Dharmakruthi Chapters
Last Page
'మణికుట్టి' అన్న పేరు వినడంతోనే తల్లితండ్రులు తమ పిల్లవాణ్ణి ముద్దుగా పిలిచే పేరుగా తోస్తుంది. ''కాకిపిల్ల కాకికి ముద్దు'' అన్న సామెతగా, తమ గర్భవాసాన జనించిన పుత్రులు ఎంత వికృతంగా ఉన్నప్పటికీ తల్లితండ్రులకు వారెంతో సుందరంగా, ప్రియంగా తోచడం లోకసహజం కదా! ''కన్న'' ''మున్న'' అని ముద్దు చేయడమూ ఉంటుంది. మణికుట్టి అనేది ముద్దుపేరే అయినా తల్లి తండ్రులు వాత్సల్యంతో పిలిచినది కాదు. గ్రామం, సీమ, పండితలోకం ఆ పిల్లవానిని అపురూపంగా 'మణికుట్టి' గా పిలుచుకొన్నారు. అయితే కన్నతండ్రి మాత్రం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వెళ్ళకొట్టారు. పిల్లవాడు పితృవాక్యపరిపాలనకు మించినది వేరే మంత్రం లేదనుకొని, తిట్లనే పరమోపదేశంగా తీసుకొని, బ్రతికినన్నాళ్ళూ ఆ ఉపదేశాన్ని ఆచరణలో ఉంచుకొని నేను ఈ రోజున వారి కథ మీకు ఉదాహరణ కోసం చెప్పేంత ఉన్నతిని సాధించారు.
వారెవరని తెలుసుకోవాలంటే వారి ముత్తాతల నుండి ఆరంభించాలి.
అది 17 శతాబ్దపు చివరి దశాబ్దం. ఆ రోజుల్లో తంజావూరిలో మహారాష్ట్ర వంశమునకు చెందిన షహాజీ మహరాజా రాజ్యం చేస్తున్నారు. సకల కళా వల్లభులైన వారికి ఒక కోరిక జనించింది. ఏమంటే....
ఈ రోజుల్లో రిపబ్లిక్ దినాలు నడుపుకొంటున్నప్పుడు, సార్వభౌముని హోదాలో ఉన్న రాష్ట్రపతి ఎదుట, అన్ని రాష్ట్రముల ప్రభుత్వములు, గ్రామీణ ప్రజలు వారి వారి సంస్కృతీ సంప్రదాయములను, వేషభాషలను ప్రదర్శించుతున్నారు కదా! ఆ సంస్కృతి సంప్రదాయములలో విశేషములను మనమెంతో మెచ్చుకొని భారతీయ సంస్కృతిలోని ఏకసూత్రతను దర్శించి సంతోషిస్తున్నాము కదా! అదే మాదిరి వేదశాస్త్రములలో వివిధ రంగములకు చెందిన మహాపండితుల నందరినీ ఒక ప్రదేశంలో చేర్చి, నివాసము, జీవనభృతి కలుగచేసి తరించవలెననే ఉన్నతమయిన ఆలోచన కలిగింది.
రాజయినందువల్ల ఆశ కార్యాచరణలోనికి తేవడానికి తగిన సమర్ధత, వసతి ఉంటుంది కదా! గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు మొదలయిన రాజ్యాలనుండి ఉత్తమోత్తమమయిన పండితుల కుటుంబాలను ప్రార్థించి, తంజావూరు సీమకు తీసుకొని వచ్చారు. వారి ఆచారానుష్టానములకు అనువుగా ఉంటుందని, కావేరీ దక్షిణ తీరమున ఉన్న ''తిరువిసైనల్లూరు'' గ్రామములో వారినందరినీ విడిది చేయించారు. పలువురు నాయనార్లు పాటలు పాడిన శివక్షేత్రం అది. శ్రీధరయ్యవారు అనే ఆంధ్రబ్రాహ్మణుడు కార్తీక ఆమావాస్యనాడు తమ ఇంటి నూతి నుండి గంగను తెప్పించిన ఊరు అదే. శ్రీధరయ్యవారు కూడా షహాజీ ప్రార్ధనకు అంగీకరించి ఈ ఊరిలో స్థిరబడినవారే. విడిది చేయించిన బ్రాహ్మణులందరకూ గృహారామ సౌకర్యములు ఏర్పాటు చేసి, ఊరినంతటిని ''బ్రహ్మదేయ'' మని పిలువబడెడి సర్వమాన్యముగా దత్తం చేశారు షహాజీ మహారాజు.
ఆ రకంగా వచ్చి తిరువిసైనల్లూరు చేరిన బ్రాహ్మణకుటుంబాలలో శ్రీవాంజియమ్‌నకు చెందిన కన్నడ కుటుంబం ఒకటి. వారి పూర్వీకులు తంజావూరు రాజులకు పరంపరగా మంత్రిగా ఉండేవారు. ఆ కుటుంబమునకు చెందిన వారొకరు బాల్యమునుండియే మహామేధావి, ఆశుకవి అయినారు. శ్రీవాంజియమ్‌నకు చెందినవారు కాబట్టి ఆ ఊరి స్వామి పేరయిన వాంజీశ్వరన్‌గా తండ్రి ఈయనకు నామకరణం చేశారు. అయితే అనతికాలంలోనే ఊరిజనం ఆ పేరు మరిచి ''కుట్టికవి'' అని పిలువ నారంభించినారు (కుట్టి అంటే తమిళంలో పసివాడని అర్థం) - చాలా చిన్న వయస్సులోనే మహారాజు ఎదుట ఆశువుగా కవిత్వం చెప్పడమే ఈ పేరు రావడానికి కారణం. ''కుట్టికవి'' నే కథానాయకునిగా చేసుకొని కథ చెప్పడానికి చాలినంత విషయం ఉన్నప్పటికీ, ఆరంభించిన మణికుట్టి కథకు పోదాం.
''మణికుట్టి'' ''కుట్టికవి'' అపర అవతారం అని చెప్పుకొనేవారు. సాధారణంగా కుటుంబంలో తండ్రిపోతే కుమారుని కడుపున మళ్ళా పుడతాడని ఒక నమ్మిక ఉన్నది. అందువల్లనే పిల్లవానికి తాత పేరు పెట్టే ఆచారము వచ్చింది. అలా పేరు పెట్టుకొనే వారు కాబట్టి తమిళంలో మనువనికి ''పేరన్'' అని వ్యవహారనామం వచ్చింది. మన మణికుట్టి కుట్టికవికి మనవడు కాదు. మునిమనవడు. కుట్టికవి పుత్రుడు మాధవశాస్త్రి మాధవశాస్త్రి కుమారుడు నరసింహశాస్త్రి. వీరెంతో మహావిద్వాంసులు. మన శ్రీమఠ ఆస్థాన విద్వాంసులుగా జీతములు పుచ్చుకోకుండానే కైంకర్యము చేశారు. ఆ నరసింహ శాస్త్రి కుమారులు ఈ మణికుట్టి - ఇంత మహోన్నతమయిన పండిత కుటుంబానికి చెందినవారని చెప్పడానికే ముత్తాతనుండి మొదలుపెట్టాను.
