లోపల - వెలుపల
నరనారాయణులు తపస్సు చేసికొంటూ ఉన్నారు. నారాయణుడు సాక్షాత్ భగవానుడు. నరు డీశ్వరాంశ. మనుష్యులలో గొప్పస్థితిని పొందినవాడు కాబట్టి నరుడని అతనికి పేరు. ఈ నారాయణునీ నరునీ సాక్షాత్కృష్ణార్జునుల అంశం అని చెప్పడంకూడా కద్దు. వారిద్దరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు.
ఇంద్రుడు దేవలోకానికి అధిపతి. అన్ని పదవుల కంటె ఇంద్ర పదవి దొడ్డది. ఎవరయినాసరే తపస్సు చేసి సిద్దిపొందితే వారికి ఇంద్రపదవి దొరుకుతుంది. ఇంద్రునికి తన పదవి ఎక్కడ పోతుందో అనే భీతి ఉంటుందని అన్ని పురాణాలూ చెపుతై. దానిచేత ఎవరెచట తపస్సు చేసినా సరే అతడు ఎన్ని ఎన్ని అడ్డంకులు కలిగించవచ్చునో అన్నన్నీ కలిగిస్తాడు. వీని నన్నిటినీ తట్టుకుని ఎవరయినా తపస్సు పూర్తిచేసి సిద్ధి పొందితే అతనికి ఇంద్రపదవి దొరుకుతుంది. అతడు ముల్లోకాలక్కూడా అధిపతి కావచ్చు.
ఇపుడున్నూ ఇంతే. ఎవరయినా 'శాక్రిఫైస్' చేసి (శ-సౌ-|) ఉంటే అతనికి పేరూ ప్రతిష్ఠా ఉంటుంది. అతని అండచూచుకొని ఒక 'పార్టీ' బయలుదేరుతుంది. దానికి అతడు ('ప్రెసిడెంట్') అగ్రాసనాధిపతి అవుతాడు. అటు తరువాత పరిపాలనాధికారం వస్తుంది. అందరూ అతడు చెప్పినటులు నడచుకోవాలి. మరొకడు మరింత 'శాక్రిఫైస్' చేస్తే లోగడ ఉన్నవానిని తొలగించి ఈ రెండోవాడు అగ్రాసనంలో ఉంటాడు. ఇది భూలోకస్థితి. ఇట్లే తపస్సుచేసి 'శాక్రిఫైస్' చేసినవానికి ఇంద్రపదవి వస్తుందని పురాణాలు చెపుతవి. వారి ఆశ ఈ లోకంలో ఆగలేదు. ఇంద్రపదవి వరకూ పరుగుతీసింది.
నరనారాయణులు తపస్సు చేసేటప్పుడు తన ఆధిపత్యం ఎక్కడ ఊడిపోతుందో అని ఇంద్రుడికి శంక కలిగింది. అందుచేత వారి తపస్సు భగ్నం చేయడానికి ఎన్నో మార్గాలు వెదకాడు. భయపెట్టడం, బెదిరించడం, అందెకత్తెలను పంపి కామం కలిగేటటులు చేయడం ఇలాటి జిత్తు లెన్నో పన్నడం ఆతనికి వాడుక. తపోవిఘ్నానికి ఇవి సాధనాలు.
నరనారాయణులు తపస్సు భంగించడానికి ఇంద్రుడు తన దగ్గర ఉన్న అచ్చరల నందరినీ ఆశ్రమ వాటికకు పంపాడు. వారు మొదట నరుని దగ్గరకు వచ్చారు. నరుడీశ్వరాంశ. జీవుడంటే ఏదో ఒక కొరత ఉండాలిగదా. వీరిని చూచీచూడంగానే అత డొక హుంకారం చేశాడు. ఈయనగారి కోపానికి మన మెక్కడ మాడిపోతామో అని భీతితో ఒకరినొకరు తోసికొంటూ ఈ అచ్చరలు కిందా మీదా పడి ఈవంక కన్నెత్తి అయినా చూడరాదని అనుకొంటూ పరుగెత్తుకుంటూ పోయారు.
'నారాయణుడు కొంత సాధువుగా కనిపిస్తున్నాడని ఆ అచ్చరలు ఆయనదగ్గరకు ఉపసర్పించారు. నారాయణుడు వీరిని చూడంగానే తన తొడను ఊరువును - చరచాడు. ఆయన ఊరువునుండి ఊర్వసి ఉద్భవించింది. ఊర్వసిరూపు తాల్చిన అందం. ఆ అందాలరాణిని చూచి ఆ అచ్చని లందరూ ''ఈమెముందు మనమెందుకు?'' అని తలవంచుకొన్నారు.
