విద్యావినయములు
కొన్నికొన్ని గ్రామాలలో పంచాయతీబోర్డు ఆఫీసులు ఉండేచోట్ల, సదరు గ్రామవివరాలు కొన్నిబోర్డులమీద వ్రాసి కట్టి ఉంచుతారు. అందులో గ్రామజనాఫా, జనాఫాలో అక్షరాస్యులసంఖ్య, జనాఫాలో వారిశాతమూ ఇతరదేశాలలోని అక్షరాస్యశాతమూ; ఇవన్నీ ఆ బోర్డుమీద చూపబడి ఉంటవి. ఇతరదేశాలతో మనదేశం పోల్చిచూస్తే మనదేశం విద్యా విషయాలలో వెనుకబడిఉన్నట్లున్నూ ఈ విషయం ప్రజ గుర్తెరిగి అక్షరాస్య శాతం మరింత వృద్ధిచేస్తారనీ రాజ్యాంగంయొక్క అభిలాష.
ఈ సందర్భంలో మనం 'చదువుయొక్క ప్రయోజనమేమి?' అన్నవిషయం పరిశీలించవలసి వస్తుంది. మనం దేనికి చదవాలి?' చదువు సత్సంస్కారాలూ, సద్గుణాలూఅలవరచాలి. అని మనం మరింత నిశితంగా పరీక్షిస్తే సత్యస్వరూపం తెలుసుకోవడమే విద్యాప్రయోజనం అని గుర్తించవచ్చు. సత్యస్వరూపమేది? అది పరమవస్తువు. ప్రపంచంలో సమస్తవస్తువులకూ విశిష్టమైన కారణంగా ఉండేది ఒక్కపరమాత్మే. ఆపరమాత్మ ఒక్కడే నిజమైన వస్తువు. అతడు ఒక్కడేసత్యం. తక్కినదంతా మిథ్య.
మహాపురుషులందరూ సర్వకాల సర్వావస్థలలోనూ దైవచింతనతోనే గడిపారు. వారి జీవితం భగవదంకితమై పోయేది. వేరు కుటుంబకార్యాలలో తగులుకొక తమకున్న కాలమంతా భగవచ్చింతనతోనే గడిపేవారి జీవితంలో భగవంతుని ధ్యాస తప్ప తక్కినవానికి చోటు ఉండేదికాదు. జీవితంలో కష్టాలూ, దుఃఖాలే ఎక్కువ. ఆనందం కావాలంటే ఆసత్యస్వరూపిని అన్వేషించాలి. ''బ్రహ్మసత్యం జగన్మిథ్యా'' అని ఆచార్యుల వారన్నారు.
శాస్త్రము లెన్నో ఉన్నవి. భూగోళము, రసాయన శాస్త్రము, గణితము ఇట్లుఎన్నో శాస్త్రాలు స్కూళ్ళలో చదువుతున్నాం. ఇవన్నీ సత్యాలే. చరిత్రవున్నది. అదీ సత్యమే కాని వీనికన్నిటికంటే గణితం సత్యతరం. తక్కినవానిలో కొంతకల్పన ఉన్నది. భూగోళం భూమిని దేశాలుగా విభాగించి ఆసియా, ఆఫ్రికా, యూరపు అని పేరుపెట్టుతుంది. ఇవన్నీ మనం కల్పించినవే. మిట్టకొక పేరు. పల్లమున కొకపేరు. ఇవన్నీ కల్పనలే.
ఈ కల్పన అసత్యం. వీనినంతా త్రోసివేసి అంతిమసత్యమేదో అన్వేషిస్తే - దానిని తెలుసుకొంటే - ఆ అంతిమసత్యం, ఆ విశేషవస్తువు పరమాత్మ అని తేలుతుంది. ఆ పరమాత్మతోచేరి ఆనందించడమే చదువుకుఅంతిమ ప్రయోజనం.
