Dharmakruthi
Chapters
Last Page 27. పట్టాభిషేకము శంకర పీఠాధిపతులు సన్యాసులే అయినప్పటికీ, బహుకాలంగా అనేక మంది సంస్థానాధీశులకు గురువులుగా, ఆధ్యాత్మిక సార్వభౌములుగా పరిగణింపబడటం వల్ల, అనూచానంగా వారికి చక్రవర్తి సహజమయిన మర్యాదలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. వెండి అంబారీతో కూడిన భద్రగజం, పెద్ద వెండి సింహాసనం, దంతపు సింహాసనాలు, చత్ర చామరాది రాజచిహ్నములు, స్వామివారి ముందు వెండి దండాలను పట్టుకొని నడిచే బ్రాహ్మణ పరివారం, ఆ ముందు కాగడాలు పట్టుకొని వెళ్ళే పరిచారక వర్గం, దాని ముందు వెండిబాకాల వారు, గౌరీవాయిద్యం మ్రోగించేవారు ఈ రకంగా ఎన్నో రాజలాంఛనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. క్రొత్తస్వామి పట్టానికి వచ్చినప్పుడు చక్రవర్తులకు జరిగే మాదిరి పట్టాభిషేకం జరుగుతుంది. 67వ పీఠాధిపతులకు ఈ పట్టాభిషేకం జరగనే లేదు. ఆ ఆచారాన్ననుసరించి మహాస్వామివారు పట్టానికి వచ్చినప్పుడు కూడా పట్టాభిషేకోత్సవం జరిపించాలని పీఠభక్తులయిన సంస్థానాధీశులు, మిరాసీదారులు, పండితులు ఉత్సాహపడ్డారు. 1907 మే 9వ తేదీన స్వామివారిని మహాసింహాసనాధిష్ఠితులను చేసి వేదఘోష నడుమ నదీజలాలతోనూ, మల్లెపూలతోనూ, అభిషేకం చేశారు. కంచి కామకోటిపీఠంతో అత్యంత సన్నిహిత సంబంధమున్న కంచికామాక్షీ తిరునావైక్కాల్ అఖిలాండేశ్వదేవాలయముల ప్రధాన అర్చకులు తొలుదొలుత నదీజలాలతో స్వామివారిని అభిషేకించగా తంజావూరు మొదలైన సంస్థానాధీశులు, ఒడయార్‌పాళెం మొదలైన జమిందారులు స్వామిని మల్లెపూలతో అభిషేకించారు. వివిధ దేవాలయములనుంచి వచ్చిన ప్రసాదాలు, వివిధ సంస్థానాల భక్తుల వద్దనుండి వచ్చిన కానుకలు సమర్పించబడినాయి. సింహాసనాధీశులైన స్వామివారికి పీఠభక్తులందరూ తమ భక్తిప్రపత్తులను తెలియచేశారు. స్వామి తమ తొలి అనుగ్రహభాషణము చేశారు. పండితులకు యధోచితమైన సత్కారములు చేయబడినాయి. భూరి అన్నదానం జరిగింది. ఆ రోజు రాత్రి తంజావూరు సంస్థానాధీశులు పంపిన బంగారు అంబారీ కూర్చిన భద్రగజంపై పట్టణవీధులలో స్వామివారిని ఊరేగించారు. వీధులన్నీ రంగవల్లులతోనూ, ప్రత్యేకదీపాలతో అలంకరించబడి ఉన్నాయి. దారిపోడుగునా వేలాది భక్తజనులు స్వామివారికి తమ భక్తి ప్రపత్తులు తెలియజేశారు. ఈ విధముగా స్వామివారి 87 ఏళ్ళ ఆధ్యాత్మిక సార్వభౌమత్వము ఆరంభమయింది.