Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

అపరిగ్రహము

మనుజులై పుట్టినందుకు సత్యం తెలిసికోవడమే ఫలం. సత్యం తెలిసికొనక చస్తే మేను తాల్చి పుట్టినందుకు ఫలం పొందలేదన్నమాట.

కొంచెం పరిశీలిస్తే సత్యం ఈశ్వరుడే అని తేలుతుంది. సత్యవస్తువుయొక్క ఎరుక సరిగా నాటుకొంటే 'నేను, మేము' అనే మాటలు వాడుకలోనుంచి ఎగిరి చక్కాపోతయ్‌. నదులన్నీ సముద్రంలో కలిస్తే తమ తమ రూపం వదలి ఎలా సముద్రపు నీళ్ళే అయిపోతయ్యో అలాగే జీవాత్మ పరమాత్మలో కలిస్తే సత్యవస్తువే అవుతుంది. అప్పుడు 'నేను' అనే అహంకారం తొలగిపోతుంది. ఆయువున్న కాలంలో మన మీ దేహాన్ని ఆధారంగా చేసుకొని పరమాత్మ స్వరూపంలో ఐక్యం కావడానికి ప్రయత్నం చేయాలి. అపుడే మనుష్యత్వానికి ఫలం. అదే వేదాంతం. వేదాంతం కొన్ని వేళలలో మనకు అర్థం అవుతుంది. కొన్ని వేళలలోకాదు. అది మనమున్న స్థితినిబట్టి.

వేదాంతం ఆకళించుకోవడానికి, జన్మసాఫల్యం పొందడానికి తప్పకుండా చేయవలసిన పనులు కొన్ని ఉన్నై. వాటినే అష్టాంగయోగ మని అంటారు. ఈ యోగానికి ఎనిమిది అంగాలు.

యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారమూ, ధారణ, ధ్యానము, సమాధి అనేవి అష్టాంగాలు. వీనిలో మొదటి మెట్టు యమము. దానికి మళ్ళా ఐదు మెట్లు. వీనిలో మొదటి మెట్టు ఎక్కనివానికి వేదాంతం అర్థంకాదు. అట్టివానికి ఆత్మసాక్షాత్కారం బ్రహ్మసాక్షాత్కారం ఇత్యాది పాదాలను సైతం అనడానికి వీలుపడదు.

సత్యవస్తువును చూడడానికి తహతహలాడే సాధకుడు ఒకొక్క మెట్టే ప్రయత్నపూర్వకంగా ఎక్కాలి. అహింస సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనేవి యమములో అంతర్భాగాలు. గ్రహం అంటే గ్రహించడం. అపరిగ్రహం అంటే గ్రహించకుండటం, దేహధారణకు కావలసిన దానికంటె ఎక్కువ గ్రహిస్తే అది దొంగతనం. మనకు కావలసిన దానికంటె. ఎక్కువ గ్రహించ కుండుటమే అపరిగ్రహం. ఇట్టి నియమం ఉంటేనే సత్యవస్తువును చూడడానికి వీలు కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది. మంచి గుణాలను ఎతికీస్‌ ఊషఠ- అని అంటారు. కారెక్టర్‌ ఈఠశస|-షుస, మొరాలిటీ ఃుసశషో వీనిని ఇతరమతాలు కొండాడి అవే చిట్టచివర మెట్లని చెప్పినా మన శాస్త్రాలు మాత్రం వీనిని పరమాత్మ సాక్షాత్కారానికి సాధనమాత్రాలే అని చెప్పినై. కొందరకు భక్తియే కడపటి మెట్టు. కొందరకు తియాల జీయే ిఠ|ుుగా యే కడపటి మెట్టు. కొందరు కొందరు ఇట్లా ఏమేమి చెప్పినా సత్యాన్వేషణకు బ్రహ్మసాక్షాత్కారానికి అబద్ధాలాడరాదు. దొంగతనం చేయరాదు. అహంభావం పూనరాదు. ఈ మొదలయిన పెక్కు విషయాలను సాధనాలనుగా, సహాయాలనుగా గ్రహించాలని మన శాస్త్రాలు చెపుతున్నై.

మంచి గుణాలు దైవభక్తి మొదలయిన వానిని పెంపు చేయడానికి కావలసిన దోహదాలను ప్రభుత్వం చేయవచ్చు. అపుడు ప్రజల మొరాలిటీ చెడిపోయినది. ఈ కలహాలను పోలీసు బందోబస్‌త్‌ ద్వారానే అణచాలి, అనే మాట ఉండదు. దానికోసం ద్రవ్యం వెచ్చపెట్టడం ఉండదు. అన్నీ వదలి తోకపట్టుకున్నటులు 'స్వాతంత్ర్యం' అనేపదానికి అర్థమేమిటో తెలియకముందే మనం స్వాతంత్ర్యం పట్టుకొన్నాం. ప్రజాప్రభుత్వం మతసంబంధ విషయాలలో ఉత్సుకత చూపక దైవభక్తికీ రాజ్యాంగానికీ సంబంధ మేమిటి? అని తలస్తే శ్రమలూ వ్యయములూ ఎక్కువ అవుతూనే ఉంటవి.

