Sri Naradapuranam-I
Chapters
Last Page
అష్టచత్వారింశో೭ధ్యాయః=నలుబది యెనిమిది అధ్యాయము నారద ఉవాచ :- శ్రుతం మయా మహాభాగ ! తాపత్రయచికిత్సితమ్, తథా೭పి మే మనో భ్రాంతం న స్థితిం లభ##తేంజసా.
1 ఆత్మవ్యతిక్రమం బ్రహ్మన్దుర్జనాచరితం కథమ్, సోఢుం శ##క్యేత మనుజైస్తన్మమాఖ్యాహి మానద !. 2 నారద మహర్షి పలికెను :- ఓ మహానుభావా! తాపత్రయచికిత్సను నేను చక్కగా వింటిని. అయిననూ నా మనసు భ్రాంతిని చెందుచునే యున్నది. స్ధైర్యమును పొందుట లేదు. ఓ బ్రాహ్మణోత్తమా ! ఆత్మకు విరుద్ధముగా దుర్జనులాచరించు దానిని మానవులు సహించుటెట్లు? ఈ విషయమును నాకు తెలుపుము. 1 - 2 సూత ఉవాచ :- తచ్ఛ్రుత్వా నారదేనోక్తం బ్రహ్మపుత్రస్సనందనః ఉవాచ హర్షసంయుక్తస్స్మరన్భరతచేష్టితమ్. 3 సూతమహర్షి పలికెను :- నారదుడు పలికిన మాటలను వినిన బ్రహ్మపుత్రుడగు సనందన మహర్షి ఆనందముతో భరతుని కర్మను స్మరించుచు ఇట్లు పలికెను. సనందన ఉవాచ :- అత్ర తే కథయిష్యామి ఇతిహాసం పురాతనమ్, యం శ్రుత్వా త్వన్మనో భ్రాంతమాస్థానం లభ##తే భృశమ్. 4 ఆసీత్పురా మునిశ్రేష్ఠా ! భరతో నామ భూపతిః, ఆర్షభో యస్య నామ్నేదం భారతం ఖండముచ్యతే. 5 స రాజా ప్రాప్తరాజ్యస్తు పితృపైతామహం క్రమాత్, పాలయామాస ధర్మేణ పితృవద్రంజయన్ ప్రజాః. 6 ఈజే చ వివిధైర్యజ్ఞైర్భగవంతమధోక్షజమ్, సర్వదేవాత్మకం ధ్యాయన్నానాకర్మసు తన్మతిః. 7 తతస్సముత్పాద్య సుతాన్ విరక్తో విషయేషు సః, ముక్త్వా రాజ్యం య¸° విద్వాన్పులస్త్యపులహాశ్రమమ్. 8 శాలగ్రామం మహాక్షేత్రం ముముక్షుజనసేవితమ్, తత్రాసౌ తాపసో భూత్వా విష్ణోరారాధనం మునే. 9 చకార భక్తిభావేన యథా లబ్ధి సపర్యయా, నిత్యం ప్రాతస్సమాప్లుత్య నిర్మలేంభసి నారద. 10 ఉపతిష్ఠేద్రవిం భక్త్వా గృణన్బ్రహ్మాక్షరం పరమ్, అథాశ్రమే సమాగత్య వాసుదేవం జగత్పతిమ్ 11 సమాహృతైస్స్వయం ద్రవ్యైస్సమిత్కుశమృదాదిభిః, ఫలైః పుషై#్పస్తథా పత్రైః తులస్యా స్వచ్ఛవారిభిః. 12 పూజయన్ప్రయతో భూత్వా భక్తిప్రసరసంప్లుతః, స చైకదా మహాభాగస్స్నాత్వా ప్రాతస్సమాహితః. 13 చక్రనద్యాం జపంస్తస్ధౌ ముహూర్తత్రయమంబుని, అథాజగామ తత్తీరం జలం పాతుం పిపాసితా. 14 ఆసన్నప్రసవా బ్రహ్మన్నేకైవ హరిణీ వనాత్, తతస్సమభవత్తత్ర పీతప్రాయే జలేతయా. 15 సింహస్య నాదస్సుమహాన్ సర్వప్రాణిభయంకరః, తతస్సా సింహసన్నాదాదుత్ల్సతా నిమ్నగా తటమ్. 16 అత్యుచ్చారోహణనాస్యా నద్యాం గర్భః పపాత హ, తముహ్యమానం వేగేన వీచిమాలా పరిప్లుతమ్. 17 జగ్రాహ భరతో గర్భాత్ పతితం మృగపోతకమ్, గర్భపోతకమ్, గర్భప్రచ్యుతిదుఃఖేన ప్రోత్తుంగోత్క్రమణన చ. 18 మునీన్ద్ర సా తు హరిణీ నిపపాత మమార చ, హరిణీం తాం విలోక్యాథ విపన్నాం నృప తాపసః. 19 మృగపోతం సమాగ్రహ్య స్వమాశ్రమముపాగతః, చకారానుదినం చాసౌ మృగపోతస్య వై నృపః 20 పోషణం పుష్యమాణశ్చ స తేన వవృధే మునే, చచారాశ్రమపర్యంతం తృణాని గహనేషు సః. 21 దూరం గత్వా చ శార్దూలత్రాసాదభ్యాయ¸° పునం, ప్రాతర్గత్వాతిదూరం చ సాయమాయాత్యథాశ్రమమ్. 