Dharmakruthi Chapters Last Page
1911, 1912, 1913 లలో మహేంద్ర మంగలము ఆ కాలంలో తమిళనాడులో ఉన్న దిగ్దంతులయిన పండితులందరకూ పుణ్య స్థలం అయినది. ఆ రోజులలో తంజావూరు సీమ యావద్భారతంలోనే మహాపండితుల శేముషీ వైభవానికి ప్రఖ్యాతి గాంచింది. వారందరూ ఏదో విధంగా కంచి పీఠంతో సంబంధం ఉన్నవారే ఆ పీఠంపైన విశేష గౌరవ ప్రపత్తులు కలవారే. పీఠాధిపతుల చిత్రపటాలను తమ దేవతార్చనలలో ఉంచుకొని దేవునితో సమానంగా పూజించే అలవాటు ఉన్నవారు. మరి వారికి అట్టి పీఠాధిపతులకే పాఠం చెప్పడం మహద్భాగ్యంగా తోచింది. గురు శిష్యుల సంబంధం కూడా విచిత్ర గతిని సాగింది. స్వామివారందరికీ ఆశ్రమపరంగా, పరంపరా ప్రాప్తంగా గురువులు. పాఠం చెప్పడానికి వచ్చి ముందు సాష్ఠాంగ నమస్కారం కావించి ప్రారంభించేవారు. శ్రీవారు పండితులపైనున్న సహజమైన గౌరవాదరములు వారియెడ నెరపేవారు. వ్యాకరణము, న్యాయవేదాంతములు, మీమాంసా శాస్త్రములలో స్వామివారికి విద్యాభ్యాసం చేయించబడినది. స్వామివారు ఎంతో శ్రద్ధాభక్తులతో అభ్యాసము చేశారు. అప్పట్లో స్వామివారికి పాఠాలు చెప్పే అదృష్టానికి నోచుకొన్న మహామహులు పైంగనాడు పంచాపకేశశాస్త్రి మహమహోపాధ్యాయ శాస్త్రరత్నాకర వేంకట సుబ్బుశాస్త్రి, శాస్త్రరత్నాకర విష్ణుపురం సామశాస్త్రి తిరువిసనల్లూరు వెంకటరాయశాస్త్రి పైంగనాడు గణపతి శాస్త్రి, మహామహోపాద్యాయ కుమంగుల కృష్ణశాస్త్రి, ఉభయ వేదాంత కేసరి రాజగోపాల తాతాచారి వంటివారు. స్వామివారు అసాధారణ ప్రజ్ఞను గురించి తెలుసుకోవడానికి ఒక సంఘటనను ఇక్కడ చెప్పుకోవాలి. పైంగనాడు గణపతి శాస్త్రిగారు మన్నారుగుడి పెరియవా (మన్నారుగుడి పెద్దలు) ప్రసిద్ది చెందిన రాజుశాస్త్రిగారి శిష్యులు, రాజుశాస్త్రిగారు అనేక మహాపండితులను తయారు చేశారు. వారిలో గణపతిశాస్త్రిగారు ముఖ్యులు. వీరు కావేరీ తీరంలో శ్రీవారికి గీతా భాష్యం చెబుతున్నారు.
ఒకరోజు గీతలో చతుర్దాధ్యాయంలోని ''కర్మణ్య కర్మాయః పశ్యేదకర్మణిచ కర్మయః'' అనే శ్లోకం పాఠం చెబుతున్నారు. ఈ శ్లోకం దగ్గర శంకరులు స్వతంత్రించి విచారించారట. శాస్త్రిగారు మెలుకువలను ఎంతో స్వారస్యంగా ప్రవచనం చేస్తున్నారు. ప్రవచన సమయంలో స్వామివారు పాఠ్యాంశంపై శ్రద్ధ చూపనట్లు వలే ఇసుకలో గీతలు గీస్తూ కనిపించారు. శాస్త్రిగారికి ఎంతో కోపం వచ్చింది. ఎలాగో కోపాన్ని దిగమింగుకొని ఆ శ్లోక భాష్యం పూర్తి చేసి పాఠం ఆపివేశారు.
