Dharmakruthi  Chapters   Last Page

 

30. జంబుకేశ్వర అఖిలాండేశ్వరీ దేవాలయ పునరుద్దరణ

శంకర విజయాలలో భగవత్పాదులు కాశీలో అన్నపూర్ణ దేవాలయములోనూ, ఉత్తర కర్ణాటకలో మూకాంబిక దేవాలయములోనూ, కంచిలో కామాక్షి దేవాలయములోనూ, జంబుకేశ్వరం (తిరువానైక్కానల్‌) అఖిలాండేశ్వరీ దేవాలయంలోనూ, తిరువత్తియూరు త్రిపుర సుందరీ దేవాలయములోనూ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని విఖ్యాతంగా చెప్పబడి ఉంది. అందులో కంచి, తిరువత్తియూరు, జంబుకేశ్వర ఆలయాలలో అమ్మవారి దేవాలయ ప్రాంగణంలోనే శంకరుల సన్నిధి కూడా ఉంది. ఈ మూడు ప్రదేశాలలో కంచి కామకోటి పీఠపు మఠములుండటమే కాక, ప్రతిష్ట, జీర్ణోద్దరణము వంటి కార్యక్రమములన్నీ ఆ పీఠపు ఆచార్యులచే జరుపబడుతూ వస్తున్నాయి.

శంకరాచార్యాష్టోత్తర శతనామ స్తోత్రంలో కాంచ్యాం శ్రీచక్ర రాజాఖ్య యంత్ర స్థాపన దీక్షితః, శ్రీచక్రాత్మక తాటంక పోషితాంబా మనోరధః అని శంకరులు స్తోత్రం చేయబడినారు. భగవత్పాదులతో ఈ రెండు దేవాలయములు అంత ముడివడి ఉన్నాయి.

జంబుకేశ్వరుడు ఆపోలింగము, దేవత అఖిలాండేశ్వరి. ఈ అమ్మవారు ఉగ్రకళతో అర్చకులకు సైతం భయం కలిగించేటట్టు ఉండేదట. శంకరులు అమ్మను సౌమ్యంగా చెయ్యాలనుకొన్నారు. ఎదురుగా వినాయకుని ప్రతిష్ట చేయించారు. పుత్రుడు దృష్టిలో పడగానే మాతృ వాత్సల్యంతో అమ్మవారు సౌమ్యమూర్తి అయ్యింది. శివచక్రము, శ్రీచక్రము రెండూ రెండు దిద్దులుగా మలచి అమ్మవారి చెవులకు అలంకరించారు. ఇప్పుడు అమ్మ వాత్సల్యమూర్తి, కరుణామూర్తి, వరద మూర్తి, మరి అప్పుడప్పుడూ ఈ తాటంకములు పాతపడి పోయినప్పుడో, బాగు చేయించవలసి వచ్చినప్పుడో ఆదిశంకరుల నుంచి అవిచ్చిన్న పరంపరలో వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతులు సంప్రదాయానుసారంగా జపహోమాదులు జరిపించి పునరుద్ధరణ చేస్తున్నారు. అప్పుడే కుంభాభిషేకము జరుగుతుంది.

జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరీ దేవాలయాన్ని ఆనుకొనే కంచి కామకోటి శంకర మఠం ఉన్నది. ఇది బహుపురాతనమైనది. 1708 లో మధుర నాయకరాజు అయిన విజయరంగ చొక్కానాధుడు లోకగురు స్వాములైన శ్రీమత్పరమహంస పరివ్రాజికాచార్యవర్య కాంచీపురస్థిత శ్రీమచ్చంకరాచార్యస్వాముల వారికి గజారణ్య క్షేత్రమందు పోన్‌వాశికోండాం వీధిలో పూర్వం మొదలుకొని స్వాముల వారికి స్వంత మఠం ఉండేటందున ఆ మఠాన నిరంతరముగా అన్నదాన ధర్మాదులు నడిపించవలెనని స్వాములవారు ఆజ్ఞాపించినందున ఎనిమిది గ్రామములలో భూములు, గుడి నుండి దినసరి వెచ్చాలు, పన్నులో ఒక భాగం దానం చేస్తూ ఒక శాసనం చేశారు. (ఎపిగ్రాఫికా ఇండికా, మద్రాస్‌ ప్రభుత్వం వాల్యూం 16, 1921-22). ఈ శాసనంలో చెప్పబడిన గ్రామాలలో ఇప్పటికీ మహేంద్ర మంగల వంటి ఊర్లలో శ్రీమఠానికి ఆస్తులున్నాయి. కొన్ని అన్యాక్రాంతమయిపోయాయి గుడి నుంచి చాలా కాలం వరకు దినసరి వెచ్చాలు వచ్చాయి.