22 పునశ్చ భరతస్యాభూదాశ్రమస్యోటజాంతరే, తస్య తస్మిన్మృగే దూరసమీపపరివర్తిని. 23 ఆసీచ్చేతస్సమాసక్తం న తథా హ్యచ్యతే మునే, విముక్తరాజ్యతనయః ప్రోజ్ఘితాశేషబాంధవః. 24 మమత్వం స చకారోచ్చైస్తస్మిన్హరిణపోతకే, కిం వృకైర్భక్షితో వ్యాఘ్రైః కిం సింహేన నిపాతితః. 25 చిరాయమాణ నిష్క్రాంతే తస్యాసీదితి మానసమ్, ప్రీతిప్రసన్నవదనః పార్శ్వస్దే చాభవన్మృగే. 26 సమాధిభంగస్తస్యాసీన్మమత్వాకృష్టమానసః, కాలేన గచ్ఛతా సో7థ కాలం చక్రే మహీపతిః. 27 పితేవ సాస్రం పుత్రేణ మృగపోతేన వీక్షితః, మృగమేవ తదా೭ద్రాక్షీత్ త్యజన్ప్రణానసావపి. 28 మృగో బభూవ స మునే తాదృశీం భావనాం గతః, ఆతిస్మరత్వాదుద్విగ్నస్సంసారస్య ద్విజోత్తమ. 29 విహాయ మాతరం భూయః శాలగ్రామముపాయ¸°, శుషై#్కస్తృణౖస్తథాపర్ణైస్సకుర్వన్నాత్మపోషణమ్. 30 మృగత్వహేతుభూతస్య కర్మణో నిష్కృతిం య¸°, తత్ర చోత్సృష్టదేహా೭సౌ జజ్ఞే జాతిస్మరో ద్విజః. 31 సదాచారవతాం శుద్ధే యోగినాం ప్రవరే కులే, సర్వివిజ్ఞానసంపన్నః సర్వశాస్త్రార్ధతత్త్వవిత్. 32 అపశ్యత్స మునిశ్రేష్ఠస్స్వాత్వానం ప్రకృతేః పరమ్, ఆత్మనో೭ధిగతజ్ఞానాద్దేవాదీని మహామునే. 33 సర్వభూతాన్యభేదేన దదర్శ స మహామతిః, న పపాఠ గురుప్రోక్తం కృతోపనయనం శ్రుతమ్. 34 న దదర్శ చ కర్మాణి శాస్త్రాణి జగృహే న చ, ఉక్తో೭పి బహుశః కించిజ్జడం వాక్యమభాషత. 35 తదప్యసంస్కారగుణం గ్రామభాషోక్తిసంయుతమ్, అపధ్వస్తవపుస్సో೭పి మలినాంబరధృజ్ మునే. 36 క్లిన్నదంతాంతరస్సర్వైః పరిభూతస్స నాగరైః, సంమానేన పరాం హానిం యోగర్ధేః కురుతే యతః. 37 జనేనావమతో యోగీ యోగసిద్ధిం చ విందతి, తస్మాచ్చరేత వై యోగీ సతాం ధర్మమదూషయన్. 38 జనా యథావమన్యేయుః గచ్ఛేయుర్నైవ సంగతిమ్, హిరణ్యగర్భవచనం విచింత్యేత్ధం మహామతిః. 39 ఆత్మానం దర్శయామాస జడోన్మత్తాకృతిం జనే, భుంక్తే కుల్మాష, వటకాన్ శాకం వన్యఫలం కణాన్. 40 యద్యదాప్నోతి చ స బహూన్ అత్తి వై కాలసంభవమ్, పితర్యుపరతే సో೭థ భాతృభ్రాతృవ్యబాంధవైః. 41 కారితః క్షేత్రకర్మాదికదన్నాహారపోషితః, సరూక్షపీనావయవః జడకారీ చ కర్మణి. 42 సర్వలోకోపరకరణం బభూవాహారవేతనః, తం తాదృశమసంస్కారం విప్రాకృతివిచేష్టితమ్. 43 క్షత్తా సౌవీరరాజ్యస్య విష్టియోగ్యమమన్యత, స రాజా శిబికారూఢో గంతుం కృతమతిర్ద్విజ. 44 బభూవేక్షుమతీతీరే కపిలర్షేర్వరాశ్రమమ్, శ్రేయః, కిమత్ర సంసారే దుఃఖప్రాయే నృణామితి. 45 ప్రష్టుం తం మోక్షధర్మజ్ఞం కపిలాఖ్యం మహామునిమ్, ఉవాహ శిబికామస్య క్షత్తుర్వచనచోదితః. 46 నృణాం విష్టిగృహీతానామన్యేషాం సో೭పి మధ్యగః, గృహీతో విష్టినా విప్ర సర్వజ్ఞానైకభాజనమ్. 47 జాతిస్మరో೭సౌ పాపస్య క్షయకామ ఉవాహ తమ్, య¸° జడగతిస్తత్ర యుగమాత్రావలోకనమ్. 48 కుర్వన్మతిమతాం శ్రేష్ఠస్తే త్వన్యే త్వరితం యయుః, విలోక్య నృపతిస్సోథ విషమం శిబికా గతమ్. 49 కిమేతదిత్యాహ సమం గమ్యతాం శిబికావహాః, పునస్తథైవ శిబికాం విలోక్య విషమాం హసన్. 50 నృపః కిమేతదిత్యాహ భవద్భిర్గమ్యతేన్యథా, భూపతేర్వదతస్తస్య శ్రేత్వేత్ధం బహుశో వచః. 