Dharmakruthi Chapters Last Page
3. శంకరుల కాలము ఆంగ్లేయ చరిత్రకారులు, వారినే అనుసరిస్తున్న ఆధునిక చరిత్రకారులు ఆదిశంకరుల కాలాన్ని క్రీ.శ. 788గా నిర్ణయించారు. పాశ్చాత్యులకు మన సంస్కృతి పౌరాతన్యాన్ని ఒప్పుకోవడానికి మనసొప్పలేదు. బానిసలకు ఇంతటి మహోన్నతమైన సంస్కృతి చరిత్రకు అందని అనాది కాలం నుంచే ఉన్నదనే నిజం ముఖ్యంగా మెకాలే తరువాతి కాలపు చరిత్రకారులకు కొరుకుడు పడలేదు. అందువల్లనే మన చారిత్రక పురుషులు పౌరాతన్యాన్ని సాధ్యమైనంత కుదించడానికి ప్రయత్నం చేశారు. మన దురదృష్టవశాత్తు వామాచారులైన చరిత్రకారులు నెహ్రుగారి కాలం నుండి ప్రభుత్వంలో ఆధిపత్యం చేయడం మొదలుపెట్టారు. వీరికి మన పూర్వ ఔన్నత్యం మీద నమ్మకం లేదు. మన పురాణాలను, సంప్రదాయాలను, ఆధారాలను పుక్కిట పురాణాలుగా తేల్చివేస్తారు. సంబంధం లేని ఆధారాలను కంబోడియా నుండో, చైనా నుండో వీలయితే రష్యా నుండో పట్టుకోని వస్తారు. శంకరుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కంబోడియా శాసనం, శంకరులు తమ గ్రంధాలలో చెప్పిన విషయాలు మొదలుగా గల ఇరవై ఆధారాలను శంకరుల కాలం నిర్ణయించడానికి ప్రమాణాలుగా తీసుకొన్నారు. సాంప్రదాయిక చరిత్రకారులు ఆ ఆ ప్రమాణాలను అత్యంత సమర్ధవంతంగా ఖండించారు. ఇద్దరి వాదనలనూ విని నిర్ణయించేదెవ్వరు? క్రీ.పూ.. ఆరవ శతాబ్దం నుండి క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దం వరకూ ఎవరికి తోచిన కాలం వారు చెబుతూనే ఉన్నారు.
చిక్కల్లా శృంగేరీ పీఠము వారు చెప్పే కాలంతో వస్తోంది. 1954 సం.. వరకూ వీరు శంకరుల కాలం క్రీ.పూ.. 44 గా చెప్పారు. వీరి పీఠంతో సంబంధం ఉన్న కుడలి పీఠం వారు కూడా శంకరులాదిగా అరవై ఏడు పీఠాధిపతుల వివరాలు తెలియబరచి శంకరుల కాలం క్రీ.పూ. 44గా నిర్ణయించారు. క్రీ.శ.. 1844 లో ఒక కోర్టు అఫిడవిట్టులో అప్పటి శృంగేరీ యాజమాన్యము వారు వారి పరంపరలో రమారమి 2000 సం..ల పూర్వమున్న శంకరుల కాలం నుండి అప్పటి వరకూ 68మంది ఆచార్యులున్నట్లు, వారి అధిష్ఠానములకు పూజ జరుగుతున్నట్లు వ్రాతపూర్వకముగా తెలియజేశారు. తరువాత ఏ కారణము చేతనో ఆ పీఠాధిపతుల పూజాపేటిక నుండి గ్రహించబడినదని చెప్పబడిన పరంపరా విశేషములో ముప్పయి ఇరువురు పీఠాధిపతుల పేర్లు మాత్రమే ఉదహరించబడినవి. 1910వ సం.. లో అప్పటి శృంగేరీ పీఠాధిపతులచే కాలడిలో వేయిచబడిన శిలాశాసనం (ప్రస్తుతం తొలగించబడినది). ఆదిశంకరుల కాలం అప్పటికి 2000 సం.. పూర్వముగా గుర్తించినది. అయితే తరువాత కాలంలో బహుశః 1967 - 68 లలో అప్పటి పీఠాధిపతులు పూర్వాపరాలను పరిశీలించి శంకరుల కాలం క్రీ.