శ్రీమాత్రే నమః శ్రీ శ్రియానందనాథ గురవే నమః శ్రు|| పరో రజసి సావదోమ్' ఓంపదవాచ్యము పరబ్రహ్మము శ్రు|| సర్వే వేదా యత్పదమామనన్తి తపాగ్‌ంసి సర్వాణి చయద్వన్తి, యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యో'' మిత్యేతత్|| - కఠోపనిషత్. పదవాచ్యమనగా నేమి? - ఏపదము నుచ్చరించుటచేత ఏవస్తువు శ్రోతకు స్ఫూరించునో ఆ వస్తువు ఆ పదమునకు వాచ్యము. ధ్యానావస్థితచిత్తముతో ఓంకారముచ్చరింపబడినపుడు శుద్ధనిర్గుణ సత్త్వప్రధాన మాయావచ్ఛిన్నమగు ఓం కారోపాధిబ్రహ్మమే స్ఫురించును, గనుక ఓం కారపదవాచ్యము నిత్య సుఖ స్వరూపానందము. ఆ సుఖస్వరూపమే ''భూమా' యనబడును. 'భూమా' యన నేమి? శ్రు|| భూమైన తత్సుఖం - భూమా ఇత్యేవ విజిజ్ఞాసితవ్యమ్| యత్ర నాన్యత్పశ్యతి నాన్యచ్ఛ్రుణోతి నాన్యద్విజ్ఞాయతే తద్భూమా అస్యదార్తం తన్మర్త్యం యద్భూమా తదమృత మితి||
-ఛాందోగ్యము. ఎట్టి స్థలమందును - ఎట్టి యవస్థయందును ఈ చర్మ చక్షువులకు గానరాని వస్తువు, భూమ. శ్రవణగోచరము కాని శబ్దము భూమ. మనోగోచరము కాని పదార్థము భూమ. అఖండసంవిస్మయ వస్తువు భూమ. నిత్యనిరవధిక తురీయా తీత సుఖస్వరూవము, భూమ, అదే ఓంకారము. అదే పరబ్రహ్మము, పరమాత్మ. నీవు తెలియగోరితిని గాన - ఇదిగో సంగ్రహముగా చెప్పుచున్నాను. అవధరింపుము. - శ్రుతి స్మృతి పురాణతిహాసములు, గొంతెత్తి యీ ప్రణవమే యుపాస్యవస్తు వనుచున్నవి. కృఛ్ర చాంద్రాయణాదులగు తపశ్చర్యలన్నియు ఓంకారమును జేరుటే ఫలముగా గలవి. బ్రహ్మవిద్యాంగమున జ్ఞానావాప్తి సాధనము ప్రణవోపాసనమే. నిశ్చల బ్రహ్మచర్యవ్రతావలంబనముచే ధ్యేయము. ప్రాప్యము ఈ ప్రణవమే. 'ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్యతత్||' సగుణమును నిర్గుణమును అగు బ్రహ్మమిదియే పరాపరముల రెంటను ఉపాస్యవస్తువిది యొకటే. 'యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్య హమ్' ఎవరెటులు నన్నే రూపమున నుపాసింతురో, వారికా రూపముతో వ్యక్తమగుదునని భగవవద్వాక్యము. బ్రహ్మపదప్రాప్తికి ఓం కారోపాసన పట్టుగొమ్మ. శ్రు|| సర్వగ్గీహ్యేతబ్రహ్మా7యమాత్మా||' - మాండూక్యము. పిపీలికాది బ్రహ్మపర్యంతము అణువునుండి మహదాకాశ పర్యంతము అంతయు బ్రహ్మాత్మకమే. 'స యశ్చాయం పురుషే యశ్చాపావాదిత్యే స ఏకః||' - పైత్తరీయము. సర్వాంతరాత్మాత్మకముగా ప్రసిద్ధమైనది. ఆత్మ - బ్రహ్మము. బ్రహ్మమననేని? ఆత్మ యననేమి? బృహత్వాత్, బృంహణత్వాత్ బ్రహ్మ - గొప్పది యగుటను, వికసస్వభావము (అనుక్షణము పెంపొందు స్వభావము) గలదగుటను 'బ్రహ్మ' మనబడును. 