దైవభక్తి ఆవశ్యక మని చెప్పడ మెందుకు? ప్రతివాడు ఆత్మానుభవం కలిగి జన్మ రాకుండా చేసికోవడానికే. అట్టి ఆత్మసాక్షాత్కారానికై మొదటి మెట్టు యమం. యమంలో ఒకటియే అపరిగ్రహం. మనుష్యులు తమ అక్కరకు మించి ఒక పూచిక పుల్లయినా వాడరాదు. అదే అపరిగ్రహం. అపరిగ్రహం ఆత్మసాక్షాత్కారానికి సాధనం.

ఇపుడు మనుష్యులకు అక్కఱ లేని అనే ప్రశ్న వస్తుంది. 'ఛాయా తోయం వసన మశనం' అని పెద్దలన్నారు. కడుపునకు కూడు, తాగడానికి నీరు, ఉనికికి ఒక పూరిపాక, కట్టుకోడానికి ఒక గుడ్డ. ఇవి ముఖ్యావసరాలు. ప్రాణాలు కాపాడుకోడానికి ఈ నాలుగున్నూ పరికరాలు. ఇవి అన్నీ భూమినుండి ఉత్పన్నమవుతై. నీ రిచ్చేది భూమి. ఇండ్లు కట్టుకోడానికి మన్ను సున్నం దారువు లోహం ఇత్యాదులు భూమిలోనుండి వచ్చేవే. ఇక ఆహారం, పత్తితో నేయబడిన వలువలు. ఇవన్నీ భూమినుండి వచ్చేవే. కడపట మనము కలిసేదికూడా ఆ భూమిలోనే.

సృష్టిలో మనకు దొరికే ఈ వస్తువులను పొదుపుగా వాడుకోవాలి. మానరక్షణకోసం మనం బట్టలుకట్టుకుంటాం. పత్తితో గట్టిగా నేయబడిన బట్టలతో మనకు ఆ ప్రయోజనం తీరుతుంది. ఆడంబరంగా ఉండాలని వెలగల దువ్వలువలు కట్టుకొనకపోతేయేం? అట్లా కట్టుకుంటేనేగాని ఇతరులు గౌరవంతో చూడరని దురభిప్రాయంగాక ఇందుకు వేరే కారణం ఉందా? వెలగలవానిని కట్టుకోవడంచేతనే మానరక్షణ జరుగుతుందని అనగలరా?

ఒక కుటుంబం, వెలగల వలువలకై చెసే ఖర్చుతో దాదా పయిదు కుటుంబాలకు కావలసిన సాధారణాలయిన బట్టలు దొరుకుతై. ఆడంబరంకోసం కట్టే బట్టలు పట్టుబట్టలే అయివుంటే అవి మనకు పాపాన్నే పోగుచేసి పెడతై. వీని కోసం ఎన్ని జీవాలనో హింసించవలసి వస్తున్నది. అహింస అహింస అని చెపుతూ మనం మాంసం ముట్టం. కాని మాంసాహారానికయితే ఏ ఒక జీవానికో హింస. పట్టుబట్టకు ఒకటింటికి లక్షలాది జీవాలను చంపాలి. మనము కట్టుకొనే బట్టలు సాధ్యమయినంతవరకు హింసచేయకుండా ఉండే ఉపాయాలవల్ల ఉత్పత్తి అయేవిగా చూచుకోవాలి. మనము కట్టె బట్టలు సాధారణు లందరూ కట్టుకొనేటటువంటివిగానూ గట్టివిగానూ ఉండాలి.