మరునాటి ఉదయం స్వామివారికి నమస్కారము చేసిన శాస్త్రిగారు తాము గ్రామానికి పోదల్చుకొన్నట్లు మనవి చేశారు. పాఠం సగంలో ఆపి ఎలా వెళతారని ప్రశ్నించారు స్వామివారు. ''గురువుకు ఉన్నత స్థానం, శిష్యునిది నిమ్నస్థానం అనేది లోక నియమం. ఇక్కడ సన్యాసులూ, పీఠాధిపతులూ అవడాన మీ స్థానం ఉన్నతమైనది. పీఠభక్తుడవడాన నా స్థానం నిమ్నమైనది. విద్య క్రింది నుంచి పైకి ఎక్కడం కష్టం'' అన్నారు శాస్త్రిగారు. ఆశ్చర్యపోయిన స్వామివారికి క్రితం సాయంత్రం పాఠం చెప్పే సమయంలో శాస్త్రిగారి మోము కోపారుణ మవడం జ్ఞప్తికి వచ్చింది. ''నేను నిన్న సాయంత్రం పాఠం వినలేదనుకొన్నారా? ఆసాంతం శ్రద్ధగా విన్నాను'' అని చెప్పి ''ననుఅకర్మైవ పరమార్ధతః'' నుండి ఆరంభించి ''తథాపిచ వ్యాఖ్యాతం అస్మాభిశ్లోకః పర్యంతం'' పుస్తకం చూడకుండా ఆచార్యపాదుల భాష్యం, శాస్త్రిపాదుల వివరణం తు.చ. తప్పకుండా చెబుతూ తమకు తోచిన విశేషార్ధమును కూడా వివరించారు. శాస్త్రిగారు సంభ్రమానికి లోనయ్యారు. ఇప్పటికీ నేను వెళ్లడమనేది సరైన నిర్ణయమే. మీరు స్వయంగా ప్రతిభాశాలురు. సర్వజ్ఞులు. మీకు పాఠం చెప్పవలసిన అవసరమే లేదంటూ సాష్టాంగంగా నమస్కరించి ఆశువుగా సంస్కృత శ్లోకాలతో అభివందనం చేశారు. శ్రీవారు గీతా భాష్య పర్యంతం మీరే పాఠం చెప్పాలని కోరగా మహద్బాగ్యంగా భావించారు శాస్త్రిగారు.
ఇక్కడ బాలస్వామివారు "Hundred years of light" మూడవసంపుటంలో తమిళ భాషలస వ్రాసిన ఒక ఉదంతం చెప్పుకోవాలి.
స్వామివారికి 18, 19 సంవత్సరముల వయస్సులో అప్పట్లో మహామహులైన పండితులందరూ, ఒక్కక్కరూ రెండుమూడు శాస్త్రములలో మహాప్రతిభాశాలురైన వారు, శ్రీమఠంలో ఏర్పాటు చేసిన పండిత సదస్సులో పాల్గొన్నారట. స్వామివారు శాస్త్రచర్చలలో తప్పకుండా పాల్గొనేవారు. సదస్సు అంతా అయిపోయిన తరువాత సభలోనున్న సంస్కృతం తెలిసిన సామాన్య ప్రజలు సదస్సులోని చర్చా విశేషాలు తమకు అర్థమయ్యే రీతిలో చెప్పవలసినదిగా ప్రార్థించారు.
శతాధిక గ్రంధములు పరిశీలించి ప్రచురించడానికి దోహదం చేసినవారు, మహాపండితుల అనేక శిష్యులకు శాస్త్రబోధ చేసిన వారు అయిన మహా మహోపాధ్యాయ హరిహరశాస్త్రిగారు గంటసేపు ఆ చర్చల సారాన్ని సంస్కృతంలో వివరించారట. అయితే సామాన్య ప్రజలు తమకు అర్థం కావడం లేదనీ, మరింత సులభంగా చెప్పవలసిందనీ ప్రార్థించడంలో పండితులందరూ మౌనముద్రాంకితులయ్యారు. మహాస్వామివారు తాను చెప్పడానికి ప్రయత్నిస్తానని పలికి సులభ##మైన సంస్కృత భాషలో హృద్యంగా వివరించడంతో సామాన్య ప్రజలతో పాటు మహాపండితులు సైతం పాదాక్రాంతులయ్యారట. హరిహరశాస్త్రిగారు ఆశ్చర్యమగ్నులై స్వామివారి ప్రతిభను వేనోళ్ల పొగిడారట.
ఈ మధ్యకాలంలో మహాస్వామివారి సమక్షంలో ఒక మధ్య పండితులు చేసిన పూర్వ పక్షము సదస్సులోని పండితులకు సైతము అర్ధము కాలేదుట. సిద్ధాంతం చేయవలసిన పండితులు పూర్వపక్షాన్నే మరింకొక్కసారి చెప్పండి అనడం మర్యాదగా ఉండదు కదా! మహాస్వామివారు చిరునవ్వుతో అద్వైత న్యాయశాస్త్ర పండితికి పూర్వపక్షాన్ని పండితులందరికీ ఆశ్చర్యం గొలిపే రీతిలో అతి సులభ##మైన సంస్కృత భాషలో వివరించి చెప్పారు.
