శ్రీమాత్రే నమః
శ్రీ శ్రియానందనాథ గురవే నమః
''యశ్చన్దసామృషభో విశ్వరూపః
ఛన్దోభ్యోధ్యమృతాత్సంబభూవ
సమేన్ద్రో మేధయా స్సృణోతు''
అమృతస్య దేవధారణో భూయాసమ్ ||
ఏయది వేదములలో శ్రేష్ఠమో, ఈ పరిదృశ్యమాన ప్రపంచమే రూపముగా గలదియో, ఆయది పరమాత్మ స్వరూపమగు ఛందస్సులవలన నుద్భవించెను. సంవిద్రూపమగు నా ప్రణవము నాకు జ్ఞానప్రదానముచేసి, సంసారబంధము వలన గాపాడుగాక.
జ్ఞానమనఁగా నెట్టిది?
శ్రు|| ''జ్ఞానమితిచ -- దేహేంద్రియ నిగ్రహ సద్గురూపాసన శ్రవణమనన నిదిధ్యాసనై యద్దృస్వరూపం సర్వాంత రస్థం సర్వసమం ఘటపటాది పదార్థమివా వికారం వికారేషు చైతన్యం వినా కించిన్నాస్తీతి సాక్షాత్కారానుభవః జ్ఞానమ్ ||
సాధకుఁడు దేహాభిమానమును విడువ వలయును. ఇంద్రియ నిగ్రహమును అలవఱచుకొనవలయును. మోక్షాపేక్షతో సద్గురు పదకమలముల నాశ్రయించి చిశుశ్రూష చేయ (వేదాన్తశ్రవనముచేయ) వలయును. వినినదానిని మనన నిదిధ్యానలచే దృఢతర మొనర్చుకొనవలయును. కేవల నిర్వికార చైతన్యమే పరబ్రహ్మమనెడి నిశ్చయజ్ఞాన మప్పుడే గలుగును.
సచ్చిదానందరూప పరతమ పరాత్పర బ్రహ్మము, ఒక్కటియే సర్వవిధముల దానేయైమున్నదనెడి తెలివికలుగును. అది సర్వదా సర్వత్ర సర్వవిధముల సర్వరూపములతో సర్వగతమై యనంతమై సర్వాతీతమై దేశకాలమయమై దేశకాలాతీతమై నిత్యమై, నిర్గుణములును సగుణమునై యదే వెలుగొందుచున్నటులు తెలియగలుగును.
శ్రు|| ''ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపోబభూవ'' సకల భూతగణములందును జైతన్య మొక్కటే సమముగానున్నది.
సముద్రమందలి జలమొక్కటే. ఫేన బుద్బుద తరంగరూపమున భిన్నభిన్నముగా గానబడును. మన్నొక్కటే నానావిధ పాత్రరూపమును దాల్చినది. అటులే నూలొక్కటే (తంతవు) పలురంగులతో పలువిధముల వస్త్రరూపమును దాల్చి నిత్యజీవనమందుపయోగపడి మనోరంజనము చేయుచున్నది. చంద్రుడొక్కడే యనేక జలాధారములం దనేకముగా బ్రతి బింబించును.
''సూత్రేమణిగణా ఇవ'' సర్వగతమై వెలయు బ్రహ్మ చైతన్యము, 'నేనే'. నేను లేనిచోటు లేదు. ''బహుస్యామ్ బహుప్రజాయేయ'' అనెడి కామము నేనుదే. ప్రతివస్తువు తద్రూపమే; గాన నేను కోరదగినది, పొందదగినదియు లేదు. అను సర్వసంకల్ప శూన్యత్వమేర్పడు ననుభవమే 'జ్ఞానము'.
అఖండజ్ఞానమే శబ్దస్పర్శరూపాదిగా ఖండఖండ విషయాకారమున వెలసినప్పుడదే అజ్ఞానము. నఞర్థకము అకారమునకు అల్పార్థము సుప్రసిద్ధముగదా. అల్పాల్పవిద్యయే అవిద్య. అవిద్యకు జిక్కుటచేనగు శోకమోహాదుల ఫలమే జన్మము జనన మరణములే సంసారము. ఈ కట్టువలన విడివడుటకు జ్ఞానమొక్కటే యుపాయము. ప్రణవోపాసనము జ్ఞానసముపార్జన సాధనము.
