శ్రీమాత్రే నమః శ్రీ శ్రియానందనాథ గురవే నమః ''షోడశీ -
కామకలా'' ఓం|| బాలవ్యక్తవిభాకరామితవిభాం భవ్యప్రదాం భారతీం ఈషత్ఫుల్లముఖాంబుజస్మితకరై రాశాభవాంధాపహామ్ పాశం సాభయమంకుశం చ వరదం సంబిభ్రతీం భూతిదాం భ్రాజన్తీం చతురాంబుజాకరై ర్భక్త్యా భ##జేషోడశీమ్|| షోడశీనామప్రథిత శ్రీమహాత్రిపురసుందరీదేవి, ఉషః కాలీనబాలభాస్కరుని యరుణకిరణజాలసదృశ దేహకాంతి కోరిక లనెడి దిక్కులయందు ఆవరించిన యజ్ఞానమనెడి చీకటులను పాఱదోలు ఈషదంకురితమందహాసరోచిస్సులు, విషయవాంఛ యనెడి పాశము, క్రోధమనెడి యంకుశము గల రెండు హస్తములు - ''ప్రతిపన్ముఖ్యకళానిధానమయి, శశ్వత్‌స్థాయియై సాద నా స్తుతవౌ నీవు, సదాశివాఖ్యపరవస్తువ్యగ్రవై, చంద్రికా ప్లుతసౌధాగ్రమునందునిల్చుతఱి, మీపూతాంఘ్రుల ६ మున్గి,నా స్థితియే నేనెఱుఁగంగ లేని సుఖమందే తేల్పుమమ్మా ! ఉమా! ''శ్రీరాజేశ్వరినీవు, నీయనుఁగు మంత్రిన్నేను, లోటేమి¸°? సారైశ్వర్యపురాధిపత్యజనవశ్యత్యమ్ము లీడేఱ, ని ర్వైరిన్నాకటె నడ్డు లేదు పెనుదారింద్రొక్కుచో, నీదు న త్కారుణ్యంబె బలంబు నన్విడకుమా, గాయత్రి! గేయప్రథా!'' - శ్రీ శ్రియానందనాథ. అని సర్వధర్మముల బరిత్యజించి పదములకెరగి, ప్రపత్తి నెఱపి శరణము వేడ సాధకుల భవభయమును బాఱద్రోలి, సకలబంధముల తెగద్రెంచు అభయహస్తము- ''సతతమనోజ్ఞపద్మవనచారిణి పద్మిని! మన్మనోమధు వ్రతము సిపాతితంబు మకరందభ రాంబుజమందుదాఁక, ని గ్గతి భ్రమరాఖ్యమై తిరుగుఁగాన, సహస్రదళాంబుజాత సం స్థితి నిడి తన్పుమో మధుమతీ! ఎటఁద్రెళ్లునో దీనదీనమై.'' ''మనసా! మున్గుము మున్గు వేసరక శ్రీమాత్రంఘ్రినీరేజనా బ్ధిని, దద్వత్సలతాంబుధి ६, సకలధా త్రీదివ్యసౌందర్యవా ర్థిని, గన్గొందువపూర్వరత్న మనుచు&, ధీరత్వముంగొల్పి ముం చినఁఁ'గంటి& జెఱుకంద' దంచు మునుఁగు& జింతాబ్ధిలో నీశ్వరీ!'' - శ్రీ శ్రియానందనాథ. అని మాయాంధకారమును తట్టుముట్టాడు దీనాతిదీన సాధకులకు ఈప్సితార్థదాయ యగు వరదహస్తము, అఖండ తేజోవిరాజితచిదమలాకారము. ఇట్టి దివ్యమంగళరూప; జీవకారుణ్యబోధానందస్వరూప; బ్రహ్మస్వరూప; మా యమ్మ; పరిణతశరచ్చంద్రవదన ''షోడశి'' అమ్మా! జగదీశ్వరీ! ''త్వదస్యః పాణిభ్యామభవరదో దైవతగణ స్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్య లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ'' - సౌందర్యలహరి. ''లలితా! నీకితరమ్ము దైవతమదెల్ల& గామీ మదాభీతిము ద్రులు కైదోయిన తాల్చు; నీవొక తెవే తద్వ్యంజనంబూనుకో వెలమిం గోరిక మీఱ నీయ, వెఱ మాఱుంపంగ, నీకాలుద మ్ములె చాలు &; జగతీవ్రజమ్మునకుఁగా పుంగూర్చుతల్లీ! ఉమా!'' నీకంటె నితరదైవములు వరదము అభయము అనెడి ముద్రలు చేతులతో జూపుదురు. అది యభినయమాత్రమేమో? ఔను, అందు గొప్ప యేమున్నది? నీ భక్తులు కోరినదానికంటె నదన మీయగలవి. సర్వభయహరములు, సంసారముత్తారణ సమర్థములు; భుజించువారికి 'భవానిత్వ'మునే ప్రసాదించు రక్తశుక్ల ప్రభామిశ్రములనైన నీయడుగుదమ్ములే యుండగా, నీకాయభినయమేల తల్లీ! నీ యొక చేతిది చెఱుకువిల్లు, అదె మనస్సు; ఒక చేత ననుసంధానించునవి పుష్పబాణములు; అవె పంచతన్మాత్రలు. శబ్దస్పర్శరూపరసగంధాః పంచతన్మాత్రాఃపంచబాణాః మన ఇక్షుధనుః, వశ్యోబాణః రాగః పాశో, ద్వేషోంకుశః|| - భావనోపనిషత్. తామరసము, అశోకము, చూతము, మల్లిక, ఇందీవరము అను పూవుటమ్ములే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధముననెడి పంచభూతధర్మములు. అవి నావి. చెఱకువిల్లు నీచేతిది. సంకల్పవికల్పాత్మకమై వానినే మననము చేయు మనస్సు నాది. పారము లేని జీవకారుణ్య మనెడి యనురాగము నీది. అంతు లేని తుచ్ఛైహికసుఖలంపటత్వమునం దభిలాషము, పుత్త్రధనదారాదులందు గాఢాను రాగము నాది. నన్ను బట్టి పీడించు అరిషడ్వర్గమును ద్వేషమున గాంచు క్రోధమే నీచేతి యంకుశము. మిత్రులుగా గానవచ్చు కామాదిశత్రులయెడ నీకు గల క్రూరదృష్టిని గాంచి యినుమడించునది ద్వేషమే. ఇట్టి సమానగుణములు, ధర్మములు మనకు బాదరా యణసంబంధమును గలుగజేయుచున్నవి. కాదా? ''మనస్సును చిక్కబట్టుకొనుము; రాజరాజ్వేశ్వరీ! నిరంతర సాధనచే ఇంద్రియముల యుద్వేగము సణచివేయుము. విల్లువలె నెట్టి ప్రయత్నమును లేకయే నీవు నాకభిముఖుడ వగుదువు. 