Sri Naradapuranam-I
Chapters
Last Page
షట్చత్వారింశత్తమోధ్యాయః = నలుబదియారవ అధ్యాయము బృహదుపాఖ్యానమ్ సూత ఉవాచ :- తచ్ఛ్రుత్వా నారదో విప్రా మైథిలాధ్యాత్మముత్తమమ్, పునః పప్రచ్ఛ తం ప్రీత్యా సనందనముదారధీః. సూతమహర్షి పలికెను :- పంచశిఖమహర్షి జనకమహారాజునకు చెప్పిన అధ్యాత్మజ్ఞానమును వినిన నారదమహర్షి ఉదారబుద్ధితో ప్రీతితో మరల ఇట్లు పలికెను. నారద ఉవాచ :- ఆధ్యాత్మికాది త్రివిధం తాపం నానుభ##వేద్యది, ప్రబ్రూహి తన్మే మహ్యం ప్రపన్నాయ దయానిధే. 2 నారదమహర్షి పలికెను :- ఓ దయానిధీ! నిన్నాశ్రియించిన నాకు ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికమను తాపత్రయమును అనుభవించని మార్గమును బోధించుము. సనందన ఉవాచ :- తదస్య త్రివిధం దుఃఖమిహ జాతస్య పండిత, గర్భే జన్మ జరాద్యేషు స్థానేషు ప్రభవిష్యతః. 3 నిరస్తాతిశయాహ్లాదసుఖభావైకలక్షణా, భేషజం భగవత్ప్రాప్తిరేకా చాత్యంతికీ మతా. 4 తస్మాత్తత్ర్పాప్తయే యత్నః కర్తవ్యః పండితైర్నరైః, తత్ప్రాప్తి హేతుజ్ఞానం చ కర్మ చోక్తం మహామునే ! 5 ఆగమోత్థం వివేకాచ్చ ద్విధా జ్ఞానం తథోచ్యతే, శబ్ద బ్రహ్మగమమయం పరం బ్రహ్మ వివేకజమ్. 6 మనురప్యాహ వేదార్ధం స్మృత్వాయం మునిసత్తమః, తదేతచ్ఛ్రూయతామత్ర సుబోధం గదతో మమ. 7 ద్వే బ్రహ్మణీ వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరం చ యత్, శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరంబ్రహ్మాధిగచ్ఛతి. 8 ద్వే విద్యే వేదితవ్యే చేత్యాహ చాధర్వణీ శ్రుతిః, పరమా త్వక్షరప్రాప్తిరృగ్వేదాదిమయా పరా. 9 యత్తదవ్యక్తమజరమనీహమజమవ్యయమ్, అనిర్దేశ్యమరూపం చ పాణిపాదాదిసంయుతమ్. 10 విభుం సర్వగతం నిత్యం భూతయోనిమకారణమ్, వ్యాప్యం వ్యాప్తం యతస్సర్వం తం వై పశ్యంతి సూరయః. 11 తద్బ్రహ్మ తత్పరం ధామ తద్ధ్యేయం మోక్షకాంక్షిభిః, శ్రుతివాక్యోదితం సూక్ష్మం తద్విష్ణోః పరమం పదమ్. 12 తదేవ భగవద్వాచ్యం స్వరూపం పరమాత్మనః, వాచకో భగవచ్ఛబ్దస్తస్యోద్దిష్టో೭క్షయమాత్మనః. 13 ఏవం నిగదితార్ధస్య యత్తత్త్వం తస్య తత్త్వతః, జ్ఞాయతే యేన తజ్ఞానం పరమన్యత్త్రయీమయమ్. 14 అశబ్దగోచరస్యాపి తస్య వై బ్రహ్మణో ద్విజ, పూజాయాం భగవచ్ఛబ్దః క్రియతే హ్యౌపచారికః. 15 శుద్ధే మహావిభూత్యాఖ్యే పరే బ్రహ్మణి వర్తతే, భగవన్భగవచ్ఛబ్దస్సర్వకారణకారణ. 16 జ్ఞేయం జ్ఞాతేతి తథా భకారో೭ర్ధద్వయాత్మకః తేనాగమపితా స్రష్టా గకారో೭యం తథామునే.17 ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్శ్రియః, జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా. 18 వసన్తి తత్ర భూతాని భూతాత్మన్యఖిలాత్మని, సర్వభూతేష్వశేషేషు వకారో೭ర్ధస్తతో೭వ్యయః. 19 ఏవమేవ మహాశబ్దో భగవానితి సత్తమ, పరమబ్రహ్మభూతస్య వాసుదేవస్య నాన్యగః. 20 తత్రర పూజ్యపదార్ధోక్తిః పరిభాషాసమన్వితః, శబ్దో೭యం నోపచారేణ చాన్యత్ర హ్యుపచారతః. 21 ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానామాగతిం గతిమ్, వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి. 22 జ్ఞానవక్తిబలైశ్వర్యవీర్యతేజాంస్యశేషతః, భగవచ్ఛబ్ధవాచ్యాని వినా హేయైర్గుణాదిభిః. 23 సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మని, భూతేషు వసనాదేవ వాసుదేవస్తతస్స్మృతః. 