18వ శతాబ్దపు ద్వితీయార్దమునకు చెందినవారు మణికుట్టి. ముత్తాతపేరు అయిన ''వాంజీశ్వరన్'' అని వీరికి నామకరణం చేయబడింది. చిఱుత ప్రాయము నుండే వీరి బుద్ది కుశలత, శేముషీ వైభవము కూడా ముత్తాతగారిని గుర్తుకు తెప్పించేది. అందుకు తోడు తరువాత వీరి గౌరవ నామం కూడా ''మణికుట్టి'' అయినది. తిరువిసైనల్లూరులోనే ఉన్న ఈశ్వరశాస్త్రి అనే వారి వద్ద వీరు మీమాంసాశాస్త్రం అభ్యసించారు.
అయినా వారిని న్యాయశాస్త్ర నైపుణ్యమే ''మణికుట్టి'' ని చేసినది. తిరువిసైనల్లూరు తూర్పున ఆరుమైళ్ల దూరమున ''మనలూరు'' అనే గ్రామమున్నది. ఆ ఊరిలో శ్రీనివాసయ్యర్ అనే తర్కశాస్త్ర మహావిద్వాంసులొకరుండేవారు. బెంగాలులో ప్రసిద్ఢిగాంచిన ''నవ్యన్యాయ'' మనే తర్కశాస్త్రములో దక్షిణాదిలో పాండిత్యము సంపాదించినవారు వీరు ఒక్కరు దక్క వేరే ఇంకెవ్వరూ లేరు. వారి వద్ద మన ''వాంజీశ్వరన్'' తర్కశాస్త్రమభ్యసించినారు.
బెంగాలంటే మన ప్రక్క వారందరికీ సాధారణంగా రామకృష్ణ పరమహంస, కాళీమాత గుర్తుకు వస్తారు. మత విషయకమయిన పరిజ్ఞానమున్న మరి కొంతమందికి చైతన్యమహాప్రభు, రాధాకృష్ణులు గుర్తుకు వస్తారు. (కాళం, కృష్ణ అనే రెండు పదాలకూ నలుపు అనే అర్థం). సాధారణంగా బెంగాలీలంటే భక్త్యావేశపూరితులనే మన అభిప్రాయం. అయితే బెంగాలులో Pure reasoning కోసమే ఏర్పడి కేవలం బుద్ధివాదం ద్వారా తర్కశాస్త్రం చిగిర్చి పరిఢవిల్లినది. వైదిక మతంలో షడ్దర్శనములని పిలువబడుతున్న షట్చాస్త్రములలో గౌతముడు ప్రసాదించినది తర్కశాస్త్రం. ఈ తర్కశాస్త్రమును అభివృద్ధి పరచి నవ్యన్యాయ మను పేర సాధించారు గంగేశోపాధ్యాయులవారు.
గంగేశమిశ్రోపాధ్యాయులవారు బంగాళ దేశమునకు చెందినవారు, చరిత్ర పరిశోధకులు. వారి కాలము 13వ శతాబ్దమునకు ముందు ఉండటానికి సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. వీరు తమ ''తత్త్వచింతామణి'' గ్రంథములో గౌతముడొసగిన తర్కశాస్త్రమును 64 వాదములుగా విభజించి, అభివృద్ధి పరచి నవీన తర్కమైన నవ్యన్యాయమును సాధించారు. ''నవం'' అంటే క్రొత్తది అని అర్థం. ''నవ్యం'' అనేది దాని నుంచి సాధించబడిన పదమే. ''మణి'' అని వాడుకలో పిలువబడే ''తత్త్వచింతామణి'' పుస్తకమునకు మధురానాధుడు, జగదీశుడు, వాసుదేవ సార్వభౌముడు, రఘునాధ శిరోమణి మొదలయిన పండితులు వాఖ్యానము చేసినారు. (ఎన్నో సంవత్సరముల ముందు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లలో క్రికెట్ ఆడినవారి పేర్లు, హాలీవుడ్ సినిమాలలో నటించినవారి పేర్లు, సినిమాలు, సంవత్సరాలు, ఇన్ని వివరాలు జ్ఞాపకం ఉంచుకొంటున్నారు కదా! విదేశీ విద్యావంతులు ''ఈ రకమైన మహోన్నతమైన ఒక తర్కమా!'' అని ఆశ్చర్యపోతున్న తర్కశాస్త్రంపై ఆధారగ్రంథాలు వ్రాసినవారి పేర్లు మీ చెవుల్లో పడాలనే చెప్పాను). ఆశ్యర్యమేమంటే పై ఆధార గ్రంథములు వ్రాసినవారందరూ భక్త్యావేశములకు పేరు పొందిన బంగాళీయులే. అందులో విశేషముగా కృష్ణగిరి జిల్లాకు చెందిన నవద్వీపమునకు చెందినవారే. ఈ ప్రాంతంలో తొమ్మిది గంగ దీవులు ఉన్నందున దీనికి నవద్వీపమని పేరు వచ్చినది. సరి! ప్రదేశమో! నవద్వీపం! అందు ఉద్భవించిన శాస్త్రం ''నవ్యన్యాయం''. నవద్వీపము బంగాళీయుల వాడుక భాషలో ''నదియా'' అయినది. చైతన్య మహాప్రభువులు కూడా నదియాలోనే పుట్టారు. వారు 15 శతాబ్దం చివరి దశాబ్దం నుండి 16వ శతాబ్దం మొదటి దశాబ్దం వరకు జీవించి ఉన్నారు. వాసుదేవ సార్వభౌములు వారికి Senior Contemparay. వారి వద్ద చైతన్యులూ, రఘునాధశిరోమణి శిష్యులుగా ఉన్నారని చెబుతారు. పరమ భాగవత సహజంగా, తనను తాను మరచి భగవన్నామంలో లీనమయిపోతూ ఉండే చైతన్యులు బుద్ధి ప్రకాశంలో కూడా వెనుకంజ వేసినవారు కాదు. ఆ విషయం అలా ఉండనీండి. పైన చెప్పిన నాల్గయిదు తర్కశాస్త్ర మహావిద్వాంసుల సరసన ఇంకొక పేరు చేర్చవలసి ఉన్నది. వారు గదాధరులు (పరమహంసకు కూడా గదాధరుడనే పేరు).