లోకంలో ఉన్న ఏ ఆనందమయినా అందమయినా కామమయినా ఇట్టివన్నీ మన ఆత్మలోనే ఉన్నయ్. లోపల వెలసి వెలిగే అఖండాకార పరిపూర్ణ ఆనందచ్ఛాయలే బయటగోచరించే అందం. బయట ఒక్కటీలేదు, ఉన్నదంతా లోపలే. బయటఉన్న వస్తువులన్నీ లోపలికివచ్చి చేరవలసినదే అనే పరమతత్త్వం నారాయణుడు చూపంగానే అచ్చరలు 'ఇక మేము ఇంద్రుని సభను క్రీగంటనయినా చూచేది లేదు. కడుపుకూటికి ఇట్టి చేతలు చేయవలసి వస్తున్నది' అని అన్నారట. ఈరీతిగా నారాయణుడు వారికి జ్ఞానోపదేశం చేశాడని ఒకకథ. నేను చెప్పినదానిలో కొంత కొంత తేడా పాడా లుండవచ్చు. గీతలో ఈ తత్త్వము ననుసరించే ఒక శ్లోకం ఉన్నది.
అపూర్యమాణ మచల ప్రతిష్ఠం
సముద్ర మావః ప్రవిశన్తి యద్వత్,
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాంతి మాప్నోతి న కామకామీ.
కామ మనేది వెలుపలి ఆశ. మనకు వెలుపలి వస్తువుల చేతనే సంతోషంగాని ఆనందంగాని కలుగుతుంది. వెలుపలి కామము కావాలని అనుకొనే వాడెన్నటికిని శాంతి పొందడు. ఎపుడూ వెలుపలి వస్తు సంచయం కోరుకొనే వానికి శాంతి ఎక్కడ? వెలుపల ఎన్నో వస్తువులు ఉన్నవి. అవివస్తే రానీ పోతే పోనీ, అని అన్నీ లోపలి వస్తువుతో కలియ వలసినవే. ప్రతి నిమిషమూ వేలాది నదులు వచ్చి పడుతున్నవి సముద్రంలో. ఒకపు డెపుడో అవన్నీ సముద్రంలోనుంచి బయటికి వెళ్ళినవేకదా! చూడబడే వస్తువులన్నీ లోపల ఉన్న ఆనందపు శాఖలే కదా! 'అది కావాలి ఇది కావాలి' అని సబ్బండు కోరికలతో మనము వస్తువులను తరుము కొంటూపోతే ఏమి ఫలం? అన్నీ లోపలనే ఉన్నవి. అని తలస్తే- 'స శాంతి మాప్నోతి' అతడు శాంతిని పొందుతాడు. ఏదో పెద్ద పదవో ఒక స్త్రీయో ఒక సంపదో ఒక గౌరవమో ఒక స్తోత్రమో ఇవి ఇట్టివి, సంప్రాప్తమైతేనే మన కానందం, సంతోషం, లేకపోతే దుఃఖం, లేక కొరత అని తలపోయడం శుద్ధ తెలివితక్కువ. వెలుపలి వస్తువుల వల్ల కలిగే ఆనందం లోన వుబికే ఆనందం యొక్క బిందువే.
'యత్సౌఖ్యాంబుధి లేశ##లేశత ఇమే శక్రాదయోనిర్వృతాః'
లోపల వెలసిన ఆనందపరమాత్మస్వరూపంయొక్క సౌఖ్య లేశ##మే ఇంద్రాదుల ఆనందమూ సంతోషమూ. వెలుపలి విషయములవల్ల కలిగే ఆనందం లోపలికి వెళ్ళి లయం కావలసినదే. అంతర్ముఖానందంతో ఓలలాడేవానికి-ఈశ్వరుని సాక్షాత్కారం కలవానికి వెలుపలి వస్తువులవల్ల కోరదగిన ఆనందంగాని సంతోషంగాని ఉండదు. అవి లేకపోతే అతనికి దుఃఖం ఏర్పడదు.
అలాకాక బహిర్ముఖంగా ఆనందం వెతకికొనేవాడు ఆనందం కలిగించే వస్తువులను పొంది సంతోషిస్తాడు. వియోగంచే దుఃఖిస్తాడు. అవిలేకపోతే ఏదో కొంత కలిగి నటులు క్షోభిస్తాడు. ఆయా వస్తువుల వెనువెంట అంటుకొని ఉంటాడు. అయ్యో చేతికందకపోయెనే అని చింతిల్లుతాడు. 'ఈ దుఃఖం ఎవరివల్ల కలిగింది?' అని తెలిసికొని అతనిపై దండెత్తుతాడు. కోపపడతాడు. గోలగోల చేసిపెడతాడు. ఇవీ వానిచర్యలు. వానికి శాంతి అనే మాట ఉండదు- 'స శాంతి మాప్నోతి న కామకామీ'. ఆతని కేనాటికీ శాంతి ఉండదు. వెలుపలి విషయాలు వస్తయ్, పోతయ్, వీనిని ఎవడయినా తన సుఖానికి ఆధారం గనుక చేసికొంటే అలవానికి ఏనాటికీ ఎడతెగని కొరతే. వానికి శాంతి సున్న. అని గీతలో భగవంతుడు ఒక అధ్యాయం చివర శ్లోకంలో చెప్పి ముగిస్తాడు.
