Sri Naradapuranam-I
Chapters
Last Page
చతుర్ధో
భక్తి వర్ణనం - మార్కండేయ చరితారంభః
సనక ఉవాచ :-
శ్రద్ధాపూర్వాః సర్వధర్మా మనోరథ ఫలప్రధాః, శ్రద్ధయా సాధ్యతే సర్వం శ్రద్ధయా తుష్యతే హరిః. 1
భక్తిర్భక్త్యైవ కర్తవ్యా తథా కర్మాణి భక్తితః, కర్మశ్రద్ధావిహీనాని న సిధ్యన్తి ద్విజోత్తమాః. 2
యథా೭లోకో హి జన్తూనాం చేష్టాకారణతాం గతః, తథైవ సర్వసిద్ధీనాం భక్తిః పరమకారణమ్. 3
యథా సమస్తలోకానాం జీవనం సలిలం స్మృతమ్, తథా సమస్తిసిద్ధీనాం జీవనం భక్తిరిష్యతే. 4
యథా భూమిం సమాశ్రిత్య సర్వే జీవన్తి జంతవః, తథా భక్తిం సమశ్రిత్య సర్వకార్యాణి సాధయేత్. 5
శ్రద్ధావాన్ లభత్ ధర్మం శ్రద్ధావానర్థమాప్నుయాత్, శ్రద్ధయా సాధ్యతే కామశ్శ్రద్ధావాన్ మోక్షమాప్నుయాత్. 6
న దానైర్న తపోభిర్వా యజ్ఞైర్వా బహుదక్షిణౖః, భక్తిహీనైర్మునిశ్రేష్ఠ తుష్యతే భగవాన్హరిః. 7
మేరుమాత్రసువర్ణానాం కోటి కోటిసహస్రశః, దత్తా చాప్యర్థనాశాయ యతో భక్తివివర్ణితా. 8
అభక్త్యా యత్తపస్తప్తం కేవలం కాయశోషణమ్, అభక్త్యా యద్ధుతం హవ్యం భస్మని న్యస్తహవ్యవత్. 9
యత్కించిత్కురుతే కర్మ శ్రద్ధయాప్యణుమాత్రకమ్, తన్నామ జాయతే పుంసాం శాశ్వతం ప్రీతిదాయకమే. 10
అశ్వమేధసహస్రం వా కర్మ వేదోదితం కృతమ్, తత్సర్వం నిష్ఫలం బ్రహ్మన్యది భక్తివివర్జితమ్. 11
సనక మహర్షి పలికెను : భక్తిచే కూడినపుడే అన్ని ధర్మములు కోరిన ఫలముల నీయగలవు. భక్తిచేతనే అన్నింటిని సాధించవచ్చును. భక్తి చేత శ్రీహరి సంతోషించును. భక్తిచేతనే భక్తిని ఆచరించవలయును. అన్ని పనులను భక్తితో చేయవలయును. భక్తి లేక చేసిన కార్యములు సిద్ధించవు. జీవులు పనులు చేయుటకు వెలుగు కారణమైనట్లు అన్ని కార్యసిద్ధులకు భక్తిమూలకారణము. అన్ని ప్రాణులకు నీరు జీవనాధారమైనట్లు అన్ని సిద్ధులకు భక్తి మూలాధారము. భూమిని ఆదారముగా చేసుకొని అన్ని ప్రాణులు జివించునట్లు భక్తిని ఆశ్రయించి అన్ని కార్యములను సాధించవలయును. భక్తికలవాడే ధర్మార్థకామమోక్షములను సులభముగా పొందగలడు. భక్తిలేని దానములతో తపములతో బహుదక్షిణలనిచ్చు యజ్ఞములతో కూడా శ్రీహరి సంతోషించడు. భక్తిలేక మేరుపర్వతమంత బంగారురాశులను కోట్ల కొలదిగా ఇచ్చిననూ ద్పవ్యనాశము తప్ప ఫలము కలుగదు. భక్తిలేనిదే చేసిన తపస్సు శరీరశోషణ యగును. భక్తిహీనముగా అగ్నిలో ఇచ్చిన హవిస్సు బూడిదలో వేసిన హవిస్సువలె నిష్ఫలమగును. భక్తితో ఎంత చిన్న పనిచేసినను శాశ్వతమైన కీర్తిని, ప్రీతిని కలిగించును. భక్తిహీనముగా వేయి అశ్వమేధయాగములను చేసినను వేదవిహితకర్మల నాచరించినను అవి యన్నియు నిష్ఫలములే యగును. 1-11
హరిభక్తిః పరా నౄణాం కామధేనూపమా స్మృతా, తస్యాం సత్యాం పిబన్త్యజ్ఞాః సంసారగరలం హ్యహో. 12
అసారభూతే సంసారే సారమేతదజాత్మజ, భగవద్భక్తసంగశ్చ హరిభక్తిస్తితిక్షుతా. 13
అసూయోపేతమనసాం భక్తిదానాదికర్మ యత్, అవేహి నిష్ఫలం బ్రహ్మంస్తేషాం దూరతరో హరిః. 14
పరిశ్రయాభితప్తానాం దంభాచారరతాత్మనామ్, మృషా తు కుర్వతా కర్మ తేషాం దూరతరో హరిః. 15
పృచ్ఛతాం చ మహాధర్మాన్వదతాం వై మృషా చ తాన్, ధర్మేష్వభక్తిమనసాం తేషాం దూరతరో హరిః. 16
వేదప్రణిహితో ధర్మో వేదో నారాయణః పరః, తత్రాశ్రద్ధాపరా యే తు తేషాం దూరతరో హరిః. 17
యస్య ధర్మవిహీనాని దినాన్యాయాన్తి యాన్తి చ, స లోహకారభ##స్త్రేవ శ్వసన్నపి న జీవతి. 18
ధర్మార్థకామమోక్షాఖ్యాః పురుషార్థాస్సనాతనాః, శ్రద్ధావతాం హి సిద్ధ్యన్తి నాన్యథా బ్రహ్మనన్దన! 19
స్వాచారమనతిక్రమ్య హరిభక్తిపరో హి యః, స యాతి విష్ణుభవనం యద్వై పశ్యన్తి సూరయః. 20
మానవులకు ఉత్తమమైన హరి భక్తియే కామధేనువు వలె అన్ని కోరికలనిచ్చును. ఆ హరిభక్తియుండగా సంసార విషమును అజ్ఞానులు మాత్రమే త్రాగెదరు. నిస్సారమైన
ఈ సంసారమున భగవద్భక్తులతో కలిసి యుండుట, శ్రీహరి భక్తి, ఓర్పు అను నీ మూడు మాత్రమే సారవంతములు. అసూయ కలవారు చేసెడి దానాదులు, చూపెడి భక్తి నిష్ఫలములే. వారికి శ్రీహరి చాల దూరమూగానుండును. పరులసేవచే పరితపించువారికి బూటకపు ఆచారమునందు ప్రీతి చూపువారికి, అసత్యకర్మలను ఆచరించువారికి శ్రీహరి దూరముగా ఉండును. మహాధర్మములను గూర్చి సంశయించువారికి, మహాధర్మములు అసత్యములని చెప్పువారికి, ధర్మములందు భక్తిలేని వారికి శ్రీహరి దూరముగా నుండును. వేదముచే విధించబడినది ధర్మము. వేదము సాక్షాత్తుగా నారాయణ స్వరూపము. ఆ వేదములపై భక్తిలేని వారికి శ్రీహరి దూరముగా నుండును. ధర్మహీనములైన దినములను గడుపువాడు లోహకారుని వద్దనుండు తోలుతిత్తి వలె ఊపిరి పీల్చుచు విడుచుచున్ననూ జీవించువాడు కాడు. ధర్మార్థ కామమోక్షములను సనాతన పురుషార్థములు భక్తికలవారికి మాత్రమే సిద్ధించును. తన ఆచారమును అతిక్రమించక హరిభక్తి గల నరుడు నిత్యసూరులు చూచు శ్రీహరి భవనమునకు చేరగలడు. 12-20
కుర్వన్వేదోదితాన్ధర్మాన్మునీన్ద్ర స్వాశ్రమోచితాన్, హరిధ్యానపరోయస్తు స యాతి పరమం పదమ్. 21
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః, ఆశ్రమాచారయుక్తేన పూజిత స్సర్వదా హరిః. 22
యస్స్వాచారపరిభ్రష్టః సాంగవేదాన్తగో೭పి వా, స ఏవ పతితో జ్ఞేయా యతః కర్మబహిష్కృతః. 23
హరిభక్తిపరో వాపి హరిధ్యానపరో೭పి వా, భ్రష్టో యః స్వాశ్రమాచారాత్పతితః సో೭ భిధీయతే. 24
వేదో వా హరిభక్తిర్వా భక్తిర్వాపి మహేశ్వరే, ఆచారాత్పతితం మూఢం న పునాతి ద్విజోత్తమ. 25
పుణ్యక్షేత్రాభిగమనం పుణ్యతీర్థనిషేవణమ్, యజ్ఞో వా వివిధం బ్రహ్మంస్త్యక్తాచారం న రక్షతి. 26
ఆచారాత్ప్రాప్యతే స్వర్గ ఆచారాత్ప్రాప్యతే సుఖమ్, ఆచారాత్ప్రాప్యతే మోక్ష ఆచారాత్కిం న లభ్యతే. 27
ఆచారాణాం తు సర్వేషాం యోగానాం చైవ సత్తమ, హరిభ##క్తేరపి తథా నిదానాం భక్తిరిష్యతే. 28
భ##క్త్యైవ పూజ్యతే విష్ణుర్వాంఛితార్ధఫలప్రదః, తస్మాత్సమస్త లోకానాం భక్తిర్మాతేతి గీయతే. 29
జీవన్తి జన్తవస్సర్వే యథా మాతరమాశ్రితాః, తథా భక్తిం సమాశ్రిత్య సర్వే జీవన్తి ధార్మికాః. 30
స్వాశ్రమాచారయుక్తస్య హరిభక్తిర్యదా భ##వేత్, న తస్య త్రిషు లోకేషు సదృశో 7స్త్యజనందన ! 31
ఓ మునీన్ద్రా ! వేదవిహితములు స్వాశ్రమోచితములైన ధర్మములనాచరించుచు హరిధ్యానపరుడైనవాడు పరమపదమును పొందును. ఆచారమునుండి ధర్మము పుట్టును. ధర్మమునకు అధిపతి శ్రీమన్నారాయణుడు. ఆశ్రమాచారముతో కూడినవాడే శ్రీహరిని పూజించగలడు. వేదములను, వేదాంగములను, వేదాన్తములైన ఉపనిషత్తులను చక్కగా అధ్యయనముచేసి అవగతము చేసుకొన్ననూ ఆచారభ్రష్టుడైనచో కర్మబహిష్కృతుడై పతితుడగును. హరిభక్తి కలవాడైనను హరిధ్యానము చేయువాడైనను తన ఆశ్రమాచారమునుండి భ్రష్టుడైనచో పతితుడందురు. వేదము కాని, హరి భక్తి కాని, శివభక్తి కాని ఆచారభ్రష్టుడైన మూఢుని పవిత్రుని చేయజాలదు. పుణ్యక్షేత్రములకు వెళ్ళుట, పుణ్యతీర్థములను సేవించుట, పలు విధములైన యజ్ఞములు
ఇవి అన్నియూ ఆచారమును వదలిన వానిని రక్షించజాలవు. ఆచారము వలన స్వర్గము లభించును. ఆచారము వలన సుఖము లభించును. ఆచారము వలన మోక్షము లభించును. ఆచారము వలన లభించనిదేది? అన్ని ఆచారములను అన్ని యోగములను, చివరికి హరిభక్తికి కూడ మూలము భక్తియే . కోరిన కోరికలనిచ్చు శ్రీమన్నారాయణుడు భక్తిచేతనే పూజింపబడును. కావుననే అన్ని లోకములకు భక్తి మాత అని గానము చేయుబడుచున్నది. అన్ని ప్రాణులు తల్లి నాశ్రయించి జీవించునట్లు ధార్మికులందరూ భక్తినాశ్రయించి జీవింతురు. స్వాశ్రమాచారము కలవానికి హరిభక్తి కూడా కలిగినచో అతనితో సమానుడు మూడు లోకములలోనూ మరి యొకడుండడు. 21-31
భక్త్యా సిద్ధ్యన్తి కర్మాణి కర్మభిస్తుష్యతే హరిః, తస్మింస్తుష్టే భ##వేద్ జ్ఞానం జ్ఞానాన్మోక్షమవాప్యతే. 32
భక్తిస్తు భగవద్భక్తసంగేన ఖలు జాయతే, తత్సంగం ప్రాప్యతే పుంభిస్సుకృతైః పూర్వసంచితైః . 33
వర్ణాశ్రమాచారరతా భగవద్భక్తిలాలసాః, కామాదిదోషనిర్ముక్తాస్తే సన్తో లోకశిక్షకాః. 34
సత్సంగః పరమో బ్రహ్మన్న లభ్యేతాకృతాత్మనామ్, యది లభ్యేత విజ్ఞేయం పుణ్యం జన్మాన్తరార్జితమ్. 35
పూర్వార్జితాని పాపాని నాశమాయాన్తి యస్య వై, సత్సంగతిర్భవేత్తస్య నాన్యథా ఘటతే హి సా. 36
రవిర్హి రశ్మిజాలేన దివా హన్తి బహిస్తమః, సన్తస్సూక్తిమరీచ్యౌఘైశ్చాన్తర్ధ్వాన్తం హి సర్వదా. 37
దుర్లభాః పురుషా లోకే భగవద్భక్తిలాలసాః, తేషాం సంగో భ##వేద్యస్య తస్య శాన్తిర్హి శాశ్వతీ.
భక్తి చేతనే అన్ని కర్మలూ సిద్ధించును. కర్మలచే శ్రీహరి సంతోషించును. శ్రీహరి సంతోషించినచో జ్ఞానము కలుగును. జ్ఞానము వలన మోక్షము లభించును. శ్రీహరిపై భక్తి భగవద్భక్తుల సంగతితో కలుగును. పూర్వజన్మలలో సంపాదించిన పుణ్యమున్నపుడే భగవద్భక్తుల సంగతి లభించును. వర్ణాశ్రమాచారములయందు ఆసక్తులై భగవద్భక్తియందు ప్రీతికలవారై కామాది దోషములు లేనివారు మాత్రమే లోకమునకు మంచిమార్గమును బోధింతురు. పూర్వ జన్మమున పుణ్యము చేయనివారికి సజ్జనులతో స్నేహము కలుగదు. సజ్జన స్నేహము లభించినచో పూర్వజన్మలలో పుణ్యము చేసి యున్నారని తెలియవలయును. పూర్వజన్మలలో చేసిన పాపముల నశించినపుడే సజ్జన స్నేహము లభించును. లేనిచో మరియొక దానితో లబించదు. సూర్యుడు పగటిపూట మాత్రమే బయట కనపడు చీకటిని తన కిరణములతో నశింపచేయగలడు. సజ్జనులు తమ సూక్తులు అను కిరణములతో అన్నివేళలా లోపల అనగా మనసులో దాగియున్న అజ్ఞానమను చీకటిని కూడా నశింపచేతురు. భగవద్భక్తితో పరవశము నొందు పురుషులు లోకమున చాల అరుదు. ఆ భగవద్భక్తులతో స్నేహము కలిగినవానికి శాంతి శాశ్వతముగా నుండును. 32 - 38
నారద ఉవాచ
కింలక్షణా భాగవతాస్తే చ కిం కర్మ కుర్వతే, తేషాం లోకో భ##వేత్కీదృక్తత్సర్వం బ్రూహి తత్త్వతః. 39
త్వం హి భక్తో రమేశస్య దేవదేవస్య చక్రిణిః, ఏతన్నిగదితుం శక్తస్త్వతో నాస్త్యధికో ೭పరః. 40
నారద మహర్షి పలికెను:- భగవద్భక్తులు ఎట్లుందురు? వారేు పని చేసెదరు ? వారికే లోకము లభించును ? ఈ విషయమంతయు వివరముగా చెప్పుము. దేవదేవుడు చక్రాయుధధారియగు శ్రీమన్నారాయణునకు నీవు పరమభక్తుడవు. ఈ విషయమును నీవు తప్ప ఇతరులు చెప్పలేరు. 39-40
సనక ఉవాచ: -
శృణు బ్రహ్మన్పరం గుహ్యం మార్కండేయస్య ధీమతః, యమువాచ జగన్నాథో యోగనిద్రావిమోచితః. 41
యో೭సౌ విష్ణుః పరంజ్యోతిర్దేవస్సనాతనః, జగద్రూపీ జగత్కార్తా శివబ్రహ్మస్వరూపవాన్. 42
యుగాన్తే రౌద్రరూపేణ బ్రహ్మండగ్రాసబృంహితః, జగత్యేకార్ణవీభూతే నష్టే స్థావరంజగమే. 43
భగవానేవ శేషాత్మా శేతే వటదలే హరిః, అసంఖ్యాతాబ్జజన్మాద్యైరాభూషితతనూరుహః. 44
పాదాంగుష్ఠాగ్రనిర్యాతగంగాశీతాంబుపావనః, సూక్ష్మాత్సూక్ష్మతరో దేవో బ్రహ్మాండగ్రాసబృంహితః. 45
వటచ్ఛదే శయోనో೭భూత్సర్వశక్తిసమన్వితః, తస్మిన్ స్థానే మహాభాగో నారాయణపరాయణః. 46
మార్కండేయః స్థితస్తస్య లీలాః పశ్యన్మ హేశితుః.
సనక మహర్షి పలికెను:- ఓ బ్రాహ్మణోత్తమా! పరమ రహస్యమైన మార్కండేయుని చరిత్రను వినుము. యోగనిద్రనుండి మేల్కొనిన జగన్నాథుడు మార్కండేయునితో చెప్పిన మాటలను కూడా వినుము. ఈ శ్రీమహావిష్ణువు సనాతనుడు; దేవదేవుడు; పరంజ్యోతి స్వరూపుడు; జగత్స్వరూపుడు;జగత్తును సృష్టించినవాడు. శివ బ్రహ్మ స్వరూపములతో నుండువాడు. యుగాంతమున రుద్రరూపముతో బ్రహ్మండమును ఆరగించును. అపుడు స్థావరజంగమములు నశించి ఈ ప్రపంచమంతయు సముద్రముగా నుండును. ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే మిగిలియుండి మఱ్ఱి ఆకుపై పరుండియుండును. లెక్కలేని బ్రహ్మాదులు శరీరమునందలి రోమకూపములందు నివాసమేర్పరచుకొని స్వామిని అలంకరించియుందురు. కాలిబొటనవేలు కొననుండి బయలుదేరిన గంగానది యొక్క చల్లని నీటితో పవిత్రముచేయుచు సూక్ష్మములకంటే సూక్ష్మరూపుడై బ్రహ్మండమును మింగి మఱ్ఱియాకుపై పరుండియుండును. శ్రీమన్నారాయణుడు మాత్రమే సర్వశక్తి సమన్వితుడుగా నుండును. శ్రీమన్నారాయణుడున్న ఆస్థానమున మహానుభావుడు నారాయణ భక్తుడు అయిన మార్కండేయ మహర్షి ఉండి పరమేశ్వరుని లీలలను చూచుచుండెను. 41-46
ఋషయ ఊచుః :-
తస్మిన్కారే మహాఘోరే నష్టే స్థావరజంగమే, హరిరేకః స్థిత ఇతి మునే పూర్వం హి శుశ్రమ. 47
జగత్యేకార్ణవీభూతే నష్టే స్థావరజంగమే, సర్వగ్రస్తేన హరిణా కిమర్థం సో ೭వశేషితః. 48
పరం కౌతూహలం హ్యత్ర వర్తతే೭ తీవసూతనః, హరికీర్తిసుధాపానే కస్యాలస్యం ప్రజాయతే. 49
ఋషులు పలికిరి:- ఓ సూతమహర్షీ ! ఆ ప్రళయకాలమున స్థావర జంగములన్నియు నశించగా కేవలము శ్రీమన్నారాయణుడు మాత్రమే మిగిలి ఉండెనని మొదట విని యుంటిమి. ఈ ప్రపంచమంతయు జలమయమైయుండగా స్థావరజంగమాత్మకమైన ప్రపంచమంతటినీ మింగిన శ్రీమన్నారాయణుడు మార్కండేయుని ఎందుకు మిగిలించెను ? ఈ విషయమును తెలుసు కొనవలయునని మాకు చాలా కుతూహలమున్నది. శ్రీమన్నారాయణుని కీర్తి యను అమృతమును పానము చేయుటలో అలసట ఎవరికి కలుగును ? 47-49
సూత ఉవాచ :-
అసీన్మునిర్మహాభాగో మృకండురితి విశ్రుతః, శాలగ్రామే మహాతీర్థే సో೭తప్యత మహాతపాః. 50
యుగానామయుతం బ్రహ్మన్గుణబ్రహ్మ సనాతనమ్, నిరాహారః క్షమాయుక్తః సత్యసంధో జితేంద్రియః. 51
ఆత్మవత్సర్వభూతాని పశ్యన్విషయనిస్స్పృహః, సర్వభూతహితోదాన్తస్తతాప సుమహత్తపః. 52
తత్తపశ్శంకితాస్సర్వే దేవా ఇంద్రాదయస్తదా, పరేశం శరణం జగ్ముర్నారాయణమనామయమ్. 53
క్షీరాబ్ధేరుత్తరం తీరం సంప్రాప్య త్రిదివౌకసః, తుష్టువుర్దేవదేవేశం పద్మనాబం జగద్గురమ్. 54
సూత ఉవాచ-
సూతమహర్షి పలికెను :- మహానుభావుడగు మృకండువను పేరుగల సుప్రసిద్ధు డుండెను. ఆ మృకండువు సత్యసంధుడు; జితీంద్రియుడు. ఓర్పుగలవాడు. అన్ని ప్రాణులను తనవలె చూచుచు సంసార విషయ భోగములందు ఆశ లేనివాడై అన్ని ప్రాణుల హితమును కోరుచు అంతరింద్రియ నిగ్రహము కలవాడై శాలగ్రామమును మహాతీర్థమున పదివేల సంవత్సరములు సనాతనుడైన సగుణబ్రహ్మను గూర్చి నిరాహారుడై తపస్సు చేసెను. అతని తపస్సును చూచి ఇంద్రాది దేవతలు శంకించి ఆర్తినాశనుడగు శ్రీమన్నారాయణుని శరణు వేడిరి. దేవతలందరు పాలసముద్రపు ఆవలి తీరమును చేరి జగద్గురువు పధ్మనాభుడు దేవదేవుడగు శ్రీమన్నారాయణుని స్తోత్రము చేసిరి.