చదువుయొక్క ముఖ్యప్రయోజనం వినయం. వినయమంటే అణకువ. అణకువలేని చదువు ఒక చదువు కాదు. తన్ను తాను సంయమించుకొనే మంచిగుణం విద్యచే అలవడాలి. ఇప్పుడు ఏ దేశంలో విద్య అధికవ్యాప్తిలో వుంది? ఆ దేశపు జనులు గుణవంతులుగా ఉన్నారా? చదువుతక్కువగా ఉన్న దేశంలోని ప్రజల గుణశీలా లెట్లా ఉన్నవి? ఇదికొంచెం గమనించిచూస్తేచదువురానిగ్రామీణుల మంచితనం పట్ణాలలోని ప్రజలకులేదు. కొండజాతి వారికున్న సుగుణాలు విద్యావంతుల కున్నట్లు కనపడదు. వారికి మేజిస్ట్రీటు కోర్టులుగాని, హైకోర్టులుగానీ లేవు. యూనివర్శిటీలు, కాలేజీలు అధికంగా ఉన్నచోటులలో న్యాయస్థానాలున్నూ ప్రబలినవి. మోసం, దగా, లంచగొండితనం, అన్యాయం, జేబుదొంగతనము ఇవన్నీపట్నములయందే అధికంగా కనబడుతూంది.
చదువుయొక్క ప్రయోజనం గుణం. కాని మన చదువులవల్ల గల్గిన గుణాలు విపరీతాలు. స్కూళ్ళలో చోటులేదని షిప్టుపద్ధతితో చదువులు నేర్పుతున్నాము' ఈవిద్యవల్ల రావలసిన వినయం మాత్రం మనకు అంటటంలేదు. మనదేశంలో బాలికలకు, స్త్రీలకు సహజగుణము వినయమూ, సిగ్గు. బాలికలకు చదువుతో పాటు అణకువకూడా వృద్ధికావాలి. ఒకకాలేజీలో చదివే బాలికలు తన ప్రిన్సిపాల్ పోలికగల బొమ్మను తయారుచేసి శవంవలె ఊరేగించారుట. స్వాభావికమైన స్త్రీ గుణాలను సయితం ఈచదువులు పోగొట్టుతున్నవికదా! ఐతే ఈ చదువులు మన కవసరమా? గుణం కలిగించే చదువులు కదా మనం చదవాలి? ''విద్యా విహీనః పశుః'' అని భర్తృహరివాక్యం. కాని, ఈ కాలపు చదువులు వినయం నేర్పక మనలను పశువులనుగా చేస్తున్నవే?
ఈ కాలంలో చదవనివారికంటే చదివినవారే ఎక్కువ కష్టపడుతున్నారు. అనవసరములైన వ్యవహారాలు బోలెడు కల్పించుకొని తామూ కష్టపడి, ఇతరులను కష్టపెడుతున్నారు. విద్యయొక్క ప్రయోజనం సత్యస్వరూపుడు భగవంతుని తెలిసికోవడమే. కాని ఈ కాలపు విద్యార్థులకు దైవభ##క్తే ఉండటం లేదు. మరి ఈ చదువులకు ప్రయోజనమేమి? 'విద్యాం వినయసంపన్నా' విద్య వినయసంపద చేకూర్చాలి. కాని నేటి చదువులు, అవినయానికే కారకము లవుతున్నవి. మునుపటికంటే ఈకాలంలో స్త్రీ పురుషులు అధికవిద్యావంతులుగా ఉన్నారు. కాని విద్యయొక్క అసలుప్రయోజనం వీరు పొందటంలేదు. తద్విపరీతగుణాలే వీరివి.
విద్య అంటే ఏది నిజమైన విద్య? దానినెట్లు నేర్వాలి? శిష్యుని లక్షణమేమి?. ఆచార్యుల లక్షణమేమి? మనము ఒక్కొక్కపని ఎట్లాచేయాలి? ఇవన్నీ ధర్మశాస్త్రాలుచెపుతై. 'శైశ##వేభ్యస్త విద్యానాం' విద్య శైశవమునందే నేర్వాలి. అనగా బ్రహ్మచర్యకాలమందే గురువులకడ విద్య నేర్వాలి. గురువు శిష్యునివద్దనుండి డబ్బుపుచ్చుకొని చదువుచెప్పరాదు అని శాస్త్రం. గురువుకడ విద్య నేర్వాలి అని శిష్యునికి విధి. 'గురులక్షణాలు కల్గినవారు ఈకాలమున ఎచ్చట ఉన్నారు? బడికిపోతేకాని గురువు కనపడని ఈ రోజుల్లో ఈ ధర్మశాస్త్రాలన్నీ ఎట్లాసాధ్యాలు?' అని సందేహం వస్తుంది.