గంగేశుని ''తత్త్వచింతామణి'' పైన ఉన్న అనేక వ్యాఖ్యానగ్రంథములకు కొలికి పూసలేక శిరోమణిగా చెప్పుకోదగినది రఘునాధ శిరోమణి వ్రాసిన దీధితి - ఈ కాలంలో శిరోమణి పట్టం ఇస్తున్నారే అది వీరిని దృష్టిలో ఉంచుకొనే. మహావిద్వాంసులు, జ్ఞానభాస్కరులు వీరు. ఈ వ్యాఖ్య ఎంతో సులభగ్రాహ్యంగా, స్పష్టంగా వ్రాశారు. దీధితి అంటే ప్రకాశం, కాంతి అని అర్థం. లలితా సహస్రనామములలో అమ్మవారి గోళ్లకాంతుల గురించి ''నఖదీధితి'' అని చెప్పబడినది. రఘునాధ శిరోమణి వ్రాసిన ''దీధితి'' లోని పది వాదములనెత్తి, వీనికి గదాధరుడు విస్తృతమైన వ్యాఖ్య చేసినారు. అది చాలా పెద్ద పుస్తకమయినప్పటికి, ఒక్క వాక్యం కూడా అనవసరంగా వాడినట్లు తోచదు. గదాధరుడు వ్రాసినాడు కాబట్టి దాని పేరు ''గదాధరి'' అయినది. న్యాయశాస్త్రమునకు గోపురశిఖరము వంటింది ఈ గ్రంథము. ఇందులో వివరించిన పది వాదములలో అయిదు క్షుణ్ణంగా చదివితేనే బుద్ధిమంతుడు అవుతారు. పదీ చదివితేనో? మహాబుద్దిమంతుడు. అందులో బ్రాహ్మణ్యవాదాన్ని అర్థం చేసుకొన్న వారికన్న బుద్దిమంతులీ పృధ్విలో లేరని చెబుతారు.
ఈ రకంగా ''చింతామణి'' నుండి ''గదాధరి'' వరకూ అభివృద్ధి పొందిన ఈ ''నవ్యన్యాయం'' బెంగాలులో, ఉత్తరప్రదేశ్ కొన్ని భాగాల్లో ప్రాచుర్యం పొందింది. మన కథాకాలంనాటికి తమిళనాడు పండితులు మంచి లోతు కల్గిన అలాటి శాస్త్రమొకటుందని విన్నారే కానీ చదివి ఉండలేదు. అలాటి కాలంలో దానిలో విశేష జ్ఞానం సంపాదించడానికి బస్సులు, రైళ్ళు లేనందున తంజావూరు నుండి బెంగాలుకు నడిచిపోయి అక్కడి పండితులను ఆశ్రయించి నవ్యన్యాయమును పూర్ణముగా ఔపోసన పట్టిన వారొక్కరే. వారు మన ''వాంజీశ్వరన్'' చదువుకోవడానికి వెళ్ళారే - ఆ మనసూర్ శ్రీనివాస అయ్యర్ - 18వ శతాబ్దపు మొదటి అర్థంలో తిరిగి స్వగ్రామం చేరారాయన.
ఎవరి కంటే బుద్దిమంతులుండ శక్యం కాదో, అటువంటివారే బ్రాహ్మణ్యవాదాన్ని అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పుకొన్నాం కదా! అలా పరిపూర్ణబుద్ది కల్గిన మన వాంజీశ్వరన్ ఒక్కడే వారి వద్ద ఈ తర్కమభ్యసించగలిగారు. రోజుకు పన్నెండు మైళ్ళు రానుపోను నడిచి విద్యనభ్యసించి 18 ఏళ్ళ వయస్సులో మన ''కుట్టిశాస్త్రి'' 64 వాదములలోనూ మహాఘటికుడయినాడు. ఆ కాలంలో బంగాళ విద్వాంసులొకరు రామేశ్వరయాత్ర సంకల్పించి దారిలోని అన్ని సంస్థానాలలోని విద్వాంసులను వాదములో పరాస్తులను గావించుతూ తంజావూరు చేరి వాద పరీక్షకై రాజాను సందర్శించారు. అప్పటి తంజావూరు మహారాజా సర్వోజీ.
అది తెల్లదొరలు రాజ్యం కబళించేకాలం. వారు యుద్ధాలు చేసి రాజ్యాలు కలుపుకొన్న భాగం కన్నా కృత్రిమమైన కోతి మధ్యస్థం చేసి రాజ్యాలను స్వాహా చేసిన భాగమే ఎక్కువ. ఒక రాజ్యం అంటూ వుంటే వారసత్వం విషయంలో ఏదో ఒక స్పర్థ రాక మానదు కదా! ఆ సమయాలలో వీరు పోయి పిల్లవాడ్ని గిల్లి, ఉయ్యాల ఊపి ఆడించే విధాన రెండు వైపులా రెచ్చగొట్టి, తలబడేట్లు చేసి, రాజీ చేసే మాదిరి పెద్ద మనుష్యుల వలె వచ్చి ఒకరికి రాజ్యాధికారం, ఇంకొకరికి అందులోనే కొన్ని అధికారాలు రాజాబిరుదులూ, లక్షల నష్టపరిహారం, సుఖజీవనానికి గారంటీలంటూ ఏర్పాటు చేసి, ఇద్దరినీ ఒత్తిడి చేసి ఒప్పించేవారు. తీరా చూస్తే రాజ్యాధికారం అన్న పెద్ద పేరుతో వీరిచ్చేది భవంతిలో గౌరవయుతమయిన జీవనం, పట్టపేనుగు ఊరేగింపు, డబ్బు సౌకర్యం వంటివి మాత్రమే. ముఖ్యమైన అధికారాలన్నీ వారే హస్తగతం చేసుకునేవారు. అదృష్టమేమంటే సంస్కృతి విషయమును ముఖ్యమైన అధికారాల్లో ఒకటిగా వారు భావించేవారు కాదు. అదీకాక మన రాజపరంపరల మనస్తత్వాన్ని బాగా అర్ఘం చేసుకొన్నవారు కాబట్టి వీర్ని కేవలం బొమ్మరాజులుగా చేసినా, కళాకారులను, విద్వాంసులను పోషించడానికి తగు అధికారం, సౌకర్యాలు కలుగజేసేవారు.
ఇదేరకంగా సర్వోజీ, అమరసింహులు వారసత్వ విషయమై ప్రతికక్షులుగా మారినప్పుడు, ఈ తెల్లదొరలు అటూ ఇటూ తాళం వేసి సర్వోజీని తంజావూరి మహారాజాగా చేశామన్నారు. అమరసింహునికి అధికారాలు లేని మహారాజా టైటిల్ మాత్రమిచ్చి తిరువిడైమరుదూరులో గృహనిర్బంధము మాదిరి చేసి ఉంచారు. ఇది ఒక రకంగా చాలా మంచిదయింది. ఆ ఇద్దరు రాజులు కళాభివృద్ధిపైన అభిరుచితో విశేషముగా కళలను పోషించి కళాకారులను, వేద విద్వాంసులను పోషిస్తూ వచ్చారు.
