Nadichedevudu   Chapters  

14. ''అభయం సర్వభూతేభ్యః''

స్వామికి మిత్రులూ, శత్రువులూ అంటూ లేరు. ''అభయం సర్వ భూతేభ్యః'' అన్నదే స్వామి ఆశయం.

ఈ క్రింది సంఘటన అందుకు నిదర్శనం.

శ్రీమాన్‌ యస్‌.టి.జి. వరదాచార్యులుగారు బందరు సమీపంలో చిట్టి గూడూరు వాస్తవ్యులు. ఎం.ఏ. పట్టభద్రులు. ప్రఖ్యాత సంస్కృత పండితులు, కవులు. 'మద్రాసులో కుప్పు స్వామి శాస్త్రిగారి శిష్యుణ్ణి' అని ఘనంగా చెప్పుకునేవారు.

గాంధిగారి సహాయనిరాకరణోద్యమం ఫలితంగా స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి స్వగ్రామంలో తమ ఇంటి పక్కనే స్వయంగా సంస్కృత కళాశాల స్థాపించి, కులమత విచక్షణ లేకుండా విద్యార్థు లందరికీ సంస్కృతం బోధించిన గీర్వాణ భాషా పోషకుడు.

భద్రాద్రిరామాలయ పునరుద్ధరణ సంఘం ఉపాధ్యక్షులుగా, అప్పటి దేవాదాయశాఖ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారితో సహకరించి ఆలయోద్ధరణకు పాటుబడిన రామభక్తుడు.

ఆ సందర్భంలో గర్భగుడి పునర్నిర్మాణం గురించి అభిప్రాయభేదాలు తలయెత్తాయి. పూర్వమున్న గర్భగుడిని విశాలపరిచి పునర్నిర్మాణం చేయాలని ఉద్ధరణ సంఘం తీర్మానించింది. ప్రజల్లో మరొక వర్గం దీనిని ప్రతిఘటించింది.

పత్రికలలో, శాసనసభలో కూడా వాదప్రతివాదాలు చెలరేగాయి. తంజావూరు నుంచి ఆగమశాస్త్రపండితులను రప్పించి, సంప్రదింపులు జరిపారు. ఏ విధంగానూ రాజీ కుదర లేదు.

తుదకు ఈ వ్యవహారం శ్రీ కామకోటి శంకరాచార్య స్వామికి నివేదించడానికి, వారి తీర్పును ఉభయపక్షాలూ అంగీకరించడానికి నిర్ణయమైంది. వరదాచారిగారు కంచి వెళ్లి, స్వామివారికి ఉద్ధరణసంఘం పక్షాన తమ వాదం వినిపించి వచ్చారు.

గర్భాలయం కొలతలను మార్చవలసిన అవసరం లేదని, మూడు వందల ఏళ్ల కిందట భక్తశిఖామణి రామదాసు నిర్మించిన గర్భగుడి ప్రమాణం ప్రకారం పునర్నిర్మాణం చేయడమే సమంజసమనీ స్వామివారు తీర్పు చెప్పారు.

ఆ తీర్పు తమ వాదానికి అనుకూలం కానందున, శ్రీ చంద్రమౌళి, శ్రీ వరదాచార్యులుగార్లుభయులూ దానికి ఎదురు తిరిగారు.

పాంచరాత్ర ఆగమం వర్తించవలసిన భద్రాద్రి ఆలయం విషయంలో అద్వైత మత ప్రవర్తకులైన కామకోటి శంకరాచార్యుల జోక్యం కూడదంటూ కొత్త ఆక్షేపణను లేవదీశారు.

అంతటితో ఆగక, ఈ వ్యవహారాన్ని హైకోర్టుకు లాగారు. కాని, కోర్టులో వారి వాదం నెగ్గలేదు.

చివరకు, కామకోటి స్వామివారి నిర్ణయానుసారంగా పూర్వపు కొలతల ప్రకారమే గర్భగుడి నిర్మాణం జరిగింది.

* * *

కొంత కాలం గడిచింది. వార్ధక్యదశలో శ్రీ వరదాచారి గారు వ్యాధిగ్రస్తులైనారు. ఒక రోజు మాట పడిపోయింది. సగం రాత్రయింది. డాక్టరు చూచి, రోగి జీవించే ఆశ లేదని చెప్పాడు. భూశయనం చేయించారు.

తరవాత జరిగిన కథంతా.............శ్రీ వరదాచార్యులు గారే స్వయంగా ఇలా వివరించారు, కళ్లనీళ్లు తుడుచుకుంటూ:

''స్వప్నంలో శ్రీ కామకోటి శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నాకు కనిపించారు: ''భయపడకండి. మీ కింకా ఆయుష్యం ఉన్నది'' అంటూ చేయెత్తి అభయ మిచ్చారు. గాఢ నిద్ర నుంచి లేచినట్టు తోచింది నాకు. నా కదలిక చూచి, మా వాళ్లు తిరిగి నన్ను మంచం మీద పడుకో బెట్టారు. డాక్టరును పిలిపించారు. డాక్టరు ఆశ్చర్యం వెలిబుచ్చుతూ, ''గండం గడిచింది'' అన్నాడు. నాలుగైదు రోజులకు నా ఆరోగ్యం మాళ్లా దారి పట్టింది.

''కంచి స్వామి వారు అప్పుడు బందరులో ఉన్నారు. బందరు వెళ్లి స్వామిని సందర్శించాను. స్వామి వారిని స్తుతిస్తూ నేను రచించిన శ్లోకాలను స్వామికి వినిపించాను. వారిని మా యింటికి ఆహ్వానించాను. స్వామి మా యింటికి దయచేశారు. నేనూ, నా కుమారుడూ ఆయన మేనా మోశాము.''

''పాంచరాత్ర ఆగమానికి చెందిన మా వైష్ణవాలయం విషయంలో జోక్యం కలిగించుకోడానికి అద్వైతమతాచార్యులకు అధికార మెక్కడిది?'' అంటూ కంచి స్వామిని గురించి వాదానికి దిగిన శ్రీ వరదా చార్యులు గారే, స్వామి తనకు ప్రాణదానం చేసినట్టు స్వయంగా అంగీకరించారు!

''అభయం సర్వ భూతేభ్యః'' అన్నది స్వామి ఆశయం.

Nadichedevudu   Chapters