'భవానిత్వం' అని నీవు బిగ్గ బిలుచునంతనే నీకు భవానిత్వము నిత్తును'' అని కదా, తల్లీ! చెఱుకువిల్లు పూవుటమ్ములతో నీబిడ్డలను ప్రబోధించుచున్నావు. ''నే నాయనమ్మకు ముద్దుబిడ్డనను వాని& మెల్నఁನಂఁగొన్నాళ్ళకు& నే నీవాఁఁడ ననంగఁఁజేయుదువు; వాని& మళ్లి కొన్నాళ్లకే నే నీవంచును బల్కజేయుదువు; నీయీ జీవకారుణ్యబో ధానందమ్మె భవాని! సాధనఫలమై ప్రోచు నీబిడ్డల&.'' - శ్రీ శ్రియానంద - అమ్మతో ముచ్చటలు నాయందలి మోహబీజములను దగ్ధము జేయుదును. ఒకింత జ్ఞానవిస్ఫులింగములను రగుల్పఁచేయుము. తల్లీ! బహుళోద్భవ కర్మబీజమూలకందము గ్రంధిత్రయము నిర్మూలింపుము. నాకెవ్వరును లేరు. ఉన్న - నాది యని నమ్ముకొన్న, ఒక్క యమూల్యప్రేమనిధానమును నీవే తీసికొంటివి భవానీ! నీవలెనే నే నేకాకిని, మన యీ బాంధవ్యమును గుర్తింపుము. ''మమతాశృంకలముం దగిల్చి, పటుకామక్రోధలోభాది వ ర్గముఁబైఁగాపిడి, బొంది బండియను నిర్బంధించి జీవాత్ముచే శ్రమసంధాయక హేయకార్యచయము& జల్పించె; చెందాఁక, నీ యమబాధల్? పరమాత్మ! నిత్యసుఖమిమ్మా! భక్తచింతామణీ!'' ''నీసాయుజ్యముఁగోరి దివ్యమణికా న్తిభ్రాజిత్యున్నత ప్రాసాదమ్మఁ ద్వదీయ మెక్క బహుసోపాసమ్ములందాటి, నే నే సాధించితి నిట్టి పుట్టుతుది మెట్టిందుండి న& ద్రెళ్లనీ కాసంకల్పము నిర్వహింపు పరమాత్మా! భక్తచింతామణి!'' ''తనకంటె& ఘనులైనవారి కరణ& దానెట్టు లర్థించునో తనకారుణ్యములంతు లాకరణినే దైన్యంబున& గోరు వా రనుకొంచీవిడు శక్తికి& దగిన సాహాయ్యంబుచే నొండుల& దనియింప& గలిగింపు బుద్ధి; పరమాత్మా! భక్తచింతామణీ!'' - వి|| ను|| రాయకవి. భగవతికి త్రిపురసుందరి యను నామ మెటులు కలిగినది? శ్రీ శ్రియానందనాధగురుజీ తమ శ్రీసూక్తరహస్వార్థమందు ఈ విధముగా వ్రాసిరి. ''లలితా శారదా లక్ష్మీర్దేవేశీ భగవత్యుమా, తత్తల్లక్షణసంయుక్తా పురుషార్థప్రదా నృణామ్||'' - దేవీపురాణము. లలితా శారదా లక్ష్మీ నామములతో నొప్పునది శివ శక్తియైన శ్రీమహాత్రిపురసుంరదియే. ఆయా లక్షణములతో గూడినదియై భక్తులకు ఆయాపురుషార్థముల నిచ్చును. బ్రహ్మవిష్ణురుద్రశరీరములు ఎవనివో అతడు త్రిపురుడు (పురము=శరీరము) పరమశివుడు. అతని సుందరిగా సంభావింప బడినది. అతనికంటె భిన్న కాని పరశక్తియే శ్రీమాత. శ్రీమహా త్రిపురసుందరి. ''జ్ఞానమాత్మని భా సూర్యే చంద్రేజ్యోత్స్నాచ ఖే ధ్వనిః వర్ణో హిరణ్య పయసి ఘృతం త్యమసి మాతృకే||'' ఆత్మయందు జ్ఞానము, సూర్యునందు వెలుగు, నెల యందు వెన్నెల, ఆకసమందు ధ్వని, బంగరునందు వన్నె, పాలయందు నేయియువలె తల్లీ! నీవే చుమా - నీవే జ్ఞాన స్వరూపిణివి అజ్ఞాదిసహస్రారాంతమైన చంద్రమండలకాంతివి. నీవే హృదయాకాశముందు శ్రవణాకాశమందు వీణావేణు మృదంగా దిధ్వనివి. ఆకారాదిక్షకారాంతమై వైఖరీవాగ్రూపమున జెవికి గోచరించు శబ్దము నీవే. హిరణ్యమందు వర్ణము అనునపుడు (హిరణ్యం విష్ణు రాఖ్యాతం తస్యవర్ణస్తు వైష్ణవీ - వ్యాప్నోతీతి విష్ణుః) పరమశివుని సర్వవ్యాపకశక్తివి నీవే. ''ఘృతం మిమిక్షిరే ఘృతమస్య యోనిఃఘృతే శ్రితో ఘృతమవశ్య ధామ అనుష్యధమావహ మాదయస్వ స్వాహా కృతం వృషభవక్షి హవ్యమ్'' సహస్రారమునందు బుట్టు ఆనందమనెడి యమృతమునే, క్షీరసాగరమందు బుట్టు ఘృతమనిరి. అదినీవే. త్రిభ్యఃపురా=మూడిటికంటె ముందుండినది గాన 'త్రిపురా' ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తులకును, సత్త్వరజస్తమోవస్థల కును బ్రహ్మవిష్ణురుద్రులకును, జాగ్రత్ స్వప్నసుషుప్తులకును, ధ్యాతృధ్యానధ్యేయములకును ముందుండినది గాన త్రిపురా. ఈ త్రిపుటులను అధిగమించి వానికధిష్ఠానమై చిత్ప్రకాశ##మై సృష్టికి ముందుగా ఏతత్త్వముండినదో ఆ బ్రహ్మమే మహా త్రిపురసుందరి. శ్రీరాజరాజేశ్వరి. పురమనగా శరీరము. త్రిపురములనగా స్థూలసూక్ష్మ కారణశరీరములు. జాగ్రత్ స్వప్నసుషుప్తులనెడి యవస్థలకే శరీరములని పేరు. మూడు శరీరములందును