శ్రీవారికి శాస్త్రంలో అత్యంత క్లిష్టతరమైన విషయాలు కేవలం ఒకసారి వినడంతోనే గ్రాహ్యమవడమే కాక, బోధించిన వారి కంటే సులభతరమైన భాషలో తిరిగి చెప్పగలిగేవారు. ఒకసారి తెలుసుకొన్న విషయము మరచిపోయే ప్రసక్తే లేదు. శాస్త్రములే కాకుండా తమిళ భక్తి గ్రంథాలైన నాయనార్ల తేవారాలు, ఆళ్వార్ల ప్రబంధములోని పాశురాలు, తిరువాచకము, పెరియపురాణము, తిరుక్కురల్ వంటి గ్రంధాలు కంఠోపాఠం చేసి వానిలోని సునిశితమైన మెలుకువలను అర్ధం చేసుకొన్నారు. మరాఠాలోని ప్రాచ్య గ్రంధాలను, మరాఠా పండితుని ఒకని మఠంలో ఉంచుకొని ఆయన సహాయంతో అధ్యయనం చేశారు. ఫ్రెంచి, ఇంగ్లీషు భాషలలో తమకు అప్పటికే ఉన్న పరిచయాన్ని వృద్ధి చేసుకొన్నారు. రమణీయమైన కావేరీ పులిన తీరములను, అందుండే దీవులను స్వామివారు తమ పరిచారకులచే కెమేరాలలో బంధింప చేసేవారు. వారికి ఫోటోగ్రఫిలో అభినివేశం ఉంది. కెమేరాలో ఏ లెన్స్ వాడితే మంచి చిత్రం వస్తుంది. ఎంతసేపు ఎక్స్‌పోజ్ చేయాలి మొదలుకొని ప్రింటులు వేసేదాకా సలహాలిస్తూ ఆ ప్రదేశపు ప్రకృతి సౌందర్యాలన్నీ చిత్తరువులలో అతి సుందరంగా బంధింప చేసేవారు. గణిత జ్యోతిశ్శాస్త్రముల పండితులను తమతో కొంతకాలము ఉంచుకొని ఆ శాస్త్రములతో సన్నిహిత సంబంధము ఏర్పరచుకొన్నారు. సంగీత శాస్త్రజ్ఞులు దర్శనానికి వచ్చినప్పుడు వారి వద్ద సంగీత శాస్త్రములోని మెలుకువలను అడిగి తెలుసుకొనేవారు. ఈ రకంగా మహేంద్రమంగళంలో శ్రీవారు గడిపిన ప్రతి నిముషము విద్యాభివృద్ధికై ఉపయోగించు కొన్నారు.
1914 లో శ్రీచరణులు కుంభకోణం తిరిగి వచ్చేనాటికి వారికి ఇరవై సంవత్సరముల వయస్సు, అనేక శాస్త్రములలో అసాధారణమైన ప్రజ్ఞ సంపాదించుకొన్న స్వామివారు కుంభకోణంలో ఉన్నప్పుడు కూడా వివిధ పండితులతో ఆయా శాస్త్రముల గురించి చర్చిస్తూ తమ వైదుషిని మరింత ధృడపరచుకొన్నారు. స్వామివారికి మన దేశ చరిత్ర మీద, పురాతత్వశాస్త్రం మీద, శిలా శాసనాల మీద ఎంతో అభిరుచి ఉన్నది. ఈ అభిరుచే వారిని గంగైకొండ చోళపుర బృహదీశ్వరాలయానికి తీసుకొని వెళ్లింది. శ్రీవారు ఆ దేవాలయాన్ని ఎంత పరిశీలించారంటే దగ్గర దగ్గర 80 ఏళ్ల తరువాత ప్రముఖ భరత నాట్య కళాకారిణి అయిన శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యంకు అక్కడి శిల్పముల యొక్క నాట్య భంగిమల శాస్త్ర విశేషాలను వివరించారట.
గంగైకొండ చోళపురం అంటే ఇంకో విషయం గుర్తుకు వస్తోంది. 1989లో ఒకసారి స్వామివారు కొంతమంది శిష్యుల మధ్య కూర్చుని ఉన్నారు. నిదానంగా తాము చెప్పదలచిన విషయానికి వచ్చారు. ''తల్లి తండ్రులు అప్పు చేస్తే పిల్లలకు ఆ అప్పు తీర్చే బాధ్యత ఉంటుంది కదా! నేనో సన్యాసిని, డబ్బు, సంపాదించడానికి, ఖర్చు చేయడానికి కూడా నాకు అధికారం లేదు. మరి మా పూర్వాచార్యుల కాలంలో శ్రీమఠంనకు అయిన ఋణ బాధ్యత తీర్చాల్సిన బాధ్యత పీఠ భక్తులకే కదా ఉంది'' అంటూ మొదలుపెట్టారు.