24 ఖాండిక్య జనకం ప్రాహ పృష్టః కేశిధ్వజః పురా, నామ వ్యాఖ్యామనంతస్య వాసుదేవస్య తత్త్వతః. 25 భూతేషు వసతే సోం೭తర్వసంత్యత్ర చ తాని యత్, ధాతా విధాతా జగతాం వాసుదేవస్తతః ప్రభుః. 26 స సర్వభూతప్రకృతిం వికారం గుణాదిదోషాంశ్చ మునే వ్యతీతః, అతీతసర్వావరణో೭ఖిలాత్మా తేనాస్తృతం యద్భువనాంతరాలమ్. 27 సమస్తకళ్యాణగుణం గుణాత్మకో హిత్వాతిదుఃఖావృతభూతసర్గః ఇచ్ఛాగృహీతాభిమతోరుదేహస్సంపాధితాశేషజగద్ధితో೭సౌ. 28 తేజోబలైశ్వర్యమహావబోధం స్వవీర్యశక్త్యాదిగుణౖకరాశిః, పరః పరాణాం సకలా న యత్ర క్లేశాదయస్సంతి పరావరేశే. 29 స ఈశ్వరో వ్యష్టిసమష్టిరూపో೭ వ్యక్తస్వరూపః ప్రకటస్వరూపః, సర్వేశ్వరస్సర్వనిసర్గవేత్తా సమస్తశక్తిః పరమేశ్వరాఖ్యః. 30 స జ్ఞాయతే యేన తదస్తదోషం శుద్ధం పరం నిర్మలమేవ రూపమ్, సందృశ్యతే చాప్యవగమ్యతే చ తజ్‌జ్ఞానమజ్ఞానమతో೭న్యదుక్తమ్. 31 స్వాధ్యాయసంయమాభ్యాం చ దృశ్యతే పురుషోత్తమః, తత్ప్రాప్తికారణం బ్రహ్మ తదేతత్ప్రతిపద్యతే. 32 స్వాధ్యాయాద్యోగమాసీత యోగాత్స్వాధ్యాయమామనేత్, స్వాధ్యాయయోగసంపత్త్వా పరమాత్మా ప్రకాశ##తే. 33 తదీక్షణాయ స్వాధ్యాయశ్చక్షుర్యోగ స్తథాపరమ్, న మాంసచక్షుషా ద్రష్టుం బ్రహ్మ భూతస్స శక్యతే. 34 సనందన మహర్షి పలికెను :- ఓ పండితా! ఆధ్యాత్మికాది త్రివిధ దుఃఖములు గర్భవాసము, పుట్టుక, జరాదులతో కలుగును. ఈ త్రివిధ దుఃఖములను తొలగించుకొనుటకు అతిశయము, ఆహ్లాదము, సుఖభావము మొదలగు వాటిని అధిగమించిన అత్యంతికమైన భగవత్ప్రాప్తి ఒక్కటే సరియైన ఔషధము. కావున పండితులైన మానవులు ఆ భగవత్ప్రాప్తికి ప్రయత్నించవలయును. భగవత్ర్పాప్తికి జ్ఞానము, కర్మ అనునవి కారణములు. శాస్త్రముల వలన వివేకము జ్ఞానము కలుగును. శబ్దబ్రహ్మశాస్త్ర స్వరూపుడు. పరబ్రహ్మ వివేకము వలన తెలియును. ఈ విషయమున మనువు కూడా వేదార్ధమును స్మరించి ఈ విషయమునే చెప్పెను. ఆ విషయమునే సులభముగా బోధ పడునట్లు చెప్పెదను వినుము. శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మ అని బ్రహ్మ రెండు విధములని తెలియుము. శబ్దబ్రహ్మను చక్కగా తెలిసినవాడు పరబ్రహ్మను తెలియగలడు. అధర్వణశ్రుతి కూడా రెండు విద్యలను తెలియవలయునని చెప్పినది. ఋగ్వేదాది స్వరూపమైన అక్షరప్రాప్తి ఉత్తమమైనది. అవ్యక్తము, అజరము, కోరికలు లేనిది, పుట్టుకలు లేనిది, తరగనిది, నిర్దేశించరానిది, రూపరహితము, పాణిపాదాదిసంయుతము, విభువు, సర్వగతము, నిత్యము, సర్వభూతకారణము, అకారణము, వ్యాప్యము, వ్యాప్తము, సర్వకారణము, అయిపరబ్రహ్మను జ్ఞానులు చూడగలరు. అదియే పరబ్రహ్మ, పరంధామము, మోక్షమును కోరువారిచే ధ్యానించదగినది, శ్రుతివాక్యములచే చెప్పబడినది, సూక్ష్మము, విష్ణువు యొక్క పరమపదము. అదియే భగవచ్ఛబ్ద వాచ్యము. అదియే పరమాత్మస్వరూపము. పరమాత్మను చెప్పునది భగవత్ శబ్దము. అక్షయాత్మయగు పరబ్రహ్మను ఉద్దేశించి చెప్పినది భగవచ్ఛబ్దము. ఇట్లు చెప్పిన అర్ధము చే పరబ్రహ్మతత్త్వము స్వరూపము చక్కగా తెలియును. ఈ జ్ఞానమే వేదస్వరూపమగు పరబ్రహ్మ స్వరూపమును చేర్చును. ఓ బ్రహ్మణోత్తమా! శబ్దగోచరుడు కాని పరబ్రహ్మ గౌరవార్థములో భగవచ్ఛబ్దము ఉపవాచముగా చెప్పబడినది. భగవచ్ఛబ్దము శుద్ధుడు, మహావిభూతి అనబడువాడు, సర్వకారణకారణుడు