శ్రీదక్షిణామూర్తి
'గురోస్తుమౌనవ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః' దక్షిణామూర్తి స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శనంచేస్తున్న సమయంలో మహం్షులు చెప్పిన శ్లోకం ఒకటిఉన్నది,-
చిత్రం వటతరో ర్మూలే వృద్ధా శ్శిష్యా గురు ర్యువా,
గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః.
తరతరాలనుండీ ఈశ్లోకం వస్తూంది.
గురువు మఱ్ఱిచెట్టుమొదట చిన్ముద్రతో మౌనియై శిష్యపరివేష్టితుడై కూర్చుంటాడు. ప్రతి శివాలయంలోనూ దక్షిణాభిముఖంగా అమర్చిన యీ దక్షిణామూర్తి గురువిగ్రహం దక్షిణదిశ ఉన్న గోడలమీద మనకు కనబడుతూ వుంటుంది. అన్ని మూర్తులకంటె శాంతమూర్తి యితడు భైరవుడు బలే ఉగ్రమూర్తి. సోమస్కందుడు కరుణాపూర్ణుడు.
ఈశ్వరుడు జడలువిప్పి తాండవం చేసేటపుడు అవి అన్నీ తాండవవేగంచేత ఒకచుట్ట చుట్టుకొని అటులే సూటిగా నిక్కపొడిచికొని ఒకప్రక్కకు అభిముఖాలై ఉంటవి. ఆనర్తంన యొక్క ఔద్ధత్యం ఎంతదో నటరాజవిగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది. కాని మఱ్ఱమ్రానిక్రింద కూచున్న దక్షిణామూర్తి జడలన్నీ కిందికి వేలాడుతూ జటామండలంగా ఉంటై.
ఆ జటామండలమధ్యంలో ఒక చంద్రకళ. అదియే జ్ఞానకళ. జ్ఞానంనానాటికివృద్ధిచెందే వస్తువు. దానికి చిహ్నమో అనేటటులు ఈ మూర్తి తదియనాటి చంద్రుని శిరసున పెట్టుకొని ఉండును. చంద్రవతంసుడై శాంతమూర్తియై వెలయు శ్రీదక్షిణామూర్తి స్వరూపదర్శన మాత్రాన మనకు ఎక్కడలేని శాంతీ తానుగాఅమరి ఊరుకుంటుంది. కోపిష్ఠిని గనుక చూస్తే మనకూ కోపంవస్తుంది. దురాలోచనలను చేసే వాళ్ళతో చేరితే మనకున్నూ దురాలోచనలు కలుగుతవి. మన మనోభావాలు ఎంతవిపరీతంగా ఉన్నాసరే దేవాలయానికి వెళ్లి దక్షిణామూర్తిని చూచీచూడగానే వారు - 'మనోవేగం మాని కాసేపు శాంతంగా కూచుని మరీవెళ్ళు' అని చెప్పక చెప్పినట్లు తోస్తుంది. అక్కడ ప్రశ్నకుగాని ప్రతివచనమునకుగాని అవసరం ఉండదు. మాటా మంతీ లేక మౌనంగా కాష్ఠమౌనంగా శాంతంగా మనమున్నూ చతికిలబడవలసిందే.
దక్షిణామూర్తి శిల్పం పరిశీలిస్తే శల్యావశిష్టులయిన నలుగురు ఋషులు సాధారణంగా ఎప్పుడూ ఉంటారు. కాంచీ మండలంలోమాత్రం సప్తం్షులు ఉన్నారు. ఎన్నియుగాలనుంచీ తపస్సు చేస్తున్నారోగాని వారి శరీరంలో ఎముకలేకాని మరేవీ కనిపించవు.
కృతయుగంలో ఎముకలు మాత్రంఉన్నా ఆయుస్సు ఉంటుందని చెబుతారు. వారు అస్థిగతప్రాణులు. అటు తరువాత యుగం అనగా త్రేతలోవారు మాంసగతప్రాణులు. మాంస మున్నంతవరకూ వారికి ప్రాణ ముంటుంది. ద్వాపరయుగంలో రుధిరగతప్రాణులు. వారికి రుధిరమున్నంతవరకు ప్రాణం ఉంటుంది. ఈ యుగంలో అన్నగతప్రాణులు. ఇప్పటివారికి అన్న మున్నంతవరకే ఆయువు.