'బ్రహ్మైవాత్మా' ఆసంతతా తిష్ఠతీత్యాత్మా అతతీ త్యాత్మా, విశ్వవ్యాపకస్వభావరుణము గలది గాన ఆత్మ. శ్రు|| దృశ్యమానస్యసర్వస్య జగతస్తత్త్వ మిర్యతే బ్రహ్మశ##బ్దేన తద్ర్బహ్మ స్వప్రకాశరూపకం|| కానబడు నీ జగత్తునకు అధిష్ఠానభూతమది. సృష్టికి ముందుండిన దిదియే. ఆకాశాది భూతపంచకమునకు పరాపరములందున్న దిదియే. అది సచ్చిదానంద కల్యాణగుణ సముపేతము. అది పారమార్థికమై స్వప్రకాశస్వరూపము. ఇట్టి బ్రహ్మచైతన్యమే ఆత్మ. చైతన్య మనగానేమి? - శ్రు|| అవస్థాత్రయోపహిత మవస్థాత్రయోపలక్షితంచనిరవస్థ విశుద్ధతత్త్వమేవ చైతన్యం|| అది అవస్థాత్రయమందును వ్యాపించి యున్న దే కాని, జాగ్రదవస్థయందు స్వస్న సుషుప్తులు లేవని గుర్తెఱుంగును. అటులే - స్వప్నావస్థయందు, జాగ్రత్సుషుప్తులు లేవనియు నెఱుంగును. ఇట్టి పరిజ్ఞానముచేత దేనిని అంటనటులు అవస్థాత్రయము నంటక, వానికంటెను విలక్షణమై పరిశుద్ధమై నిర్వికారమై సర్వసాక్షియై స్వయంప్రకాశ##మై సర్వద్యోతకమైన జ్ఞానజ్యోతియే బ్రహ్మచైతన్యము, ఆత్మ. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, అనందమయములైన పంచకోశములకు నంతరస్థమై, తన సత్తామాత్రముచే వానిని ప్రకాశింపజేయుచు, వానినంటక భిన్నముగా ప్రత్యేకవ్యక్తిత్వము గల వస్తువే ఆత్మ. శ్రు|| ''చైతన్యం వినాకించిన్నా స్తి'' -నిరాలంబోపనిషత్తు. శ్రు|| సర్వం ఖల్విదం బ్రహ్మ ఇదం సర్వం యదయ మాత్మా ఆత్మైవేదం సర్వం'' - ఛాందోగ్యము. పంచకోశములు, చతుర్దశభువనములు, ఆ స్తంబబ్రహ్మ పర్యంతము సర్వమును పరబ్రహ్మయగు ఆత్మకంటె వేఱుకాదని భావించుటే బ్రహ్మజ్ఞానము. అట్టి పరిశుద్ధజ్ఞానమే శ్రీవిద్య. అదియే శ్రీ శ్రియానందతత్త్వము. ''మధ్యవికాసాచ్చిదానందలాభో భవతి'' - శివసూత్రము. జ్ఞాతృజ్ఞానజ్ఞేయముల నెడి త్రిపుటిలో మధ్యమపదముజ్ఞానము. జ్ఞానమువలన జ్ఞాతయు, జ్ఞాతవలన జ్ఞేయమును గలుగుచున్నవి. మధ్యమపదమైన జ్ఞానమువల్లనే జ్ఞాతృజ్ఞేయములు కలుగుచున్నందున మధ్యమపదమైన జ్ఞానము వికసించినపుడు - అనగా వృద్ధిపొందినపుడు - మిగిలిన జ్ఞాతృజ్ఞాయములు రెండును తల్లీనములగుచున్నవి. మిగిలినది జ్ఞానమొక్కటే అదియే బ్రహ్మము. అదియే ఆత్మ. ద్రష్ట, దృక్కు, దృశ్యము అనువానికిని, ధ్యాత ధ్యానము, ధ్యేయములకును ఈ సూత్రమునే చేకొనవలయును. ఈ సూక్ష్మమును గ్రహించుటయే అమృతత్వమునందుట. కులమునందుండి శ్రీ శ్రియానందగురు దేవులు ముక్తకంఠమున చాటినది. ఈపరమసత్యమునే త్రిపుటిని లయించి సత్త్వ రజస్తమః పరమైన అమృతధామమును జేరుమని ప్రబోధించు చున్నారు. దీనినే కులమును వీడి అకులమును