అగు పరబ్రహ్మయందుండును. భగ అను పదములోని భకారమునకు జ్ఞేయము, జ్ఞాత అను రెండర్థములు. శాస్త్రకారణత్వము స్రష్టృత్వము గకారమునకు అర్థము. సమగ్రమైన ఐశ్వర్యమునకు, వీర్యమునకు, కీర్తికి, శ్రీకి, జ్ఞానమునకు వైరాగ్యమునకు ఈ ఆరింటికి భగము అను పేరు. భూతాత్మ అఖిలాత్మయగు పరబ్రహ్మయందు అన్ని ప్రాణులు నివసించును. సమస్త భూతములయందు పరబ్రహ్మ యుండును అని వకారము చెప్పుచున్నది. ఇట్లు భగవాన్ అనునది మహాశబ్దము. ఈ శబ్దము మాత్రమే పరబ్రహ్మయగు వాసుదేవునకు వాచకము. ఇతరమునకు కాదు. ఇతరమును చెప్పజాలదు. భగవాన్ అను శబ్దమునకు పూజ్యార్థము చెప్పుట కూడా పరబ్రహ్మకు స్వరూపకథనమే కాని ఔపచారికము కాదు. పరబ్రహ్మకంటే భిన్నమైన వాటియందు మాత్రమే ఉపచారముగా చెప్పబడుచున్నది. ఉత్పత్తిని, ప్రళయమును, ప్రాణుల ఆగమనమును, గమనమును, విద్యను, అవిద్యను తెలియువాడు భగవానుడు. భగవచ్ఛబ్దవాచ్యుడు. హేయగుణములు లేక జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్య తేజస్సులను ఆరుగుణములు కలవాడు భగవచ్చబ్దవాచ్యుడు. ఆ పరమాత్మ యందు అన్ని ప్రాణులు వసించును. అన్ని ప్రాణులలో పరమాత్మ యుండుటచే వాసుదేవుడనబడుచున్నాడు. ఖాండిక్యుడగు నకుడు అడుగగా కేశిధ్వజుడు ఈ విషయమునే చెప్పెను. అనంతుడగు వాసుదేవనామమునకు తత్త్వమును తెలుపు వ్యాఖ్యానమును బోధించెను. అన్ని ప్రాణులలో ఉండును. అన్ని ప్రాణులు అతనిలో ఉండును. జగత్తునకు ధాత, (ధరించువాడు) విధాత జగత్తు నందు తానుండును. కావుననే వాసుదేవుడనబడును అని. ఆ పరమాత్మ సర్వభూతప్రకృతిని, వికారమును, గుణాదులను, దోషములను అధిగమించినవాడు అన్ని ఆవరణములను అధిగమించినవాడు, అఖిలాత్మ, భువనాంతరాలమునంతటిని వ్యాపించియున్నవాడు, సమకళ్యాణగుణగణములు కలవాడు దుఃఖము లేనివాడు, ప్రాణిసృష్టి చేయువాడు, సంకల్పముచే కోరిన దేహమును స్వీకరించువాడు, జగద్ధితమును సాధించువాడు. తేపోబలైశ్వర విశేషజ్ఞానము కలవాడు, వీర్యశక్త్యాది గుణములకు మూలస్థానము, పరములన్నిటి కంటే పరుడు, పరులకు అవరులకు ఈశుడు. ఏ క్లేశములు లేనివాడు, అతనే ఈశ్వరుడు వ్యష్టిరూపుడు, సమష్టిరూపుడు, అవ్యక్తరూపుడు, ప్రకటస్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వసృష్టి తెలియువాడు, సర్వశక్తి కలవాడు, పరమేశ్వరుడు దోషములను తొలగించువాడు, శుద్ధుడు, నిర్మలుడు, పరుడు అగు పరమాత్మను తెలుపునది, చూపునదే జ్ఞానము. ఇతరము అజ్ఞానము. స్వాధ్యాయసంయమములచే పురుషోత్తముడు తెలియబడును. పరబ్రహ్మను పొందించునది వేదమే. స్వాధ్యాయముచే యోగమును అభ్యసించవలయును. యోగముచే స్వాధ్యాయమును మననము చేయవలయును. స్వాధ్యాయయోగములచే పరమాత్మ తెలియును. పరమాత్మను చూచుటకు స్వాధ్యాయము యోగము అనునవి రెండు కన్నులు. పరబ్రహ్మను చర్మచక్షువులచే చూడజాలము. 3 - 34 నారద ఉవాచ :- భగవంస్తమహం యోగం జ్ఞాతుమిచ్ఛామి తం వద, జ్ఞాతే యన్నిఖిలాధారం పశ్యేయం పరమేశ్వరమ్. 35 నారదమహర్షి పలికెను :- పూజ్యుడా! నేనా యోగమును తెలియగోరుచున్నాను. నాకా యోగమును చెప్పుము. యోగము తెలిసినచో అఖిలాధారుడగు పరమేశ్వరుని దర్శించగలను.35 సనందన ఉవాచ :- కేశిధ్వజో యథా ప్రాహ ఖాండిక్యాయ మహాత్మనే, జనకాయ పురా యోగం తథాహం కథయామి తే. 