అనగా ఆ మూడవస్థల యందును జ్ఞానస్వరూపమున శోభించునది గాన త్రిపురసుందరి. బ్రహ్మవస్తువును స్త్రీ రూపమున వర్ణించి రేల? - ప్రసవ ధర్మము, అనగా కనుటక పెంచుట మున్నగునవి స్త్రీ ధర్మములు మాత్రమే. సకలతత్త్వసముదాయమును సమస్తవర్ణకదంబమును గర్భమందు ధరించి వెలికి విడుచుచున్నది. అనగా సృజించుచున్నది, బ్రహ్మము. దానికి లింగభేదమే లేదు. ''నైవ స్త్రీ న పుమానేష నైవ చాయం నపుంసకః, యద్యచ్ఛరీరమాదత్తే తేన తేన స యుజ్యతే||'' ''ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరం, ఏతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వాయో యదిచ్ఛతి తస్యతత్'' - (కఠ) సాధకుల చిత్తవృత్తుల ననుసరించి యెవరు దాని నెటు లభిలషింతురో యటులే యుపాసింతురు. శ్రీనూక్తరహస్వార్థమందు శ్రీ శ్రియానందనాధగురుజీ యీవిషయము నిటులు వివరించిరి. - బ్రహ్మమును మాతృరూపమున భజించు విశేషమేమందురా? స్వభావముఁ గని పెంచు తల్లికిఁఁ బ్రజలయెడ స్నేహము మెండనుట యెల్ల రెఱింగినదే. మాతృత్వతము నొందిన బ్రహ్మము మాతయే. ఉప నయనవేళఁఁ ద్రైవర్ణికులకుఁఁజేయఁఁబడు బ్రహ్మోపదేశమును గుర్తింపుడు. ''ఓమిత్యేకాక్షరం బ్రహ్మ'' అని యారంభించి, యుపాసనవేళ ధ్యానముకైన రూపమును గల్పించునపుడా జ్ఞానానందస్వరూపబ్రహ్మమునకు, పారమ్యమహిమాదివిశిష్టతలను దెల్పు స్త్రీరూపమునే కల్పించి, గాయత్రియని సార్థక నామముంచి, ఆనామరూపవివర్జితవస్తువు. చరాచరజగన్మాతయే కాదు, వేదమును (జ్ఞానమును) గూడ గనునది కనుక వేదమాత యని, తల్లి గానే యారాధింపుమనిరి. ఆ బ్రహ్మోపదేశము కాఁఁగానే వటుఁడు మునుమున్ను తల్లికే మ్రొక్కి భిక్ష గొనవలయును. శీక్షావల్లియు ''మాతృదేవోభవ'' ''పితృదేవో భవ'' యనుచు ముందుగా మాతృపూజనే శిక్షించినది. ఇన్నేల? తానై యేరికిని మ్రొక్కని సన్నాసియుఁఁగన్నతల్లికి మ్రొక్కక తప్పదు. భారతమున యక్షప్రశ్నములందు ''మాతా పృథివ్యా అని మహీయసీ'' యనెను. మఱి చూడుఁఁడు. ద్వంద్వసమానమందు - ''తల్లిదండ్రులు అత్తమామలు, రాధాకృష్ణులు, సీతారాములు, పార్వతీపరమేశ్వరులు, మున్నగు వానిలో నేడఁఁజూచినను అగ్రస్థానము మాతృరూపశక్తిదే. కావున బ్రహ్మమును మాతృరూపమున నుపాసించుటనే శ్రీఘఫలసిద్ధి యనిరి. ''జననీ! ద్వంద్వసమానమందు, శ్రుతిశీక్షావాక్కులన్, వడ్గుమ్రొ క్కున సగ్రస్థితి నీది; వంద్యపదభిక్షుండై ననుం దల్లికే విసతుల్ సేయక తప్ప; దీవిధము భావింపఁఁగబ్రాముఖ్యము& జననీసేవకె వేదమిచ్చె ననఁఁగా సందేహమా! శ్రీమతీ!'' ''చక్కనిచంద్రుఁడన్న, నిది చక్కని చుక్క యటన్న, నేదియే& జక్కనిదన్న, నీకొసరు చక్కదనమ్ము రవంత దానిలోఁ జొక్కణమౌటనే, త్రిపురసుందరి! చక్కని దౌను, కానిచో నెక్కడిదమ్మ! యంతట రహించెడి దెన్నఁగ నీదు చొక్కమే'' - శ్రీ శ్రియాందనాథ - అమృతోముచ్చటలు. శ్రీ భగవతికి 'షోడశీ' యను నామాంతర మెటులు చెల్లినది? - శ్రు|| సృష్టేఃపురా నామరూవివర్జితం జగత్' సృష్టికి మున్ను సర్వశూన్యమైన ప్రలయాంతమున నామరూపరహితమై అద్వితీయమై అఖండతేజో రాశ్యాకారమై స్వతఃసిద్ధప్రకాశ శక్తిగల బ్రహ్మమే - ఆత్మ యనెడి సద్వస్తువే ఒకటి యుండెను. శ్రు|| సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్|| - ఛాందోగ్యము. శ్రు|| 'ఆత్మా వా ఇదమేక మేవాగ్ర, ఆసీత్' నాన్యత్కించన మిషత్ - ఐతరేయోపనిషత్ నిర్మలాకాశమువోలె, స్ఫటికమువోలె, అతిస్వచ్ఛమై, సజాతీయ విజాతీయ స్వగతభేదరహితమై, నిత్యనిర్ముక్తమై సర్వోపనిషత్సమధిగమ్యమైన బ్రహ్మవస్తువు ఆత్మ ఒక్కటియే యుండెను. తదన్యమైనది యేమియు లేకుండెను. ''కనఁబడుచున్న విశ్వమది కల్ల యెటౌ నుమ! పేరురూపులం గనునది పేరురూపులను గానకపోవుట నెంచి, రూపు పో యినను దదర్థబోధక మదేదొ నశింపదు గాన, నిత్యము& గనుగొన వాక్కుపర్థమునుగా మదిఁదోచును; నీవదేకదా.'' - శ్రీ శ్రియాంనంద-ఆ|| ము|| నామము రూపము ఏకవస్తుబోధకములగుట నీరెంటికి ఉపాధిగా దానిని 'ప్రకాశబిందువు' అని నిర్దేశింపఁబడినది. ఈ ప్రకాశబిందువునందు అంతర్లీనమై (గర్భితమై) భావిసృష్టికి హేతుభూతమగు విమర్శశక్తి యుండెను. ''ప్రకర్షేణ కాశ##తే ఇతి ప్రకాశః'' ప్రకాశ##మే జ్ఞానము, గాన ఇదె సంవిద్బిందువైనది. శ్రు|| 'ఖం బ్రహ్మేతి వ్యజానాత్' ఆకాశము బ్రహ్మ స్వరూపము, శూన్యధర్మము గలదగుట బ్రహ్మమును నిర్దేశించు చున్నది. 