జేరుటనిరి. శ్రు|| ''అంతఃశరీరేనిహితో గుహాయా మజ ఏకో నిత్యః'' పిపీలికాది బ్రహ్మపర్యంతము ప్రత్యేకవియందును బుద్ధి యనెడి గుహాంతరమున వ్యాపించి బుద్ధికి సాక్షిగాను అధిష్ఠానముగాను నుండు ప్రకాశవస్తువే ఆత్మ. తన్నాశ్రయించి, అనుసరించు చంచలములైన బుద్ధీంద్రియాదులకు విలక్షణమైనది ఆత్మ. పూదండలోని దారమువలె సర్వత్ర విశ్వజీవకోటి యందు వ్యాపించియుండు చైతన్యమే ఆత్మ. అంతరాత్మ, అంతర్యామి యను నామాంతరములు ఆత్మకు జెందినవే. శ్రు|| ''అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం'' - కఠ శరీరము లేక, నాశము లేక తటిత్కాంతుల వెదజల్లుచు ఈ శరీరమును వెలుగుచున్న వస్తువే ఆత్మ. శ్రు|| 'అధాయ మశరీరో7మృతః'|| - బృహదాఱణ్యకము. ఈశరీరమునందుండు ఆత్మ నాశరహితుఁడు. ఆశరీరుడు. శ్రు|| అణోరణీయా& మహతో మహీయా& ఆత్మా7స్య జంతోర్నిహితో గుహాయామ్'' - కఠోపనిషత్తు దానికంటె జిన్నది లేదు. దానికంటే బెద్దది లేదు. ఎఱ్ఱచీమ కన్నను జిన్నవైన సూక్ష్మమైన జీవకోటియందును, గజమువంటి మహాకాయముగల జన్తువులయందును, నివసించు నది ఆత్మ. శ్రు|| యదేవేహ తదమృతం తదన్విహ మృతః సమృత్యు మాప్నోతి య ఇహ నానేవ పశ్యతి'' -కఠ. ఇందు వసించు ఆత్మయే అవల పరబ్రహ్మయే అని అవతి పరబ్రమ్మయే ఈవల ఆత్మ యని వ్యవహరింపబడును. ఘటోపాధివలన ఘటాకాశమనియు, ఉపాధిరహితమైనపుడు మహాకాశమనియు చెప్పబడు వస్తువొక్కటే. నానాజన్యసమూహమందును వివిధరూపముల గాన్పించు నాతడొక్కడే. కేవల దేహోపాధిచేతనే ఈవివిధప్రకృతిరూపములు పలువిధముల నామములు. పరబ్రహ్మమునకును - ఆత్మకును ఇసుమంతేనియు వ్యత్యాసము లేదు. శ్రు| ఏకో వశీ సర్వభూతాంతరాత్మాఏకం చేదం బహుధా యఃకరోతి||'' - కఠ. అతి సూక్ష్మమగు బీజమునుండి పుట్టునది వటకృక్షము. ఆ మహావృతక్షమునుండి యనేక శాఖోపశాఖలు, పూలు, పిందెలు, కాయలు, పండ్లు పుట్టి వ్యాపించి ప్రకృతిశోభను ఇనుమడింప జేయును. ఆవిత్తునందు అవ్యక్తముగానున్న సద్వస్తువు స్కంధమునందును శాఖలయందును ఫలములందును ఏకరూపమున ఏకాంశమును నిండియున్నడి. అటులే తనవలననే యుద్భవించిన సకలచరాచరములందును ఆత్మ నిండియున్నది. శ్రు|| ఏకో దేవః సర్వభూతేషు గూఢ స్సర్వవ్యాపీ సర్వ భూతాంతరాత్మ కార్మాధ్యక్షః సర్వభూతాదివాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ|| శ్వేతాశ్వతర. సరమునందుండెడి యొక్కొక్క ముత్తెమునందును సూత్రము వ్యాపించి యున్నటులు సమస్తజీవకోటియందును గూఢముగా వ్యాపించియుండి ఆయాజీవులు చేయు కర్మములకు సాక్షియే యుండువది ఆత్మ. ఆత్మ సచ్చిదానందస్వరూపము; నిత్యము; నిర్మలము; స్వయంప్రకాశము. సత్ -చిత్ -ఆనందము. అను వాని స్వరూపమెట్టిది? నిత్యలక్షణమెట్టిది? స్వయం ప్రకాశనిరూపణమేమి? శ్రు|| ''స్వప్నంతం జాగరితాంతం చోభే యేనానువశ్యతి| మహాన్తం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి||'' జాగ్రత్ స్వప్నసుషుప్తులనెడి యవస్థాత్రమందును తొలిగిపోకుండునది కనుకనే జాగ్రదవస్థయందు దోచు ప్రపంచముస్వప్నావస్థయందు గనబడలేదనియు, స్వప్నమందు దోచు ప్రపంచమును దాని వ్యాపారములును జాగ్రదవస్థయందు గనబడ లేదనియు, మఱి యీరెండవస్థలయందును దోచు ప్రపంచములును వాని వ్యాపారములును గాడనిద్రయందు బొత్తిగా గనబడక శూన్యమై గాఢాంధకారముగా నున్నదనియు చెప్పగలుగుచున్నాడు. అందువల్లనే త్రికాలములందును - మూడవస్థలయందును - నాశ హీతుడగుటను; ఆత్మ సత్ అనుబడుచున్నది. ఒక యవస్థయందగపడు ప్రపంచము మఱియొక యవస్థ యందు కనబడక పోవుటచేత, ఈపరిదృశ్యమానప్రపంచము అసత్ అనబడును. ఆత్మ - సత్తు; ప్రపంచము-అసత్తు. శ్రు ''జాగ్రన్ని ద్రాంతపరిజ్ఞానేన బ్రహ్మవిద్భవతి'' -మండల బ్రాహ్మణము. శ్రు|| ''బ్రహ్మవిదాప్నోతి పరం'' - తైత్తిరియము. అవస్థాత్రయపరిణామాంతమును అవగాహనము చేసి కొనిన సాధకుడు ఆత్మజ్ఞాని, బ్రహ్మవేత్త యనబడును. విశ్వవ్యాపనశీలమయిన పరమోత్కృష్టటపదమును గానగలవాడు బ్రహ్మవేత్తయే. ఆయతనేత్రములతో కనుల కఱవుతీఱగాంచి ఆనందాతిరేకమున తన్మయుడై తత్స్వరూపమును బొందగలుగు భాగ్యము బ్రమ్మవేత్తదే. ఆత్మ ఆనంద స్వరూపము. శ్రు|| ''తదేవత్ ప్రేయః పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో ఆత్మానమేవ ప్రియముపాసీత.'' - బృహదారణ్యకము. సర్వజనులకు ప్రియమైనదిఆనందము. ఆ ప్రియమైనది దుఃఖము. ఆనందదుఃఖములు రెండును వాని వాని సన్నిహతులకు దమ స్పర్శముచే స్వీయగుణముల నాపాదించును దారపుత్త్ర ధనారామాదులు ఆనందమును గూర్చును. కనుకనే మనకు వానియందు తగులము కలిగినది. ప్రియమేర్పడినది. నిరాశా నిఃస్పృహా దుఃఖకారణములైన విషయములకు దూరముగానుండ యత్నింతుము. మఱి పరిహరించుటకును ఉపాయముల వెదకుదుము. ఒక గృహస్థుని గృహము పరశురామప్రీతి యగుచుండగా దాని యజమానుఁడు తనకు ప్రేమాస్పదులయిన దార సతాదులను, సుఖప్రదములైన ధనధాన్యాదులకు ఆహుతి కాకుండ గాపాడుకొన శక్తివచనములేక పాటుపడును. పరిస్థితులు విషమించి తన ప్రాణములపైకే వచ్చునప్పుడు అతఁడు చేయునది యేమి? ఇంతకాలమును ''నావారు, నావి'' యను కొని తగులము త్రెంచుకొనలేకుండినవాడు, అన్నిటిని వీడి ఆత్మసంరక్షకై దూరము తొలగి అవి యన్నియు ఆహుతి యగుటను జూచి యోర్చుకొనును. కనుక