ఈ బంగాళ పండితుడు మొదట సర్వోజీ వద్దకు వచ్చారు. వాద పరీక్షకు సదస్సు ఏర్పాటు చేయబడింది. తంజావూరి సంస్థానములో ప్రసిద్ధి పొందిన పండితులెంతో మంది ఉన్నప్పటికీ బంగాళ నవ్యన్యాయములో వీరికి ప్రవేశము లేదు. వచ్చిన విద్వాంసులో! దానిలో అందె వేసిన చేయి. ప్రసిద్ధి గాంచిన తంజావూరి సంస్థానపు మహాపండితులు బంగాళాపండితుని చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మర్యాదానుసారం మహారాజావారు జయించిన వారికి విశేష సంభావన చేసి పంపారు. దక్షిణదేశ ప్రతిష్టకిది కళంకంగానే ఉన్నది. తంజావూరు విజయం తరువాత వంగ విద్వాంసులు తిరువిడైమరుదూరు అమరసింహుని వద్దకు వచ్చారు. తిరువిసైనల్లూరు గ్రామం తంజావూరు కన్నా తిరువిడైమరుదూరుకే దగ్గర. ఆ కారణంగా ఆ గ్రామ పండితులందరూ అమరసింహుని సదస్సులలో ఎక్కువ పాల్గొనేవారు. ఆ సదస్సులో అమరసింహునితో తిరువిడైమరుదూరు తరలి వచ్చిన మహారాష్ట్ర శాస్త్రపండితులతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలలోని విద్వాంసులు కూడా పాల్గొనేవారు. ఆ వచ్చిన పండితుడు రాజును వాద పరీక్ష ఏర్పాటు చేయకోరగా, అమరసింహుడు విద్వాంసులందరికీ ఆహ్వానము పంపినారు. తంజావూరు సమాచారం అందరకూ తెలిసి ఉన్నందున పేరు పొందిన విద్వాంసులు అవమాన భయంతో సదస్సుకే రాలేదు. అయితే ఇదివరకు ఈ రకమైన వాద పరీక్షలలో పాల్గొనని యువక పట్ట భద్రులు, 'తంజావూరు అవమానాన్ని తుడిచి' వేయాలనే సదుద్దేశ్యంతో సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సదస్సులో వంగపండితుడు సింహంలా గర్జిస్తూ తమ నవ్యన్యాయవాదాన్ని వెలికి తీశారు. తంజావూరి గతియే ఇక్కడా పట్టేలా ఉంది. వృద్దులు, వాదోత్సాహంతో ఉఱ్ఱూతలూగుతూ వచ్చిన యువకులూ, సిగ్గుతో కుంగిపోయే పరిస్థితి వచ్చింది. అంతలో ఓ మూలనుండి మెల్లగా ఒక గొంతు వినిపించింది. ఆ వైపుకు సదస్సంతటితో పాటు వంగ విద్వాంసులూ చూశారు. వారి ముఖంలో పరిహాస రేఖ తోచింది. ఎవరో ఊరు పేరు లేని 18 ఏళ్ళ యువకుడు అలక్ష్యంగా కూర్చోమన్నట్లుగా చేత్తో సైగ చేశారు.
ఆ బాలుడు ''కుట్టిశాస్త్రి'' అని మీకు నే చెప్పకుండానే తెలిసి ఉంటుంది. మహాప్రతిభాశాలి అయిన విద్వాంసుడు కూర్చోమన్నట్లు సైగ చేసినా వీరు కూర్చొనలేదు. గొంతు పెంచి చెప్పదల్చినది ధైర్యంగా ఖరాఖండిగా చెప్పారు. అమరసింహుడు, సదస్యులు ఆనంద సంభ్రమాలకు లోనయినారు. తర్కశూరుని ప్రశ్నలకు సరి అయిన జవాబులిచ్చారు. ''కుట్టిశాస్త్రి''. ఆ పైన 64 వాదములలోనూ వంగపండితుని ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానమిచ్చారు. సదస్సులో ఒకటే ఉత్సాహం. సభలో జీవకళ తిరిగి ప్రవేశించింది. వంగపండితుని నోరు మూత పడిపోయింది. అంతటితో వదలక మన కుట్టిశాస్త్రి ''ఇక నే అడిగే ప్రశ్నలకు తాము సమాధానమియ్యాలి'' అంటూ తర్కవిద్వాంసునికి ఆధార పరీక్ష పెట్టనారంభించారు.
వంగపండితులు పరీక్షకు నిలువలేకపోయారు. కుట్టిశాస్త్రిని నోరు మూసుకోమని సైగ చేసిన వీరు మౌనం వహించాల్సి వచ్చింది. అవమాన భారంతో తలవంచారు. ''మన దేశీయమైన నవ్యన్యాయంలో పోయి పోయి ఒక పసివాని వద్దనా పరాజయం'' అని కుంగిపోయి వేరు శరణ్యం లేక పరాజయం అంగీకరించారు. సభలో ఒకటే సంరంభం, రాజ్యగౌరవాన్ని నిలబెట్టిన కుట్టిశాస్త్రిని మిగతా పండితులు, అమరసింహులు ఎంతో ఆనందంగా అభినందించారు. ఈ యువక విద్వాంసునకు విజయస్తంభము నాటబోతున్నానన్నారు మహారాజు. పిల్లవాడు ఆ గౌరవానికి నిస్సంశయముగా యోగ్యుడయినప్పటికీ, చిన్న వయస్సులో ఈ రకమైన సన్మానం వలన దృష్టిదోషం కలగవచ్చు. ఇంకా ఎంతో అభివృద్ధి పొందాల్సిన వాడవడాన ఈ సామాజిక గౌరవాన్ని గురించి నిదానంగా ఆలోచించాలన్నారు సదస్యులు. అలా అయితే బిరుదు ఇద్దామన్నారు రాజుగారు. సదస్సు ఆనందోత్సాహములతో ఆమోదించింది.
తర్క చింతామణి లో ఈ మహావిద్వాంసుడు తన విశేష ప్రజ్ఞాపాటవాలను చూపించినారు కాబట్టి ఆ పేరు కలిసివచ్చేలా ''చింతామణి కుట్టి'' అనే బిరుదు ఉచితముగా ఉంటుందని రాజు, పండితులు భావించారు. వాంజీశ్వరన్ ఈ విధముగా ''చింతామణి కుట్టి'' అయినారు. తర్కచింతామణిని పండితలోకంలో సంక్షేపంగా మణి అని పిలిచే అలవాటుంది అని చెప్పుకొన్నాం కదా! అందువలన చింతామణి కుట్టిని మణికుట్టి అని వ్యవహారంలో పిలువనారంభించారు. ప్రేమతో ముద్దుగా పిలిచే పేరు మాదిరి చక్కగా అమరింది ఈ పేరు ఏదో చక్రవర్తి, అపర అవతారం అని నలుగురి దృష్టిదోషం కలిగే బిరుదుగాక మన పసి విద్వాంసునికి ఈ పేరెంతో ముద్దుగా, ప్రియంగా ఉన్నది కదా!