కృతయుగంలో ఎముకలు మిగిలేటంతవరకూ తపస్సు చేసేవారు. ఆ కాలంలో 'భృగువు' అనే ఆయన తండ్రి 'వరుణుడ'నే ఆయనకడకు వెళ్ళి-'పూర్ణమయిన వస్తువేదో దానిని ఎట్లా పొందాలో' అనిన్నీ బ్రహ్మమనేదే పరిపూర్ణ వస్తువయితే అది ఎల్లకాలమూ ఎల్ల చోటులాలోపం లేకుండా ఉండాలి. అట్టి పూర్ణవస్తువును నాకు మీరు చూపండి' అనిన్నీ అడిగాడు.
'నీవు వెళ్లి తపస్సుచెయ్. నీ యంతట నీకే తెసుస్తుంది అని వరుణు డన్నాడు.
భృగువు తపస్సుకు కూచున్నాడు. తపస్సు చేయగా అతనికి ఈ శరీరమే చాలా దొడ్డది, ఎంచేతనంటే అన్నింటినీ తెలిసికొనేదిది. ఇది జ్ఞాత. జ్ఞాయముకంటె జ్ఞానశ్రేష్ఠము, అనగా తెలియబడే దానికంటె తెలిసికొనేది శ్రేష్ఠము, అని అతనికి తొలుత తోచిందట. ఆపళంగా అతడు తండ్రికడకు వెళ్ళి అన్నిటికంటే గొప్పదయిన వస్తువును నేను తెలిసికొన్నాను. అది యీ శరీరమే అని తన తపః ఫలమును చెప్పాడు.
ఇది విని వరుణుడు 'ఇంకా కొంతకాలం తపస్సు చేసి చూడు' అని కట్టడి చేశారు.
ఇట్లా భృగువు కొంతకాలం తపస్సు చేయడమూ కొంత గ్రహించడమూ తాను గ్రహించినదేమో తండ్రికి చెప్పడమూ మళ్ళా కొంత కాలం తపోనియతీ ఇట్లా అయిదుసారులు జరిగింది. కడపటిసారి మాత్రం భృగువు-మీరు చెప్పిన చందంగా ఇంతకాలం తపస్సు చేశాను కాని ఇప్పుడేదో హృదయంలో ఒకానొక ఆనందంస్ఫురిస్తూంది. ఇది యేమిటి? అని తండ్రినడిగాడు.
'నీకొక ఆనందం స్ఫురిస్తున్నదని అనుచుంటివే అదే ఆ ఆనందమే పూర్ణవస్తువు. నీకు ఇపుబపుడు అలతి అలతిగా స్ఫురిస్తున్నది. క్రమక్రమముగా అభ్యాసంకొలది నడుమనడుమ తెగిపోకుండా సార్వకాలదేశికముగా ఉండిపోతుంది' అని తండ్రి చెప్పాడు. ఇదొక కథ.
ఆ పూర్ణానందసముద్రంలో ఒక తుంపర ఎపుడో ఒకపుడు మనకు అందుంది. దట్టమయిన నీడలు నిండి తీగలచే పూలచే పండ్లచేనిండిన ఒక చెట్టుక్రింద కూచున్నప్పుడు గాలివేస్తే ఆకులు కదలుతవి. వాని సందులనుండి మిల మిలలాడుతూ సూర్యకిరణాలు ప్రవేశించి నీడలను పారదోలిన పిమ్మట మళ్లా ఆకులు తమతమ చోటులకు చేరంగానే ఆ కిరణాలు మళ్లా మాయమైపోతవి. అలాగే మనకు అపుడపుడు సత్త్వం వృద్ధిచెందినపుడు ఆనందం కొంతకొంత గోచరిస్తుంది. కాని నిరవధికానందం మనకు చిక్కదు. చెడ్డకర్మలు చెడ్డబుద్ధులు ఆ ఆనందాన్ని దరికి చేరనీయవు. సత్కర్మల సంఖ్య పెరగగా పెరగగా ఆనందసముద్రము కెరటాలు ద్విగుణితోత్సాహంతో దరిదాపులకు వస్తయ్. ఆనందలహరుల తెరగే తెలియని మనం, ఈ తుంపరలకే ఆశ్చర్యపడి 'ఆహా ఎంత ఆనందం! ఎంత ఆశ్చర్యం!' అని ఉవిళ్లూరుతాం. తపస్సు చేస్తూచేస్తూ తత్త్వవిచారం చేస్తూవుంటే అప్పసమూ ఆనందమయులమై ఆ ఆనందజలధిలోని తరంగాలలో కలసిపోతామని అనుభవజ్ఞులు చెపుతున్నారు.
