Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

భక్తి

అంకోలం నిజబీజసంతతి.........

మనసుకు తెలియకుండానే పరమేశ్వరునితో ఐక్యం కావాలి. ఒక్క క్షణమయినా మరపు ఓర్వలేనంత వ్యాకులత కలగాలి. దేవుని మరచితిమా మనకు శాంతి లేదనే గట్టి సంకల్పం ఉండాలి. సూదంటూరాతిని అంటిపెట్టుకొన్న సూదిలాగా భర్తమీదనే చూపెట్టుకొని ఉన్న పతివ్రతలాగా సముద్రంతో కలయవలెననే ఉత్సాహంతో తొణికిసలాడే ఏరులాగా మన చిత్తం ఎటూ భ్రమించక యీశ్వరునిలో లగ్నం కావాలి. ఆయన మనకు సర్వకాల బాంధవుడు. ఆయనదయతో మెత్తనయిన హృదయంకలవాడు. మన అపచారాలన్నీ సైరిస్తాడు. ఈశ్వరానుగ్రహంతప్ప వేరొక వస్తువుతో పనిలేదనే ఉద్దేశం ఉదయిస్తే మనకు తెలియకుండానే భక్తి పుటుతుంది.

భగవంతుని తలపోయడాని కేదేనా కారణం ఉంటే అది భక్తికాదు. అది ఒకవస్తువిచ్చి మరియొకవస్తువు పుచ్చుకోవడంవంటిది. నీవునాకు సంపదఇస్తే నేనునీకు భక్తి ప్రపత్తులుచేస్తా. అనడం బేరమాడడం. అలాక్కాక ఏ చింతాలేక ఈశ్వరసాయుజ్యమే లక్ష్యం అనే చిత్తవృత్తిఉంటే అది భక్తి. దీనినే శంకరభగవత్పాదులు. శివానందలహరిలో ఇట్లా వివరించారు.

అంకోలం నిజబీజసంతతి

రయస్కాంతోపలం సూచికా

సాథ్వీ నైజవిభుం లతా క్షితిరుహం

సింధు స్సరిధ్వల్లభమ్‌,

ప్రాప్నో తీహ యథా తథా పశుపతేః

పాదారవిందద్వయమ్‌

చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా

సాభక్తి రిత్యుచ్యతే

ఊడుగువిత్తు చెట్టునుండిరాలినా మళ్ళా మెలమెలగా చెట్టు వంకకేప్రాకి చెరడును అంటిపెట్టుకొని ఐక్యం అవుతుంది అంటారు. ఊడుగుగింజ చెట్టుకు పుట్టి రాలి మళ్ళా ఎలా చెట్టునే చేరుతుందో ఆలాగే పరమాత్మనుండి విడివడ్డ జీవాత్మ మళ్ళా పరమాత్మలోనే కలిసిపోయేటటులు చేసేది భక్తి. ఇంకో దృష్టాంతం. నిప్పులోంచి మిణుగురులెన్నో పుట్టి ఆ నిప్పులోనే లయ మవుతై - 'యథా సుదీప్తాః పావకా ద్విస్ఫులింగాః' సముద్రంలో పెద్ద అల ఒకటి కొండయెత్తున లేస్తుంది. దానిలో నురుగు పుటుతుంది. నురుగుతో ఆ అల గుభిల్లుమని పడి సముద్రంలోనే కలిసిపోతుంది. ఒక గాలి వీవగానే ఒక అల పుట్టి అలలో పుట్టిన నురుగుతో సముద్రంలో కలిసిపోయిన జాడగా పరమాత్మనుండి పుట్టిన జీవాత్మ ఆచార్యుల సత్కటాక్షమనే గాలితో పరమాత్మ స్వరూపైక్యం పొందుతుంది.