శ్రీవారికి శాస్త్రంలో అత్యంత క్లిష్టతరమైన విషయాలు కేవలం ఒకసారి వినడంతోనే గ్రాహ్యమవడమే కాక, బోధించిన వారి కంటే సులభతరమైన భాషలో తిరిగి చెప్పగలిగేవారు. ఒకసారి తెలుసుకొన్న విషయము మరచిపోయే ప్రసక్తే లేదు. శాస్త్రములే కాకుండా తమిళ భక్తి గ్రంథాలైన నాయనార్ల తేవారాలు, ఆళ్వార్ల ప్రబంధములోని పాశురాలు, తిరువాచకము, పెరియపురాణము, తిరుక్కురల్ వంటి గ్రంధాలు కంఠోపాఠం చేసి వానిలోని సునిశితమైన మెలుకువలను అర్ధం చేసుకొన్నారు. మరాఠాలోని ప్రాచ్య గ్రంధాలను, మరాఠా పండితుని ఒకని మఠంలో ఉంచుకొని ఆయన సహాయంతో అధ్యయనం చేశారు. ఫ్రెంచి, ఇంగ్లీషు భాషలలో తమకు అప్పటికే ఉన్న పరిచయాన్ని వృద్ధి చేసుకొన్నారు. రమణీయమైన కావేరీ పులిన తీరములను, అందుండే దీవులను స్వామివారు తమ పరిచారకులచే కెమేరాలలో బంధింప చేసేవారు. వారికి ఫోటోగ్రఫిలో అభినివేశం ఉంది. కెమేరాలో ఏ లెన్స్ వాడితే మంచి చిత్రం వస్తుంది. ఎంతసేపు ఎక్స్‌పోజ్ చేయాలి మొదలుకొని ప్రింటులు వేసేదాకా సలహాలిస్తూ ఆ ప్రదేశపు ప్రకృతి సౌందర్యాలన్నీ చిత్తరువులలో అతి సుందరంగా బంధింప చేసేవారు. గణిత జ్యోతిశ్శాస్త్రముల పండితులను తమతో కొంతకాలము ఉంచుకొని ఆ శాస్త్రములతో సన్నిహిత సంబంధము ఏర్పరచుకొన్నారు. సంగీత శాస్త్రజ్ఞులు దర్శనానికి వచ్చినప్పుడు వారి వద్ద సంగీత శాస్త్రములోని మెలుకువలను అడిగి తెలుసుకొనేవారు. ఈ రకంగా మహేంద్రమంగళంలో శ్రీవారు గడిపిన ప్రతి నిముషము విద్యాభివృద్ధికై ఉపయోగించు కొన్నారు. 1914లో శ్రీచరణులు కుంభకోణం తిరిగి వచ్చేనాటికి వారికి ఇరవై సంవత్సరముల వయస్సు, అనేక శాస్త్రములలో అసాధారణమైన ప్రజ్ఞ సంపాదించుకొన్న స్వామివారు కుంభకోణంలో ఉన్నప్పుడు కూడా వివిధ పండితులతో ఆయా శాస్త్రముల గురించి చర్చిస్తూ తమ వైదుషిని మరింత ధృడపరచుకొన్నారు. స్వామివారికి మన దేశ చరిత్ర మీద, పురాతత్వశాస్త్రం మీద, శిలా శాసనాల మీద ఎంతో అభిరుచి ఉన్నది. ఈ అభిరుచే వారిని గంగైకొండ చోళపుర బృహదీశ్వరాలయానికి తీసుకొని వెళ్లింది. శ్రీవారు ఆ దేవాలయాన్ని ఎంత పరిశీలించారంటే దగ్గర దగ్గర 80 ఏళ్ల తరువాత ప్రముఖ భరత నాట్య కళాకారిణి అయిన శ్రీమతి పద్మా సుబ్రమణ్యంకు అక్కడి శిల్పముల యొక్క నాట్య భంగిమల శాస్త్ర విశేషాలను వివరించారట.
గంగైకొండ చోళపురం అంటే ఇంకో విషయం గుర్తుకు వస్తోంది. 1989లో ఒకసారి స్వామివారు కొంతమంది శిష్యుల మధ్య కూర్చుని ఉన్నారు. నిదానంగా తాము చెప్పదలచిన విషయానికి వచ్చారు. ''తల్లి తండ్రులు అప్పు చేస్తే పిల్లలకు ఆ అప్పు తీర్చే బాధ్యత ఉంటుంది కదా! నేనో సన్యాసిని. డబ్బు సంపాదించడానికి, ఖర్చు చేయడానికి కూడా నాకు అధికారం లేదు. మరి మా పూర్వాచార్యుల కాలంలో శ్రీమఠంనకు అయిన ఋణ బాధ్యత తీర్చాల్సిన బాధ్యత పీఠ భక్తులకే కదా ఉంది'' అంటూ మొదలుపెట్టారు.