'అసమన్తాత్ కాశత ఇత్యాకాశః' అంతటను ప్రకాశించునది కావునను ఆకాశము. బ్రహ్మమునే చెప్పుచున్నది. ఆకాశము వృత్తనూచకము. తన్మధ్యమున సంవిద్రూపమగు 'ఆత్మ' బిందురూపమున నుండెను. శ్రుతులు ఆకాశమును 'పరమే న్యోమ&' అని చెప్పుచున్నవి. జ్ఞానస్వరూప స్వప్రకాశసంవిద్బిందువు చంద్రమండలము. సాధకుని శరీరము నాలుగు భాగములు. అందు కటి ప్రదేశము మొదలు భ్రూమధ్యపర్యంతము మూడు భాగములు. భ్రూమధ్యమునుండి బ్రహ్మరంధ్రపర్యంతము ఒక భాగము. ఇది ఆరోహణ క్రమములో ప్రథమభాగము. అవరోహణక్రమములో తురీయభాగము, గాన తురీయకూట మనుబడినది, ఇట నున్న ప్రధాన వస్తువు 'ఆత్మ' బ్రహ్మము, ధ్రువము, కామకళ, సాదా, పరా, మహావైసర్గికీ, షోడశీ అను వివిధనామములతో వ్యవహరింపబడుచున్నది. శ్రీసూక్తరహస్వార్థమందు శ్రీ శ్రియానందనాథగురుజీ యిటులు వ్రాసిరి. 'చంద్రుని కళలు పదునాఱు; అయినను బ్రతిపదాదితిథిరూపములైనవి పదునైదే. శుక్ల కృష్ణ పక్షము లందు వృద్ధిక్షయరూపములతో గానబడుచున్నవి. కాని పదునాఱవ కళ కాదు. అది స్థిరమై పెరుగు తఱుగులు లేక 'సాదా, పరా, మహావైసర్గికీ' త్యాది నామములతోఁజెల్లును. అద్దానికే క్షయమున్నచో అమాంతమున జంద్రునికే నాశ ప్రసంగము గలుగును గానఁజంద్రుని పదునాఱవ కళ సర్వకళలకును బీజభూతమై సర్వకళామయియై హానివృద్ధులు లేనిదై పంచదశతిథిరూకళలందు నిమిడి యున్నది. కావుననే దీనికి సాదా (సదాయుండునది) యని పేరు. ఈపదనాఱవ కళ##యే. తక్కు పదునైదిటిని తనలోనుండి విడుచుచున్నది కావునను, సర్వజత్కారణము కావునను 'మహావైసర్గికీ'యను పేరఁజెల్లును. సర్వోత్కృష్టబ్రహ్మకళ కావుననే 'పరా' యని పేరు. శ్రీమహాత్రిపురసుందరిని చంద్రునందు ఉపాసింపు మనుటకు హేతువేమి? శ్రీ శ్రీయానందనాథగురుజీ సమాధానము!- షోడశకళ శరత్కాలమందు శశిబింబమున వ్యక్తతర ముగాఁదోఁచును. కావుననే, యప్పటి చంద్రకిరణములకు జ్ఞాన వికాసశక్తితోఁబాటు వ్యాధిహరణశక్తియు విశిష్టము, గాన శరచ్ఛంద్రకిరణములు సేవములనిరి. శరత్తున వచ్చు నాశ్వి యుజకార్తికపూర్ణిమలందు (గౌరీపూర్ణిమ, నవజ్ఞపూర్ణిమ) సర్వవర్ణములవారును జంద్రు నారాధించు విధి యున్నది. పై రహస్యము నెఱింగిన పెద్దల శాసనమది. ''చంద్రమండల మధ్యగా - జారుచంద్రకళాధారా'' మున్నగు నామములు సర్వాగమతంత్రములందును బ్రసిద్ధములు గదా. మఱియొక విశేషము - ఆ శరత్పూర్ణిమల రెంటను వెలయు షోడశికి 'మహావైసర్గికీ' యని పేరింటిని. విసర్గము= విశేషసృష్టి, వైసర్గికీ సృష్టిశక్తివిశిష్ట కనుకనే యానాటి చంద్రోదయవేళఁబూజించు స్త్రీలను, ''అమ్మా! వ్రతప్రయోజనమేమి?'' అని యడిగినపుడు ''కడపుఁజలువ'' యందురు. అనఁగా వంధ్యాత్వాదిదోషములను దొలగించి సంతాసఫల ప్రదమని భావము. అంతె గాక చంద్రునకుం దమ గోళ్లను జూపుచుఁ జంద్రుని బిలుచుట సభినయించుచు ''చిప్ప చిప్ప గోళ్లు - చిన్నారిగోళ్లు'' అనుచుఁ బాట పాడుచుండు నాచారమునుంగలదు. భావమేమనఁగా శరచ్చంద్రకిరణములందు, షోడశీకళా శోభావిశిష్టత కలదనియు, దాని స్పర్శముచే గోళ్లకు వచ్చు బిప్యమనెడి (పుప్పిగోళ్లు) వ్యాధి తొలగుననియు అట్టి వ్యాధి రాకుండుటయు నగుననియే కదా. మఱి శరచ్ఛుక్లపక్షరాత్రులందుఁ బ్రథమయామమున అమృతకిరణచరణములు సేవ్యము లనెడి వైద్యశాస్త్రోపదేశము క్షయవ్యాధిహరణార్థనియుఁ దోఁచును. ''సూర్యాం హిరణ్యయీం లక్ష్మీ'' మని శ్రీసూక్తము అమ్మను స్తుతించుచున్నది. శ్రీ శ్రియానందనాఘగురుజీ యిట్లు వివరించుచున్నారు:- 1. శ్రు|| ''అర్ద్రాంపుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్యయీం లక్ష్మీం జాతమేదో మ అవహ''|| 2. ''అర్ద్రాం యఃకరిణిం యష్టిం పింగళాం పద్మమాలినీం, చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాతవేదో మ అవహ||'' బ్రహ్మాండమందు జంద్రమండలము బహిర్యాగ యోగ్యము పిండాండమందు ఆజ్ఞాదిసహస్రారాంతమైన చంద్రమండలము అంతర్యాగయోగ్యము. దీని కళలు సూర్య తేజస్సువలన వెల్వడి చంద్రుని సంక్రమించును గావుననే శ్రీమహాత్రిపురసుందరి సూర్యమండలారాధ్యయుఁ జంద్రమండలారాధ్యము నైనది. 