Sri Naradapuranam-I    Chapters    Last Page

దశమో7ధ్యాయః పదియవ అధ్యాయము

గంగోత్పత్తౌ బలికృతదేవపరాజయః

నారద ఉవాచ:-

విష్ణుపాదాగ్రసంభూతా యా గంగేత్యభిధీయతే, తదుత్పత్తిం వద భ్రాతరనుగ్రాహ్యో7స్మి తే యది.

నారదమహర్షి పలికెను:- విష్ణుపాదాగ్రమునుండి పుట్టి, గంగ అని చెప్పుబడుచున్న పుణ్యతీర్థముయొక్క ఉత్పత్తిని నా మీద అనుగ్రహముంచి తెలుపుము. 1

సనక ఉవాచ:-

శృణు నారద వక్ష్యామి గంగోత్పత్తిం తవానఘ, వదతాం శృణ్వతాం చైవ పుణ్యదాం పాపనాశినీమ్‌. 2

ఆసీదింద్రాదిదేవానాం జనకః కశ్యపో మునిః, దక్షాత్మజే తస్య భార్యే దితిశ్చాదితిరేవ చ. 3

అదితిర్దేవమాతాస్తి దైత్యానాం జననీ దితిః, తే తయోరాత్మజా విప్ర పరస్పరజయైషిణః. 4

సదాసన్‌ పూర్వదేవాస్తు యతో దైత్యాః ప్రకీర్తితాః, ఆదిదైత్యో దితేః పుత్రో హిరణ్యకశిపుర్బలీ. 5

ప్రహ్లాదస్తస్య పుత్రో7భూత్‌ సుమహాన్దైత్యసత్తమః, విరోచనస్తస్య సుతో బభూవ ద్విజభక్తిమాన్‌. 6

తస్య పుత్రో7తి తేజస్వీ బలిరాసీత్ప్రతాపవాన్‌, ప ఏవ వాహినీ పాలో దైత్యానామభవన్మునే. 7

బలేన మహతా యుక్తో బుభుజే మేదిరీమిమామ్‌, విజిత్య వసుధాం సర్వాం స్వర్గం జేతుం మనో దధే. 8

సనకమహర్షి పలికెను:- ''ఓ పాపరహితుడా! నారదా! చెప్పువారలకు వినువారలకు పాపములను నశింపచేసి పుణ్యము నిచ్చు గంగోత్పత్తిని నీకు చెప్పెదను. వినుము. ఇంద్రాదిదేవతలకు తండ్రి కశ్యపమహర్షి ఉండెను. కశ్యపమహర్షికి ఆదితి దితియను దక్షప్రజాపతి పుత్రికలు భార్యలుగా నుండిరి. దేవతల తల్లి అదితి. దైత్యుల తల్లి దితి. అదితి దితి పుత్రులైన దేవదైత్యులు ఒకరినొకరు జయింపవలెనని ఎల్లపుడు భావించుచుండిరి. అందువల్లనే దైత్యులకు పూర్వదేవులు అని పేరు. దైత్యులలో మొదటివాడు దితి పుత్రుడు బలవంతుడగు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుని పుత్రుడు మహానుభావుడైన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు. బ్రహ్మణ భక్తి గలవాడు. విరోచనుని పుత్రుడు బలి మిక్కిలి తేజోవంతుడు, ప్రతాపవంతుడు. దైత్యులకు సేవానాయకుడై బలి వారికి సంతోష జనకుడు ఆయెను. గొప్ప సైన్యముతో భూమండలమునంతటిని గెలిచి రాజ్యము ననుభవించుచుండెను. స్వర్గమును జయించవలయునని సంకల్పించెను.'' 2-8

గజాశ్చ యస్సాయుతకోటిలక్షాః తావన్త ఏవాశ్వరథా మునీన్ద్ర! 9

గజే గజే పంచశతీ పదాతేః, కిం వర్ణ్యతే తస్య చమూర్వరిష్ఠా.