అన్నిటికంటెను ప్రియము-ఆనందప్రదము, ఆత్మ దాని స్వరూపమానందమే. ఆత్మనిత్యలక్షణము శ్రు|| అశబ్ద మస్పర్శ మరూప మద్యయం తథారసం నిత్యమగంధంచ యత్ అనాద్యంతం మహతః పరం నిచాయ తంమృత్యుముఖాత్ ప్రముచ్యతే||'8 - కఠ. ఆత్మ శబ్దగుణమైన ఆకాశము కాదు. స్పర్శగుణము గల వాయువు కాదు. రూపగుణమైన యగ్ని కాదు. రసగుణము గల జలము కాదు. గంధగుణము గల పృథ్వియు గాదు. ''అస్తి జాయతే, వర్థతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి'' అనెడి ఆఱు భావములు (వికారములు) లేనిది. ఈమార్పులుగలది శరీరము మాత్రమే. మాతృగర్భమున నవమాసములు పిండరూపమున నుండుట ఆస్తి; తొమ్మిది మొదలు పండ్రెండు నెలలో నొక దానియందు వెలువడుట జాయతే; అన్నరసముచే నానాట పెరిగి ¸°వనావస్థనొందుట వర్ధతే; నానాట క్షీణించి వార్ధకమునందుట పరిణమితే; నాటికి నాడు సప్తధాతువులు క్షీణించిపోవుట అపక్షీయతే. మరణానంతరము రూపమే చెడి పంచభూతములచేనైనది మఱల పంచభూతములలో జేరిపోవుట వినశ్యతి. ఇవి పాంచభౌతిక శరీరమునకు సహజలక్షణములు. ఈయాఱు మార్పులకును లోగక వానికతీతీమై, వృద్ధిక్షయములు లేక సర్వకాలసర్వావస్థలందును ఒక్కతీరుగా నిత్యమై యుండుట ఆత్మలక్షణము. మొదలు నడుమ తుది లేనిది ఆత్మ. శ్రు|| సూర్యో యథా సర్వలోకస్య చక్షుర్నలిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః ఏక స్తథా సర్వభూతాంతరాత్మాన లిప్యతే లోకదుఃఖైఃస భాహ్యైః-భగవానుఁడు ఆదిత్యుడు తన యరుణకిరణ హస్తములచే దివ్యసుగంధభరిత సుమరాజములను స్పృశించుచున్నాడు. ఆ హస్తములతోనే దుర్గంధ దూషితకశ్మలపదార్థములను దాకుచున్నాడు. కాని ఆ సుగంధ దుర్గంధము లాతని నంటజాలవు. విశ్వజీవకోటి హృదయాంతరములు పసించు ఆత్మయను సూర్యుని ఆయా జీవుల పుణ్యపాపములు అంటజాలవు. కనుక ఆత్మ నిర్మలుడు. స్వయంప్రకాశ లక్షణము శ్రు|| నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాన్తి కుతో7యమగ్నిః తమేవ భాన్తమనుభాతి సర్వంతస్య భాసా సర్వమిదం విభాతి|| -కఠ. అగ్గిచేరిక వలన కట్టెలు అగ్గిరూపమునే చెంది తదితర పదార్థములను గాల్చుచున్నవి. కట్టెలకు కాల్చు శక్తి స్వతః సిద్ధము కాదు. అటులే స్వతఃసిద్ధమైన ఆత్మయొక్క జ్ఞానప్రకాశముచేతనే, కాష్ఠనదృశములైన సూర్యచంద్రనక్షత్రాదులు విద్యుత్తు మున్నగునవెల్ల సప్రకాశములుగా దోచుచున్నవి. ఆదిత్యుని చైతన్య కిరణకాన్తులు ఆత్మకు చెందినవే. హిమధాముని శీతలకిరణములు ఆత్మకు చెందినవే. అగ్ని దేవుని దహనశక్తి ఆత్మకు చెందినదే. మినుకు మినుకుమనెడి చుక్కల తేజు ఆత్మకు చెందినదే. మినుకు మినుకుమనెడి