36 సనందన మహర్షి పలికెను :- మహానుభావుడగు ఖాండిక్యుడను జనకునకు పూర్వము కేశిధ్వజుడు చెప్పిన యోగమును అదే విధముగా నేను నీకు తెలిపెదను. 36 నారద ఉవాచ :- ఖాండిక్యః క్యో೭భవద్బ్రహ్మన్కో వా కేశిధ్వజో೭భవత్, కథం తయోశ్చ సంవాదో యోగసంబంధవానభూత్. 37 నారద మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! ఖాండిక్యుడెవరు? కేశిధ్వజుడెవరు? వారిద్దరికి యోగసంబంధమున సంవామెట్లు జరిగెను? సనందన ఉవాచ :- ధర్మధ్వజో వై జనకస్తస్య పుత్రోమితధ్వజః, కృతధ్వజో೭స్య೭ భ్రాతా೭భవత్సదాధ్యాత్మ రతిర్నృపః. 38 కృతధ్వజస్య పుత్రో೭భూద్ధన్యః కేశిధ్వజో ద్విజః, పుత్రో೭మితధ్వజస్యాపి ఖాండిక్యజనకాధిపః. 39 కర్మామార్గే హి ఖాండివ్యస్వరరాజ్యాదవరోపితః, పురోధసా మంత్రిభిశ్చ సమవేతో೭ల్పసాధనః. 40 రాజ్యాన్నిరాకృతస్సో೭థ దుర్గారణ్యచరో೭భవత్, ఇయాజసో೭పి సుబహూన్యజ్ఞాన్ జ్ఞానవ్యపాశ్రయః. 41 బ్రహ్మవిద్యామధిష్ఠాయ తర్తుం మృత్యుమపి స్వయమ్, ఏకదా వర్తమానస్య యాగే యోగవిదాం వర ! 42 తస్య ధేనుం జఘానోగ్రశ్శార్దూలో విజనే వనే, తతో రాజా హతాం జ్ఞాత్వా ధేనుం వ్యాఘ్రేణ చర్త్విజః. 43 ప్రాయశ్చిత్తం సపప్రచ్ఛ కిమత్రేతి విదీయతామ్, తే చోచుర్న వయం విద్య కశేరుః పృచ్ఛ్యతామితి. 44 కశేరుపరి తేనోక్తస్తథేతి ప్రాహ నారద ! శునకం పృచ్ఛ రాజేన్ద్ర ! నాహం వేద స వేత్స్యతి. 45 స గత్వా తమపృచ్ఛచ్చ సో೭ప్యాహ నృపతిం మునే ! న కశేరున్నచైవాహం న చాన్యస్సాంప్రతం భువి. 46 వేత్త్యేక ఏవ త్వచ్ఛత్రుః ఖాండిక్యో యోజితస్త్వయా, స చాహ తం ప్రజామ్యేష ప్రష్టుమాత్మరిపుం మునే. 47 ప్రాప్త ఏవ మయా యజ్ఞే యది మాం స హనిష్యతి, ప్రాయశ్చిత్తం స చేత్పృష్టో వదిష్యతి రిపుర్మమ. 48 తతశ్చావికలో యోగో మునిశ్రేష్ఠ భవిష్యతి, ఇత్యుక్త్వారథమారుహ్య, కృష్ణాజినధరో నృపః. 49 వనం జగామ యత్రాస్తే ఖాండిక్యస్స మహీపతిః, తమాయాన్తం సమాలోక్య ఖాండిక్యో రిపుమాత్మనః. 50 ప్రోవాచ క్రోధతామ్రాక్షస్సమారోపితకార్ముకః. 51 సనందన మహర్షి పలికెను :- జనకవంశమున ధర్మధ్వజుడను మహారాజు కలడు. ధర్మధ్వజుని పుత్రుడు అమితధ్వజుడు. అమితధ్వజుని సోదరుడు కృతధ్వజుడు. ఎప్పుడూ అధ్యాత్మజ్ఞానమునందాసక్తి కలవాడు. కృతధ్వజునిపుత్రుడు కేశిధ్వజుడు. ఇతను ధన్యుడు. అమితధ్వజుని పుత్రుడు ఖాండిక్యనాముడు. కర్మమార్గమున నున్న ఖాండిక్యుని రాజ్యమునుండి కేశిధ్వజుడు వెడలగొట్టెను. పురోహితునితో మంత్రులతో కూడి కొద్ది సైన్యముతో రాజ్యభ్రష్టుడగు ఖాండిక్యుడు దుర్గమారణ్యమున నివసించసాగెను. కేశిధ్వజుడు కూడా చాలా యజ్ఞములనాచరించెను. సంసారమును తరించుటకు బ్రహ్మవిద్యనభ్యసించసాగెను. ఒకప్పుడు కేశిధ్వజుడు యాగమును చేయుచుండగా కేశిద్వజుని గోవును ఒక భయంకరమగు పెద్దపులి చంపెను. అపుడు కేశిధ్వజ మహారాజు ఆవును పులి చంపినదని తెలుసుకొని దీనికేమి ప్రాయశ్చిత్తమునాచరించవలయునో తెలుపుడని ఋత్విజులనడిగెను. అపుడా ఋత్విజులు మాకు తెలియదు. కశేరుమహర్షిని అడుగవలయునని తెలిపిరి. కశేరుమహర్షి నడుగగా నాకు తెలియదు. శునక మహర్షి నడుగమని చెప్పెను. కేశిధ్వజుడు శునకమహర్షి వద్దకు వెళ్ళి అడుగగా కశేరునకు తెలియదు. నాకు తెలియదు. ఇపుడీ భూలోకమున ఈ విషయమును తెలిసినవాడు నీ శత్రువగు ఖాండిక్యుడొక్కడు మాత్రమే అని తెలిపెను. ఆ మాటలను వినిన కేశిధ్వుజుడు ఖాండిక్యునే అడిగెదను. నేను వెళ్ళినపుడు అతను నన్ను వధించునా? లేక నేనడిగినపుడు ప్రాయశ్చిత్తమును తెలుపునా చూచెదను. ప్రాయశ్చిత్తమును తెలిపినచో నా యోగము సిద్ధించును అని పలికి రథమునధిరోహించి కృష్ణాజినధరుడై ఖాండిక్యుడున్న వనమునకు వెళ్ళెను. తన శత్రువగు కేశిధ్వజుడు వచ్చుట చూచి ఖాండిక్యుడు కోపముచే కనులు ఎఱ్ఱబారగా ధనువున బాణమును సంధించి ఇట్లు పలికెను. 