51 శిబికావాహకాః ప్రోచురయం యాతీత్యసత్త్వరమ్. 52 సనందన మహర్షి పలికెను :- ఇచట నీకు ఒక ప్రాచీనమైన ఇతిహాసమును చెప్పెదను. ఈ కథను వినినచో మనశ్చాంచల్యమును వీడి స్ధిరత్వమును పొందెదవు. ఓ మునిశ్రేష్ఠా! పూర్వకాలమున భరతుడను పేరు గల మహారాజు ఉండెను. ఋషభుని పుత్రుడతడు. అతని పేరు వలననే ఈ ఖండమునకు భారత ఖండమును పేరు కలిగినది. భరత మహారాజు తండ్రి తాతలు పాలించిన రాజ్యమును క్రమమున పొంది ప్రజలను తండ్రివలె ఆనందింప చేయుచు ధర్మబద్ధముగా పరిపాలించెను. భగవంతుడగు శ్రీమన్నారాయణుని పలు యజ్ఞములచే పూజించెను. సర్వదేవాత్మకుడగు శ్రీహరియందే మనసును నిలిపి సత్కర్మల నాచరించెను. తరువాత వివాహము చేసుకొని పుత్రులను పొంది విషయభోగములందు విరక్తిని చెంది, రాజ్యమును విడిచి పులస్త్యపులహ మహర్షుల ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ ఆశ్రమమే శాలగ్రామమను పేరుతో విఖ్యాతమైనది. మోక్షమును కోరువారు సేవించు ఆశ్రమమది. ఆయాశ్రమమున భరతమహారాజు దొరికిన పూజాద్రవ్యములతో భక్తి భావముచే తాపసుడై శ్రీమహావిష్ణువు నారాధించెను. ప్రతిదినము ప్రాతఃకాలమున పవిత్రజలములలో స్నానమాడు చుండెను. అక్షరమైన పరబ్రహ్మను కీర్తించుచు సూర్యోప స్థానమును చేయుచుండెను. తరువాత ఆశ్రమమున తాను స్వయముగా కూర్చుకొనిన సమిధలు, దర్భలు, మట్టి, ఫలములు, పుష్పములు, పత్రములు, తులసి, పవిత్రజలములు మొదలగు ద్రవ్యములచే వినయముతో భక్తిభావములో మునిగి శ్రీహరిని పూజించుచుండెను. ఒకపుడు భరత మహారాజు ప్రాతఃకాలమున చక్రనదిలో స్నానమాచరించి నదిలోనే జపము చేయుచు మూడు ముహూర్తముల కాలము నిలుచుండెను. ఆ సమయము ప్రసవకాలము సమీపించిన ఒక లేడి దప్పిగొని నీరు త్రాగుటకు ఆ నదికి వచ్చెను. ఆ లేడి నదిలో నీరును త్రాగుచుండగా సర్వప్రాణి భయంకరమగు సింహగర్జన వినిపించెను. సింహగర్జనను విని భయపడిన ఆ యాడలేడి నదిని దాటుటకు ప్రయత్నించెను. ఎత్తు ప్రాంతమునకు ఆరోహించుట వలన గర్భము నదీ ప్రవాహములో పడెను. తరంగముల వేగముచే కొట్టుకొని వచ్చిన లేడి పిల్లను భరతుడు పట్టుకొనెను. గర్భపాత దుఃఖము వలన ఉన్నత ప్రదేమును అధిరోహించుట వలన కలిగిన శ్రమచే ఆ లేడి పడిపోయి మరణించెను. ఆ లేడి మరణించుటను చూచిన భరతుడు లేడి పిల్లను తీసుకొని ఆశ్రమమునకు వచ్చెను. భరతుడు ప్రతిదినము ఆ లేడి పిల్లను పోషించుచుండెను. ఇట్లు భరతునిచే పోషించబడు లేడిపిల్ల పెరిగి పెద్దదాయెను. ఆశ్రమప్రాంతారణ్యమున తృణ భక్షణమును చేయుచుండెను. కొంతదూరము వెళ్ళి శార్దూలాది క్రూరమృగముల భయముచే మరల ఆశ్రమమునకు వచ్చుచుండెను. ప్రాతఃకాలమున చాలాదూరము వెళ్ళిననూ సాయంకాలమున ఆశ్రమమునకు చేరుచుండెను. మరల భరతుని కుటీరములో నివసించుచుండెను. అట్లు లేడి దూరముగా వెళ్ళినపుడు దగ్గరలో ఉన్నపుడు కూడా భరతుని ఆ లేడి మనసు ఆ లేడి యందే ఆసక్తమై యుండెను. రాజ్యమును పుత్రులను సమస్త బంధువులను విడిచిన భరతుడు ఆ లేడి పిల్లయందు