Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

గీతోపదేశము

భగవద్గీతలో భగవానుడు అర్జునునకు ఉపదేశం చేసిన పట్టులెన్నో ఉన్నయ్‌. ఆయా యీ పట్టులలో ఎన్నెన్నో సంగతులను వారు విశదీకరించారు - 'తస్మా ద్యుధ్యస్వ భారత' అని సహేతుకంగా నాలుగయిదు కారణాలు చెప్పి 'అందుచేత నీవు యుద్ధంచెయ్‌' అని చెపుతూవచ్చారు. యుద్ధంచేయడం నీధర్మం. నీపనిని నీవు నెరవేర్చవలసిందే'- 'కార్యం కర్మ కరోతి యః' అని చెప్పారు.

యజ్ఞార్థాత్కర్మణో న్యత్ర లోకో యం కర్మబంధనః,

తద్ధర్మ్యం కర్మ కౌంతేయ ముక్తసంగ స్సమాచర!.

'యజ్ఞంకోసం చేసే పనులకంటె నేరుగా చేసేపనులు (కర్మలు) బంధం కలిగిస్తయ్‌. దానిచేత నీవు సంగం వదలి పనులుచేసి ఈశ్వరునికి అర్పింతంచెయ్‌'. అని ఉపదేశించారు. ఎవరికీ ఏ యే పనులు ఏర్పాటయినవో వారువారు వానిని చేయవలసిందే. 'ధర్మం చేయడం ఎట్లా? ఏది ధర్మం? అని ప్రశ్నవస్తే

'తస్మా చ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్ఢితౌ'

చేయదగిన పనులేవో చేయదగని పనులోవో శాస్త్రాన్ని బట్టి నిర్ణయించాలి. నీకు శాస్త్రం ప్రమాణం అని విపులీకరించారు.

ఇది చూస్తే మొత్తంమీద గీత 'నిర్దిష్టకార్యాలు చేయాలి, క్షత్రియునికి ధర్మం యుద్ధంచేయడం. ఎవరికర్మలను వారుచేయాలి' అన్న విషయమునే ముఖ్యంగా చెప్పినటులు తోస్తుంది. ఈ దృష్టితోనే బాలగంగాధర్‌ తిలకుగారు గీతా రహస్యం వ్రాశారు. వారు చెరసాలలో ఉన్నప్పుడు కాలం వృధాపుచ్చక గీతకు భాష్యాలెన్ని ఉన్నవో వాని నన్నిటినీ శోధించి ఉపనిషత్తులు వేదాలు వీనిని క్షుణ్ణంగా పరిశీలించి గీతారహస్యం లేక కర్మయోగం అనే గొప్ప గ్రంథం వ్రాశారు. ఇది తెలుగు హిందీ మొదలయిన ప్రాంతీయ భాషలలో గూడా తర్జుమా చేయబడ్డది.

'ఒక నిమిషమయినా వితపుచ్చకు. నీ ధర్మానికి అనుగుణమయిన పనులను నీవుచేయాలి. నీవు క్షత్రియుడవు. నీవు యుద్ధం చెయ్‌' అని చెప్పడములో ఎవరి ధర్మాన్ని అనుసరించి వారు తమ పనులు చేయవలసిందే అని తేలుతుంది. ఈచోట భగవంతుడనే మాటకాని భగవత్‌ ప్రసక్తిగాని కనిపించదు.- 'స్వ కర్మణాత మభ్యర్చ్య' కర్మలను చేసి వానికి అర్పించు, వానికి అంటే భగవంతునికి అని ఇక్కడ తెలుస్తున్నది.-'యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర' అని చెప్పిన స్థలములో యజ్ఞం అంటే మహావిష్ణువే అని అర్థం చెప్పిఉన్నారు. పరమాత్మ అని చెప్పడమున్నూ కద్దు. యజ్ఞం 'శాక్రిఫైస్‌'. కర్మచెయ్‌. దానిని ఈశ్వరునకు అర్పణచెయ్‌. ఇట్లా చేస్తే నీకు సక్తి లేకుండా పోతుంది.

వీని నన్నింటినీ చూస్తే మనంకూడా తిలకుగారితో చేరి గీత యావత్తూ కర్మపరం అని తీర్మానించవచ్చు. కాని వెనుక భాగంలో గీతలోనే ఇందుకు విరుద్ధంగా - 'తూష్ణీంకించి దచింత యన్‌' ఏమాటా నీ కక్కరలేదు. ఏయోచనా నీ కక్కరలేదు. ముక్కు పట్టుకొని కూచో!-మూర్ధ్న్యాధా యాత్మనఃప్రాణమ్‌' ప్రాణమును శిరసుకు తీసుకోపోయి బ్రహ్మ స్వరూపం ధ్యానంచెయ్‌, అని భగవంతుడు అంటాడు.