ఇట్లా వేల యేండ్ల తపస్సుచేసి ఎముకల గూడులుగా మారిన ఋషులు ఏ శాంత, ఆనంద స్వరూపుని సన్నిధిలో సమావిష్టు లయినారు? సాక్షాదీశ్వరుడే దక్షిణామూర్తియై మఱ్ఱిచెట్టు కింద కూచుని జ్ఞానప్రదానం చేస్తుంటే ఋషులు తమ తపస్సుకు ఫలంగా ఆ ఆనందస్వరూపుని సమక్షంలో వచ్చి కూర్చుకున్నారు.
'ఆహా ఏమి శాంతి! ఏమి ఆనందము!' అని అటులే వారును శ్రీ దక్షిణామూర్తి ముందు శాంత స్వరూపులై ఆనందమయులై కూచున్నారు.
పొంగిపొరలెత్తే ఆనందానికి చిహ్నం నటరాజు తాండవం. పొంగిపోయే ప్రతి వస్తువూ ఎపుడో ఒకప్పుడు అడగిపోవలసిందేకదా! కట్టెలు మండిమండి కాలికాలి నుసినుసియై యేర్పడిన బూడిదను మళ్ళా నిప్పులో వేస్తే ఏ మవుతుంది? బూడిదగానే ఉంటుంది. అలాగే నటరాజులో పొంగే ఆనందం అడగిపోవచ్చు. శ్రీవన్నృసింహస్వామిలో పొంగే కోపం అడగవచ్చు. కాని దక్షిణామూర్తి శాంతి అడగిన శాంతి. వారి ఆనందం అణగిన ఆనందం అటుపిమ్మట దానికిపైని ఏమీ లేదు. అన్నీ ఎచట అంతమయిపోతాయో అదే శాంతి. అట్టి అపారమూర్తిని దర్శనం చేస్తేచాలు. పొంగే ఎలాంగి హృదయమయినా శాంతమయిపోతుంది.
'చిత్రం వటతరో ర్మూలే వృద్ధా శ్శిష్యా గురు ర్యువా'
ఈ మఱ్ఱికింద ఎంత చిత్రం. సాధారణంగా గురువులు అనుభవం కలవారుగానూ ముదుసండ్రుగానూ శిష్యులు కుఱ్ఱలుగానూ ఉండటం వాడుక. కాని ఇది ఇచట తలక్రిందు. గురువోప్రాయంలో ఉన్న పదారు పదేడేండ్లవాడు. శిష్యులో ముదుసండ్రలో మూడుకాళ్ళ ముదుసండ్రు. చిత్రమిది ఒకటేకాదు. గురువు శిష్యులకు పాఠాలు చెప్పేటపుడు ఒకొక తత్త్వాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మారుమూలలు శోధించి భేదించి బోధిస్తేకదా విద్య అలవడుతుంది. అని అంటే 'గురుస్తు మౌనవ్యాఖ్యానం' గురువులు మౌనముతోనే వక్కాణిస్తున్నారు. వారి ఉపన్యాసం మౌనమే. ఉత్తరదేశంలో వ్యాఖ్యాన మంటే ఉపన్యాసం, లెక్చర్ అని అర్థం.