అమాత్యకోట్యగ్రసరావమాత్యౌ కుంభాండనామాప్యధకూపకర్ణః 10

పిత్రా సమం శౌర్యపరాక్రమాభ్యాం, బాణో బలేః పుత్ర శతాగ్రజో7భూత్‌.

బలిః సురాన్జేతుమనాః ప్రవృత్తః సైన్యేన యుక్తో మహాతా ప్రతస్థే 11

ధ్వజాతపత్రైర్గగనాంబురాశేస్తరంగవిద్యుత్స్మరణం ప్రకుర్వన్‌.

అవాప్య వృత్రారరరిపురం సురారీ రురోధదైత్యైర్మృగరాజగాఢైః,

సురాశ్చ యుద్ధాయ పురాత్తథైవ వినిర్యయుర్వజ్రకరాదయశ్చ. 12

తతః ప్రవవృతే యుద్ధం ఘోరం గీర్వాణదైత్యయోః, కల్పాన్తమేఘనిర్ఘోషం డిండిమధ్వనిసంభ్రమమ్‌. 13

ముముచః శరజాలాని దైత్యాస్సమనసాం బలే, దేవాశ్చ దైత్యసేవాసు సంగ్రామే7త్యన్తదారుణ. 14

జహి దారయ భిన్ధీతి ఛిన్ది మారయ తాడయ. ఇత్యేవం స మహాన్ఘోషో వదతాం సేనయోదభూత్‌. 15

శరదున్దుభినిధ్వానైః సింహనాదైసురద్విషామ్‌, భాంకారైః స్యన్దనానాం చ బాణకేంకారనిస్స్వనైః. 16

అశ్వానాం హేషితైశ్చైవ గజానాం బృంహితైస్తధా, టంకారైర్థనుషాం చైవ లోకః శబ్దమయో7భవత్‌. 17

సురాసురవినిర్ముక్తబాణనిషేవషజానలే, అకాలప్రలయం మేనే నిరీక్ష్య సకలం జగత్‌. 18

బలి చక్రవర్తి సైన్యము చాలా శ్రేష్ఠమైనది. పదివేల కోట్ల లక్షల యేనుగులు. అన్నియే రథములు. అన్నియే అశ్వములు. ప్రతియేనుగు వెంట అయిదువందల పదాతిసైన్యము కలిగియుండెను. ఆ సైన్యమును గూర్చి ఏమి వర్ణించగలము. బలి చక్రవర్తి మంత్రులలో అగ్రేసరులు కుంభాండుడు, కూపకర్ణుడను వారలు. బలిచక్రవర్తి నూరుగురు పుత్రులలో పెద్దవాడైన బాణాసురుడు తండ్రితో సమానమైన బలపరాక్రమములు గలవాడు. దేవతలను జయించవలయునని సంకల్పించి గొప్ప సైన్యముతో బయలుదేరెను. ధ్వజములతో, ఛత్రములతో ఆకాశమున మెఱుపులను, సముద్రమున, అలలను స్మరింపజేయుచు సైన్యము సాగెను. దేవేన్ద్ర నగరమును చేరి సింహపరాక్రములైన రాక్షసులతో అమరావతిని ముట్టడించెను. వజ్రకరుడు మొదలగు దేవతలు కూడా గొప్ప సైన్యముతో నగరమునుండి బయలువెడలిరి. అపుడు దేవదానవులకు ప్రళయకాలమేఘములవలె ధ్వనించుచు యుద్ధభేరి ధ్వనులతో ఆకులముగా భయంకరమైన యుద్ధము మొదలాయెను. రాక్షసులు దేవతాసైన్యముపై శరజాలములను విడిచిరి. దేవతలు కూడా భయంకరమైన యుద్ధములో దైత్యులపై బాణవర్షమును కురిపించిరి. గెలువుము, చీల్చుము, భేదించుము, ఛేదించుము, చంపుము కొట్టుము అని పెద్దగా అరచుచున్న సైన్యము ధ్వని వినిపించుచుండెను. శరముల ధ్వనులు, దుందుభిధ్వనులు, దైత్యుల సింహనాదములు, రథముల భాంకారములు, బాణముల కేంకారములు, అశ్వముల సకిలింపులు. ఏనుగుల ఘీంకారములు, ధనుష్టంకారములు నిండి లోకమంతయూ శబ్దమయమాయెను. దేవదానవులు వదిలిన బాణముల రాపిడి వలన పుట్టిన జ్వాలలను చూచిన ప్రపంచమంతయూ అకాలప్రళయము సంభవించినదని తలచెను. 9 - 18