శ. 788 గా నిర్ణయించారు. కాబట్టి శృంగేరీ పీఠము వారిచే చెప్పబడిన కాలం వారి సంప్రదాయ పరంగా వచ్చినది కాదు. శృంగేరీ పరంపర పరస్పర స్పర్థ కల ఇరువురి మధ్య బడి విచ్ఛిన్నము చేయబడినందున దానిని దాని ననుసరించు వారిని ప్రమాణముగా అంగీకరింప వీలు లేదని, భారత చరిత్ర చతురానన, భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వేంకటాచలంగారు స్పష్టపరిచారు. ప్రముఖ చరిత్రకారులు డా.. సర్ జడునాధ్ సర్కార్ గారు తమ History of Dasanami Nagas" లో "No paper earlier than the 19th Century has been preserved in Sringeri Mutt and the same list can be accepted as correct at the best from 13th Century downwards but not earlier than that period" అని శృంగేరీ గురించి చెబుతూ అంటారు. ఇదే పుస్తకంలో ఇంకొక చోట R.N. Ghosh అనే ఆయనకు శివాభినవ నృసింహభారతీస్వామివారు ఈ విధంగా చెప్పినట్లు వ్రాస్తున్నారు. "At the request of modern archaelogist, my Guru constructed this list, in which Sankaracharya's birth day is given as 14 vikram Samrat and his immediate successor of Sureswara is stated to have lived as the head of Monastery for eight hundred years till 757 AD. You may take it as true or false as you like". సందర్బానుసారంగా చెప్పవలసి వచ్చింది కాబట్టి వ్రాశాను గానీ, శృంగేరీ పీఠ చరిత్రను, ఔన్నత్యాన్ని, కించ పరచాలని కాదు. హైందవులందరికీ ఆ పీఠము పూజనీయమైనది.
ఏతావతా చెప్పవచ్చిందేమంటే ఆదిశంకరుల కాలం క్రీ.పూ.. 509 అనడానికే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. శృంగేరీ పీఠపు ముపై#్పరెండవ ఆచార్యుల జీవిత చరిత్రను అత్యంత రమణీయముగా ఆంధ్రీకరించిన ప్రముఖ విద్వాంసులు, విమర్శకులు అయిన శ్రీనాగపూడి కుప్పుస్వామయ్యగారు కూడా ఈ విధంగానే అభిప్రాయ పడ్డారు. శంకరుల కాలం క్రీ.పూ.. 509 అనడానికి సంప్రదాయ చరిత్రకారులు కొన్ని తిరుగులేని ఆధారాలు చెబుతున్నారు.
1. పైన చర్చించిన శంకర పీఠాల సంప్రదాయం ప్రకారం (శృంగేరీ మినహాయించి) శంకరుల కాలం క్రీ.పూ.. 509 అనడం సరిగా సరిపోతోంది. వీరందరూ కుమ్మక్కయి ఈ కాలనిర్ణయం చేశారనడానికి వేరు వేరు చోట్ల వేరు వేరుగా పరిరక్షింపబడిన సంప్రదాయాలు అవడాన వీలులేదు.
2. ప్రాచీన శంకర విజయాలలో సూచించిన శంకరుల జనన కాలపు గ్రహస్థితి ఈ కాలానికే సరిపోతోంది. వేరే ఏ తేదీకీ దగ్గరగా లేదు.
3. పతంజలి చరిత్ర ఆధారంగా గోవింద భగవత్పాదుల సిద్ధి క్రీ.పూ.. 493 గా నిర్ణయించబడినది. శృంగేరీ పీఠానికి సంబంధమున్న అభినవ విరూపాక్ష పీఠాచార్యులు ఈ నిర్ణయం చేయడం విశేషం. ఈ నిర్ణయాన్ని అనుసరించి కూడా శంకరుల కాలం క్రీ.పూ.. 509 అని చెప్పుకోవడం సమంజసం.
4. జైన విజయాన్ననుసరించి కుమారిలభట్టు కాలం క్రీ.పూ.. 557 గా గుర్తించబడింది. కుమారిల భట్టు కంటే శంకరులు 48 ఏండ్లు చిన్నవారని శంకర విజయాలు చెబుతున్నాయి.