''ఓ ప్రణవమా! పరమాత్మస్వరూపమును అవగతము చేసికొనదగు మేధాభిక్షము పెట్టుము.'' అది లేకున్నచో, గురు కృపావిశేషలబ్ధ విద్యాసంపత్తి నిల్వనేరదు.
'బ్రహ్మాహమస్మీతి స్మృతిరేవ మేధా' శ్రీ శంకరగురువాక్యము. నేను బ్రహ్మమనేయైయున్నాను. క్రొత్తగాకాను. యుగయుగాంతరములనుండి, జన్మజన్మాంతరములనుండి యిమ్మాట విస్మృతమై (మఱవబడి) యెడ తెగక శరీరధారణము చేయుచు జననమరణములనెడి యెడపెడదెబ్బలు తినుచున్న దేహి యిమ్మాటను జెదరని విశ్వాసముతో స్మరించుటే (తలంచుటే) మేధ. 'కలౌతు స్మరణాన్ముక్తిః' ఈ స్మరణమే ముక్తిసాధనము అందు నిల్చుటే సమాహితత్వము. సమాధి. శ్రీ శ్రియానంనాథుల 'సో7హంసమాధి' యను గ్రంథమును జూచునది. సర్వదేవ శిరోభూషణముప్రణవము 'యో వేదా దౌ స్వరః ప్రోక్తో వేదాన్తే చ ప్రతిష్ఠితిః' అదే ప్రణవము - ప్రకృతిని దాటించు నావ.
శ్రు|| విశ్వతశ్చక్షు రుత విశ్వతో ముఖో
విశ్వతోహస్త ఉత విశ్వతః న్యాత్ |
సంబాహుభ్యాం సమతి సంపతత్త్రై
ర్ద్యావా పృథివీ జనయన్దేవ ఏకః ||
ప్రాణాది దిక్కులను, ఆగ్నేయాది విదిక్కులను, బ్రహ్మాండ మధ్యమునను, దేవతిర్యగాది రూపములందును, ప్రత్యణువు నందును, పిపీలికాది బ్రహ్మపర్యంతము జీవకోటి యొక్క స్వరూపమైనది ప్రణవము.
బాహుతుల్యములగు ధర్మాధర్మకార్యములచే, చతుర్దశ భువనముల నాక్రమించి, సృష్ట్యాదికార్యములను జేయుచు ఒక్కడై వెలుగు పరమాత్మస్వరూపమే ప్రణవము.
అమృతస్వరూపవేద సారమైనదే ప్రణవము. ఆ ప్రణవము నాకు మేధాశక్తిని బ్రసాదించుగాక.
బ్రహ్మమనఁగానేమి? 'కింబ్రహ్మేతి హోవాచ' మహదహంకార పృథివ్యప్తేజోవాయ్వాకాశాత్మకేన బృహద్రూపేణాండకోశేన కర్మజ్ఞఃఆనార్థరూపతయా భాసమాన మద్వితీ మఖిలోపాధి వినిర్ముక్తం తత్సకలశక్త్యుపబృంహితమనాద్యంతం శుద్ధం శివం శాంతం నిర్ణిమిత్యాది వాచ్య మనిర్వాచ్చంచైతన్యం బ్రహ్మ'.
మూలప్రకృతి నామక మహామాయా సంబూతములగు ఆకాశాది పంచభూతములందు నంతర్యామిరూపమున నున్న దే బ్రహ్మము. చతుర్దశ భువనములకు నాదారభూతము బ్రహ్మము. నిష్కామ నిఃస్వార్థత్యాగశీలమున లభ్యమగునది బ్రహ్మము నిశ్చలజ్ఞాన (అహం బ్రహ్మాస్మీతి జ్ఞానము) ముచే సముపార్జనీయము బ్రహ్మము. 'ఏక మేవా ద్వితీయం బ్రహ్మ' తనకంటె రెండవది లేక సర్వము తానే యైనది బ్రహ్మము. స్వచ్ఛము, పరిశుద్ధమునగు వస్తువే బ్రహ్మము. సకల ప్రపంచోపాధులను వానివాని శక్తులతోగూడ దనయందు లీనమొనర్చుకొను శక్తి సంపద గలది బ్రహ్మము. ఆదిమధ్యాందతరహితము బ్రహ్మము. నిత్యమంగళకరము, సంతత శ్రీకరము బ్రహ్మము. 'రసోవై సః' ప్రధానభూత శాంతానందరసస్వరూపము బ్రహ్మము. శుద్ధము, నిర్గుణము, నిరాకారము బ్రహ్మము.
'యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ'
అనంతం బ్రహ్మణో విద్వా೯, న బిభేతి కదాచనేతి ||
మనస్సు అనగా నేమి? --- శ్రు|| యైషా స్వభావాభి మతం స్వయం సంకల్ప్య ధావతి| చిచ్ఛైత్యం, స్వయమావ్లూనం మననాన్మన ఉచ్యతే ||' అభీష్టమును ప్రియంకరమును నగు వస్తువును సంకల్పించుకొని దానియందే నిమగ్నమై పరుగు లిడుచు, అందే ప్రవర్తించుచు. నశ్వరమైన ఐహికాముష్మిక విషయములను గుఱుతెఱు పరిశుద్ధ జ్ఞానస్వరూపమగు బ్రహ్మమును, ఇన్నిటిని స్మరించుచుండుటచేత, అనగా మననము చేయుచుండుటచే అది మనసు అనబడును.
శ్రు|| సంకల్పనం మనోవిద్ధి సంకల్పన్తన్నవిద్యతే |
యత్రసంకల్పనం తత్ర మనో೭స్తీత్యవగమ్యతామ్ ||
సంకల్పమునే మనస్సని తెలియుము. సంకల్పము మనసు కంటె వేఱుగాదు. ఎచట సంకల్పమున్నదో అచట మనస్సున్నదని తెలియుము.
మనస్సుతోగూడ వాక్ఛక్తి దేనిని బొంద యత్నించి నిష్పలమై నిర్వీర్యమై తన తావునకు మఱలిపోవునో అట్టి ఆనంద మయ వస్తువు బ్రహ్మము.
శ్రు|| వదన్తితత్త్వ విదస్తత్త్వం యద్ జ్ఞానమవ్యయం,
బ్రహ్మేతిపరమాత్మేతి భగవానితి శబ్ద్యతే |
అద్వైతజ్ఞానమయశక్తియే బ్రహ్మము. అదియే పరమాత్మ, అదే భగవత్తత్త్వము, అదే శ్రియానందతత్త్వము. శ్రీవారు--
''అమనోవాగభివేద్యతత్త్వమయి. సర్వాంతశ్చిదాకారమై కమనీయంబయి, నిత్యమై, యమలభక్తశ్రేణి కాధారమై, విమలానందవిధాయియై, సకల సంవిద్రూపమై యొప్పు, నొక్క మహాశక్తిని మాతృభావమున నెక్కాలమ్ము సేవించెద೯ ||
అదే బ్రహ్మమని, దానినొక మహాశక్తిగానే నిరూపించిరి. మఱియు శ్రీవారే యిట్లనిరి-
''జననీ! యింద్రియ పంచకానుభవ దృష్టంబై, సదా దానిమించినదై, యిట్టి దిదే యటంచు నెవరు೯ జెప్పంగరానట్టిదై మనము೯ స్వాభిముఖమ్ముఁజేయునదియై, మన్నింపఁబ్రేమింపనొప్పినదై, శక్తి యొకండుతోఁచు; నది నీ వేయన్న ఁదప్పా? ఉమా!''
సచ్చిదానందమయ పరతమ మనోవాగగోచర పరిపూర్ణ పరిశుద్ధ, తత్త్వమైయొప్పుశక్తియే బ్రహ్మము.
శ్రీవ్యాసులను ''జన్మాద్యస్యయతః'' ఈజగత్తుయొక్క జన్మస్థిత్యంతములు దేనివల్ల నగుచున్నవో యదే బ్రహ్మమని యొక శక్తినే సూచించిరి.
ఆ శక్తియే మాతృమూర్తి, ఉమ - హైమవతి.
''విశ్వము నింటిపట్టెది, యభేద్యమునేది, యనంతమేది, సర్వేశ్వరమేది, సన్నిహితమేది, గుహాచరమేది, భక్తహృచ్ఛాశ్వతసౌఖ్యదాయియెది. నర్జనకర్తృకమేది, యింద్రియాఖ్యాశ్వనియంత్రియేది, యదెయమ్మయునయ్యుయు నమ్మువారికి೯ .
బ్రహ్మమనెడి శక్తియే విశ్వజననీ జనకులైన ఉమా మహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీహిరణ్యగర్భులు.