బభౌ దేవద్విషాం సేనా స్ఫురచ్ఛస్త్రాఘధారిణీ, చలద్విద్యున్నిభా రాత్రిశ్చాదితా జలదైరివ. 19

తస్మిన్యుద్ధే మహాఘోరే గిరీన్‌ క్షిప్తాన్‌ సురారిభిః, నారాచైశూర్ణయామసుర్దేవాస్తే లఘవిక్రమాః. 20

కించిత్సంతాడయామాసుర్నాగైర్నాగాన్దధన్రధైః, అశ్వైరశ్వాంశ్చ కేచిత్తు గదాదండైరథార్దయన్‌. 21

పరిఘైస్తాడితాః కేచిత్పేతుః శోణితకర్థమే, సముత్ర్కాంతాసవః కేచిద్విమానాని సమాశ్రితాః 22

యే దైత్యా నిహతా దేవైః ప్రసహ్య సంగరే తదా, తే దేవభావమాపన్నా దైతేయాన్సముపాద్రవన్‌. 23

అథ దైత్యగణాః క్రుద్ధాస్తాడ్యస్సురైర్భృశమ్‌, శస్త్రసైర్బహువిధైర్దేవాన్నిజఘ్నరతిదారుణాః. 24

దృషద్భిర్భిన్దిపాలైశ్చ ఖడ్గైః పరశుతోమరైః, పరిఘైశ్చురికాభిశ్చ కుంతైశ్చక్రైశ్చ శంఖుభిః. 25

ముసలైరంకుశైశ్చైవ లాంగలైః పట్టిశైస్తథా, శక్త్యోపలైశ్శతఘ్నీభిః పాశైశ్చ తలముష్టిభిః. 26

శూలర్నాలీకనారాచైః క్షేపణీయైస్సముద్గలైః, రాథాశ్వనాగపదగైస్సంకులో వవృధే రణః. 27

దేవాశ్చ వివిధాస్త్రాణి దైతేయేభ్యస్సమాక్షిపన్‌, ఏవమష్టసహస్రాణి యుద్ధమాసీత్సుదారుణమ్‌. 28

ప్రకాశించు ఆయుధములను ధరించిన రాక్షససైన్యము చంచలములైర మెరుపులతో మేఘములతో కప్పబడిన రాత్రివలె శోభించెను. మహాఘోరమైన ఆ యుద్ధములో రాక్షసులు ప్రయోగించిన పర్వతములను శీఘ్రవిక్రములైన దేవతలు బాణములచే చూర్ణము చేసిరి. మరికొందరు ఏనుగులతో ఏనుగులను, రథములతో రథములను, అశ్వములతో అశ్వములను, గదలతో మరికొందరిను కొట్టుచుండిరి. పరిఘలతో కొట్టబడిన కొందరు నెత్తుటి బురదలో పడిరి. ప్రాణములను కోల్పోయిన కొందరు విమనములనాశ్రయించిరి. యుద్ధమున దేవతలచే చంపబడిన రాక్షసులు దేవత్వమును పొంది రాక్షసులతో యుద్ధమునకు తలపడిరి. అతి భయంకరులైన రాక్షసులు దేవతలచే కొట్టబిడి మిక్కిలి కోపించినవారై పలువిధములైన శస్త్రములతో దేవతలను కొట్టిరి. రాళ్ళతో, ఖిందిపాలములతో, ఖడ్గములతో, గోడ్డళ్ళతో, తోమరములతో, పరిఠలతో, చిన్నకత్తులతో, కుంతములతో, చక్రములతో, శంఖులతో, రోకళ్ళతో, అంకుశములతో, నాగళ్ళతో, పట్టిశములతో, శక్తులతో గులకరాళ్ళతో, శతఘ్నులతో, పాశములతో, అరచేతులతో, పిడికిళ్ళతో, శూలములతో, బాణములతో, ముద్గరములతో గూడిన క్షిపణులతో, రథములతో, అశ్వములతో, ఏనుగులతో, పదాతులతో సంకులమై యుద్ధము వృద్ధిపొందెను. దేవతలు కూడా పలు విధములైన అస్త్రములను రాక్షసులపై ప్రయోగించిరి. ఇట్లు ఎనిమిది వేల సంవత్సరములు భయంకరమైన యుద్ధము సాగెను. 19 - 28

అథ దైత్యబలే వృద్ధే పరాభూతా దివౌకపః, సురలోకం పరిత్యజ్య సర్వే భీతాః ప్రదుద్రువుః. 29

నరరూపపరిచ్ఛన్నా విచేరురవనీతలే, వైరోచనిస్త్రిభువనం నారాయణపరాయణః. 30

బుభుజే7వ్యాహతైశ్వర్యప్రవృద్ధశ్రీర్మహాబలః, ఇయాజ చాశ్వమేధైస్స విష్ణుప్రీణనతత్పరః. 31

ఇంద్రత్వం చాకరోత్స్వర్గే దిక్పాలత్వం తథైవ చ, దేవానాం ప్రీణనార్ధాయ యైః క్రియన్తే ద్విజైర్మఖాః. 32

తేషు యజ్ఞేషు సర్వేషు హవిర్భుఙ్కే స దైత్యరాట్‌, అదితిస్స్వాత్మజాన్వీక్ష్య దేవమాతాతిదుఃఖితా. 33

వృధాత్ర నివసామీతి మత్వాగాద్ధిమవద్గిరిమ్‌, శక్రసై#్యశ్వర్యమిచ్ఛంతీ దైత్యానాం చ పరాజయమ్‌. 34

హరిధ్యానపరా భూత్వా తపస్తే పే7తి దుష్కరమ్‌, కించిత్కాలం సమాసీనా తిష్ఠంతీ చ తతః పరమ్‌. 35

పాదేనైకేన సుచిరం తతః పాదాగ్రమాత్రతః, కంచిత్కాలం ఫలాహారా తతశ్శీర్ణదళాపనా. 36

తతో జలాశనా వాయుభోజనాహారవర్జితా, సచ్చిదానన్దపందోహం ధ్యాయత్యాత్మాన మాత్మనా. 37

దివ్యాబ్దానాం సహస్రం సా తపో7తప్యత నారద! దురన్తం తత్తపశ్శ్రుత్వా దైతేయా మాయినో7దితిమ్‌. 38

దేవతారూపమాస్థాయ సంప్రోచుర్బలినోదితాః, కిమర్థం తప్యతే మాతః శరీరపరిశోషణమ్‌. 39

యది జానన్తి దైతేయా మహద్దుఃఖం తతో భ##వేత్‌, త్యజేదం దుఃఖబహులం కాయశోషకారణమ్‌. 40

ప్రయాససాధ్యం సుకృతం న ప్రశంసన్తి పండితాః, శరీరం యత్నతో రక్ష్యం ధర్మపాధనతత్పరైః. 41

యే శరీరముపేక్షన్తే తే స్యురాత్మవిఘాతినః, సుఖం త్వం తిష్ఠ సుభ##గే పుత్రానస్మాన్న భేదయ. 42

మాత్రా హీనా జనా మాతః మృతప్రాయా న సంశయః, గావో వా పశవో వాపి యత్ర గావో మహీరుహాః. 43

న లభ##న్తే సుఖం కించిత్‌ మాత్రా హీనా మృతోపమాః, దరిద్రో వాపి రోగి వా దేశాన్తరగతో7పి వా. 44

మాతుర్దర్శనమాత్రేణ లభ##తే పరమాం ముదమ్‌, అన్నే వా సలిలే వాపి ధనాదే వా ప్రియాసు చ. 45

కదాచిద్విముఖో యాతి జనో మాతరి కో7పి న, యస్య మాతా గృహే నాస్తి యత్ర ధర్మపరాయణా. 46

సాధ్వీ చ స్త్రీ పతిప్రాణా గన్తవ్యం తేన వై వనమ్‌.

ధర్మశ్చ నారాయణభక్తిహీనో ధనం చ సద్భోగవిర్జితం, గృహంచ భార్యాతనయైర్విహీనం యథా తథా మాతృవిహీనమర్త్యః 47

తస్మాద్దేవి పరిత్రాహి దుఃఖార్తానాత్మజాంస్తవ, ఇత్యుక్తాస్యదితిర్దైత్యైర్న చచాల సమాధితః 48

తరువాత రాక్షస బలము వృద్ధిచెందగా పరాజయము పాలైన దేవతలు స్వర్గమును విడిచిపెట్టి అందరూ భయముతో పారిపోయిరి. మానవరూపముతో రహస్యముగా భూలోకమున తిరుగుచుండిరి. విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి నారాయణుని యందు భక్తి కలవాడై మూడు లోకములను తిరుగులేని ఐశ్వర్యముచే పెరిగిన కాంతి, బలము కలవాడై అనుభవించసాగెను. శ్రీమహావిష్ణువును సంతోషింపచేయుటకు అశ్వమేధయాగములచే పూజించెను. స్వర్గమున ఇంద్రత్వమును దిక్పాలత్వమును కూడా నిర్వహించెను. దేవతల ప్రీతి కొఱకు బ్రాహ్మణులు చేయు యాగములతో అన్నిటిలో దైత్యరాజైన బలిచక్రవర్తియే హవిస్సులను భుజించుచుండెను. దేవమాతయగు అదితి తన పుత్రుల దురవస్థను చూచి మిక్కిలి దుఃఖించినదై నేనిచట వ్యర్థముగా నివసించుచున్నానని తలచి హిమవత్పర్వతమునకు వెళ్ళెను. ఇంద్రునికి ఐవ్వర్యమును, దైత్యులకు పరాజయమును కోరుచు హరిని ధ్యానించుచు మిక్కిలి కష్టసాద్యమైన తపస్సును చేయనారభించెను. కొంతకాలము కూర్చొరి, మరికొంతకాలము నిలబడి, కొంతకాలము ఒక కాలు మీద నిలబడి, మరికొంతకాలము కాలు కొన మీద నిలబడి, కొంతకాలము పండ్లను భుజించుచు, తరువాత ఎండుటాకులను భుజించుచు, తరువాత నీరు మాత్రమే తీసుకొని, తరువాత గాలిని భుజించుచు, ఆ తరువాత నిరాహారముగా మనస్సుతో సచ్చిదానన్ద స్వరూపుడైన శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచుండెను. ఇట్లు అదితి వేయి దివ్యవత్సరములు తపస్సును చేసెను. అంతులేని ఆమె తపస్సును విని మాయావులైన దితిపుత్రులు బలిచక్రవర్తిచే పంపబడి దేవతారూపముతో అదితి వద్దకు వచ్చి ఇట్లు పలికిరి. ''ఓ తల్లీ! శరీరమును శష్కింపచేయు తపస్సునెందుకు చేయుచున్నావు? దితిపుత్రులకు తెలిసినచో చాలా కష్టములు వచ్చును. శరీరమును శుష్కింపచేయు, పలు దుఃఖములను కలిగించు ఈ తపస్సును వదిలి పెట్టుము. శ్రమ వలన కలిగెడు పుణ్యమును పండితులు అభినందించరు. ధర్మమును సాధించుటయందు ఆసక్తి కలవారు శరీరమును ప్రయత్నముతో కాపాడుకొనవలయును. శరీరమును పేక్షించి వారు ఆత్మఘాతకులవుదురు. కావున నీవు ఆనందముగా నుండుము. పుత్రులమగు మమ్యులరె బాధించకుము. ఓ తల్లీ! తల్లిలేని వారు చచ్చినవారితో సమానులు. ఆవులు, పశువులు, వృక్షములు మాతృహీనములై చనిపోయినవాటివలె ఆనందమును పొందజాలవు. దరిద్రుడైనను, రోగియైనను, దేశాంతరమునకు వెళ్ళిన వాడైనను తల్లిని చూచినంతనే పరమానందమును పొందును. అన్నమును, నీటిని, ధనాదులను ప్రియులను కూడా ఎప్పుడో ఒకప్పుడు విముఖుడై వదులునుగాని తల్లిని వాడుచువాడెవడును ఉండడు. తల్లి, ధర్మపరాయణులైన పతివ్రతయగు స్త్రీ ఎవరింటనుండదో వాడు అడవికే వెళ్ళవలయును. తల్లిలేని మానవుడు నారాయణ భక్తిలేని ధర్మము వంటివాడు. సద్భోగములేని ధనము, భార్యాపుత్రులులేని ఇల్లు వంటివాడు. కావున దుఃఖముతో ఆర్తులైన నీ పుత్రులను కాపాడుము.'' ఇట్లు రాక్షసులు పలుకుచున్ననూ అదితి సమాధినుండి చలించలేదు. 29 -48

