Sri Naradapuranam-I    Chapters    Last Page

ఏకత్రింశోధ్యాయః ముప్పదియొకటవ అధ్యాయము

యమదూతకృత్యనిరూపణమ్‌

నారద ఉవాచ:-

కథితో భవతా సమ్యగ్వర్ణాశ్రమవిధిర్మునే, ఇదానీం శ్రోతుమిచ్ఛామి యమమార్గం సుదుర్గమమ్‌. 1

ఓ మునిశ్రేష్ఠా! మీరు చక్కగా వర్ణాశ్రమవిధిని వివరించితిరి. ఇపుడు దుర్గమమైన యమమార్గమును వినగోరుచున్నాను.

సనక ఉవాచ:-

శృణు విప్ర ప్రవక్ష్యామి యమమార్గం సుదుర్గమమ్‌, సుఖదం పుణ్యశీలాం పాపినాం భయదాయకమ్‌. 2

షడశీతిసహస్రాణి యోజనాని మునీశ్వర ! యమమార్గస్య విస్తారః కథితః పూర్వసూరిభిః. 3

యే నరా దానశీలాస్తు తే యాంతి సుఖినో ద్వీజ, ధర్మశూన్యా నరా యాంతి ధుఃఖేన భృశమర్దితాః. 4

అతిభీతా వివస్త్రాశ్చ శుష్కకంఠోష్ఠతాలుకాః, క్రందంతో విస్వరం దీనా పాపినో యాంతి తత్పథే. 5

హన్యమానా యమభ##టైః ప్రతోదాత్యైస్తధాయుధైః, ఇతస్తతః ప్రధావంతో యాంతి దుఃఖేన తత్పథే. 6

క్వచిత్పంకః క్వచిద్వహ్నిః క్వచిచ్సంతప్త సైకతమ్‌ క్వచిద్వై దావరూపేణ తీక్షధారాః శిలాక్ష క్వచిత్‌. 7

క్వచిత్కంటకవృక్షాశ్చ దుఃఖారోహశిలా నగాః, గంఢాంధకారాశ్చ గుహాః కంటకావరణం మహత్‌. 8

వప్రాగ్రారోహణం చైవ కందస్య ప్రవేశనమ్‌, శక్రరాశ్చ తథా లోష్ఠాస్సూచీతుల్యాశ్చ కంటకాః. 9

శైవాలం చ క్వచిన్మార్గే క్వచిత్కీచకపంక్తయః, క్వచిద్వ్యాఘ్రాస్చ గర్జంతే వర్ధంతే చ క్వచిజ్జ్వరాః. 10

ఏవం బహువిధా క్లేశాః పాపినో యాంతి నారద క్రోశంతశ్చ రుదంతశ్చ వ్లూయంతశ్చైవ పాపినః. 11

పాశేన యంత్రితాః కేచిత్‌ కృష్యమాణాస్తతాంకుశైః, శస్త్రాసై#్త్రస్తాడ్యమానాస్చ పృష్ఠతో యాంతి పాపినః. 12

నాసాగ్రపాశకృష్టాశ్చ కేచింద్యంత్రైశ్చ భాదితాః, వహంతశ్చాయసం భారం శిశ్నాగ్రేణ ప్రయాంతి వై. 13

అయోభారద్వయం కేచిన్నాసాగ్రేణ తతాపరే, కర్ణాభ్యాం చ తథా కేచిద్వహంతో యాంతి పాపినః. 14

కేచిచ్చ స్ఖలితా యాంతి తాడ్యమానాస్తథాపరే, అత్యర్ధోచ్ఛాస్వితాః కేచిత్కేచిదాచ్ఛన్నలోచనాః. 15

ఛాయాజలవిహీనే తు పధి యా త్యతిదుఃఖితాః, శోచన్తస్స్వాని కర్మాణి జ్ఞానాజ్ఞానాకృతాని చ. 16