నదుల దృష్టాంతంకూడా ఇంతే. నదు లెక్కడనుండి వచ్చెయ్‌? కావేరి గోదావరి అనే వాడుక ఉన్నా కావేరిలోనూ నీరే గోదావరిలోనూ నీరే. సృష్టి మొదట లోకంలో ఎంత నీరుందో దానిలో బిందుమాత్రమయినా తగ్గక అంతే నీరు ఇపుడున్నూ ఉంది. కాని మనం వేసివిలో నీరు లేదని అంటాం. ఆస్తిపాస్తులు లెక్కకట్టేటపుడు ఆ బాంకీలో ఇంత రొక్కం ఉన్నది, ఈ బ్యాంకీలో ఇంత రొక్కం ఉన్నది, తక్కినది కంపెనీ షేర్లుగా ఉన్నది అని అంచనా వేస్తాం. అదే రీతిగా నీరుకూడా, సముద్రాలలోనో మబ్బులలోనో నదులలోనో చెరువులలోనో మంచుగానో ఏందో ఏదోవిధంగా ఉంటుంది. దాని మొత్తానికి తేడా రాదు. ఉండేదంతా నామరూపాలలో భేదమే. శోణ మంటే ఎరుపు. కృష్ణ అంటే నలుపు. గంగ అంటే తెలుపు. ఇట్లా ఆయాయా దేశాల మట్టిరంగులనుబట్టి నదులకు నామరూపాలు ఏర్పడుతై.

'రసాంతరా ణ్యకరసం యథా దివ్యం వయో7శ్నుతే'

ఒకేసముద్రపునీళ్ళు పెక్కు పేర్లతోఉన్న ఏళ్ళగామారి మళ్లా సముద్రంలోకి కలిసి సముద్రమే అయిపోతున్నై. జీవాత్మ పరమాత్మైక్యంగూడా ఈలాగే.

అంగ్లంలో ూశష|స ౌnd ష' |ు| అని అంటారు. దీని కర్థం ఏమిటి? సముద్రంలోని నీళ్లు మబ్బులుగా పరిణామం చెంది వం్షిస్తవి. దాదాపు పదిహేనువేలఅడుగుల యెత్తున గంగపుట్టుక. అంత ఎత్తునుండి భాగీరథి మహావేగంతో ఘోష పెట్టుకుంటూ కిందికిదిగి వస్తుంది. తన పట్నంలోకి దిగితేనేగాని ఆమె ఉద్ధతిఅడగి శాంతికలుగదు. శాంతికలగాలంటే 'లెవల్‌'కు రావాలి. 'లెవెల్‌' కు మించితే శాంతిలేదు. శబ్ద మాత్రమే దడబడలే. అలసటలే. అటులే పరమాత్మనుండి విడివడిన జీవుడు మళ్లా పరమాత్మలో ఐత్యం అయేటంతవరకు ఈ ఉద్ధతి. వేగమూ అశాంతీ అలసట ఈ మొదలయినవి తప్పవు.

'అంకోలం నిజబీజసంతతి' అనేశ్లోకంలో చెప్పినఊడుగు విత్తనాల దృష్టాంతంకూడా ఇదే మాదిరి మట్టిలోనుంచి చెట్టు పుటుతుంది. మళ్లా మట్టిలోనే కలుస్తుంది. ఆచార్యుల వారీ శ్లోకంలో ఐదు దృష్టాంతాలు చెప్పారు. భక్తి అంటే భక్తుని హృదయం వేరే ఇంకో ప్రయోజనం కోరక సదా పరమాత్మ స్వరూప సాయుజ్యం కోసమే నిరీక్షించడం. దాని కేదయినా కారణం ఉంటే భక్తికాదు. ఈశ్వరునిమీద అవ్యాజమయిన అనురాగం తనంతట తానుపుట్టుకొనిరావాలి. సకారణంగా వచ్చేది ప్రేమకాదు. అదేభక్తి. సర్వమూ పరమాత్మ స్వరూపమే. పరమాత్మతో యోగం లేనంతవరకూ శాంతికీ ఆనందానికీకరవే. సదాశివబ్రహ్మేంద్రులు మానసిక పూజచేస్తూ- 'ఈశ్వరా! నిన్ను పూజించడానికి కూచున్నాను. కాని నీకు ఉపచారం చేయడానికి బదులు అపచారం చేస్తున్నాను. నీ కెట్లా పూజ చేయడం? అది వీలయిన పనా? నీఆరాధన చేయ డమెట్లా? నీవు ఒక దిక్కున ఒకచోటనే ఉంటే కదా నీవు ఇక్కడనే ఉన్నా వని నమస్కారం చేయడం? నీవు వెనుకా ముంగలా ప్రక్కలా పైనా కిందా ఎల్లయెడలా సర్వాంతర్యామివై ఉన్నావు. నేను నీపాదాలను ఎక్కడ ఉన్నవని చూచినమస్కరించను? పోనీ! ఎక్కడనో నీ పాదాలున్నవని నమస్కరిస్తే ఆ పాదాల వెనుక నీవులేవు అని కదా అర్థం. అలా అయితే నీపూర్ణత్వానికి భంగం చేసిన చందంగా నిన్ను అర్థం చేసికొన్నవాడనే కదా! నీ చరణములను కడుగుటకు పంచపాత్రనుండి ఒక ఉద్ధరిణలో నీళ్ళు కింద పోస్తామా. నీవు ముల్లోకాలనూ మూడడుగులతో కొలచిన త్రివిక్రముడవి కదా! నీ పాదాలను అణుమాత్రమయినా ఈనీళ్ళు తడపగలవా? పాదాలను పూర్తిగా కడగక వదలుట అపచారం కాదా ప్రభూ?

