Dharmakruthi Chapters Last Page
23. దీక్ష
సరి! శ్రీమఠం చింతాక్రాంతంగా ఉన్నదని చెప్పుకొన్నాం. పరమగురువులు గినిని తమ వారసునిగా నిర్ణయించారు. మన అనవసర జోక్యం వల్లనే మఠానికి ఈ అగచాటు వచ్చిందేమోననే అపరాధభావంతో క్రుంగిపోతున్న శ్రీమఠ సర్వాధికారీ, మఠ పండితులూ గినిని పీఠాధిపతులుగా అభిషిక్తులను చేయడానికి కావలసిన చర్యలు త్వరితగతిని చేపట్టారు. స్వామినాధునికై పరమగురువులు పండితులతో చర్చించి సిద్దపరచిన కాషాయవస్త్రాలు, దండ కమండలాదులు సిద్దంగానే ఉన్నాయి. తిరుచ్చిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అనుమతి తంతి ద్వారా తీసుకొనబడింది. తమకు దీక్షనిచ్చిన వైనాన్ని తమ సమీపవర్తులయిన ఒకరితో స్వామివారు ఇలా వివరించారు. ''నేను శ్రీమఠం బస చేసియున్న ఆవరణలో ప్రవేశిస్తూనే మఠ పండితులూ, సర్వాధికారీ, ఇతర అధికారులు నన్నుచుట్టుముట్టి సన్యాస దీక్షకు ఆయత్తపరుస్తున్నారు. ప్రభుత్వాధికారుల రాకపోకల సందడి చాలా ఎక్కువగా ఉంది. నా ప్రమేయం లేకుండానే ముండనాది కార్యక్రమాలు శీఘ్రగతిని సాగిపోయాయి. దీక్షకు కావలసిన వైదిక కర్మకలాపాలు నా చేత చేయించడం ఆరంభించారు''. గురువుగారు దీక్షనిచ్చే స్థితిలో లేరు. పరమగురువులు పండితులతో చర్చించి సూచించిన విధానంలో శ్రీస్వామినాధునికి సన్యాసదీక్ష ఈయబడినది. తమ సన్యాస కధనాన్ని వివరిస్తూ ''నా కాషాయ వస్త్రాలు నేను వైరాగ్యంతో వరించినవి కావు. నాకు గురు సాన్నిధ్యంలో ఉండే భాగ్యము కూడా లేదు. నా సన్యాసాశ్రమపు మొదటి రోజునే పీఠాధిపత్యపు బాధ్యతలు, గౌరవ మర్యాదలు నన్ను చుట్టుముట్టినాయి'' అంటారు. ఆదిశంకరులకు కూడా సన్యాసము హఠాత్తుగా వచ్చినదే. అయితే నిర్ణయంలో వారి ప్రమేయం ఉన్నది. ఇక్కడ నిర్ణయంలో కూడా మహాస్వామి వారు సాక్షీమాత్రులే.
మహాలక్ష్మమ్మగారు, పిల్లలు కొంతసేపు తరువాత గానీ చేరలేదు. వచ్చేసరికి అక్కగారితో పాటు తనను కూడా ఓదార్చవలసిన పరిస్థితి ఏర్పడింది. శ్రీమఠపు ఆవరణలలో నాగేశ్వరశాస్త్రిగారి కుమార్తెలు, ఇరువురు కంచి పీఠాధీశ్వరుల తల్లులు కలుసుకొన్నారు. అక్కగారి ఏకైక పుత్రుడు సన్యాసి అవడంతో పాటు బ్రహ్మీభూతులు కూడా అయిపోయారు. చెల్లెలి పుత్రుడు అతి చిన్న వయస్సులో సన్యాసి అయ్యారు. మరి వారి మనఃస్థితి ఎలా ఉంటుంది. స్వామివారు తమ పెద్దమ్మగారి గురించి చెప్పారు. ''పెద్దమ్మ చాలా సాధువు. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. ఎంతో కాలం తరువాత కానీ పిల్లలు కలుగలేదు. పిల్లవానికి ఉపనయనం చేశారో లేదో భర్త పోయారు. వైధవ్యం, దారిద్ర్యం, ప్రాణాలు పిల్లవాని మీద పెట్టుకొని ఏదో కాలక్షేపం చేస్తుంటే ఇప్పుడు ఈ పుత్ర వియోగం. ఆమె జ్ఞాని అవునో కాదో చెప్పటానికి లేదు కానీ మహావివేకి మాత్రం అవును. ఆ రోజు మా అమ్మను కౌగలించుకొని ''ఆదిశంకరులు అకాలమృత్యువునించి తప్పించుకోవడానికి సన్యాసం స్వీకరించారంటారే. ఆ శంకరులే నా కొడుకుకి సన్యాసం ఇచ్చి కూడా నన్ను గర్బశోకానికి గురి చేశారు చూశావా! విధి! ఏం చేస్తాం. అయిపోయినదేమో అయిపోయింది. వారిద్దరి అయుస్సు పోసుకొని మన గిని ఈ క్రొత్తస్వామివారు దీర్ఘాయుస్సుగా ఉండాలి అంటూ ఒక ప్రక్క పుట్టెడు దుఃఖంతో ఉంటూనే ఆశీర్వదించారు''. ఆ అమ్మ చల్లటి దీవెన మనందరి అదృష్టాలను ప్రోది చేసింది. స్వామి నిండు నూరేళ్లు మనలను అనుగ్రహించారు.