17వ శతాబ్దంలో కంచిపీఠం 62వ పీఠాధిపతుల కాలంలో మహ్మదీయ దండయాత్రల భయంతో కంచి నుంచి బయలు దేరింది కదా! కంచి పీఠానికి అనూచానంగా భక్తులైన ఉడయార్‌పాళెం జమిందారులు శ్రీచరణులను వారి ఊరిలో వచ్చి ఉండమని ప్రార్దించారు. తగిన బందోబస్తు చేశారు. మళ్ళీ తంజావూరు మహారాజు ప్రార్ధనపై తంజావూరు తరలేంత వరకూ శ్రీమఠం ఉడయార్‌పాళెంలో ఉంది. అప్పటి శ్రీమఠపు దినసరి ఖర్చులు జమిందారు తన అధీనంలో ఉన్న బృహదీశ్వరాలయ మిగులు నిధులతో భరించారట. అందువల్ల స్వామి ఈ పీఠము, ఈ పీఠభక్తులు బృహదీశ్వరునికి ఋణపడి ఉన్నారంటున్నారు. అంతేకాదు తమ పూర్వ పీఠాధీశ్వరులు చేసిన ఖర్చులు అన్నీ పరిశీలిస్తున్నప్పుడు ప్రతి కార్తీక పౌర్ణమికి గంగైకొండ చోళపుర బృహదీశ్వరునికి అన్నాభిషేకానికి రెండు బస్తాల బియ్యం వాడుకగా ఇవ్వడం, అన్నాభిషేకానికి కావలసిన ఏర్పాట్లలో సహాయసంపత్తులను అందజేయడానికి స్వామివారు గమనించారు. కొంత కాలంగా ఆగిపోయిన అన్నాభిషేకాన్ని పునరుద్ధరించవలసినదిగా తన శిష్యులను ఆజ్ఞాపిస్తున్నారు. అది శిష్యులు తన వంటి బీద సన్యాసికి అంటుకొన్న ఋణ విముక్తికి చేయవలసిన బాధ్యతగా చెబుతున్నారు. ఆ గుడిపై స్వామికి అంతటి అనుబంధం. ఇంతకీ ఆ గుడిలో శివలింగానికి అన్నాభిషేకం అంత సులభసాధ్యమైన విషయం కాదు.
తంజావూరు బృహదీశ్వర లింగం కంటే పెద్ద లింగం రాజరాజచోళుని పుత్రుడు రాజేంద్రచోళుడు. ఆయన గంగాతీరం వరకూ దండయాత్ర చేసి ఆ ఉత్తరదేశపురాజుల తలలపై గంగ మోయించి ఇక్కడ స్వామికి అభిషేకం చేశారట. ఆయన కాలంలో అన్నాభిషేకం విస్తారంగా జరిగేదట. దగ్గిర దగ్గిర 80 బస్తాలు వండి వార్చి పొద్దున నుండి సాయంకాలం లోపల ఆ అన్నంతో ఈ మహాలింగానికి అభిషేకం చెయ్యాలి. అప్పుడు ఒక్కొక్క అన్నం మెతుకు ఒక్కొక్క శివలింగంతో సమానం. అన్న ప్రసాదం పావువంతు జలచరములకు కావేరిలో కలపాలి. మరోక పావు వంతు ఆవులకు ఆహారంగా ఇవ్వాలి. మిగిలిన సగం 14 గ్రామాలలోని ప్రజలు పంచుకొంటారు. ఇది అనూచానంగా వస్తున్న ఆచారం. స్వామివారు మళ్ళీ ఈ మహాలింగమునకు రాజేంద్రచోళుని కాలంలో చెప్పబడిన విధంగా నిరంతర గంగా జలాబిషేకం, అయిదు మానికల అన్నం, తదితర సంభారాలతో నైవేద్యం, అన్నాభిషేకం ఇవ్వన్నీ ఏర్పాటు చేయించారు. 1989లో కేవలం కొద్ది పర్యాటకులు మాత్రమే దర్శిస్తూ వచ్చిన ఈ దేవాలయం ఈ రోజున కళకళలాడుతోంది. మళ్ళీ 80 ఏళ్ళ పూర్వానికి వెళదాం.
శ్రీమహాస్వామివారికి హైందవ సంస్కృతీ సంప్రదాయముల మీద మిక్కుటమయిన అభిమానం ఉంది. ఆయన ఒక మత ఆచార్యులు. మతాతీతమయిన ఆధ్యాత్మిక గురువులు. ఈ దేశాన్ని, ఈ దేశ సంస్కృతిని ఎంతగానో అభిమానించే దేశభక్తులాయన. 1914 ప్రాంతాలలో వారు చూపిన చొరవ, పరిశీలన ఈ లక్షణములను ప్రోది చేసింది. శ్రీశివానందమూర్తిగారన్నట్లు హిందూమతాన్ని, సంస్కృతిని సమగ్రంగా అర్ధం చేసుకొని ఆచరించి ఉపదేశించిన అతి కొద్ది మంది మహాత్ములలో వారొకరు.