38 - 51 ఖాండిక్య ఉవాచ :- కృష్ణాజినత్వక్కవచభావేనాస్మాన్హనిష్యసి. 52 కృష్ణాజినధరే వేత్సి న మయి ప్రహరిష్యతి, మృగానాం వద పృష్ఠేషు మూఢకృష్ణాజినం న కిమ్. 53 యేషాం మత్వా వృధా చోగ్రాః ప్రహితాశ్శితసాయకాః, స త్వామహం హనిష్యామి న మే జీవన్విమోక్ష్యసే. 54 ఆతతాయ్యసి దుర్బుద్ధే మమ రాజ్యహరో రిపుః. 55 ఖాండిక్యుడు పలికెను :- కృష్ణాజినమును కవచముగా ధరించి మమ్ములను చంపదలచితివా? కృష్ణాజనమును ధరించినందున నిన్ను వధించనని తలచితివా? మూఢుడా లేళ్ళ శరీరముపైన కృష్ణాజినముండదా? ఆ లేళ్ళను నిష్కారణముగా క్రూరులై బాణములతో వధించుటలేదా? కావున ఓ దుష్టబుద్ధీ! నీవు నాకు జ్ఞాతివి, రాజ్యమును హరించిన శత్రువువు కావున నిన్ను వధించెదను. నా నుండి బ్రతికి వెళ్ళలెవు. 52 - 55 కేశిధ్వజ ఉవాచ :- ఖాండిక్యసంశయం ప్రష్టుం భవంతమహమాగతః. 56 స త్వాం హంతుం విచార్యైతత్కోపం బాణం చ ముంచ వా, తతస్స మంత్రిభిస్సార్ధమేకాంతే స పురోహితం. 57 మంత్రయామాస ఖాండిక్యస్సర్వైరేవ మహామతిః, తమూచుర్మంత్రిణో వధ్యో రిపురేష వశంగతః. 58 హతే೭త్ర పృథివీ సర్వా తవ వశ్యా భవిష్యతి, ఖాండిక్యశ్చాహ తాన్సర్వానేవమేవ న సంశయః. 60 హతే తు పృథివీ సర్వా మమ వశ్యా భవిష్యతి, పరలోకజయస్తస్య పృథివీ సకలా మమ. 61 న హన్మి చేల్లోకజయో మమ త్వస్య వసుంధరా, పరలోకజయో೭నంతస్స్వల్పకాలో మహీజయః. 62 తస్మాన్నైనం హనిష్యే೭హం యత్పృచ్ఛతి వదామి తత్, తతస్తమభ్యుపేత్యాహ ఖాండిక్యో జనకో రిపుమ్. 63 ప్రష్టవ్యం యత్త్వయా సర్వం తత్పృచ్ఛ త్వం వదామ్యహమ్, తతః ప్రాహ యథావృత్తం హోమధేనుపధం మునే. 64 తతశ్చ తం స పప్రచ్ఛ ప్రాయశ్చిత్తం హి తద్ర్వతమ్, స చాచష్ట యథాన్యాయం మునే కేశిధ్వజాయ తత్. 65 ప్రాయశ్చిత్తమశేషం హి యద్వై తత్ర విధీయతే, విదితార్థస్స తేనైవమనుజ్ఞాతో మహాత్మనా. 66 యాగభూమిముపాగత్యం చక్రే సర్వాం క్రియాం క్రమాత్, క్రమేణ విధివద్యాగం నీత్వా సో೭వభృధాప్లుతః. 67 కృతకృత్యస్తతో భూత్వా చింతయామాస పార్థివః, పూజితా ఋత్విజస్సర్వే సదస్యా మానితా మయా. 68 తథైవార్ధిజనో೭ప్యర్ధైజితో೭భిమతైర్మయా, యథాహం మర్త్యలోకస్య మయా సర్వం విచేష్టితమ్. 69 అనిష్పన్నక్రియం చైతస్తథా న మమ కిం యథా, ఇత్ధం తు చింతయన్నేవ సస్మార స మహీపతిః. 70 ఖాండిక్యాయ న దత్తేతి మయా వై గురుదక్షినా, స జగామ తతో భూయో రథమారుహ్య పార్థివః. 71 స్వాయంభువస్థ్సితో యత్ర ఖాండిక్యో೭రణ్యదుర్గమమ్, ఖాండిక్యో೭పి పునర్దృష్ట్వా తమాయాన్తం ధృతాయుధః 72 తస్థౌ హంతుం కృతమతిస్తమాహ స పునర్నృపః, అహంతు నాపకారాయ ప్రాప్తః ఖాండిక్య మా క్రుధః. 73 గురోర్నిష్కృతిదానాయ మామవేహి సమాగతమ్, నిష్పాదితో మయా యాగః సమ్యక్త్వదుపదేశతః. 74 సో೭హం తే దాతుమిచ్ఛామి వృణీష్వ గురుదక్షిణామ్, ఇత్యుక్తో మంత్రయామాస స భూయో మంత్రిభిస్సహ. 75 గురోర్నిష్కృతికామో೭యం కిమయం ప్రార్ధ్యతాం మయా, తమూచుర్మంత్రిణో రాజ్యమశేషం యాచ్యతామయమ్. 