ఇటీవలవరకు, చాలామంది సంగీతం గురుముఖంగా అభ్యసించి ఉన్నారు. వీరంతా బడులకువెళ్ళి సంగీతం నేర్చుకోలేదు, సంగీత మొక గొప్పకళ. సంగీతం నిరాయాసంగా ఏ కష్టమూలేక మోక్షాన్ని సంపాదించి పెట్టే విద్య.
''వీణావాదన తత్త్వజ్ఞః శ్రుతిజాతి విశారదః,
తాలజ్ఞ శ్చాప్రయత్నేన మోక్షమార్గం సగచ్ఛతి||''
వీణా వాద్య మొక్కదానిని నేర్చుకొని, సర్వశుద్ధిగా వాయించి, ఆ గీతానందములో లయించి పోయేవారికి వేరే యోగం అక్కరలేదు. తపస్సు అక్కరలేదు. సులభంగా మోక్షం పొందవచ్చు. శ్రమలేని మార్గమిది. తపోమార్గంలో ఇంద్రియాలు నిరోథించాలి. అట్టికష్టం ఇందులోలేదు. స్వర శుద్ధితోడి సంగీతం ఈశ్వరార్పణచేసి తద్ద్వారా మోక్షమునే పొందవచ్చు. ఇంతవరకు బడులకువెళ్ళి వీణనేర్చుకొన్నదిలేదు. కానీ ఈ మధ్య వానికీ స్కూళ్ళు ఏర్పడ్డవి.
మునుపు వేదాధ్యయనం గురుకులంలో నడిచింది. కాని ఇటీవల వేదపాఠశాలలున్నా ఏర్పడినవి. నగరాలలోని ఆలయాలలో పూజాదికాలు సక్రమంగా నడపాలని, పాఠశాలలు కట్టి వానికి మాన్యాలు కొందరు ఆస్తికులుఏర్పరచారు. అందుచేతనే వేదమునకున్నూ పాఠశాలలు వచ్చినవి. ఆ అవినయం ఒక్క ఇంగ్లీషుచదివే పిల్లలకే కాక వేదపాఠశాలలలోని పిల్లలకూ వచ్చింది.
మన శాస్త్రాల ప్రకారం విద్యలు అసంఖ్యాలుగా ఉన్నవి. తంజావూరులో చిత్రకళ, సంగీతం, నాట్యకళ వృద్థి నొందినవి. పాఠశాలలతో పనిలేకుండానే ఇవి అన్నీ వృద్ధిపొందినై. వైద్యం, యోగశాస్త్రం, రసశాస్త్రం. ఇంకాఎన్నో శాస్త్రాలు పురాతనకాలంనుండి రక్షింపబడుతూ వచ్చినై. వీనికి బడులులేవు. గురువులుండేవారు. శిష్యులు ఉండేవారు. చదువుయొక్క ప్రయోజనం వారు పొందియుండేవారు. కాని ఈకాలంలో అన్నిటికిన్నీ పాఠశాలలు ఏర్పడినవి. ఈ పాఠశాలలో దుర్గుణాలున్న బాలురను బహిష్కరించడానికి తగిన నియమాలున్నయ్యా అంటే లేవు.
విద్యార్థులు జీతాలు కట్టుతున్నారు. గురువులుజీతాలు పుచ్చుకుంటున్నారు. విద్యార్థులు కూర్చుని పాఠాలు నేర్చుకొంటున్నారు. గురువు నిలబడి పాఠాలు చెపుతున్నాడు. దీంతో ఉన్న గురుభక్తి కాస్తా సమూలంగా పోయింది.
''నేను డబ్బిస్తున్నాను నీవు చదువుచెప్పు'' ఇది నేటి శిష్యుని వాలకం. ''నేను డబ్బిస్తా, నీవునాకుక్వ్చొశెన్ పేపర్లను అందజేయి.'' ఇది ఈ నాటి శిష్యుని సంప్రదాయం.