1915లో స్వామివారు మేజర్ అయినారు. అంతవరకూ మఠ నిర్వాహణ కోర్ట్ ఆఫ్ వార్ఘ్‌చే నియమించబడిన మేనేజర్ చేత నిర్వహించబడినది. 1915 శంకర జయంతి రోజున స్వామివారు పీఠబాధ్యతలను స్వయంగా చేపట్టారు. కామకోటి పీఠములో దినసరి కార్యక్రమములన్నీ స్వామివారిచే నియమించబడిన శ్రీకార్యం ఏజెంట్ చేత నిర్వహించబడతాయి. అన్ని వ్యవహారాలు శ్రీవారి అనుమతితో ఈ ఏజెంట్ చేస్తారు. స్వామివారు సన్యాసులయినందు వలన చేవ్రాలు చేయరు. అన్ని ముఖ్య పత్రముల మీద శ్రీకార్యం ఏజెంటు స్వామి సన్నిధిలో స్వామివారి ముద్ర వేసి సంతకం చేస్తారు. ఆ సంవత్సరపు శంకర జయంతి ఉత్సవము అత్యద్భతంగా నిర్వహించ బడింది.
1916లో తిరుప్పనందాల్‌లో కాశీ మఠాధిపతుల వంటి తంజావూరు జిల్లా ప్రముఖులు ముఖ్య భూమిక చేపట్టి ఆ సంవత్సరపు నవరాత్ర్యుత్సవాలను అత్యంత వైభవముగా జరిపించారు. మఠం ముందు పెద్ద పందిరి వేసి అలంకారాలు చేసారు. ఆ పందిరిలో అత్యంత సుందరమైన దుర్గాలక్ష్మీ సరస్వతుల విగ్రహాలను తూర్పు ముఖంగా ఉంచారు. అనంతమైన పుష్పరాసులతో అమ్మపాదాలను అలంకరించారు. 12000 ఇత్తడి ప్రమిదలతో నేతి దీపాలు లింగాకారంగా, వృషభాకారంగా, గజాకారంగా చిత్ర విచిత్రాలుగా పదిరోజులూ రాత్రంతా వెలిగించే ఉంచారు. ఒక పక్క లలితా సహస్రనామాలతో లక్షార్చనలు, శతచండీ, శ్రీవిద్యాహోమాలు, వేరొక వంక రామాయణ, భాగవత, దేవీమహాత్మ్య, సౌందర్యలహరీ ప్రవచనాలు, మరొక వంక వేద పారాయణము, భాష్య శాంతులు, ఇంకొక వంక సాంస్కృతిక కార్యక్రమాలు, గాత్ర కచేరీలు, వాద్య కచేరీలతో పందిరి హోరెక్కిపోయింది. ఆ రోజులలో ప్రముఖులైన కర్ణాటక సంగీత విద్వాంసులంతా విచ్చేశారు. స్వామివారు పందిరిలో ఎక్కడ చూసినా తాముగా వెలిగిపోయారు. 300 మంది స్వయం సేవకులు కార్యక్రమం విజయవంతం కావడానికి అహోరాత్రులు కృషి చేసారు. భోజనాలకు కాక ఏభైవేలకు పైగా ఖర్చయ్యింది. మహాస్వామి విజయదశమినాడు ఏనుగు అంబారీలో మంగళ వాద్యాలు, తేవారం పాడే జౌదువర్లు ముందు నడవగా వేద పండితుల వేదఘోష నడుమ వేలాది భక్త జన సందోహం వెంటరాగా పురవీధులలో ఊరేగుతూ దేవాలయ దర్శనానికి వేంచేశారు. అశేషమయిన భక్త జనులకు తమ కరుణా కటాక్ష వీక్షణమనే పీయూష వర్షంతో వసంతోత్సవం ప్రసాదించారు.
ఆ పదిరోజులూ వేలాది మందికి భోజన వసతులు ఏర్పాటు చేసే బాధ్యత తేపరమానల్లూరు అన్నదానం శివం స్వీకరించారు. ఆ ప్రాంతపు మిరాశీదారులు వందలాది బస్తాల బియ్యం భక్తి పూర్వకంగా సమర్పించారు. 200 మంది వంటవాళ్ళు అహోరాత్రులు శ్రమించి అన్నపురాసులు, ఏనుగులు పట్టేంతటి గంగాళాలతో సాంబారు, రసం, కూటులాంటి పదార్ధాలు తయారు చేశారు. ఇంతమందికి పెరుగు పులవకుండా ఉండటానికి అప్పుడే పాలు కొనడం, తోడు పెట్టడం ఎంత శ్రమ. శివం ముందరే పెరుగును చెక్క పీపాలలో నింపి సీలు వేసి చెరువులో ముంచి ఉంచారు. ఆ రోజులలో రిఫ్రిజిరేటర్ అది. ప్రజలందరూ సుష్ఠుగా భోజనం చేసి మఠం, మఠాధిపతులు వెయ్యికాలాల పాటు సుఖంగా ఉండి తమకు మార్గదర్శకంగా ఉండాలంటూ కోటి నమస్కారాలు చేసుకొన్నారు. ఇంత చేసిన శివం పదకొండో రోజు మిగిలిన సరంజామా అంతా శ్రీమఠానికి అప్పజెప్పి పై గుడ్డ దులుపుకొని వెళ్ళిపోయారు. 'జీవితం నేర్పిన పాఠం' అనే వ్యాసంలో శ్రీవారు ''కొందరి జీవితాన్ని దేముడు పరుల ప్రయోజనం కొరకే సృష్ఠిస్తూ ఉంటాడు'' అంటారు. అన్నదానం శివం అలాంటి పుణ్యపురుషుల కోవలోనివాడు.