'భానుమండలమధ్యగా' భగారాధ్యాయనియు, 'చంద్రమండలమధ్యస్థా'యని సహస్సనామస్మరణము. శ్రీసూక్త మంత్రములందు, 'సూర్యాంహరిణ్మయీం లక్ష్మీం' అనియు 'చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం' అనియు నుతింపఁ బడుటకుఁ గారణమైనది. అహమ్=(నేను) అను సర్వనామమును షోడశీపరముగా నెటు లన్వయింతురు? 'అహమ్' ఎటులు నిష్పన్నమైనది? - పంచాశద్వర్ణములకును ఆదిమము అకారము. శబ్దప్రపంచ సృష్టికి మూలము అకారము. ''అక్షరాణామకారో7స్మి''-గీత కంఠతాల్వాదిస్థానప్రయత్నముచే 'అ' అనునదే సర్వ వర్ణవికారము నొందినది. కనుక అది సృష్టిశక్తి రూపబ్రహ్మ. ''అకారం బ్రహ్మదైవత్వం బీజం స్వాయంభువం'' - బీజనిఘంటువు. ''ఋగ్వేదో గార్హపత్యంచ పృథివీ బ్రహ్మ ఏవ చ అకారస్య శరీరం చ వ్యాఖ్యాతం బ్రహ్మవాదిభిః||'' ఋగ్వేదము, గార్హపత్యాగ్ని, పృథివీలోకము, బ్రహ్మ దేవత అనునవి అకారమశరీరమని బ్రహ్మవాదులు వ్యాఖ్యానించిరి. మాతృకావర్ణమాల యందలి తుదిది హకారాము, ఇది యగ్ని బీజము. బ్రహ్మాత్మకమై యరుణవర్ణము గల హకారము, శక్తిస్వరూపము. శివశక్తి స్వరూపములు ప్రకాశవమర్శాంశములు. శివుని యందలి విమర్శాంశశక్తి వికసించినపుడు స్పందనము కలిగి 'అ-హ' అనెడి రెండు ధ్వనులు (వర్ణములు) పుట్టి, అవి సమసింపఁగా 'అహమ్' అనుమాట నిష్పన్నమైనది. ''అకారాః సర్వవర్ణాద్యః ప్రకాశః పరమః శివః హకారోంత్యః కలారూపో విమర్శాఖ్యః ప్రకీర్తితః అనయోః సారమస్యం యత్తస్మిన్నహ మితీర్యతే||'' - యోగవాశిష్ఠము ఈ 'అహమ్' అను వర్ణద్వయమే పరశివుని స్వరూపము. ఇదియే ఆత్మ. స్వరూపమై విశ్వజీవకోటియందును ఉన్నందున నిదియే బ్రహ్మవస్తువు. సర్వసాధారణముగా మనము యథాకాలయోగ్యముగా భూషితులమై అద్దములో ప్రతిబింబమును జూచికొని 'అయమహమ్' ఈ నేను సంపూర్ణముగా నలంకరించుకొంటిని, ఎట్టి లోపమును లేదు అని సంతృప్తిని జెందుచున్నాము. నిర్మలమైన దర్పణమువంటిది పరాశక్తి. స్వాంశభూత మైనవిమర్శశక్తి యన నద్దములో ఆత్మశక్తిని జూచికొని పరశివుడు 'అయమహమ్' ఈ ప్రతిబింబమును 'నేను' అని తెలిసికొనుచున్నాడు. సమీపమునందు ఎట్టి వస్తువును లేనిచో అంతర్గత ప్రతిబింబప్రకాశమునకు సామర్థ్యముండదు. పరమశివుని సాన్నిధ్యము లేనపుడు అంతర్లీనమైయున్న ప్రపంచోల్లసనసామర్థ్యము పరాశక్తికిని సంభవింప నేరదు. అట్లే పరాసంయోగము లేనిచో పరశివునకును స్వస్వరూపజ్ఞానము కలుగనేరదు. శివశక్తుల అన్యోన్యసామరస్యము చేతనే చరాచరజగత్తు నిర్మింపబడుచున్నది. ''వాగార్థా వివసంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే| జగతః పితరౌవందే పార్వతీపరమేశ్వరా||'' వాక్కునకును అర్థమునకును వలెనే శివశక్తులకును అవినాభావసంబంధము. అహమ్ అనగా ఆత్మ, బ్రహ్మము, షోడశి, శ్రీరాజరాజేశ్వరి. వృక్షమునకు శాఖలవలెనే, ఇచటను నామము, రూపము అను శాఖలు రెండు. రూపముననుసరించి తురీయతురీయమైన న'షోడశీ' యైనది. ప్రకాశబిందువుగా మాఱి విభాగము నొందినది గాన, సృష్టికిదే మొదలు గాన, మూలశక్తి 'అద్యా' యను నామము నొందినది. వంచదశకళలు ఇందు జనించి మఱల నిందే లయమగు చున్నవి. కనుక అద్య. అక్షరమైన, నాశరహితమైన బ్రహ్మానందస్వరూపమగుట నిత్యనిశ్చలమై, స్థిరముగా ఒక్క తీరుగానుండుటచే ధ్రువకళ. షోడశియే యిన్ని నామాంతరముల నొప్పియున్నది శ్రీరాజరాజేశ్వరీ స్వరూప మెట్టిది? ''ఆదిత్యవర్ణం - సువర్ణజ్యోతిః, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాతవేదో మమావహ నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖేవభాస్వరా నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా||'' ''అలౌకిక పరమానందలక్షణాఖండామితాతేజోరాశిః''|| - మహానారాయణోపనిషత్. ''భావాభావకలా వినిర్ముక్తా చిద్విద్యా బ్రహ్మసంవిత్తిః సచ్చిదానందలహరీ మహాత్రిపురసుందరీ బహిరంతరనుప్రవిశ్యస్వయమేకైవ విభాతి|| - బహృచోపనిషత్ ''నిష్కలంకా సమా శుద్ధా నిరహంకారరూపణీ||'' - అన్నపూర్ణోపనిషత్ ''సా బ్రహ్మపరమాత్యేతినాభిః పరిగీయతే||'' - అ||పూ|| ఇత్యాద్యనేక శ్రుతి ప్రమాణములచే సర్వతేజోమయముఆమె స్వరూపము. ''యోనౌ కనకపుంజాభం హృది విద్యుచ్చయోజ్జ్వలం, అజ్ఞాయాం చంద్రసంకాశం మహస్తవ మహేశ్వరి||'' ఇది యోగుల అంతరోపాసానుభవము. సౌభాగ్యవిద్యాహృదయము. సుషుమ్నా గతకమలములు (మూలాధారస్వాధిష్ఠాన మణిపూరానాహతాజ్ఞాసహస్రారములు) రెండేసి కలిసి యొక మండలముగా నిర్ణయింపబడినవి. మూలాధార స్వాధిష్ఠానములు అగ్ని మండలము. మణి పూరానాహతములు సూర్యమండలము. విశుద్ధాజ్ఞలు చంద్రమండలము. ఆపైని సహస్రారాంత బ్రహ్మరంధ్రమువఱకు జ్యోత్స్నా మండలము. ఇదే పరమాకాశము. అగ్ని మండలమందు పుటము పెట్టిన బంగారువన్నెతో, సూర్యమండలమందు మెఱుపుతీవల గుంపువలెను - సువర్ణ రజత కాంతిమిశ్రణముతోను, చంద్రమండలమందు తెల్లని చల్లని పరిణతి నొందిన శరచ్చంద్రకాంతితోను, జ్యోత్స్నా మండలమందు క్షీరనీహారసదృశస్నిగ్ధసుధాకాంతులతోను శ్రీదేవి సాధకులకు దర్శనమిచ్చును. అది యతర్క్యమైన అవాఙ్మాననగోచరమైన అనుభ##వైక వేద్యమైన తేజఃప్రకాశ స్వరూపము. విదియనాటి నెల మనకు గన్పించును. ప్రతిపత్కల యోగులకు మాత్రమే కనుపించును. బ్రహ్మరంధ్రాధోభాగమున ద్వాదశాంతమున జ్యోత్స్నామండలమున జ్ఞానదృష్టి సంపన్నులగు యోగులే షోడశిని దర్శింప గలుగుచున్నారు. 'సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమేవ్యోమ& సో7శ్నుతే సర్వా& కామా స్థ్సహ బ్రహ్మణా విపశ్చితేతి||'' - తైత్తిరీయము పర్యవసానము:- అకారవాచ్యము ప్రకాశబిందువు చంద్రమండలాత్మకము. హకారవాచ్యము విమర్శబిందువు అగ్నిమండలాత్మకము. ఈరెంటి సామరస్యముచేత నేర్పడు 'అహం' అను వర్ణద్వయము శివశక్తులుగాను, అదియే షోడశిగాను నిర్దేశింపబడినది. ''శివశ##క్త్యైక్యరూపిణీ'' - లలితా సహస్రతమనామస్మృతి ప్రకాశబిందువు చంద్రమండలముశుక్లవర్ణము; విమర్శ బిందువు అగ్ని మండలమురక్తవర్ణమ; ఈ రెండిటి సామరస్యము రక్తశుక్లవర్ణమిశ్రణము. స్థూలముగా దేవీవర్ణము రక్తశుక్ల ప్రభామిశ్రము. ఇదెగురుపదద్వంద్వము. సర్వవ్యాపక (ప్రకాశ విమర్శ) శక్తి యుగళము. కావుననే యట్లు వర్ణితము. ''వందే గురుపదద్వంద్వమవాఙ్మానసగోచరం, రక్తశుక్ల ప్రభామిశ్ర మతర్క్యం త్రైపురం మహః||'' కామేశ్వరీకామేశ్వరదివ్యదద్వంద్వమే గురుపదద్వంద్వము. గురుదేవతల నభేదబుధ్దితో పూజింప గల్గునపుడే యథార్థగురు లాభ##మైనటు లెన్నవలయును. స్వగురుదేవుల నట్టి భావనతో బూజించుట ఆ సదాతనశ్రీగురునారాధించుటే యగును. అదే తరణోపాయము. ''క్షీరసముద్రజాత రమ, శీతనగాత్మజ గౌరి నా, సహ స్రారమునందుదోఁచు భవదాకృతులే; అటనైన క్షీరనీ హారములన్న నీదు చరణామృతమే కదె, శైత్యమాధురీ సారరసాంచితౌషధ మసారభవామయదారకంబుమా!||'' - శ్రీ శ్రియానందనాథ. అ|| ము|| ఆదియం దేకవస్తువుగా నుండిన ప్రకాశవిమర్శశక్తులు కార్యార్థమై విభాగమునొంది చంద్రాగ్ని మండలము లైనవి. మఱి మూడవది యగు సూర్యమండల మెటులేర్పడినది? ఇది సూక్ష్మముగా - విచారింపదగిన విషయము. అవధాన మావశ్యకము. పగలు సూర్యుడు తీక్షణముగా వెలుగునపుడు అతని కెదురుగా నొక యద్దమును బెట్టుడు. ఏమి జరుగును? సూర్య కిరణములు అద్దముచే ప్రతిహన్యమానములగును గదా. సరే. దానిని సమీపమందున్న గోడపైన కేంద్రీకరింపుడు. ఇప్పుడేమి కనుగొందువు? అద్దము నుండి ప్రతిహస్యమానములైన కిరణములు గోడపై ప్రసరించి దానిని తేజోవంతముగా చేయుచున్నవి. ఇపుడు మనము మూడు వస్తువులను జూచుచున్నాము. ప్రధానమైన సూర్యబింబ మొకటి. అద్దముందలి ప్రతిబింబమొకటి. గోడపై కేంద్రీకరింపబడిన తేజోవంతమైన బింబప్రతిబింబ మొకటి. ప్రకాశైకస్వరూపుడు పరశివుడు సూర్యుడు. విమర్శాంశమగు స్ఫురణశక్తి యనెడి యద్దమునందు ఆత్మశక్తిని ప్రతిఫలింపజేయుచున్నాడు. ఇప్పుడు ప్రకాశ విమర్శాత్మకమైన మఱియొక మిశ్రబిందువు ఉత్పన్నమగుచున్నది. బ్రహ్మాండమందిదియే సూర్యమండలము. పిండాండమందిదియే జీవాత్మ. పరశివుడు ఆత్మ; పరాశక్తి