మరోచోట-'య స్సర్వత్ర.....స్థితప్రజ్ఞస్య....' అని చెపుతూ చిత్తవృత్తి నిలిచినవానికి మాట యెక్కడిది? జ్ఞాపక మెక్కడ? చూపెక్కడ? ఏదీలేదు. 'సమాధిలో ఉన్నవానికి పనేలేదు.' అని సమాధిని స్తోత్రం చేశారు.- 'తస్య కార్యం న విద్యతే' వానికి కార్యం లేదని చెబుతున్నారు.

'జనమధ్యంలో ఉండకు, ఏకాంతస్థలానికిపో! జనులు లేనిచోటికిపో! ఎవరితోను మాటాడకు' అని మరొకఉపదేశం. కాని జనంలేని చోట ఎవరితో యుద్ధం చేయడం? 'ముక్కు ధ్యానంలో మునిగిపో. లే! కయ్యం చెయ్‌!' అని అంటే ధ్యానం చేయడమా కయ్యం చేయడమా?

ఇంకోచోట, 'వాసుదేవ స్సర్వ మితి' ఎటుచూచినా వాసుదేవుడే. ఇట్లా వాసుదేవ స్వరూప దర్శనం చేసే మహాపురుషులు ఏ ఒకరిద్దరో అని వారిని స్తుతించారు.

ఏకాంతంగా ఉండు. ఎక్కువగా తినకు. అట్లా తింటే యోగసిద్ధి లేదు. 'నా త్యశ్నతస్తు యోగః' అందులకు కేవలోపవాసం, నిరశనవ్రతంకూడా పనికిరాదు. నిట్రుపాసంతో యోగంచేయలేరు. 'నా త్యశ్న తస్తుయోగోస్తి న చై కాంత మనశ్నతః' అని ఆహారనియమాలు చెప్పారు.

ఇట్లా చూచుకుంటూపోతే గీతలో పరస్పరవిదుద్ధాలవలె కనబడే విషయాలనేకం. ఎన్నో సందియాలు వీనికి సమాధానాలుగూడా గీతలోనే కనబడతవి. ఒకచోట భక్తియే గొప్పది అని గీత చెపుతుంది. అప్పుడు తక్కిన దానిని తక్కువగా తలుస్తారు. ఇంకోచోట జ్ఞానప్రాశస్త్యం వెల్లడిస్తూ భక్తికర్మలు రెండుజ్ఞానంలో లయమవుతయ్యని ఉంటుంది. ఇది చదివేవారు ఏ మనుకుంటారు? తమ తమ మనోధర్మాల కనుగుణంగా అర్థం తీస్తారు. ఆదిశంకరులు గీతాభాష్యంలో వీని నన్నిటినీ సమరసం చేసి వీనిలో విరోధమేమీ లేదు, అన్నీ సరిగానే ఉన్నవి అని తీరుమానం చేయడానికి కావలసిన శ్లోకాలను తీసికొని అర్థం చెప్పారు.

ఉపనిషత్తులలో గూడా అనేక వాక్యాలు ద్వైతఅద్వైత విశిష్టాద్వైత పరాలని చెప్పడానికి వీలుగా ఉన్నై. ఒకొకచోట జీవాత్మ వేరు పరమాత్మవేరు ప్రపంచంవేరు అనిన్నీ అంతాట నిండియున్న పరమాత్మయే అంతర్యామిగా ఉన్నాడనిన్నీ ఇవన్నీ ఏకమే అనిన్నీ ఇట్లా ఎన్నో రీతులయిన విషయాలున్నయ్‌ ఐనప్పటికీ ఉపనిషత్తులలో నడుమనడుమ చెప్పబడిన వాక్యాలనుమాత్రం తీసుకొని పరస్పరభేదం ఉన్నట్లు కనబడే విషయాలను సమన్వయం చేయడానికి అద్వైతప్రకారం పరమాత్మే సర్వాత్మకంగా ఉన్నాడనిన్నీ విశిష్టాద్వైతప్రకారం అతడే అంతర్యామియై దేహంలో ప్రాణంలాగా శరీరిగాఉన్నాడనిన్నీ తీర్మానం చేస్తున్నారు. ఇట్లా రెండింటికిన్నీ మాధ్యస్థ్యంచేసే వాక్యాలను ఘటక వాక్యాలని అంటారు. ఘటక వాక్యాలద్వారా ఉపనిషత్తులలో ఒకదానితో మరొకటి సమన్వితం కాని విరుద్ధవిషయాలేమీ ప్రస్తావింపబడలేదని ఎట్లా తీర్మానించారో అట్లాగే భగవద్గీతలోగూడా అక్కడక్కడ కొన్నికొన్ని శ్లోకాలను గ్రహించి పరస్పర వైరుధ్యమేమీలేదు అని ఆచార్యులవారు చూపించారు.