మునుపటిచదువులే నేడూ ఉన్నవి. వానిలోమార్పేమీ లేదు. మార్పంతా నడిచే నడకలోనే. మందేమో ఒక్కటే. కాని పథ్యం మారినట్లైతే మందే విషమవుతుంది. అందుచే చదివే చదువులలో మార్పులేకున్నా, చదివే పద్థతిలోని వ్యత్యాసంచేత ఈనాటి చదువులు విపరీతగుణాలను శిష్యులకు అంటిస్తున్నవి. విద్యకు బదులు అవిద్య అధికమవుతున్నది.
పూర్వకాలంలో విద్య నేర్చుకొనబోయేవాడికి వినేయుడని పేరు. దానికి వినయం అభ్యసించినవాడనిఅర్థం. స్టూడెంటు, విద్యార్థి ఈనాటి మాటలు. పూర్వం విద్య నేర్చుకున్నందుకు వినయ మొక చిహ్నంగా ఉండేది. శిష్యుని వినయసంపదకు పద్మపాదుల చరిత్ర ఒక నిదర్శనం.
పద్మపాదులు భగవత్పాదుల నలువురశిష్యులలో ఒకరు. ఒకపుడు గంగ ఆవలిగట్టునున్న పద్మపాదులను తమ మడుగులు తెమ్మని శంకరభగవత్పాదులవారు ఆజ్ఞాపించారట. వారు తొందరతొందరగా మడుగులు తీసుకొని గంగానది ఉన్న స్మృతియేలేక నడువసాగినారట. వారు అడుగుపెట్టినచోటులలో గంగాదేవి ఒక్కొక్కపద్మం సృష్టించిందట. ఆ పద్మాలపై అడుగువేసుకొంటూ ఈవలిగట్టు చేరినారుట. అందుచేత వారికి పద్మపాదులన్న పేరు వచ్చింది. పద్మపాదులవారు పంచపాదిక వ్రాశారు. అందులో ఆచార్యులవారిగూర్చి ఈక్రింది మంగళశ్లోకం-
''య ద్వక్త్రమానససరః ప్రతిలబ్ధజన్మ
భాష్యారవింద మకరందరసం పిబంతి,
ప్రత్యాశ మున్ముఖ వినీతవినేయ భృంగాః
తాన్భాష్యవిత్తకగురూ స్ర్పణమామి మూర్థ్నా||''
ఇందుఆచార్యలువారిభాష్యాన్ని అరవిందంతో పోల్చారు. అభాష్యమకరందం ఏబదియాదుదేశాలలోని పండితభృంగాలు ఆస్వాదిస్తున్నవి. ఆచార్యులవారి భాష్యారవిందంవారి వక్త్రమనే మానససరోవరంలోంచి పుట్టింది. ఇందలి వినేయశబ్దానికి శిష్యుడని అర్థం.
ఈకాలంలో విద్య బేరమాడేవస్తువు ఐంది. కాబట్టి వినయం లోపించింది. మునుపు గురుకులవాసం చేస్తూ శిష్యుడు అన్నభిక్ష గ్రహించి గురువునకు అర్పించి అతడిచ్చినదిగ్రహించేవాడు. అందుచే అతడు గురువుదగ్గర వినయంగా ఉండవలసిన స్థితి ఏర్పడేది. ఈవ్యవస్థలన్నీ ఇపుడు మారినవి గనుకనే విద్య యొక్క సరియైన ప్రయోజనం మనం పొందయలేకపోతున్నాము. సరియైన విద్యాపద్ధతి మనం అవలంబిస్తే భర్తృహరి చెప్పిన ఈక్రిందిరీతిగా జీవితంలోని సోపానాలను అధిష్ఠించగలము.
''విద్య యొస-గును వినయంబు, వినయమునను
బడయు- బాత్రత పాత్రతవలన ధనము
ధనము వలనను ధర్మంబు దానివలన
ఐహికాముష్మికసుఖంబు లందు నరు-డు.''
|