Sri Naradapuranam-I
Chapters
Last Page
తృతీయో೭ధ్యాయః మూడవ అధ్యాయము సృష్టి భరతఖండ ప్రాశస్త్యం భూగోలవర్ణనమ్ నారద ఉవాచ కథం ససర్జ బ్రహ్మదీనాదిదేవః పురా విభుః, తన్మమాఖ్యాహి సనక సర్వజ్ఞో೭స్తి యతో భవాన్.
1 నారదుడు పలికెను :- మొదట ప్రభువు ఆదిదేవుడేన- శ్రీమన్నారాయణుడు బ్రహ్మాదులనెట్లు సృజించెను ? నీవు సర్వజ్ఞుడవు కావున నాకు అంతయూ నెరిగింపుము. శ్రీ సనక ఉవాచ నారాయణో೭క్షరో೭నన్తః సర్వవ్వాపీ నిరంజనః, తేనే దమఖిలం వ్యాప్తం జగత్ స్థావరజంగమమ్.
2 ఆదిసర్గే మహావిష్ణుః స్వప్రకాశో జగన్మయః గుణభేదమధిష్ఠాయ మూర్తిత్రికమవాసృజత్. 3 సృష్ట్యర్థం తు పురా దేవో దక్షిణాంగాత్ప్రజాపతిమ్, మధ్యే రుద్రాఖ్యమీశానం జగదన్తకరం మునే. 4 పాలనాయాస్య జగతో వామాంగాద్విష్ణుమవ్యయమ్, తమాదిదేవమజరం కేచిదాహుశ్శివాభిధమ్, కేచిద్విష్ణుం సదా సత్యం బ్రహ్మాణం కేచిదూచిరే. 5 తస్య శక్తిః పరా విష్ణోర్జగత్కార్యప్రవర్తినీ, భావాభావస్వరూపా సా విద్యా విద్యేతి గీయతే. 6 యదా విశ్వం మహావిష్ణోర్భిన్నత్వేన ప్రతీయతే, తదా హ్యవిద్యా సంసిద్ధా భ##వేద్దుఃఖస్యసాధనమ్ . 7 జ్ఞాతృజ్ఞేయాద్యుపాధిస్తే యదా నశ్యతి నారద, సర్వైకభావనా బుద్ధిః సా విద్యేత్యభిధీయతే. 8 ఏవం మాయా మహావిష్ణోర్భిన్నా సంసారదాయినీ, అభేదబుద్ధ్యా దృష్టా చేత్సంసారక్షయకారిణీ. 9 శ్రీ సనక మహర్షి చెప్పెను :- అంతము, నాశము లేనివాడు, అంతటా వ్యాపించియుండువాడు దేనితో సంబంధములేనివాడు అయిన శ్రీమన్నారాయణుడు స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తునంతటినీ వ్యాపించియున్నాడు. జగత్స్వరూపుడు, స్వయంప్రకాశుడు అగు మహావిష్ణువు ఆది సృష్టిలో సత్త్వరజస్తమోగుణముల భేదములను ఆధారముగా చేసుకొని విష్ణువు, బ్రహ్మా, రుద్రుడు అను మూర్తిత్రయమును సృష్టించెను. శ్రీమన్నారాయణుడు జగత్సృష్టి కొరకు పూర్వము తన దక్షిణశరీరము నుండి బ్రహ్మను, శరీరమధ్యభాగము నుండి జగదంతకరుడగు రుద్రుడను పేరుగల ఈశ్వరుని, వామశరీర భాగము నుండి జగత్పాలనకొఱకు విష్ణువును సృష్టించెను. ఆదిదేవుడు జన్మజరాది రహితుడు అగు శ్రీమన్నారాయణుడు, కొందరు శివుడందురు. కొందరు విష్ణువందురు. మరికొందరు బ్రహ్మ అనెదరు. జగత్తును ప్రవర్తింపచేయు శ్రీమహావిష్ణువు శక్తి అన్నిటికంటె పరమైనది. ఆ శక్తి భావస్వరూపమని, అభావస్వరూపమని, విద్య అని అవిద్య అని, కీర్తించబడును. ఈ ప్రపంచము మహావిష్ణువు కంటే వేఱుగా తోచినపుడు దుఃఖ సాధనమైన ఆవిద్య సిద్ధించును. తెలియునది, తెలియువాడు అను ఉపాధి నశించినపుడు అంతా ఒకటే మహావిష్ణుమయమను బుద్ధికలుగునపుడు దానిని విద్య అందురు. ఇట్లు మహావిష్ణువు మాయయే భిన్న రూపముగా సంసారమునిచ్చును. అభేద బుద్ధిచే చూచినచో ఆ మాయయే సంసారమును నశింపజేయును. 