5. క్రీ.శ.. 788 కన్నా ముందున్నారని ఆధునిక చరిత్రకారులు ఒప్పుకొన్న అనేక మంది (ముఖ్యంగా భవభూతి, మహేంద్రవర్మల) గ్రంధాలలో శంకరుల యొక్క అద్వైత సిద్దాంత ప్రసక్తి ఉంది.
6. కోట వెంకటాచలంగారు అనేక విధాలుగా శంకరుల కాలం క్రీ.పూ.. 509 గా నిర్ణయించారు. నేపాళ రాజుల వంశ చరిత్ర ఆధారంగా పునరుద్ధరించి, వారి కాలాన్ని నిర్ణయించి పురాణ ప్రమాణంతో బలపరిచారు. శంకరులు వృషదేవ వర్మ కాలంలో నేపాళ దేశం పర్యటించినట్లు చెప్పబడింది. వృషదేవవర్మ కాలం కలి శకం 2555 - 2615 గా నిర్ణయించబడింది. తద్వారా శంకరుల కాలం క్రీ.పూ.. 509 అనటం సరిపోతుంది. వెంకటాచలంగారు భాగవతము, విష్ణుపురాణము మొదలైన పురాణాల ఆధారంగా బుద్ధుని కాలనిర్ణయం, నాగార్జునిని కాలనిర్ణయం చేశారు. దాని బట్టికూడా శంకరుల కాలం నిర్ణయించబడింది.
7. శంకరుని కాలంలో మగధరాజ్యపు రాజుగా చెప్పబడుతున్న ఆంధ్రహాలుని కాలాన్ని బట్టి కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించవచ్చు.
8. ముఖ్యమైనదింకొకటున్నది. కాశ్మీరులో ఉన్న శంకరాచార్య పర్వతంపై ఉన్న శంకరాచార్య దేవాలయం క్రీ.పూ.. 367 లో కాశ్మీర రాజు గోపాదిత్యునిచే కట్టబడింది. దీని పునరుద్ధరణ క్రీ.పూ.. 220లో క్రీ.శ.. 600లలోనూ జరిగింది. దీనిని బట్టి శంకరుల కాలం క్రీ.పూ.. 367కన్నా ముందు అయి ఉండాలని ఋజువవుతోంది.
అయితే ఒకే శంకరులు అనేక కాలాల్లో ఉన్నారనడానికి తగిన ఆధారాలు కనిపించడానికి కారణం ఏమిటి? బౌద్ధగ్రంధాలలో శతాబ్దాల అంతరంలో జీవించి ఉన్న బౌద్ధాచార్యులిరువురకు, శంకరులనే బ్రాహ్మణసన్యాసి సమకాలీనులుగా చెప్పబడింది. ఇదెలా సాధ్యం? బౌద్ధంలో కూడా అనేకకాలాల్లో ఉన్న నాగార్జునాచార్యులందరినీ నాగార్జునాచార్యుడనే పిలుస్తున్నారు. ప్రస్తుతం లామాలను చూడటం లేదా? అలాగే ఆదిశంకరుల నుండి ఇప్పటి వరకూ అనేక పీఠాలలో, అనేక కాలాలలో శంకర తుల్యులైన మహామహులున్నారు. శంకర పీఠాలలో వారినందరినీ శంకరాచార్యుల వారనే కదా పిలుస్తున్నాం. మరి ఈ ప్రసిద్ధులైన శంకరాచార్యుల ప్రశంస అనేక గ్రంధాలలోనూ, అనేక శాసనాలలోనూ ఉండటం సహజం. కాబట్టి ఇవన్నీ కట్టుకధలని త్రోసి పుచ్చనక్కరలేదు. అయితే ఈ మహాత్ముల కాలాన్ని ఆదిశంకరుల కాలంగా పొరబడటమే ప్రమాదం. ధీమంతులైన మహాపురుషులు కూడా ఈ విషయంలో ప్రమాదంలో పడినారు. ఏం చేస్తాం! ప్రమాదో ధీమతామపి.