76 కృతిభిః ప్రార్ధ్యతే రాజ్యమనాయాసితసైనికైః, ప్రహస్య తానాహ నృపస్సఖాండిక్యో మహామతిః. 77 స్వల్పకాలం మహారాజ్యం మాదృశైః ప్రార్ధ్యతే కథమ్, ఏవమేతద్భవంతో೭త్ర స్వార్ధసాధనమంత్రిణః. 78 పరమార్ధః కథం కో೭త్ర యూయం నాత్ర విచక్షణాః ఇత్యుక్త్వా సముపేత్త్యేనం స తు కేశిధ్వజం నృపమ్. 79 ఉవాచ కిమవశ్యం త్వం దాస్యసి గురుదక్షిణామ్, బాఢమిత్యేవ తేనోక్తం ఖాండిక్యస్తమథాబ్రవీత్. 80 భవానధ్యాత్మవిజ్ఞానపరమార్థవిచక్షణః, యది చేద్దీయతే మహ్యం భవతా గురునిష్క్రియః. 81 తత్ల్కేశప్రశమాయాలం యత్కర్మ తదుదీరయ కేశిధ్వజుడు పలికెను :- ఓ ఖాండిక్యా! సంశయమడుగుటకు నీ వద్దకు వచ్చితిని. నిన్ను చంపుటకు రాలేదు. కావున ఆలోచించి కోపమునో బాణమునో వదులుము. అంతట ఖాండిక్యుడు మంత్రులతో పురోహితులతోకలిసి ఆలోచించసాగెను. అపుడు మంత్రులందరు కలిసి ఇపుడు నీవు నీ శత్రువగు కేశిధ్వజుని చంపుము. ఇతనిని చంపినచో రాజ్యము నీ వశమగును. మంత్రి మాటలను విని ఖాండిన్యుడిట్లు పలికెను. మీరు చెప్పినది నిజమే. సంశయము లేదు. ఇతనిని చంపినచో భూమి నా వశమగును. కాని కేశిధ్వుజుడు పరలోకమును జయించును. నాకు భూమి నాకు లభించును. చంపనిచో నాకు పరలోక జయము ఇతనికి భూమి లభించును. భూమి స్వల్పకాలికము, పరలోక జయము అనంతకాలికము. కావున నేనితనిని చంపను. అతనడగిన దానిని చెప్పను. ఇట్లు పలికి కేశిధ్వజుని సమీపించి నీవడుగదలచినదానినడుగుము చెప్పెదను. అంతట కేశిధ్వజుడు హోమధేనువును వ్యాఘ్రము చంపినది. దానికి చేయవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పుమని అడిగెను. అంతట ఖాండిక్యుడు అచట చేయవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పెను. ఇట్లు ఖాండిక్యుని వలన ప్రాయశ్చిత్తమును తెలుసుకొనిన కేశిధ్వజుడు ఖాండిక్యుని అనుమతిని పొంది యాగభూమిని చేరి ప్రాయశ్చిత్తము నాచరించెను. ఇట్లు ప్రాయశ్చిత్తము నాచరించి యాగమును సమాప్తి గావించి ఆవబృధ స్నానము నాచరించి ఇట్లు ఆలోచించసాగెను. ఋత్విజులనందరిని పూజించితిని. సదస్యులను గౌరవించితిని. యాచకులకు అభిమతార్థములనిచ్చి సంతుష్టుల గావించితిని. ఈలోకమున చేయతగిన వాటిని అన్నింటిని చేసితిని. అయిననూ నా కర్తవ్యము ముగియలేదనిపించుచున్నది. ఇట్లు ఆలోచించుచుండగా ఖాండిక్యునికి గురుదక్షిణనీయలేదని జ్ఞప్తికొచ్చెను. వెంటనే కేశిధ్వజుడు రథము నారోహించి ఖాండిక్యుడు నివసించు దుర్గమారణ్యమునకు వెళ్ళెను. ఖాండిక్యుడట్లు వచ్చు కేశిధ్వజుని చూచి ఆయుధమును ధరించి వధించ సంకల్పించెను. అపుడు కేశిధ్వజుడు నేను నీకపకారమును చేయుటకురాలేదు. గురుదక్షిణ నిచ్చుట కొచ్చితిని. నీవు ఉపదేశించునట్లు యాగమును పూర్తిగావించితిని. కావున నీకు గురుదక్షిణనీయ సంకల్పించితిని. ఏమి కావలయునో కోరుకొనుము అని పలికెను. కేశిధ్వజుని మాటలను వినిన ఖాండిక్యుడు మంత్రులతో ఆలోచించసాగెను. కేశిధ్వజుడు గురుదక్షిణనీయ దలచినాడు. ఏమడుగవలయును? అని మంత్రుల నడిగెను. సంపూర్ణరాజ్యమునడుగుము. అట్లు కోరినచో సైన్యము శ్రమలేకనే రాజ్యము లభించును అని మంత్రులు పలికిరి. ఆ మాటలను వినిన ఖాండిక్యుడు నవ్వి వారితో నిట్లనెను. అశాశ్వతమగు రాజ్యమును నాలాంటివారెట్లడిగెదరు? మీరు మంత్రులు కావున స్వార్థపరులుగా మాటలాడుచున్నారు. పరమార్థమును తెలియజాలకున్నారు. ఇట్లు పలికి ఖాండిక్యుడు కేశిధ్వజుని సమీపించి నీవు తప్పక గురుదక్షిణ నిచ్చెదవా? అని అడిగెను. తప్పక నిచ్చెదనని కేశిధ్వజుడు పలుకగా ఖాండిక్యుడిట్లడిగెను. నీవు ఆధ్యాత్మవిజ్ఞాన పరమార్థమును బాగుగా తెలిసిన వాడవు. నీవు గురుదక్షిణనీయ దలచినచో క్లేశములను పరిహరింపచేయు కర్మను నాకు బోధించుము. 