Dharmakruthi
Chapters
Last Page 6. మహాత్ములైన పూర్వాచార్యులు ఆదిశంకర భగవత్పాదులవారు తమ చివరి అయిదేళ్లకాలం కైలాసయాత్ర సంప్రాప్తమైన యోగలింగాన్ని అర్చించుకొంటూ కాంచీపురంలో ఆవాసం చేశారు. తుంగభద్రా తీరము నుండి విద్యార్థియై వచ్చిన బ్రహ్మచారికి సన్యాసదీక్ష ననుగ్రహించి వారిని తమ తదనంతరపు పీఠాధిపతులుగా నియమించారు. శివరహస్యములో పరమశివుడు త్రికాలములందు యోగనమకమైన స్పటికలింగమును పూజించమని ఆదేశించినట్లున్నది కదా! శంకరులాదిగా మహాత్ములైన కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వరులు యోగేశ్వరార్చన అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు. శంకరులు సర్వజ్ఞేంద్రులను శ్రీసురేశ్వరుల సంరక్షణలో ఉంచినారు. సర్వజ్ఞేంద్రులు సంక్షేపశారీరకమ్, సర్వజ్ఞ విలాసమనే ఉద్గ్రంధములను రచించారు. వీరు సురేశ్వరుల వారి వద్ద బాష్య గ్రంధాలు చదువుకొన్నారు. వీరి ప్రశిష్యులు జ్ఞానానందులు సురేశ్వరుల నైష్కర్మ్యసిద్దికి చంద్రికాభాష్యాన్ని వ్రాశారు. తొమ్మిదవ పీఠాదిపతులైన కృపాశంకరులు మహాప్రతిభాశాలురు. వీరు కామాక్షీ దేవాలయంలోని శ్రీచక్రాన్ని, అఖిలాండేశ్వరీ కర్ణాభరణాలను పునఃప్రతిష్టించారు. ఇరువదవ పీఠాధిపతులయిన శ్రీమూక శంకరులు కామాక్షీ కటాక్షం చేత తమ మూకత్వాన్ని పోగొట్టుకోవడమే కాక కామాక్షీదేవిపై అత్యంత మధురమైన మూకపంచశతిని రచించారు. 37వ పీఠాధిపతులయిన విద్యాఘనుల శిష్యులు అభినవశంకరులు మరల శంకరులంతటి లబ్దప్రతిష్టులు. వీరు కాశ్మీర వాకృతిభట్టును వాదములో పరాస్తులను గావించారు. కాశ్మీరులో సర్వజ్ఞ పీఠాధిరోహణము చేశారు. 47వ ఆచార్యులయిన చంద్రచూడేంద్ర సరస్వతీస్వామివారు ఆసేతుహిమాచలం పర్యటించారు. కాశ్మీర ప్రభువు వీరియెడ భక్తి ప్రపత్తులు చూపేవారు. 51వ పీఠాధిపతులు శ్రీవిద్యాతీర్థులు మహాప్రతిభాశాలురు. విద్యారణ్యులు, భారతీకృష్ణతీర్థులు, సాయణులు, శంకరానందులు వీరి శిష్యులు. శంకరానందులు వీరి తదనంతర పీఠాధిపతులు. వీరు భగవద్గీతకు, నాలుగు ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు వ్రాశారు. 54వ ఆచార్యులు వ్యాసాచల మహాదేవేంద్ర సరస్వతీ స్వామివారు ఆదిశంకరుల చరిత్ర వ్రాశారు. 57వ ఆచార్యులు పరమశివేంద్ర సరస్వతీస్వామివారు దహరవిద్యాప్రకాశిక అనే గ్రంధాన్ని శివగీతలపై భాష్యాన్ని వ్రాశారు. 58వ పీఠాధిపతులు ఆత్మబోధేంద్రులు. వీరికే విశ్వధీకేంద్రులనే పేరున్నది. వీరు చాలా కాలం కాశీక్షేత్ర నివాసం చేశారు. 59వ ఆచార్యులు భగవన్నామ బోధేంద్రులు. వీరు భగవన్నామ మహిమను బహుళ ప్రచారం చేశారు. నామామృత రసాయనము, నామామృత రసోదయమనే రెండు గ్రంధాలను వ్రాశారు. వీరిది జీవసమాధి ఈనాటికి వీరి అధిష్టానం వద్ద రామనామం మందమందంగా వినిపిస్తూ ఉంటుంది. 62వ ఆచార్యుల కాలంలో ఆర్కాటు యుద్దాల కారణంగా శ్రీమఠము కంచి నుండి కుంభకోణమునకు మార్చబడింది. 62, 63, 64 వ ఆచార్యులు కుంభకోణంలోనే సిద్ధిపొందారు. 64, 65, 66, 67 వ ఆచార్యుల సంక్షిప్త జీవిత చరిత్రలు ముందు ముందు చూడవచ్చు. అట్టి మహోన్నత జ్ఞాన పరంపరలో శ్రీశ్రీశ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు 68 వ శంకరాచార్యులవారు.