తేజోమయ ప్రణవమా!
శ్రు|| శరీరం మే విచర్షణమ్; జిహ్వామే మధుమత్తమా| కర్ణాభ్యాం భూరి విశ్రుమః, బ్రహ్మణః కోశోసి, మేధయా సిహితః శ్రుతం మే గోపాయ ||
'శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్' ధర్మార్థ కామ మోక్షలాభమునకు మొట్టమొదటి సాధనము శరీరము, ''కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః'' --- వేదవిహిత కర్మములను జేయుచునే నూఱండ్లు మనగోరవలయును; అని నీవేకదా అదేశించితివి. కనుక నా యీ భౌతిక శరీరము ధర్మాచరణసమర్థమగునటులు పూర్ణాయురారోగ్యసంపదలతో వర్ధిల్లుగాక. నా దేహేంద్రియములు ఆత్మజ్ఞానార్హము లగు గాక, పొట్టునందు గింజవలెను, గుల్లయందు చింతపండువలెను, మేఘమునందు మెఱుపువలెను, ఒరయందు కత్తివలెను. నీ యందు బ్రహ్మము ప్రతిష్ఠితమై యున్నది. నన్ను బోలిన సామాన్యజ్ఞానులు నిన్ను గుర్తింపజాలరు. భోగటాలసమైన నాచిత్తమును పరిపూతమొనర్చి నేను వినినదానిని విస్మృతముగాకుండ జేయుము.
శ్రు|| ''తం ద్వాభగప్రవిశానిస్వాహా'' - సర్వసంపత్కరమై శ్రీల జెలగు ప్రణవమా! నిన్ను బ్రవేశింతునుగాక. నామభేదమేగాని వస్తుభేదములేదు గాన నీ జ్యోతిఃప్వరూపంమునందు తాదాత్మ్యము నొందుదునుగాక.
భగమనగానేమి?-
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః,
జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భక ఇతీరితః ||
ఐశ్వర్యము - సర్వసామర్థ్యము; వీర్యము - కర్మశక్తి; కీర్తి - గొప్పదనముచేవచ్చువాసి; లక్ష్మి - శోభ; జ్ఞానము - తెలివి వైరాగ్యము - త్యాగము; ఈ మొత్తమునకు భగమనిపేరు. అది కలవాడు భగవంతుడు. స్త్రీపరమైనపడు - శక్తి పరమైనపుడు భగవతి, యని వ్యవహారము.
''పుంలింగం సర్వమీశానః స్త్రీలింగం భగవత్యుమా''
''వ్యక్తం సర్వ ముమారూపం, అవ్యక్తంతు మహేశ్వరః'',
యా ఉమా సా స్వయం విష్ణుః
''యే೭ర్చయన్తి హరిం భక్త్యాతే೭ర్చయన్తి వృషధ్వజమ్''
ఇట్టి ప్రమాణవాక్యములచే, నామభేదమేకాని యెల్లరు భగముతో నొప్నువారలే. అభేదబుద్ధితో నిరూపింపబడిరి. ఆబ్రహ్మమును శక్తిగా భావించుచో స్త్రీ, శక్తిమంతునిగా భావంచుచో పురుషుఁడు, శక్తి శక్తిమంతుల కభేదమును శ్రుతియే ప్రతిపాదించినది. ఎవరెవ్వరిని గీర్తించినను వారి శక్తియే కీర్తింపబడుచున్నది. ఘంటసాలవారు చక్కగా పాడుదురని యొకరన్నను, ఘంటసాలవారి పాటశక్తినే కీర్తించిరి కాదా? విజ్ఞులైన సాధకలు గురూపదేశము ననుసరించి శక్తి శక్తిమంతుల నభేదబుద్ధితోనే యారాధింతురు. ద్విజసంధ్యావందన వాక్యములందును ఇదియే ప్రతిపాదితము.