1-9 విష్ణుశక్తిసముద్భూతమేతత్సర్వం చరాచరమ్, యస్మాద్భిన్నమిదం సర్వం యచ్చేఙ్గేద్యచ్చనేఙ్గతి 10 ఉపాధిభిర్యథాకాశో భిన్నత్వేన ప్రతీయతే, అవిద్యోపాథియోగేన తథేదమఖిలం జగత్. 11 యథా హరిర్జగద్వ్యాపీ తస్య శక్తిథామునే, దాహశక్తిర్యథాంగారే స్వాశ్రయం వ్యాప్య తిష్ఠతి. 12 ఉమేతి కేచిదాహుస్తాం శక్తిం లక్ష్మీం తథాపరే, భారతీత్యపరే చైనాం గిరిజేత్యంబికేతి చ . 13 దుర్గేతి భద్రకాళీతి చండీ మహేశ్వరీత్యపి, కౌమారీ వైష్ణవీచేతి వారాహ్యైన్ద్రీ చ శాంభవీ. 14 బ్రహ్మీతి విద్యావిద్యేతి మాయేతి చ తథా పరే, పకృతిశ్చ పరాచేతి వదన్తి పరమర్షయః. 15 సేయం శక్తిః పరా విష్ణోర్జగత్సర్గాదికారిణీ, వ్యక్తావ్యక్తస్వరూపేణ జగద్వ్యాప్య వ్యవస్థితా. 16 ప్రకృతిశ్చ పుమాంశ్చైవ కాలశ్చైతి త్రిథాస్థితా, సృష్టి స్థితి వినాశానామేకా కారణతాం గతా. 17 యేనేదమఖిలం జాతం బ్రహ్మరూపధరేణ వై, తస్మాత్పరతరో దేవో నిత్య ఇత్యభిధీయతే. 18 రక్షాం కరోతి యోదేవో జగతాం పరతః పుమాన్, తస్మాత్పరతరం యత్తదవ్యయం పరమం పదమ్. 20 ఈ చరాచరజగత్తంతయు విష్ణుశక్తి వలన పుట్టినదే. చలించునది , చలించనిది అయిన ఈ జగత్తంతా విష్ణువు కంటె భిన్నముగా కనబడుచున్నది. ఘటపటాద్యుపాధులచే ఎట్లు ఆకాశము భిన్నముగా తోచునో అట్లే అవిద్యోపాధి భేదముచే ఈ జగత్తు భిన్నముగా తోచును. విష్ణువు జగత్తునంతటిని వ్యాపించి యున్నట్లు అతని శక్తిని కూడా జగత్తును వ్యాపించియుండును. అగ్నిలో ఉన్న దాహశక్తి అగ్న్యాశ్రయమును వ్యాపించి యుండునుకదా ఈ శక్తిని కొందరు ఉమ అని, మరి కొందరు లక్ష్మీయని, ఇతరులు భారతియని, కొందరు గిరిజ, అంబికయని అందురు. కొందరు దుర్గ, భద్రకాళి, చండి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఐన్ద్రి శాంభవి, బ్రాహ్మి, విద్య, అవిద్య, మాయ అని అందరు. పరమర్షులు మాత్రము దీనిని ప్రకృతియని పరాయని అందురు. విష్ణువుయొక్క ఈ శక్తి అన్నిటికంటే పరమైనది. ఇదియే జగత్సృష్టి స్థితిలయములను చేయును. ఈ శక్తియే వ్యక్తరూపముతో, అవ్యక్తరూపముతో జగమును వ్యాపించియుండును. ఈ శక్తియే ప్రకృతి, పురుషుడు, కాలము అని మూడు విధముల వస్తుస్థితి ఉండి సృష్టి స్థితిలయములకు కారణమగుచున్నది. ఈ జగత్తును సృష్టించిన బ్రహ్మరూపధరుని కంటే పరతరుని నిత్యుడు అందురు. ఈ జగత్తును రక్షించు దేవుని నిత్యుడందురు. అన్ని జగత్తులను రక్షించువాడు అందరి కంటే పరుడైనవాడు పురుషుడు. అతని కంటే పరుడే అవ్యయుడు పరముడు అందురు. 10-20 అక్షరో నిర్గుణశ్శుద్ధః పరిపూర్ణః సనాతనః యః పరః కాలరూపాఖ్యో యోగిధ్యేయః పరాత్పరః 21 పరమాత్మా పరానన్దస్సర్వోపాధివివర్జితః, జ్ఞానైకవేద్యః పరమః సచ్చిదానన్దవిగ్రహః. 22 యో೭సౌ శుద్ధో೭పి పరమో హ్యహంకారేణ సంయుతః దేహీతి ప్రోచ్యతే మూఢైరహో೭జ్ఞానవిడంబనమ్. 