పనిచెయ్‌ పనిచెయ్‌ అని గీతలోఉన్నా మరొకచోట ఎవరూలేని చోటికి వెళ్ళి ధ్యానంచెయ్‌ అని ఉన్నా వీనికి వైరుధ్యం ఏమీలేదనడానికి ఈ దిగువ శ్లోకం చూపారు,-

'స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభ##తే నరః'

శాస్త్రం చెప్పిన కర్మలుచేసి ఈశ్వరార్పణం చెయ్‌! అట్లాచేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్పారు.

చిత్తశుద్ధేమోక్షమా? అదేమోక్షమయితే కర్మ మాత్రం చేస్తేచాలు, జన్మసాఫల్యం పొందవచ్చు. కర్మతప్ప భక్తియోగం జ్ఞానం ఇవిఏవీ అక్కరలేదు. మోక్షం సంపాదించడమేకదా లక్ష్యం అంటే చిత్తశుద్ధే మోక్షంకాదు. అదొక సాధన మాత్రమే.

'స్వకర్మ నిరతః శుధ్ధిం యథా విందతి తచ్ర్ఛుణు'.

'స్వకర్మలో నిష్ఠ కలవాడు ఎట్లా పరమాత్మ స్వరూపంతో ఐక్యం కాగల పరిపక్వస్థితి పొందుతాడో ఆసంగతి చెపుతా విను.' అని చెప్పడం మొదలుపెట్టారు.

కర్మలు చేయడంవల్ల కలిగే చిత్తపరిశుద్ధి పరమాత్మ స్వరూపసాక్షాత్కారం కావడానికి ఆనుకూల్యం చేసికొనే సాధనం. ఈ చిత్తశుద్ధి అనే సాధనం చేతనే తక్కిన స్థితులు కలగాలి అని భగవంతు డుపదేశం చేస్తాడని ఆచార్యులవారు భాష్యం రచించారు.

'పనిచెయ్‌ పనిచెయ్‌' అంటే పని చేయడం వల్ల చిత్తం శుద్ధం అవుతుంది. అనగా మొదట చిత్తశుద్ధి తరువాత యోగసిద్ధి మనోనిగ్రహము అని సోపానక్రమంగా కలుగుతై. 'అందుచేత ధర్మశాస్త్రాలు విధించిన పనులుచెయ్‌. చిత్తశుద్ధి ఏర్పడ్డ తరువాత పరమాత్మలాభం కలుగుతుంది. ఈ యెడ విరోధ మేమీలేదు' అని ఆదిశంకరు లంటారు.

ఎవని కేర్పడిన కర్మ వాడు ముమ్మెదట చేయాలి. భయమో కామమో దుఃఖమో ఏదో మనోమాలిన్యం ఉన్నదంటే చిత్తశుద్ధి ఏర్పడలేదన్నమాట. దుఃఖం భ్రాంతి మాలిన్యం భయం ఈ యొదలయినవి పోతేనే భగవంతునితో సంలాపం చేసేస్థితి కలుగుతుంది. చిత్తశుద్ధి ఏర్పడవలెనంటే కర్మ చేసేతీరాలి. కామాదులను పోగొట్టుకొడానికే కర్మచేయాలి. కర్మలు చేసి చిత్తశుద్ధి పొంది ఇంద్రియాల గెలిచి ఆసక్తితో ఆశ వదలితే సాక్షాద్‌ భగవంతునిలో చేరుట కస్తిలేని తోవ. దానిచేత ఆస్థితిని వచ్చినవారు జ్ఞానానికి అవధి అయిన బ్రహ్మమును పొందేతోవ చూపిస్తున్నారు.-

'సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తధా ప్నోతి నిబోధ మో,

సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్యయాపగా.'