ప్రణవము అనగా ఓంకారము. అకార, ఉకార, మకార, అర్ధమాత్ర అనువాని సంకలనము. ఓంకారపద నిర్వచనము శ్రీ దేవీభాగవతంమదిట్లున్నది--
''ఓంకారమ్మన నాద్యకారమున వాచ్యుండౌ నజుండయ్యుకారాంకుండాతని తండ్రి విష్ణువు; మకారాంకుండు శంభుండు; తత్సంకేతమ్మున నుత్తరోత్తరము ప్రాశస్త్యమ్ము వాటిల్లు, నిశ్శంక೯ బైదగు నర్థమాత్ర చెలఁగు೯ శక్తి స్వరూపమ్మున೯''
గీ|| అమ్మహాశక్తి సగుణయు సగుణయు నన
రెండు తెఱఁగులఁదనరారుచుండు; నందు
రాగులకు సగుణసేవ్య; విరాగులకును
నిర్గుణాత్మిక సేవ్య, మునివరులార!''
ఓంకారస్వరూపిణి భగవతి శ్రీరాజరాజేశ్వరి లలిత. గుప్తగాయత్రి. ఆయెను మనమేల యారాధింపవలయును? లేకున్న జీవింపఁజాలమా? సుదీర్ఘముగా విచారింపదగునంశమిది.
ప్రత్యేకవ్యక్తికిని భగవతికిని గల పారస్పరిక సంబంధమేమి? మనలను పాపపంకమువలన పరిశుద్ధులను జేయుటకును అజ్ఞానాంధకారమునుండి వెలికుద్ధరించుటకును భగవత్యారాధన మావశ్యకము.
జన్మజరామరణవివర్జితమై యానందమయమైనయమృత ధామమును జేరు సామర్థ్యము నందుటకు అత్యంతావశ్యకములు, పై నుదాహరించిన ఆఱు గుణములు.
హృదయపీఠిక నధిరోహించి స్వీయదివ్య తేజఃపుంజములచే నీ యజ్ఞానాంధ తమోమలినమైన గృహమును పునీతముచేయుమని ప్రసాదసుముఖిని భగవతి నర్థింతుము. దీని ప్రాముఖ్యము గుర్తెఱిఁగినపుడు ఆసురీదైవీశక్తుల సమ్మిలనము--మన జీవితము--పరస్పర విరుద్ధతత్త్వములు గల యీశక్తిద్వయము, ఒకచోగాలూని నిల్వజాలదు. వెలగున్న చోట చీకటికి తావు లేదుకదా.
ఈ సురాసుర సంగ్రామము నిరంతరము మన హృదయరంగమున సాగుచునేయుండును. మన మొఱ్ఱలను వినిన భగవతియే ఆసురీసంస్కారములను సంహరించికొని తన దివ్య మంగళస్వరూపమును శుద్ధహృదయపీఠికపై సుప్రతిష్ఠితము చేయును.
మనలను బెడదారుల ద్రొక్కించి పీడించు నీయసురులెవరు? ఉపాయాంతరముచే వీరిబారినుండి తప్పుకొనజాలమా? కామాదులార్గురు మహాసురులు, జీవితపథమును కంటకావృతమొనర్చుచున్నారు అమ్మగారి యానందయమధామమును జేరనీయకున్నారు.
ఈ దుఃఖమయ విపత్కరస్థితివలన విడివడుట కొక్కటే యమోఘోపాయము.
శ్రు|| ఈశావాస్య మిదం సర్వం యత్కించి జ్జగత్యాం జగత్ | తేన త్యక్తేన భుంజీథాః మాగృధః కస్య చిద్ధనమ్ ||
సత్యస్వరూపుడగు పరమాత్ముడే ఈ పరిదృశ్యమాన నామ రూపాత్మక ప్రపంచము, అనెడి శ్రుత్యుక్తి గాఢముగా విశ్వసించి ప్రపంచమసత్యమనెడి బుద్ధిని విడువవలయును. ఇట్టి త్యాగబుద్ధి వలవరించుకొని సంపరణదుఃఖమువలన నిన్ను నీవు పరిరక్షించు కొనుము. ఈషణత్రయ శృంఖలలను ద్రెంచు కొనుము.
అంతయు నింద్రజాలము, మాయామరీచికల వెంబడి పరుగిడకుము, భ్రమచే విషమును అమృతమనుచున్నావు.
జీవితము క్షణికము. రాలిపోవుటకే పూవు వీడును. అస్తమించుటకే అమృతాంశుడుదయించును. వట్టిపోవుటకే వారిదము నిండుచున్నది. ఆరిపోవుటకే దీపకళ ప్రజ్వలిత మగుచున్నది.