మమకారమును పెంచుకొనెను. లేడిపిల్ల ఆశ్రమమునుండి దూరముగా వెళ్ళి వచ్చుటకు ఆలస్యమైనచో తొడేలో, పెద్దపులియో, సింహమో భక్షించియుండునా అని మనసున విచారించుచుండెడివాడు. సమీపమున నున్నపుడు ప్రీతుడై యుండెడివాడు. ఇట్లు మమకారముచే ఆకర్షించబడిన మనసు గలవాడైనందున భరతునికి సమాధి భంగము జరిగెను. కొంతకాలమునకు భరతుడు తండ్రిని పుత్రుడు చూచునట్లు లేడిపిల్ల కన్నీటిచే చూచుచుండగా మృతి చెందెను. భరతుడు కూడా మరణించునపుడు లేడిపిల్లను చూచుచునే ప్రాణములను వీడెను. లేడిపిల్లనే తలచుచు మరణించినందున మరల లేడిగా పుట్టెను. అయిననూ పూర్వజన్మ జ్ఞానముండుటచే సంసారమునకు భయపడి తల్లిని విడిచి శాలగ్రామక్షేత్రమునకు వెళ్ళెను. ఎండిన గడ్డితో ఆకులతో దేహమున పోషించుకొనుచుండెను. అట్లు విరక్తి చెందియున్నందున మృగజన్మము వచ్చుటకు కారణమైన పాపమునకు నిష్కృతి లభించెను. తరువాత కొంతకాలమును దేహమును విడిచి పూర్వజన్మజ్ఞానముతో బ్రాహ్మణునిగా సదాచారము గల శ్రేష్ఠులైన యోగుల కులమున పుట్టెను. సమస్త విజ్ఞానము కలవాడుగా సర్వ శాస్త్రార్ధములు తెలిసిన వాడుగా నుండెను. తన ఆత్మను ప్రకృతికంటే వేరుగా చూడగలిగెను. ఆత్మజ్ఞానము కలవాడగుటచే దేవాదిసమస్తజీవులను అభేదముగా చూడసాగెను. ఉపనయనము అయిననూ గురువు ద్వారా శాస్త్రమున పఠించలేదు. కర్మలనాచరించలేదు. శాస్త్రములను స్వీకరించలేదు. ఎన్నియో ఎదుటివారు పలికినచో జడునివలె మాటలాడసాగెను. ఆమాటలు కూడా సంస్కారరహితముగా గ్రామ్యభాషతో నుండెడివి. దుమ్ముకొట్టుకొని పొయిన శరీరముతో మురికి పట్టిన వస్త్రములను ధరించి దంతధావనము చేయక అపరిశుభ్రముగా నుండెడి భరతుని నాగరికులు పరాభివించుచుండెడివారు. నాగరికులు సమ్మానము చేసినచో యోగవృద్ధికి హాని జరుగునని భరతుడు తెలియును. నాగరికులు అవమనించినపుడే యోగము సిద్ధించునని తెలిసినవాడు. కావున యోగియైనవాడు సజ్జన ధర్మమునకు భంగము కలుగకుండగా ప్రవర్తించవలయును. జనులు అవమానించునట్లే మెలగవలయును కాని వారితో సహవాసము చేయరాదు అని చెప్పిన హిరణ్యగర్భుని వాక్కును ఆలోచించి మహామతియగు భరతుడు తనను జడుని వలె ఉన్మత్తుని వలె జనులకు చూపసాగెను. శాకములను వన్యములను, కణములను భుజించుచుండెను. ఆయాకాలములలో లభించుదానినే భుజించెడివాడు. తండ్రి మరణించిన తరువాత, సోదరులు, పెద్దతండ్రి బాంధవులు చెడిపోయిన ఆహారమును పెట్టుచు పొలము పనులను ఇంటిపనులను చేయించుచుండిరి. భరతుడు మాత్రము చూడ శక్యముకాని కాంతితో పుష్టిచెందిన అవయవములచే జడుని వలె పనులను చేయుచు, ఆహారమునిచ్చువారందరికి పనులను చేయుచుండెడివాడు. ఇట్లు సంస్కారహీనునిగా విప్రాకారముతో నున్న భరతునీ సౌవీరరాజు పల్లకిని మోయుటకు తగినవానినిగా తలచెను. ఆ రాజు పల్లకినెక్కి ఇక్షుమతీ నదీ తీరమున నున్న కపిలాశ్రమమునకు దుఃఖమయమైన ఈ సంసారమున మానవులకు ఏది హితము అని, మోక్షధర్మములను తెలిసిన కపిల మహర్షిని అడుగుటకు వెళ్ళదలచెను. ఆరాజు ఆజ్ఞచే భరతుడు అతని పల్లకిని మోయసాగెను. పల్లకి మోయువారందరిలో భరతుడు మధ్యన నుండెను. సర్వజ్ఞానము కల భరతుడు తాను చేసిన పాపము క్షీణించుటకు ఆ రాజుపల్లకిని మోయసాగెను. పల్లకిదండమునే చూచుచు పల్లకిని మెల్లగా మోయుచుండెను. మిగిలిన వారు మాత్రము వేగముగా నడువసాగిరి. ఇట్లు కొందరు వేగముగా ఒకడు మెల్లగా నడుచుటచే పల్లకిలో సమానత్వము భంగమాయెను. అట్లు విషమగతిని చూచిన రాజు ఏమిటిది? సమానముగా వెళ్ళుడు అని పలికెను. అయిననూ పల్లకి అట్లే వెళ్ళుటను చూచి రాజు నవ్వుచూ మీరిట్లెందుకు నడుచుచున్నారని మరల అడిగెను. ఇట్లు రాజు పలుమార్లు పలుకగా పల్లకిని మోయువారు ఇతను మెల్లగా నడుచుచున్నాడు అని పలికిరి. 4 - 52 రాజోవాచ :- కిం శ్రాంతో೭స్యల్పమధ్వానం త్వయోఢా శిబికా మమ, కిమాయాససహో న త్వం పీవానసి నిరీక్షసే. 53 పల్లకిని కొద్దిదూరమే మోసితివి కదా? అపుడే అలిసిపోతివా? కష్టమును సహించలేకుంటివా? పుష్టిగా కనపడుచున్నావు కదా? అని రాజు పలికెను. 53 బ్రాహ్మణ ఉవాచ :- నాహం పీవాన్నచైవోఢా శిబికా భవతో మయా, న శ్రాంతో೭స్మి న చాయాసో వోఢాన్యో೭స్తి మహీపతే. 54 బ్రాహ్మణుడు పలికెను :- నేను పుష్టిగా లేను. నీ పల్లకిని నేను మోయుట లేదు. నేనలసి పోలేదు. నాకే ఆయాసమూ లేదు. నీ పల్లకిని మోయువాడు ఇతరుడే. 54 రాజోవాచ :- ప్రత్యక్షం దృశ్యేత పీవా త్వద్యాపి శిబికా త్వయి, శ్రమశ్చ భారోద్వహనే భవత్యేవ హి దేహీనామ్. 55 రాజు పలికెను :- ప్రత్యక్షముగా పుష్టిగా కనపడుచున్నావు. పల్లకి నీభుజము మీదనే యున్నది. బరువును మోయునపుడు దేహధారులకు శ్రమ కలుగును. 55 బ్రాహ్మణ ఉవాచ :- ప్రత్యక్షం భవతా భూప యద్దృష్టం మమ తద్వద, బలవానబలశ్చేతి వాచ్యం పశ్చాద్విశేషణమ్. 56 త్వయోఢా శిబికా చేతి త్వయ్యద్యాపి చ సంస్థితా, మిథ్యా తదప్యత్ర భవాన్ శృణోతు వచనం మమ. 57 భూమౌ పాదయుగం చాథ జంఘే పాదద్వయే స్థితే, ఊరూ జంఘాద్వయావస్థౌ తదాధారం తథోదరమ్. 58 వక్షస్థలం తథా బాహూ స్కంధే చోదరసంస్థితా, స్కంధాశ్రితేయం శిబికా మమాధారో೭త్ర కిం కృతః. 59 శిబికాయాం స్థితం చేదం దేహం త్వదుపలక్షితమ్, తత్ర త్వమహమహ్యత్రేత్యుచ్యతే చేదమన్యథా. 60 అహం త్వం చ తథాన్యే చ భూతైరూహ్యాశ్చ పార్ధివ, గుణప్రవాహపతితో భూతవర్గో೭పి యాత్యయమ్. 61 కర్మవశ్యా గుణాశ్చైతే సత్త్వాద్యాః పృథివీపతే, అవిద్యాసంచితం కర్మ తచ్చాశేషేషు జంతుషు. 62 ఆత్మా శుద్ధో೭క్షరశ్శాంతో నిర్గుణః ప్రకృతేః పరః, ప్రవృద్ధ్యపచయో నస్తః ఏకస్యాఖిలజంతుషు. 63 యదా నోపచయస్తస్య న చైవాపచయో నృప, తదాపి బాలిశో೭సి త్వం కయా యుక్త్యా త్వయేరితమ్. 64 భూపాదజంఘాకట్యూరుజఠరాదిషు సంస్థితా, శిబికేయం యదా స్కందే తదా భారస్సమస్త్వయా. 65 తథావ్యజంతుభిర్భూప శిబిశోఢా న కేవలమ్, శైలద్రుమగృహోత్ధో೭పి పృథివీసంభవో೭పి చ. 66 యథా పుంసః పృథగ్భావః ప్రాకృతైః కరణౖర్నృప, సోఢవ్యస్సమహాన్భారః కతమో నృపతే మయా. 67 యద్ద్రవ్యో శిబికా చేయం తద్ద్రవ్యో భూతసంగ్రహః భవతో మే೭ఖిలస్యాస్య సమత్వేనోపబృంహితః. 