Sri Bhagavatha kamudi    Chapters   

6వ కిరణము

అజామిళో ప్రాఖ్యానము - వృత్రవధ - చిత్రకేతూపాఖ్యానము

అజామిళోపాఖ్యానము

పూర్వచరిత్రలో నరకములో వర్ణన విని ఆ నరకముల బారినుండి తప్పించుకొను మార్గము తెల్పుమని పరీక్షిత్తు శకులవారిని అడుగగా శుకుడు ఇట్లు చెప్పెను. ''రాజా మనోవాక్కాయములతో చేసిన కర్మల యొక్క పాపము పోవుటకు ఇచ్చట, నీ దేహములోనే విహిత ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను. దేహమున వ్యాధి ప్రవేశించిన వైద్యుని చికిత్స పొందినట్లు, చేసిన పాపముల తారతమ్య మెరిగి వానికి తగిన విధముగ ప్రాయఃచిత్తము చేసికొనిన ఆ పాపములు పోవచ్చును. అట్లు కానియడల ఈ దేహాంతరమున నరకములో తీవ్రమైన బాధల ననుభవింపక తప్పదు. ప్రాయఃచిత్తములు ఆచరించియూ వివశులై కొందరు తిరిగి పాపములు చేయుచుందురు ఏలనన, ప్రాయశ్చిత్తాదులవలన పాపము తాత్కాలికముగా పోవును. అందువలన వారు తిరిగి పాపము చేయుటకు అవకాశము కలుగుచున్నది. రోగమునకు పధ్యమువలె, ప్రాయశ్చిత్తాదుల తరువాత, నియమముల నాచరించుచూ భగవంతునియడల భక్తికలిగినయడల, తిరిగి పాపములను చేయక శ్రేయస్సును పొందగలరు. పాపము సమూల ధ్వంసము కావలెనన్న ఆత్మజ్ఞానము ఒక్కటే పరమ ప్రాయశ్చిత్తము. కొందరు భక్తియోగమువల్ల కూడా పాపములు పోగొట్టుకొందురు. సామాన్య పరిస్థితులలో పవిత్ర నదీజలము దేహాదులను శుద్ధి చేసినను, సురాభాండమును శుద్ధిచేయలేదుకాదా! అటులనే నానా ప్రాయశ్చిత్తములను నియమపూర్వకముగా నాచరించిననూ భగవద్భక్తి లేనివారికి శుద్ధిగావింపనేరవు. భగవద్గుణములపై అనురక్తితో హరిని మనస్సున నిల్పుకొన్నవారి పాపములన్నియు పూర్తిగ నశించును. అట్టివారికి యమదర్శనము కానేరదు. ఇట్టి సందర్భంలో యమదూతలకు, విష్ణదూతలకు జరిగినన సంవాదము అజామిళుని చరిత్రలో వచ్చును. దానిని వినిన మీకు సంశయ నివృత్తి జరుగును.

అజామిళుని చరిత్ర

పూర్వము కన్యాకుబ్జదేశమునందు అజామిళుడను బ్రాహ్మణుడుండెను. వేదాధ్యయన సంపన్నుడు, శీలాచార గుణాశ్రయుడు అయిన అతడు గురువుగారికై కందమూల ములు కొనివచ్చుటకు అడవిలో సంచరించుచుండగా, కల్లు త్రాగిన కైవులో తన భర్తతో క్రీడించుచున్న ఒక స్త్రీని చూచి, మోహవశుడై ఆ స్త్రీయందు అనురాగముపొంది, పత్నిని స్వధర్మమును వదులుకొని ఆమెతో సంసారము చేయుచూ, బిడ్డలకని పోషించుటకు అక్రమ ధన సంపాదన చేయుచూ పాపిష్టి జీవనము గడుపుచుండెను. తన చివరి కుమారునికి నారయణుడని పేరుపెట్టి, నిత్యము అతనిని పిలుచుచు గొప్ప మమకారముతో వుండెను ఇట్లుండగా అతనికి మరణ మాసన్నమై నరకమునకు గొనిపోవుటకు ముగ్గురు యమభటులు వచ్చిరి. వారి భీకరాకారము చూచిన అజామిళుడు, అదిరిపడి ప్రక్కనే ఆడుకొనుచున్న ఆఖరి కుమారుడు కనపడగా 'నారాయణ' యని అరచెను. ఇట్లు భగవన్నామము అతని నోటినుంచి వెలువడగా, నలుగురు విష్ణుదూతలు వెంటనే ప్రత్యక్షమై యమదూతలను అడ్డగించిరి. అంతట యమదూతలు 'ఇతడు పరమ పాసి కావున నరకమునకు తీసుకొనిపోవుటకు యముడు పంపగా వచ్చితిమి, మీరు అడ్డగించుట ధర్మము కాదు. మమ్ములను అతని ప్రాణములను తీసుకొని పోనిండు, మీరు అవతలకు పొండు'' అనగా విష్ణుదూతలు ఇట్లనిరి, ''యమదూతలారా, మీకు ఎవరిని దండింపవలెనో, ఎవరిని దండింపరాదో తెలియదు. ధర్మాధర్మములు తెలియకుండ మీరు ప్రవర్తించరాదు. వేదచోదితమైనది ధర్మము. తద్విపరీతము అధర్మము వేదమనగా సాక్షాత్‌ నారాయణ స్వరూపము. మానవుడు ఆచరించు ధర్మాధర్మములకు సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, గోవులు, చంద్రుడు, సంధ్య, అహోరాత్రములు, దిక్కులు, జలము, భూమి, కాలము, ధర్మము అనునవి సాక్షులు. గుణసంగము వలన మానవుడు పుణ్యాపుణ్య కర్మలుచేసి తదనుగుణమైన ఫలమును అనుభివించును. మానవుని లింగశరీరమే సంసారమునకు కారణము. ఇదంతయూ పరమేశ్వరారాధనవలననే నశించును. ఈ అజామిళుడు మీరు చెప్పినట్లు ఎన్నో పాపములను చేసెను. నిజమే! కాని అట్టి పాపములనెల్ల హరించు హరినామమగు 'నారాయణ' నామమును అవసానమున, వివశుడై యుచ్చరించెను. దానివలన అతని పాపములన్నియు నశించెను. వ్రతాది ప్రాయశ్చిత్తములవలన అప్పటి పాపములు మాత్రమే పోవునుగాని, తిరిగి పాపాచరణ ప్రవృత్తి ఆగదు. అట్లుగాక హరినామోచ్చారణవలన పాపనాశనము చిత్తశుద్ధియు కలుగును. అందుచేత అతడు తిరిగి పాపములను చేయడు. ఈ అజామిళుడు అంత్యకాలమున 'నారాయణ' నామము ఉచ్చరించుటచేత అతని పాపములు అన్నియు నశించెను. అందుచేత అతనిని నరకమునకు తీసుకొని పోగూడదు.

ఇతడు తనపుత్రుని నామమును ఉచ్చరించెను గాని భగవన్నామము కాదుగదా యని అందురేమో, తెలిసి ముట్టుకొన్ననూ, తెలియకముట్టుకొన్ననూ అగ్ని కాల్చునట్లు, తెలిసి సేవించిననూ తెలియక సేవించిననూ, ఔషధము రోగమును హరించు విధమున, జ్ఞానముతో గాని, అజ్ఞానముతో గాని హరినామము ఉచ్చరించిన పాపక్షయమగును. అతడు ఉచ్చరించినది కుమారుని నామమే అయిననూ, అది భగవన్నామమగుటచేత దాని ప్రభావమును కనపరచును. ఇట్లు పాపరహీతుడైన అజామిళుని యమలోకమునకు గొనిపోవలదు. ఇంకనూ మీకు నందియము కలదేని, మీ ప్రభువగు యమధర్మరాజు నడిగి తెలుసుకొనుడని చెప్పగా, ఆ యమభటులు పాశములను తీసివేసి, యమునివద్దకుపోయి జరిగినంతయూ విన్నవించిరి.

అంతట యముడు ''దూతలారా, అఖిలలోకములకు నే నొక్కడనే శాశించువాడనుగాను, నేనే ఈశ్వరుడను కాదు. నాకుపైన ఈ చరాచర ప్రపంచమునంతకు ఈశ్వరు డొకడు కలడు. ఆ భగవంతుని ధర్మములకు నేనును బద్ధుడనే. ఆ భగవంతుని పరమధర్మములైన భాగవత ధర్మములను బ్రహ్మ, నారదుడు, శంకరుడు, సనత్కుమారుడు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, శుకుడు నేను, అను పన్నిద్దరము మాత్రమే ఎరిగినవారము. ఆ ధర్మముల నెరిగిన అమృతత్వము లభించును. కావున ఈ లోకమున మానవునకు భగవంతుని నామకీర్తనాదులచే భక్తి యలవరచుకొనుటయే పరమధర్మము, మోక్షమార్గము అయి వున్నది. సాధువులై, హరిర శరణాగతులైన భక్తులమయొద్దకు మీరు పోవలదు. వారిని దండిప నేనర్హుడనుగాదు. కావున మీరు భగవద్విముఖులై ధన దారాదులపై తృష్ణ కలిగిన పాపాత్ములను మాత్రమే ఇటకు తీసుకొనిరండు. నాలుక హరి గుణనామము వుచ్చరింపక, మనస్సు భగవంతుని పాదార విందములు కలపక, శిరస్సు ఆ పరమపురుషుని మ్రొక్కక, వుండు కేవల ప్రాపంచికులైన పావులను నా యొద్దకు తీసుకొనిరందు'' అని చెప్పెను. అప్పటినుండియు మయదూతలు హరిభక్తుల జోలికిపోక, కేవలము పాపాత్ములను మాత్రమే తీసుకొని పోవుచున్నారు.

ఇట్లు అజామిళుని వదలివెళ్లిన యమదూతలు తిరిగి రానందున చనిపోయిన వాడు తిరిగి బ్రతికినట్లు లేచి, యమభటులకు, విష్ణూదూతలకు జరిగిన సంవాదమునంతయూ వినిన వాడు కావున దానిని మననము చేసుకొని, ఇట్లను కొనెను.

''నేను బ్రాహ్మణవంశములో పుట్టి పండితుడనై యుండియూ, అడవిలో కల్లుత్రాగి కామపీడితురాలైన స్త్రీని చూచి మోహితుడైన, దానితో సంసారముచేసి, బిడ్డలను కని ఇంత భ్రష్టుడనైతినే! తల్లిదండ్రులను భార్యను త్యజించి కల్లునుగూడ త్రాగి ఎన్నో అధర్మకార్యముల చేసి, ఇంత ధర్మభ్రష్టుడనైన నాయొద్దకు, మరణ సమయమున యమభటులతో పాటు విష్ణుదూతలు వచ్చుటకు, వారి దివ్యదర్శనము నాకగుటకు నేను చేసిన పూర్వపుణ్య మేదో వుండి యుండవలెను. లేనియడల పరమ పాపాత్ముడనైన నానోటివెంబడి 'నారాయణ' అనునామము అవసాన కాలమున ఎట్లు వచ్చును? నేను 'నారాయణ' అనినంత మాత్రమున వాసుదేవుడు తన దూతలను నాయొద్దకు పంపి నాడే? అవశమునను పుత్రుని నామమైన 'నారాయణ' అని నంత మాత్రమున ఆ నామ ప్రభావముచే విష్ణుదూతల దర్శనము, యమదూతలు తనను విడిచిపుచ్చుటయు జరిగెనుగదా! శ్రద్ధాభక్తులతో భగవంతుని నామసంకీర్తనము చేసి ఆరాధించిన దాని మహాత్మ్యము ఏమిని చెప్పగలము ? కేవలము మోక్షమువచ్చును కదాయని తానుచేసిన పాపములకు పూర్తిగ పశ్చాత్తాపము పొంది విరక్తుడై పుత్రాది స్నేహ బంధములను త్రెంచి గంగానదీ తీరమునకుపోయి, యోగా భ్యాసమున ఇంద్రియముల నరికట్టి మనస్సును భగవత్స్వ రూపమున అనుసంధించి ఆత్మానుసంధానము గావించి యుండగా యమభటులను వారించిన నలుగురు విష్ణుదూతలు తిరిగి ప్రత్యక్షమై తెచ్చిన విమానములో సూక్ష్మ దేహముతో వైకుంఠమునకు చనియోను.

తరువాత పరీక్షిత్తు ప్రాచేతన వంశ విస్తారమును చెప్పుమనగా వారి వంశమున బుట్టిన దక్షుడు ప్రజావృద్ధికి తపస్సుచేయగా హరి ప్రత్యక్షమై 'నీ తపస్సునకు మెచ్చితిని. నా ప్రేరణచేతనే నీవు ప్రజాసృష్టి కావలెనని కోరితివి. తపస్సు నాకు హృదయము, విద్య తనువు, క్రియ ఆకృతి, క్రతువు లింగములు, ధర్మము ఆత్మ, సురలు ప్రాణములు, నేను తొలుత ఈ సృష్టికి పూర్వము చైతన్యమాత్రముగనే యుండి మాయావేశమున బ్రహ్మాండంబు కలుగ, దానిలో నించి బ్రహ్మపుట్టి సంకల్పమాత్రమున కొంత సృష్టిచేసి, దానివల్ల వృద్ధి కాకపోగా, మిధునసృష్టిని యారంభించెను. ఈ మిధునసృష్టి పరంపరలోనే నీవు పుట్టితివి. నీవునూ సృష్టిని వృద్ధిచేయుము'' అని అంతర్ధాన మొందెను.

దక్షుడు వివాహము చేసుకొని అతనికి కలిగిన సంతానమునకు నారదుడు నివృత్తిధర్మమును బోధించి వివాహమునకు విముఖులను చేసెను. అందువల్ల ప్రజావృద్ధి కాకపోవుటచే-అందుకు కారణమైన నారదుని కోపముతో 'నారదా, నీవు వంశమును వృద్ధికానీయక పాడు చేసితివి గాన నీవు ఎచ్చోటనైన కాలునిలువకుండ అనవరతము లోకసంచారము చేయుచుందువుగాక' యని శపించెను.

అందుకు నారదుడు ప్రతిశాపము ఇచ్చుటకు సమర్ధుడయ్యు భగవద్భక్తుడు గాన ఓర్చుకొని, ఈ లోకసంచారమున లోకక్షేమము కలుగుటకు అవకాశము కలుగునని సంతసించెను.

అటు పిమ్మట దక్షుడు ఇంకొక భార్యయందు అరువది కుమార్తెలను కని వారికి వివాహముచేసి ఆ విధముగ వారి సంతానముతో లోకమును నింపెను. ఆ వంశములో వచ్చిన త్వష్ట, దైత్య భగినియగు రచనఅనుదానిని వివాహమాడగా సన్నివేశుడు, విశ్వరూపుడునను నిద్దరు కుమారులు కలిగిరి.

ఇట్లుండగా ఇంద్రుడు త్రిలోకాధిపత్య గర్వముచే, నిండు సభలో, సింహాసనమునగూర్చుండి, గురువగు బృహస్పతి రాకకు వేచి నమస్కరించక మదోన్మత్తుడైవుండగా, బృహస్పతి ఇంద్రుని ఐశ్వర్యమదము ఇట్లు చేసెనని తలచి తన ఆశ్రమమునకు వెడలిపోయెను.

ఇంద్రుడు ఇట్టి గురుధిక్కారమువలన తనకు కీడు వాటిల్లునని గ్రహించి, పశ్చాత్తాపపడి, బృహస్పతిని వెదుకుటకై వెళ్ళగా, ఆయన తన ఆశ్రమములోగూడా లేకుండా అదృశ్యమయ్యెను.

దేవతలు ఈ విధముగా గురువులేని వారని గ్రహించి రాక్షసులు దేవతలపైకి యుద్ధమునకు వచ్చి హీంసించుచుండ, వారు బ్రహ్మదేవుని శరణుపొందిరి. బ్రహ్మ 'త్వష్ట పుత్రుడగు విశ్వరూపుని మీరు గురువుగాఎన్నుకొనిన మీకు జయము కలుగు' ననిన, వారు విశ్వరూపునివద్దకు జని తమకు గురువుగా ఉండమని ప్రార్థించుచూ ''విశ్వరూపా! లోకమున ఆచార్యుడు వేదమూర్తియని, తండ్రి బహ్మమూర్తియని, భ్రాత ఇంద్రమూర్తియని, తల్లి భూమిమూర్తియని, భగినిదయమూర్తియని అతిధి ధర్మమూర్తియని, అభ్యాగతుడు అగ్నిమూర్తియని, సర్వభూతములు ఆత్మమూర్తియని చెప్పబడుచున్నవి గదా! మాకిప్పుడు కలిగినకష్టములను తొలగించిమమ్ములను రక్షింప నీవే తగినవాడవు. నీ తేజస్సు చేత మేము శత్రువులను పారద్రోలి జయించునట్లు మమ్ము అనుగ్రహింపుము మిమ్ములను పురోహితుడుగాను, గురువుగాను వరించితిమి. వయస్సులో మాకన్న పిన్నవయ్యును, వేదవిదుడవు జ్ఞానిని గనుక నమస్కరించుచున్నాము. మమ్ము అనుగ్రహింపుము''

వారి ప్రార్థన విని విశ్వరూపుడు, పౌరోహిత్యము బ్రహ్మవర్చస్సు క్షీణింపచేయును కనుక అంగీకరింపలేను. కాని దేవలోక క్షేమమునకై మీరందరూ ప్రార్ధించినారు గాన, కాదనుట ధర్మము కాదని అంగీకరించుచున్నానని చెప్పి ఇంద్రునకు అసురులను గెలుచుటకుగాను మహావిద్య, నారాయణ కవచమును ఉపదేశముచేసెను. అంతట ఇంద్రుడు వాటి పారాయణామహిమవలన రాక్షసులను యుద్ధమున ఓడించి తిరిగి మూడులోకములకు అధిపతి అయ్యెను.

విశ్వరూపునకు రాక్షసులు మేనమామలగుటచే, ఇంద్రుని పక్షమున యజ్ఞములుచేయుచు, హవిర్భాగములను రాక్షసులకుగూడ అందచేయుచుండెను. ఈ మోసమును గ్రహించి ఇంద్రుడు, విశ్వరూపుని వధించెను. అట్టి బ్రాహ్మణోత్తముని వధ వలన సంక్రమించిన బ్రహ్మహత్యా పాపమును, ఇంద్రుడు నాలుగు విధములుగా భాగించి ఒక భాగము భూమికి, ఊసరక్షేత్రముల స్వరూపములోను, ఒక భాగము జలమునకు నురుగు; బుడగలుగాను, వృక్షములకు జిగురు బంకగాను, స్త్రీలకు ప్రతిమాసము వెలువడు రజోదర్శనమున బహిష్టు వుండుటగాను పంచెను.

విశ్వరూపుని మరణవార్త వినిన అతనితండ్రి త్వష్ట, ప్రతీకారేచ్ఛతో ఇంద్రుని చంపతగిన పుత్రుని కొరకై ''అభిచారేష్టి''ని సలిపెను. కాని అతని దురదృష్టవశమున హోమముచేయుటలో అపస్వరము దొర్లి ఇంద్రుని చేతిలో మరణించెడు కుమారుడు కలిగెను అతడు ఘోరభయంకరాకారమున దినదిన ప్రవర్థమానుడై, వృతృడుగా పేరుగాంచి దేవతలమీదికిపోయి వారిని హింసించుచుండ, ఇంద్రుని నాయకత్వమున దేవతలందురు విష్ణుమూర్తికడకు జనిమొర పెట్టుకొనగా విష్ణుమూర్తి వారితో 'మీరు దధీచి మహర్షిని ప్రార్థించి ఆయన శరీరమును కోరుడు. ఆయన వెన్నెముకతోనూ ఇతర అంగములతోనూ తయారగు వజ్రాయుధము వలననే వృత్రాసురుడు సంహరింపబడునని ఆశీర్వదించి అంతర్ధానమయ్యెను.

దేవతలు దధీచి మహర్షివద్దకు జని మహర్షీ మీరు బ్రహ్మజ్ఞానము కలిగిన జీవన్ముక్తులు గనుక, దేహాభిమానులు కారు గాన మీ శరీరమును మా కొసంగిన వృత్రాసుర సంహారమునకు ఆయుధములు చేయుటకు ఉపయోగించె దము'' అని ప్రార్థించిరి.

అంత దధీచి మహర్షి ''అనిత్యమైన ఈ దేహమును లోకక్షేమమునకై కోరుచున్నారు. గాన తప్పక ఇచ్చెదన''ని పలికి సమాధిలోనికిపోయి దేహమును విడచెను.

అంత ఆయన వెన్నెముకతో తయారైన వజ్రాయుధముతో ఇంద్రుడు ఐరావతమునెక్కి వృత్తాసురునితో ఘోర భీకర యుద్ధమును సలిపెను. కాని వజ్రాయుధమును ఉపయోగింపలేదు.

అంత వృత్రాసురుడు ఇంద్రునితో నీవు వెంటనే వజ్రాయుధమును ప్రయోగించి నన్ను సంహరించిన, నేను కర్మబంధమును వదలి ఉత్తమ గతిని పొందెదను. ముల్లోకములయందలి సంపదలు, ద్వేషము, భయము, మదమును కలిగించును గాన భగవంతుడు తన భక్తులకు సంపదల నొసగడు. ఐశ్వర్యమే ఇట్టి అనర్ధములకు కారణమని భగవంతుని ధ్యానించుచూ, శ్రీ హరీ, నా మనస్సు నిన్నెప్పుడూ చూడకోరుచున్నది. నాకు ఎల్లప్పుడు నీ భక్తులతో సాహచర్యము కలిగించుము. నాకు దేహపుత్ర విత్తాదులయందు ఆసక్తి కలుగకుండ అనుగ్రహింపుమని ప్రార్ధించెను.

యుద్ధములో మరణించి దేహవిముక్తిచెంద నిశ్చయించి ఇంద్రునితో తలపడెను. ఇంద్రుడు వజ్రాయుధము ప్రయోగించి వృతృని దక్షిణ భజమును ఖండించెను.

కోపోద్రేకమున వృత్రుడు పరిఘను ఎత్తి ఇంద్రునిపై ప్రయోగించగా వజ్రాయుధము అతని చేతినుండి జారిపడెను. దానిని తిరిగి తీసుకొనుటకు ఇంద్రుడు సిగ్గుపడుచుండగా వృత్రుడు ''ఇంద్రా వజ్రాయుధముతో నన్ను సంహరింపుము ఇప్పుడు నీకు కలిగిన పరాజయమునకు అధైర్యపడకుము. జయాపజయములు మన యధీనములోనికి కావు. భగవంతుడు సృష్టి, స్థితి, లయములకు కారకుడై తాను సర్వకారణంబై విరాజిల్లును కోరకపోయినను ఆపదలు వచ్చు విధమున. ఐశ్వర్యమును, సమస్త సుఖములునూ వాని వాని వాని కాలములో కోరకుండగనే వచ్చును. కావున జయాపజయములకును, సుఖదుఃఖములకును మనము కారకులము కాదు. స్వత్వము, రజస్సు, తమస్సు అనునవి ప్రకృతి గుణములు కాని ఆత్మగుణములు కావు. వానికి ఆత్మ సాక్షియని తెలిసికొనిన ఆతడు బద్ధుడు కాడు. కావున నీవు వజ్రాయుధముతో నన్ను సంహరింపుము'' అని యిట్లు వృత్రాసురుడు ఇంద్రునికి తత్వబోధ చేయగా ఇంద్రుడు ఆనందాశ్చర్యములతో అతనిని కీర్తించి వజ్రాయుధమును తిరిగి ధరించి ''వృత్రా, నీవు ఈశ్వరుని సర్వాత్మకముగ భజించి సిద్ధుడవైతివి. విష్నూమాయను గూడ జయించితివి. అసుర భావముపోయిన మహాపురుషడవైతివి'' అని తిరిగి యుద్ధము ప్రారంభించి వృత్రుని రెండవ చెయ్యి గూడా తెగకొట్టెను.

అంత నోరు బ్రహ్మాండమంతగా తెరచి ఐరావతముతోసహా ఇంద్రుని మింగివేసెను. అంత యింద్రుడు నారాయణ కవచ మహామంత్రముతో భగవంతుని ప్రార్థించి వజ్రాయుధముతో వాని పొట్టను చీల్చి బయల్పడి వృత్రాసురుని శిరస్సు ఖండించెను.

ఇట్లు వృత్రుడు వధింపబడగా దేవదుందుభులు మ్రోగినవి. పుష్పవర్షము కురిసెను. వృత్రాసురుని దేహము నుండి గొప్ప తేజస్సు బయటకువచ్చి అందరూ చూచుచుండగా భగవంతునిలో లీనమయ్యెను.

వృత్రాసురుని సంహారమున అందరితో పాటు ఇంద్రుడు సంతసించలేకపోయెను. ''నేను విశ్వరూపుని వధంచుటవలన వచ్చిన బ్రహ్మహత్యాపాపము స్త్రీ, భూ, జల,వృక్షములకు పంచియిచ్చి ఎటులనో పోగొట్టుకొంటివి. ఈ వృత్రాసురుని చంపిన పాపము ఎట్లు పోగొట్టుకొందనోకదా!'' అని విచారించ, మహర్షులు ఇంద్రుని తత్పరిహారమునకై అశ్వమేధయాగము చేయమనిరి. కాని ఈ బ్రహ్మహత్యా పాపము ఛండాల స్త్రీ రూపములో భయంకరాకారము దాల్చి యింద్రుని తరుముకొనిరాగా ఇంద్రుడు దానిని తప్పించుకొనలేక నలు దిశలు పరుగెత్తి చివరకు మానస సరోవరములో ప్రవేశించి, దానిలోనున్న కమలనాళములో దాగుకొనెను.

ఇట్లు వెయ్యిసంవత్సరములు ఎట్టి భోగములు లేనివాడై బ్రహ్మహత్యాదోష విమోకమును కూర్చి చింతించుచుండ, సహుషుడు తన తపోయోగబలమున ఇంద్రుని లేని సమయమున స్వర్గాధిపతియై ఐశ్వర్యమదాంధుడై ఇంద్రుని భార్య శచీదేవిని బలాత్కరింపబోగా ఆమె మహర్షులతో మొరపెట్టుకొనెను. వారలు ఆ సహుషుని అజగరము అగునట్లు శపించిరి ఇట్లు ఆతడు నశింపగా ఇంద్రుడు దాగుకొన్న స్థలమునకు పోయి మహర్షులు ఆహ్వానింప, ఇంద్రుడు హరిని ధ్యానించుచు బయల్పడి, ఆ బ్రహ్మరుషుల సహాయముతో అశ్వమేధయాగము చేసి ఆ యజ్ఞేశ్వరుని అనుగ్రహముతో వృత్రాసురునిచంపిన పాపమును పోగొట్టుకొనెను.

చిత్రకేతూపాఖ్యానము

వృత్రాసురుని చరిత్ర వినిన పరీక్షీత్తు అట్టి ఘోర రాక్షసుడైన వృత్రాసురుడు దేవేంద్రునకు తత్వోపదేశము చేయుట ఎట్లు సంభవించెను. అని అడుగగా శకుడు ఇట్లు చెప్పెను. ''పూర్వము శూరశేన దేశమును పాలించు చిత్రకేతుడను రాజు ప్రపంచము నంతనూ సార్వభౌముడుగా పరిపాలించుచూ పుత్రులు లేని కారణమున చాలమంది భార్యలను పెండ్లియాడెను. ఏ ఒక్కరిలోనూ సంతానము కలుగ నందున చింతించుచుండ, బ్రహ్మఋషియగు అంగీరసుడు ఒకనాడు ఆకశ్మికముగ అరుదెంచినంత, యాతనిని రాజు యధావిధిగ పూజించి తన చరిత్ర చెప్పి తనకు పుత్రుడు కలుగ నుపాయము చెప్పమని ప్రార్ధించెను.

అంతట అంగీరసుడు ఆతనియందు దయకలవాడై త్రష్టృయాగముచేసి పెద్దభార్య కృతద్యుతికి యజ్ఞశేషము ఇచ్చిన యడల ఆమెకు పుత్రుడు కలుగుననియూ ఆ పుత్రునివలన ఆనందము. దుఃఖమూ కలుగుననియు చెప్పెను. అంతట చిత్రకేతుడు యజ్ఞముచేసి, కృతద్యుతి యందు కుమారుని కనెను. లేకలేక కుమారుడు కలిగినందుకు అనేక దానధర్మములను చేసి ప్రజలందరితో తన సంతోషమును పంచుకొనెను. ప్రజలుగూడ రాజునకును పట్టమహిషికిని అనేక కానుకలు ఒసంగి ప్రశంశించిరి.

ఇది రాజుయొక్క మిగిలిన భార్యలకు అసూయకు కారణమై, రాజు తమను భార్యలుగా గాక, దాశీలుగా చూచుచున్నాడను రోషముతో ఆ పిల్ల వానికి అన్నములో విషము పెట్టి చంపించిరి. రాజును, పట్టమహిషియ పుత్ర వియోగమువలన అమితముగా దుఃఖించిరి. ఇతర భార్యలు తమ గుట్టు బయటపడ కుండుటకై తాముగూడ దుఃఖము నటించిరి. సంతానము లేని దుఃఖము కన్న, పుత్రుడు కలిగి కొంతకాలము పెరిగి చనిపోయిన, మరింత దుఃఖకారణము కదా!

ఇట్లు వారు అమితముగ దుఃఖించుచుండ, పూర్వము వారికి దర్శన మిచ్చిన అంగీరసుడు, నారదుడు అచ్చటకువచ్చి జ్ఞానబోధ చేసిరి. ఆ జ్ఞానబోధ రుచింపక తమ పిల్లవానిని బ్రతికించమని నారదుని ప్రార్ధించిరి. అంత నారదుడు ఆ పిల్లవాని శరీరము పైనవున్న జీవుని చూచి తిరిగి శరీరమున ప్రవేశించి లెమ్మని ఆజ్ఞాపించెను.

ఆతడు అట్లే చేసిన ఆ బాలుడు లేచి, ''స్వామీ నన్నెందుకు బ్రతికించినారు?'' అని ప్రశ్నించగా, నారదుడు, ''నీ తల్లిదండ్రులు నిన్ను చూడకోరుచున్నారని'' చెప్పెను.

అంతట ఆ పిల్లవాడు '' ఏతల్లి తండ్రి నన్నుచూడవలెనని కోరుచున్నారు? ఈ సంసార చక్రమున తిరుగుచున్న నాకు అనేకమంది తల్లి దండ్రులు గతించిరి. ఇక ముందు ఎందరో రావలసియున్నారు. నేను ఇచ్చటనే యుండిన ఏమి ప్రయోజనము అని'' పలికి తిరిగి శరీరమును విడిచెను.

ఈ మాటలు విన్న ఆ పిల్లవాని తల్లిదండ్రులు, మమకారమును విడచి, వైరాగ్యము కలిగి పిల్లవాని శవమునకు అంత్యక్రియలు జరిపిన తరువాత చిత్రకేతునకు మంత్ర విద్య నుపదేశించి, నారదుడు, అంగీరసుడు వెడలిపోయిరి.

చిత్రకేతుడా మంద్రవిద్యను యధావిధిగా అనుష్ఠించగా దాని ప్రభావమువలన అదిశేషుడు ప్రత్యక్షమై ''అచిరకాలములో నీవు సిద్ధుడ వగుదువని'' ఆశీర్వదించి అంతర్ధాన మొందెను.

అంతట ఆ చిత్రకేతుడు విద్యాధరేశ్వరుడై భగవద్గుణాను కీర్తనుడై విహరించుచుండ ఒకనాడు సిద్ధచారణ పరివృతుడై, పార్వతిని తొడపై కూర్చుండబెట్టుకొని నిండు సభలో కొలువైయున్న మహేశ్వరుని చూచి, భార్యను నిండు సభలో తొడపై కూర్చుండ బెట్టుకొనుట అధర్మమని ఆక్షేపించెను.

శివుడు ఆ మాటలు విని మౌనము వహించిననూ పార్వతి, 'సభలో కొలువైయున్న బ్రహ్మ, నారద, సనత్కుమారాదులకు తెలియని ధర్మము తనకు తెలిసినట్లు ఆక్షేపించుచున్నాడని కోపముతో రాక్షసుడవు కమ్మ'ని శపించెను.

అందుకు చిత్రకేతుడు ఇది తన పురాకృత కర్మఫలముగా గ్రహించి పార్వతీదేవితో ''ఓదేవీ, నిన్ను శాపమోక్షమును కోరను, నీకు యపచారము కావించినందుకు క్షమింపుము'' అని తన విమానము నెక్కి వెడిలిపోయెను.

ఈశ్వరుడు పార్వతి'' ''చిత్రకేతుడు, నీవు ఇచ్చిన శాపమునకు కోపగించక శాంతముతో దానిని గ్రహించి వాసుదేవునియందు భక్తిజ్ఞాన వైరాగ్యములతో సంచరించుచున్నాడు. నీకు ప్రతిశాపము ఇచ్చు శక్తికలవాడయ్యూ అట్లు చేయక వైరాగ్యముతో శాపమును గ్రహించెను.'' అని అతనిని ప్రశంశించెను.

అంత చిత్రకేతుడు శాపవశమున రాక్షసరూపము ధరించిన వాడయ్యూ అతనికి హరిభక్తియూ ఆత్మజ్ఞానము మనస్సులో స్థిరముగా నుండుటచే స్థూల దేహము రాక్షస దేహమైననూ, సూక్ష్మదేహములోని జ్ఞానముతో యుద్ధ సమయమున ఇంద్రునికి జ్ఞానబోధచేసెను. ఆ జ్ఞానమువల్లనే చివరకు ముక్తుడయ్యెను'' అని శుకుడు చెప్పెను.

విష్ణుని సహాయము వలన ఇంద్రుడు తన కుమారుల నందరనూ నాశనము చేసినాడను దుఃఖముతో దితి భర్తయైన కశ్యవునితో ''ఇంద్రుని చంపునట్టి కుమారుని తనకు అనుగ్రహింపుమని'' ప్రార్ధించెను కశ్యపుడు అట్టికోరిక మంచిది కాదని ఎంత వారించిననూ విననందున, ఆమె ప్రార్థనను మన్నించి ఒక సంవత్సరము కొన్ని నియమములతో ఒక వ్రతము చేసిన ఇంద్రుని చంపు కుమారుడు కలుగునని చెప్పెను. ఆ నియమము లేవి? అని యడుగగా,

''ఏ భూతమును హింసింపరాదు

అసత్యము చెప్పగూడదు

గోళ్ళు తీసుకొనరాదు

వెంట్రుకలు తీయరాదు.

అమంగళ ప్రదములైన ద్రవ్యములను ముట్టరాదు

జలములో నగ్నముగ స్నానము చేయరాదు

దుర్జనులతో సంభాషింపరాదు

మాసినచీరె కట్టరాదు

వాడిన పూలు ముడువరాదు

ఎంగిలి అన్నము తినరాదు

భద్రకాళికి బలివేసిన యన్నము తినరాదు

మాంసము తినరాదు

శూద్రుడు తెచ్చిన అన్నము తినరాదు

రజస్వల చూచిన యన్నము తినరాదు

నీళ్ళు దోసిటితో త్రాగరాదు

జుట్టు విరబోసుకొని తిరగరాదు

ముఖమున బొట్టులేకుండ తిరుగరాదు

వస్త్రాఛ్ఛాదన లేకుండా తిరుగరాదు

మలమూత్ర విసర్జన చేసినప్పుడు పాదప్రక్షాళన

చేయకుండా వుండరాదు

తడి బట్టలతో తిరుగరాదు

ఉత్తరదిశను పశ్చిమ దిశను తల పెట్టుకొని

పరుండరాదు

సంధ్యాకాలమున పరుండరాదు

భోజనమునకు పూర్వము, గోవులను, బ్రహ్మణులను

భగవంతుని పూజింపవలెను

గంధపుష్పాదులతో సువాసినులను పూజించి, పతిని

పూజింపవలెను

పతి గ్రామాంతరము వెళ్ళినచో అతనినే ధ్యానింప

వలెను.

పుంసవనంబైన ఈ వ్రతమగు ఒక్క సంవత్సరము జరిపినచో ఉత్తముడగు కుమారుడు కలుగునని కశ్యవుడు చెప్పగా దితి అతనివలన గర్భముదాల్చి ఆ వ్రతమును అవలంబించెను. తనను నశింపజేయుటకే దితి ఈ వ్రతమును అవలంబించెనని ఇంద్రుడు గ్రహించి ఆమెకు పండ్లు, పూలు, సమిధులు తెచ్చి ఇచ్చుచూ, ప్రతిదినము ఉపచారములు చేయుచూ, వ్రతభంగము చేయు సమయమునకు ఎదురు చూచుచుండెను.

ఇట్లుండ ఒకనాడు దితి ఎంగిలి ముట్టుకొనియు, బయటికి వెళ్ళి వచ్చియు పాదప్రక్షాళన చేసికొనక మరచి పోయి పరుండెను.

ఈ విధముగా వ్రతభంగ మగుటచే ఇంద్రుడు సవతి తల్లిగర్భమున తన యోగమాయ బలముచే ప్రవేశించి దానిని మొదట ఏడు తునకలుగాను, వాటిలో ఒక్కొక దానిని తిరిగి ఏడు ముక్కలుగాను ఖండించెను, ఈ నలభై తొమ్మిది ముక్కలు బయటపడి నలభైతొమ్మిది మరుత్తులైరి.

వారందరూ ఇంద్రునితో 'నీ తమ్ములమైన మమ్ముల నెందుకు హింసించినావు? మేము ఏమి యపకారము చేసితిమి అని అడుగగా ఇంద్రుడు వారిని ఓదార్చి 'మీరందరూ నాకు తమ్ములే, నాకు పార్షదులుగా, మరుద్గణములని పూజనీయమైన స్థానమును కల్పించెదను.'' అని చెప్పి ఆ విధముగ చేసెను.

దితియొక్క ఆరాధన వల్లనే ఇంద్రుడు ఆమె గర్భమును అన్ని ముక్కులుగ ఖండించిననూ, వారు బ్రతికి గౌరవస్థానములు పొందగలిగిరి. ఇంద్రునితో పాటు ఆ నలభై తొమ్మిదిమంది యజ్ఞములలో సోమపానమునకు అర్హులైరి.

దితి తన గర్భములో ఇంతఘోరమైన చర్య జరుగుచున్ననూ మాయచేత తెలుసుకొనలేక, తాను నిద్రమేల్కొని చూచు నప్పటికీ ఇంద్రునితో కూడిన 49 మంది పుత్రులను చూచి ఇది యేమి చిత్రమని అడుగగా ఇంద్రుడు ఆమెకు అసత్యము చెప్పలేక, తాను చేసిన అక్రమమును చెప్పి క్షమార్పణ కోరి, ఆమెచేసిన వ్రతఫలితముగా భగవదను గ్రహమును ఈ 49 మంది జీవించుటయు, వారికి పూజనీయమైన స్థానము నాతోపాటు కలిగినదనియు చెప్పి వారిని తనతో స్వర్గమునకు తీసుకొని పోయెను.

దితి చెడు తలంపుతో ఇంద్రుని చంపెడు కుమారుడు కావలెనని కోరినందు వల్ల అది ఫలించక, చేసిన పుణ్య కర్మవల్ల పూజ్యస్థానము పొందిన 49 మంది కుమారులు కలిగిరి. బయటకు పోయి వచ్చి పాదప్రక్షాళన చేసికొనని దోషము వలన ఆమె వ్రతమునకు భంగము కలిగెను. ఇంకనూ ఈ పుంసవన వ్రత విధానమును గురించి పరీక్షిత్తునకు ఇట్లు చెప్పెను.

''మార్గశిర శుక్లపాడ్యమినాడు భర్త అనుమతితో భార్య ఈ వ్రతమును ఆరభింపవలెను. ఆనాడు స్నానమాచరించి పవిత్రముగ తెల్లనిమడిచీరె ధరించి లక్ష్మీసమేతుడైన హరిని పూజింపవలెను. హరియొక్క మంత్రమును ఉపదేశము పొంది జపము చేయవలెను. షోఢశోపచారములతో పూజింపవలెను. భగవంతునికి నివేదన చేసిన శేషమును అగ్నిముఖమున 12 హోమములు ఆ మంత్రమును ఉచ్చరించుచూ చేయవలెను. ఇట్లు పూజగావించి సాష్టాంగ ప్రణామములు ఆచరించి పది మారులు ఆ మంత్రమును జపించి ఆ లక్ష్మీనారాయణులను తమ కోర్కెలను నెరవేర్పుమని ప్రార్ధించి, నివేదన శేషము నాఘ్రాణించి యతిని పూజించి నానావిధ ఉపచారములు చేయవలెను. తరువాత సువాసినీ పూజ చేసి నివేదన శేషమును భుజింపవలెను. ఇట్లు ఒక సంవత్సరము ఈ వ్రతము చేసి, కార్తీకమాసములో చివరి రోజు వేకువజామున లేచి స్నానశౌచాదులు నెరవేర్చి, నేతితో మిశ్రితమైన క్షీరాన్నమును పండ్రెండు ఆహుతులు అగ్నిహోత్రములో హోమము చేసి, పండిత బ్రాహ్మణులకు సంతర్పణ గావించి తిలలు ఉదకుంభములు, గోవులు దానముచేసి వారి ఆశీర్వచనము పొంది, వారికి నమస్కరించి పతి భుజించిన యనంతరము ఆచమ శేషమును భుజింపవలెను. ఈ వ్రతమును పురుషుడు గూడ చేయవచ్చును.

ఈ వ్రతమువల్ల ఉత్తమ సంతానము, సర్వసౌభాగ్యములు కలుగును లక్ష్మీనారాయణుల అనుగ్రహము గలిగి అభీష్టము లన్నియూ నెరవేరును.'' అని పరీక్షిత్తునకు శుకుల వారు చెప్పిరి.

(ఆరవ కిరణము సమాప్తము)

భాగవతమున ఆరవ స్కందము సమాప్తము

Sri Bhagavatha kamudi    Chapters