సప్తమ సంపుటము - శంకరవిజయము శ్రీ కంచికామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి ఆంధ్రానువాదము 'విశాఖ' పరిశోధకులు : శతావధానులు, శ్రీ వేలూరి శివరామశాస్త్రి 'ఆంధప్రభనుండి పునర్మద్రింతం' ప్రకాశకులు : సాధన గ్రంథ మండలి, తెనాలి. కాపీరైటు వెల రు. 30/-
ఇది జగద్గురుబోధలు సప్తమ భాగం. వెనుకటి భాగాలవలె ఇదికూడా శ్రీ ''విశాఖ'' గారిచే అనువదింపబడినది. కీ.శే. బ్రహ్మశ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారిచే సంస్కరింప-బడింది. వెనుకటి భాగాలలోవలె ఇందుకూడా ఆ యా వ్యాసాలలోని శ్లోకాలకు అర్థం గ్రంథాంతమున వివరించడం జరిగింది. జగద్గరుబోధలు వెనుకటి భాగాలకంటే యీ భాగంలో ఒక విశిష్టత ఉన్నది. వెనుకటి భాగాలలో విడివిడిగా భిన్న భిన్నవిషయాలు చెప్పబడ్డాయి. ఇందులో అలాకాదు. ఇందులో ఆదిశంకరుల జీవితం ఆద్యంతం చెప్పబడింది. అలా అని ఇది, శంకరుల జీవితాన్ని గూర్చి చెప్పే శంకరవిజయాలకోవకు చెందిన గ్రంథం అనికూడా తలంచరాదు. ఏమంటే ఇది శంకర విజయాలలోని విషయాలను ప్రధానంగాచేసికొని వ్రాయబడిన గ్రంధంకాదు. జ్ఞానావతారులేన శంకరులను గూర్చి వారి ఘనతను గూర్చి శంకరవిజయాలను రచించినవారు ఎలాగూ వివరిస్తారు, ఆ వివరాలు చాలామంది ఎరిగినవే. కాని శంకరులనుగూర్చి శంకరవిజయకర్తలు కాకుండా వారికి సమకాలికులైన వారు, ఆ తరువాతి వారు ఎందరో గ్రంథకర్తలు వారిని గూర్చి పేర్కొన్నారు. వారి చరిత్రలోని అంశాలను గూర్చి తమతమ గ్రంథాలలో వెల్లడించారు. శంకరవిజయ కర్తలు శంకరులను గూర్చి చెప్పిన మాటలకంటే ఇలా ఈ గ్రంథకర్తలు తమ గ్రంథాలలో శంకరులనుగూర్చి ముచ్చటించిన విషయాలు ఎక్కువ విశ్వాసపాత్రాలు. అందుచే ఆ విషయాలనే ప్రధానంగా ఏరి యీ శంకరవిజయ గ్రంథం రచింపబడింది. అలా అని ఇది కేవలం శంకరుల జీవితకథ అని మాత్రమే తలచరాదు. శంకరుల జీవితకథా వివరణంతోబాటు ఎన్నో విషయాలు, సామాన్యులు ఎఱుగనివి, పండితులకు ముచ్చట కలించేవీ యిందు ఎక్కువగా పొందు పరుచబడ్డాయి. ఆంధప్రభలో ప్రచురించిన వ్యాసములను మా సాధన గ్రంథ మండలిలో గ్రంథరూపంగా రూపొందించుటకు తమ ఆమోద అంగీకారములను వెలిబుచ్చి అనుగ్రహించిన ఆంధప్రభ సంపాదకులుగానుండిన శ్రీ నీలంరాజు వెంకట శేషయ్యగారికిని, ప్రస్తుతము ఆంధప్రభ సంపాదకులైన శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు గారికిని మా కృతజ్ఞతలు. సహృదయులు, ఆప్తమిత్రులు, శ్రీవారిబోధలు ఆంధ్రమున అనువదించినవారును బొంబాయి వాస్తవ్యులును అగు ''విశాఖ'' (యం. వెంకటబాలసుబ్రహ్మణ్యశర్మ) గారికిని మా కృతజ్ఞతలు. ఈ వ్యాసములలోని భాషను, సంస్కృత భాగములను మిక్కిలి శ్రమకోర్చి సంస్కరించిన శతావధానులు శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారి సౌజన్యమునకు మండలి ఎంతయో ఋణపడి యున్నది. కీ.శే. వేలూరి శివరామ శాస్త్రులవారి ఆత్మశాంతికై జగన్మాతయైన శ్రీ కామాక్షిని ప్రార్ధిస్తున్నాను. తెనాలి ఇట్లు బులుసు సూర్య ప్రకాశశాస్త్రి విరోధకృత్ శ్రావణము వ్యవస్థాపకుడు ః సాధన గ్రంథ మండలి |