'భూః పాదౌ యస్య నాభిః'. దిగంబరుడవయిన నిన్ను ఈ చిన్న వస్త్రముతో అలంకరింపగలనా? నే నేమి పూజ చేయను తండ్రీ! నే నేమని ప్రార్థంపను? నీ మనోవృత్తులన్నీ నీవు చదివిన పుటలు. నీవు సర్వజ్ఞుడవు. ప్రార్థన అంటూ చేసి నీసర్వజ్ఞత కొక అజ్ఞానం తెచ్చి అంటగట్టనా? అయినా నీవద్దలేని ఏదో ఒక వస్తువును నే నడుగలేదు. కొత్త వస్తువును ఏదే నొకదానిని నే నడిగితే నీవు దాతవు నేను ప్రతిగ్రహీతను అయిపోతాం. నీవు అఖండానందస్వరూపడ వని శ్రుతులు చెపుతున్నవి. నేనో ఇలా కోరికలతో కొరతలతో ఉన్నాను. ఈ స్థితిని మాన్పి నా స్వరూపం నా కియ్‌. నన్నే నా కియ్‌.' అని చెప్పారు.

'నన్నే నా కియ్‌.' అంటే ఏమిటి అర్థం? నా స్వరూపమే నీవు, నిన్నే నా కియ్‌' అని

యాచే నా7భిసవం తే

చంద్రకలోత్తంస! కించి దపి వస్తు,

మహ్యం దేహి చ భగవన్‌

మదీయ మేవ స్వరూప మానందమ్‌.

ఇట్లా మన స్వరూపాన్నే మనం వదలి ఉన్నపుడు క్షణం కూడా సహించరాని తాపం తలగాలి, 'పరమాత్మ స్వరూపంతో మనమే క్షణం ఐక్యం అవుతాం' అనే చింతతాపమూ ఇవి కలగాలి. మనం మనంగా ఉండాలంటే పరమాత్మతో కలిసి ఉండడమే. అదే ఆనందస్వరూపం. పరమయిన పరమాత్మ స్వరూపం. తక్కినవన్నీ దేహాత్మ స్వరూపాలు భ్రాంతిజనితాలు. ఆ సత్యవస్తువుతో ఐక్యమై ఉండడమే పరమయిన ఆ ఆత్మస్వరూపం. అలలవలె, నురుగువలె వేరొకటి వచ్చి కలిస్తే సహించరాని, తాళుకోలేని ప్రేమ మనకు పుట్టుకోరావాలి. 'ఆ సత్యవస్తు దర్శనం ఎన్నడు? దానితో యోగం ఎన్నడు? అనే చింత సదా ఏర్పడాలి. అదే భక్తి.


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page