ఆభాస; జీవుడు ఆశ్రయము. పరశివుడు పరాశక్తి యను ఉభయులలో ఒకరు ఆత్మ; మఱి యొకరు అభాసము. అగుచో, సృష్టికి ఇరువురును సమాన కారణభూతు లెటులగుచున్నారు? పైనుదాహరించిన మిశ్రబిందువునకు సూర్యుడును అద్దమును కారణములు. ఈ రెంటిలో నేది లేకున్నను మిశ్రబిందువేర్పడుట సంభవింపదు గదా. పరాశక్తియు పరశివుడును అన్యోన్యసారమరస్యముచే సమానధర్మము గలవారై జగదుత్పత్తి చేయుచున్నారు. ''శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘం అతః శేషః శేషీత్యయ ముభయసాధారణతయా స్థితః సంబంధో వాంసమరసపరానంద పరయోః||'' - సౌందర్యలహరి. ''భగశశువే కుచద్వయిగ భాసిలు శంభుశరీరమీవె; ఓ భగవతి ! చక్రవిగ్రహ ! భవ త్తనువుందలంతున్నవాత్ముగా; ఒగిఁబర సౌఖ్యచిత్సమతయెప్పెడి మీకు సమానమౌచునే తగియెడుప్రధానముఁ బ్రధానమునాఁదగులంకెయిందుచే. - శ్రీ శ్రియానందనాథ. అతడు ఆనందభైరవుడు, పరానందుడు; ఆమె ఆనంద భైరవి, పరాశక్తి; ఒకరు ప్రధానులు; ఒకరు అప్రధానులు; ఒండొరులు సామర్యముచే శేషి శేషభావము నొందు చున్నారు. శేషి శేషభావమనగా నేమి? - శేషిత్వము ప్రధానత్వము. శేషత్వము అప్రధానము. ముఖ్యవస్తువుపై ఆధారపడి యుండి గ్రస్తమైనది. నవాత్ముడు శివుడు, ఇచట ఆత్మయనగా వ్యూహము. అనగా స్వరూపము. సవాత్ముడనగా తొమ్మిది (వ్యూహములు) స్వరూపములు గలవాడు. అవి 'కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, బిందు, నాద, కలా, జీవములు.' శ్రీ శ్రియానందనాథగురుజీ - యీ నవాత్మలను దమ సౌందర్యలహరియందిటులు ఉల్లేఖించిరి. 1) కాలవ్యూహము - నిమేషాది కల్పాంత పరిచ్ఛేద కల్పనము. సూర్యచంద్రులకును గాలావచ్ఛేద ముండుటచేఁ గాలవ్యూహమం దంతర్భూతము. 2) కులవ్యూహము - నీల శ్వేతాదివర్ణ వ్యూహము. 3) నామ వ్యూహము - ఘటపటాది సంజ్ఞాస్కంధము. 4) జ్ఞానవ్యూహము - దీనికే భాగవ్యూహ మందురు. ఇది రెండు తెగలు, సభాగము - విభాగము నని. సభాగము సవికల్పము. విభాగము నిర్వికల్పము. 5) చిత్తవ్యూహము - అహంకార, చిత్త, బుద్ధి, మహన్మనస్సులు. 6) నాదవ్యూహము - పరా, పశ్యన్తీ, మధ్యమా, వైఖరీరూపము. 7) బిందువ్యూహము - షట్చక్రసముదాయము, మూలాధారాదికము. 8) కలావ్యూహము - అకారాదిపంచాశద్వర్ణరూపము. 9) జీవవ్యూహము - జీవాత్మ సముదాయము. ఇదే భోక్తస్కంధము. ఈ నవవ్యూహములును ఆత్మగా - స్వరూపముగాఁ గలవాఁడు నవాత్ముఁడు, పరశివుఁడు, ఇటలే పరాశక్తియు నవవ్యూహాత్మిక. ''చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః||'' - సౌందర్యలహరి ''నలువగు శైవకోణములు నాలుగు, నీవి యొకైదు, బిందువు& గలియక, మూలహేతువు లనందగు తొమ్మిదియైన వానిచే||'' - శ్రీ శ్రియానందనాథ. శ్రీచక్రరాజనిలయ పరాశక్తి; శ్రీచక్రమున క్రిందుగా శీర్షికలు గల కోణములు నాలుగు. అవి శివకోణములు, మీదుగా శీర్షికలు గలవియైదు. అవి శక్తికోణములు. వెరసి తొమ్మిది; అవే తొమ్మిది వ్యూహములు. ఇవె ప్రపంచ నిర్మాణ కారణములు, గాన వీనిని యోనులందురు. అవె పిండాండనిర్మాణమునకైన తొమ్మిది ధాతువులు. చర్మకర్త మాంసమేదో7స్థులు శక్తిజాతములు. మజ్జా శుక్లప్రాణ జీవములు శివజాతములు. పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనస్సు అను నిరువదికయొకటియు శాక్తములు. మాయా, శుద్ధవిద్యా, మహేశ్వర, సదాశివులు; ఈ నాలుగు శైవములును, శాక్తము లిరువది యొకటియు వెరసి ఇరువది యైదు. ఈ పంచవింశతి తత్త్వములు చేరిన తొమ్మిది కోణములే బ్రహ్మాండ పిండాండ నిర్మాణహేతువులు. అధోయోనులు నాలుగు, వామా, జ్వేష్ఠా, రౌద్రీ, అంబికలు, ఊర్ధ్వయోనులు అయిదు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, శాంతా, పరాశక్తి స్వరూపములు. నవవ్యూహాత్మకత్వము ఆనందభైరవి, ఆనందభైరవులకు సమానము కనుక ఒకరికంటె ఒకరికి ఎక్కువతక్కువలు లేవు. ఇరువురుం గలిసియే పూర్ణమనిపించుకొను చున్నారు. కనుకనే శేషిశేష సంబంధము ఉభయసాధార అనగా శివ శక్తుల యేకత్వము ఆధారాధేయ భావములు అన్యోన్యత యున్నది. కనుక శివశక్తిస్వరూపమైన శ్రీచక్రము శివాశివుల శరీరమైనది. కనుక 'శ్రీచక్రం శివయోర్వపుః