Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

భక్తి - కర్మ

ఈశ్వరానుగ్రహం కలుగవలె నంటే మనము చేసే ప్రతిపనినీ ఈశ్వరార్పణం చేయాలి. మనం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే వుంటాము. అది సహజము. ఒక క్షణం కూడా మనము ఊరకే ఉండలేము. దేహముతో పనులు చేయడమేకాదు, మనస్సు ఏదో ఒక ఆలోచన చేస్తూనే వుంటుంది. శరీరాన్ని కూడా ఈశ్వరార్పణం చేయవలెననే ఉద్దేశ్యంతోనే దేహాన్నికూడా యీడ్చుకుంటూ దేవళానికి పోవడమూ, దేవుణ్ణి అర్చిండంమూను. వేదవిహితములైన కర్మలుచేయడంగూడా ఈశ్వరార్పణం చేయడమే. ఇట్లే ''మనస్సు చేసే కర్మలు కూడా ఈశ్వరార్పణం చేయవలెననే యెన్నికతోనే ఆయనను సదా ధ్యానించు'' అని పెద్దలు చెప్పడం, 'ఏది చేసినా సరే దానిని భగవదర్పితం అని మనఃపూర్వకంగా అర్పణచేస్తే దాన్ని నేనుఅంగీకరిస్తానని' గీతలో భగవద్వాక్యం.

యత్కరోషి య దశ్నాసి యజ్జుహోషిదదాసి యత్‌,
యత్తపస్యసి కౌంతేయ! తత్‌ కురుష్వ మదర్పణమ్‌.

దేవుడు మనకు శరీరం ఇచ్చాడు. ఆకలివేస్తే దానితో అన్నం తింటాం. ఎండవానలనుండి కాపాడుకోవటానికి నీడ కావాలి. జంతువులకువలెకాక మనకు మానం అనేది ఒకటి ఉన్నది. కదా! అట్టి మానం కాపాడుకోవడంకోసం వస్త్రం కావాలి. అన్నమూ, వస్త్రమూ, ఇల్లూ ఈమూడూ ఒకత్రిపుటి. దీనిని సంపాదించుకోవడంకోసం ఒక ఉద్యోగం, ముందటిమూడూ అక్కరలేకపోతే మానవుడు పని యేమీ చేయవలసిన అవసరం వుండదు.

ఈమూటినీ వదలిపెట్టిన మనుజుడు పని యేమీ చేయకుండా వున్నాడని తెలుస్తున్నది. ఇప్పుడు కూడా అటువంటి జ్ఞానులు ఒకరిద్దరు వుండవచ్చు. కాని అది మనకు తెలియదు. ఒక పని చేయడం గాని దానివల్ల కలుగ వలసిన ఫలితం గాని వారి కేమీలేదు. ఏదైనా ఒక పని చేశాడంటే అతడు జ్ఞాని కాడు అని అర్థం.

అన్నం కోసం, ఇంటి కోసం, బట్టకోసం, మనం సతతం యత్నించి సతతమై పోతూ ఉంటాం.సదా దుఃఖరహితులమై ఆనందంగా వుండాలంటే మనము చేసే ప్రతిపనీ ఈశ్వరార్పణం చేయాలి.ఈశ్వరానుగ్రహమే దొరికితే ఇక పనితో పనిలేదు. ఆనందంగా వుండవచ్చు. ఈశ్వరానుగ్రహం దొరకనంతవరకూ ఈ మూడూ కావాలంటే కావాలి. తల వెంట్రుకలన్ని పనులు బరువు నెత్తిమీది నుండి జారిపోదు. పనులను చక్కగానూ చిత్తశుద్ధితోనూ ధర్మానుసారముగానూ చేయవలె నంటే ఈశ్వరునియెడల భక్తి తప్పదు. అందుచేత భక్తినిమాత్రం అవలంబిస్తామంటే ప్రయోజనంలేదు.పనిచేయటం అవసరమే.

ఒక ఆసామి దగ్గర ఇద్దరు సేవకులు వున్నారని అనుకుందాం. వారిలో ఒకడు ఆ ఆసామిని యెప్పుడూ ముఖస్తుతి చేస్తూ ఉంటాడు. మరియొకడు ఆసామికి ప్రేమ లేకపోయినా తానుమాత్రం ఆ ఆసామిని ప్రేమిస్తూంటాడు. ఆసామి మూర్ఖుడైతే తన్నెప్పుడూ స్తోత్రం చేసే సేవకుని ప్రేమిస్తుంటాడు. అతడు బుద్ధిమంతుడైతే ఎప్పుడూ పని చేసే వానిని గాని స్తోత్రము చేసే వానిని గాని ప్రేమించడు. 'ఇది ఆసామి పని ఇది తన పని' అని భేదబుద్ధి లేకుండా భక్తితో 'ఇది అంతా ఈశ్వరుని పని' అని కొరత యేమీ లేకుండా ఏ పని బడితే ఆ పని ప్రీతితో చేసే వానియందు ఆ ఆసామి ఎక్కువ వాత్సల్యం వుంచుతాడు. ఈశ్వరుడు కూడా అట్టి ఆసామే. సర్వజ్ఞుడైన అట్టి ఆసామిని స్తోత్రం మాత్రంచేసి తనివి నొందింప లేము. అతని ఆజ్ఞ శిరసావహింపక ఊరకే స్తోత్రం చేసినంత మాత్రాన అతడు సంతోషించి అనుగ్రహించడు. ఆయనకు కావలసిందేదీ లేదు. దానివల్ల ఆయనకుగౌరవమూలేదు అగౌరవమూలేదు. అట్లాగే మన కర్మల వల్ల గూడా ఆయనకు కావలసిన దేదీ లేదు. విహితమైన కర్మాచరణం మన చిత్త శుద్ధి కోసమే.

స్నానం, సంధ్యా, జపము, హోమము, దేవపూజ అనేవి నిత్యకర్మలు. ఈ ఆరింటినీ, తప్పకుండా చేయాలని పెద్దలు చెపుతారు. ఈ ఆరింటిలోనే అన్నీ అడగి వున్నవి. ఈ కర్మల చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది- ''షట్‌ కర్మాణి దినే దినే.'' స్నానం యెలా చేయాలో శాస్త్రంలో చెప్పబడి వుంది. అలా చేస్తేనే ఆత్మశుద్ధి. సబ్బుతో ఒళ్ళుతోముకుంటే దేహం మాత్రం శుద్ధమవుతుంది. స్నానసమయంలో చెప్పవలసిన మంత్రాలుకొన్నిఉన్నవి. మంత్రమనేమాట తెలియకపోయినా రామా! కృష్ణా! అని స్మరిస్తూనైనా స్నానంచేయాలి.


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page