క్రీ.శ.. 1708 సం.. లో కంచి కామకోటి పీఠ ఆచార్యులవారు శ్రీమహాదేవేంద్ర సరస్వతీస్వామివారు. జంబుకేశ్వరంలో కంచి శంకర మఠానికి స్థిర ఏర్పాట్లు చేసిన వీరు తిరువట్రియూరు త్రిపురాంబికాదేవి ఆలయ సమీపాన ఉన్న కంచిశంకర మఠంలో సిద్ధిపొందారు. వీరి అధిష్ఠానం ఈ రోజునకు కూడా అక్కడ పూజింపబడుతోంది. కడపటిగా అఖిలాండేశ్వరీ దేవాలయ కుంభాభిషేకము అప్పటి కంచి పీఠాధిపతులు శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారి కరకమలముల ద్వారా అతి వైభవంగా జరిగింది. తరువాత అరవై సంవత్సరాలు గుడికి సరియైన మరమ్మత్తులు జరగలేదు. ఆలయ జీర్ణోద్దరణ అవసరమును గుర్తించిన భక్తుల ఉత్సాహంతో 1902 సంవత్సరము నుండి అఖిలాండేశ్వరీ దేవాలయపు జీర్ణోద్దరణ కార్యక్రమం మొదలయింది. 1908 లో ముగిసింది. ఫిబ్రవరి మూడవ తేదీన కుంభాభిషేకపు ముహూర్తము నిశ్చయమయింది. అప్పటికి మహాస్వామి పట్టమునకు వచ్చి ఆరుమాసాలైనా కాలేదు. పదమూడవ సంవత్సరము మైనర్‌గా ఉన్నారు. జీర్ణోద్ధరణ కార్యక్రమములో ముఖ్యులుగా ఉన్న నాగనత్తార్‌ చెట్టియార్‌ అప్పటి శృంగేరీ పీఠాధిపతుల నుండి మంత్ర దీక్ష స్వీకరించినవారు. ఈ విషయాలను పరిగణలోనికి తీసుకొని కుంభాభిషేకమునకై శృంగేరీ పీఠాధిపతులను ఆహ్వానించారు చెట్టియార్‌. ఆ స్వామివారు కూడా అంగీకరించి జంబుకేశ్వరం విజయం చేయడానికి సమాయత్తయమ్యారు. ఈ విషయం కంచి పీఠవర్గాలకు తెలిసింది. నాలుగేళ్ళు పోరాడి నిలబెట్టుకొన్న గౌరవమాయె. వెంటనే చెట్టియార్‌ను ప్రశ్నించారు. చెట్టియార్‌ ఇద్దరినీ ఆహ్వానించానని తప్పించుకొన్నారు. నిజానికి జనవరి చివరి వారంలో మాత్రమే ఆహ్వానం కుంభకోణం చేరింది. మహాస్వామి హడావుడిగా బయలుదేరి ఫిబ్రవరి ఒకటవ తేదీ సాయంకాలం జంబుకేశ్వరం చేరి చాలాకాలంగా గుడి ఆవరణలోనే ఉన్న తమ స్వంత మఠంలో విడిది చేశారు. శృంగేరీ స్వామివారు రెండవ తారీఖున పెద్ద ఊరేగింపుతో జంబుకేశ్వరం చేరారు. కంచిస్వామివారు అదే సమయంలో యాగశాల పర్యవేక్షణకు దేవాలయమునకు వేంచేశారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొంటూ మహాస్వామివారు ఈ విధంగా అన్నారు.

''నేను చిన్న పల్లకిలో వెళుతున్నాను. చాలా దగ్గరలో ప్రక్కగా శృంగేరీమఠం శ్రీసచ్చిదానంద శివాభినవ నృశింహభారతీ మహాస్వామివారు పెద్ద పల్లకిలో వస్తున్నారు. నేను చిన్న పిల్లవాడిని. స్వామివారో! చాలా పెద్దవారు. మఠపెద్దలు నేను గంభీరంగా దిక్కులు చూడకుండా నిటారుగా ఎదురుగా చూస్తూ కూర్చోవాలని చెప్పారు. అయినా వారెలా ఉంటారో చూద్దామని నాకెంతో ఆశగా ఉంది. మెల్లగా తిరిగి చూశాను. అదే సమయంలో మరి వారికి కూడా నన్ను చూడాలనిపించిందో ఏమో నా ప్రక్కకు తిరిగి చూస్తూనే ఉన్నారు. చూడటానికి మంచి జోరుగా, గంభీరంగా ఉన్నారు. వారిని అంత దగ్గరగా చూసిన దృశ్యం ఇంకా ఇప్పుడే చూసినంతగా జ్ఞాపకం ఉన్నది. అప్పుడు మఠంలో పెద్దలు నన్ను తీసుకొని పోయి అఖిలాండేశ్వరి ప్రక్కన ఒక మూలగా కూర్చోపెట్టారు. ఒకటే చీకటి. ఆ ప్రదేశం వదలి కదలకూడదు అని చెప్పారు. ఒక్కడ్నే చాలాసేపే కూర్చున్నాను. గాలి ఆడటం లేదు. చెమట పోస్తోంది. ఒకటే ఆకలి. ఎప్పుడూ ఈ పర్యవేక్షణ తంతు ముగిసి ఎప్పుడు బయటకు వెళ్తామా అనిపించింది నాకు'' అని పకపకా నవ్వారు.

మొత్తానికి ఫిబ్రవరి ఆరవ తేదీన కుంభాభిషేకము, తాటంక ప్రతిష్ట స్వామి చేతుల మీదుగా మహావైభవంగా జరిగింది. కార్యక్రమానికి లక్ష రూపాయలు) ఖర్చయ్యింది. కార్యక్రమము దిగ్విజయంగా జరగడానికి రాజమయ్యర్‌ (తహసిల్దార్‌ కారకులు. జరిగింది అంటే ప్రభుత్వ వర్గాల అధికారులు అంతకు ముందు కోర్టుచే చేయబడిన నిర్ణయాన్ని త్రికరణశుద్ధిగా అమలుపరచడానికి బద్ధకంకణులయి ఉన్నారు కాబట్టి జరిగింది. అప్పటి తహసిల్‌దారు రిపోర్టులో ఎదుటి వర్గాలవారి ప్రయత్నాలపై అభిశంసన ఉంది. మరునాడు శృంగేరీ పీఠాధీశ్వరులు అమ్మవారి దర్శనం చేశారు. శివగంగ పీఠాధిపతులు శ్రీసుబ్రహ్మణ్య భారతీస్వామివారు కూడా కొన్ని నెలల తరువాత అమ్మవారి దర్శనం చేశారు.

ఇంతకూ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే పీఠాధిపతులుగా స్వామివారి మొదటి అధికారికమైన కార్యక్రమం ఒక విధంగా సంఘర్షణతో మొదలయింది. తమ పదవికి ఆ గౌరవము కోర్టులచే నిర్ణయించబడినప్పటికీ తనంతట తానే ఆ గౌరవము వరించలేదు. స్వామివారికి అలాంటి గౌరవాల మీద నమ్మకమో, కోరికో లేదు. తాటంక ప్రతిష్ట విషయంలో కూడా తాము వయస్సులో ఎంతో చిన్నవారయి ఉన్నందున శృంగేరీ స్వామివారి చేతి మీదుగానే జరిపిస్తే బాగుంటుందని మహాస్వామి అంత చిన్న వయస్సులోనే అభిప్రాయపడినారట. అయితే అప్పటి మఠనిర్వాహకులు ఎంతో పోరాడి సాధించిన గౌరవమవడాన స్వామిని ఒప్పించి - కాదు వత్తిడి చేసి-తిరువానైక్కావల్‌ తీసుకొని వచ్చారట.

శ్రీచరణశరణయతులు తమ శంభోర్మూర్తిః వ్యాసంలో అధికారులు కంచి కామకోటి పీఠాధిపతులకు మాత్రమే ఈ అధికారం ఉన్నదనీ శృంగగిరి పీఠాధీశ్వరులు ఆ ప్రదేశంలో ఉండరాదనీ (బహుశః ఉద్రిక్తతను నివారించడానికి) కట్టడి చేశారనీ, దానికి బాలయతులైన మహాస్వామివారి ప్రతిస్పందన క్రింది విధంగా ఉన్నదనీ తెలియజేశారు.

ఈ కార్యంలో (తాటంక ప్రతిష్టలో) ఎవరికి అధికారం ఉన్నదన్న విషయం మాత్రమే విచారణకు ఉంచబడింది. అప్పుడు ఇరుపక్షాలలో ఒకరికి ఉన్నదన్న నిర్ణయం చేయడమే వారికి తగిన పని. శ్రీశృంగగిరి పీఠాధీశ్వరులు అన్యస్థలానికి వెళ్లాలని వారు చెప్పటం ఎందుకు. అది అప్రసక్తం కదా!

ఈ వార్త ప్రయాణోన్ముఖులైన మహాత్ములైన శృంగగిరి పీఠాధీశ్వరులు విని, బాలయతి యొక్క వివేచనా పటుత్వాన్ని గ్రహించి మహాదానందాన్ని, విస్మయాన్ని ప్రకటించారట. ఆహా! ఈతడు సామాన్య బాలకుడు కాడు. ఈ వర్థిష్ణువు సర్వజ్ఞకోటిని సాదించనున్నాడు. ఈతని అధిపత్యంలో ఆ పీఠం సర్వతోముఖ వికాసాన్ని సంపాదిస్తుంది అని ఆశీస్సులతో అభినందించి ప్రయాణం సాగించారట.

ఈ సన్నివేశంలో దేశికేంద్రులైన శ్రీచరణుల విషయ వివేచనా పటత్వము శత్రుమిత్రుల యందు అన్ని వేళలలా సమదృష్టీ, న్యాయదృష్టీ చక్కగా అభివ్యక్త వయ్యాయంటారు శ్రీచరణశరణయతులు ఆ విషయం ముందు ముందు చరిత్రలో మధురై కుంభాభిషేక విషయంలో తెలుస్తుంది. అయినా వారి జీవితము వారి జీవిత కధలలో చెప్పిన మాదిరి నల్లేరు మీద బండిలా సాగలేదని చెప్పడమే ఇక్కడి ఉద్దేశ్యం.

Dharmakruthi  Chapters   Last Page