23 స దేవః పరమః శుద్ధః సత్త్వాదిగుణభేదతః, మూర్తిత్రయం సమాపన్నం స్సృష్టిస్థిత్యన్తకారణమ్. 24 యో೭సౌ బ్రహ్మా జగత్కార్తా యన్నాభికమలోద్భవః, స ఏవానన్దరూపాత్మా తస్మాన్నాస్త్యపరో మునే. 25 అన్తర్యామీ జగద్వ్యాపీ సర్వసాక్షీ నిరంజనః, భిన్నాభిన్నస్వరూపేణ స్థితో వై పరమేశ్వరః. 26 యస్య శక్తిర్మహామాయా జగద్విస్రమ్భధారిణీ, విశ్వోత్పత్తేర్నిదానత్వాత్ప్రకృతిః ప్రోచ్యతే బుధైః. 27 ఆదిసర్గే మహావిష్ణుర్లోకాన్కర్తుం సముద్యతః, ప్రకృతిః పురుషశ్చేతి కాలశ్చేతి త్రిథా భ##వేత్ . 28 పశ్యన్తి భావితాత్మనో యం బ్రహ్మేత్యభిసంజ్ఞితమ్, శుద్ధం యత్పరమం ధామ తద్విష్ణోః పరమం పదమ్. 29 ఏవం శుద్ధో೭క్షరో೭నన్తః కాలరూపీ మహేశ్వరః, గుణరూపీ గుణాధారో జగతామాదికృద్విభుః. 30 నాశరహితుడు, గుణరహితుడు, శుద్ధుడు, పరిపూర్ణుడు, సనాతనుడు, పరము కంటే పరుడు యోగులచే ధ్యానించదగిన వాడు కాలనామము కలవాడు పరమాత్మ, పరానన్దుడు ఉపాధులేవీ లేనివాడు, జ్ఞానముతో మాత్రమే తెలియదగినవాడు పరముడు సచ్చిదానన్ద స్వరూపుడు పరమాత్మ శుద్దుడైనను అహంకారముతో సంబంధముచేత దేహి (జీవుడు) అని అనబడుచున్నాడు. అజ్ఞానప్రవృత్తి వింత కదా ! అన్నిటికంటే పరముడైన ఆ యాదిదేవుడు సత్త్వరజస్తమోగుణ భేదముల వలన సృష్టి స్థితిలయములను చేయు విష్ణు బ్రహ్మ శివాఖ్యములగు మూడు మూర్తుల రూపమును పొందెను. జగత్తును సృష్టించిన బ్రహ్మ ఎవని నాభి కమలము నుండి పుట్టెనో అతనే ఆనంద స్వరూపుడు పరమాత్మ, అతని కంటే భిన్నుడింకొకడు లేడు. ఆ పరమాత్మయే అన్తర్యామిగా జగత్తును వ్యాపించి యుండును. సర్వసాక్షి అయిననూ దేనితో సంబంధములేని వాడు. ఈ పరమేశ్వరుడే (జగజ్జీవాదులకంటే) భిన్నరూపముతో అభిన్నరూపముతో నుండును. ఈ పరమాత్మశక్తియగు మహామాయయే జగత్స్వరూపమును ధరించును. ప్రపంచము పుట్టుటకు మూలకారణము కావున పండితులు ఈ మాయను ప్రకృతి అందురు. మహావిష్ణువు ఆదిసృష్టిలో లోకములను సృజించుటకు సంకల్పించి ప్రకృతి, పురుషుడు, కాలము అని మూడువిధము లాయెను. ఆత్మస్వరూపమును తెలిసినవారు ఇతనినే బ్రహ్మ అని అందురు. పరిశుద్ధమైన ఈ పరంధామమే పరమపదమని పిలువబడును. ఈ పరమాత్మ పరిశుద్ధుడు అక్షరుడు, అనన్తుడు. కాలరూపి, మహేశ్వరుడు, గుణరూపి, గుణములకు ఆధారము, జగత్తును మొదట సృజించినవాడు. జగత్తులకధిపతి. 21-30 ప్రకృతిః క్షోభమాపన్నా పురుషాఖ్యే జగద్దురౌ, మహాన్ప్రాదురభూద్బుద్ధిస్తతో೭హం సమవర్తత. 31 అహంకారాచ్చ సూక్ష్మాణి తన్మాత్రాణీంద్రియాణీ చ, తన్మాత్రేభ్యో హి జాతాని భూతాని జగతః కృతే . 32 ఆశాకవాయగ్నిజలభూమయో೭బ్జభవాత్మజ, యథాక్రమం కారణతామేకైకస్యోపయాన్తి చ . 33 తతో బ్రహ్మ జగద్థాతా తామసానసృజత్ప్రభుః తిర్యగ్యోనిగతాన్ జంతూన్ పశుపక్షిమృగాదికాన్. 