68 బ్రాహ్మణుడు పలికెను :- ఓ రాజా! నీవు ప్రత్యక్షముగా దేనిని చూచితవో చెప్పుము. బలమున్నది బలములేనిది అను విశేషణములను తరువాత చెప్పుము. నీవు పల్లకిని మోసితివి. ఇపుడు కూడా నీమీది పల్లకి యున్నది అనుమాట కూడా మిధ్యయే. నా మాటను వినుము. భూమిపై పాదములు, పాదములపై పిక్కలు, పిక్కలపై తొడలు, తొడలపై నడుము, నడుముపై వక్షస్థ్సలము, వక్షస్థ్సలముపై భుజములు బాహవులు, భుజముపై పల్లకి యున్నది. వీటిలో నాకాధారమేదియో తెలుపుము. నేను దేనికాధారమో చెప్పుము. ఏయంశము వలన ఆధారమును నిర్ణయించవలయును. పల్లకిలో నీవుగా గుర్తింపబడు దేహమున్నది. అచట నీవు ఇచట నేను అనునదంతయూ మిధ్యయే. నీవు నేను ఇతరప్రాణులు భూతములచే ధరింపబడును. ఈ ప్రాణిసముదాయమంతయూ గుణ ప్రవాహములో పడి కొట్టుకొని పోవును ఈ గుణములు కర్మవశ్యములు. అన్నిప్రాణులలోనూ అవిద్యా సంచితమగు కర్మయుండును. ఆత్మ శుద్ధము, అక్షరము (నశించనది) శాంతము, నిర్గుణము, ప్రకృతి కంటే పరము, సమస్త ప్రాణులలో నుండు ఆత్మకు వృద్ధి క్షయములు లేవు. ఆత్మకు వృద్ధి క్షయములు లేనపుడు నీవు పుష్టిగానుంటివి అని ఏ యుక్తిచే పలికితివి? భూమి, పాదములు, పిక్కలు, తొడలు, నడుము, కపుడు వక్షస్థలము భుజములు మొదలగు వాటిలో భుజము పైనున్న ఈ పల్లకి బరువు నీకూ నాకూ సమానమే. కావున పల్లకిని నేను మోయుచున్నాను ఇతరులు మోయుటలేదు అని ఎట్లు చెప్పగలవు? పర్వత వృక్షగృహములనుండి వచ్చునది, పృథివి నుండి పుట్టునది అన్నియు ప్రకృతి సంభవములు మాత్రమే. ప్రాకృతములైన ఇంద్రియముల కంటే జీవుడు వేరైనపుడు నేను నీ ఏ భారమును మోయవలయును? ఈ పల్లకి ఏర్పడిన ద్రవ్యముల చేతనే ప్రాణి సమూహము ఏర్పడినది. కావున నీకు నాకు భారము సమముగానేయున్నది. సమముగానే పెరుగును. 56 - 68 సనందన ఉవాచ :- ఏవముక్త్వా೭భవన్మౌనీ స వహన్ శిబికాం ద్విజః, సో೭పి రాజావతీర్యోర్వ్యాం తత్పాదౌ జగృహే త్వరన్, 69 సనందన మహర్షి పలికెను :- ఇట్లు బ్రాహ్మణుడు పలికి మౌనముగా పల్లకిని మోయుచుండెను. ఆరాజు బ్రాహ్మణుని మాటలను విని భూమిమీదికి దికి ఆ బ్రాహ్మణుని పాదములను పట్టుకొనెను. 69 రాజోవాచ:- భో ! భో ! విసృజ్య శిబికాం ప్రసాదం కురు మే ద్విజ ! కథ్యతాం కో భవానత్ర జాల్మరూపధరస్ధ్సితః. 70 యో భవాన్యదపత్యం వా యదాగమనకారణమ్, తత్సర్వం కథ్యతాం విద్వన్ మహ్యం శుశ్రూషవే త్వయా. 71 రాజు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! పల్లకిని విడిచి నాయందు దయచూపుడు. ఇట్లు భిక్షురూపములో నున్న మీరెవరో చెప్పడు. మీరెవరు? ఎవరి పుత్రులు? ఏ కారణమున ఇటకు వచ్చితిరి? దీనినంతటిని మిమ్ములను సేవించగోరు నాకు తెలుపుడు. 70 - 71 బ్రాహ్మణ ఉవాచ :- శ్రూయతాం కో೭హమిత్యేతద్వక్తుం భూప న శక్యతే, ఉపయోగనిమిత్తం చ సర్వత్రా గమనక్రియా. 72 సుఖదుఃఖోపభోగౌ తు తౌ దేహాద్యుపపాదకౌ, ధర్మాధర్మోద్భవౌ భోక్తుం జంతుర్దేహాదిమృచ్ఛతి. 73 సర్వసై#్యవ హి భూపాల జంతోస్సర్వత్ర కారణమ్, ధర్మాధర్మౌ యతస్తస్మాత్కారణం పృచ్ఛ్యతే కుతః. 