ఏవముక్తాస్సురాస్సర్వే హరిధ్యానపరాయణామ్‌, నిరీక్ష్య క్రోధసంయుక్తా హస్తుం చక్రుర్మనోరథమ్‌. 49

కల్పాన్తమేఘనిర్ఘోషాః క్రోధసంరక్తలోచనాః, దంష్ట్రాగ్రైరసృజన్వహ్నిం సో7దహత్కాననం క్షణాత్‌. 50

శతయోజనవిస్తీర్ణం నానాజీవసమాకులమ్‌, తేనైవ దగ్ధా దైతేయాద యే ప్రధర్షయితుం గతాః. 51

సైవావశిష్టా జననీ సురాణామబ్దాచ్ఛతాదచ్యుతసక్తచిత్తా, సంరక్షితా విష్ణుసుదర్శనేన దైత్వాన్తకేన స్వజనానుకంపినా. 52

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణ పూర్వభాగే ప్రథమపాదే గంగోత్పత్తౌ బలికృతదేవపరాజయయవర్ణనం నామ దశమో7 ధ్యాయః

ఇట్లు పలికిన, దేవరూపములో ఉన్న, రాక్షసులు హరినే ధ్యానించుచు చలించకయున్న అదితిని చూచి కోపముతో చంపుటకు సంకల్పించిరి. ప్రళయకాలమునందలి మేఘముల వలె కోపముతో ఎఱ్ఱబారిన కన్నలు గలవారై కోరలనుండి అగ్నిని సృజించిరి. ఆ వహ్ని అరణ్యమునంతటిని కాల్చివేసెను. అనేక ప్రాణులతో ఆకులముగానున్న నూరుయోజనములు విస్తీర్ణముగల ఆ వనమును దహించిన అగ్నియే అదితిని హింసించదలచిన దైత్యులను కూడా దహించివేసెను. రాక్షసులను సంహరించునది, భక్తులను అనుగ్రహించునది యగు శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనచక్రముచే కాపాడబడిన అదితి వేల సంవత్సరముల నుండి శ్రీమహావిష్ణువును ధ్యానించుచున్నదై మిగిలియుండెను. 49 - 52

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వ భాగమున ప్రథమపాదమున గంగోత్పత్తిలో బలికృత దేవపరాజయవర్ణనమను పదియవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page