34 తమప్యసాధకం మత్వా దేవసర్గం సమాతనోత్, తతో వై మానుషం సర్గం కల్పయామాస పద్మజః . 35 తతో దక్షాదికాన్పుత్రాన్ సృష్టిసాధనతత్పరాన్, ఏభిః పుత్రైరిదం వ్యాప్తం సదేవాసురమానుషమ్. 36 భూర్భవశ్చ తథా స్వశ్చ మహాశ్చైవ జనస్తథా. తపశ్చ సత్యమిత్యేవం లోకాః సప్తోపరి స్థితాః . 37 అతలం వితలం చైవ సుతలం చ తలాతలమ్, మహాతలం చ విప్రేన్ద్ర తతో೭ధశ్చ రసాతలమ్. 38 పాతాలం చేతి సరపై#్తవ పాతాలాని క్రమాదధః, ఏష సర్వేషు లోకేషు లోకనాథాంశ్చ సృష్టవాన్. 39 కులాచలాన్నదీశ్చాసౌ తత్తల్లోకనివాసినామ్, వర్తనాదీని సర్వాణి యథాయోగ్యమకల్పయత్. 40 పురుషుడను పేరుగల జగద్గురువునందు క్షోభ (కదలిక) చెందిన ప్రకృతి నుండి మహత్తత్త్వమను బుద్ధి పుట్టెను. మహత్తత్త్వమునుండి అహంకారము పుట్టెను. అహంకారమునుండి సూక్ష్మములైన పంచతన్మాత్రలు, ఇంద్రియములు పుట్టెను. ఈ జగత్సృష్టి కొఱకు తన్మాత్రలనుండి పంచభూతములు పుట్టెను. ఆకాశము, వాయువు. అగ్ని, జలము, భూమి అను పంచభూతములు వరుసగా ఒక్కొక్కదానికి కారణములగును. అనగా ఆకాశమునుండి వాయువు. వాయువునుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి పుట్టినవని భావము. తరువాత జగత్తును సృష్టించు బ్రహ్మ తమోగుణ భూయిష్ఠములైన తిర్యగ్జంతువులగు పశుపక్షిమృగాదులను సృష్టించెను. అది తన కార్యసాధనము కాదని భావించిన బ్రహ్మ దేవతలను సృజించెను. పిమ్మట మానుషసృష్టిని గావించెను. తరువాత సృష్టిని సాధించుటయందు తత్పరులైన దక్షాది పుత్రులను సృష్టించెను. దేవదానవమాననాత్మకమగు ఈ ప్రపంచమంతయు ఈ పుత్రులచే వ్యాపించబడెను. భూలోకము భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, అను ఏడు లోకములు ఉపరిభాగమున నున్నవి. అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాలము అనునవి ఏడు క్రింది భాగమున నున్న పాతాల లోకములు. ఈ అన్ని లోకములందును లోకనాథులను కూడా సృష్టించెను. ఆయా లోకములలో నివసించువారికొఱకు కుల పర్వతములను నదులను కూడా సృష్టించెను. ఆయా లోకములలో నివసించువారికి యోగ్యముగా ప్రవర్తన మొదలగు వాటిని కూడా ఏర్పరిచెను. 31-40 భూతలే మద్యగో మేరుః సర్వదేవసమాశ్రయః, లోకాలోకశ్చ భూమ్యన్తే తన్మధ్యే సప్తసాగరాః. 41 ద్వీపాశ్చ సప్త విప్రేన్ద్ర ద్వీపే ద్వీపే కులాచలాః, వాహ్యా నదృశ్య విఖ్యాతా జనాశ్చామరసన్నిభాః. 42 జంబూప్లక్షాభిధానౌ చ శాల్మలశ్చ కుశస్తథా, క్రౌంచాశోకౌ పుష్కరశ్చ తే సర్వే దేవభూమయః. 43 ఏతే ద్వీపాస్సముద్రైస్తు సప్త సప్తభిరావృతాః, లవణక్షుసురాసర్పిదధిక్షీర జలైస్సమమ్. 44 ఏతే ద్వీపాస్సముద్రాశ్చ పూర్వస్మాదుత్తరోత్తరాః, జ్ఞేయా ద్విగుణవిస్తారా అలోకాలోకపర్వతాత్. 45 క్షారోదధేరుత్తరం యద్ధిమాద్రేశ్చైవ దక్షిణమ్, జ్ఞేయం తద్భారతం వర్షం సర్వకర్మఫలప్రదమ్. 