సుస్థిర ¸°వన మిచట లేదు. మెఱుపుంబోలి జీవిత మతిచంచలమని గుర్తెఱుంగుము. 'కస్యస్విద్ధనమ్' - ధనమెచట నున్నది. ఎవనికున్నది? ఈశ్వరునికంటె వేఱయి యొక వస్తువే లేనపుడు, ఒక వ్యక్తి యున్నాడనిగాని, అతడు థనాఢ్యుడని గాని అనుట కాధారమేమున్నది? అనెడి నిశ్చయమే, త్యాగమయ వైరాగ్యభావము. దాని నలవరించుకొనుము.
శ్రు|| న కర్మణా న ప్రజయా ధనేన | త్యాగే నైకే అమృతత్వ మానశుః || -- నిత్యగ్నిహోత్రాది కర్మములు ఫలాపేక్షాపంకిలము లగుట మోక్షసాధన భూతములు కావు. పుత్రులు పున్నామ నరకమువలన రక్షింప జాలుదురేమో, తండ్రులు బహుపుణ్యులైనచో వార్థకమున నిర్విచార ప్రశాంత జీవితమును గడపుటకు సాధనభూతులగుదురేమో కాని, అమృతత్వమును పొందుటకు సాయపడ జాలరు. ఇక ధనమా తుచ్ఛవిషయసుఖలంపటత్వమునకు మిగుల తోడ్పడును. గాన ముక్తిమందిరద్వార నిరోధకమే.
మఱి గమ్యమును జేరుట యెట్లు?
ఒకటే మార్గము, 'ఏకేన త్యాగేన' కర్మఫలత్యాగము చేతనే, మన పూర్వులు సంసరణ బంధవిముక్తులై, అమృతత్వము నందిరి.
అట్టి పరమధామ మేది? స్వర్గమా? వైకుంఠమా? కైలాసమా? కాదు.
శ్రు|| ''పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశన్తి.'' - అది స్వర్గము కంటెను శ్రేష్ఠమైనది. ఏకాన్తమైనది. నీ హృదయగుహయందు కోటిసూర్య ప్రభాభాసమానమై వెలుగుచున్నది.
సత్య దాన శమ దమాది సాధనాంతరములు శ్రేష్ఠములే కావచ్చు. కర్మఫలత్యాగమే మోక్షలాభమునకైన సాధనములందు సర్వోత్కృష్ఠము. తదన్యము లల్పఫలదాయ కములు.
ఈ భావనము తీవ్రరూపమున పరాకాష్ఠ నందుకొన్నప్పుడే నీలోని దుష్టాసురశక్తులు నిర్వీర్యము లగును భావిజీవితము ఉజ్జ్వలతరమై ఆనందమయమగును.
శ్రు|| సమాభగప్రవిశస్వాహా|| - ప్రణవమా! నేను నిన్ను బ్రవేశింతును. బ్రహ్మమునకు కోశభూతమవైన నీవు నన్ను బ్రవేశింపుము.
వేకటులైన చీకటులు బాలభానుకిరణ దీప్తిచే తొలగిపోవునటులు, నిబిడనీరదములు పవనాహతి క్షిప్తములైనట్లు 'నీవు-నేను' అనెడి ద్వంద్వభావమును గలిగించు నజ్ఞానమును నిర్మూలింపుము.
శ్రు|| 'తస్మి೯ సహస్ర శాఖేని భగా೭హం త్వయి మృజే స్వాహా||' - సర్వజగన్నియంతవు నీవు. పరబ్రహ్మ స్వరూపవునీవు. ''తటిల్లతాసమరుచిః షట్చక్రోపరిసంస్థితా'' నామస్మృతి. పరంజ్యోతివి నీవు ప్రసృతామృత రత్నౌఘసంతర్పిత చరాచర వీవు. భవతాపమును జల్లార్చు అమృతే శ్వరివి నీవు.
కులము నందుండి సత్యశర్మ సాధనము నుపన్యసించి ప్రబోధించి బద్ధజీవులను సన్మార్గాభిముఖులను జేయు నీశ్వరుడవు నీవు.
'దేవీసూక్తపరమార్థ' సూత్ర సుదర్శనచక్ర పరిభ్రమణ ధ్వని స్మృతాద్వైతభావభావుకుడవు సత్యనారాయణుడ నీవు.
