Dharmakruthi Chapters Last Page
29. ప్రధమ విజయయాత్ర
పీఠాధిపతులు ప్రజల మనసులలో ఆధ్యాత్మిక జాగృతిని ప్రోది చేయడానికి దేశం నలుమూలల జరిపే యాత్రను విజయ యాత్ర అంటారు. ఈ యాత్రలలో ఆయా ఊరులలోని ప్రజలందరిలోనూ భక్తి భావం ఉప్పొంగుతుంది. స్వామివారు చేసే త్రిపుర సుందరీ చంద్రమౌళీశ్వరుల నిత్య పూజా కార్యక్రమములలో పాలు పంచుకొనే అవకాశం లభిస్తుంది. స్వామివారి పవిత్ర హస్తాల నుండి తీర్ధప్రసాదాలు స్వీకరించి పునీతులు అవుతారు. స్వామివారు తమ ఆచరణ ద్వారా, తమ ఉపదేశముల ద్వారా, భాషణముల ద్వారా ప్రజలను ధర్మోన్ముఖులను చేస్తారు. ప్రతి ఊరిలోనూ ఒక ఉత్సవం, ఒక ఆధ్యాత్మిక ఉద్యమం, ఒక ధర్మ పరివర్తనం జరుగుతుంది. 1967-68 లలో మహాస్వామి చేసిన ఆంధ్ర పర్యటనలో కొన్ని లక్షల కుటుంబాలను ధర్మోన్ముఖులను చేసిన దాని ఫలితం ఇప్పటికీ మనకు కన్పిస్తోంది కదా! శ్రీచరణులు పట్టానికి వచ్చిన ఆరు నెలల లోపునే ఇలాంటి విజయయాత్ర చేయవలసిన అవసరం వచ్చింది. అంటే ఈ యాత్ర మొదలు పెట్టడం కూడా వారి సన్యాస స్వీకారంలానే వారి ప్రమేయం లేకుండానే జరిగింది. స్వామివారికి ఈ సాక్షీ మాత్ర స్థితి మొదటి నుంచే వస్తున్నది.