56 - 81 కేశిధ్వజ ఉవాచ :- న ప్రార్థితం త్వయా కస్మాన్మమ రాజ్యమకంటకమ్, రాజ్యలాబాద్ధి నాస్త్యన్యత్‌క్ష్కత్రియాణామతిప్రియమ్. 82 కేశిధ్వజుడు పలికెను :- క్షత్త్రియములకు రాజ్యలాభమునకంటే ప్రియమైనది మరియొకటి లేదు గదా? నీవు నా రాజ్యమునేల అడుగలేదు? ఖాండిక్య ఉవాచ :- కేశిధ్వజ నిబోధ త్వం మయా న ప్రార్థితం యతః 83 రాజ్యమేతదశేషేణ యన్న గృధ్నంతి పండితాః, క్షత్త్రియాణామయం ధర్మో యత్ప్రజాపరిపాలనమ్. 84 వధశ్చ ధర్మయుద్ధేన స్వరాజ్యపరిపంధినామ్, యత్రాశక్తస్య మే దోషో నైవాస్త్యపకృతే త్వయా. 85 వధాయైవ భవత్యేషా హ్యవిధ్యా హ్యక్రమోజ్ఘితా, జన్మోపభోగలిప్సార్థమిహ రాజ్యస్పృహా మమ. 86 అన్యేషాం దోషజానేవ ధర్మమేవానురుధ్యతే, న యాఞ్చా క్షత్రబంధూనాం ధర్మాయైతత్సతాం మతమ్. 87 అతో న యాచితం రాజ్యమవిద్యాంతర్గతం తవ, రాజ్యం గృధ్నంతి విద్వాంసో మమత్వాకృష్టచేతసః 88 అహంమానమహాపానమదమత్తా న మాదృశాః. ఖాండిక్యడు పలికెను :- ఓ కేశిధ్వజా! పండితులైన వారు రాజ్యమునందు ఆశపడరు. కావున నేను రాజ్యమును కోరలేదు. క్షత్రియులకు ప్రజాపరిపాలనము, ధర్మ యుద్ధమున శత్రువధ స్వధర్మము. ఆ రెంటిలో అశక్తుడనగుట నా దోషము. నీవు చేసిన అపకారమేమియును లేదు. అక్రమ మార్గమున శత్రువధ చేయుట అజ్ఞానమే యగును. మరల పుట్టుకను పాపాను భవమునకే నాకు రాజ్యలాభమునందాశయగును. దోషముల వలన చేయు ధర్మములనే అనుసరింతురు. క్షత్రియులు యాచనచే రాజ్యమును పొందుట ధర్మము కానేరదు. కావున అవిద్యలో అంతర్భవించిన రాజ్యమును నేను అర్ధించలేదు. మమకారముచే ఆకర్షించబడిన చిత్తము కలవారు అహంకారమదమత్తులు మాత్రమే రాజ్యమునాశించెదరు. నా వంటి వారు రాజ్యము నాశించజాలరు. 82 - 88 కేశిధ్వజ ఉవాచ :- అహం చ విద్యయా మృత్యుం తర్తుకామః కరోమి వై. 89 రాజ్యం యజ్ఞాంశ్చ వివిధాన్భోగే పుణ్యక్షయం తథా, తదిదం తే మనో దిష్ట్యా వివేకైశ్వర్యతాం గతమ్. 90 శ్రూయతాం చాప్యవిద్యాయాస్స్వరూపం కులనందన ! అనాత్మన్యాత్మబుద్ధిర్యా హ్యస్వే స్వవిషయా మతిః. 91 అవిద్యాతరుసంభూతం భీజమేతద్ద్విధా స్థితమ్, పంచభూతాత్మకే దేహే దేహీ మోహతమో వృతః. 92 అహమేతదితీత్యుచ్చైః కురుతే కుమతిర్మతిమ్, ఆకాశవాయ్వగ్నిజలపృధివీభీః పృధక్థ్సితే. 93 ఆత్మన్యాత్మమయం భావం కః కరోతి కలేవరే, కలేవరోపభోగ్యం హి గృహక్షేత్రాదికం చ యత్. 94 అదేహే హ్యాత్మని ప్రాజ్ఞో మమేదమితి మన్యతే, ఇత్ధం చ పుత్రపౌత్రేషు తద్దేహోత్పాదితేషు చ. 95 కరోతి పండితస్స్వామ్యమనాత్మని కలేవరే, సర్వదేహోపభోగాయ కురుతే కర్మ మానవః. 96 దేహం చాన్యద్యదా పుంసస్సదా బంధాయ తత్పరమ్, మృణ్మయం హి యథా గేహం లిప్యతే వై మృదంభసా 97 పార్ధివో೭యం తథా దేహా మృదంభోలేపనస్థితిః, పంచభోగాత్మకై ర్భోగైః పంచభోగాత్మకం వపుః. 