వెలుపలి కామ్యాలు లెక్కలేనన్ని. వస్తే రానీ? నదులు సముద్రంలో ఎపుడూ వచ్చి పడుతున్నయ్. అపారమయిన సముద్రజలాలలో చేరిపోతున్నయ్. నదులు వచ్చి కలియకపోతే సముద్రాని కేమయినా దుఃఖమా కొరతా? దాని స్థితి ఎట్టిది?
అపూర్యమాణ మచల ప్రతిష్ఠం,
సముద్ర మాపః ప్రవిశన్తి యద్వద్.
ఆపూర్వమాణ మంటే అంతటా నిండినది. అచల ప్రతిష్ఠర్సకదలక మెదలక ఉండేది. అది రాలేదే, ఇది రాలేదే, ఇంకా నీరు చాలదే అని సముద్రం దుఃఖించదు. కొంచెమయినా చలనం లేనిది సముద్రం. 'అచలప్రతిష్ఠమ్'
రామేశ్వరం దగ్గర ఉండే సముద్రం 'రత్నాకరం, మహోదధి' అని రెండు భాగములుగా చెపుతారు. రత్నాకరంలో ఆరునెలలు అలలు లేస్తూవుంటయ్. మహోదధిలో దేవీపట్నం వంకకు వెళ్లిచూస్తే ఒక పెద్దకొలను మాదిరిగా అలలేమీ లేకుండా ఉంటుంది. అట్లే మనంకూడా వెలుపలి నుండి వచ్చే విషయాలవల్ల పుట్టే ఆనందనదులను ఆత్మానంద మహోదధి లోనికి ఇముడ్చికొని 'ఆ పూర్యమాణ మచల ప్రతిష్ఠము'గా కూచోవాలి. 'అట్లా ఉంటేనే శాంతి' అని గీతాశ్లోకం చెబుతూంది.
కాశీలో ఆదిశంకరుల యెదుట ఈ పరీక్షార్థం ఈశ్వరుడు ఒక చండాలవేషంతో వచ్చాడు. శంకరులు చూచి, దూరం దూరం దూరంగా తొలగిపో' అని అన్నారట. వెంటనే ఆ చండాలవేషంలో ఉన్నాయన ఈ కింది శ్లోకం చదివాడుట.
ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజా
నందావ బోధాంబుధౌ
విప్రోయం శ్వపచోయ మిత్యపి మహాన్
కోయం విభేదగ్రహః
కిం గంగాంబుని బింబితేంబరమణౌ
చండాల వీథీ పయః
పూరే వాంతర మస్తి కాంచన ఘటీ
మృత్కుంభయోర్వాంబరే?
గీతా శ్లోకంలో సముద్రం అని ఉంది. పై శ్లోకంలో అంబుధి అంబుధి అని, అచలప్రతిష్ఠమ్ అని గీతలో, దీనిలో నిస్తరంగానందం' అని. నిస్తరంగమహోదధిసైతం ఆచల ప్రతిష్ఠమే.
సర్వవ్యాపకమయిన ఒక ఆనందస్వరూపమే లోపల కూడా నిండి నిబిడమై ఉంది. వెలుపలి వస్తువులన్నీ లోపలి వస్తువులో ఐక్యం కావలసినవే 'అదిలేదు ఇది లేదు'. అన్న కొరతలతో మనం బాధపడవలసిన అవసరంలేదు. 'నాకు ఈ వస్తువు కావాలి' అంటే అది ఒక కొరతకు గుర్తు. నిండిన వస్తువు లోపలఉన్నప్పుడు వెలుపలివస్తువలకెక్కడి ఆవశ్యకత? 'వచ్చేది రానీ పోయేది పోనీ,' అని ఆ అఖండాకార పరమానంద వస్తు సాక్షాత్కారం కావలసిందే. లోపల వస్తులేశ##మే వెలుపలి విషయవిస్తారం అన్న జ్ఞానం ఉండాలి. సముద్రంలాగా అచలంగా ఉండాలి. అట్టివాడే - 'స శాంతి మాప్నోతి' శాంతి పొందుతాడు. అని అర్జునునికి భగవంతు డుపదేశించి-'అర్జునా! నీకు ఏకొరతా అక్కరలేదు. నీవు క్షత్రియుడవు' యుద్ధం చేయుట నీ ధర్మం 'నాధర్మం నేను చేస్తున్నాను' అనే మెలకువతో యుద్ధంచెయ్, కొరతలనే వానిని దాపులకు రానీయకు! 'వానికి కష్టం కలుగుతుందే, వీనికి కష్టం కలుగుతుందే' అనే ఉబుసు నీకు వద్దు, నీధర్మమేదో నీవు చేసి ముగించు' అని ఉపదేశపూర్తి చేశాడు.
|