సువర్ణ రజత నవరత్న దివ్యప్రభా తేజోవిరాజిత దివ్య మంగల ప్రణవస్వరూపమున సహస్రారకమలమున సాక్షాత్కరించు కమలవు నీవు.
అనేకకోటి జన్మార్జిత పుణ్య పుంజ పక్వ కైవల్య ఫలమవు నీవు.
పిపీలికాది బ్రహ్మపర్యంతము, అణ్వాదిమహాకాశము పర్యంతము, నిఖి జీవకోటియందును అంతర్యామినివై నీవు లేని పదార్థమే లేదు.
శ్రు|| ''వృక్ష ఇవ స్థభ్ధో దివి తిష్టత్యేకస్తే నేదం పూర్ణం పురుషేణ సర్వమ్||'' - గమనాగమనములు లేక ఒక్క చోటనే నిశ్చలముగా నుండు వటవృక్షమువలెనే అద్వితీయవై, నిరాకారవై, చిదేకరసాత్మవై, సర్వజగత్తును త్రివిక్రమావతారమున వ్యాపించి యున్నావు సర్వరూపముచే నిత్య వేకమాత్రవే యైనను, మాతా ! నీవు అనాదిగా వివిధరూపములతో వివిధ శక్తులతో వివిధ శక్తిప్రకాశ ప్రక్రియలతో ఈశ్వర, సత్యనారాయణ, గణశ, భాస్కరాది రూపముల సభివ్యక్త వగు చున్నావు.
చైతన్యపరిపూర్ణమై, సర్వదోషవివర్జితమై, శ్రియానందనిలయమై, వెలయు నీజ్ఞానస్వరూపమును ప్రవేశించుచున్నాను. ఐశ్వర్యవీర్యాది షడ్గుణసంపన్నవైన ప్రణవమా ! నన్ను పరిశద్ధుని జేయుము.
శ్రు|| ప్రతివేశో7సి ప్రమా భాహి ప్రమాపద్యస్వ'' నాకు నీవు అత్యంత సమీపమందున్న గృహమవైతివి. నా యందు ఆత్మతత్త్వమును - భగవత్తత్త్వమును శ్రీ శ్రీయానంద తత్త్వమును ప్రకాశింప జేయుము. భ్రమరకీటన్యాయమున నన్నావేశించి 'నీవే నేను, నేనే నీవు' అనెడి 'సో7హం' సమాధ్యవస్థను స్థిరపఱచి నన్ను నిన్నుగా జేసివేయుము. (భ్రమరకీటన్యాయ రహస్యమునకై శ్రీ శ్రియానంద నాథుల 'సో7హం సమాధి'యను గ్రంథమును జూచునది.)
''ఇడుమలఁబడ్డవాఁడు స్మరియించిన బీతెడలింతు; వమ్మ ! స్వ
స్థుఁడు తలపోసిన& బరమశోభనబుద్ధి నొసంగు; దెట్టి లే
వడినయినం దొలంపఁగలవా రవికెవ్వరు? మేలొనర్చుచో
నెడగన వెట్టివారయిన నెప్పుడును& గరుణార్ద్రచిత్తవై||''
'అమ్మతో ముచ్చటలు' - శ్రీ శ్రీయానందనాథుఁడు.
భగవతీ ! అపచ్ఛోకవ్యాధి జన్మాదులైన దుర్గములను దొలఁగించి, యాశ్రితులకు శుభములనొసగు (దుర్గ+ఆ=దుర్గా) దుర్గవు. ప్రపన్నుడనైన నాకు వేదశాస్త్రాది పరమార్థగ్రహణ ధారణాపటిమను (మేధను) జ్ఞానశక్తిని ప్రసాదింపుము. లేకున్న,
''తరమా ! పరమానందే
తరమా! జగమనుచుందెలియ ధర మూఢునకా
చరమార్థము తెలియుట దు
ష్కరమా ! గురుకరుణ వడయు సర్వజ్ఞునకు&.''
-సీతారామాంజనేయము.
''భౌతిక సుఖసంపదలన్నియు, అఖండ బ్రహ్మానందము నందలి లేశములు'' అని శ్రీగరుకృప నొందిన జ్ఞానియెఱుంగుట దుష్కరము కాదు 'శ్రీగురుః సర్వకారణభూతా శక్తిః' మోహావిష్టుల కీపరమసత్యముందెలియ తరముకాదు.
శ్రు|| ''మయిమేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు, మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు, మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః