శ్రీరామః శరణం మమ
అభిప్రాయము
మహారాజశ్రీ మఱ్ఱిపాటి వెంకటనరసింహారావుగారిచే రచింపబడిన శ్రీతత్త్వమును అమూల్యగ్రంథమును శ్రీ సాధన గ్రంథమండలివారి పంపున నందుకొంటిని. వ్యవధి తక్కువగా నున్నను ఆ మూలచూడముగా గ్రంథమును దిలకించకతప్పినది కాదు. గ్రంథస్థవిషయము మహోదా త్తమగుటవలన నింకను నింకను జూచిచూచి చర్వణము చేయఁదగియే యున్నది.
సాంప్రత సాంప్రదాయము ననుసరించి పరిజ్ఞాతల యభిప్రాయములను సేకరించుట మాత్రమేగాని, రవివలె స్వయం ప్రభతో వెలుగొందు నీ గ్రంథరాజమే 'శ్రీతత్త్వ' నామముతో శ్రీతత్త్వ ప్రకాశమును నిగూఢమోక్షప్రద శ్రీతత్త్వ జిజ్జాసవులకుఁ బరవిద్యాప్రబోధకమగుచు, స్వతః ప్రమాణములగు వేదములవలె విషయవిశేష నిర్విశేష చిన్మాత్ర చిచ్ఛక్తి యుత బ్రహ్మనిరూపణచే స్వయం విరాజమాన మగుచు. నీ 'శ్రీతత్త్వము' పండితాభిప్రాయముల నపేక్షింపలేదని నా యభిప్రాయము.
'తీర్థమునకుఁదీర్థము ప్రసాదమునకుఁ బ్రసాదము' అను నట్లు ఉపనిషద్విద్య (బ్రహ్మవిద్య) వేరు, శాక్తవిద్య (శ్రీవిద్య) వేరని యభిప్రాయపడుచుఁ బరస్పర వివదమానయై లక్ష్యసిద్ధికి దూరమైన లోకమును 'న శివే న వినా శక్తిః న శక్త్యా చ వినా శివః' అనినట్లు శివశ##క్త్యైకమును బ్రతిపాదించి, పరశివాను గ్రహమున నెపరాశక్తి యొక్క కటాక్షము, తత్కటాక్షముననే యపరోక్ష సాక్షాత్కారము అని ముక్తకంఠముగా విద్యాద్వ యైక్యమును ససామరస్యముగా సప్రమాణముగా సయుక్తికముగా ప్రతిపాదించి విభిన్నవాదుల నుద్ధరించిరి.
గృహమునకు యజమాన శుద్ధి యెంత యగత్యమో శిష్యునకు గురుశుద్ధి యంత యత్యావశ్యకము. శ్రీమఱ్ఱిపాటి వెంకట నరసింహారావుగార్కి అట్టి బోధగురువు శ్రీ శ్రీ శ్రీ శ్రియానందనాథులు లభించినారు. లోకమున బాధగురువులు తండోపండములుగా దొరుకుదురుగాని పరదేవీ కటాక్షపాత్రులై అపరోక్ష సాక్షాత్కారానుభూతిని గడించి శిష్యుని సర్వసంశయ విచ్ఛేదమును జేయగల పరాపరావిద్యల నుపదేశించి యద్వైతాత్మ నందుకొనునట్లు భోధించు గురువురు దుర్లభులు కదా! బహుజన్మార్జిత పుణ్యసంచయ మహాఫలము సద్గురూపలబ్ధి. కావుననే ఈ శ్రీతత్త్వగ్రంథకర్తలు గ్రంథకర్తలు కాగల్గిరి. దుర్బోధము, సుసూక్ష్మమగు బ్రహ్మవిద్యను నానామత నానా గ్రంథ ప్రస్తార ప్రదర్శన పూర్వకముగా సులభ##శైలిలో బోధించిరి గ్రంథ కర్తలు. ఏతద్గ్రంథమును దమ గురుపాదుల దివ్యపాదసన్నిధి నంకితమొనర్చుట వీరి యచంచల నిర్వ్యాజ గురుభక్తిని బ్రకటించుచున్నది. ''న గురో రధికం తత్త్వం న గురోరధికం తపః'' అనికదా భారతీయార్ష సంప్రదాయము! ఈ విశేషముచే శ్రీ మఱ్ఱిపాటివారు లోకమాన్యులు కాకతప్పదు.
అజుఁడు కర్మవాసనా ప్రాబల్యముచే నేకజుడు కాగా, వానికి ద్విజత్వ, త్రిజత్వ, తుర్యజత్త్వాది సిద్ధిద్వారా తిరిగి అజత్వసిద్ధికై వలయు సాధన పరికరముల శ్రీ వెంకటనరసింహారావుగారు సమ్యకృథమున సులభాతిసులభముగా నిరూపించిరి. భారతజాతి మాతృగర్భమునుండి ఆకాయము సంస్కారములచే సుసంస్కృతమగుచునే యుండును. ఇది వేదివిధి. తత్ర్కమమున నుపనయసంస్కారమున త్రిపదాగాయత్రీరూప బ్రహ్మోపదేశము కాగా ద్విజత్వసిద్ధి కలుగును. గాయత్రీతురీయ పాదోపదేశమున త్రిజుఁడు కాగలుగుచున్నాఁడు. పాచతుష్టయము వ్యాహృతి త్రయమును ప్యుత్క్రమమున లయమగుచు అర్థనూ త్రాక్షరయగు ప్రణవమున లయమగును. అట్టి ప్రణవోపదేశమున తుర్యజుడై తద్భావనా భావిత చిత్తము అర్థమాత్రాక్షరలక్ష్య సచ్చిదానంద పరబ్రహ్మయందు లయముకాగా స్వస్వరూప స్థితి - అనగా నజత్వసిద్ధి కలుగునను యంశమును సుస్పష్టముగా ప్రతిపాదించిరి. ఉపనయనమననేమో, గాయత్రీ మంత్రార్థమెట్టిదో, చతుర్వింశత్యక్షర సంకేతమెందులకు వొడమెనో పంచదశీ షోడశాక్షరీమహావిద్యల స్వరూపస్వభావము లేప్రకారమయినవో వాని నిగూఢార్థములను విద్యారణ్య, సాయణశంకరాచార్య, శాక్తసాంప్రదాయసిద్ధి భాష్యప్రమాణములతో నిస్సంశయముగా ప్రతిపాదించి తత్త్వజిజ్ఞాసువులకు మహోకార మొనరించిరని విన్నవించుట అతిశయోక్తి కానేరదు.
శివశ##క్త్యైక్య ప్రతిపాదనా సందర్భమున త్రిపురసుందరీ రాజరాజేశ్వరీ, బాలా, శ్రీమత్సింహాసనేశ్వరీత్యాది పద నిర్వచనములు అత్యన్త శాస్త్రసమ్మతములయి మిక్కిలి హృదయంగమములై అజ్ఞజనాకర్షణీయములై శివాశివుల యభీన్నత్వమునకు (ఐక్యమునకు) దోహదము లగుచున్నవి.
ఈవిధముగా అప్రాణములైన హల్లులతో ప్రాణములగు అచ్చులు కలిసి ముఖసుఖోచ్చారణనుకూల్యమును సంపాదించునట్లు మాతృవాచకమగు ఇకారముతో గూడిన శవుడు శివుడు కాగలుగుచున్నాడని శివశక్తి పరమైక్యతారూప శ్రీ విద్యారహస్యమును 'శ్రీతత్త్వ' గ్రంథము ద్వారా లోకమున కందజేసిన శ్రీ మఱ్ఱిపాటి వేంకటనరసింహారావుగారు ఎంతధన్యులు! ఈ మహనీయులు శ్రీమత్సింహాసనేశ్వరీ దివ్యమంగళ కటాక్షవీక్షణమున కత్యంతపాత్రులయి శ్రీ శ్రీ శ్రీ శ్రియానందనాథ గురువులవారి యనుగ్రహమున చిరాయురారోగ్యైశ్వర్యాభివృద్ధులు కలవారై యితోధిక గ్రంథముల రచించుచు నిద్రాణావస్థయందున్న లోకమును మేల్కొల్పుదురు గాక!
శ్రీభావనారాయణస్వామి ఇట్లు
సంస్కృతక కళాశాల ధర్మాలసుబ్బారాయశాస్త్రీ
పొన్నూరు (వ్యాకరణ వేదాన్తాచార్యుడు)