ప్రాతఃస్మరణీయులు అన్నదానం శివం గురించి ఇక్కడ చెప్పుకోవలసి ఉన్నది. లక్షలాది మందికి సంతృప్తి కలిగేటట్లు భోజనం పెట్టిన శివం 1852లో కుంభకోణం దగ్గర తేపరమానల్లూరు గ్రామంలో నిరుపేద బ్రాహ్మణకుటుంబంలో జన్మించారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులు పోయారు. మరి వేదశాస్త్రములేవీ చదివిన వాడు కాదు. ఒక వంట బ్రాహ్మణుని దగ్గిర సహాయకునిగా కుదిరాడు. ఆ బ్రాహ్మణుడు నిరతాన్నశీలి. మనం ఉన్న చోట ఆకలితో ఎవరూ పోకూడదంటూ విసుగు, విరామం లేకుండా కొన్ని సమయాల్లో నష్టానికి కూడా చూసుకోకుండా వండి పెట్టేవారు. ఆయన శివానికి అన్నదాన మహిమ గూర్చి ఎంతో గొప్పగా బోధ చేసారు. శివంకు పెళ్ళి అయ్యింది. భార్య అనతి కాలంలోనే కాలం చేసింది. ఇంతలో ఆ వూరి లక్ష్మీనరసింహాలయానికి ఉత్సవాలు వచ్చాయి. ఎంతోమంది ప్రజలు ఉత్సవానికి వచ్చి ఆకలితో మరలటం చూశారు శివం. తనకున్న కొద్దిపాటి భూమి అమ్మి అన్నదానం ఆరంభించారు. డబ్బంతా అయిపోయిన తరువాత త్రిభువనం గుళ్ళో వంటకై చేరారు. అక్కడ చాలా తక్కువ కాలమే ఉన్నారు. తనకుంటూ ఏమీ ఉంచుకోకుండా కేవలం ఒక మాసిన తుండు కట్టుకొని పైన ఒక తుండుతో అనేక ఉత్సవాలలో వేలమందికి భోజన సదుపాయం చేయడం మొదలుపెట్టారు. వీరు సరంజామా ఏర్పాటు చేసే విధానం ఆశ్చర్యంగా ఉండేది. పెద్ద బజారుకి పోయి వర్తకులకు నువ్వో రెండు బస్తాలు బియ్యం పంపించు, నువ్వు పప్పు పంపించు, నీవు ఈ ఈ కూరలు పంపుమని చెప్పుకుంటూ పోయేవారట. వాళ్ళు పంపేవారు. ఏ మిరాసీదారో చిక్కాడో వారందరికీ డబ్బులు ఇప్పించేవారు. లేదంటే వారికే అంతకు అంత లాభం వచ్చేది. పని అయిపోయిన తరువాత మిగిలిన సంభారాలన్నీ ఆ గుడికో, మఠానికో వదిలి పై గుడ్డ దులుపుకొని వెళ్ళిపోయేవారు. ఏ మధ్యాహ్నానికో రెండు ముద్దలు మజ్జిగ అన్నం మాత్రం తిని కుంభకోణం శ్రీమఠం అరుగు మీద పై గుడ్డ పరుచుకొని పడుకొనేవారు.
1897, 1909 , 1921, 1933 లలో మహామఖానికి వచ్చే లక్షలాది ప్రజలకు విపరీతమైన అన్నదానం చేసారు. చివరకు త్రిభువనం గుడిలోనే బ్రహ్మైక్యం పొందారు. అది విన్న స్వామివారు శివంకు మోక్షమేననీ, మరుజన్మ లేదనీ చెప్పి కుంభకోణంలోనూ, త్రిభువనం గుడిలోనూ మోక్ష దీపాలు వెలిగించవలసినదిగా ఆదేశించారు. 10వ రోజు మఠంలో వేలాది మందికి పర్వతాలవంటి అన్నరాసులు, నిచ్చెనలతో పైకెక్కి తిరుగు మూతలు వెయ్యవలసి వచ్చే పెద్ద గంగాళాలతో సాంబారు, చక్రవర్తుల కాలం తరువాత ఈ వైభవం ఆయనకే చెల్లు అనేలా అన్న సంతర్పణ జరిగింది. కొసమెరుపు ఏమిటంటే శివం మిగిల్చిపోయిన ఆరువందల రూపాయల నగదు శ్రీవారు తిరువెల్లూరులో హరిజనులు వాడుకొనే పెద్ద నూతిని బాగు చేయించడానికి వినియోగింప చేసారు.