సనక మహర్షి పలికెను:-పుణ్యశీలురకు సుఖమునిచ్చునది, పాపులకు భయమును కలిగించునది దుర్గమమైన యమమార్గమును చెప్పెదను వినుము. ఓ మునీశ్వరా! యమలోకమార్గము ఎనుబది యారు వేల యోజన విస్తారము అని జ్ఞానులు చెప్పియున్నారు. దానశీలురకు మానవులకు సుఖముగా వెళ్ళెదరు. ధర్మ శూన్యులగు నరులు దుఃఖములచే పీండించబడుచు వెళ్ళెదరు. యమమార్గమున పాపులు మిక్కిలి భయముచే వివస్త్రులై తడారిన గొంతు పెదవులు కలవారై వికృతముగా ఆరచుచు దీనులై వెళ్ళెదరు. యమభటులచే కొరడాలతో అంకుశములచే కొట్టబడుచు, ఇటునటు పరుగెత్తుచు దుఃఖముచే ఆ మార్గమున నడిచెదరు. ఒకచోట బురద, ఒకచోట అగ్ని, ఒకచోట బాగుగా కాగియున్న ఇసుక, ఒకచోట దావాగ్ని, నిశిత దారలు గల శిలలు ఒకచోట, ఒకచోట ముళ్ళచెట్లు, దుఃఖముచే ఎక్కదగిన రాళ్ళుగల పర్వతములు, కటిక చీకటిగల గుహాలు, మార్గమంతయు కంటకావృతము , కోటబురుజులు ఎక్కుట , లోయలలో చొరబడుట, గులకరాళ్ళు, పాషాణఖండములు , సూదులవంటి కంటకములు, కొన్నిచోట్ల నాచు, కొన్నిచోట్ల వెదురు బొంగులు, కొన్నిచోట్ల గర్జించు పెద్దపులులు, కొన్నిచోట్ల జ్వరములు పెరుగుచుండును. ఇట్లు పలువిధములైన కష్ఠములతో పాపులు వెళ్ళెదరు. పాపులు ఆక్రోశించుచు, ఏడ్చుచు వాగుచు పాశ ములచే కట్టబడుచు, అంకుశముచే కట్టబడుచు, వె నుకకు వెళ్లుచుందురు. ముక్కు చివర పాశముచే కట్టబడి, కొందరు తాళ్ళచే బాధించబడుచు, శిశ్నాగ్రముచే అయోభారమును మోయుచు వెళ్ళెదరు. కొందరు కొట్టబడుచు, మిక్కిలి నిట్టూర్పు కన్నులు మూసుకొ ని కొందరు నీడ, నీరు లేని దారిలో దుఃఖించుచు వెళ్ళెదరు. తెలిసి తెలియక చేసిన తన పనులను గూర్చి ఆలోచించుచు వెళ్లెదరు. 2-16

యే తు నారద ధర్మిష్ఠా దానశీలా సుబుద్దయ, అతీవసుఖసంపన్నాస్తే యాంతి ధర్మమందిరమ్‌. 17

అన్నాదాస్తు మునిశ్రేష్ఠ భంజంతస్స్వాయాంతి వై, నీరదా యాంతి సుఖినః పిబన్తః క్షీరముత్తమమ్‌. 18

తక్రదా దధిరాశ్చైవ తత్తద్భోగం లభంతి వై, ఘృతదా మధుదాశ్చైవ క్షీరదాశ్చ ద్విజోత్తమ. 19

సుధాపానం ప్రకుర్వంతో యాంతి వై ధర్మమందరిమ్‌. శాకదాః పాయసం భంజన్‌ దీపదో జ్వలయన్దిశః. 20

వస్త్రదో మునిశార్దూల యాతి దివ్యాంబరావృతః, పురాకరప్రదో యాతి స్తూయమానోమరైః పధి. 21

గోదానేన నరో యాతి సర్వసౌఖ్యసమన్వితః భూమిదో గృహదశ్చైవ విమానే సర్వసంపది. 22

అప్సరోగణసంకీర్ణః క్రీడన్యాతి వృషాలయమ్‌, హయదో యానదశ్చాపి గజదశ్చ ద్విజోత్తమ. 23

ధర్మాలయం విమానేన యాతి భోగాన్వితేన వై, అనడుద్దో మునిశ్రేష్ఠ యానారూఢః ప్రయాతివై. 24

ఫలదః పుష్పదశ్చాపి యాతి సంతోషసంయుతః , తాంబూలదో నరో యాతి ప్రహృష్టో ధర్మమందిరమ్‌. 25

మాతాపిత్రోశ్చ శుశ్రూషాం కృతవాన్యో నరోత్తమః, స యాతి ప్రతుష్టాత్మా పూజ్యమానో నరోత్తమః. 26

శుశ్రూషాం కురుతే యస్తు యతీనాం వ్రతచారిణాం , ద్విజాగ్య్రబ్రాహ్మణానాం చ స యాత్యతిసుఖాన్వితః, 27

సర్వభూతదయాయుక్తః పూజ్యమానో మరైర్ద్విజైః, సర్వభోగాన్వితేనాసౌ విమానేన ప్రయాతి చ. 28

విద్యాదానరతో యాతి పూజ్యమానో బ్జసూనుభిః, పురాణపాఠకో యాతి స్తూయమానో మునీశ్వరైః. 29

ఏవం ధర్మపరా యాంతి సుఖం ధర్మస్య మందిరమ్‌, యమశ్చతుర్ముఖో భుత్వా శంఖచక్రగదాసిభృత్‌. 30

పుణ్యకర్మరతం సమ్యక్స్నేహాన్మిత్రమివార్చతి, భో భో బుద్ధిమతాం శ్రేష్ఠా నరక్లేశభీరవః. 31

యుష్మాభిస్సాధితం పుణ్యమాత్రాముత్ర సుఖావహమ్‌, మనుష్యజన్మ యః ప్రాప్య సుకృతం న కరోతి చ. 32

స ఏవ పాపినాం శ్రేష్ఠ ఆత్మఘాతం కరోతి చ, అనిత్యం ప్రాప్య మానుష్యం నిత్యం యస్తు న సాధయేత్‌. 33

స యాతి నరకం ఘోరం కో న్యస్సస్మాదచేతనః, శరీరం యాతనారూపం మలాధ్యైః పరిధూషితమ్‌. 34

తస్మిన్యో యాతి విశ్వాసం తం విద్యాదాత్మఘాతకమ్‌, సర్వేషు ప్రాణినశ్శేష్ఠాస్తేషు వై బుద్ధిజీవినః. 35

బుద్ధిమత్సు నరాశ్శేష్ఠాస్తేషు, వై బుద్ధిజీవినః, బ్రహ్మణషు చ విద్యాంసో విద్వత్సు కృతబుద్ధయః. 36

కృతబుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహ్మవాదినః, బ్రహ్మవాదిష్వపి తథా శ్రేష్ఠో నిర్మమ ఉచ్యతే. 37

ఏతేభ్యో పి పరో జ్ఞేయో నిత్యం ధర్మపరాణః, తస్మాత్సర్వప్రయత్నేన కర్తవ్యో ధర్మసంగ్రహః 38

సర్వత్ర పూజ్యతే జంతుర్ధర్మవాన్నాత్ర సంశయః, గచ్ఛ స్వపుణ్యౖర్మత్థ్సానం సర్వభోగసమన్వితమ్‌. 39

అస్తి చేద్దుష్కృతం కించిత్పశ్చాదత్రైవ భోక్ష్యేసే, ఏవం యమస్తమభ్యర్చ్య ప్రాపయిత్వా చ సద్గతిమ్‌. 40

ఓ నారదా! ధర్మిష్ఠులు, దానశీలురు సుబుద్ధులు మిక్కిలి సుఖముతో ధర్మమందిరమునకు వెళ్ళెదరు. అన్నదానము చేసినవారు రుచికరమైన పదార్ధములను భుజించుచు వెళ్ళెదరు. జలదానమును చేసినవారు రుచికరమైన పాలను త్రాగుచు వెళ్ళెదరు. తక్రదానమును చేసినవారు దధి దానమును చేసినవారు ఆయా భోగములను అనుభవించుచు వెళ్ళెదరు. ఘృతదానమును మధుదానమును, క్షీరదానమును చేసినవారు తేనె త్రాగుచు ధర్మమందిరమునకు వెళ్ళెదరు. శాకదానము చేసినవారు పాయసమును త్రాగుచు, దీపదానమును చేసినవారు దిక్కులు ప్రకాశింప చేయుచు, వస్త్రదానమును చేసినవారు దివ్యాంబరధారులై వెళ్ళెదరు. చేయూత నిచ్చువారు దారిలో దేవతలచే స్తుతించబడుచు వెళ్ళెదరు. గోదానమును చేసినవారు సర్వసౌఖ్యములతో వెళ్ళెదరు. భూదానమును గృహదానమును చేసినవారు అప్సరోగణములతో సర్వసంపదచే కూడియున్న విమానమున విలాసముగా వెళ్ళెదరు. హయదానమును వాహన దానమును, గజదానమును చేసినవారు భోగాన్వితములైన విమానములలో వెళ్ళెదరు. వృషభదానమును తాంబూల దానమును చేసినవారు సంతోషముతో వెళ్ళెదరు. మాతా పితృశుశ్రూష చేసినవారు దేవతలచే స్తుతింబడుచు సంతోషమనస్కులై వెళ్ళెదరు. యతులను వ్రతచారిణులను బ్రాహ్మణోత్తములను సేవించువారు మిక్కిలి సుఖముగా వెళ్ళెదరు. సర్వభూతదయాపరుడు దేవతలచే పూజించబడుచు సర్వభోగాన్వితమైన విమానముచే వెళ్ళును. విద్యాదానమును చేసినవారు బ్రాహ్మణులచే స్తుతించబడుచు, పురాణపాఠకుడు మునీశ్వరులచే స్తోత్రము చేయబడుచు వెళ్లెదరు. ఇట్లు ధర్మపరులు ధర్మమందిరమును సుఖముగా వెళ్ళెదరు. యమధర్మరాజు చతుర్ముఖుడై శంఖచక్రగదాఖడ్గములను ధరించి పుణ్యకర్మలను చేసినవారిని స్నేహముతో మిత్రుని వలె గౌరవించును. ఓ ఉత్తమ బుద్ధిమంతులారా! నరకక్లేశములకు భయపడు మీరు చేసిన సుకృతమును చేయనిచో వాడే పరమపాపి ఆత్మఘాతమును చేయువాడును. అనిత్యమైన మానవజన్మనుపొందును. అతనికంటే అజ్ఞాని మరొకరుండరు. యాతనారూపము మలాదిపరిదూషితమైన శరీరమునందు విశ్వాసమును చూపువాడు ఆత్మఘాతకుడని తెలియుడు. అన్ని పదార్ధములలో ప్రాణులు శ్రేష్ఠులు, ప్రాణులలో బుద్ధి జీవులు, బుద్ధి జీవులలో మానవులు, నరులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రహ్మణులలో విద్వాంసులు విద్వాంసులలో కృబుద్ధులు , కృతబుద్ధులలో ఆచారపరులలో బ్రహ్మవాదులు, బ్రహమవాదులలో నిర్మములు శ్రేష్ఠులు నిర్మములలో ధ్యానపరాయణులు శ్రేష్ఠులు. కావున కల్పవిధప్రయత్నముచే ధర్మసంగ్రహమును చేయవలయును. ధర్మవంతుడు అంతటా పూజింపబడును. కావున మీ యీ పుణ్యములచే సర్వభోగ సమన్వితమైన నా స్థానమునకు వెళ్ళుడు. ఏదేని దుష్కృతమున్నచో పిదప ఇచట అనుభవించగలరు. ఇట్లు యమధర్మరాజు పుణ్యాత్ముని గౌరవించి సద్గతిని చేర్చు ను. 17-40

ఆహుయ పాపినశ్చైవ కాలదండేన తర్జయేత్‌, ప్రలయాంబుదనిర్ఘోషో హ్యంజనాద్రిసమప్రభః. 41

విద్యుత్ప్రభాయుధైర్భీమో ద్వాంత్రింశద్భుజసంయుతః, యోజనత్రయవిస్తారో రక్తాక్షో దీర్ఘనాసికః. 42

దంష్ట్రాకరాలవదనో వాపీతుల్యోగ్రవలోచనః, మృత్యుజ్వరాదిభిర్యుక్తష్చిత్రగుప్తో పి భిషణః. 43

సర్వే దూతాశ్చ గర్జంతి యమతుల్యవిబీషణాః, తతో బ్రవీతి తాన్సర్వాస్కంపమానాంశ్చ పాపినః. 44

శోచన్తః స్వాని కర్మాణి చిత్రగుప్తో యమాజ్ఞయా, భో భో పాపా దురాచారా అహంకారప్రదూషితాః. 45

కిమర్ధమార్జితం పాపైః యుష్మాభిరవివేకిభిః, కామక్రోధాదిదుష్టేన సగర్వేణ తు చేతసా. 46

యద్యత్పాపతరం తత్తత్కిమర్ధం చరితం జనాః, కృతవంతః పురా యూయం పాపాన్యత్యంతహర్షితాః. 47

తథైవ యాతనా భోజ్యాః కిం వృథా హ్యాతిదుఃఖితాః, భృత్యమిత్రకలత్రార్ధం దుష్కృతం చరితం యథా. 48

తథా కర్మవశాత్ప్రాప్తా యూమమత్రాతిదుఃఖితాః, యుష్మాభిః పోషితాం యే తు పుత్రాద్యా అన్యతో గతాః. 49

యుష్మాకమేవ తత్పాపం ప్రాప్తం కిం దుఃఖకారణమ్‌, తతాకృతాని పాపాని యుష్మాభిస్సుబహుని వై .50

తథా ప్రాప్తాని దుఃఖాని కిమర్ధమిహా దుఃఖితాః, విచారయధ్వం యూయం తు యుష్మాభిశ్చరితం పురా. 51

యమః కరిష్యతే దండమితి కిం న విచారితమ్‌ , దరిద్రేపి చ మూర్ఖే చ పిండితే వా శ్రియాన్వితే. 52

కాందిశీకే చ వీరే చ సమవర్తీ యమస్స్మృతః, చిత్రగుప్తేరితం వాక్యం శ్రుత్వా తే పాపినస్తదా. 53

శోంచతస్స్వాని కర్మాణి తూర్ణీం తిష్టంతి భీషితాః, యమాజ్ఞాకరిణః క్రూరాః చండాదూతా భయానకాః, 54

చండాలాద్వాః ప్రసహ్యేతాన్నరకేషు క్షిపంతి చ, స్వదుష్కర్మఫలం తే తు భుక్త్వాంతే పాపశేషతః,

మహీతలం చ సంప్రాప్య భవంతి స్థావరాదయః. 55

యమధర్మరాజు పాపులను పిలిచి కాలదండముచే బెదిరించి ప్రళయకాలమేఘమువలె గర్జించుచు కాటుక కొండకాంతి కలవాడై మెరుపువలె మెరయుచున్న ఆయుధములచే భయంకరమైన ముప్పదిరెండు భుజములతో యోజనత్రయ విస్తారుడై రక్తాక్షుడు, దీర్ఘనాసికుడు, దంష్ట్రాకరాలవదనుడు వాపీతుల్యోగ్రలోనుడుగా కనిపించును. మృత్యుజ్వరాదులతో కూడిన చిత్రగుప్తుడు కూడా అతి భయంకరుడై కనపడెను. యమదూతలందరూ యముని వలె భయంకరులై బీషణముగా గర్జింతురు. అపుడు చిత్రగుప్తుడు యమాజ్ఞచే భయముతో వణుకుచున్న ఆ పాపుల 'తాము చేసిన దుష్కృత్యములను గూర్చి విచారించుచున్న వారి నిట్లు పలుకును'. ఓ పాపులారా! మీరుదురాచారపరులై అహంకార దూషితులై వివేక శూన్యులై ఎందుకు పాపమును మూటకట్టుకొంటిరి. కామక్రోధాదులు కలిగించిన గర్వము నిండిన మనసుతో మహాపాపముల నేల నాచరించితివి. మీరు మిగుల సంతోషముతో చాల పాపమును చేసితిరి.అట్లే యాతనలను కూడా సంతోషముగా అనుభవించుడు ఏల దుఃఖించెదరు? భృతమిత్రకలత్రముల కొఱకు మీరు దుష్కృతము నాచరించితిరి. అట్లే అతిదుఃఖముతో ఇచటికి చేరితిరి. మీరు పోషించిన పుత్రాదులు మరో ప్రదేశమునకు వెళ్ళిరి. ఆ పాపము మీకే చేరినది . అదియే దుఃఖకారణమైనది. ఇచటికి చేరితిరి. మీరు పోషించిన పుత్రాదులు మరో ప్రదేశమునకు వెళ్ళిరి. ఆ పాపము మీకే చేరినది. అదియే దుఃఖకారమైనది. మీ పాపమును మీపుత్రాదులు పంచుకొని అనుభవించరు. మీరెట్లు పాపముల నాచరింతిరో అట్లే యాతనలననుభవింతురు. ఇక దుఃఖమేల? మీరు పూర్వము చేసిన పాపకృత్యములను ఆలోచించుచు. యముడు దండించునని అపుడెందుకాలోచించలేదు? దరిద్రుని ,మూర్ఖుని, పండితుని, శ్రీమంతుని, కాందీశీకుని, వీరుని యముడు సమముగా చూచెను. ఇట్లు చిత్రగుప్తుడు పలికిన మాటలను వినిన పాపులు తాము చేసిన పాపమును తలుచుకొని భయపడుచుందురు. యమాజ్ఞనాచరించు భయంకరులగు యమదూతలు, చండాలాదులు, బలాత్కారముగా వారిని నరకమును పడద్రోతురు. తాము చేసిన దుష్కృతమును అనుభవించి పాపశేషముచే మరల భూలోకమున స్థావరాదులుగా జన్మింతురు. 41-55

నారద ఉవాచ:-

భగవన్సంశయో జాతో మచ్చేతసి దయానిధే! .56

త్వం సమర్ధో సి తచ్ఛేత్తుం యతో నో హ్యగ్రజో భగవాన్‌, ధర్మాశ్చ వివిధాః ప్రోక్తాః పాపన్యపి బహుని చ. 57

చిరభోజ్యం ఫలం తేషాముక్తం బహువిధా త్వయా, దినాంతే బ్రహ్మణః ప్రోక్తా నాసో లోకత్రయస్య వై. 58

పరార్ధద్వితయాంతే తు బ్రహ్మాండస్యాపి సంక్షయః, గ్రామదానాదిపుణ్యానాం త్వయైవ విధినందన. 59

కల్పకోటిసహస్రేషు మహాన్భోగ ఉదాహృతః, సర్వేషామేవ లోకానాం వినాశః ప్రాకృతే లయే. 60

ఏకశ్శిష్యత ఏవేతి త్వయా ప్రోక్తం జనార్దనః, ఏష మే సంశయో జాతస్తం భవాన్‌ ఛేత్తుమర్హతి.

పుణ్యపాపోపభోగానాం సమాప్తిర్నాస్య సంప్లనే,

నారద మహర్షి పలికెను:- పూజ్యుడా! దయానిధే! నా మనసున ఒక సంశయము కలగినది. నీవు నాకగ్రజుడవు కావున ఆ సంశయమును చేదించగల సమర్ధుడవు. నీవు చాల ధర్మములను చాల పాపమును చెప్పితివి. ఆ పాపపుణ్యమును చిరకాల ఫలానుభవమును చెప్పితివి. బ్రహ్మకు దినాంతరము ప్రాప్తించినపుడు మూడు లోకములు నశించును. రెండు పరార్ధముల కాలము తరువాత బ్రహ్మండము కూడ క్షయమగునని చెప్పితివి. ఓ బ్రహ్మపుత్రా! గ్రామదానాది పుణ్యములకు కల్పకోటి సహస్రకాలము ఫలానుభవముండునని చెప్పితివి. ప్రాకృతలయమున సర్వలోకనాశనము జరుగును, ఒక జనార్దునుడు మాత్రమే మిగులునని చెప్పితిరి. సర్వలోకనాశమునందు వీని (కర్తకు) పుణ్యపాప భోగసమాప్తి జరుగదు కదా? ఆ ఫలభోగమెట్లు ఎచట జరుగును? ఈ సంశయము నాలో కలిగినది. దానిని తొలగించుము. 56-61

సనక ఉవాచ:-

సాధు ! సాధు ! మహాప్రాజ్ఞ! గుహ్యాద్గుహ్యతమం త్విదమ్‌. పృష్టం త్తే భిధాస్యామి శృణుష్వ సమాహితః.62

పృష్టంతే భిధాస్యామి శృణుష్య సుసమాహితః, నారాయణో క్షరో నంతః పరంజ్యోతిస్సనాతనః. 63

విశుద్ధో నిర్గుణో నిత్యో మాయామోహవివర్జితః, నిర్గుణో పి పరానన్దో గుణవానిన బాతి యః. 64

బ్రహ్మవిష్ణు శివాద్యైస్తు భేదవానిన లక్ష్యతే, గుణోపాధికభేదేషు త్రిష్వేతేషు సనాతనః. 65

సంయోజ్య మాయామఖిలం జగత్కార్యం కరోతి చ, బ్రహ్మరూపేణ సృజతి విష్ణురూపేణ పాతి చ. 66

అంతే చ రుద్రరూపేణ సర్వమత్తీతి నిశ్చితమ్‌, ప్రలాంతే సముత్థాయ బ్రహ్మరూపీ జనార్ధనః. 67

చరాచరాత్మకం విశ్వం యథాపూర్వమకల్పయత్‌, స్థావరాద్యాశ్చ విప్రేన యత్ర యత్ర వ్యవస్థితాః. 68

బ్రహ్మ తత్తజ్జగత్సర్వం యథాపూర్వం కరోతి వై, తస్మాత్కృతానాం పాపానాం పుణ్యానాం చైవ సత్తమః. 69

అవశ్యమేవ భోక్తవ్యం కర్మణా హ్యక్షయం ఫలమ్‌, నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశ##తైరపి. 70

అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌, యో దేవస్సర్వలోకానామంతరాత్మా జగన్మయః. 71

సర్వకర్మఫలం భుంక్తే పరిపూర్ణస్సనాతనః, యో సౌ విశ్వంభరో దేవో గుణభేదవ్యవస్థితః. 72

సృజత్యవతి చాత్తేతత్సర్వం సర్వభుగవ్యయః. 73

ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే ప్రథమ పాదే

యమదూతకృత్య నిరూపణం నామ ఏకత్రింశోధ్యాయః

సనక మహర్షి పలికెను :- ఓ మహాప్రాజ్ఞా! నీవు పరమ రహస్యమును బాగుగా ప్రశ్నింతివి. నీవడిగిన దానిని చెప్పుచున్నాను. సావదానముగా వినుము, నారాయణుడు, అక్షరుడు, అనంతుడు , పరంజ్యోతి, సనాతనుడు, విశుద్ధుడు, నిర్గుణుడు, నిత్యుడు, మాయామోహవివర్జితుడు నిర్గుణుడైనను పరమానంద స్వరూపుడు కావున గుణవంతుడు వలె బాసించును. బ్రాహ్మవిష్ణు శివాది నామ రూపములతో భేదము కలవాని భాసించును. సనాతనుడను నారాయణుడు మూడు గుణోపాధిభేదములచే భేదము కలవాని వలె తోచును. మాయను చేర్చి అఖిలజగత్కార్యము నాచరించును. బ్రహ్మరూపముతో సృష్టించును. విష్ణురూపముతో పాలించును. రుద్రరూపముతో అంతకాలమును ,సర్వమును నశింపచేయును. మరల ప్రలయాంతమున జనార్దనుడు లేచి చరాచరాత్మకమగు నీ విశ్వమును యథాపూర్వకముగా సృష్టిచేయును. స్థావరాదులు ఏయే ప్రదేశములలో ఎట్లుండెనో అట్లే సృష్టి చేయును. కావున చేసిన పాప పుణ్యుల అక్షయఫలమును తప్పక అనుభవించియే తీరవలయును. కర్పకోటి శతములు గడిచిననూ అనుభవించక కర్మ క్షీణించదు. చేయబడిన శుభాశుభకర్మలను తప్పక అనుభవించవలయును. జగత్స్వరూపుడు సర్వలోకాంతర్యామి పరిపూర్ణుడు సనాతనుడగు శ్రీమన్నారాయణుడు సర్వకర్మఫలమును అనుభవించుచుండును. ఈ విశ్వంభరుడు గుణభేదముల ఉపాదిచే రూపభేదములను స్వీకరించి సర్వమును ఉపభోగించు పరమాత్మ సర్వజగత్తును సృష్టించి కాపాడి లయమును చెందింప చేయును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

పూర్వభాగమున ప్రథమ పాదమున

యమదూతకృత్య నిరూపణమను

ముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page