ఒకే సంస్కృత పదానికి ఒకొక దేశంలో ప్రాంతీయభాషలో ఒకొక అర్థం. ఒకొకచోట సంస్కృత పదాలకే భిన్నార్థం. అరవ నాడులో వృత్తి అంటే జీవన మని అర్థం. మలయాళంలో శుద్ధము అని అర్థం. శుద్ధిలేక ఆచారము లేనివాడెవడయినా ఉంటే 'చీచీ వాడొక వృత్తి చెడిన శని' అని అంటారు. అటులే వ్యాఖ్యానం ఉంటే ఉత్తరదేశాలలో ఉపన్యాసం అని అర్థం. ఔత్తరాహులు 'వ్యాఖ్యాన్ దేతాహై' అని ఉపన్యాసార్థంలో వాడతారు. ఈలాగే ఆదేశాలలో ఉపన్యాసం అని అంటే నవల అని అర్థం 'ఉపన్యాన్ లిఖతాహై' అంటే నవల వ్రాస్తున్నాడని అర్థం. ఇట్లా కొన్ని కొన్ని పదాలు అర్థాంతరంలో వాడతారు.
ఇక్కడనో గురువువారిది మౌనవ్యాఖ్య, గురువు శాంతిమౌనాల మూర్తిమత్వం. శాంతి తరువాతా ఘట్టం మౌనమేకదా ! నోరు విప్పితేనే సందేహాలు, ఋషులకు ఎన్నో సందేహాలు. కాని ఆ శాంతిస్వరూపుని ముందు ఆ సందియాలు తమంత తాముగా నివృత్తాలయిపోయినయో ఒక మాటలేదు ఒక పలుకులేదు ఒకటే శాంతి. ఒకటే ఆనందం. ఇన్నాళ్ళ తపస్సుకు ఈనాడు ఫలితం.
మనంకూడా ముదిమి అనేది లేక నిత్య¸°వనులమై ఉండవచ్చు. ఆలోచన యేమీలేక యేపనీ చేయక శాంతంగా సంతోషంగా ఉంటే నిత్య¸°వనమే. కాని మనలను ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక కొరత. దానిచేతనే ముదిమికి లోబడటం. నిశ్చలమయిన మనసు కలవారికి ముదిమి దూరదూరంగా ఉంటుంది. ఎన్నో కోరికలను పెంచుకుని మనసును లెక్కలేనన్ని ఆలోచనలతో నింపి వ్యాకులం చేస్తాం. ఇది మన మానసికావస్థ. ఈశ్వరుడు ఏ పనీ లేకుండా కదలక స్థాణువై ఉన్మీలితనేత్రుడై మనశ్చాంచల్యరహితుడై సదాయువకుడై దీర్ఘజటాధారియై శాంతుడై ఆనందస్వరూపుడై శిష్యపరివేష్టితుడై సంశయము తొలగించడానికి సమర్థమయిన మౌనవ్యాఖ్య చేస్తూ మఱ్ఱిచెట్టుకింద కూచున్నాడు. దేశకాలాల కతీతుడై పరిపూర్ణమూ మనోజ్ఞమూ ఐనరూపంలో కూచున్న ఈశ్వరుని చేరి తాపసులు చింతలు మదలి ఆనందమయులై నిస్సంశయు లయినారు.
కొరతలేని వస్తువే కొరతలు తీర్చడానికి చాలుతుంది. మహం్షుల సందేహ నివృత్తి చేయవలె ననేదీ ఒక కోరికే. అది గూడా ఒక కార్యమే. ఆమనోవృత్తియున్నూ లేక తన హృదయానుభవమయిన ముద్ర తాల్చి శ్రీదక్షిణామూర్తి కూచున్నాడు. అన్నీ ఒకటే; 'రెండు అని తలచేదెల్లా ఒకటే' అనువారి అనుభవమే చిన్ముద్ర. ఆముద్రాధారణం సైతం మనోవృత్తిజన్యం కాదు. మనకు కోపంవస్తే కను లెఱ్ఱబారుతవి. మీసాలు సైతమూ కదలుతవి. ఇవి ఇట్టివీ మనకు తెలియకుండానే జరిగిపోతవీ మనసులోని అనుభవ మేదో దాని చిన్నెలు వెలుపలగూడా పొడసూపుతై. అటులే శాంత్యానంద పరిపూర్ణమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి ఈ చిన్ముద్ర తానుగా అమరింది.
బొటనవ్రేలిని అంగుష్ఠమని అంటారు. హృదయ మధ్యంలో అంగుష్ఠమాత్రుడై యీశ్వరుడుంటాడు. అందరి హృదయాలలోనూ అంగుష్ఠమాత్ర పరిమాణంతో పరమేశ్వరుడున్నాడని ఉపనిషత్తులంటై. హృదయముందున్నూ ఆకాశం ఉన్నది. అది హృదయాకాశం. బయటిది అఖండాకాశం. ఈలోపల వున్న వస్తువే బయట సైతం అఖండంగా వ్యాపించి ఉంది. లోపల అది అంటుష్ఠమంత అంగుష్ఠం లోపలి వస్తువును చూపుతుంది, అంగుష్ఠానికి ప్రక్కన ఉన్నది చూపుడు వేలు. అది దేన్ని చూపుతుంది? 'స్వామి ఎచ్చట'? 'అదిగో అచ్చట!' అని ఆ వ్రేలు చూపుతుంది. చాలా దూరము నందున్న వస్తువును సూచించే వేలు ఇది. 'లోపలి వస్తువొకటి, బయటి వస్తువొకటి' అని రెండు వస్తువులులేవు. రెండు రకాలులేవు. అన్నీ ఒకటే అన్న స్వానుభవాన్ని అంగుష్ఠ తర్జనీసంయోగంచే బొటనవ్రేలు చూపుడు వ్రేళ్ళకలయికచే దక్షిణామూర్తి చూపుతున్నారు.
'అద్వైతమంటే ఈ కనిపించేదీ కనిపించనిది అంతా ఒకటంటే ఒకటే కదా! అట్లాగైతే గురు వేడి? శిష్యు డేడి? తన, శిష్యుని ఆత్మ ఒకటే అని తెలిసికొన్న గురువు శిష్యునికి ఉపదేశం చేస్తానని ఎలా అనగలడు? గురువే శిష్యుడు, శిష్యుడే గురువు అయితే, తమకు తామే ఉపదేశం చేసికొంటా మని అనినట్లే కదా! అటువంటి వారుంటారా? అలాక్కాక గురుశిష్యులు వేరయి ఆ వేరువేరని తలచితే అటువంటి ఆచార్యునికి అద్వైతజ్ఞానం లేదనే చెప్పాలిగదా! అలాటి జ్ఞానం లేనివానికి ఉపదేశాధికారం ఎక్కడిది? అద్వైతం అవలంబించినవానికి ఇతరులకు చెప్పవలసిన పనే ఉండదే!' అని ఇతర మతాలవారు ప్రశ్నలవానకురిపిస్తారు. కాని ఇట్టి ప్రశ్నలకు ఎంత మాత్రమూ ఆస్పదము కాని స్థితి. దక్షిణామూర్తిది. వారి అనుభవము ఆత్మస్వరూపమే. అది ఆనందనిలయం. ఆ సాన్నిధ్యం చేరిన ఋషులు సైతం ఆనంద తరంగాలలో ఓలలాడుతుంటారు.
మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యునానమ్
వం్షిష్ఠాంతేవన దృషిగణౖ రావృతం బ్రహ్మనిష్ఠైః,
ఆచార్యేంద్రం కర కలిత చిన్ముద్ర మానందమూర్తిం
స్వాత్మారామం ముదిత వదసం దక్షిణామూర్తి మీడే.
గురువులయొక్క మౌనమే ఒక వ్యాఖ్య. ఆ మౌనవ్యాఖ్య చేతనే పరబ్రహ్మతత్త్వం తెలిసిపోతుంది. గురువుపిన్నవాడు. బ్రహ్మనిష్ఠులయిన ఋషులు ఆయనను పరివేష్టించియున్నారు. ఆచార్యులకు పరమాచార్యుడు కరకలిత చిన్ముద్రతో చిరునగవుతో ఆనందమూర్తియై వెలసి ఉన్నాడు.
జ్ఞానం రెండు తెగలు. ఒకటి పరోక్షజ్ఞానం, మరొకటి అపరోక్షజ్ఞానం. మొదటిది థియరీ. రెండవది ప్రాక్టికల్. దానిచేత పరోక్షజ్ఞానంకంటె జ్ఞానమే శ్రేష్ఠం. అపరోక్ష జ్ఞానోపదేశ##మే దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య.
ఇతర మూర్తులలో ఇట్టి శాంతత ఎక్కడా కనబడదు. ఏదో ఒక కొరత ఉన్నట్టే తోస్తుంది. ఆయా యీ మూర్తులలో కోపమో ఉత్సాహమో ఏదో ఒక భావప్రకటన ఉంటుంది. మనకొరతలకై యీ మూర్తులున్నూ దిగివస్తారు. వీనినే అవతారం అని అంటారు. అవతరణం అంటే కిందికి దిగడం తన ఆత్మానుభవ స్థితిలో ఉండే దైవం శ్రీదక్షిణామూర్తి కిందికి దిగడముగాని పయికి ఎక్కడముగాని ఉండదు. వేదాలు దైవమును గూర్చి చెప్పేటప్పుడు-దేనికి ఏదీ యిక పైనిలేదో అదేస్వామి, దేనికి కింద ఏదీ లేదో అదే స్వామి, అంతా దైవముచే నిండి ఉంది. ఆయన తప్ప వేరేదీ లేదు. ఆయనకు పైన ఏదీలేదు, కింద ఏదీలేదు. వ్యాపక మయిన ఆవస్తువు కంటె పెద్దవస్తువు గాని చిన్న వస్తువుగాని మరొకటి లేదు' అని చెపుతవి.
(తైత్తిరీయారణ్యకం పదో ప్రశ్న)
తనకు వేరయిన వస్తువొకటి ఉన్నదనే తలపు కలిగితే చాలు, భయం కోపం ఆశా ఇటువంటివేవో పుట్టుకోవస్తయ్. ఆ వేరువస్తువువల్ల కష్టం కలుగుతుందేమో అనే భీతిచేత కోపం ద్వేషం ఇట్టివి కలుగుతయ్. ఆ వస్తువుమీద అభిలాష కలిగితే ఆశ ఏర్పడుతుంది. 'అంతా ఒకటే, రెండు అనేది లేనేలేద'ని నిశ్చయం కలిగితే రాగంలేదు, ద్వేషంలేదు, ఏమీలేదు. ఒకటిఅనేది సత్యం. రెండు అనేది మాయ.
దక్షిణామూర్తి అచలుడై కార్యరహితుడై స్తాణువై ఉన్నా, కార్యాలన్నీ తమంతటతామే జరిగిపోతున్నై. ప్రొద్దుపొడవగానే పిట్టలు గూండ్లువదలి ఎగిరిపోతై. జనమంతా ఎవరిపనులు వారు చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఈలాగే లోకంలో వ్యవహారమంతా నడచిపోతుంటుంది. కాని ఆ యా యీ పనుల నన్నిటిని సూర్యుడు చేయడంలేదు. సూర్యుడుదయించినదే తరువాయిగా ఆయన సాన్నిధ్యంలో లోకవ్యవహారం సాగిపోతుంది. ఈరీతిగానే గురుసాన్నిధ్యంలో ఉపదేశ##మేమీ చేయనక్కరలేకుండానే తత్త్వమంతా తేటతెల్లమై పోతుంది. ఆ మౌనభాస్కరుని కిరణపుంజముచే శిష్యుల సందేహతిమిరాలు దవుదవులకు తరలిపోతై. కాంచీపురంలో వరదరాజస్వామి కోవెలలో దేవీసన్నిధిలో జటామకుటముతోకూడిన వ్యాసుల చిత్రము ఒకటి ఉన్నది. ఆయన కూరుచున్నటులున్నూ ఆయన కెదురుగా శంకరులు నిలుచున్నటులున్నూ స్తంభంమీద ఒక చెక్కడ మున్నది. ఆ చెక్కడములో వ్యాసదేవులు రెండవ వస్తువు నేదో ఒక దానిని చూపుతున్నటు ఉన్నది. మధ్వాచార్యుల విగ్రహం ఉన్న తావులలో ద్వైతమును సూచిస్తూ రెండు వ్రేళ్ళు చూపుతూ ఉన్నటుల శిల్పాలు ఉన్నవి. దక్షిణామూర్తియే చోటున ఉన్నా చిన్ముద్ర లేకుండా ఉండదు.