ప్రజలందరూ సుఖంగా బతకటానికి ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టాలు చేస్తుంది. కాని లేమికిమాత్రం దినదినాభివృద్ధి ప్రజల ఆర్థికజీవనం ఎంతో పెరిగిందని మురిసిపోతారు: దానికి గుర్తు ఏమిటయ్యా అంటే ఇదివరకు రెండుసార్లు కాఫీ తాగేవారిప్పుడు నాలుగు సారులు కాఫీ తాగడం. గుడిసెలలో ఉండేవారు మేడలలో ఉండడం. రెండు బట్టలతో కాలం గడిపేవారు ఇరవై బట్టలు సేకరించి ఉంచుకోడం. ఆర్థికజీవ నాభివృద్ధికి ఇవి గుర్తు లని అనుకోవడం సరికాదు. మనకు కావలసినవస్తువు లన్నిటినీ ఇలా పెంచుకుంటూనేపోతే దేశంలో ఎపుడూ లేబరమే తాండవిస్తూవుంటుంది. మానప్రాణాలు కాపాడుకోవడాని కేవి తప్పనిసరో అట్టివి అందరకూ అందుబాటులో ఉండాలి. అందులకే దిట్టమయిన చట్టాలుండాలి. ఆలాటి స్థితి కలగాలి, అది సవ్యమయినది. అని అనుకుంటే పరమదరిద్రులు తమ జీవితం ఎల్లా గడుపుకొంటారో అలాగే వసతి వాడలున్న శ్రీమంతులు కూడా గడుపుకోడానికి ప్రయత్నించాలి. దరిద్రులు గుడిసెలలో ఉంటే శ్రీమంతులు కూడా గుడిసెలలో ఉండాలి. పొద్దున్నే అతడు గంజి తాగితే ఇతడున్నూ వెసులుబాటు ఉన్నదని కోరికలు పెంచుకోక గంజి తాగాలి. దానినే అపరిగ్రహమని అంటారు. అపరిగ్రహంలేని దోషం ఉండేటంతవరకూ ఈశ్వరానుగ్రహం కలగదు. జన్మ సాఫల్యంకోరేవారు తమతమ అవసరాలు మించి ఒకింతయినా పరిగ్రహం చేయరాదు. కలిగినవారు లేనివారికి సాయంచేయడమే పుణ్యం. అదే వారికి మోక్షప్రదం. ఈసంగతి తెలియక ఇంత ఉన్నవారు తమకు నచ్చిన పట్టుబట్టలు కట్టుకొని తిరిగితే వీరినిచూచి లేనివారుగూడా వారివలె తిరగడానికి ప్రయత్నిస్తారు, అట్లా వారిని అనుకరించి అప్పులపాలవుతారు. పట్టుపుట్టాలవారు. చెడిన తరగతిలోనివారే. ఇక వజ్రాల నగలవారున్నారు. ఇందులకై చేసే వ్యయమంతా పచ్చి దుబారా. కన్యాం 'కనకసంపన్నాం' అని కన్యాదానం చేసేటప్పుడు స్వర్ణం ఇవ్వడం వాడుక. బంగారంకోసం డబ్బువెచ్చపెట్టి నగగా పెట్టుకొన్నా ఏనాటికయినా అది ఉపయోగపడుతుంది. కాని వజ్రాలకు ఇట్టి ప్రయోజనంలేదు. సరికదా ఉపద్రవం కావలసినంత. ఏబది, నూఱండ్లక్రితం మనపూర్వులు కాఫీ ఎరగరు. వారి కాపురం గుడిసెలలోనే చెవులకు తాటికమ్మలే. తాగేది రాగిగంజో బియ్యపుగంజో. బ్రతుకుతెరువులో ధనికులకూ దరిద్రులకూ పెద్ద భేదమేమీ ఉండేదికాదు.

'ఇకమీద కాఫీతాగను, పట్టుబట్టలు కట్టను' అని సంకల్పం చేస్తే దానివల్ల మిగిలేధనంతో అయిదు కుటుంబాలు సుఖంగా బ్రతుకుతై. జీవిత సదుపాయానికి మనం ఎక్కువ వస్తువులను సేకరించినకొద్దీ శాంతీ ఉండదు. సౌఖ్యమా ఉండదు. ఇట్టి దుబారావల్ల మళ్ళా దారిద్ర్యం తప్పదు, దుఃఖంతప్పదు. కాఫీనీ పట్టుబట్టలనూ వదలిపెడితే అన్ని కుటుంబాలూ బాగుపడతై. ఇదేకాదు, పట్టుబట్టలకోసం చేసేపాపం ఉండదు. అది లేకుంటే మోక్షానికి శ్రమయే లేక పోతుంది. అష్టాంగయోగంలో మొదటిదే అపరిగ్రహం, అహించ అనేవి. ఏ ప్రాణికిన్నీ మనవల్ల హింసకలుగరాదు. డబ్బు ఉందికదా అని అనవసరమైన వస్తువులకు దుబారా చేయరాదు. అట్లాచేసే వ్యయంతో లేమితో కొట్టుకోనే వారి అవసరాలు తీర్చవచ్చు, అలాచేస్తేనే, చేయడానికి ఉంకిస్తేనే తొందరగా బ్రహ్మసాక్షాత్కారానికి దాపుతోవ దొరుకుతుంది. అష్టాంగయోగానికి మొదటిసోపానం అది దానిని ఎక్కక పై సోపానానికి పోవడం అసంభవం అని విశదీకరించడానికే దీనిని చెప్పడం.


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page