వీరు కూడా ''చింతామణి'' గ్రంథము మూలానే తనకీ గౌరవం లభించిన విషయం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జ్ఞప్తిలో ఉంచుకొన్నారు. తరువాతి కాలంలో వారు వ్రాసిన పుస్తకాలకు చింతామణి పేరు కలిసి వచ్చేలా ''బ్రహ్మసూత్రార్థ చింతామణి'', ''పాఠ చింతామణి'', ''దత్త చింతామణి'', ''శ్రాద్ధ చింతామణి'' అని పేరు ఉంచుకొన్నారు. ఈ రకంగా లోకమంతా బహుధా ప్రశంసించబడిన తన ప్రియమైన కుమారుని తండ్రి ఎందుకు తిట్టనారనే విషయం గురించి కదా మనం మొదలుబెట్టాం.
ఆ రోజుల్లో తెల్లదొరల పరిపాలన స్థిరబడి మద్రాస్‌లో హైకోర్టు వచ్చింది. అందులో హిందూ మత సంబంధమయిన వ్యవహారములను పరిశీలించడానికి పండిత పదవిని వారేర్పాటు చేశారు. హిందూ ధర్మ శాస్త్ర విషయంలో నిష్ణాతులైన పండితునికే ఈ ఉద్యోగమిచ్చేవారు. మరి అలాటి పండితుని నిర్ణయించడం వారి అధికారులకు అలవి కాదనే ఉద్దేశ్యంతో అభ్యర్థులనెంపిక చేసి పంపవలసినదని ధర్మ పీఠమును ప్రార్థించేవారు. మన కథ నడిచే కాలంలో అలా పదవి ఒకటి ఖాళీ అయింది. అభ్యర్థులను ఎంపిక చేసి పంపవలసినది అని మన మఠ ఆచార్యులవారిని కోరారు. ఆ కాలంలో మన మఠం కుంభకోణంలో ఉండేది.
తెల్లవారు ఇక్కడ ఎన్నో తప్పుడు పనులు చేసి రాజ్యములను హస్తగతం చేసికొని, తమ ప్రాచుర్యమునకు ఎన్ని తంత్రములు చేయాలో అన్నిటినీ చేస్తున్నప్పటికీ, హిందూ మత వ్యవహారములలో తలదూర్చి వారి సెంటిమెంట్స్‌పై దెబ్బతీయకుండా జాగ్రత్తగా ఉండేవారు. దానికి కారణం ఏమయినా అవనీండి. ఇప్పుడు మన స్వపరిపాలనలో రాజ్యాంగంలో మత ప్రమేయము లేని లౌకిక రాజ్యమని పెద్ద దంభంగా వ్రాసికొని మరొక ప్రక్క హిందూ మత విషయంలో మాత్రం ప్రవేశించి, రాజకీయనాయకులు తమ చిత్త మొచ్చినట్లు మార్పులు, చేర్పులు చేస్తున్నట్లుగా, ఆ కాలంలో తెల్లదొరలు చేయలేదనే విషయం ఒప్పుకొని తీరవలసినదే. అందువలనే న్యాయశాస్త్రంలో హిందూ మత పరమయిన చిక్కులు వస్తే తమ చిత్తమొచ్చినట్లు తీర్పు నీయకూడదని, ఒక ధర్మశాస్త్రజ్ఞుని సలహా తీసుకోవాలని, ఈ పదవి ఏర్పాటు చేశారు. సరి! కథాంశంలోనికి వస్తే మణికుట్టి తండ్రి, తాతలు మఠవిద్వాంసులని చెప్పాను కదా! ఇప్పుడు ఈ గౌరవమును పొంది ఆచార్యస్వామి ఆశీర్వాదమునకై కుంభకోణం వచ్చినారు మణికుట్టి - స్వామివారు వేడుకగా ''హైకోర్టు పండిత ఉద్యోగానికి పోతావా'' అని అడిగారు. అంత చిఱుతప్రాయంలో మహాగౌరవమును పొందిన మణికుట్టి తన విద్య ఇంకనూ వినయమును పెంపొందించగా, అణుకువతో స్వామి అడిగిన తోడనే ''పెద్దలు ఆదేశించిన తరువాత తీర్మానం చేసే అధికారం నాకేమున్నది? సన్నిధానమువారు, నా తండ్రి, ఆదేశించిన తీరున నడుచుకొనడమే నా విధి'' అన్నారు. స్వామివారు నవ్వి ''అలానా! అయితే తండ్రిగార్ని అడిగి చూడు'' అన్నారు. తిరువిసైనల్లూరు వచ్చిన మణికుట్టి తండ్రి వద్దకు వెళ్ళి విషయం వివరించారు. అంతే! అనర్థం వచ్చిపడింది. తండ్రి మండిపడ్డారు.
''బ్రాహ్మణ జన్మ ఎత్తినవాడు శ్వవృత్తి చేయడం పెద్దతప్పు. స్వతంత్రంగా ఉండి శాస్త్ర విహితమయిన ధర్మములను కాపాడుకొంటూ, అందుకోసం చనిపోవడానికైనా సిద్దపడి ఉండాలి. సేవకావృత్తికి పోతే తనకు అన్నం పెట్టే యజమానిని అనుసరించవలసి రావడాన ధర్మమును సందర్భానుసారము కొంచెం ఉపేక్షించవలసి వస్తుంది కాబట్టి ఈ వృత్తే కూడదన్నది శాస్త్రం. స్వతంత్రంగా పాఠం చెప్పు. ఎవరయినా నేర్చుకోవడానికి వచ్చినవారు ప్రియంతో దక్షిణ ఇస్తారా, స్వీకరించు. దాంతో జీవనం చేయి. నీ దగ్గర వేదం చెప్పుకోవడానికి ఎవరూ రాకపోతే ఆ వచ్చినవారు దక్షిణ ఈయకపోతే, అదే వేదము పారాయణం చేసుకొంటూ వేద ధర్మము కళంకమవకుండా ఉండటానికి ప్రాణత్యాగం చేయడానికైనా సరే సిద్ధంగా ఉండు అని బ్రాహ్మణునికి విధించబడి యున్నది. ఈ విధి వేరెవరో నియమించినది కాదు. ఋషులే దూరదృష్టితో ఈ రకంగా విధించారు. మరి నువ్వో! మన వర్ణాశ్రమాది ధర్మ విషయమే తెలియని అన్యదేశీయుల వద్ద ఊడిగం చేయడానికి సిద్ధమయినావు. సన్నిధానం వారు చెప్పారని వేరే చెబుతున్నావు. స్వామివారు నీ మనోభావనలు తెలుసుకోవడానికి వేడుకగా అడిగి ఉంటారు. విదేశీ దొరల వద్ద కూలిపని గురించి చెప్పినంతనే నీ శరీరం అసంకల్పితంగా కంపించిందా లేదా అని చూడటానికే వారు ఆ విధంగా అడిగి ఉంటారు. స్వామివారే అయినా, చంద్రమౌళీశ్వరుడే అయినా, నీ మీద నిప్పులు గుమ్మరిస్తే వెంటనే చెదిరి, బెదిరి కంపించిపోతావా లేక తండ్రితో సంప్రదించి కంపించుదామని ఆగిపోతావా? ఉద్యోగమంటే నీకు రుచి ఉన్నందునే వెంటనే అయ్యా! ఇది పాపం! ఈ రకంగా జీవించడం కన్నా చావడం మేలు అని బెదురుతూ చెప్పక నాన్నా, మేకపిల్ల అని సాకులు చెబుతున్నావు. నీవు ఏం చదివి ఏం బిరుదులు తెచ్చుకొంటే ఏం ప్రయోజనం! సన్నిధానంలో ఈ పాప వృత్తి వద్దు అని ఖరాఖండిగా చెప్పనందునే బుద్ధి పరిణితికై ఊరంతా మెచ్చుకోబడుతున్న నీ కుమారుని మనో పరిణితి ఎంత లక్షణంగా ఉందో చూడు అని చెప్పకయే చెప్పినట్లు నా వద్దకు పంపారు. పో! ఈ రకమైన పిల్లవాడు నాకు అక్కరలేదు'' అని నిర్దాక్షిణ్యంగా పుత్రుని వెళ్లగొట్టారు నరసింహశాస్త్రి.
ఆధ్యాత్మిక ప్రవృత్తికీ, దైవభక్తికి, సదాచారమునకు ఆలవాలమయిన మన దేశం, మన స్వధర్మములను సకల ధర్మములను త్రోసివేసి, తాను పోటీపడలేని లౌకికాభివృద్ధి పోటీలోనే ముణిగి వృధా అయిపోవడానికి కారణం, ఈ రోజులలో ఎంతో మంది నరసింహశాస్త్రులు లేకపోవడమే. బ్రాహ్మణులు మొదట్లో స్వధర్మాన్ని వదిలి వేసి తెల్లవారి వద్దకు గుమాస్తా ఉద్యోగానికి పోయి, ఆ పైన వారి ఆంగ్లేయ విద్య అభ్యసించినందు వల్లనే హిందూ సముదాయపు ఉన్నతి, వర్ణాశ్రమధర్మములు కుప్పకూలిపోయినవి. నరసింహశాస్త్రి ఈ రకంగా చెప్పడం మీ అందరికీ ఎలా తోచినా సరే! నాకు ఈ కోణంలో చూచినప్పుడు ఇలా అనేక నరసింహశాస్త్రులు లేరే! అని బాధగా ఉంది. ఆ విషయం అలా ఉండనీయండి.
ఎందుకూ పనికిమాలిన పిల్లలపై తండ్రి కోపిస్తే, దండిస్తే వారికెంతో కోపం వచ్చి ఇంటినుండి పారిపోతున్నారు. తరువాత వీరి కన్నమనస్సు తాళ##లేక న్యూస్ పేపర్లలో ''ఏమీ మనస్సులో ఉంచుకోక ఇంటికి రా! మేము అన్నీ మరచి పోయాం! మరణశయ్యలో ఉన్నాము'' అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. మరి, నరసింహశాస్త్రి! మహావిద్వాంసుడు, సుగుణాలప్రోవు, ఏక సంతాగ్రాహి అయిన పిల్లవానిని స్వధర్మం పై తనకున్న శ్రద్దతో ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
మణికుట్టి కూడా సాధారణబాలుని వలె తండ్రి తిట్టినందుకు కోపించలేదు. ''మనకు ఉద్యోగాశ##లేదనేది మన అంతరంగానికి బాగా తెలుసు. అయినా తండ్రి చెప్పిన విధంగా స్వధర్మ రక్షణపై మనకు తీవ్రమైన పట్టదల ఉండి ఉన్నట్లయితే వారు ఎదురు చూసిన విధంగా సన్నిధానం వారి ఎదుట హైకోర్టు ఉద్యోగమును సవినయముగా తిరస్కరించి ఉండవలసినది. ఆ రకంగా చేయకపోవడం దోషమే. ఆ దోషం తొలగి తండ్రికి మనపై మనస్సు కరిగి మనలను దగ్గర చేర్చుకొనేంతవరకూ తపస్సు ఒకటే శరణ్యమని నిశ్చయించుకొన్నారు.
సారవంతమయిన భూమిలో నాటిన సత్తువగల బీజం వలె తండ్రి ఉపదేశం తనయుని మనస్సులో బలంగా నాటుకొంది. కావేరి తీరాన వారి తపస్సు పండితలోకాన్ని కల్లోల పరిచింది. వారంతా నరసింహశాస్త్రి వద్దకు పోయి సద్గుణాలరాశి అయిన తనయుని దగ్గరకు తీసుకోవలసినదిగా అర్థించారు. వారునూ సమాధానపడి తపస్సు చేసి వచ్చిన తన తపముల పంటను దగ్గరకు తీసుకొన్నారు. అయితే కథ ఇక్కడితో ఆపివేయవచ్చుగానీ, ఆ విత్తు కాలక్రమంలో ఏ రకంగా మహావృక్షంగా మారిందీ చెప్పాలి కదా! మణికుట్టిని కుట్టిశాస్త్రిగా పిలిచే తరువాతి తరం వచ్చింది. అంటే వారు నడివయస్సులోనికి వచ్చి కుటుంబ భారం వహిస్తున్నప్పుడన్నమాట. వారు బహుకాలం ఒరతాడులో నివాసం చేస్తూ వచ్చారు. ఆ ఊరికి సర్వోజీమహారాజు ప్రతిదినం ఆశ్వికులను పంపి ఆ ఊరి బ్రాహ్మణోత్తముల నుండి పూజాక్షతలు తెప్పించుకొని అవి ధరించిన పిదప భోజనం చేయడం ఆచారంగా పెట్టుకొన్నారు. కుట్టిశాస్త్రి రాజుగారి సేవకులు వేచి ఉన్నారని తమ పూజను త్వరితగతిని ముగించక, యధావిధిగా అనుష్టానము ముగించేవారు. అందువలన రాజుగారి భోజనానికి ఆలస్యమయ్యేది. ఈ విషయమై ఒకనాడు రాజా కుట్టిశాస్త్రిని ప్రశ్నించారు. పలువురి ఎదుట ఎదిరించడం రాచమర్యాదకు భంగమని తమను తాము సంబాళించుకొని 'ఆజ్ఞ' అని చెప్పి ఊరుకొన్నారు కుట్టిశాస్త్రి.
అయితే రాజా వెళ్ళిన పిదప ఆ ఊరిలో ఒక్క క్షణమయినను నిలువ బుద్ధి కాలేదు. తంజావూరు సీమ విడిచిపో నిశ్చయించుకొన్నారు. వెంటనే భార్యాసహితులై బయలుదేరి అర్థరాత్రి ఝాముకు తిరువయ్యార్ ధర్మసంవర్థిని అమ్మవారి వద్దకు వచ్చి మొరబెట్టుకొన్నారు. మహాపండితులు కావడాన మొర శ్లోకరూపంలో వచ్చింది.
కతీంద్రయామ కతి చంద్రయామ
ఛండం పునః పూరయతుం పిచండం
నీస్తుతి చేయక ఈ ఉదర పోషణకై ఎంతమంది రాజలను ఇంద్రుడు చంద్రుడు అని స్తోత్రం చేస్తాను అని ఈ శ్లోక భావం.
అమ్మవారు ఆయనకు తెలివిని ధైర్యాన్ని ప్రసాదించింది. భిక్షం ఎత్తుకుంటూనే మహారాష్ట్రకు పోయినారు. అక్కడ ఆ రోజుల్లో భాజీరావు సీమంతక్ అనే పీష్వా రాజ్యంలో ఉన్నారు. గదాధరి వ్రాసిన గదాధరుని వంశము వాడయిన సుందర నారాయణ భట్టాచార్య అక్కడ ఆస్థాన పండితులుగా ఉన్నారు. ఆయన దాక్షణాత్య పండితులకు నవ్యన్యాయంలో పరిచయం లేనందున వారు పీష్వా కొలువులో ఉండటానికి అర్హులు కారని అడ్డుపెడుతూ వచ్చారు. ఇది విని దక్షణగౌరవము నిలబెట్టడానికి మణిశాస్త్రి సంకల్పించారు. పూనాలోని ప్రసిద్ద విద్యాలయమునకు పోయి నవ్యన్యాయంలో పరీక్షనీయడానికి అర్జీ పెట్టారు. అక్కడి అధ్యాపకులు భట్టాచార్య వాక్యముల ననుసరించి ఈ శాస్త్రంలో ప్రవేశంలేని దాక్షిణాత్యులను పరీక్ష చేసే ఆస్కారం లేదు అని తిరస్కరించినారు. పట్టువదలని మణికుట్టి మీమాంస పరీక్షలోనయినా అనుమతి నీయండి ఆ పరీక్షా ఫలితాలు చూచి తర్క పరీక్ష గురించి ఆలోచించవచ్చు అని అభ్యర్థించి, మీమాంస పరీక్షలో మొదటివానిగా ఉత్తీర్ణులయ్యారు. అయితే ఇప్పుడు వారి నడ్డగించడానికి భట్టాచార్యులు ఇంకొక సాకు చూపినారు. మీమాంస శాస్త్రంలో పరీక్షాధికారి ''వళమార్ నేరి'' కి చెందిన దాక్షిణాత్యుడయినందున పక్షపాత బుద్ధితో వీరిని ప్రథములుగా ఉత్తీర్ణులను చేశారని వాదించారు.
మనస్సు చలించని కుట్టిశాస్త్రి మీమాంసా పండితుని సహాయంతో పీష్వాకే నేరుగా ''నన్ను పరీక్షించిననే చాలును ఎంతటి ఉన్నత స్థానములో ఉత్తీర్ణుడనయినా సన్మానము చేయనవసరము లేదు'' అని తెలియబరిచినారు. అది పీష్వా హృదయాన్ని స్పృశించింది. నిజమైన విద్వత్తు గుర్తించి దాని వలన ప్రయోజనం పొందవలెననెడి ఆసక్తిగల పీష్వా భట్టాచార్యులను వత్తిడి చేసి పరీక్షకు అనుమతింపచేశారు.
అయినప్పటికీ వ్యతిరేక భావముతో ఉన్న భట్టాచార్యులు వీరు పరీక్షకు వచ్చే దారిలో కాలు అడ్డు పెట్టి పడుకొని ఉన్నారు. కుట్టిశాస్త్రి వెంటనే అది సమన్వయ పరుస్తూ నవ్యన్యాయ వాక్యములనేకం ఉటంకించారు. ఉలిక్కిపడిన భట్టాచార్యులు ''నీవు నిజంగా దక్షిణాత్యుడవా'' అని సంభ్రమముగా ప్రశ్నించగా, కుట్టిశాస్త్రి శ్రీనివాసయ్యర్ సమాచారం, తాము వారి వద్ద నవ్యశాస్త్రము నభ్యసించిన విషయం 64 తర్కవాదములను ఉటంకిస్తూ చెప్పారు. చదువుకొన్న వారే ఇంకొక చదువుకొన్నవానిని గుర్తించగలరు. అందువలన అంతవరకు అకారణ శత్రువుగా ఉన్న తర్కవిద్వాంసులు మణికుట్టిని పీష్వాతో చెప్పి ఆస్థాన విద్వాంసునిగా నియమింపచేసినారు.
స్వతంత్రం, స్వధర్మం విడువకుండా మణికుట్టి మహారాష్ట్ర పీష్వాల సభనలంకరించి దాక్షిణాత్య విద్వత్తుకు వన్నె తెచ్చారు. రాజా అధికారానికి లొంగనివారు, స్వతంత్రులు అయినప్పటికి రసజ్ఞులయిన రాజాలతో స్నేహధర్మం మహాపండితులెలా చూపేవారో కూడా వీరి చరిత్ర నుంచి తెలుసుకొనవచ్చును. పీష్వాను తెల్లవారు బంధించి గంగా తీరంలోని కాన్పూరు పట్టణంలో గృహనిర్భంధం చేయడానికి తరలి వస్తున్నారు. విద్వత్స్రేష్ఠుడుగా అప్పటికే బహు ప్రసిద్దులు అయిన మణికుట్టి ఇంకో రాజాస్థానమునకు పోవచ్చు. అయినప్పటికీ పీష్వా వారిస్తున్నప్పటికీ ''సుభిక్షకాలంలో పోషించిన నిన్ను నేను దుర్దశలో విడువలేను'' అని చెప్పి దారంతా బిచ్చమెత్తి జీవిస్తూ వారితో నడిచి వెళ్ళారు. బహుకాలం ఎంతో స్వారస్యమయిన విజ్ఞానపు విందు చేశారు. తరువాత కాలంలో వారు కాశీ చేరారు. అప్పుడక్కడ అహోబిల పండితుడు అనే మహావిద్వాంసులుండేవారు. ఇప్పటికే మన కథ పొడిగించాము. అయినా వీరి గురించి ఓ ఉపకథ చెప్పక తప్పడం లేదు. రాజుకో, ప్రభుత్వానికో తలవంచక తన స్వధర్మరక్షణ చేసుకోవాలి అనే మన కథ ముఖ్య ఆదర్శాన్ని జీవితంలో తూ.చ. తప్పక పాటించినవారు ఈ అహోబిల పండితులు.
వీరు మైసూరు హైదరాలీ చేత విశేష మర్యాదలతో గౌరవింపబడుతూ వారి రాజసభలో ఉంటూ ఉండేవారు. టిప్పు రాజ్యానికి వచ్చిన తరువాత వారిచే ప్రార్థింపబడి రాజ సభలో కొనసాగారు. తరువాతి కాలంలో టిప్పుకు సమరసభావం తగ్గింది. స్వమతాన్ని విస్తరింపచేయవలెననే ఆకాంక్ష పెరిగింది. ఈ పండితుణ్ణి మర్యాదగా పిలిపించి ''తాము మా మతాన్ని ఎప్పుడు గౌరవింపబోతున్నారు'' అని ప్రశ్నించారు. ''హూజూర్'' అని మటుకు అప్పటికి సమాధానం చెప్పిన అహోబిలపండితులు మరుసటి రోజు సభకు రానే లేదు. టిప్పు వారింటికి మనుష్యులను పంపగా ఇల్లు ఖాళీగా ఉన్నది. ప్రాయశ్చిత్తార్థము అహోబిల పండితులు కాశీకి పోయారు.
టిప్పు తల్లి, హైదర్ భార్య అయిన బీబీకి ఈ విషయం తెలిసింది. వెంటనే పుత్రుని పిలువనంపి కఠినంగా ఖండించింది. ''జ్ఞాన వైరాగ్యములు రెంటిలోనూ ఉద్ధండులయిన ఈ పండిట్ జీ ఆశీర్వాదముతోనే మన సామ్రజ్యము వర్దిల్లినట్లు నేను, నీ తండ్రి గట్టిగా నమ్మి యున్నాము. వారు చెప్పా చేయకుండా పోయే విధంగా నీవేమి తప్పు చేశావు'' అని అడిగింది. టిప్పు తడబడుతూ విషయం చెప్పాడు. దానికి బీబీ ''కుమారా! నీకు ఎంతో వీర ధీర పరాక్రమాదులుండవచ్చు. అయినా సత్పురుషులకు చేసిన ఈ అపకారం వలన ఇక రాజ్యం నిలుస్తుందని నమ్మనవసరం లేదు'' అన్నది.
అమె వాక్కు ఆ విధంగానే ఫలించిందని చరిత్ర తెలిసిన ఎల్లరకు తెలుసు, ఈ రకంగా కాశీలో ముందే స్థిరబడియున్న ఆహోబిలపండితుల వద్ద మన మణికుట్టి శిష్యులయి వేదాంతశాస్త్ర అభ్యాసం చేశారు. నేనింత ముందు చెప్పిన నాలుగు చింతామణి పుస్తకాలు కాశీలోనే వ్రాశారు. తరువాత కొంత కాలం అక్కడే అధ్యాపకులుగా శిష్యులకు పాఠాలు చెప్పారు.
కొంత కాలం కాశీవాసం పూర్తిచేసి, దక్షిణపుదిశగా మైసూర్ చేరి, అప్పటి రాజులయిన మూడవ కృష్ణదేవ ఒడయార్ ప్రార్థన ననుసరించి వారి ఆస్థానమును అలంకరించినారు. ఒడయార్ వారియెడ దైవ విశ్వాసం ఉంచి పూజించేవారు. వీరు తమ స్వాతంత్ర్యమును ఇసుమంత కూడా విడనాడలేదు. తాము ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికినీ ఎక్కడయినా స్వధర్మానికి ఆఘాతం కలిగి ఉండవచ్చునేమోనన్న భయంతో తద్దోషనివృత్తికై ఒక సోమయాగం చేశారు. దానిని సందర్శింపవచ్చిన ఒడయార్ ''తాము వాజపేయ యాగం చేయాలి. ఆ యాగం ముగించి అపభృధస్నానం చేసే వారికి రాజు పట్టుశ్వేత ఛత్రం పట్టి ఊరేగింపు జరపాలని ఉన్నది. కదా! నాకు ఆ భాగ్యం కలుగజేయాలి'' అని ప్రార్థించారు. ''పాశ్చాత్యుల చేతిలో చిక్కి రాజ్యాలున్న కాలంలో నియమాలు, విధులు సరిగా నిర్వర్తిస్తూ యాగం చేయడమే ఎంతో కష్టంగా ఉంది. దౌర్ర్సాహ్మణ్య నివృత్యర్థం తెలియని స్వధర్మాఘాతం వలన కలిగిన దోషనివృత్యర్థం ఏదో కడుపుకు నిప్పు కట్టుకొని ఈ ఒక్క యాగం ముగించాననిపించాను. ఇంకో యాగం చేయడానికి భయపడుతున్నాను. జన సమూహం ఈ విషయం గుర్తించాలి'' అని ఎంతో మర్యాదగా, అయినా ఖచ్చితంగా చెప్పారు.
రాజుగారి మాటకు లొంగి ఉండాలనే భయము వీరికి లేదు. చక్రవర్తి చేత శ్వేత ఛత్రం పట్టించుకోవాలనే కోరికా లేదు. సర్వోజీ కాలం ముగిసి శివాజీ పట్టానికి వచ్చిన తరువాత, దగ్గర దగ్గర 19 వ శతాబ్దంలో మణికుట్టి తమిళనాడుకు తిరిగి వచ్చారు. అప్పుడు ఉన్న మన మఠస్వామి చేసిన అఖిలాండేశ్వరి తాటంక ప్రతిష్టలో కూడా పాలు పంచుకొన్నారు. ముసలి తనంలో తిరువిసైనల్లూరు వచ్చి, స్థిరబడి అక్కడనే ఆనందయోగం పొందారు. తండ్రిచే ఇంటి నుండి వెలివేయబడిన వారు. రాజ్యం వదిలి బిచ్చమెత్తుతూ పోయినవారు, కర్ణాటక రాజ్య పల్లకీ పరివారముతో ఛత్ర చామరాది రాజ చిహ్నములతో తిరిగి వచ్చిన వీరి చరిత్ర నుండి మనము అనేక పాఠములు నేర్చుకొనవచ్చును.
మణికుట్టి శాస్త్రి చేసిన మణి మయమైన పుస్తకములన్నింటిలోనూ మొదట్లో డుంఢిగణపతి, విశ్వేశ్వరుడు, మణికర్ణికాగంగా, తిరువడైమరుదూరు మహాస్వామికి నమస్కారం చేసిన తరువాత తమ ఊర్లో మీమాంస బోధించిన ఈశ్వరశాస్త్రి, నవ్యతర్కం బోధించిన శ్రీనివాసయ్యర్, కాశీలో వేదాంతం బోధించిన అహోబిల పండితులు మొదలైన వారందరికీ గురువందనం చేసిగాని విషయం మొదలుపెట్టరు. వారి గురుభక్తి కూడా మనకు ఆదర్శప్రాయమైనది.
తండ్రి దండనతో ఇహం పరం రెండూ సంపాదించుకొన్న మణి పుత్రుడు మన మణికుట్టి.