98 ఆప్యాయతే యది తతః పుంసో గర్వో೭త్ర కింకృతః, అనేక జన్మసాహస్రం సంసారపదవీం వ్రజన్. 99 మోహాశ్రమం ప్రయాతో೭సౌ వాసనారేణుగుంఠితః, ప్రక్షాళ్యతే యదా సౌమ్య రేణుర్జానోష్టవారిణా. 100 తదా సంసారపాంధస్య యాతి మోహశ్రమశ్శమమ్, మోహశ్రమే శమం యాతే స్వచ్ఛాంతఃకరణః పుమాన్. 101 అన్యనాతిశయాధారః పరం నిర్వాణమృచ్ఛతి, నిర్వాణమయ ఏవాయమాత్మా జ్ఞానమయో೭మలః. 102 దుఃఖజ్ఞానమయా ధర్మాః ప్రకృతేస్తే తు నాత్మనః, జలస్య నాగ్నినా సంగస్ధ్సాలీసంగాత్తథాపి హి. 103 శబ్దోద్రేకాదికాన్ ధర్మన్కరోతి హి యధాబుధః, తథాత్మా ప్రకృతేస్సంగాదహం మా నాదిదూషితః. 104 భజతే ప్రాకృతాన్ధర్మాన్నస్తస్తంభో హి సో೭వ్యయః, తదేతత్కథితం బీజమవిద్యాయా మయా తవ. 105 క్లేశానాం చ క్షయకరం యోగాదన్యన్న విద్యతే. 106 ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయ పాదే షట్చత్వారింశత్తమో೭ధ్యాయః కేశిధ్వజుడు పలికెను :- నేను జ్ఞానముచే సంసారమును తరించుటకే రాజ్యమును యజ్ఞములను చేయుచున్నాను. పుణ్యక్షయము కొఱకు పలు భోగములననుభవించుచున్నాను. దైవేచ్ఛచే నేటికి నీ మనసు వివేకవృద్ధిని చెందుచున్నది. ఓ కులనందనా ! అవిద్యస్వరూపమును చెప్పెదను వినుము. ఆత్మకాని దానియందు ఆత్మబుద్ధి, తనది కానిదానియందు తనదను బుద్ధి ఈ రెండు విధములగు బీజములు అవిద్యావృక్షములనుండి పుట్టినవి. పంచభూతాత్మకమగు దేహమునందు జీవుడు మోహమను చీకటిచే ఆవరించబడి దుష్టబుద్ధి కలవాడై ఈ దేహమేనేనని భావనచేయును. ఆకాశ వాయ్వగ్ని జల పృథివులను పంచభాతములు విడివిడిగా యుండగా శరీరమున ఆత్మయని భావించువాడెవ్వడు? శరీరముచే అనుభవించదగిన గృహక్షేత్ర కలత్రాదులు దేహమున కంటే భిన్నమగు ఆత్మలో నావి ఇవి యని ప్రజ్ఞుడు భావించెను. ఇట్లే దేహము వలన ఉత్పన్నములైన పుత్రపౌత్రాదులందు ఆత్మకాని శరీరమునందు పండితుడు కూడా తనది అను భావన కలిగియుండును. సమగ్ర శరీరానుభవము కొఱకు మానవుడు కర్మను చేయును. కాని ఆత్మకంటే భిన్నమగు ఈ దేహము ఎపుడూ దేహిని బంధించుటకే ప్రయత్నించుచుండును. మట్టిచే నిర్మించిన గృహమును మట్టినీటిచే అలుకునట్లు ఈ పార్ధివ దేహమును కూడా మట్టినీరులచే పూయబడియుండును. పంచభోగాత్మకములగు భోగములచే పంచభూతాత్మకమగు శరీరమును తృప్తిపరిచినచో పురుషుని గర్వము విజృంభించుచుండును. అనేక వేలజన్మలలో సంసారమును పొందుచు వాసనా ధూళిధూసరితుడై మోహముచే శ్రమను పొందును. జానమను ఉష్ణజలముచే వాసనాధూళిని ప్రక్షాళనము చేసినచో సంసారమును బాటలో పయనించు బాటసారికి మోహశ్రమము శమించును. మోహమను శ్రమ శాంతించినపుడు పవిత్రమైన అంతఃకరణము గల పురుషుడు ఇతరములను అధికముగా ఆశ్రయించక పరమానందమును పొందును. ఇట్లు ఈ ఆత్మ పరమానందమయుడు జ్ఞానమయుడు, దుఃఖమును కలిగించు ధర్మములు ప్రకృతివి కాని ఆత్మవి కావు. నీటిని అగ్నితో సంగముండజాలదు. స్థాలీసంగముండును. జీవుడు శబ్దోద్రేకాది ధర్మములను ఆచరించినపుడు ఆత్మకు ప్రకృతి సంబంధమేర్పడుటచే అహంకార దూషితమగును. అపుడు అవ్యయుడగు ఆత్మ నిశ్చేష్టతను విడిచి ప్రాకృతధర్మమున నాచరించును. ఇట్లు నీకు అవిద్యాబీజమును తెలిపితిని, క్లేశములను నశింప చేయు సాధనము ఒక్క యోగము మాత్రమే. 89 - 106 ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ద్వితీయ పాదమున బృహదుపాఖ్యానమున నలుబది యావర అధ్యాయము సమాప్తము