'దేవుడు ఉన్నాడా? ఉంటే ఎట్లా వుంటాడు? ఏమి చేస్తూ ఉంటాడు?' అనే ప్రశ్నకు బదులో అనేటటులు అర్జునునకు శ్రీకృష్ణభగవాన్లు, నాయనా! ఈశ్వరు డొకడే, అందరయూ డెందాలలో నెలకొని మాయచే నియమిస్తున్‌ఆనడు' అని అన్నారు.
'ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే7ర్జున! తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యంత్రాగూఢాని మాయయా'
గీతలలో మరియొక చోట చరాలూ అచరాలూ అన్నీనాలోనే ఉన్నవని అన్నారు. ఇవన్నీ విన్న అర్జునునికి ఉన్న జ్ఞానం కాస్తా ఉడిచిపెట్టుకొనిపోయి లేని సందేహా లెన్నో పుట్టుకొని వచ్చెయ్. 'ఒక తావుననేమో నే నన్ని వస్తువులలోనూ ప్రతిష్ఠితుడనై వాని నన్నిటినీ ఆడిస్తున్నా నని అంటావు, మరొక తావున అన్ని వస్తువులూ నాలోనే వున్నవని అంటావు. ఇట్లా ఒకదానికీ ఇంకొకదానికీ పొసగని మాటలు చెప్పి ఏమి ప్రయోజనం? నీవు అన్ని వస్తువులకున్నూ ఆధారమవా? లేక అన్ని వస్తువులూ నీకు ఆధారమా? ఏదో ఒకటి నిక్కచ్చిగా చెప్పు! అలా చెపితే నే నొప్పుకుంటాను'. అని అర్జునుడు శ్రీకృష్ణుని నిలువరించి అడిగాడు. ఇది 'దొన్నెకు నేయి ఆధారమా? నేతికి దొన్నె ఆధారమా? అని తర్కించిన కుతార్కికుని తర్కంవలె సందేహంవలె ఉన్నది.
'ఓహో! నీకు సందేహాలు ఆరంభమయినవే! సరే! నేను చెప్పిన మాటలలో ఒకటీ గ్రహించి రెండవ దానిని వదలివెయ్!-'న చ మత్ స్థాన్ని భూతాని' నాలో ఏ వస్తువున్నూ లేదు ఇపుడు తెలిసిందా?'
'అడిగినపుడల్లా, తలచుకున్నపుడెల్లా, మాటమారిస్తే నే నెట్లా ఒప్పుకుంటా?' అని వస్తువులూ నాలో ఉన్న వనిన్నీ వెనువెంటనే నాలో ఏమిన్నీ లేదనిన్నీ చెపితే ఏ మాటలో నిజాయినీ ఉన్నట్లు?
'పోవోయ్! నే వేమీ' నన్ను నమ్మక్కరలేదు. నేనేం చెప్పినా అడ్డు ప్రశ్నలువేసి నే నొప్పుకోను, నే నొప్పుకోనని అంటావు. లోగడ చెప్పిన యీ రెండు మాటలూగూడా వద్దు. ఇదిగో కచ్చితమయిన మాట చెపుతున్నా విను!-'నా7హం ప్రకాశః సర్వస్య' ్స 'నే నందరికీ ప్రకాశించను' అని రెండవ మాటకూడా శ్రీకృష్ణుడు రద్దుచేశాడు.
ఎందుకు ప్రకాశించవ్? ఏ కారణంచేత అందరకూ తెలియబడవ్?
'యోగమాయ ఆవరించడమువల్ల ఎవరికిబడితే వారికి గోచరించను'.
'నాలో ఏవీ లేవు' అని ఒకమారూ, 'నేనున్నూ వానిలో లేను, అని రెండోమారూ, 'నేనెవరికిబడితే వారికి గోచరించను' అని మూడోమారూ, ఏమిటయ్యా మాటిమాటికీ యీ మాటమార్పిడి. ఇదంతా ఏమిటయ్యా అంటే? 'అదే యోగమాయ' నేను మాయచే ఆవరింపబడేఉన్నాను' అని సమాధానమా?
నా హం ప్రకాశస్పర్వస్య యోగమాయాసమావృతః,
మూఢో7 యంనా7భిజానాతి లోకే మామజిమవ్యయమ్.
'ఇదేమిటి ఉపదేశం? మనకేమీ అర్థంకావడంలేదు' అని తోస్తుందికదా!
'నేనందరకూ, ఎవ్వరికీ కనబడును' అని భగవంతుడు చెపితే వేవురుంటే వేవురికిన్నీ కనబడను అని అర్థం 'నే నందరకు కనబడనంటే వేపురిలో తొమ్మన్నూట తొంబది తొమ్మిదిమందికి కనబడకపోవచ్చును; ఏ ఒకనికో కనబడితే కనబడవచ్చును అని అర్థం. భగవంతుడు.
'నా హం ప్రకాశః సర్వస్య'
అనే చెప్పాడు. మాయచే మోహితుడు కానివానికే ఆయన గోచరిస్తాడు.
దార్లో ఒక రెవరో పూలమాల పడవేసి పోయారని అనుకుందాం. పగటిపూజ అది అందరకూ పూమాలలాగానే కనబడ్డది. అందువల్ల దానిచేత ఎవరికిన్నీ బాధగాని వికారంగాని కలుగలేదు. మసక మసక చీకటిలో ఎవడో దానిని తొక్కి 'పాము పాము' అని అరచాడు. మాలగా ఉన్నదీ పాముగా ఉన్నదీ ఒకే వస్తువు. మాల అని తెలియంగానే పాము మాయమయింది. కాని పామని బ్రమసినందులకు ఆధారం మాలే. 'ఈ ప్రపంచంలో నే నున్నాను, నాలో ఈ ప్రపంచం ఉన్నది' అని అంటే దీనికేమిటి అర్థం? 'పూలమాలలోనే పామున్నది, పాములోనే పూలమాల ఉన్నది అని అర్థం. గుండె చెదరినవానికి మాల పామయి కూచుంది. అజ్ఞానం పోయి 'పాము కాదు-మాల' అని తెలిసిన వానికి మాల, పామును తనలో ఇమిడ్చికొని మాలగా కనబడుతుంది' ప్రపంచమును సత్యమని చూచేవానికి, ప్రపంచాని కాధారమూ భర్తా ఈశ్వరుడు. ఈ దృశ్యప్రపంచమును జ్ఞానముచే చూచే వానికి ఈశ్వరుడే సర్వమూ వ్యాపించినట్లు తోస్తుంది.
ద్రావిడకవి కంబరు సుందరకాండలో ఈ విషయమునే ప్రస్తావించాడు. శ్రీరామచంద్రమూర్తి దర్శనమాత్రానే పంచభూతాత్మకమయిన మాయ తొట్ట తొలగిపోతుందని ఆ కంబరు వ్రాశారు. వస్తువు లన్నింటిలోనూ తానే నెలకొని ఉన్నటులు శాంతుడై సుస్థిరుడై 'అంతా ఒకటే' అనే అద్వైతానుభవం చూపిస్తూ చిన్ముద్రతో ఉపదేశం చేసే శ్రీదక్షిణామూర్తి దర్శనమాత్రాన మాయపొర తొలగి ఆనందాద్వైత జ్ఞానసముద్రంలో మనంగూడా కలసిపోతాం.
|