దేవా ఊచుః :-
నారాయణాక్షరానన్త! శరణాగత పాలక! మృకండు తపసా త్రస్తాన్పాహి నశ్శరణాగతాన్. 55
జయ దేవాధిదేవేశ జయ శంఖగదాధర! జయో లోకస్వరూపాయ జయో బ్రహ్మండహేతవే. 56
నమస్తే దేవదేవేశ ! నమస్తే లోకపావన ! నమస్తే లోకనాథాయ నమస్తే లోకసాక్షిణ. 57
నమస్తే ధ్యానగమ్యాయ నమస్తే ధ్యానహేతవే, నమస్తే ధ్యానరూపాయ నమస్తే ధ్యానసాక్షిణ. 58
కేశిహన్త్రే నమస్తుభ్యం మధుహన్త్రే పరాత్మనే, నమో భూమ్యాదిరూపాయ నమశ్చైతన్య రూపిణ. 59
నమో జ్యేష్టాయ శుద్ధాయ నిర్గుణాయ గుణాత్మనే, ఆరూపాయ స్వరూపాయ బహురూపాయ తే నమః. 60
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ, జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. 61
నమో హిరణ్యగర్భాయ నమో బ్రహ్మాదిరూపిణ, నమస్సూర్యాదిరూపాయ హవ్యకవ్యభుజే నమః . 62
నమో నిత్యాయ వన్ద్యాయ సదానన్దైకరూపిణ, సమస్స్మృతార్తినాశాయ భూయోభూయో నమో నమః. 63
ఏవం దేవస్త్సుతిం శ్రుత్వా భగవాన్కమలాపతిః, ప్రత్యక్షతామగాత్తేషాం శంఖచక్రగదాధరః. 64
వికచాంబుజపత్రాక్షం సూర్యకోటి సమప్రభమ్, సర్వాలంకారసంయుక్తం శ్రీ వత్సాంకితవక్షసమ్. 65
పీతాంబరధరం సౌమ్యం స్వర్ణయజ్ఞోపవీతినమ్, స్తూయమానం మునివరైః పార్షదప్రవరావృతమ్. 66
తం దృష్ట్వా దేవసంఘాస్తే తత్తేజోహతతేజసః, నమశ్చక్రుర్ముదా యుక్తా అషాంగైరవనిం గతాః . 67
తతః ప్రసన్నో భగవాన్ మేఘగంభీర నిస్స్వతః, ఉవాచ ప్రీణయన్దేవాన్నతానింద్రపురోగమాన్. 68
దేవతలు పలికిరి:- క్షయము అంతములేని ఓ నారాయణా! శరణు వేడినవారిని రక్షించువాడా! మృకండు మహర్షి చేయు తపస్సుచే భయపడి నిన్ను శరణుకోరిన మమ్ములను కాపాడుము. దేవతలకు అధిదేవతలకు ప్రభువువు నీవే !నీవే శంఖగదాద్యాయుధములను ధరించి యుందువు. నీకు జయమగు గాక! బ్రహ్మాండమునకు కారణభూతుడవు, లోకస్వరూపుడవు అయిన నీకు జయము. ఓ దేవదేవేశా !ఓ లోకపావనా! నీకు నమస్కారము. అందరిలో జ్యేష్ఠుడవు, పరిశుద్ధుడవు, నిర్గుణుడవయ్యు గుణాత్మకుడవైన నీకు నమస్కారము. రూపరహితుడవు మంచిరూపము గలవాడవు అనేక రూపములు గల వాడవు అయిన నీకు నమస్కారము. బ్రహ్మణులయందు ప్రీతి గలవాడవు. గోవులకు బ్రహ్మణులకు హితమును చేయువాడవు, జగత్తునకు హితమును కలిగించువాడవు అయిన కృష్ణుడవైన నీకు నమస్కారము. హిరణ్యగర్భుడవు, బ్రహ్మది దేవతారూపుడవు, సూర్యాది దేవతారూపుడవు, హవ్యమును కవ్యమును భుజించు వాడవు అయిన నీకు నమస్కారము. నిత్యుడవు అందరిచే నమస్కరించబడువాడవు, ఎప్పుడూ ఆనంద స్వరూపుడవు అయిన నీకు నమస్కారము. తలచిన వారి ఆర్తిని నశింపచేయు నీకు మాటిమాటికి నమస్కారము.