ఇలా కర్మలుచేసి చిత్తశుద్ధి పొంది యోగసిద్ధిని అందుకొని జ్ఞానమును ఆశ్రయించాలి. జ్ఞానం కలిగిన వెనుక ఈశ్వరసాక్షాత్కారమే. తానుగాక రెండోది ఉంటేనే మాటో చెలిమో జగడమో. రెండోది కల్ల. ఒకటే నిక్కం. అంతా ఒకటే అనే స్థితి కలిగిన పైన కోరదగినదేమి ఉంది? 'వాసుదేవ స్సర్వమ్‌' అంటే అంతా రామమయం; ఈ జగమంతా రామమయంగా చూచేవానికి అట్టి జ్ఞానస్థితిని పొందినవానికి ఎట్టి పనిన్నీలేదు. 'తస్య కార్యం న విద్యతే'.

అయితే ఇచట బోధింపబడేవాడు అర్జునుడు. అతడు తనకు ధర్మమైన పనులు చేసేతీరాలి. చేస్తేనే అతనికి చిత్తశుద్ధి. అర్జునుడు ఎవరికో దుఃఖం కష్టం కలుగుతుందని చింతిస్తున్నాడు. తన కర్మ తాను నిర్వహించేవానికి అట్టి చింత ఉండదు. సోపానక్రమంగా 'పరమాత్మలో ఐక్యంచెందే స్థితి వానికి కలుగుతుంది' అని అచట నచట శ్లోకాలు తీసి చూపి ఆచార్యులవా రొకదానికి ఇంకొకటి విరుద్ధం కాదని నిరూపించారు.

ఇదే విధంగా భక్తికూడా. చిత్తశుద్ధి కలిగిన పిదపనే భక్తి కలుగుతుంది. భక్తిచేత, 'నే నెవరు? నా నిజస్వరూప మేమిటి?' ఈ మొదలయిన ప్రశ్నలకు ప్రత్యత్తరం అనుభవ మవుతుంది.

భక్త్యా మా మభిజానాతి యావాన్‌ య శ్చాస్మి తత్త్వతః

తతో మాం తత్త్వతోజ్ఞాత్వా విశ##తే త దనస్తరమ్‌.

భక్తిచేతనే భగవంతుని తెలిసికొంటాడు. అని అర్థం. ఆలాగయితే భగవంతుడు తెలిస్తేకద ఆయనమీద భక్తి కలగడం. ఈమాటకూడా విరుద్ధంగా తోస్తుంది.

భక్తికలగడానికి భగవంతుని తెలిసికొనియే తీరాలని నియమంలేదు. తత్త్వం తెలిసికొన్న పిదపనే భక్తిచేయాలి అని కాదు అర్ధం. 'భగవంతుడు ఈ ఆలయంలో ఉన్నాడు. గర్భగృహంలోనే ఉన్నాడు. ఈ శిలలోనే ప్రతిష్టితుడై ఉన్నాడు. వేరెక్కడాలేడు' అని ప్రపథమంలో మనకు నమ్మిక భక్తీ కలగాలి. భక్తికలగాలి. 'భగవంతుడు ఎక్కడబడితే అక్కడ ఉన్నాడు.' అనే నిజస్వరూపజ్ఞానం మనకు కలిగితే అటుపిదప ప్రసాదం తిని కోవెలలోని స్తంభాలకు చేతులు పులుముతామా? ఇప్పుడు మనజ్ఞానం 'ఈ గుడికంబాలలో దేవుడులేడు, లోపల ఉన్న శిలలోమాత్రం ఉన్నాడు' అన్నంతవరకూ పాకింది. ఆ మాత్రం తెలిసినా చాలు. శాస్త్రాలలో చిప్పిన రీతిగా- 'స్వామి నీలిమేఘశ్యాముడు,పీతాంబరుడు, చతుర్భుజుడు, శంఖచక్ర గదాధారి' అని ఈ విధంగా ధ్యానం ప్రారంభించి గుడికి పోవడం, పెరుమాళ్ళను దర్శించడం, వారిని, సేవించడం అనే అలవాటు కలిగినాక క్రమక్రమంగా భక్తిపెరిగి 'భగవంతుడు గుళ్లోనేకాదు, గోపురంలోనేకాదు, సర్వత్రా ఉన్నాడు, ఆయనలేనిచోటే లేదు. అతడు సర్వాత్ముడు, సర్వాంతర్యామి' అని ఆయన సత్యస్వరూపాన్ని తెలిసికొంటాడు.