1914-1918 వరకు శ్రీవారు అప్పుడప్పుడు ప్రక్క గ్రామాలకు వెళ్లడం తప్పించి ముఖ్యంగా కుంభకోణంలోనే ఉండిపోయారు. స్వామి ఈ కాలాన్ని ఎన్నో రంగాలలో తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకొన్నారు. ముఖ్యంగా అనూచానంగా శంకరాచార్యులవారి పీఠంలో ఆచరించబడుతున్న ఆచారానుష్ఠాదులు, పూజాపద్ధతులలో, పరమోత్కృష్టత సాధించడంలో ఎంతో కృషి చేశారు. ప్రతి దినం పండితుల మధ్యలో ఉండి శాస్త్రచర్చ చేస్తూ స్వస్వరూప సంధానం చేసిన మహాపురుషులు కాబట్టి మహాపండితులకు సైతం ఆశ్చర్యం కొలిపే రీతిలో వ్యాఖ్యానాలు చేసేవారు. ఒకసారి ఒక పండితుడు శతావధానం చేస్తుంటే స్వామి సరి అయిన సమాధానాలన్నింటినీ ముందే వ్రాయించి అట్టి పెట్టారు. శతావధాని ఆశ్చర్య చకితులయినారు.
భౌతిక శాస్త్ర విషయంలోనూ, గణితశాస్త్రంలోనూ, ఖగోళశాస్త్రంలోనూ స్వామికి ఉన్న అసాధారణ ప్రతిభ ఆ రోజులలో శాస్త్రజ్ఞులను సైతం విస్మయపరిచేది. రాజా ఏ.వీ. జగ్గారావుగారు విశాఖపట్నంలో అబ్జర్వేటరీని ఒకదానిని స్థాపించారు. ఆయన శ్రీవారిని దర్శించడానికి వచ్చి ఆయన ఆసాధారణ ప్రతిభకు ఆశ్చర్యపోయారట. స్వామికి తాము ఇటలీ నుంచి తెప్పించుకొన్న విలువయిన టెలిస్కోప్‌ను సమర్పించుకొన్నారు. ఈ రకంగా 1919 నాటికి శ్రీవారు బ్రహ్మానుభవలీనులుగా ఉంటూ సమస్త విజ్ఞాన విషయాలలోనూ పరిజ్ఞానాన్ని సంపాదించుకొని రానున్న 75 ఏళ్ళ ఆధ్యాత్మిక సార్వభౌమత్వానికి గట్టి పునాది వేసుకొన్నారు.
నేనీ విధంగా స్వామివారు వివిధ విషయాల్లో ప్రయత్నపూర్వకంగా సుశిక్షుతులయ్యారని చెబితే శ్రీవారిని అవతారంగా భావించే నాకే అనుచితంగా అనిపిస్తోంది. అయితే స్వామివారు తాము ఆచరించి చూపడం అవతారోద్దేశ్యంగా పెట్టుకొన్నారు కాబట్టి, పై విధంగా చెప్పడం ఉచితమేనేమో. మహామహోపాధ్యాయ శాస్త్రరత్నాకర శ్రీ ఎస్.ఆర్.కే. శాస్త్రిగారు ఒక సందర్భంలో 1932-33 లలో శ్రీవారు చేసిన మహోన్నతమైన ఉపన్యాసాలను గూర్చి ముచ్చటిస్తూ ''రాత్రి ఉపన్యాసం అయ్యేటప్పటికి అప్పుడప్పుడు 10 గంటలయ్యేది. అందర్నీ పంపేటప్పటికి 11 గంటలు అప్పుడు కుప్పుస్వామి అయ్యర్ రీసెర్చి లైబ్రరిలో లోపల తలుపు వేసుకొని కూర్చుని రాత్రంతా చదువుతూనే ఉండేవారు. లేకుంటే మద్రాస్ సంస్కృత కళాశాలలో ఆ రోజుల్లో మహామహులైన దిగ్ధంతులైన పండితులు, వివిధ కోర్టులలో ప్రాక్టీస్ చేసే సుతీక్షణమైన బుద్దికల న్యాయవాదులు, న్యాయమూర్తులు శ్రీవారి చినుకు చినుకుగా మొదలయి గంగా ప్రవాహంలా సాగిపోయే ఉపన్యాసాల్లో ఆనంద ఆశ్చర్యాలతో తల మునకలవడం సాధ్యమా!'' అని ప్రశ్నించారు. శ్రీవారు అంత హోమ్‌వర్క్ చేశారని ఆయన ఉద్దేశ్యం. వారి ఉద్ధేశ్యంతో మనమూ పూర్తిగా ఏకీభవిద్దామనుకొంటే అనేక విషయాల్లో, అనేక సందర్భాలలో వారు చూపిన అలౌకిక ప్రజ్ఞ మనని ఒప్పుకోనీయదు.