Dharmakruthi Chapters Last Page
31. పరమేష్టిగురువుల అధిష్ఠానదర్శనము
మహాస్వామివారు వారి పరమేష్ఠిగురువులయిన సుదర్శన మహాదేవేంద్ర సరస్వతీ స్వామివారి అధిష్టానం దర్శనం చేయాలని సంకల్పించారు. వీరి చరిత్ర వెనుక పుటలలో చెప్పుకొన్నాము. మహాదేవేంద్ర సరస్వతీస్వామి కామకోటి పీఠ 65వ ఆచార్యులవారు. పరమేష్ఠిగురువుల అధిష్ఠాన దర్శనానికి బయలుదేరిన మహాస్వామివారు పుదుక్కోట చేరారు. పుదుక్కోట సంస్థానాధీశులు రాజ మర్యాదలతో ఆహ్వానించి సకల సదుపాయాలు చేశారు. స్వామివారు ఆ వూరిలో 15 రోజులుండి ఇలయాత్తంగుడి విజయం చేసారు. పరమేష్ఠి గురువుల అధిష్ఠానం, అక్కడే ప్రతిష్టించబడిన శంకరుల మూర్తిని సేవించుకొని తమ రెండవ చాతుర్మాస్యమునకు జంబుకేశ్వరం చేరారు. జంబుకేశ్వర చాతుర్మాస్యము ముగించి స్వామివారు కుంభకోణం తిరుగు ప్రయాణం పట్టారు. జంబుకేశ్వరం నుండి కుంభకోణం వెళ్లే దారిలో అప్పటి తంజావూరు రాజపరివారం కోరికపై నెలరోజులు తంజావూరులో ఉండిపోయారు. తంజావూరులో స్వామికి చేసిన ఎదుర్కోలు సన్నాహం, ఊరేగింపు ఆ వూరి చరిత్రలో చిరస్థాయిగా నిలువ తగినవి.
కనీవినీ ఎరుగని విధంగా వేలాది జనము ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. తంజావూరు రాజ కుటుంబంవారు స్వామివారి బసకు, పూజకు విస్తృతమైన ఏర్పాట్లు చేసారు. తంజావూరు నుండి కుంభకోణం చేరడంతో మహాస్వామివారి ప్రధమ విజయ యాత్ర సంపూర్ణమైంది. అంతలో 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహామఖ పుణ్యకాలం వచ్చింది.