పరిణామం ఇట్లా క్రమంగా రావాలి. మొదటి మెట్లులో ఆయన ఖండస్వరూపందలచి భక్తిపూనడం మొదలుపెటితే ఆ భక్తిచేతనే ఆయన అఖండస్వరూపం సైతం చూడవీలవుతుంది. ఇట్టి తత్త్వదృష్టి కలిగిన తరువాత విరాకార, స్వరూపమే సత్యమని తెలిసిపోతుంది. 'వానికి కాళ్లు లేవు, కళ్ళు లేవు, చేతులు లేవు. చెవులు లేవు, కాళ్లు లేకే నడుస్తాడు, చెవులు లేకే వింటాడు.' అనే జ్ఞానం కలుగుతుంది. కాని మొదటి మెట్టులో, ఆరంభంలో ధ్యానం చేసేందుకు ఇట్టి తత్త్వదృష్టి అక్కరలేదు. అఖండస్వరూపాన్ని ధ్యానం చేయడానికి ముందు ఆయనను ఖండంగానే తలచి ధ్యానించాలి. ధ్యానింపగా భక్తి ఘనీభవించిన కొలదీ సత్యవస్తువయిన అఖండస్వరూపం ఆ భగవంతునిది అనే సంగతి తానుగా తెలిసివస్తుంది. అటు తరువాత తాను వేరు భగవంతుడు వేరు అనే భేదజ్ఞానం నశించి తాను భగవానుడు అనే నిశ్చయం కలుగుతుంది.

'తతో మాం తత్త్వతోజ్ఞాత్వా విశ##తే త దనంతరమ్‌'.

'బ్రహ్మవిత్‌ బ్రహ్మైవ భవతి' ్స'బ్రహ్మవేత్తబ్రహ్మమే అవుతాడు, ఈ స్థితి కలగడానికి ముందు దైవాన్ని గూర్చి ఒక విధంగా తెలిసికొంటే చాలు. భక్తి వహించడానికి అది వీలే. లేకుంటే భక్తి అలవడడం కష్టం. మొదట ఖండస్వరూపంగా భక్తి చేసి పిదప అఖండస్వరూపదర్శనం చేస్తే తాను మొదట చూచిన ఖండస్వరూపమంతా తమాషా అని తేలుతుంది. అయినప్పటికీ అఖండస్వరూపదర్శనానికి మొదటి సోపానం ఖండస్వరూపధ్యానమే. భగవత్‌ స్వరూప దర్శనం చేసిన తరువాత వాడిక వేరుగా ఉండలేడు. ఆక్షణమే అతడు భగవంతుడవుతాడు-'విశ##తే తదనన్తరమ్‌.'

మనం మంచుగడ్డను రంపపు పొట్టులో భద్రపరుస్తాం. మంచుగడ్డ ఒకప్పుడు నీరుగా ఉన్నదేకదా అని దానిని నీటిలో పడవేస్తే అది నీరుగా మారిపోతుంది. పిదప మనకు కావలసినపుడు మంచుగడ్డ దొరకదు. అలాగే భగవానుని నిజస్వరూపం వెతకి వెతకి తెలిసికొన్న సాధకుడు 'నేను భగవంతుడను' 'అహంబ్రహ్మాస్మి' అని తెలిసికొంటాడు. అటుమీద 'నేను, నేను,' అని చెప్పుకొని బయట తిరిగిన వస్తువు మాయమయి పోతుంది.

ఇదేమాదిరి మరొక దృష్టాంతం కూడా చెప్పటం వాడుక. మనం 'ఇది గోదావరి ఇది కృష్ణ ఇది కావేరీ' అని అంటాం. ఇవి పోయి సముద్రంలో పడ్డాక వాని వాని పేరులు మాయమై ఒకటే సముద్రజలమయి పోతై 'ఆపః సముద్రం యథా ప్రవిశంతి'. అని ఉపనిషద్వాక్యం.

ఇట్లా ఏస్థితిలో ఉన్నవాడు ఆస్థితికి తగ్గ పనులు ఆయాయీ స్థితిలో చేయాలనే గీతాచార్యుల సందేశం. వారు-'యుద్ధం చెయ్‌', 'తస్మాద్యుధ్యస్వభారత!' అని అర్జునునికి ఉపదేశం చేశారు. అధికారి భేదాన్ని బట్టి ఆయా స్థితిలో చేశారని ఇందులో ఒకదానికొకటి విరుద్ధం కాదని సమన్వయం చేసి శ్రీ శంకరులు భాష్యం చేశారు.


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page