ఇట్లు దేవతలు చేయు స్తోత్రమును విని భగవంతుడగు లక్ష్మీపతీ శంఖచక్రగదాదులను ధరించినవాడై వారికి ప్రత్యక్షమాయోను. వికసించిన పద్మములవలె విశాలమైన నేత్రములు గల వానిని, కోటి సూర్యులతో సమానమైన కాంతి గలవానిని, అన్ని అంలంకారములు కలవాని శ్రీవత్సమను పుట్టుమచ్చ వక్షస్థ్సలమున కలవానిని, పీతాంబరధారిని సువర్ణయజ్ఞోపవీతమును ధరించియున్న వానిని, సౌమ్యుని మునులచే స్తోత్రము చేయబడుచున్నవానిని, ద్వారపాలక శ్రేష్ఠులతో కూడి యున్న వానిని, శ్రీమన్నారాయణుని చూచి స్వామితేజస్సుచే తమ తేజస్సు మందగించగా ఆనందముతో సాష్టాంగముగా భూమి మీద పడి నమస్కరించిరి. అపుడు శ్రీమన్నారాయణుడి ప్రసన్నుడై దేవతలకు ప్రీతి కలిగించుచు మేఘగంభీరనాదముతో ఇంద్రాది దేవతలను గూర్చి ఇట్లు పలికెను. 55-68
శ్రీ భగవానువాచ:-
జానే వో మానసం దుఃఖం మృకండుతపసోద్గతమ్, యుష్మాన్నే బాధతే దేవాః స ఋషిః సజ్జనాగ్రణీః . 69
సంపద్భిః సయుతా వాపి విపద్భిశ్చాపి సజ్జనాః, సర్వదా೭ న్యం న బాధన్తే స్వప్నే ೭పి సురసత్తమాః ! 70
సతతం బాధ్యమానో೭ పి విషయాఖ్యైరరాతిభిః, అవిధాయాత్మనో రక్షామ్ అన్యాన్ద్వేష్టి కతం సుధీః. 71
తాపత్రయాభిధానేన బాధ్యమానో హి మానవః. అన్యం పీడయితుం శక్తః కథం భవతి సత్తమః. 72
కర్మణా మనసా వాచా బాధతే యప్సదా పరాన్, నిత్యం కామాదిభిర్యుక్తో మూఢధీః ప్రోచ్యతే తు సః. 73
యో లోకహితకృన్మర్త్యో గతాసుర్యో విమత్సరః, నిశ్శంకః ప్రోచ్యతే సద్భిరిహాముత్ర చ సత్తమాః 74
సశంకరస్సర్వదా దుఃఖీనిశ్శంకస్సుఖమాప్నుయాత్, గచ్ఛధ్వం స్వాలయం స్వస్థాః పీడిష్యతి వో న సః . 75
భవతాం రక్షకశ్చాహం విహరధ్వం యతాసుఖమ్, ఇతి దత్వా వరం తేషామతపీకుసుమప్రభః. 76
పశ్యతామేవ దేవానాం తత్త్రైవాన్తరధాయత, తుష్టాత్మానస్సురగణా యయుర్నాకం యథాగతమ్. 77
శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను:- ''ఓ దేవతలారా! మృకండుమహర్షి చేయు తపస్సు వలన మీ మనసులో కలిగిన భయమును నేనెరుగుదును. ఆమృకండుమహర్షి సజ్జనులలో శ్రేష్ఠుడు. కావున మిమ్ములను బాధింపడు. సజ్జనులు సంపదలొచ్చిననూ, ఆపదలొచ్చిననూ, ఎప్పుడూ కలలో కూడా ఇతరులను బాధించరు. సంసార విషయములు అను శత్రువులు ఎప్పుడూ భాధించుచున్ననూ తన రక్షను తానేర్పరచుకొనని సజ్జనుడు ఇతరుల నెట్లు బాధించును ?తాపత్రయములచే బాధించబడు ఉత్తమమానవుడు ఇతరులనెట్లు బాధించగలడు? ఎపుడూ కామాదులు కలిగినవాడై కర్మచే, మనసుచే, మాటలచే, అన్ని వేళలా ఇతరులను బాదించువాడు మూర్ఖుడనబడును. ఓ సజ్జనులారా! లోకమునకు హితము చేయుచు మాత్సర్యములేని మానవుని నిశ్శంకుడు అని సజ్జనులు ఈ లోకమున, పరలోకమున చెప్పెదరు. సశంకుడు ఎప్పుడూ దుఃఖము కలిగియే యుండును. నిశ్శంకుడు సుఖమునే పొందును. కావున స్వస్థమనస్కులై మీ గృహములకు వెళ్ళుడు. మృకండుమహర్షి మిమ్ములను బాధించడు. నేను మీకు రక్షకుడను. కావున మీరు కోరిన విధముగా విహరించుడు అని నల్ల అవిసెపూవువన్నె గల శ్రీమన్నారాయణుడు వారికి వరము నిచ్చి దేవతలందరూ చూచుచుండగనే అక్కడనే అంతర్ధానమాయోను. సంతోషము నిండిన మనస్సుగల వారై దేవతలు కూడా వచ్చిన దారినే స్వర్గమునకు వెళ్ళిరి. 69-77
మృకండోరపి తుష్టాత్మా హరిః ప్రత్యక్షతామగాత్, అరూపం పరమం బ్రహ్మ స్వప్రకాశం నిరంజనమ్. 78
అతసీపుష్పసంకాశం పీతవాససమచ్యుతమ్, దివ్యాయుధధరం దృష్ట్వా మృకండుర్విస్మితో೭ భవత్. 79
ధ్యానాదువ్మీల్య నయనమపశ్యద్ధరిమగ్రతః, ప్రసన్నవదనం శాంతం ధాతారం విశ్వతేజసమ్. 80
రోమాంచితశరీరో೭ సావానన్ద్రాశ్రువిలోచనః, ననామ దండవద్భూమౌ దేవదేవం సనాతనమ్. 81
అశ్రుభిః క్షాళయంస్తస్య చరణౌ హర్షసంభ##వైః, శిరస్యంజలిమాధాయ స్తోతుం సముపచక్రమే. 82
శ్రీమన్నారాయణుడు మృకండు మహర్షి చేసిన తపస్సునకు మెచ్చి ప్రత్యక్షమాయెను. రూపరహితుడు, పరబ్రహ్మ, స్వయప్రకాశుడు, ప్రకృతి సంబంధము అంటనివాడు అవిశపూవువంటి శరీర ఛాయ గలవాడు పీతాంబరధారి, దివ్యాయుధములను ధరించినవాడు అచ్యుతుడు అయిన శ్రీమన్నారాయణుని చూచి అతడు ఆశ్చర్యము నొందెను. ధ్యానములోనుండి కనులు తెరిచి ప్రసన్నమైన ముఖముతో శాంతుడు, ప్రపంచమును తనలో ధరించువాడు, ప్రపంచమును ప్రకాశింపచేయు తేజోమూర్తి, అయిన శ్రీహరిని ఎదురుగా చూచెను. స్వామిని చూచిన ఆనందంతో నిలువెల్లా పులకలురాగా ఆనందాశ్రువులు కనులనిండగా సనాతనుడు దేవ దేవుడు అయిన శ్రీమన్నారాయణునికి దండవత్ప్రణామము లాచరించెను. ఆనందాశ్రుజలముచే శ్రీమన్నారాయణుని పాదములను కడుగుచు తలపై దోసిలి ఒగ్గి స్తోత్రము చేయ నారంభించెను. 78-82
మృకండురువాచ-
నమః పరేశాయ పరాత్మరూపిణ పరాత్పరస్మాత్ పరతః పరాయ,
అపారపారాయ పరానుకర్త్రే నమః పరేభ్యః పరపారాణాయ. 83
యో నామజాత్యాదివిక్పహీనః శబ్దాదిదోషవ్యతిరేక రూపః బహుస్వరూపో೭ పి నిరంజనో యస్తమీశమీడ్యం పరమం భజామి. 84
వేదాన్తవేద్యం పురుషం పురాణం హిరణ్యగర్భాదిజగత్స్వరూపమ్,
అనూపమం భక్తజనానుకంపినం భజామి సర్వేశ్వరమాదిమీడ్యమ్. 85
పశ్యన్తి యం వీతసమస్త దోషా ధ్యానైకనిష్ఠా విగతస్పృహాశ్చ,
నివృత్తమోహాః పరమం పవిత్రం నతో೭ స్మి సంసారనివర్తకం తమ్. 86
స్మృతార్తినాశనం విష్ణుం శరణాగతపాలకమ్, జగత్సేవ్యం జగద్ధామ పరేశం కరుణాకరమ్. 87
మృకండు మహర్షి పలికెను:- పరమాత్మరూపుడు పరేశుడు, మూలప్రకృతి మహదహంకారముల కంటే పరముగా నుండు వాడు, పారములేని వారికి పారమైనవాడు, పరులను అనుసరించువాడు, పరులకంటే పరులను కూడా తరింప చేయువాడు అయిన శ్రీమన్నారాయణునకు నమస్కారము. నామము జాతి మొదలగు భేదములు లేనివాడు, శబ్దస్పర్శరూపరసగంధాదుల దోషములు లేనివాడు, పలురూపములతో నున్ననూ ఏ సంబంధమూ అంటనివాడు, పరమేశ్వరుడు, స్తుతిపాత్రుడు అగు శ్రీమన్నారాయణునికి నమస్కారము. వేదాన్తములతో తెలియబడువాడు, పురాణపురుషుడు, బ్రహ్మ మొదలు సమస్త ప్రపంచస్వరూపములతో నుండువాడు, సాటిలేనివాడు, భక్తజనులను అనుగ్రహించువాడు, ఆదిదేవుడు సర్వేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుని సేవించెను. అన్ని దోషములు తొలగిన వారు, ధ్యానమునందే ఉండువారు, ఆశనొదలిన వారు, మోహము తొలగిన వారు మాత్రమే చూడగలుగు పరమ పవిత్రుడు సంసారనివర్తకుడు అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాను. తలచువారి ఆర్తిని తొలగించువాడు, శరణువేడిన వారిని కాపాడు వాడు జగత్తుచే సేవించబడువాడు, జగత్తు నివాసముగా గలవాడు, దయాలవాలుడు, పరేశుడు అయిన శ్రీమహావిష్ణువును నమస్కరించుచున్నాను. 83-87
ఏవం స్తుతస్స భగవాన్విష్ణుస్తేన మహర్షిణా, ఆవాప పరమాం తుష్టిం శంఖచక్రగదాధరః. 88
అథాలింగ్య మునిం దేవశ్చతుర్భిర్దీర్ఘబాహుభిః, ఉవాచ పరమప్రీత్యా వరం వరయ సువ్రత. 89
ప్రీతో೭స్మి తపసా తేన స్తోత్రేణ చ తవానఘ !మనసా యదభిప్రేతం వరం వరయ సువ్రత! 90
శంఖచక్రగదాధరుడైన శ్రీమహావిష్ణువు మృకండు మహర్షి చేసిన స్తోత్రముచే మిక్కిలి సంతోషించెను. తన పొడవైన నాలుగు చేతులతో మృకండు మహర్షిని ఆలింగనము చేసుకొని మిక్కిలి సంతోషముతో ఓ సువ్రత వరమును కోరుము. పాపరహితుడవైన నీవు చేసిన తపస్సుచే స్తోత్రముచే నేను సంతోషించితిని. కావున నీ మనసులో కోరిన వరమును అడుగుము అని పలికెను. 88-90
మృకండురువాచ:-
దేవదేవ జగన్నాథ కృతార్థో೭ స్మి న సంశయః, త్వద్దర్శనమపుణ్యానాం దుర్లభం చ యతః స్మృతమ్ . 91
బ్రహ్మాద్యా యం న పశ్యన్తి యోగినః సంశ్రితవ్రతాః, ధర్మిష్ఠా దీక్షీతాశ్చాపి వీతరాగా విమత్సరాః. 92
తం పశ్యామి పరంధామ కిమతో೭న్యం వరం వృణ. ఏతేనైన కృతార్థో೭స్మి జనార్దన జగద్గురో. 93
యన్నామస్మృతిమాత్రేణ మహాపాతకినో ೭పి యే, తత్పదం పరమం యాన్తి తే దృష్ట్వా కిముతాచ్యుత! 94
మృకండు మహర్షి పలికెను- ఓ దేవ దేవా! జగన్నాథా! పుణ్యము లేని వారలకు నీ దర్శనము దుర్లభమని శాస్త్రములు చెప్పుటచే. నీదర్శనమును పొందిననేను కృతార్థుడనైతిని. ఈ విషయమున ఏమాత్రము సంశయములేదు. బ్రహ్మ మొదలగు దేవతలు, యోగులు, వ్రతములను ఆతరించు వారు, ధర్మాత్ములు, దీక్షితులు, కోరికలుడిగినవారు, మాత్సర్యము తొలగినవారు చూడలేని పరంధాముని చూడగలుగుచున్నాను. ఇంతకంటే ఏ వరమును కోరెదను. ఓ జగద్గురూ! జనార్దనా! ఈ దర్శనము చేతనే కృతార్థత నందితిని. మహాపాపాత్ములు కూడా నీనామస్మరణ మాత్రమున పరమపదమును పొందెదరన్న నీ దర్శనము నందిన వారి విషయము నేమి చెప్పవలయును ? 91-94
శ్రీ భగవానువాచ:-
సత్యముక్తం త్వయా బ్రహ్మన్ప్రీతో೭ స్మి తవ పండిత, మద్దర్శనం హి విఫలం న కాదచిద్భవిష్యతి. 95
విష్ణర్భక్తకుటుంబీతి వదన్తి విబుధాస్సదా, తదేవ పాలయిష్యామి మజ్జనో నానృతం వదేత్. 96
తస్మాత్త్వత్తపసా తుష్టో యాస్వామి తవ పుత్రతామ్, సమస్తగుణసంయుక్తో దీర్ఘజీవీ స్వరూపవాన్. 97
మమ జన్మ కులే యస్య తత్కులం మోక్షగామి నై, మయి తుష్టే మునిశ్రేష్ఠ కిమసాధ్యం జగత్త్రయే. 98
ఇత్యుక్త్వా దేవదేవేశో మున్తేస్తస్య సమీక్షతః, అంతర్దధే మృకండుశ్చ తపసస్సమవర్తత. 99
ఇతి శ్రీ బృహన్నారదీయపురాణ పూర్వభాగే ప్రథమపాదే భక్తివర్ణనప్రసంగేన మార్కండేయ చరితారంభో నామ చతుర్థో೭ధ్యాయః.
శ్రీమన్నారాయణభగవానుడు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా !నీవు సత్యమునే పలికితివి. ఓ పండితా! నీ విషయమున ప్రీతి నొందితిని. నాదర్శనమెప్పుడూ వ్యర్థము కాదు. శ్రీమహావిష్ణువు భక్తకుటుంబి అని జ్ఞానులు చెప్పుచుందురు. ఆ మాటనే పాటించెదను. నా భక్తులు అబద్ధమాడకూడదు. కదా !కావున నీ తపస్సుకు సంతోషించిన నేను నీకు పుత్రుడుగా జన్మించెదను. అన్ని గుణములు కలవాడుగా, చిరంజీవిగా, చక్కని రూపము కలవాడుగా పుట్టెదను. నేను ఏ కులములో పుట్టెదనో ఆ కులము మోక్షమును పొందును. నేను సంతేషించిన తరువాత ఈ మూడు లోకములలో సాధింపరానిది, లేనిది ఏముండును? దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికి ఆ మృకండుమహర్షి చూచుచుండగా అక్కడే అంతర్థానమాయెను. మృకండుమహర్షి కూడా తన తపస్సు నుండి విరమించెను. 95-99
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున భక్తిని వర్ణించు సందర్భమున మార్కండేయచరితారంభమను నాలుగవ అధ్యాయము సమాప్తము.