46 అత్ర కర్మాణి కుర్వన్తి త్రివిధాని తు నారద! తత్ఫలం భుజ్యతే చైవ భోగభూమిధనక్రమాత్. 47 భారతే తు కృతం కర్మ శుభం వా శుభ##మేవ చ, తత్ఫలం క్షయి విప్రేన్ద్ర భుజ్యతే೭ న్యత్ర జన్తుభిః. 48 అద్యాపి దేవా ఇచ్ఛన్తి జన్మ భారతభూతలే, సంచితం సమహత్పుణ్యమక్షయ్యమమలం శుభమ్. 49 కదా లబామహే జన్మ వర్షభారతభూమిషు, కదా పుణ్యన మహాతా యాస్యామ పరమం పదమ్. 50 భూమండలమున మధ్యభాగమున దేవతలందరికి ఆశ్రయమైన మేరుపర్వతమున్నది. భూమి చివర లోకాలోక పర్వతమున్నది. భూమి మధ్యభాగమున ఏడు సముద్రములు కలవు. ఓ బ్రహ్మణోత్తమా ! ఈ భూమండలమున ఏడు ద్వీపములు కలవు. ప్రతి ద్వీపమున కులాచలములు కలవు. ఈ భూమండలమున చక్కని ప్రవాహములు కల నదులు కలవు. ఇచటి జనులు దేవతాసములు. జమ్బూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, అశోకద్వీపము, పుష్కరద్వీపము అను ఏడు ద్వీపములు దేవనివాసములు. ఈ ఏడు ద్వీపములు ఏడు సముద్రములచే చుట్టబడియున్నవి. లవణసముద్రము, ఇక్షుసముద్రము, సురాసముద్రము, సర్పిసముద్రము, దధిసముద్రము, క్షీరసాగరము, జలసముద్రములు అని ఏడు సముద్రములు, లోకాకోకపర్వతము వరకు ఈ ఏడు ద్వీపములు, సముద్రములు మొదటి దానికంటే రెండవది ఈ విధముగా రెట్టింపు విస్తారము కలవి. ఉప్పు సముద్రము కంటే ఉత్తర భాగమున హిమాద్రికి దక్షిణ భాగమున భారత వర్షము కలదు. ఈ భారతవర్షము అన్ని కర్మల ఫలము నిచ్చునది. ఓ నారదా ! ఈ భారతవర్షమున మూడు విధములైన కర్మలను (కాయిక వాచిక మానసిక) చేతురు. ఆ కర్మల ఫలమును భోగరూపముగా భూరూపముగా ధనరూపముగా వరుసగా అనుభవింతురు. భారతవర్షమున చేయు శుభాశుభ కర్మల ఫలమును ప్రాణులు మరొకచోట అనుభవింతురు. ఇప్పటికీ దేవతలు భారతభూమిలో పుట్టవలయునని కోరుచుందురు. ఈ భూమిపై సంపాదించిన పుణ్యము, అక్షయము అమలము శుభమగును. భారతవర్ష భూభాగమున ఎపుడు పుట్టెదమా ! ఎపుడు గొప్ప పుణ్యముతో పరమపదమును చేరెదమా! అని దేవతలు ఆశింతురు. 41-50 దానైర్వా వివిధైర్యజ్ఞై స్పపోభిర్వాధవా హరిమ్, జగదీశం సమేష్యమో నిత్యానన్దమనామయమ్. 51 యో భారతభువం ప్రాప్య విష్ణుపూజాపరో భ##వేత్, న తస్య సదృశో೭న్యో೭స్తి త్రిషు లోకేషు నారదా ! 52 హరికీర్తనశీలో వా తద్భక్తానాం ప్రియో೭పి వా, శుశ్రూషుర్వాపి మహతస్స వంద్యో దివిజైరపి. 53 హరిపూజారతో నిత్యం భక్తపూజారతో ೭పి వా, భక్తోచ్ఛిష్టాన్న సేవీ చ యాతి విష్ణోః పరం పదమ్. 54 నారాయణతి కృష్ణేతి వాసుదేవేతి యో వదేత్, అహింసాదిపరశ్శాన్తస్సో೭పి వన్ద్యస్సురోత్తమైః . 55 శివేతి నిలకంఠేతి శంకరేతి చ యః స్మరేత్ , సర్వభూతహితో నిత్యం సో೭భ్యర్చ్యో దివిజైః స్మృతః. 56 గురుభక్తశ్శివధ్యానీ స్వాశ్రమాచారతత్సరః, అనసూయుశ్శుచిర్దక్షో యస్సో೭భ్యర్చ్యస్సురేశ్వరైః. 57 బ్రహ్మణానాం హితకరశ్శ్రద్ధావాన్వర్ణధర్మయోః, వేదవాదరతో నిత్యం స జ్ఞేయః, పంక్తిపావనః. 