అందలి ఆత్మపరశివుడు. అతడు అర్థము, ఆమె వాక్కు; అతడు శక్తిమంతుడు, ఆమె శక్తి; అతడు పరుషుడు, ఆమె ప్రకృతి; అతడు స్థాణువు, ఆమె చైతన్యశక్తి; అతడు ఇచ్ఛ, ఆమె క్రియ; అతడు కుసుమము, ఆమె తావి; ఆమె జ్ఞానస్వరూపరాశక్తి, అతనియందు అంతర్లీనయై నిష్క్రియాత్మికయై యుండును. ఒక్కొకప్పుడు దివ్యతేజఃపుంజముచే విజృంభించి క్రియారూపమున ప్రస్ఫుట యగుచుండును. ఆమె లేనిచో అతనికి ఆస్తిత్వమే లేదు. శక్తిరూపములైన అచ్చులు (సర్వములు - ప్రాణములు) సంయోజితములు కానిచో శివరూపములైన (శివాంశములైన) హల్లులకు స్పష్టోచ్చారణమే లేదు. కనుకనే హల్లులు ఆ ప్రాణములు. శక్తి యను పదములోని ఇకారము సంయోజితము కానిచో 'శివ' యను పదము 'శవ'మై పోవును గదా! విమర్శాంశమగు నామె యంతర్లీన యగుటచేతనే అతని స్వరూపము అభివ్యక్తమైసర్వప్రాభవములను పొందగలుగుచున్నది. 'శిశఃశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం, న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి||'' - సౌందర్యలహరి ''శివుడు& శక్తిని నిన్నుఁగూడినపుడే చెల్లున్నిభుత్వము, శ క్తి వియుక్తి& గదలంగనైనఁగలఁడే దేవుండె కానిమ్ము||'' - శ్రీ శ్రియానందనాథ. సనాతన దంపతులగు శివశక్తుల సమ్మేళనము చేతనే సమస్త చరాచర జగత్తును 'శాక్తము' అని, 'శైవము' అని పిలువఁబడుచున్నది. అపురాణదంపతుల లీలావిభూతి సృష్టి, చక్షుర్గో చరమగునదంతయు శక్తిస్వరూపము. తదభిన్నమగు అవ్యక్తము పరశివస్వరూపము. శ్రు|| యధోర్ణనాభిః సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయః సంభవన్తి యథా సతః పురుషాత్కేశలోమాని తథా7క్షరాత్సంభవతీహ విశ్వమ్|| - మండకోపనిషత్. ఆత్మయొక్క ఇచ్ఛాశక్తి, క్రియారూపమైన తంతువుచే సాలెపురుగు పరివేష్టించుకొని యుండి మఱల స్వాత్మయందే లీనము చేసికొనుచు నిమిత్తమును ఉపాధానమును (దానే) ఒక్కటే యగుచున్నది. ఓషధివనస్పతులును, నీవారాదిధాన్య ములును భూమినుండి పుట్టుచున్నవి. చేతనుఁడగు పురుషుని యందు శిరమునుండి కేశములు, తక్కు శరీరావయవముల నుండి లోమములు పుట్టుచున్నవి. (ముండక) అటులే స్వాంతర్గతవిమర్శాంశయగు పరాశక్తి సామరస్యముచే సృష్ట్యాది కార్యములు చేయుచున్నాడు శ్రు|| న శివేన వినా దేవీ దేవ్యా చన వినా శివః, ఏతయోరంతరం నాస్తి చంద్రచంద్రిక యోరివ|| నెలకును వెన్నలకునువలె శివశక్తులకు విడరాని సన్ని హితత్వ మున్నందున ఇరువురును సృష్టికార్యమునందు సమాన కారణభూతులగుచున్నారు. ''త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభో రపరమపి శంకే హృతమభూత్, యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రిణయనం కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటమ్||'' - సౌందర్యలహరి ''అరుణిమ యొప్పి, ముక్కును దై, చనుబర్వున వంగినట్టిదై యరనెలతోడి మౌళిగలదై, యలరారెడి నీదు రూపమే నరసి, తలంతు డాపలి హరార్థము లోఁగొని, తన్వి తీఱకా యొరుపుసగంబు సైతము హరించితివో, యని శంభుకామినీ!'' - శ్రీ శ్రియానందనాథ ఎఱ్ఱని రంగు, ముక్కనులు, నెలవంకతోడి కిరీటము, చనువ్రేగుననైన వంగు గలదై యొప్పు నీరూపము చూడగా శివుని యెడమ భాగమును హరించియు తనివి తీఱక తక్కుసగమును లోగొంటివను శంక గలుగుచున్నది. ఇదియుత్తరకౌళమతము. ఈ తెగ శాక్తులు, శివతత్త్వము శాక్తతత్త్వమునందు లీనమై పోవును గాన, శక్తిత్త్వము కంటె వేఱుగా శివతత్త్వము లేదనియు, అదే యుపాస్య మనియు నందురు. ''సదాపూర్వఃసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ స్తవాజ్ఞామాలబ్య క్షణచలితయో ర్భ్రూలతికయోః|| శ్రీమాత బొమ్మసన్న చే సదాశివుడు చరాచరజీవకోటి ననుగ్రహించుచున్నాడు గాన, పరశివునికింగన్న పరాశక్తికే శాక్తబంధువులు ప్రాధాన్యము నిచ్చుచున్నారు. ''శివుఁడన నీవు; శక్తి యనఁజెల్లుదు వీవ; అవిద్యవీవు; వి ద్యపు; సమయాఖ్య వీవు; అది తాల్చిన దానపు, ఆత్మవీపు, దీ క్షవు; నణిమాదులీవు; నినుఁగాదని వేఱొకఁడేది? సర్వమై తివి; పరతత్త్వ మోభగవతీ! కనరాదిక మాకు వేఱుగా.'' - శ్రీ శ్రియానందనాధ