Sri Bhagavatha kamudi Chapters
పన్నెండవ కిరణము
భవిష్యత్ రాజుల చరిత్ర
కృష్ణుడు వైకుంఠమునకు వేంచేసిన పిదప ఈ భూమిని ఎవరు పాలించెదరు. అని పరీక్షిత్తు శుకయోగిని అడుగగా నాతడిట్లనెను.
రాజేంద్రా చంద్రవంశములో రిపుంజయుడను రాజు పాలనవరకూ వెనుక చెప్పతిని. ఆతని మంత్రి రాజునుచంపి తన కుమారుడైన ప్రద్యోతనుని రాజుగా చేయును. ఇట్లు అతని తర్వాత కలియుగమున మున్నూటారువదియేండ్లు పలువరు పాలించెదరు. తరువాత నందుడను వాడు క్షత్రవినాశన మొనర్చును తదాది రాజులెల్ల అధార్మికులై శూద్రప్రాయులగుదురు. తరువాత నవనందులనువారు నూరేండ్లు రాజ్యమేలుదురు. వారిని ఒక బ్రాహ్మణుడు చంపి మౌర్యుడైన చంద్రగుప్తుని రాజ్యాభిషిక్తుని చేయును. ఈ మౌర్యులు పదిమంది నూటముప్పదియేండ్లు పాలింతురు. ఆ రాజుల సేనాపతియైన పుష్యమిత్రుడు వారిని సంహరించి తానే రాజగును. ఆ వంశీయులు పదిమంది శతాధిక వర్షములు పాలింతురు. తరువాత ముప్పదిమంది 456 సంవత్సరములు రాజ్యమేలుదురు. ఆ తరువాత అభీరులు ఏడుగురు, గర్ధభులు పదిమంది, కంకులు పదునాలుగుమంది, యవనులు ఎనిమిది మంది, బర్బరులు పద్నాలుగుమంది, మురుళ్ళులు పదమూడుగురు, మౌనులు పదనొకండుగురు కలిసి ఒక వెయ్యితొంభై తొమ్మిది (1099) సంవత్సరములు పాలించెదరు. తరువాత ఆంధ్రులు ఏడుగురు, కోసలులు ఏడుగురు, వైఢూర్యవతులైన నైషధులు, పరిపాలించెదరు తరువాతవచ్చు రాజులు ఉపనయనాది రహితులై శూద్రప్రాయులై పాలించెదరు. తరువాత శూద్రులు, వ్లుెచ్ఛులు, అంత్యజులునూ రాజులై వేదాచార శూన్యులై రాజ్యమేలుదురు. వీరందరూ అధర్మ అసత్యపరులై తీవ్రకోపులు, పరదారధనాసక్తులై అల్పాయువులై సంస్కారక్రియాహీనులై రాజవేషమున ప్రజలను పీడింతురు. ధర్మము, సత్యము, శౌచము, క్షమ, దయ నశించును.
కలియుగమున ధనమే ఉత్కర్షకు కారణమగును. ధర్మన్యాయవ్యవస్థయందు బలమే కారణమగును. దాంపత్యమున అభిరుచియు, వ్యవహారమున వాక్శౌర్యము ప్రకోపించును. బహుభాషణయే పాండిత్యలక్షణము. స్త్రీని స్వీకరించుటే వివాహము. కేశధారణమే సౌందర్యము. ఉదరభరణమే పురుషార్థము. యశోనిమిత్తమే ధర్మసేవనము. బ్రహ్మ క్షత్రియాశూద్రులలో బలవంతుడే రాజగును. జనులు అనావృష్టి, దుర్భిక్ష, జ్వరపీడితులై అన్యోన్యభయడున ఘోరకష్టముల పాలగుదురు. ఇరువది లెకముప్పది సంవత్సరములే జనులకు పరమాయర్దాయము. వర్ణాశ్రమ ధర్మములు వేదమార్గము చెడును. ప్రజలు చౌర్య, అసత్య, హింసాది నానాదుర్ వృత్తుల పాలగుదురు.
ఇట్లు ధర్మము అడుగంటి అధర్మముపైకిరాగా ధర్మరక్షణార్థము భగవంతుడు శంబలగ్రామమున విష్ణుయశుడను బ్రాహ్మణుని ఇంట కలికిరూపమున అవతరించి శీఘ్ర గమనమైన అశ్వముపై తిరుగుచూ దుష్టుల సంహరించి ధర్మరక్షణచేయును. ధర్మపరిపాలనకుడైన భగవంతుడు కల్కిరూపమున అవతరించిన తరువాత కృతయుగము వచ్చును. అప్పుడు జనించు జనులు సాత్వికులు అగుదురు. చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఏకకాలమున ఎప్పుడు పుష్యమీనక్షత్రమున ప్రవేశింతురో అప్పుడు కృతయుగ ప్రవేశము. సప్తర్షిమండలము మఖానక్షత్రములోనున్నపుడే కృష్ణనిర్యాణము కలిప్రవేశము జరుగును.
కృథయుగమున ధర్మము నాలుగుపాదముల, త్రేతా యుగమున మూడుపాదములనూ ద్వాపరయుగమున రెండు పాదములునూ కలియుగమున ఒక పాదమున నుండి, అదియును చివరకు నశించును. అపుడు మానవులు దురాచారులు, శూద్రసంకరజాతులు నగుదురు.
సత్త్వగుణ ప్రధానమై జ్ఞానతపోనిష్ఠ కృతయుగ లక్షణము. రజః ప్రధానమైన ప్రవృత్తి త్రేతా యుగలక్షణము. రజస్తమో మూలమైన కామము, దంభము, మత్సరము మున్నగునవి ద్వాపరలక్షణములు. మాయ, అసత్యము, అలసత, నిద్ర, హింస, శోకమోహభయదైన్యములుకల తామస ప్రవృత్తి కలియుగ లక్షణములు.
కలికాలమున జనులు కామాసక్తులు, దరిద్రులునగుదురు. స్త్రీలు వ్యభిచరింతురు. దొంగలు చలరేగుదురు. రాజులు ప్రజలను భక్షించువారగుదురు. ద్విజులు శిశ్నోదర పరులగుదురు. వైశ్యులు మోసమున వ్యాపారము చేయుదురు. పురుషులు స్త్రీవశులై పితృభాతాదులను విసర్జింజెదరు. శూద్రులు తపోవేషమున ప్రతిగ్రహము స్వీకరించుచూ అధర్మజ్ఞులయ్యూ, ఉన్నతాసనమున కూర్చుండి ధర్మము చెప్పబూనుదురు. ప్రజలు నిత్యభీతులై అనావృష్టి దుర్భిక్షములచే బాధితులగుదురు. వృద్ధులైన తల్లి దండ్రులను విసర్జించుదురు. భగవంతుని పూజింపరు.
ఓ రాజేంద్రా ! కలి యిట్లు సర్వదోషనిధానంబైనను భగవన్నామ సంకీర్తనమువలన బంధమును వదలి ఆ పరమ పదమును చేర్చు ఒక్క మహాగుణము ఈ కలియుగమున కలదు. కృతయుగమున విష్ణుధ్యానమువలననూ, త్రేతాదియుగమున యజ్ఞాది కర్మాచరణమువల్లనూ ద్వాపరమున హరిపరిచర్య వలననూ గలుగు ఫలము కలియుగమున భగవన్నామ సంకీర్తనమువలన సిద్ధించును.
కాలలక్షణమున యుగమానము, నాలుగువిధములలయమునుగూర్చి శుకుడిట్లుచెప్పెను. వేయిమహాయుగములు బ్రహ్మకు ఒకపగలగును దాని తుది వేయిమహాయుగముల కాలము రాత్రి అగును అప్పుడు ఈ ముల్లోకములు ప్రళయము చెందును. ఇది నైమిత్తిక ప్రళయము. నారాయణుడు జగమును ఉపసంహరించి సేవించుచున్నపుడు బ్రహ్మాండమెల్లలయించును. ఇది ప్రాకృతిక ప్రళయము. సర్వభూతములు ఎల్లప్పుడూ ఉత్పత్తి ప్రళయము పొందుచుండును. ఇది నిత్య వళయము. వివేకఖడ్గమున మాయామయ అహంకారరూపమగు ఆత్మ బంధనమును త్రెంచి ఆత్మసక్షాత్కారముపొంది ముక్తుడగును. ఇది ఆత్యంతిక ప్రళయము.
పరీక్షిత్తునకు శుకుడు బహ్మోపదేశము చేయుట
రాజేంద్రా నీవు మరణింతువని భయపడవలదు. నీవు ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు లేనివాడవుకావు. నిత్యుడవు. దేహమునకే జన్మమరణములు. నీలోని ఆత్మ జన్మమృత్యువర్జితమై నిర్వికారమై సచ్చిదానందమూ, అనంతమూ అయివున్నది. జననమరణములు, క్షుత్పిపాసలు, సుఖదుఃఖములు వీటీతో కూడిన సంసారము పంచకోశములకే కాని ఆత్మకు కాదు. ఆత్మ కేవలమూ పరబ్రహ్మమే ! 'అహం బ్రహ్మాస్మి' అనియు, 'బ్రహ్మైవాహమస్మి' అనియూ ఆత్త్మెకత్వమును అనుసంధించుచూ నిత్యానందము ననుభవింపుము. తక్షకుడు నిన్నేమియు చేయజాలడు నీకు సర్వాత్మభావము కలిగినపుడు, నీశరీరము విశ్వమూ నీకు అన్యములు కాపుగదా! అని శుకుడు పరీక్షిత్తునకు పరబ్రహ్మోపదేశము చేసి మృత్యుభయమును పోగొట్టెను. అందుకు పరీక్షిత్తుశుకునకు సాష్టాంగ ప్రణామములాచరించి, ఆయన అనుజ్ఞతో సర్వేంద్రియములనూ నియమించి సమాధిస్థితిని పొంది బ్రహ్మీభూతుడయ్యెను.
తక్షకుడు పరీక్షిత్తును చంపుటకు వచ్చుచుండగా కాశ్యపుడను విషాహార మంత్రప్రయోగ నిపుణుడు ఎదురు పడినంత తక్షకు డతనికి బహుళధనమునిచ్చి పంపివేసెను. తరువాత తక్షకుడు బ్రాహ్మణరూపమువచ్చి పరీక్షిత్తు శరీరమును కరచివేసెను. అతనాశరీరము ఆ తక్షక విషముచే దగ్ధమయ్యెను. అంతట పుష్పవర్షముకురిసి దేవదుందుభులు మ్రోగెను.
ఈ భాతవతపురాణ సంహితను తొల్లి నారాయణ మహర్షి నారదునకు, నారదుడు మాత్రండ్రియగు బాద రాయణువకును, ఆయన నాకును ఉపదేశించెను. నేను మీకు ఇప్పుడు చెప్పితిని. ఇట్లు నైమిశారణ్యమున దీర్ఘ సత్రయాగమున సూతులవారు శౌనకాదిమునులకు చెప్పెను.
పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు తనతండ్రిని తక్షకుడను సర్పముచంపెనని తెలిసి బ్రాహ్మణసహాయమున సర్పయాగముచేయగా సర్పములన్నియూవచ్చి అగ్నిలోపడి నశించుచుండెను అంత తక్షకుడు భయపడి ఇంద్రుని శరణువేడగా అది తెలిసిన జనమేజయుడు ''సహేంద్ర తక్షకాయస్వాహా'' అని ఇంద్రునితో సహా తక్షకుడు వచ్చిపడులాగున మంత్రము ఉచ్చరించగా బృహస్పతి అచ్చటకే తెంచి జనమేజయునికి జ్ఞానబోధ చేసి ఆ యభిచారిక హోమమును చాలింపజేసెను. అంతట నాతడు బృహస్పతిని పూజించి వైరాగ్యముతో జ్ఞానమార్గమవలంబించెను.
తరువాత సూతుడు శౌనకాదులకు వేదవిభాగక్రమమును, పురాణములను బోధించెను. పదునెనిమిది పురాణముల నామములు తెలిపెను. వానిలో బ్రాహ్మణము పదివేలు, పాద్మము 55వేలు, వైష్ణవము 23 వేలు, శైవము 24వేలు, భాగవతము 18 వేలు, నారదము 25 వేలు, మార్కండేయము తొమ్మిదివేలు, ఆగ్నేయము 15 వేల నన్నూరు. భవిష్యత్తు పధ్నాలుగువేల అయిదువందలు, బ్రహ్మకైవర్తము 18వేలు, లైంగము 11 వేలు, వారాహము 24వేలు, స్కాందము 81 వేలు, వామము 10 వేలు, కూర్మము 17వేలు, మాత్స్యము 16 వేలు, గారుడము 19 వేలు, బ్రహ్మాండము 12 వేలు - ఈ విధమున 18 పురాణములు వెరసి నాలుగులక్షల పరిమితము.
ఈ పదునెనిమిది పురాణములలో ఈ భాగవతమును భగవంతుడు బ్రహ్మదేవునకు ఉపదేశించెను. ఇందులోని కథలన్నియూ వైరాగ్యబోధకములు ఈ భాగవతములో ప్రతిపాదించబడిన విషయము, సర్వవేదాంత సారమును కైవల్య ప్రయోజనమును, బ్రహ్మాత్మైకత్వ లక్షణమునూ అగు అద్వితీయ పరబ్రహ్మము.
పురాణములన్నిటిలోనూ ఈ భాగవతము ఉత్తమము. దీనిలో హరిలీలలు, చక్కగా వర్ణింపబడినవి. ఎట్టి కష్టములో నున్ననూ ''హరయేనమః'' అని ఉచ్చైస్స్వరముతో పలికిన సర్వపాపవిముక్తి కలుగును. భగవద్గుణ కీర్తనమే సంపార సాగరమును దాటించెను. హరిగుణములు కీర్పింపని గ్రంథము గ్రంథము కాదు. కృష్ణపాదారవిందస్మరణ, అమంగళము లన్నింటినీ నశింపజేసి ఉత్తమజ్ఞానమును కలిగించును. వాసుదేవుని మహాత్మ్యమును శుయోగీంద్రుడు ఈ భాగవత రూపముగా పరీక్షిత్తునకు చెప్పిన దానిని నేను మీకు చెప్పితిని. ఈ భాగవతమును ప్రతిదినము ఏస్వల్పభాగమైనను పఠించినను, వినిననూ భగవదనుగ్రహము కలుగును. ఏకాదశినాడు గాని ద్వాదశినాడు గాని ఉపవశించి
పఠించిన సర్వపాపములు పోయి పవిత్రుడగును.
బ్రాహ్మణుడు ఈ భాగవతమును చదివిన ప్రజ్ఞను పొందును రాజన్యుడు చదివిన ధరిత్రీమండలమునెల్ల పాలించును వైశ్యుడు చదివిన ధనసమృద్ధిగాంచును. శూద్రుడు చదివిన సర్వపాపములు నశించును. ఈ భాగవతమును పఠించిన ద్విజుడు సర్వవేదపారాయణ ఫలమునుపొంది పరమపదము చేరును.
(పన్నెండవ కిరణము సమాప్తము)
పన్నెండవ స్కంధము సమాప్తము.
భాగవతకౌముది సమాప్తము.
శ్రీ శ్రీ శ్రీ