74 బ్రాహ్మణుడు పలికెను :- ఓ రాజా! వినుము. నేనెవరో చెప్పజాలను. అంతటా ఆగమనకారణము ఉపయోగము మాత్రమే సుఖదుఃఖానుభవమే దేహాదులను ఒసంగునది. ధర్మాధర్మముల వలన కలిగిన పాపపుణ్యములననుభవించుటకే ప్రాణి దేహాదులను పొందును. అంతటా అన్ని ప్రాణుల రాకకు ధర్మాధర్మములే కారణము. కావున రాకకు కారణమెందుకడిగెదరు? రాజోవాచ:- ధర్మాధర్మౌ న సందేహస్సర్వకార్యేషు కారణమ్, ఉపభోగనిమిత్తం చ దేహాద్దేహాంతరాగమః. 75 యత్త్వేతద్భవతా ప్రోక్తం కో೭హమిత్యేతదాత్మనః వక్తుం చ శక్యతే శ్రోతుం తన్మమేచ్ఛా ప్రవర్తతే. 76 యో೭స్తి యో೭హమితి బ్రహ్మన్కథం వక్తుం న శక్యతే, ఆత్మన్యేవ న దోషాయ శబ్దో೭హమితి యో ద్విజ. 77 రాజు పలికెను :- అన్నికార్యములకు ధర్మాధర్మములే కారణమనుటలో సందేహము లేదు అనుభవించుట కొఱకే ఒక దేహము నుండి మరియొక దేహమును పొందుటయనునది కూడా నిజమే. కాని ఆత్మవిషయమున నేనెవరిని అని చెప్పజాలను అని మీరు చెప్పితిరి కదా? ఎందుకు చెప్పశక్యము కాదో వినవలయునని కోరుచున్నాను. ఎవరున్నారో ఎవరు నేనో ఎందుకు చెప్పజాలను? 'అహం'(నేను) అను శబ్దమును ఆత్మవిషయమున ఉపయోగించుట దోషము కాదు కదా? బ్రాహ్మణ ఉవాచ :- శబ్దో೭హమితి దోషాయ నాత్మన్యేవం తథైవ తత్, అనాత్మన్యాత్మవిజ్ఞానం శబ్దో వా శ్రుతిలక్షణః. 78 జిహ్వా బ్రవీత్యహమితి దంతోష్ఠతాలుకా నృప, ఏతే నాహం యతస్సర్వే వాఙ్నిష్పాదనహేతవః. 79 కిం హేతుభిర్వదత్యేష వాగేవాహమితి స్వయమ్, తథాపి వాగహమితి వక్తుమిత్థం న యుజ్యతే 80 పిండః పృథగ్యతః పుంసః శిరఃపాణ్యాదిలక్షణః, తతో೭హమితి కుత్రైనాం సంజ్ఞాం రాజన్కరోమ్యహమ్. 81 యద్యన్యో೭స్తి పరః కో೭మత్తః పార్ధివసత్తమ ! న దేహే೭హమయం చాన్యే వక్తుమేవమపీష్యతే. 82 యదా సమస్తదైహేషు పుమానేకో వ్యవస్థితః, తదా హి కో భవాన్కో೭హమిత్యేతద్విఫలం వచః. 83 త్వం రాజా శిబికా చేయం వయనం వాహాః పురస్సరాః, అయం చ భవతో లోకో న సదేతన్నృపోచ్యతే. 84 వృక్షాద్దారు తతశ్చేయం శిబికా త్వయా ధిష్ఠితా, క్వ వృక్షసంజ్ఞా వై తస్యా దారుసంజ్ఞాధవా నృప. 85 వృక్షారూఢో మహారాజో నాయం వదతి తేజనః, న చ దారుణి సర్వస్త్వాం బ్రవీతి శిబికాగతమ్. 86 శిబికా దారుసంఘాతో స్వనామస్థితిసంస్థితః, అన్విష్యతాం నృపశ్రేష్ఠానన్దదా శిబికాగతమ్. 87 ఏవం ఛత్రం శలాకాభ్యః పృథగ్భావో విమృశ్యతామ్, క్వ జాతం ఛత్రమిత్యేష న్యాయస్త్వయి తథా యయి. 88 పుమాన్త్సీగౌరావాజీకుంజరోవిహగస్తరుః, దేహేషు లోకసంజ్ఞేయం విజ్ఞేయా కర్మహేతుషు. 89 పుమాన్న దేవో న నరో న పశుర్న చ పాదపః, శరీరాకృతిభేదాస్తు భూపతే కర్మయోనయః. 90 వస్తు రాజేతి యల్లోకే యచ్చ రాజభటాత్మకమ్, తధాన్యచ్చ నృపేత్ధం తన్న సత్యం కల్పనామయమ్. 91 యస్తు కాలాంతరేణాపి నాశసంజ్ఞాముపైతి వై, పరిణామాదిసంభూతం తద్వస్తు నృప తచ్చ కిమ్. 92 త్వం రాజా సర్వలోకస్య పితుః పుత్రో రిపో రిపుః, పత్న్యాః పతిః పితా సూనోః కస్త్వం భూప వదామ్యహమ్. 93 త్వం కిమేతచ్ఛిరః కింతు శిరస్తవ తథోదరమ్, కిము పాదాదికం త్వేతన్నైవ కిం తే మహీపతే. 94 పమస్తావయవేద్యస్త్వం పృథగ్భూతో వ్యవస్థితః, కో೭హమిత్యత్ర నిపుణం భూత్వా చింతయ పార్ధివ. 95 ఏవం వ్యవ స్థితే తత్త్వే మయాహమితి భావితుమ్, పృథక్చరణనిష్పాద్యం శక్యం తు నృపతే కథమ్96 ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయ పాదే అష్టచత్వారింశోధ్యాయః బ్రాహ్మణుడు పలికెను :- నేను అను శబ్దము ఆత్మలో వాడుట తప్పుకాదు. నిజమే. కాని ఆత్మకాని దానిని ఆత్మయను కొనుట దోషము శబ్దము వినబడునది మాత్రమే. దంతములు, ఓష్ఠములు, తాలువులచే కూడిన జిహ్వ 'అహం' అని పలుకును. కావున అహం అని చెప్పబడు వారందరు వాక్కుచే వ్యవహరించుటకు మాత్రమే హేతువులు. ఈ వాక్కు ఏ హేతువులచే 'అహం' అని స్వయముగా పలుకుచున్నది? అయిననూ పలుకుచున్నది. ఇట్లు పలుకుట తగదు. తల, కాలు, చేయి మొదలగు వాటితో కూడియున్న మాంసపిండము జీవునకంటే భిన్నమేకదా! కావున 'అహం'అని ఎక్కడ వాడవలయును? నాకంటే వేరుగా ఈ శరీరము కంటే భిన్నముగా వేరొకడున్నపుడు నేను అని నేనేకాక నన్ను ఇతరులు కూడా నేను అని అనవచ్చును కదా? అన్ని శరీరములలో ఒకే జీవుడు ఉన్నపుడు నీవెవరు? నేనెవరిని? ఈ మాటలే వ్యర్థములు కదా? రాజువగు నీవు, ఇది పల్లకి, మేము ముందునడుచు పల్లకి మోయు వారము, ఇది నీ లోకము ఇదియంతయు ఉన్నది కాదు. చెట్టునుండి చెక్క, చెక్క నుండి పల్లకి, పల్లకిలో నీవు, ఇపుడు ఈ పల్లకిని వృక్షమని కాని చెక్కఅని కాని అనవచ్చునా? అట్లు అనినచో మహారాజు చెట్టునెక్కియున్నాడనవలయును. కాని ఈ నీ జనము అట్లనుట లేదే? పోనీ చెక్క మీద రాజున్నాడని అనుచున్నారా? లేదే? పల్లకిలో ఉన్నాడను చున్నారు. చెక్కల సమూహముచే ఏర్పడిన పల్లకిని పల్లకి అనుపేరుచే పిలుచుచున్నాము. ఇపుడు నీకానందము నిచ్చు పల్లకి దేనిలో ఉన్నదో వెతుకుము. ఇట్లే గొడుగు లోహపు శిలాకములచే ఏర్పడును. శిలాకముల కంటే విడిగా ఛత్రముండునా? ఛత్రము పుట్టినదెచట? ఈ న్యాయమే నీ విషయమున నా విషయమున కూడా వర్తించును. పురుషుడు, స్త్రీ, గోవు, మేక, గుఱ్ఱము, ఏనుగు, పక్షి, చెట్టు మొదలగు కర్మ హేతువులగు దేహములందు లోకము చేసిన సంజ్ఞలివి. కాని వాస్తవముగా దేవుడుకాడు. నరుడుకాడు. పశువుకాదు, వృక్షము కాదు. ఇవియన్నియు కర్మహేతువుగా గల శరీరాకృతి భేదములే. రాజు అనుట రాజభటులు అనుట అట్లే ఇతర వ్యవహారములన్నియు కల్పనామయములే. సత్యములు కావు. కొంత కాలమునకు నాశము చెందునది, పరిణామాదుల వలన కలుగునది ఇదియంతయు వస్తువు సంజ్ఞ ఏదియో చెప్పుము. నీవు ఈ లోకమునకు రాజువు. తండ్రికి పుత్రునివి, శత్రువునకు శత్రువువు భార్యకు భర్తవు, పుత్రునికి తండ్రివి, ఇపుడు నిన్ను ఎవరిని పిలువవలయును? అసలు నీవు అనగా ఏమి? నీ శిరస్సా? ఉదరమా? శిరస్సు ఉదరములు నీవి కాని నీవు కాదుగదా? తత్త్వమిట్లుండగా నేను నాచేత అని భావించుటకు కరచరణాదులచే ఏర్పడిన మాంసపిండమెట్లు యోగ్యమగును? 78 - 96 ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయ పాదమున నలుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము