Dharmakruthi Chapters
Last Page 22. పరమగురువుల అనుగ్రహం 1906 ప్రాంతాలలో పరమగురువులు తిండివనం సమీప గ్రామాలలో పర్యటన చేస్తున్నారు. పెరుముక్కల్ చాతుర్మాస్య సమయంలో శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రిగారు సకుటుంబముగా స్వామివారిని దర్శించారు. అప్పుడు స్వామివారు చంద్రమౌళీశ్వర పూజలో ఉన్నారు. పూజ చేస్తున్నంతసేపూ స్వామివారు గినిని పరీక్షగా చూస్తూనే ఉన్నారు. మొదటి కలయికలోనే మరి వారికేమి స్పురించిందో! మరి మన స్వామివారి కేమి తోచిందో వారి మాటలలోనే చెప్పుకొందాం. ''వారిని చూస్తున్నప్పుడు మిగతా మనుష్యులందరినీ చూసినపుడు కలిగే భావం కలగలేదు. పూర్వకాలపు ఋషీంద్రులలో మునీంద్రులనో ఎవరో ఒక మహానుభావుని దర్శించిన భావన. అప్పటివరకూ ఎవరి యెడా ఏర్పడని ఒక పూజ్యభావం ఏర్పడింది. అంతవరకూ నాటకాలలో ఋషులను చూశానుకానీ వారి యెడ ఈ రకమైన పూజ్యభావం కలగలేదు. వారిపైన పూజ్యభావమే కాదు ఒక ప్రియం కలిగింది. ఎంతో ఆత్మీయులను, కావలసినవారిని చూసిన భావం. ఏదో దర్శనం చేసుకొని పోదాం అని వచ్చిన నాకు వారి వద్దనే ఎల్లకాలం ఉండిపోవాలనే తీవ్ర ఆకాంక్ష ఏర్పడింది.'' పూజ పూర్తి అయిన తరువాత స్వామివారు గినిని దగ్గరకు పిలిచి అనేక ప్రశ్నలు వేసి వీరి చురుకుదనానికి, సమయస్పూర్తికి ఎంతో అబ్బురపడ్డారు. చాలా సమయం బాలునితో గడిపిన తరువాత అందరి సమక్షంలో ఈ బాలుడు ఎంతో గొప్ప వాడవుతాడని చెప్పారు. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అది ఎంతో పెద్ద ఆశీర్వాదంగా తీసుకొని తమ పిల్లవాడు గొప్ప ప్రభుత్వోగి అవుతాడనుకొని సంతోషపడ్డారు. జగద్గురువులవుతారనే ఆలోచన వారికి ఏ కోశానా లేదు. అలాంటి ఆలోచన కలగడానికి కూడా అప్పటి పీఠాధిపతులకు వయస్సు ఎక్కువ లేదు. వారిముందు పీఠాధిపతులు 40 ఏళ్ళు పీఠాధిపత్యం నిర్వహించారు. అయితే పూజ చేస్తున్నంతసేపు తీక్షణంగా చూస్తూనే ఉండిపోయిన స్వామివారి మనస్సులో ఏమి భావం కలిగి ఉంటుంది? వారికి గిని తమ వారసులవుతారనే భావం మనస్సులో మెదిలి ఉండాలి. అలా అనుకోవడానికి తగిన ఆధారాలు తరువాతి సంఘటనలలో కన్పిస్తున్నాయి. మరి 12 సంవత్సరాల మన గిని ఏమనుకున్నారో? ''అంత పెద్దస్వామికి మన మీద ఇంత ప్రియం ఏమిటి? పొంగిపోయాను. వారు సర్వసాధారణమైన ప్రశ్నలే వేశారు. క్లాసులో మంచి మార్కులు వస్తున్నాయికదా! మరి నిన్ను క్లాసుమానిటర్‌ని చేశారా? రోజూ సంధ్యా వందనం విడువకుండా చేస్తున్నావా? సూక్తాలు, శ్లోకాలూ చెప్పుకొంటున్నావా? సంస్కృతం ఏమైనా నేర్చుకొంటున్నావా? లాంటివి''. ''వారి తీక్షణమైన చూపు నాలో స్పిరిట్యువల్‌గా మార్పు తెచ్చిందా అనే విషయం నాకు తెలియదు. దాని గురించి ఆలోచించే మనస్సు, వయస్సు అప్పటికి నాకు లేవు. అస్సలు స్పిరిట్ అంటే ఏమిటో కూడా అప్పుడు నాకు తెలియదు. మానిటర్‌వా అన్న ప్రశ్నలో నాయకత్వ లక్షణాలున్నాయా అని పరిశీలించారు. సంధ్య వారుస్తున్నావా అంటే ధర్మ చింతన ఏమాత్రం ఉన్నదని పరిశీలించారు అని మీరు చెప్పుకొంటే చెప్పుకోండి. నాకు మాత్రం వారడిగిన ప్రశ్నలు సర్వసాధారణంగానే తోచాయి. పసివాని తొక్కు పలుకులు వినడానికి రకరకాలుగా ప్రశ్నించే పెద్దల ప్రశ్నలుగానే తోచాయి''. బాలుని తరచుగా తమ వద్దకు తీసుకొని రావలసినదిగా చెబుతూ అనుగ్రహ ప్రసాదాలు ఇచ్చి పంపారు స్వామివారు. శాస్త్రిగారు అది ఆజ్ఞగా తీసుకొని తరచు గిని తో కలసి స్వామివారిని దర్శించడం అలవాటు చేసుకొన్నారు. అయితే గినికి ఏర్పడిన ప్రియం మూలాన తండ్రితోనే కాక విడిగా కూడా దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ వీలయినప్పుడల్లా వెళ్ళి దర్శనం చేసుకోనారంభించారు. పెరుముక్కల్ విశ్వరూప యాత్ర సందర్భంగా స్వామివారు ఒక దేవాలయం నుండి బయటకు వచ్చేటప్పుడు గుంపులో దూరంగా మన గిని ఉన్నారు. బయటకు వస్తూనే సూటిగా గిని కళ్లలోకి చూశారట. ఆ చూపు మన మహాస్వామివారి స్మృతిపధంలో నిత్యనూతనంగా నిలిచి పోయింది. ''ఆ వీక్షణం నా మస్తిష్కంలో ఒకానొక అలజడిని రేపింది. ఆ అలజడిని వివరించేందుకు సరి అయిన పదములు దొరకడం లేదు. తదాదిగ మనస్సులో మళ్ళీ మళ్ళీ స్వామివారిని దర్శించాలని ఒకటే ఆరాటం తహ తహ'' అంటారు స్వామివారు. దీక్షలలో మూడు రకాలు కదా! గినికి స్వామివారు మత్స్య దీక్ష (నయన దీక్ష) ను అనుగ్రహించారేమో. అయితే ఈ విషయం మహాస్వామివారి నడిగితే ''మీరంతా పెద్ద వాళ్ళు. పెద్ద పెద్ద విషయాలన్నీ తెలిసినివారు కాబట్టి ప్రతి విషయాన్ని ఏదో పెద్ద విశేషం చేసి చెప్పగలరు'' అని చురకలేస్తారు. గిని పెత్తల్లి కుమారులు శ్రీలక్ష్మీకాంతం (శ్రీవారి గురువులు) అప్పట్లో స్వామివారి వద్ద పూజా కార్యక్రమాల్లో సహాయకారిగా ఉంటూ ఉండేవారు. అందువల్ల గినికి శ్రీమఠంలో పూజాకార్యక్రమాలు, పద్ధతులు, నైవేద్య విశేషాలు దగ్గర నుంచి సుసూక్ష్మంగా పరిశీలించడానికి ఎంతో అవకాశం లభించింది. మరక్కానంలో జరిగిన నవరాత్రి ఉత్సవాలలో కూడా వీరు స్వామివారిని దర్శించారు. తరచుగా శ్రీమఠానికి వెళ్ళడం వల్ల కుమారుని చదువు పాడవుతుందనే భావన తండ్రిగారికి కలిగి ఉండవచ్చు. బహుశః అలా తరచు వెళ్లవద్దని కట్టడి చేసి ఉండవచ్చు. కారణం తెలియదు కానీ ఆ రోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్దుర లేచిన గిని తమ ఇంటి నుంచి బయలుదేరారు. నెమ్మదిగా తన మిత్రుడు కృష్ణస్వామి ఇంట్లోకి ప్రవేశించారు. వీధి అరుగు మీద కృష్ణస్వామి, అతని అత్త కొడుకు రామకృష్ణయ్య పడుకొని నిద్రిస్తున్నారు. గిని కృష్ణస్వామిని తట్టి మేల్కొల్ప ప్రయత్నించారు. ఊహూ! కుంభకర్ణుని నిద్ర. ఇక లాభం లేదని రామకృష్ణయ్యను తట్టిలేపి బయటకు రమ్మన్నారు. ''ఇంత ప్రొద్దునే ఏమిటిరా?'' అంటూ ఆవులిస్తూ బద్దకంగా ఒళ్ళు విరుచుకొంటున్నారు రామకృష్ణయ్య. ''శబ్దం చేయకుండా నా వెనుకరా'' అంటూ బయటకు వచ్చి సారంగ్రామం వైపు బయలుదేరారు. దారిలో సారం గ్రామానికి పోతున్న శ్రీమఠ పరివారం. మేనా కన్పించినాయి. మేనా వద్దకు పరుగెత్తుకొని వెళ్ళారు. స్వామివారు లోపల విశ్రాంతి తీసుకొంటున్నారేమో! మేనా తలుపులు మూసి ఉన్నాయి. బోయీలతో పోటీపడలేక వెనుకనున్న గుఱ్ఱపుబళ్లలో ఎక్కించుకోమని కార్వార్ శ్రీవెంకట్రామయ్యర్‌ను కోరారు. ''మఠపు సిబ్బందికి మాత్రమే శ్రీమఠపు బళ్ళు'' అని సమాధానం వచ్చింది. గిని తన మిత్రునితో కూడి నడుచుకొంటూనే స్వామివారి వద్దకు చేరారు. తెల్లవారింది. చూస్తే గిని ఇంట్లో లేడు. ఇంత ప్రొద్దునే ఆటలకు వెళ్ళాడా? అనుకుంటూ తండ్రిగారు శ్రీవెంకట్రామయ్యర్ ఇంటికి వెళ్ళారు. అక్కడ రామకృష్ణయ్య లేడు. ఇద్దరూ కలిసే వెళ్ళారు. కానీ ఎక్కడికి? చెట్లు, చేమలు, చెఱువులు, దొరువులు, కాలువలు, నూతులు, పొంతలు ఒకటేమిటి? గ్రామమంతా గాలించారు. ఎక్కడా పిల్లల జాడలేదు. ఇంతలో శ్రీమఠం నుంచి వర్తమానం వచ్చింది. స్వామినాధన్ ఇంకొక మిత్రునితో కూడి శ్రీమఠపు మకాంలో క్షేమంగా ఉన్నారు. పెద్ద వాళ్ళు ఊరట చెందారు. శ్రీ స్వామినాధన్‌ను చూసిన స్వామివారు అమందానందం పొందారట. అతనితో ఏకాంతంగా ఎంతో కాలం గడిపారు. తమవద్ద కొన్ని రోజులు ఉండిపొమ్మని కోరారు. ఇంట్లో చెప్పిరానందువల్ల రెండు రోజులు స్వామివారి సన్నిధానంలో గడిపి ఇంటికి బయలుదేరాడు గిని. శ్రీమఠపు బండిలో ఇంటికి వెళ్ళే ఏర్పాటు చేయబడింది. శ్రీమఠపు పరివారినికే. శ్రీమటపు బళ్ళు అని చెప్పిన కార్వార్ గిని తిరుగు ప్రయాణానికి ప్రత్యేకమయిన బండి ఏర్పాటు చేయవలసి వచ్చింది. అంతేకాదు. తరువాత కాలంలో కలవై నుండి ఏకంగా తిండివనం వరకూ గినిని కూడుకొని రావడానికి బండి కూడా కార్వార్ చేత పంపబడిందే. కార్‌వార్ కార్యనిర్వాహణాధికారి. అతని అనుమతి లేనిదే బళ్ళు సేవకబృందం కదలడానికి కూడా వీలులేదు. మహాస్వామివారు పట్టానికి వచ్చిన క్రొత్తలలో ఒక పండుగకి బళ్ళు, ఏనుగులు, లొట్టిపిట్టలు, పరిచారక బృందాలను నిర్ణీతమయిన రీతిలో సిద్ధపరచి స్వామివారి వద్దకు వచ్చి నమస్కరించి పర్యవేక్షణకై ఆహ్వానించారు కార్‌వార్. అది శ్రీమఠ సంప్రదాయం. పర్యవేక్షణకు వచ్చిన స్వామి నవ్వుతూ ''నేను గుఱ్ఱపుబండి ఎక్కుతానంటే మఠ పరివారం తప్పితే బళ్లు ఎక్కకూడదన్నావు. ఇప్పుడు బళ్ళు అన్నీ నావేనని నీవు చెబుతున్నా బండి ఎక్కే స్థితిలో నేను లేను'' అంటూ పర్యవేక్షణ సాగించారట. కార్‌వార్ క్షంతవ్యోహం అంటూ సాష్టాంగంగా నమస్కరించారు. సన్యాసాశ్రమ నియమాలను అసిధారావ్రతంగా పాటించిన మహాస్వామివారు ఆ జీవితాంతము చక్రములతో నడిచే వాహనాలను ఎక్కలేదు. ప్రస్తుతానికి వస్తే ఇంటి వద్ద కంగారుపడుతూ ఉంటారని వినయంతో విజ్ఞాపన చేసి స్వామివారి వద్ద శలవు తీసుకొని మఠపుబండిలో స్వగ్రామం చేరారు గిని. స్వామివారు తమవద్దనున్న మహాపండితులయిన తిరువిసైనల్లూరు సుబ్బుశాస్త్రి, శ్రీమఠపు సర్వాధికారి అయిన మునక్కాల్ కందస్వామి అయ్యర్ వద్ద శ్రీస్వామినాధన్‌ను తమ తదనంత పీఠాధిపతులుగా నియమించాలనే ప్రగాఢవాంచను వెలిబుచ్చారట. విచిత్రమేమంటే అప్పుడు అప్పటి స్వామివారికి అంత పెద్దవయస్సేమీ లేదు. తమ వారసుని నియామకం వరకు ఆలోచన ఎందుకు వెళ్ళిందో? ఆగత అనాగతములు తెలిసిన మహాజ్ఞాని కావడమే కారణం అయి ఉండాలి. అలా ఇల్లు చేరిన గినిని చూసి సంతోషంతో పరవశించిపోయారు తల్లిదండ్రులు. ''మక్కువ శాంతి సేయుటకు, మన్నన సేసి ప్రసన్నుడౌటకున్'' గిని తిరిగి ప్రత్యక్షమయారు. ఈ చెప్పా చెయ్యకుండా మాయమయిపోవడం, అకస్మాత్తుగా దర్శనం ఇవ్వడం అనే అలవాటు మహాస్వామి వారి మహాప్రస్థానపర్యంతం ఉండి పోయింది. ఒకరోజు ఉమయాల్‌పురం నుంచి తిరువిడైమరుదూరు మేనాలో వెళుతున్నారు మహాస్వామి. అప్పుడు తెల్లవారుఝామున నాలుగ్గంటలయి ఉంటుంది. స్వామిమలైలో ఒక ఇంటి ముందు మేనా దింపమన్నారు. పరివారం ఇంటి యజమానిని నిద్దురలేపుతామన్నారు. ''ఎంతో కాలంగా తన ఇంటికి రమ్మని కోరుతున్నాడీ గృహస్తు. నా కోసం ఎంతోకాలం వేచి ఉన్నాడు. వచ్చిన తరువాత తొందరెందుకు. తనంతట తాను బయటకు వచ్చే వరకు ఈసారి మనం వేచి ఉందాం. నిద్రాభంగం చేయవద్దు. మీరంతా విశ్రాంతి తీసుకోండి'' అన్నారు మహాస్వామివారు. నిద్దురపోతున్న ఇంటి యజమానికి బయట వీధి వాకిలిలో మహాస్వామివారు వేచి ఉన్నట్లు కల వచ్చింది. ఒక్క ఉదుటున నిద్రలేచి తలుపులు తోసుకొని వీధిలో చూస్తే మేనా తలుపులు తెరిచే ఉన్నాయి. స్వామివారు చిర్నవ్వుతో చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నారు. కదిలిపోయారు యజమాని. ''నా స్వామీ! నా కులదైవమా! నాకు దర్శనం ఈయడానికి నా ఇంటికీ దయచేశావుటయ్యా! అయ్యయ్యో! ఎంత పొరపాటు. తీరా నీవు వచ్చే సమయానికి ఇంటి వాకిలి మూసి ఉన్నదా? ఎంత మూఢుణ్ణి. ఆహ్వానిస్తే సరి పోయిందా? కనీసం స్వామివారీ ప్రాంతాలలో ఉన్నప్పుడయినా తయారుగా ఉండవద్దా! అయినా ఎంత దయ. నేరుగా నా హృదయంలో ప్రవేశించి నన్ను మేల్కొల్పావే'' అంటూ కన్నీరుమున్నీరుగా పరవశించి పోయాయి. ఈ ఆక్రోశానికి, ఈ ఉద్వేగానికి స్వామివారు ఏమి బదులు చెప్పారో నాకు తెలియదు. మరి భరణీదరన్ వ్రాయలేదు. అయితే అనుభవంలోని మాట. స్వామి బదులుగా మాట్లాడనక్కరలేదు. ఒక చిరునవ్వు చాలు. వెన్నెలను కురిపిస్తుంది. ఒక శిరశ్చాలనం చాలు. గుండె నిండిపోతుంది. సాభిప్రాయంగా కన్ను మూసి తెరిస్తే చాలు కోట్లపుటలు నిండిపోయే భావాల వర్షం కురుస్తుంది. దయా సముద్రం పొంగుతుంది. గృహయజమానిని అనుగ్రహించి పరిచారకులను ఇక బయలుదేరండన్నారు. ''రామో రామయ్యా, కంచీ కామాక్షీ, మధురా మీనాక్షీ'' అంటూ మేనా మోసుకు పోతున్నారు బోయీలు. ఆ రోజుల్లో తంజావూరి సీమలోని చెట్టు చేమలన్నిటికీ పాటలాసాగే ఈ సవ్వడి సుపరిచితమయినదే. బ్రాహ్మీముహుర్తంలో ఎన్నిసార్లు స్వామి ఆ త్రోవలను పావనం చేశారో! చెట్టు ఆ సవ్వడి దూరంగా వినవస్తున్నప్పుడే మత్తు వదిలి పులకాంకితంగా నిలుచుండిపోయేవేమో! గౌరవపురస్సకంగా తలలు వాల్చి నమస్కరించేవేమో! మేనా మోస్తున్న బోయీలకు, ప్రక్కన నడుస్తున్న బ్రాహ్మణ పరివారానికి పిల్ల తెమ్మరలతో సేదతీర్చి స్వామిని ఆహ్మానించేవేమో! అంతలో మేనా మోసుకొని పోతున్న బోయీలకు అనుమానం వచ్చింది. స్వామి లోపల ఉన్నారా? - కన్నయ్యన్ (పూర్వపుబోయి) చెపుతాడు. స్వామి లోపల ఉంటే కష్టం లేకుండా సవారీ సాగిపోతుందట. స్వామిలేని ఒట్టి మేనా మోయడం శ్రమగా, కష్టంగా ఉండి సవారీ సాగనే సాగదట. -కొండరాజు బ్రాహ్మణ పారిషదునితో చెబితే ఇద్దరూ తలుపు జరిపి మేనా లోపలికి తొంగి చూశారు. అరెరె! యజమాని ఎక్కడ? ఎక్కడా దిగినట్టు లేదు. మేనాలో కూర్చుని మనలను బయలదేరమని ఆదేశమిచ్చారే? అయ్యయ్యో ఎంత అపచారం జరిగిపోయింది అనుకుంటూ వెనుకకు పరుగెత్తారు బోయీలు. దారి ప్రక్కన చెట్టు మొదట్లో తలపాగా కట్టుకొని కూర్చుని ఉన్న ఒకాయనను ''అయ్యా! మా యజమానిని, కంచి స్వాములోరిని చూశారా'' అంటూ ప్రశ్నించారు. చిర్నవ్వుతో ''లేదే'' అన్నారాయన. తొందరలో ముందుకు సాగిపోయిన బోయీలకు అనుమానమొచ్చింది. చీకట్లోనూ వెన్నెలను కురిపించే చిర్నవ్వు యజమానిది కాక వేరెవరిది అయి ఉంటుంది. వెనుదిరిగి వచ్చారు. ''అయ్యో! స్వామీ! మీరు ఇక్కడ ఉన్నారేమిటి? మేనాలోంచి ఎప్పుడు దిగారు? ఎందుకు దిగారు? మమ్మల్ని ఎందుకిలా ఏడ్పించారు'' అని ప్రశ్నిస్తూ చుట్టుముట్టారు. ఏ ముని ఆ చెట్టు రూపంలో తపం చేస్తున్నాడో. ఏ సిద్దుడు అదృశ్యంగా స్వామివారిని ఆరాధిస్తున్నాడో! చెబుతారా? అడిగితే అలాంటి పెద్ద పెద్ద విషయాలు తమకు తెలియవంటారు. లేదూ! ''భ##వేస్మిన్ క్లిశ్యమానానం అవిద్యా కామకర్మభిః శ్రవణ స్మరణార్హాణి కరిష్యన్నితి కేచన'' అని చెప్పబడిన విధంగా మనం స్మరించి తరించడానికి చేసిన లీలేనేమో! శ్రీశైలంలో అంతే కదా! ఎవరికీ చెప్పకుండా పాలధార పంచధార దగ్గరకు పోయి జపం చేసుకోవడం మొదలు పెట్టారు. కాష్ఠమౌనం మఠంలో గగ్గోలు పుట్టింది. స్వామివారు తిరిగి మఠానికి వస్తారా? ఇలానే జపం చేసుకొంటూనే ఉండిపోతారా? శంకరులవలె యోగతారావళి గుహలోనికి దూరిపోతారా? మహాస్వామివారికి యోగతారావళిలోని ''సిద్ధంతదా విదమనో నిలయం ప్రవిష్టా, శ్రీశైల శృంగ కుహరేషు కథోపలప్సే, గాత్రం యధామమ లతా పరివేష్టయంతీ, కర్ణేయధా విచరయంతి ఖగాశ్చనీడాన్'' అనే శ్లోకం అంటే ఎంతో ఇష్టం - ఆ స్థితిని పొందడానికి నిశ్చయించుకోలేదు కదా! జయేంద్రసరస్వతీ స్వామివారు తల్లడిల్లిపోయారు. జపం చేసుకొనే స్వామివారిని పలకరించే ధైర్యం ఎవరకి ఉంటుంది. బహుకాలం స్వామి సాన్నిధ్యంలో మెలుగుతున్న కొత్త పెద్దలకు వారి బలహీనత తెలుసు. పండితులను చూస్తే స్వామి ప్రసన్నులవుతారు. అఖిలాండేశ్వరీదేవి ఉగ్రకళను ఉపశమింప చేయడానికి ఎదురుగా గణపతిని ప్రతిష్ఠించిన శంకరులవలె మాండలీకం వెంకటశాస్త్రిగారిని పంపారు. తమ తుది విజయయాత్రలో సతారా వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎవరికైనా ఇదీ కార్యక్రమం అని ముందు తెలుసా? తెల్లవారుఝామున మూడుగంటలకు లేచి ముఖప్రక్షాళనం కావించి, కమండలంలో నీరు పట్టుకొని చెయ్య తట్టారంటే, ఇక అంతే! స్వామి వీధిలో ఉండేవారు. పారిషదులు చెంబూ తట్టా సద్దుకొని, పక్కగుడ్డ లెత్తుకొని వెనుకబడేసరికి స్వామి రెండుమైళ్లు నడిచి పోయేవారు. చివరగా మహాప్రస్థాన సమయంలో మాత్రం ఎవరికైనా తెలియనిచ్చారా? మద్రాస్ వెళ్ళి వస్తామని నమస్కరించిన క్రొత్త పెద్దలకు, బాలస్వామికి చెయ్యెత్తి అనుజ్ఞ ఇచ్చారు. పరివారం అంతా పదిహేనురోజులుగా మఠంలోనే ఉన్న డాక్టర్ భాస్కర్‌తో సహా భోజనానికి వెళ్ళిన తరువాత మిగిలిన ఒక్క పారిషదుని కూడా నీరు తెమ్మని పంపివేశారు. తిరిగి వచ్చి చూస్తే స్వామి ఏరీ? ఊహించామా ఈ రకంగా మనల్ని వదిలి వెళ్ళిపోతారని. ఆయనలేని జీవితాన్ని ఆలోచించామా? అందరి మీద ఎంత బంధం, ప్రేమ, పాశం ఉన్నట్లు అవుపించేవారు. చివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా దగ్గర లేని సమయం చూసి మాయమయిపోయారు. స్వామీ! మోసపోయాము. ఇలా మాయమయ్యే చరిత్ర మీకున్నదనే విషయం తెలిసి కూడా మిమ్మల్ని ఒంటరిగా వదిలి మేము ఒంటరులయిపోయాము. ఇంతకాలం శరీరంతో కూడి మాయమయేవారు. స్వామీ! ఇప్పుడు శరీరాన్ని కూడా మాకు వదిలి మాయమయి పోయారా? శ్రీవెంకట్రామయ్య జోస్యం తరచుగా శ్రీమఠమునకు వెళ్ళిరావడమే చదువుకు ఆటంకంగా భావించే తండ్రిగారికి ఇప్పుడు ఈ కొత్త బెడద వచ్చి పడింది. పిల్లవాడు ఇంట్లో చెప్పకుండా కూడా శ్రీమఠానికి పోవడం మొదలుపెట్టాడు. ఆ స్వామివారిపై రోజు రోజుకు భక్తి పెరిగిపోతోంది. మిగతా విషయాలన్నీ ముఖ్యంగా పరిగణించడమే లేదు. పోనీ మందలిద్దామా అంటే చేసే పని తప్పుపని కాదు. పైపెచ్చు అందరూ కోరుకోవలసిన లక్షణం అది. మంచి ప్రతిభావంతుడు కుశాగ్రబుద్ది. చదువులోనూ, వాగ్వైఖరిలోనూ దిట్ట. ఈ విషయం తాను అనుకోవడం కాదు. ఉపాధ్యాయులందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు. కానీ ఈ క్రొత్త వ్యామోహంలో పడి చదువునకు అఘాతం కలుగుతోందే? ఇదెక్కడికి దారి తీస్తుందో అనే చింతలో పడిపోయారు. ఒకసారి జాతకం పరిశీలిస్తేనో. తమ మిత్రులు శ్రీ టీ.కే. వెంకట్రామయ్య జ్యోతిశ్శాస్త్రంలో మంచి పండితుడు. తనకు ఆప్తుడు. ఒక్కసారి వారిని సంప్రదిస్తే బాగుండుననిపించింది. జాతక చక్రం తీసుకొని వెంకట్రామయ్యగారి వద్దకు వెళ్ళి తన మనోవ్యధ తెలియజేశారు. జాతకాన్ని పరిశీలించిన శ్రీ వెంకట్రామయ్యకు ఒళ్లు గగుర్పొడిచింది. ముక్కున వేలుంచుకున్నారు. అరె! ఎంతటి యోగ జాతకం. చక్రవర్తులకు, సార్వభౌములకు గానీ ఉండటానికి వీలులేని గ్రహ సంపత్తి వీరికున్నదే. అదే విషయం శాస్త్రిగారితో అన్నారు. ''సుబ్రహ్మణ్యా! ఎందుకయ్యా గిని గురించి బెంగపెట్టుకొంటావు. నిశ్చింతగా ఉండు. లగ్నానికి పదో ఇంట్లో రవి ఉన్నాడు. ఆ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు మీనంలో ఉచ్ఛలో ఉన్నాడు. వీని పాదాల ముందు ప్రపంచమంతా మోకరిల్లి నమస్కరిస్తుందయ్యా! ఈతడు మరి మన వంటి సామాన్యుల ఇండ్లలో ఎలా అవతరించాడో'' అన్నారు. శాస్త్రిగారికి ఇది అయోమయంగా తోచింది. తన కుమారుడు ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి కావాలనే చిన్న ఆశ ఆయనది. బహుశః విద్యాశాఖలో డి.యి.ఓ అయితేనో, ఒక ఐ.సీ.యస్. అఫీసరు అయితేనో మహాప్రసాదంగా భావిస్తారాయన. మరి దేశాధినేతలు శిరస్సు వంచి పాదాభివందనం చేసే జగద్గురుత్వం వీరికి సిద్దిస్తుందనే ఆశ వీరికి ఏ కోశానాలేదు. అందుకే అనుమానంగా తన మిత్రుని మోము చూస్తూ వారు చెప్పిన దాని అర్ధం ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. విషయం గ్రహించారు వెంకట్రామయ్యగారు. మిత్రునికి నమ్మిక కలగడం లేదు. తనకు తోచిన విషయాన్ని ఇంకా పరీక్షించి రూఢి చేసుకోదలుచుకొన్నారు. సరి! గిని ని పిలుచుకొనిరా! ''వచ్చేటప్పుడు పిల్లవాణ్ని పాదాలు సరిగ్గా కడుక్కొని రమ్మను''. చెప్పిన విధంగానే స్వామినాధునితో తిరిగి వచ్చారు శాస్త్రిగారు. గినికి ఎత్తుబల్లపై కూర్చుండ నియమింపజేసి మళ్ళీ చెంబుతో నీరు తెప్పించి పాదములను స్వయంగా శుభ్రపరచసాగారు శ్రీ వెంకట్రామయ్య. ''అదేమి పని. చిన్నవాని పాదాలు పుచ్చుకోవచ్చునా?'' అంటూ వారింప చూశారు తండ్రిగారు. మామా, మామా అంటూ పాదాలు వెనుకకు తీసుకోజోచ్చారు గిని. వెంకట్రామయ్యగారు ఇదేమీ గ్రహించే స్థితిలో లేరు. పాదాలను శ్రద్ధగా పరిశీలించారు. మహోద్వేగంతో పాదాలను తన కళ్ళకు, తలకు అద్దుకున్నారు. ''అయ్యో! చిన్నవాని పాదాలు....'' అంటూ మరల అడ్డు తగిలారు శాస్త్రిగారు ''నేననుకొన్నట్టే అయింది. ఇదిగో చూడు వీని అరి పాదాలలో శంఖ చక్రాది చిహ్నములు చూశావుటయ్యా! ఈ పాదములు ముందు యావత్ప్రపంచమునకు దాసోహమంటూ తలవంచి నమస్కరిస్తుంది. అప్పుడు నేను జీవించి ఉండవద్దా? ఈ మహోత్కృష్ఠమయిన పాదాలను పుచ్చుకోవడానికి ఎంత పెట్టి పుట్టానో కదా!'' అంటూ ఆనందభాష్పాలతో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు శ్రీవెంకట్రామయ్య. సుబ్రహ్మణ్య శాస్త్రిగారి కనులు గంగా ప్రవాహాలయాయి. గినికి ఇదంతా ఒక వేడుకగా తోచి ఉండవచ్చు. అర్ధం అయి ఉండకపోవచ్చు. తన తోటివారితో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. (ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి శ్రీకృష్ణస్వామి తన ముసలితనంలో ఉన్నదున్నట్లుగా శ్రీభరణీధరన్‌కు వివరించారు). శాస్త్రిగారు మనసు దిటవు చేసుకొని ఇంటికి వెళ్ళి ఉంటారు. అయితే వారి మనస్సులో గిని భవిష్యత్తు గురించి ఇతమిత్థమనే నిర్ణయము అయి ఉండి ఉండదు. వెంకట్రామయ్యగారు కూడా పిల్లవాని ముందు జగత్తు మోకరిల్లుతుందని చెబుతున్నారు కానీ సన్యాసయోగం గురించి ప్రస్తావించలేదు. అప్పుడు చెప్పవలసిన అవసరం లేదని వారికి తోచి ఉండవచ్చు. ఏది ఏమయినా శ్రీవారి అవతారాన్ని మొదటగా గుర్తించిన మహానుభావులు శ్రీవెంకట్రామయ్య. తరువాతి కాలంలో మన తమిళ సోదరులు, తరువాత యావద్బారతం, తరువాత యావత్ప్రపంచం వారిని గుర్తించి సేవచేసుకొన్నా మొట్టమొదట సారి గుర్తించింది మన తెలుగువారే. ఇది మరి మనందరి గర్వకారణం కదా? ఎంత శుద్ద బ్రహ్మమయిన మహాస్వామివారి గురించి చెప్పుకొంటున్నా మన భేదభావాన్ని మనము ఎందుకు వదిలి పెట్టాలి? గురువులు గిని మాతామహులు శ్రీనాగేశ్వరశాస్త్రిగారు ఋగ్వేదములో సలక్షణ ఘనాపాఠి. ధర్మశాస్త్రప్రయోగములో అందె వేసిన చేయి అని ఇంతకు ముందే చెప్పుకొన్నాము. వారికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె లక్ష్మీఅమ్మాల్, తిరువిసైనల్లూరు గ్రామకాపురస్థులు, ఋగ్వేదక్రమాంతస్వాధ్యాయి అయిన శ్రీనరసింహశాస్త్రిగారితో వివాహమయింది. తిరువిసైనల్లూరు కుంభకోణమునకు అయిదు కిలోమీటర్ల దూరములో ఉంది. నరసింహశాస్త్రిగారికి చాలాకాలము పుత్రులు కలుగలేదు. ఇచ్చంగుడి ఇలవేల్పు అనుగ్రహంతో కలిగిన తమ పుత్రునికి లక్ష్మీకాంతము అని పేరు పెట్టుకొన్నారు. తమ కుమారుని కూడా తమవలెనే వేదవిద్యలో ప్రవేశ##పెట్టాలనే ఉద్దేశ్యంతో తండ్రిగారు తమ పుత్రునికి ఎనిమిదవ ఏటనే ఉపనయనం చేసి వేదవిద్యలో ప్రవేశ##పెట్టారు. దురదృష్టవశాత్తు నరసింహశాస్త్రిగారు చిన్నతనంలోనే పరమపదించారు. తిరువిసైనల్లూరు విద్వాంసులు. కంచిపీఠమును గురుభావంతో ఆశ్రయించుకొని ఉన్నవారు. తమ భర్త పరమపదించిన తరువాత వేరు ఆధారములేని ఆ తల్లిగారు తన పుత్రుని శ్రీమఠంలో సరైన శిక్షణ లభించగలదనే ఉద్దేశ్యంతో స్వామివారి రక్షణలో అప్పగించారు. ఆ సమయములో అప్పటి కంచి ఆచార్యులవారు కుంభకోణంలో బహుకాలం వేదాంతాభ్యాసానంతరం విజయయాత్ర ఆరంభించారు. విజయయాత్రలో పిల్లవానికి చదువు సాగడం కష్టమని తలపోసిన స్వామివారు లక్ష్మీకాంతమును ఋగ్వేదాధ్యనం కొరకు చిదంబరం పంపారు. శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రిగారు (గిని తండ్రిగారు) అప్పట్లో చిదంబరంలో ఉద్యోగంలో ఉండేవారు. శ్రీలక్ష్మీకాంతము తమ పిన్నిగారింట్లో ఉండి వేదాధ్యయనం చేయడానికి నిర్ణయించబడింది. మహాలక్ష్మమ్మగారికి తండ్రిలేని తన అక్క కుమారునిపై ఎంతో ఆదరం. పరమ నిర్లిప్తులు, మృదుభాషి అయిన శ్రీలక్ష్మీకాంతము ఇంట్లో అందరి మనస్సులను ఆకట్టుకొన్నారు. వీరు గిని కన్నా నాలుగయిదేండ్లు పెద్ద, సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కూడా వీరినెంతో ఆదరంగా చూసేవారు. ఇది గుర్తుకు తెచ్చుకొని శ్రీవారు ''ఇంట్లో నాకు గారాబు పట్టినని పేరు. అటెన్షన్ అంతా అన్నగారిపైనే. మా అన్నయ్యది మౌనబార్గవగోత్రం. గోత్రానికి తగినట్లే పరమ మౌనంగా ఉండేవారు. నాన్నగారిది ఇంగ్లీషు ఉద్యోగం. పిన్ని పిల్లలం మేమంతా ఇంగ్లీషు చదువులో ఉన్నాము కదా! మరి ఆధునికనాగరికతా చిహ్నములైన చొక్కా, కోటు వంటివి వేసుకొనేవారం కదా! మనస్సులోనైనా సరే వారికి ఆ దుస్తుల మీద మోజుండేది కాదు. తన చదువేమో! తానేమో! నిరంతరం వేదం వల్లె వేసుకొంటూ ఉండేవారు. వారికి అమితమైన మడి. మా అమ్మగారి మడికి ఈడైన మడి. మేము అప్పుడప్పుడు వారినాట పట్టించడానికి ఇంగ్లీషులో మాట్లాడుకోవడం కద్దు! అయినా వారి ముఖంలో చిరునవ్వు చెరగదు. ప్రేమ తరగదు''. గినికి తల్లిగారే చిన్నప్పటినుంచి సంస్కృత శ్లోకాలు వల్లె వేయించినప్పటికీ, వీరు కూడా కొన్ని శ్లోకాలను వల్లె వేయించేవారు. ఆయన వేదం వల్లె వేసుకొనేటప్పుడు కేవలం వినికిడి వలన గిని కొన్ని ఋక్కులను, సూక్తాలను తిరిగి చెప్పగలిగేవారు. పెద్దలు ఉపనయనం చేసుకోని పిల్లవాడు వేదం వల్లె వేయకూడదని అభ్యంతర పెట్టడంతో ఆ అలవాటు కొనసాగలేదు. చిదంబరంలో వేదాధ్యాయనం చేసే కాలంలో కూడా శ్రీలక్ష్మికాంతము అప్పుడప్పుడు కంచిస్వామివారి మకాంకు వెళ్లి కొంతకాలం గడిపి వచ్చేవారు. స్వామివారిపై వీరికి అనన్యభక్తి. స్వామివారికి వీరిపై అమిత వాత్సల్యం. మఠంలో అందరి తలలో నాల్కవలె మెలుగుతూ వారందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇంతలో సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి బదిలీ అయింది. అప్పటికి కంచి ఆచార్యులవారు కుంభకోణం తిరిగి వచ్చేశారు. లక్ష్మికాంతపు వేదాధ్యయనం చిదంబరం నుండి కుంభకోణానికి మారింది. వీరి శ్రద్ద వలన వేదాలు వల్లె వేయడానికి పట్టవలసిన కాలం కన్నా చాలా తక్కువ కాలం పట్టింది. 1904 లో అప్పటి కంచి స్వామివారు విజయయాత్ర పునఃప్రారంభించారు. శ్రీలక్ష్మికాంతము శ్రీవారితోనే ఉంటూ, అత్యంత ఆంతరంగికులై, పూజాకార్యములలోనూ, స్వామివారి దైనందిక కార్యక్రమములలోనూ కైంకర్యము చేస్తూ వచ్చారు. నిరంతరం స్వామివారిని అంటి పెట్టుకొని ఉండి వారి సమస్త అవసరాలను వేయికళ్ళతో గమనిస్తూ అత్యంత సమీపంగా మెలగజొచ్చారు. పిల్లవానిని కుటుంబ జీవితం నుండి పూర్తిగా విడదీయడం ఇష్టం లేని స్వామివారు అప్పుడప్పుడు శాస్త్రిగారి ఇంటికి పంపేవారు. 1907 సంవత్సరము కంచి స్వామివారికి మశూచి సోకింది. వారపుడు కలవై గ్రామంలో మకాం చేసి ఉన్నారు. ఆ రోజుల్లో మశూచి వచ్చిన వారి దగ్గరకు వెళ్లడానికే అందరూ భయపడేవారు. ప్రభుత్వం కూడా అనేక నియమ నిబంధనలను అమలు పరిచేది. శ్రీలక్ష్మికాంతమునకు గురు శుశ్రూషే తప్పితే శరీరం ముఖ్యం కాదనే భావం ధృఢతరంగా ఉండేది. ఆ సమయంలో స్వామివారి శుశ్రూష బాధ్యతనంతా వీరు తమ భుజస్కందాలపై వేసుకొని పరమ భక్తి భావంతో శుశ్రూష చేశారు. స్వామివారు తమ అవసానకాలంలో శ్రీలక్ష్మికాంతమునకు సన్యాసము పీఠాధిపత్యము అనుగ్రహించి బ్రహ్మీభూతులయినారు. శ్రీలక్ష్మికాంతము కంచి కామకోటి సర్వజ్ఞ పీఠపు 67వ శంకరాచార్యుల వారిగా శ్రీమహాదేవేంద్ర సరస్వతీ మహాస్వామివారనే నామముతో విరాజమానులయినారు. అనతి కాలంలోనే శ్రీమహాదేవేంద్రులు మశూచితో సన్నిపాతజ్వరంతో బ్రహ్మీభూతులయ్యారు. మహాతృప్తులు, పరమనిర్లిప్తులు, గురుసేవా పరాయణులు అయిన ఈ స్వామిపీఠాధిపత్యపు కాలము కేవలము ఎనిమిది రోజులు. మన మహాస్వామివారు వారి గురువులను సంస్మరిస్తూ ''ఆచార్య పీఠాన్ని అధిష్ఠించడానికి ఎంతటి వైదిక శుద్ధి, ఆచార సంపత్తి కావాలో అదంతా మా అన్నగారికి చిన్నప్పుడే అబ్బింది. పీఠాధిపత్యానికి ఆయనే సరి అయినవారు. మరి స్వామి (పరమేశ్వరుడు) ఆయనను ఎందుకు అంత త్వరగా తనలో ఐక్యం చేసుకొన్నారా అని ఆలోచించాను. ఏం తోచిందంటే ఈ అవైదిక ప్రభంజనానికి, ఈ సముదాయానికి అంత శుద్ధమైన ఆచార్యులు సరిపోరనే స్వామి నన్ను ఇక్కడ ఉంచారు'' అంటారు. అయితే ఈ వాక్యాలు మహాస్వామివారి గురువుల ఆచారాన్ని తెలుసుకోవడం కోసమే తప్ప వారి గురించి చెప్పుకొన్న దానిని యధాతధంగా గ్రహించకూడదు. అలా తమను గురించి తక్కవగా చెప్పుకోవడం వారి అలవాటు. 1932 లో మనమతం అనే విషయంపై మహోద్వేగంతో ప్రసంగిస్తూ మహాస్వామి తమ గురువులను జ్ఞప్తికి తెచ్చుకొన్నారు. ఉద్వేగంగా అని ఎందుకన్నానంటే స్వామి ఇలాటి విషయాలను సామాన్యంగా వెలిబుచ్చరు. దేవ రహస్యంగా ఉంచుతారు. ఈ చెప్పబోయే విషయం ఒకానొక సమాధి స్థితిలో మాట్లాడారు తప్ప ఇది స్వామివారు సాధారణంగా మాట్లాడే విధానం కాదు. ''మా అమ్మకు నా కన్న పెద్ద కొడుకొకడున్నాడు. ఆయనొక మహాజ్ఞాని, నిర్లిప్తుడు, మహాతృప్తుడు, ఆ పిల్లవాడు చనిపోయాడు. మా అమ్మ వాని కొఱకై ఏడవలేదు సరికదా దిగులు పడినట్లు కూడా కనిపించలేదు. నేనడిగాను. అమ్మా, అన్నయ్య పోతే నీ వేడ్వలేదు. కళ్ళు చెమర్చినట్లయినా కన్పించలేదు. నే పోయినా ఏడుస్తావో? లేదో? అని. దానికి ఆమె నీవూ వాని మాదిరి కొడుకువే కదా! తాను దైహికంగా పోయాడు. నీవు మానసికంగా పో! అన్నది''. ఇక్కడ అమ్మ కామాక్షి. మహాస్వామివారి గురువులు విదేహముక్తులయారు. స్వామివారు జీవన్ముక్తులయారు. (అమ్మ అంటే కామాక్షి అనే విషయం ఎంతో తరచి తరచి అడిగిన మీదట, చిరునవ్వుతో అంగీకరించారు అని శ్రీరా. గణపతి వివరించారు.) సన్యాసస్వీకారము 1907 ఫిబ్రవరి మొదటి వారం అప్పటి కామకోటి పీఠాధిపతులయిన శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారు తమ ఆర్కాటుజిల్లా పర్యటనలో భాగంగా కలవై చేరారు. కలవై కంచికి నలభై మైళ్ల దూరంలో ఉన్నది. అప్పటికి ఆ స్వామివారికి వయస్సు నలభయ్యోవడిలో కూడా పడలేదు. అయితే మూడు సంవత్సరాలుగా నిరంతరం పర్యటన చేస్తూ వెయ్యిగ్రామాల స్వామిగా ప్రసిద్ధులయిన స్వామివారికి బడలిక చేత, జ్వరం వచ్చి నిదానంగా మశూచిలోనికి దింపింది. ఏమీ కారణం లేకుండానే అంటే అనారోగ్యమనేదే లేకుండా మంచి వయస్సులో ఉన్నప్పుడే గినిని చూడంగానే శిష్యస్వీకారం గురించి ఆలోచించారు కదా! ఇప్పుడు అనారోగ్యం రాగానే గినికి కబురుపెట్టమన్నారు. అయితే కబురు చేరి వచ్చేసరికి ఆలస్యమయితే ఈలోగా తాను సిద్ధి పొందితే పీఠపరంపరకు విచ్ఛిత్తి కలుగకుండా ధర్మశాస్త్రపరంగా ఏ రకంగా పీఠాధిపత్యము వారికి సంక్రమింప చేయవచ్చు అని పండితులతో చర్చించి తగిన ఏర్పాట్లు కూడా చేశారు. స్వామివారి అభిమతం ముమ్మాటికీ తమ తదనంతర పీఠాధిపతిగా శ్రీ స్వామినాధన్‌ను నియమించాలనేదే. అయితే పీఠంలోని పండితులకు, సర్వాధికారులకూ ఆలోచన వేరొక విధంగా ఉంది. గిని తండ్రిగారు ప్రభుత్వంతో సేవా వృత్తి చేస్తున్నారు. పిల్లవానికి కూడా వేదశాస్త్రములలోనూ, ఆచార వ్యవహారములలోనూ అంతగా ప్రవేశము లేదు. పైపెచ్చు చదివేది క్రైస్తవ మత సంబంధమైన విద్యా సంస్థలో. వారు తమ ఆలోచనలను స్వామివారి సాన్నిధ్యంలో మనవి చేశారు. మరి స్వామివారు ఏమి ఆలోచించారో! ఆగత అనాగతములన్ని ఆకళింపు చేసుకొనిన మహాజ్ఞాని వారు. మరి వారు పీఠంలోని ముఖ్యులు వ్యతిరేకభావంతో ఉన్నప్పుడు పీఠనిర్వహణము పసివానికి కష్టతరమవుతుందని ఆలోచించారో, తమకు సమీపవర్తులయి ఉండి, గురుసేవయే పరమావధిగా నిస్వార్ధచిత్తులై సేవచేసిన శ్రీలక్ష్మికాంతముకు ఆత్యంతికమైన సన్యాసాశ్రమము ప్రసాదించి ఆదిశంకర పీఠాధిపత్యాన్ని, అపర ఆదిశంకరులయిన మహాస్వామివారికి గురుత్వాన్ని అనుగ్రహించుద్దామనుకొన్నారో, తెలియదు కానీ తమ వద్దనే ఉన్న శ్రీలక్ష్మికాంతమునకు సన్యాసమిచ్చి, కంచి కామకోటిపీఠపు 67వ శంకరులుగా అధిష్ఠింపచేసి తాము సిద్ది పొందారు. ఈ వార్త తిండివనంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కుటుంబానికి తెలిసింది. మహాలక్ష్మమ్మగారు ఎంతో బాధపడ్డారు. తమ అక్కగారికి ఏకైక పుత్రులు శ్రీలక్ష్మికాంతం. భర్త పోయిన తరువాత అతని తోడిదే లోకంగా అంటిపెట్టుకొని ప్రస్తుతం శ్రీమఠంలోనే ఉంటున్నారు. వారిని ఓదార్చడానికి మఠంలో వారి చుట్టాలు అప్పుడు ఎవరూ లేరు. శాస్త్రిగారు కుటుంబసమేతంగా తమ వాహనమైన ఎద్దులబండిలో బయలుదేరుదామనుకొన్నారు. అయితే విద్యా విషయకమైన సదస్సుకు తప్పని సరిగా హాజరుకావలసి రావడంతో తాను తిరుచ్చికి పోతూ కుటుంబాన్ని రైలులో కంచివరకూ, అక్కడినుండి బండిలోనూ వెళ్ళే ఏర్పాటు చేశారు. గిని తాముకూడా వస్తామని పట్టుబట్టారు. సిద్ది పొందిన పూర్వాచార్యులపై వారికి అనన్య భక్తి. ప్రస్తుత ఆచార్యులయందు గౌరవంతోకూడిన ఎనలేని చనువు. మహాలక్ష్మమ్మగారు పిల్లలతో కూడి కంచి చేరి శంకరాచార్య మఠంలో ఆగారు. అక్కడ శ్రీస్వామినాధన్ కుమారకోష్టంలోని కొలనులో స్నానాదికములు పూర్తి చేసుకొన్నారు. 66వ శంకరాచార్యుల దశాహ్న కార్యక్రమానికి కావలసిన సంభారాలకు కంచి వచ్చిన శ్రీమఠపు సిబ్బంది వీరిని కలిశారు. వారితో కలసి కలవై వెళ్లడానికి ఏర్పాటు చేయబడింది. ఇంతలో కంచి శ్రీమఠంలో పరంపర మేస్త్రిగా ఉన్న శ్రీమునిరత్నం ముదలియార్ గుఱ్ఱపుబండి తీసుకొని వచ్చి గినిని మాత్రం తనతో రావలసినదిగా కోరారు. దారిలో మునిరత్నం ''ఏం స్వామీ! తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకొంటున్నారేమో! మీ జీవితం అంతా ఇక శ్రీమఠంలోనే'' అంటూ మొదలుపెట్టారు. గినికి ఆశ్చర్యమేసింది. అన్నగారు పీఠాధిపతులయినందువలన వారికి సాయంగా తనను శ్రీమఠంలో ఉండిపొమ్మంటారేమో! ఇంత చిన్నవయస్సులో ఉన్న తనతో అన్నగారికి మాత్రం ఏం ప్రయోజనముంటుంది. ఏమో! అంతా అగమ్యగోచరంగా ఉంది. కలవై దగ్గరవుతున్న కొద్దీ అసలు విషయం బయట పడజొచ్చింది. మేస్త్రి అసలు గినిని తీసుకొని రావడానికే నియోగించబడ్డారు. సరాసరి తిండివనానికే వెళ్దామని ప్రయాణం. అదృష్టవశాత్తూ ఆడపోయిన తీర్దం ఎదురయినట్టు శ్రీస్వామినాధన్ వారికి కంచిలోనే ఎదురుబడ్డారు. కంచి 67వ స్వామివారికి కూడా మశూచి సోకింది. సన్నిపాతజ్వరం వచ్చింది. గిని పరమోత్కృష్టమయిన శంకరాచార్య పదమును అలంకరించబోతున్నారు. గినికి పరిస్థితి అంతా అయోమయంగా తోచింది. ఏం చేయాలో తోచలేదు. బండిలోనే మోకారిల్లి కూర్చుని రామనామ జపం చేయనారంభించారు. ఆనాటి తమ మనః పరిస్థితిని తరువాత కాలంలో వివరిస్తూ ఇలా అన్నారు. ''నేనా! శంకరాచార్య అవడమా! అని అదిరి పోయాను. మఠ సంబంధమున్న ఇంట్లో పుట్టి పెరగడం వల్ల ఆచార్య పదము ఎంత ఉత్కృష్ట మయినదో ఒక అవగాహన ఉంది. దేవుని పటాలలో స్వామి వారి పటం కూడా ఉంటుంది. ఈ రోజునుంచి వారి పేరే నీది. వారు చేసే పనులే నీవు కూడా చేయాలనే ఆలోచనకే నామనస్సుస్తంభించి పోయింది. ఒడలంతా ఒణికిపోయింది. దడపుట్టింది. పెద్దగా ఏడ్పువచ్చింది. ఆచార్యస్వాములు ఉండరు. నేను ఈ బాధ్యతను ఒంటరిగా చేపట్టాలి. ఏడుస్తూ రామనామ జపం చేయనారంభించాను. మనస్సంతా బెరుకు బెరుకుగా ఉంది. శ్రీమఠం మకాం చేసి ఉన్న ఆవరణలోనికి ప్రవేశిస్తూనే బెరుకుదనం వెనుకబట్టింది. వారం రోజులు వారగా ఇద్దరు పీఠాధిపతులు మారి మూడవ పీఠాధిపతి పట్టానికి రాబోతున్నారు. మఠమంతా చింతాక్రాంతముగా ఉండి. నట్టడవిలో ఒంటరిగా చిక్కుకొని పోయిన భావన. మార్గదర్శకత్వమయినా లేకుండా ఏ యోగ్యతా లేని నాకు ఒక పెద్ద బాధ్యత ఒప్పచెప్పబడుతోంది. మొన్న మొన్న నన్ను ఎంతో దయతో ప్రియంతో ఆదరంగా చూసిన స్వామి ఇప్పుడు శరీరంతో లేరు. మా ఇంటిలో మనిషి, మా అన్నగారు, నేనంటే ప్రాణం పెట్టే రెండవ స్వామి వారు కూడా ఉండరు. పెద్ద దుఃఖం, దాని వెంటనే ఒక తెగింపు నన్ను ఆవహించాయి. ఆ భావాన్ని తెగింపే అంటారా? ఏమో! సరిగా చెప్పడానికి రావడం లేదు. ఇది శంకరాచార్యులవారి మఠం. వారు ఏ విధంగా నడవాలని అనుకొన్నారో ఆ విధంగా నడుస్తుంది. అలా నడిపే ధైర్యం, సై#్తర్యం వారే నాకు ప్రసాదిస్తారనే నిశ్చయ బుద్ది నన్ను ఆవహించింది. మఠం సమర్దవంతంగా నిర్వహించడానికి తగిన యోగ్యత ప్రసాదించమని వారినే ప్రార్దించాను. ఈ యోగ్యతకై మనం వారిని ప్రార్దించాలి, వారు అనుగ్రహించాలనే విషయం లోతుగా జీవశక్తితో పాటు మనస్సులో ప్రవేశించిందనుకొంటాను. కాకుంటే అసలు ఆ ఆలోచన రావడానికి కారణం ఏమిటి? అదీ వారి కృషే!'' (ఇక్కడ స్వామివారు కళ్ళు మూసుకొని ఆకాశంలోనికి నమస్కారం చేశారు.) ''యోగ్యత అంటే అప్పట్లో నా ఉద్దేశ్యం పరమగురువుల వలె త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరుల పూజ అత్యధిక శ్రద్ధతో నిర్వహించగలగడం, మఠంలోనికి వచ్చే వివిధ పండితులు మేలని శ్లాఘించే రీతిలో పండిత గోష్ఠులను నిర్వహించడం లాంటివి. ఆ రోజులలో ఈ విద్యలన్నింటికీ పరమావధి ఆత్మజ్ఞానమనీ, అదే ఆత్యంతికమయిన ప్రయెజనమనీ నాకు తెలియదు. ఉన్న ఆలోచనల్లా ఈ మహోన్నతమయిన పీఠాన్ని పూర్వాచార్యులు నడిపిన రీతిలో నడపడానికి తగిన యోగ్యత, శక్తి నాకు లభించాలనే కోర్కె ఒక్కటే. వేరొక ఆలోచన లేదు. ఆచార్యుల వారి అనుగ్రహం. మఠ నిర్వాహణ మహోన్నతంగా చేయలేకపోయినా ఉన్నంతలో ఏదో బాగానే నడిచింది. మొదటి రోజున ఉన్న ఆ భయం ఒక healthy fear గా ఇప్పటికీ నా మనస్సులో మిగిలి పోయింది. ఇది ఆచార్యుల వారి పీఠం. వారి పేరు పెట్టినందుకు మన బలహీనతలేమైనా ఉంటే ప్రజలు, రాబోయే తరాలవారుకూడా, శంకరుల వారి పేరు మలిన పరుస్తారనే భయం నా నడవడిలో మఠ నిర్వహణలో సదా నన్ను వెన్నంటి ఉన్నది''. Healthy Fear శాఖా చంక్రమణం స్వభావంగా పెట్టుకొన్న నా మనస్సు healthy fear అని చెప్తుంటే నే చదివిన ఒకటి రెండు సంఘటనల మీదికి దూకుతోంది. 1929 లో స్వామివారు తిరువణ్ణామలైలో విజయం చేసి ఉన్నారు. శ్రీవిశ్వనాధ అయ్యర్ మేనేజరుగా ఉండేవారు. ఒక యువతి ఎంతో వ్యాకులతతో వచ్చి మేనేజరుగారితో తాను స్వామివారికి ఏకాంతంలో తన కష్టాలను మనవి చేసుకోవాలని కోరింది. పనిలో ఉన్న మేనేజర్ స్వామివారు గదిలో ఏకాంతంగానే ఉన్నారు. పోయి మనవి చేసుకోవచ్చని చెప్పి తన పనిలో మునిగి పోయారు. ఇంతలో స్వామివారు పెద్ద గొంతుతో ''అయ్యా మేనేజరుగారూ! ఇలా దయ చెయ్యండి''. అని ఎలుగెత్తి పిలిచారు. కంఠధ్వనిలో తైష్ణతను గుర్తించిన మేనేజరుగారు స్వామివద్దకు పరుగెత్తారు. స్వామివారు నిటారుగా రొమ్ము విరుచుకొని నుంచొని ఉన్నారు. మేనేజరును చూస్తూనే నేను ఎలా ఉన్నాను అంటూ ప్రశ్నించారు. మేనేజరుకు ఈ వాలకం ఏమీ పాలు పోలేదు. మీకేమి! లక్షణంగా ఉన్నారు అని మాత్రం సమాధానం ఇచ్చారు. అలా కాదు! యవ్వనంలో మిసమిసలాడుతూ ధృడంగా కనిపించడం లేదూ? అన్నారు స్వామి. ఈయన ఏమంటారు. అవును వయస్సుకు తగినట్లే ఉన్నారని మాత్రం అని ఊరుకొన్నారు. ''మరి నీకు విజ్ఞత ఉండనక్కరలేదా? నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యువతిని పంపావు కదా! యవ్వనంలో ఉన్న శంకరాచార్యులు ఒక యువతితో ఏకాంతంగా మంతనాలాడుతున్నారని లోకం పలు విధాలుగా శంకరుల పేరు ఎత్తి ఆడిపోసుకోదా? నాకు అరవై ఏళ్ళు నిండేవరకూ ఆడవారి నెవరినైనా సరే పిల్లలయినా, యువతి అయినా, ముసలి అయినా ఒంటరిగా నా గదిలోనికి పంపడానికి వీలులేదు. ఒక బ్రహ్మచెముడునో, పరమవృద్దునో ఎవరో ఒక మగవారిని తోడు ఇచ్చి మాత్రమే పంపాలని ఉత్తర్వు చేశారట. పోయి ఆ యువతిని తన కష్టాలను చంద్రమౌళీశ్వరుని సన్నిధిలో మనవి చేసుకోమను. ఆయన అనుగ్రహం వల్ల అన్నీ తీరుతాయి'' అని చెప్పారట కరుణామూర్తి. మేనేజర్ బయటకు వచ్చి హతాశురాలై కూర్చుని ఉన్న యువతిని కలిశారు. స్వామివారు ఏమన్నారని అడిగారు. ఈమె లోపలికి వెళ్లడంతోనే నీతో ఇంకెవరు వచ్చారు అని అడిగారట. స్వామితో ఏకాంతములో కష్ఠాలు మనవి చేసుకోవాలని ఒంటరిగానే వచ్చానని చెప్పిందట. ఒంటరిగా ఏకాంతంలో కష్టాలు వెళ్లబోసుకొనే వీలు చంద్రమౌళీశ్వరుని సన్నిధిలోనే. పో! పోయి అక్కడ చెప్పుకో అని ఎంతో తీవ్రస్వరంతో అన్నారట. ఆమె గుడ్లనీరు గుడ్లకక్కుకొని బయటకు వచ్చేసింది. ఇంకో విచిత్రం ఏమంటే స్వామిని చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లపడి పోయింది. దీని వెనుకనున్న రహస్యం వారే చెప్పారు. తొందరగా జుట్టు తెల్లబడి వృద్ధునిగా కనబడాలని చంద్రమౌళీశ్వరునికి అభిషేకం చేసిన తేనె చేతిని అలానే నెత్తికి పూసుకొనేవారట. స్వామివారికి చిన్నతనం నుంచి పత్రికలు చదివే అలవాటుంది. అయితే శ్రీవారు చదవబోయే ముందు మఠపరిచారకులు అశ్లీలమయిన బొమ్మలు, వార్తాంశాలు ఉంటే వాటిపైన తెల్లకాగితం అంటించి తయారుగా ఉంచేవారు. అంత నిర్దుష్టంగా ఉండటానికి కారణం పైన చెప్పిన healthy fear. ఇంకో చిన్న కుప్పిగంతు. స్వామివారికి అప్పుడు 96 ఏళ్ళు. కంచిలో రాత్రిపూట తొమ్మిదిన్నర సమయంలో చాలా తక్కువ మంది భక్తులు ఉన్నారు. ఒక పరిచారకుడు శ్రీనాగరాజన్ పేపర్ చదివి వినిపిస్తున్నారు. కొంత సేపు తరువాత స్వామివారే ఆ పేపర్ తన చేతిలోనికి తీసుకొన్నారు. అందులో ఒక రేజర్ కంపెనీ వారు యువతి బొమ్మతో వేసిన ప్రకటనను చూశారు స్వామి. ఈ పరికరం ఏమి అని అడిగారు. తెలుసుకొని మరి ఈ యువతికీ, ఈ పరికరానికీ గల సంబంధమేమిటి? అని అడిగారు. నా ప్రక్కనున్న పారిశ్రామికవేత్త ప్రస్తుతకాలంలో సంబంధం ఉన్నా లేకపోయినా ప్రజలనాకర్షించడానికి యువతుల బొమ్మలతోనే ప్రకటనలు విడుదల చేస్తారు అని వివరించారు. వెంటనే స్వామివారు ''పూర్తిగా లౌకిక ప్రపంచానికే సంబంధించని నా పేరు నీవు నీ వ్యాపారాభివృద్ధికి వినియోగించుకొంటున్నట్లుగానా!'' అని చురక వేశారు. చెప్పవచ్చిందేమంటే స్వామివారు దినం వివిధ పత్రికలు చదివే అలవాటున్నా ఆ వయస్సు వరకూ వ్యాపార ప్రకటనలకు యువతుల బొమ్మలను అర్ధం లేకుండా ఉపయోగిస్తారనే విషయం తెలియకుండా ఎంత జాగ్రత్త తీసుకొన్నారు అనేదే. 1930 ప్రాంతాలలోనిదే మరొక సంఘటన. మేనేజర్ విశ్వనాధ అయ్యర్ వద్దకు స్వామివారి భిక్ష ఏర్పాటుచేసే పరిచారకుడు వచ్చాడు. తల వాల్చుకొని స్వామివారు మూడు రోజులుగా భిక్ష చేయడం లేదని విన్నవించారు. భిక్ష సమయానికి గోమయం ఉసిరికాయ ప్రమాణంలో పుచ్చుకొని గోమూత్రంతో ఆచమనం చేస్తున్నారట. ఈ ప్రాయశ్చితం ఎందుకో మేనేజర్‌గారికి అంతుపట్టలేదు. పరిచారకునే అడిగారు. ''తప్పంతా నాదే నన్నా! మొన్న నాల్గురోజుల క్రితం తోటకూర కూటు చేశాను. స్వామివారు రోజూకన్నా ఎక్కువ వేసుకోవడమే కాక, భిక్షానంతర నమస్కారం చేస్తానికి వెళ్ళిన నాతో చాలా రుచిగా ఉందని చెప్పారు. రెండోరోజూ అదే కూటు చేశాను. అదే ప్రియం చూపారు. మూడో రోజు కూడా చేయడంతో నన్ను పిలిచి రోజూ ఈ కూర నీకు ఎక్కణ్నుంచి దొరుకుతోందని ప్రశ్నించారు. శ్రీవారు బాగుందన్నారని భక్తులకు చెప్పి తెప్పించాను అని చెప్పాను. అంతే! అప్పటి నుంచి భిక్షే తీసుకోవడమే మానేశారని'' బావురుమన్నాడు. అతనిని వెంటబెట్టుకొని మేనేజర్ విశ్వనాధ అయ్యర్ స్వామివద్దకు వెళ్ళారు. ఎంతో బతిమాలిన పిదప స్వామివారన్నారు. ''అవునయ్యా! వాడి తప్పేముంది. యజమానికి ఇష్టమయింది వండి పెడదామనుకొన్నాడు. నా జిహ్వచాపల్యం నేను తగ్గించుకోవద్దా! ఈ రకంగా ఇష్టం కనబరుస్తే దాని కోసం వీడు రోజూ దర్శనానికి వచ్చే భక్తులతో స్వామివారికి ఫలానా ఆకుకూర కావాలని అడుగుతాడు. దొరికినంత కాలం వారు సంతోషంగానే తెస్తారు. ఇది శ్రీమఠంకు కావలసిన సంభారాల జాబితాలో చేరిపోతుంది. తరువాత ప్రజలందరూ శంకరాచార్యులవారు ఫలానా కూరే ఇష్టపడుతారట, వెతుక్కురావడానికి తాడు తెగుతోంది. అయినా ఆయన కదేమి జిహ్వచాపల్యం అని ఆ మహానుభావుని పేరు కళంకం చేయరా'' అన్నారట. శంకరాచార్య పదమును అంత భయ భక్తులతో సంభాలించారు మహాస్వామి. ఇలా చెప్పుకొంటూ పోతే వందల సంఘటనలు.