Nadichedevudu   Chapters  

 

30. ''ఆచార్యుల వారిలో అల్లాను చూస్తున్నాను''

1926లో ఆచార్యస్వామి కారంబక్కుడి నుంచి పుదుక్కోటకు వెళ్లేప్పుడు అనేకమంది ప్రజలు గుంపులుగా వచ్చి వారిని దర్శించారు. వారిలో కొందరు మహమ్మదీయులు కూడా ఉన్నారు.

ఆ మహమ్మదీయులలో ఒకరు స్వామిపై తన గౌరవానికి సూచనగా స్వామి వా రెక్కిన పల్లకిని తన చేత్తో పట్టుకున్నాడు. ఆ విధంగా దాదాపు మూడు మైళ్లు ఆ ముస్లిం భక్తుడు పల్లకి వెంట నడిచాడు. స్వామి అప్పుడు పల్లకి ఆపి, ఆ మహమ్మదీయుని తన సమక్షానికి పిలిపించి, అతని యోగక్షేమాలను విచారించారు.

ఆ ముస్లింభక్తుడు తన స్వవిషయాలను స్వామికి నివేదించి, స్వామి సలహా నర్థించాడు. స్వామిని స్తుతిస్తూ తాను వ్రాసిన పద్యాలను ఫలపుష్పాదులతో స్వామికి సమర్పించాడు.

స్వామి ఆదేశానుసారం ఆ భక్తుడు తాను వ్రాసిన పద్యాలను చదివి, వాటి అర్థం వివరించాడు.

అక్కడినుండి స్వామివద్ద సెలవు పుచ్చుకుని వెళుతూ ఆ ముసల్మాన్‌ భక్తు డన్నమాట లివి:

''ఆచార్యులవారి రూపంలో నా కళ్లకు 'అల్లా' కనిపించాడు. భవబంధాలను తెంచుకొని, ముక్తి కోరే వారికి శ్రీవారిదర్శనం చాలు!''

* * *



మంత్రశక్తి

మనం మంత్రజపం చేస్తున్నాం. అది శబ్దతరంగాలను ఉత్పత్తి చేస్తున్నది. ఆ తరంగాలే మంత్రమూర్తులుగా మారుతున్నాయి.

మనం ఉపదేశం పొందిన మంత్రాన్ని అవిరామంగా జపంచేస్తూ ఉంటే ఆ పరాశక్తి అనుగ్రహం మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. ఆ మంత్రదేవత మనలను ఆవహించి, కళేబరాన్ని త్యజించే సమయంలో కూడా మనలను వదలిపెట్టదు. ఆ ధ్యానంలోనే మనం ఉండిపోగలం.

Nadichedevudu   Chapters