58 అభేదదర్శీ దేవేశే నారాయణశివాత్మకే, స వన్ద్యో బ్రహ్మణా నిత్యమస్మదాదిషు కా కథా . 59 గోషు క్షాన్తో బ్రహ్మచారీ పరనిందావివర్జితః, అపరిగ్రహశీలశ్చ దేవపూజ్యస్స నారదః. 60 స్తేయాదిదోషవిముఖః కృతజ్ఞ స్సత్యవాక్ శుచిః, పరోపకారనిరతః పూజనీయస్సురాసురైః. 61 వేదార్థశ్రవణ బుద్ధిః పురాణశ్రవణ తథా, సత్సంగేపి చ యస్యాస్తి సో೭పి వన్ద్యస్సురోత్తమైః. 62 ఏవమాదీన్యనేకాని కర్మాణి శ్రద్ధయాన్వితః, కరోతి భారతే వర్షే స వన్ద్యోస్మా భిరేవ చ . 63 ఏతేష్వన్యతమో విప్రమాత్మానం నారభేత్తు యః, స ఏవ దుష్కృతిర్మూఢో నాస్త్యన్యో ೭స్మాదచేతనః. 64 సంప్రాప్య భారతే జన్మ సత్కర్మసుపరాఙ్ముఖః, పీయూషకలశం ముక్త్వా విషభాండముపాశ్రితః. 65 శ్రుతిస్మృత్యుదితైర్ధిర్మైరాత్మానం పావయేత్తు యః, స ఏవాత్మవిఘాతీ స్యాత్ పాపినామగ్రణీర్మునే. 66 కర్మభూమిం సమాసాద్య యో న ధర్మం సమాచరేత్, స చ సర్వాధమః ప్రోక్తో వేదవిద్భిర్మునీశ్వర. 67 శుభం కర్మ సముత్సృజ్య దుష్కర్మాణి కరోతి యః, కామధేనుం పరిత్యజ్య అర్కక్షీరం స మార్గతి. 68 ఏవం భారతభూభాగం ప్రశంసన్తి దివౌకసః, బ్రహ్మాద్యా అపి విప్రేన్ద్ర స్వభోగక్షయభీరవః . 69 నిత్యనందస్వరూపుడు, శుద్ధుడు, జగదీశ్వరుడైన శ్రీహరిని పలువిధములైన దానములచేత కాని, యజ్ఞములచేత కాని, తపములచేత కాని ఆరాధించి ఎప్పటికైన అతనిని చేరగలమా అని దేవతలు కోరుకొనుచుందురు. భారత భూమిలో పుట్టి విష్ణుపూజారతుడైనచో వానితో సాటివచ్చువాడు మూడులోకములలో మరియోవడుండడు. హరిని కీర్తించు స్వభావము కలవాడు కాని, హరిభక్తులకు ప్రీతిపాత్రుడుకాని, మహాత్ములను సేవించువాడు కాని దేవతలచే కూడ నమస్కరింపదగినవాడగును. హరిని పూజించుటయందు ఆసక్తిగలవాడు, హరిభక్తులను పూజించగోరువాడు, హరిభక్తులు తినగా మిగిలిన అన్నమును తినువాడు శ్రీమహావిష్ణువు నివసించు పరమపదమును చేరును. నారాయణ కృష్ణ వాసుదేవ అని శ్రీహరిని కీర్తించువాడు అహింసను ఆశ్రయించి శాంతుడుగా ఉండువాడు దేవతల చేత కూడా నమస్కరించదగినవాడగును. శివా, నీలకంఠా, శంకరా అని కీర్తించువాడు సర్వప్రాణుల హితమునుకోరువాడు దేవతల పూజలందదగినవాడును. గురువు యందు భక్తిగలవాడు, శివుని ధ్యానించువాడు తన ఆశ్రమాచారములయందు ఆసక్తుడు, అసూయలేనివాడు, పవిత్రుడు, సమర్థుడు అయినవాడు కూడా దేవతలచే పూజించదగినవాడు. బ్రహ్మణులకు హితమును చేయువాడు, వర్ణధర్మములయందు శ్రద్ధకలవాడు ఎల్లప్పుడు వేదాధ్యయనమునం దాసక్తి కలవాడు ఎల్లప్పుడు పంక్తిపావనుడే. నారాయణ శివ రూపములతోనున్న ఆదిదేవుని అభేదమును చూచువాడు ఎల్లప్పుడు చతుర్ముఖబ్రహ్మచేత కూడ నమస్కరింపదగినవాడగును. ఇక మన విషయమేమి చెప్పగలము? ఓ నారదా! ఆవులయందు క్షమాశీలుడు, బ్రహ్మచారి, పరనిందను వదిలినవాడు ఎవరినుండి దేనిని గ్రహించనివాడు దేవపూజ్యుడు. చౌర్యము మొదలగు దోషములయందు విముఖుడు, కృతజ్ఞుడు, సత్యమును మాత్రమే మాట్లాడువాడు, పరిశుద్ధుడు, పరోపకారమునందు ఆసక్తి కలవాడు దేవదానవులందరిచే పూజించదగినవాడగును. వేదార్థములను వినుటయందు, పూరాణములను వినుటయందు, సజ్జనసాంగత్యమునందు ఆసక్తికలవాడు కూడా దేవతలచేకూడా పూజించదగినవాడగును. ఇటువంటి పనులను అనేకములను శ్రద్ధతో భారతవర్షములో చేయుచు ఋషులతో సంబంధము నేర్పరచుకొనినవాడు ఉత్తముడు. భారతవర్షములో పుట్టి శ్రద్ధతో ఇట్టి పనులు చేయువాడు మనకు నమస్కరింపదగినవాడు. పైన చెప్పిన పనులలో ఏ ఒక్క పనిని కూడా చేయనివాడు మహాపాపి. మూర్ఖుడు కూడ. అతని కంటే అజ్ఞాని మరియొకడుండడు. భారతవర్షములో పుట్టి కూడా మంచికర్మలయందు ఆసక్తిలేనివాడు అమృతకలశమును వదలిపెట్టి విషభాండము నాశ్రయించినవాడగును. శ్రుతి స్మృతులచే చెప్పబడిన ధర్మములతో తనను పవిత్రుని చేసికొననివాడు ఆత్మఘాతి, పాపులలో మొదటివాడగును. కర్మభూమిలో పుట్టి కూడా ధర్మము నాచరించనివాడు అందరిలో అధముడుగా వేదజ్ఞులచే చెప్పబడును. శుభకర్మలను వదలి చెడుపనులను చేయువాడు కామధేనువును వదలి జిల్లేడు పాలను వెతుకువాడగును. ఇట్లు బ్రహ్మాది దేవతలు తమ భోగము క్షీణించును అను భయముచే భారత భూభాగమును ప్రశంసించెదరు. 51-69 తస్మాత్పుణ్యతమం జ్ఞేయం భారతం వర్షముత్తమమ్, దేవానాం దుర్లభం వాపి సర్వకర్మఫలప్రదమ్. 70 అస్మిన్పుణ్య చ భూభాగే యస్తు సత్కర్మక్షపణోద్యతః, న తస్య సదృశః కశ్చిత్త్రిషు లోకేషు విద్యతే. 71 అస్మిన్జాతో నరో యస్తు స్వకర్మక్షపణోద్యతః, నరరూపపరిచ్ఛన్నః స హరిర్నాత్ర సంశయః. 72 పరలోకఫలప్రేప్సుః కుర్యాత్కర్మాణ్యతంద్రితః, నివేద్య హరయే భక్త్యా తత్ఫలం హ్యక్షయం స్మృతమ్. 73 విరాగీ చేత్కర్మఫలేష్వపి కించిన్న కారయేత్ అర్పయేత్సుకృతం కర్మ ప్రీయతామితి మే హరిః. 74 ఆబ్రహ్మభువనాల్లోకాః పునరుత్పత్తిదాయకాః, ఫలాగృధ్నుః కర్మణాం తత్ప్రాప్నోతి పరమం పదమ్. 75 వేదోదితాని కర్మాణి కుర్యాదీశ్వరతుష్టయే, యథాశ్రమం త్యక్తుకామః ప్రాప్నోతి పదమవ్యయమ్. 76 నిష్కామో వా సకామో వా కుర్యాత్కర్మ యథావిధి, స్వాశ్రమాచారశూన్యశ్చ పతితః ప్రోచ్యతే బుధైః. 77 సదాచారపరో విప్రో వర్ధతే బ్రహ్మతేజసా, తస్య విష్ణుశ్చ తుష్టః స్యాద్భక్తియుక్తస్య నారద! 78 భారతే జన్మ సంప్రాప్య నాత్మానం తారయేత్తు యః, పచ్యతే నిరయే ఘోరే స త్వాచన్ద్రార్కతారకమ్. 79 వాసుదేవపరో ధర్మో వాసుదేవపరం తపః, వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరా గతిః. 80 వాసుదేవాత్మకం సర్వం జగత్ స్థావరజంగమమ్, ఆబ్రహ్మస్తమ్బపర్యన్తం తస్మాదన్యన్న విద్యతే. 81 స ఏవ ధాతా త్రిపురాన్తకశ్చ స ఏవ దేవాసురయజ్ఞరూపః. స ఏవ బ్రహ్మండమిదం తతో೭న్యన్న కించిదస్తి వ్యతిరిక్తరూపమ్. 82 యస్మాత్పరం నాపరమస్తి కించిద్యస్మాదణీయాన్న తథా మహీయాన్, వ్యాప్తం వా తేనేదమిదం విచిత్రం తం దేవదేవం ప్రణమేత్సమీడ్యమ్. 83 ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణ పూర్వభాగే ప్రథమపాదే సృష్టి భరతఖండప్రాశస్త్య భూగోలానాం వర్ణనం నామ తృతీయో೭ధ్యాయః కావున భారతవర్షము అన్నిటికంటే ఉత్తమము, పరమ పవిత్రము, అని తెలియుము. అట్లే అన్ని విధముల కర్మల ఫలములనిచ్చునది. దేవతలకు కూడా లభించ శక్యము కానిది. ఈ భారత భూభాగమున మంచి పనులను చేయ సమకట్టిన వానితో సమానుడు మరియొకడుండడు. ఈ భారత భూభాగమున పుట్టి కర్మలను క్షీణింపచేయదలచిన మానవుడు మానవరూపముతో నున్న శ్రీహరియే. ఈ విషయమున సందేహముతో పనిలేదు. పరలోక ఫలమును పొందగోరువాడు కూడా సోమరితనమును విడిచి కర్మలను చేయవలయును. చేసిన కర్మలను శ్రీహరికి సమర్పించినచో ఆ ఫలము తరగని దగును. కర్మఫలములలో ఆశ##లేనివాడుకూడా సత్కర్మల నాచరించి శ్రీహరి ప్రీతి చెందుగాక అని సుకృతములను శ్రీమన్నారాయణునకు సమర్పించవలయును. బ్రహ్మలోకము వరకున్న లోకములన్నియు పునర్జన్మ నిచ్చునవే. కర్మఫలముల నాశించనివాడు పునర్జన్మ లేని పరమపదమును పొందును. పరమేశ్వరుని ప్రీతికొరకు తన ఆశ్రమానుగుణముగా వేదవిహిత కర్మల నాచరించవలయును. కర్మ ఫలములను వదిలినవాడు పరమపదమును పొందును. కోరికలున్నవాడైనను లేనివాడైనను శాస్త్రము ననుసరించి కర్మలనాచరించియే తీరవలయును. తన ఆశ్రమాచారముల ననుసరించని వానిని పండితులు పతితుడందురు. సదాచారపరుడైన బ్రహ్మణుడు బ్రహ్మతేజస్సుతో వృద్ధిచెందును. భక్తియుక్తుడైన వానికి శ్రీహరి సంతుష్టుడగును. ఓ నారద మహర్షీ ! భారతవర్షమున పుట్టి ఆత్మను తరింపచేసుకొననివాడు సూర్యచంద్రులుండువరకు నరకము ననుభవించుచుండును. ధర్మము వాసుదేవ స్వరూపము. తపస్సు వాసుదేవ స్వరూపము. జ్ఞానము వాసుదేవుని తెలుపునదే. వాసుదేవుని చేర్చునదే ఉత్తమగతి. స్థావరజంగమాత్మకమగు. ఈ ప్రపంచమంతయు వాసుదేవ స్వరూపమే. బ్రహ్మనుండి స్తంబమువరకున్న ఈ ప్రపంచము సర్వము వాసుదేవాత్మకమే. శ్రీహరి కానిదేదీలేదు. శ్రీహరియే బ్రహ్మ . శ్రీహరియే విష్ణువు. దేవదానవ యజ్ఞరూపము లన్నియూ శ్రీహరియే. ఈ బ్రహ్మండమంతయూ శ్రీమన్నారాయణుడే. శ్రీహరి కానిది శ్రీహరికంటే వేరైనది ఏదియును లేదు. శ్రీహరి కంటే గొప్పది, తక్కువది ఏదియును లేదు. శ్రీహరి కంటే పెద్దది చిన్నది కూడా ఏదిలేదు. ఈ చిత్ర విచిత్రమైన ప్రపంచమందంతటనూ శ్రీమన్నారాయణుడు వ్యాపించి యున్నాడు. కావున చక్కగా స్తుతించదగిన శ్రీమన్నారాయణునికి నమస్కరించవలయును. 70-83 ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సృష్టి, భరతఖండ ప్రాశస్త్యము భూగోళ వర్ణనము అను మూడవ అధ్యాయము ముగిసినది.