చుక్కల తేజు ఆత్మకు చెందినదే. సౌదామినీ సౌందర్యము ఆత్మవలన నెరవు గొన్నదే. కాన ఆత్మస్వయంప్రకాశము. శ్రు|| అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్యస్త మితే శాంతే7గ్నౌ శాంతాయాం వాచి కింజ్యోతిరేవాయం పురుషః ఇత్యాత్మైవాస్య జ్యోతిర్భవతి|| -బృ|| ఆరణ్యము సూర్యాస్తమయమైనది. అది అమవస నిసి. అంతయు గాఢాంధరకారబంధురము. అట్టితఱి ఇది యంధకారమని సూర్యచంద్రులు లేకున్నను ఈ ప్రపంచమున్నదనియు, స్థూలశరీరినైన నేనున్నాననియు, ఏ జ్యోతిఃప్రకాశమున నీవు తెలియ గల్గుచున్నావో, ఆస్వప్రకాశజ్ఞానజ్యోతియే ఆత్మ. నీ శరీరమును ఆత్మలేనిచో సూర్యచ్రందాదులున్నను నీ దేహమును నీవు తెలిసికొన జాలవు. ఆత్మయన్న దొకటి యుండుటచేతనే యిదంతయు నెఱుగుచున్నావు, గాన ఆత్మ స్వయంప్రకాశము అదె పరంజ్యోతి. శ్రు|| 'విజ్ఞాన మానందం బ్రహ్మ'. - బృహదారణ్యము. కేవల జ్ఞానానందస్వరూపము ఆత్మ. శ్రు|| ''తతః పవిత్రం పరమేశ్వరరాఖ్య మద్వైతరూపం వినులాంబరాభం'' || - పైంగ: స్తంభాకారమున సుస్థిరమైనది, ఆకాశమువలె రూపరహితమైనది బ్రహ్మము. శ్రు|| ''స పర్యగావచ్ఛుక్ర మకాయ మవ్రణ మస్నావిరగ్‌ం శుద్ధ మపాపవిద్ధం||'' ఆత్మ విశ్వవ్యాపనశీలి; సత్యతేజోజ్వలజ్జాల; శరీరత్రయా తీతము. (జాగ్రదాద్యవస్థలు లేనిది) సర్వస్రష్ట, సర్వద్రష్ట, సర్వజ్ఞము, నిత్వతృప్తినిలయము; సర్వస్వతంత్రశక్తిధామము; నిత్యమలు ప్తశక్తిసంపన్నము. శ్రు|| ''సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ'' - తైత్తిరీయ. సత్యలక్షణము శ్రు|| ''కిం తత్సత్యమితి -సదితి శ్రౌత ప్రతీతిలక్ష్యం సత్యం అనదిత్యవాచ్యం సత్యం త్రికాలాబాధ్యం సత్యం సర్వకల్ప నాధిష్ఠానం సత్యం||'' -సర్వసార. జహదజహల్లక్షణలక్ష్యముగా శ్రుత్యుక్తమైన సత్తు సత్యము. అనశ్వరమైనది, అక్షరమైనది సత్యము. ఎట్టిమార్పును లేక త్రికాలమునందును స్థిరముగానుండునది సత్యము. సజాతీయ నిజాతీయ స్వగతభేదము లేనిది సత్యము. తనకంటె వేఱయిన పదార్థము లేక యేకాకారమున నుండునది సత్యము. జీవేశ్వర జగత్తులనెడి కల్పనలకు అతీతమై; వాని కధిష్ఠానముగా నుండునది సత్యము. అదియే ఆత్మ. అదె పరబ్రహ్మము. జ్ఞాన లక్షణము శ్రు|| ''కిం జ్ఞానమితి-స్వప్రకాశకం జ్ఞానం, సర్వప్రకాశకం జ్ఞానం, నిరావరణచిన్మాత్రం జ్ఞానం, అనాద్యనంతం నిరంతమమవృత్తి, వృత్తిసాక్షి చైతన్యమేవ జ్ఞానం.'' - సర్వసారోపనిషత్. ఇతర వస్తుసహాయము లేక తనకు దానే ప్రకాశించునదే జ్ఞానము. సూర్యచంద్రాగ్ని నక్షత్రాదులను స్వీయదుర్నిరీక్ష్య దివ్యతేజఃపుంజములచే ప్రకాశింప జేయునదే జ్ఞానము. మాయ అవిద్య యనెడి అవరణములు లేనిదే జ్ఞానము. అదిమధ్యాంతములు లేక సంకల్పశూన్యమైనదే జ్ఞానము. సంకల్పవికల్పములే రూపమయిన అంతఃకఱమునకు సాక్షిగానుండు నిర్వికార చైతన్యమే జ్ఞానము, అదె పరబ్రహ్మము; అదె ఆత్మ. అనంతలక్షణము శ్రు|| ''కిమనంతమితి-ఉత్పత్తివినాశరహితమనంతం షడ్భావవికార రహిత మనంతం సర్వోపాధివినిర్ముక్త మనంతం మృద్వి కారేషు మృదివ, స్వర్ణవికారేషు స్వర్ణమివ, తంతు వికారేషు తంతురివ, అవ్యక్తాది ప్రపంచేషు వ్యాప్య పూర్ణ మవినాశి చైతన్య మనంతం''|| - సర్వసారోపనిషత్తు. అనంతము -ఉత్పత్తివినాశములు లేనిది. షడ్భావవికార ములు లేనిది. ఎట్టి శరీరోపాధియు లేనిది. పలురీతుల పాత్రములుగా, పలు తెఱగుల రూపములుగా వివిధనామములతో వ్యవహరించుచున్నను తద్రూపములతో నున్న మన్ను ఒక్కటే. కటక మకుటాది నానావిధ రూపములతో నానావిధాభరణ నామములతో వెలయుచున్నను వాని నిర్మాణకారణము సువర్ణ మొకటే. తంతువు (నూలు) ఒక్కటియే నేయబడినపుడు వివిధనామములతో వెలయు వస్త్రములుగా వ్యవహరింపబడును. అటులే బ్రహ్మచైతన్యము భిన్నభన్నాకృతులతో భిన్నభిన్ననామములతో నిజరూపమును వ్యక్తీకరించుచున్నది. కనుకనే అనంతము. అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే జ్ఞేయము, అదే దృశ్యము. అదే ధ్యేయము, 'తమసఃపరస్తాత్' 'పరోరజిసి' అని నిర్దేశింపబడిన 'విష్ణోః పరమంపదం' అదియే. ప్రణవమునకు - శబ్ధబ్రహ్మమునకు ఉత్పత్తిస్థానము, తురీయా తీతమగు 'పరమే వ్యోమ &' అనబడు శ్రియానంద నికేతనము అదియే. ''దివీన చక్షురాతతం'' అంతరిక్షమున వ్రేలాడు నాటక దీపమువలె విస్ఫారితనేత్రముతో జూచి తన్మయత్వమును సాధకులు శ్రీ శ్రియానందస్వరూపులగుట యీ లక్ష్యమును సాధించుటచేతనే, శ్రు|| హిరణ్యయేనపాత్రేణ సత్యస్య పిహితంముఖంతత్‌త్వం న పుషన్న ప్రావృణు సత్యధర్మాయ దృష్టయే|| - ఈశావాస్య. సత్యమే స్వరూపముగా గలవాడవు నీవు, సత్యధర్మమునే ఉపాసించువాడను నేను, విరివి కన్నులతో జూచి తన్మయుడనగుదును. చూపుల కడ్డుగా నున్న ఆజ్యోతిర్మయపాత్రనొకింత తొలగింపుమా, పూష! అని యుపాసకనైష్టికులు అభ్యర్థించునది ఆ యమృతధామము నుద్దేశించియే. శ్రు|| శ్రద్ధానురూపా ధీర్దేవతా తయోఃకామేశ్వరీ సదామద ఘనా పూర్ణా స్వాత్మైకరూపా దేవతా||'' - భావనోపనిషత్తు. శ్రద్ధాయుక్తమైన పూర్ణ విశ్వాసముతోడి బుద్ధియే శ్రీచక్రమధ్య బిందుస్వరూపముగా నున్న కామేశ్వరీ కామేశ్వర ద్వంద్వము. అపురాణ దంపతులలో సర్వదా సర్వేంద్రియ జ్ఞానానందస్వరూపమైన తన ఆత్మయే కామేశ్వరీదేవతగా భావించి, ఆత్మకును దేవతకును ఐక్యమును అనుసంధానించి, నేననెడి జీవత్వాహంకారము నశింపగా, శాక్తబంధువులు కామేశ్వరీసారూప్యము నొందునది. ''పరో రజసి సావదోం'' పదవాచ్యమైన తురీయాతీతమైన రక్తశుక్లప్రభామిశ్రమైన అతర్క్యమైన తేజోరూపమైన అవాఙ్మానసగోచరమైన తత్పద వాచ్యమైన ఆ శ్రియానంద గురుమణి పాదుకా యుగమును జేరుటచేతనే. అవ్యక్తముకంటెను పరమై, ఏచిచ్ఛక్తి సదాశివుని యందు స్వాభావికియై చిద్ఘనానందస్వరూపయై, నిరతిశయ తేజోరాశియై, పరిపూర్ణానంత దివ్యసౌదామినీనియచాయకారయై, గాయత్రీ సావిత్రీ సరస్వతీ కమలాలలయాదులైన వివిధశక్తి బోధక నామములతో వివిధప్రకాశ ప్రక్రియలతో సాధకుల సాధన ప్రణాళి ననుసరించి యభివ్యక్త యగుచున్నదో, అట్టి రాజరాజేశ్వరీపరాభట్టారికకు మూలపీఠమగు తత్పదవాచ్యమగు సహస్రారకమల మదియే. బ్రహ్మాపరోక్షజ్ఞానస్ఫురణభాగ్యమును సాధకులుపడయుటకు నిర్దేశింపబడిన లక్ష్యస్థానమదియే. అదియే బ్రహ్మము. అదియే ఆత్మ. ''అయుమాత్మా బ్రహ్మ'' ఆయం-ఆత్మా అను విశేషణద్వయమునకు అర్థవివరణ మేమి? శ్రు|| ''స్వప్రకాశం పరోక్షత్వమయమిత్యుక్తితో మతం అహంకారాదిదేహాన్తాత్ ప్రత్యగాత్మేతి గీయతే|| - శుకరహస్య. స్వర్గాదులు నిత్యపరోక్షత్వమును సూచించును. ఘటాదులు దృశ్యత్వమును నిరూపించును. 'అయుం' అను పదము అదృష్టమైన - చూడబడని - చూడశక్యము కాని ఇంద్రియ ములకు గోచరము కాని స్వయంప్రకాశాత్మకు అపరోక్షత్వమును స్థిరపఱచుచున్నది. ''ఆత్మా-బ్రహ్మమనోజీవశరీరధృతిషు'' అనువిశ్వకోశము ననుసరించి దేహమునకును, ఇంద్రియములకును, బ్రాణమునకును ఆత్మశబ్దము వర్తించును. గాన, అహంకారాదిదేహా స్తముగాగల ప్రాణమనో దేహేంద్రియములకు విభిన్నమై-(ప్రత్యక్) సాక్షిస్వరూపముగా నున్నది ఆత్మ యని గ్రహింపవలయును. అట్టి యాత్మ, దృశ్యమానవచరాచరజగత్తునకు అధిష్ఠాన కారణముగానుండి, జగత్తునకును ఆకాశాదిపంచభూతములకును పూర్వాపరములయందుండి పారమార్థికమైన స్వప్రకాశ జ్ఞాన స్వరూపమును, సచ్చిదానందలక్షణమును గల సద్వస్తువునైన బ్రహ్మము అనియును జెప్పబడినది. కనుక ''ఆయమాత్మా బ్రహ్మ'' అనెడి యీ వాక్యము అధర్వణవేదగతము. అట్టి బ్రహ్మము స్వగతాదిభేదములు లేక నామరూపరహితమైత్రికాల ములయందును అనగా సృష్టికి పూర్వమందును, వర్తమాన మందును, భవిష్యత్తునందును, ఎట్టి మార్పును - పరివర్తనమును లేక అద్వితీయమై యున్నది. గాన నిదియే 'తత్' పదముచే నిర్దిష్టము. 'ఓంతత్సత్' ''పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే, పూర్ణస్వ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే||'' ఓం శాన్తిః శాన్తిః శాన్తిః.