SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌ సత్‌

శ్రీగణశాయనమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణనమః

4. ప్రశ్నోపనిషత్తు.

శాంతిపాఠము:- గురువుయొద్ద అధ్యయనముచేయు శిష్యుడు తన గురువు, సహాధ్యాయులు, మానవ మాత్రుల కర్యాణముకొరకు దేవతలను ప్రార్థించుచున్నాడు. దేవతలారా! మాకర్ణములు నేత్రములు ఎల్లపుడు కళ్యాణ వచనములనే వినుచు, చూచుచుండగాక, అమంగళకరమగువస్తువులపై మామనస్సు ఆకర్షింప బడకుండుగాక. మా జీవితము ప్రమాద రహితముగా దేవ కార్యములయందు సదా లగ్నమగు గాక, దేవరాజగుఇంద్రుడు, సర్వజ్ఞుడగు పూష, అరిష్ఠ నివారకతార్యుడు (గరుత్మంతుడు) బుద్ధికి స్వామి బృహస్పతి వీరందరు భగవానుని దివ్యవిభూతులు వీరు సదా మాకళ్యాణ పోషణము ద్వారా ప్రాణుల కళ్యాణము జరుగుగాక, ఆధ్యాత్మిక, అధిదైవిక, అధి భౌతిక సర్వతాపములచే శాంతి కలుగుగాక.

ప్రధమప్రశ్న:- ఓంకారస్వరూపుడగు పరమాత్మనుస్మరించుచు ఉపనిషత్తు ఆరంభింపబడెను. భరద్వాజపుత్రుడు సుకేశుడు, శిబికుమారుడు సత్యకాముడు, గార్గ్యగోత్రోద్భవుడు సౌర్యాయణి, కోసల దేశవాసి ఆశ్యలాయనుడు, విదర్భదేశస్థుడు భార్గవుడు, కత్యుని ప్రపేత్రుడు కబంధీయను. నీయార్వురు వేదాభ్యాస పరాయణులు, బ్రహ్మనిష్ఠులు. వీరు పరమేశ్వర జిజ్ఞాస చే పిప్పలాదుడను మహర్షిని సమిత్సాణులై సమీపించి పరబ్రహ్మ సంబంధమగు విషయములు తెలియగోరుచున్నాము. దయచేసి మాకు తెలుపుడని ప్రార్థించిరి.

2) జిజ్ఞాసువులైన ఈయార్వురనుచూచి పిప్పలాదమహర్షి వారిని ఒక సంవత్సరకాలము తపమొనరించి పిమ్మట మీరు కోరినది ప్రశ్నించిన నాకు తెలిసినంతవరగకు చక్కగా బోధపరచి చెప్పుదుననెను.

3) మహర్షి పిప్పలాదుని ఆజ్ఞానుసారము శ్రద్ధా పూర్వకముగా బ్రహ్మ చర్యము నవలంబించి తపస్సుచేసిరి. మొదట కాత్యఋషి ప్రపేత్రుడు కబంధి. శ్రద్ధావినయ పూర్వకముగా నిట్లు ప్రశ్నించెను. హేభగవాన్‌! ఎవరి నుండి ఈ సంపూర్ణ జగత్తు నానా రూపముల ఉత్పన్నమగునో ఆ సునిశ్చితకారణము ఎవరు?

4) సమస్త ప్రాణులకు స్వామియగు పరమాత్మ సృష్ట్యాదిన ప్రజోత్పత్తికి సంకల్పించెను. సంకల్ప తపోబలముచే "రయి" ప్రాణము" అను జంటను ఉత్పన్నము చేసెను. సర్వజీవన ప్రదాత సమిష్టి జీవనశక్తియే ప్రాణము. ఈ జీవనశక్తి నుండియే ప్రకృతి స్థూలరూప భూత సముదాయము. 'రయి' . ఇది ప్రాణరూప జీవనశక్తిచే అనుప్రాణితమై కార్యషీమత కలిగియుండును. ప్రాణము చేతనము, రయిశక్తి లేక ఆకృతి. ధన ఋణతత్వముల వలె ప్రాణ రయి సంయోగముచే సమస్త సృష్టికార్యము.సంపన్నమగును. వీనినే అగ్ని- సోమము, పురుషుడు-ప్రకృతి అనుపేర్ల పిలిచెదరు.

5) ప్రాణ రయి శక్తులను వేర్వేరుగా చెప్పలేము. అయినను జీవన ప్రదాత చేతన శక్తి అధికముగాగల సూర్యుడు ప్రాణము. స్థూల తత్వపుష్టికర భూత తన్మాత్రలు. అధికముగానుండుటచే చంద్రుడేరేయి. ఈ రెండుతత్వములు మనశరీరమున ప్రతి అంగమున సూర్యరూపజీవశక్తి, మాంసమేధారూప స్థూల తత్వమే చంద్రుడు.

6) సూర్యోదయమగుటతోడనే సర్వప్రాణులయందు స్పూర్తి దాయక జీవన శక్తి సూర్యకిరణ ప్రసారమునలభించును.

7) ప్రాణుల శరీరమందు, జఠరాగ్ని రూపమున అన్నపచనము చేయు వైశ్వానరుడు సూర్యుడే, పంచ ప్రాణములు సూర్యాంశ##లే.

8) సహస్ర కిరణుడగు సూర్యుడు జగత్తు నందు ఉష్ణము, ప్రకాశము వ్యాపింపజేసి అందరికి జీవన ప్రదానము చేయును. సూర్యుని నుండియే రూపము, రంగు, ఆకృతి ఉత్పన్నమైప్రకాశించును. ఋతుపరివర్తనము ద్వారా మననానావిధ అవసరములను తీర్చి సమస్త సృష్టికి జీవనదాతయగు ప్రాణమే సూర్యరూపమున ఉదయించుచున్నాడు.

9) పండ్రండు మాసముల సంవత్సరము. కాలరూపపరమేశ్వరుని స్వరూపము. ఇందు దక్షిణాయనము రేయి. ఉత్తరాయణము ప్రాణము. సంతానాది కోరిక గలవారు యజ్ఞయాగాదుల ద్వారా దేవబ్రాహ్మణ పూజ లొనరించి లోకోపకారమునకు బావులు త్రవ్వంచుట, ధర్మశాలలు, విద్యాలయములు, ఔషధాలయములు, పుస్తకాలయముల స్థాపన ద్వారా పుణ్యకార్యము లొనరించి, స్వర్గాదిపుణ్యలొకములు, చంద్రలోకము పొంది కర్మ ఫల భోగానంతరము ఈలోకమునకు తిరిగి వత్తురు. ఇదియే పితృయానము.

10) నిష్కామోపాసకులు శ్రద్ధా పూర్వకముగా బ్రహ్మచర్యము నవలంబించి ఆధ్యాత్మవిద్యద్వారా అనుకూలసాధనల చేసి ఆత్మ స్వరూప బ్రహ్మను నిష్కామముగా ఉపాసించి, ఉత్తరాయణ మార్గమున సూర్యలోకమును పొంది పరమాత్మను పొందెదరు. అట్టి వారికి పునర్జన్మలేదు. సూర్యుడే పరమాత్మ.

11) సప్తవర్ణ కిరణములతో, వసంతాది ఆరు ఋతువులు ఆకులుగాగల ఏక చక్రరధముపై ఆత్మ రూపమున, వెలుగొందు పరమాత్మయే ఉపాస్యదైవము. సూర్యుడే జీవన (నీరు) ప్రదాత. 12 మాసములు ద్వాదశాదిత్యరూపములు.

12) మాసమే ప్రజాపతి రూప పరమేశ్వరుని ఉపాసించు విధము. కృష్ణ పక్ష 15 దినములు భోగమయ 'రయి' రూపము. సకాములు కృష్ణ పక్షము ద్వారా స్వర్గాది లోకములు పొంది తిరిగి జన్మింతురు. నిష్కాములు జీవన ప్రదాతయగు సూర్యమండలస్థ పరమాత్మను ఉపాసించి శుక్ల పక్షమార్గమున పరమపదము పొందెదరు.

13) దివారాత్రములు పరమేశ్వరుని పూర్ణరూపము. ఇందు దినము ప్రాణము, రాత్రిరేయి. భోగరూప రాత్రియందు నియమాను సారముగా ఋతుకాలమున నిజధర్మపత్నిని కలసి సుఖించి సత్సంతానము పొందవలెను. అట్లు చేసినది బ్రహ్మచర్యము క్రింద లెక్కకువచ్చును.

14) ప్రాణులకు ఆహారరూపఅన్నమే ప్రజాపతి. దీనినుండి వీర్యము ఉత్పన్నమై, దానినుండి సమస్త చరాచర ప్రాణులు ఉత్పన్నమగను.

15) సంతానోత్పత్తిరూప ప్రజాపతి వ్రతానుసారము, శాస్త్ర విహిత శుభకర్మలు చేయుచు నియమాను సారముగా స్త్రీ సంయోగ భోగమనుభవించి పుత్ర, కన్యల ఉత్పత్తిద్వారా ప్రజావృద్ధి చేయుదురు. నిష్కాములు బ్రహ్మచర్యమవ లంబించి తపాదుల ద్వారా సత్య స్వరూప పరమాత్మనుపొందెదరు.

16) కుటిలత లేసమైననులేక, అసత్య భాషణ ఆచరణాదులకు దూరముగానుండి రాగ ద్వేష వికారములు లేక విశుద్ధ వర్తనము. కలవారికే బ్రహ్మలోక ప్రాప్తి కలుగును.

ద్వితీయప్రశ్న

1) భార్గవ ఋషి పిప్పలాదుని ఈవిధముగా ప్రశ్నించెను- ప్రాణుల శరీర ధారణ చేయు మొత్తము దేవత లెందరు? (2) వారిలో ఎవరెవరు దేనిని ప్రకాశింప జేయుదురు? (3) వీరందరి లో మిక్కిలి శ్రేష్ఠుడెవరు?

2) సర్వులకు ఆధారము ఆకాశరూప దేవత, కాని దీనినుండి ఉత్పన్నమైన వాయు, అగ్ని, జల, పృధ్వి మహాభూతములు శరీరమును ధారణ చేయును. వీనినుండే స్థూల శరీరము ఉత్పన్న మైనది. ఇవి ధారక దేవతలు. పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, మొత్తము 14 దేవతలు శరీరమును ప్రకాశింప జేయుదురు. ఈదేవతల దేహధారణ ప్రకాశితము చేయు ప్రకాశక దేవతలు, ఒక మారు ఇవి తమలో తాము కలహించి అభిమాన పూర్వకముగా నేనే ఈ శరీరమును ధారణ చేసి ప్రకాసింపజేతుననేను.

3) ఇట్లు వీరు కలహించు కొనుచుండ ప్రాణము ఇట్లనెను. మీరు అజ్ఞానవశమున వివాదము చేయ వద్దు. మీలో ఎవరికి ఈ శరీరమును ధరించి సురక్షితముగా నుంచు శక్తి లేదు. నేను ప్రాణ, అపాన, సమాన, ద్యాన, ఉదాన రూపమున విభక్తమై ఈశరీరమునకు ఆశ్రయమిచ్చి రక్షించుచున్నాను.

4) ఈ మాటలపై విశ్వాసములేని ఆ దేవతల చూచి తన ప్రభావము చూపుట కొరకు, సావధానపరచుటకు అభిమానముతో కోపగించి బయలు వెడలసాగెను. మిగిలిన దేవతలందరు ప్రాణముతోనే బయటకు వెడల సాగిరి. ప్రాణము తిరిగివచ్చి స్థిరమగుటతోడనే మిగిలిన దేవతలందరు స్థిర పడిరి. తేనటీగల రాజు బయలు వెడలిన మిగిలిన వన్నియు బయలు వెడలును, తిరిగివచ్చి కూర్చుండిన మిగిలినవియు కూర్చుండును. మిగిలిన దేవతల స్థితి కూడా అటులనే యుండెను. అంతట వారు విశ్వాసముతో ప్రాణమే శ్రేష్ఠమని తలచిస్తుతింపసాగిరి.

5) వాణి మొదలగు దేవతలు ఇట్లు స్తుతించిరి ఈ ప్రాణమే అగ్ని రూపమును ధరించి తపించును. ఇదియే సూర్యుడు, మేధ, ఇంద్రుడు, వాయువు, పృధ్వి ,రయి, సత్‌ అసత్‌ కంటె శ్రేష్ఠ పరమాత్మ ఈ ప్రాణమే.

6) రధ చక్రము యొక్క ఆకులు నాభిని ఆశ్రయించుకొని ఉండునటుల ఋగేవేద ఋచులు, యజుర్వేదమంత్రములు, సామ వేదము, యజ్ఞాది శుభకర్మలు. బ్రహ్మ క్షత్రియాది అధికారులు. వీరంతా ప్రాణాధారమును ఆశ్రయించియున్నారు.

7) హేప్రాణమా! నీవు ప్రజాపతివి. నీవేమాతృగర్భమున సంచరించు మాతా పితృరూప సంతానముగా జన్మింతువు. సమస్త జీవులు నీకేకానుకలు సమర్పించును. నీవే అపానాదిప్రాణ రూపమున శరీర మందు ఉందువు.

8) హేప్రాణమా! నీవు దేవతల కొరకు హవిస్సు అందజేయు ఉత్తమ అగ్నివి, పితరులకు స్వధా, అధర్వ, ఆంగిరసాది, ఋషుల ద్వారా ఆచరిత సత్యమునీవే.

9) నీవే సర్వశక్తి మయ ఇంద్రుడవు. ప్రళయకాలసంహర్త రుద్రుడవు. సర్వరక్షకుడవు. అంతరిక్షమున విహరించు వాయు, అగ్ని, నక్షత్ర, చంద్రాది జ్యోతిర్గణముల స్వామియగు సూర్యుడవు.

10) నీవు మేఘరూపమున వర్షించి మా జీవన నిర్వహణకు వలయు అన్నము ఉత్పన్నము చేయుదువు.

11) నీవు స్వభావము చేతనే శుద్ధుడవగుటచే సంస్కారరూపక శుద్ధి అవసరములేదు. నీవు అందరిని పవిత్రము చేయు సర్వశ్రేష్ఠ ఋషివి. మేము నీకొరకు భోజన సామగ్రిని అర్పింతుము. నీవు సమస్త విశ్వమునకు ఉత్తమ స్వామివి. నీవే మాతండ్రివి. నీ నుండి యే మా ఉత్పత్తి జరిగినది.

12) హే ప్రాణమా! నీయొక్క స్వరూపము చక్షురాది ఇంద్రియములు మనస్సు మొదలగు అంత కరణముల వృత్తులయందు వ్యాప్తమైనది. నీవు వీని కాళ్యాణము చేకూర్చుము. నీవుశరీరమందుండి మమ్ము రక్షింపుము.

13) ప్రత్యక్షముగా ఈ లోకమున కనపడు పదార్థములు, స్వర్గమందు ఉండునవి అన్నియు ప్రాణాధీనములే. కావున హేప్రాణమా! తల్లితన పుత్రుని రక్షించునటుల మమ్ము రక్షించి, మాకార్యశక్తి ప్రజ్ఞ ప్రసాదింపుము. ఇందు పంచ మహాభూతములలో ఆకాశతత్వవాయువు ప్రధానమైనది.అదియే ప్రాణ రూపమున సమస్త ఇంద్రియములు, దేహమును ధరించి రక్షించును. కావున ప్రాణమే. సర్వశ్రేష్ఠమని పిప్పలాదుడు వచించెను.

తృతీయ ప్రశ్న

1) ఆశ్వలాయన ముని పిప్పలాదుని అవిషయములుగూర్చి అడిగెను. ii, మీరు వర్ణించిన ప్రాణము ఎవరినుండి ఉత్పన్నమగును, 2, అది ఈ మనుష్య శరీరములో ఎట్లు ప్రవేశించును? 3, తనను తానువిభజించుకొని ఎట్లు శరీరమునందు వర్తించును. 4, ఒక శరీరమును విడచి మరియొక శరీరము పొందుసమయమున ఈ శరీరమునుండి ఎట్లు బయలు వెడలును, 5, ఈ పాంచ భౌతిక జగత్తును ఎట్లు ధారణ చేయును, 6, మనస్సు, ఇంద్రియములనెడు ఆధ్యాత్మిక జగత్తు నెట్లు ధారణ చేయును?

2) నీవు ప్రశ్నించువిధము తర్కయుతముగానున్నను, నీవు శ్రద్ధాళువు, నిష్ణాతుడవగుటచే జవాబు చెప్పెదను.

3) సర్వశ్రేష్ఠ ప్రాణము పరమాత్మ నుండియే. ఉత్పన్నమైనది. ఆయనే దీని ఉపాదానకారణము. మనుష్యుని ఛాయవాని అధీనము ననున్నటుల ఇది పరమేశ్వరాధీనము, ఆశ్రితము, ప్రాణముమనస్సు యొక్క సంకల్పముచే శరీరమున ప్రవేశించును. మరణకాలమున మనస్సు నందు కలుగు సంకల్పములు, కర్మాను సారము శరీరము లభించును.

4) మహారాజుతన గ్రామ, మండల, జనపదాభికారులను వేర్వేరుగా నియమించునటుల సర్వశ్రేష్ఠ ప్రాణము కూడా తన అంగ స్వరూపమున అపాన, వ్యాన, సమాన, ఉదానాది భేదముల శరీరము యొక్క వివిధ కార్యములు నిర్వర్తించును.

5) ప్రాణ వాయువు ముఖనాసికల ద్వారా సంచరించుచు నేత్ర, శ్రోత్రములందు వసించును. అపానవాయువు పురీషమార్గము ఉపస్థలయందు సంచరించుచు మలమూత్ర విసర్జనయోగాక రజ, వీర్య గర్భములపైకి వెలువడజేయును. సమాన వాయువు నాభిప్రవేశము ననుండి ప్రాణ రూపాగ్నియందు, హవనముచేయ బడిన ఆహారమును అనగా జీర్ణమైన అన్నసారమును, అంగ ప్రత్యంగముల యధాయోగ్యముగా సమభావమున చేర్చును. ఈ సార భూత రసము వలననే నేత్ర, కర్ణ, నాసిక, ముఖమను సప్త జ్వాలలనుండి పుష్టినొంది ప్రకాశించు సప్తద్వారములు.

6) మన శరీరమున జీవాత్మ నివాస స్థానమగు హృదయ ప్రదేశమున 100 మూలనాడులుకలవు. ప్రతినాడికి నూరు శాఖానాడులు, ప్రతిశాఖానాడికి 72 వేల ప్రతిశాఖానాడులు వెరసి 72 కోట్ల నాడులలో వ్యానవాయువు చరించును.

7) పైన తెలిపిన 72 కోట్ల నాడులకంటె విలక్షణమగు సుషుమ్నానాడి హృదయమునుండి సమస్తకముచేరును. దీనిద్వారా ఉదానవాయువు సంచరించును. ఈ ఉదాన వాయువే శుభకర్ములగు పుణ్యశీలురను ప్రాణము, ఇంద్రియముల సహితముగా శరీరము నుండి బయటకు పుణ్యలోకములచేర్చును. పాపకర్మలను నరక మునకు తీసుకొని వెళ్లి దుఃఖ భోగానంతరము నీచయోనుల జేర్చును. మధ్యముల మనుష్యశరీరమున జేర్చును.

8) సూర్యుడే సమస్త ప్రాణుల బాహ్యప్రాణము సూర్యుడు తన ప్రకాశముచే అంగప్రత్యంగముల పరిపుష్టిజేసి నేత్రేంద్రియమునకు చూచుశక్తి , ప్రకాశమునిచ్చును. పృద్వి యందు దేవత అపాన వాయువు యొక్క శక్తి. ఇది విసిర్జికావయవముల సహాయకారిగా బాహ్య స్థూలశరీర ఆకారము ధరించును. పృధ్విస్వర్గలోకముల మధ్యనుండు ఆకాశము సమాన వాయువుయొక్క బాహ్యరూపము. ఇది బపాహ్యఅంగ ప్రత్యంగముల రక్షించి శ్రోత్రేంద్రియము శబ్దము వినుటకు సహాయపడును. ఆకాశమున సంచరించు ప్రత్యక్షవాయువు వ్యానవాయువు యొక్క బాహ్యరూపమై అంగ ప్రత్యంగముల చేష్టా శీలముగావించి శాంతి ప్రదానము చేయును. ఇది నాడులలో సంచిరించి చర్మమునకు స్పర్శ జ్ఞానము కలుగ జేయును.

9) సూర్యుడు, అగ్నియొక్క బాహ్యతేజస్సు, ఉష్ణమే ఉదానవాయు బాహ్యస్వరూపము. ఇది శరీరమునందు ఉష్ణము స్థిరముగానుంచును. ఇదియే జీవాత్మను, మనస్సులో విలీనమైన ఇంద్రియములకూడి మరియొక శరీరము పొందును.

10) మరణ సమయమున ఆత్మయొక్క సంకల్పానుసారము మనస్సు ఇంద్రియముల గూడి ముఖ్య ప్రాణము ఉదాన వాయువుతో కలసి సంకల్పాను సారముగా, యధాయోగ్య భిన్న భిన్న లోకములు, యోనులు పొందును. కావున మనస్సునిరంతరము భగవానుని చింతిచుచు, ఇతర సంకల్పముల రానీయక భగవానుని పొందవలెను. అల్ప అనిత్య జీవితమును అన్యచింతనల వ్యర్థ పరచిన అనేక జన్మలనెత్తుచు జన్మ మరణ చక్రమున తిరుగెదరు.

11) ప్రాణరహస్యమును పూర్తిగా తెలిసిన విద్వాంసుడు ప్రాణమును సురక్షితముగానుండి సత్సంతానము పొందును. ఆధ్యాత్మిక రహస్యము తెలిసిన జ్ఞాని నిరంతర భగవచ్చింతనలో జీవితము గడపి ముక్తి పొందును.

12) ఇట్లు ప్రాణముయొక్క ఉప్పత్తి, శరీరప్రవేశము, స్థితి మొదలగు ఆధ్యాత్మిక రహస్యములు తెలిసికొని అమృత స్వరూప పరమానంద పరబ్రహ్మమును పొందును. పరమానందమయ సుఖము పొందును.

----

చతుర్థ ప్రశ్న.

గార్గ్యముని పిప్పలాదుని 5 విషయముల ప్రశ్నించెను. 1, గాఢ నిద్రలో మనుష్య శరీరమున నుండు దేవతలలో ఎవరెవరు నిద్రింతురు 2, ఎవరు జాగృతులగుదురు 3, స్వప్నావస్థలో ఇందు ఏ దేవత స్వప్న ఘటనల చూచును. 4, నిద్రావస్థలో సుఖానుభవము ఎవరికి కలుగును. 5, ఈ దేవతలందరు సర్వభావమున ఎవరి ఆశ్రితులైయుందురు.

2) సూర్యాస్థమయమగుట తోడనే కాంతి కిరణపుంజము ఒకటగునట్లు నిద్రావస్థలో సర్వ ఇంద్రియములు వాని దేవతలు మనస్సునందు విలీనమై తద్రూపమునొందెదరు. అట్టి సమయమున జీవాత్మ వినుట, చూచుట, రుచి, స్పర్శ, గ్రహణ, చలనాది సర్వకార్యములను వదలి వేయును. దశేంద్రియములు తమ కార్యముల విరమించును. అపుడు జీవాత్మ (పురుషుడు) నిద్రించును. నిద్ర నుండి మేల్కొనగానే సర్వకార్యములు సంపన్నమగును.

3) నిద్రావస్థలో మనుష్య శరీరమున పంచ ప్రాణ రూప అగ్నులు జాగృతమైయుండును. శరీరమందు అపాన వృత్తి గార్హ పత్యాగ్ని, వ్యానము దక్షిణాగ్ని, గార్హ పత్య అగ్ని రూపక వ్యాపనము నుండి ప్రాణము లేచుట చే ముఖ్య ప్రాణము ఆవహనీయాగ్ని, ప్రాణము అన్నరూప ఆహంతులనిచ్చు ఆహవనీయాగ్నియే.

4) ఉచ్ఛ్వాస, నిశ్వాసముల ద్వారా ప్రాణము లోపలికి బయటకు సంచరించుటయే యజ్ఞమందు ఆహుతులు. ఈ హవిని శరీర మంతటా చేర్చుకార్యము సమాన వాయువుది. సమాన వాయువే హోతలేక ఋత్విక్‌. మనస్సు యజమాని. ఉదానవాయువు యజమానియొక్క అభిష్టఫలము. ఈ ఉదాన వాయువు ప్రతి దినము నిద్రావస్థలో మనస్సును పరమాత్మ నివాస స్థానమగు హృదీయకుహరములోనికి తీసుకు వేళ్లును. ఈ మనస్సుద్వారా జీవాత్మ నిద్రాజనిత విశ్రామసుఖము పొందును. జీవాత్మ కూడా పరమాత్మనుకూడి హృదయకుహరమున నుండును.

5) స్వప్నావస్థయందు మనస్సు సూక్ష్మ ఇంద్రియముల ద్వారా తనవిభూతిని అనుభవించును. జాగ్రదావస్థలో చేసిన, చూచిన ఘటనలే కాక ఇతరఘటనల అనుభవము కూడ విచిత్రముగానగును. ఎపుడు చూడని,చేయని సంఘటనలు కూడ జీవాత్మ చూచును. స్వప్నావస్థలో జీవాత్మ తప్ప ఏ ఇతర వస్తువు ఉండదు.

6) నిద్రావస్థలో జీవాత్మ ఉదాన వాయువు అధీనములో నుండుటచే ఇతర విషయముల చూడక నిద్రాజనిత సుఖమను భవించును. స్వప్నావస్థలో జీవాత్మయే సుఖదుఃఖముల ననుభవించను.

7) ఆకాసమున సంచరించు పక్షులు సాయంసమయమున తమ గూళ్లకుచేరి విశ్రమించు రీతిని పృధ్వి మొదలు ప్రాణమువరకు గల అన్ని తత్వములు పరబ్రహ్మ పురుషోత్తముని ఆశ్రయించి యుండును. ఆయనే సర్వాత్మ.

8) స్థూల సూక్ష్మ పంచ మహాభూతములు, దశేంద్రియములు వాని విషయములు, అంతఃకరణ చతుష్టయము, పంచ ప్రాణములు అన్నియు పరమేశ్వర ఆశ్రితములే. పంచ మహాభూతములు,వాని రూప, రస, గంధ, శబ్ధ, స్పర్శాది తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు వాని విషయములు, పంచ కర్మేంద్రియములు, వాని కర్మలు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, జీవనధారణ చేయు పంచ ప్రాణములు అన్నియు ఈ శ్వరాధీనములే.

9) సమస్త ఇంద్రియములు, మనస్సు ద్వారా కర్మచేయు విజ్ఞాన స్వరూపపురుషుడు జీవాత్మయే. అతడు కూడ పరబ్రహ్మ పరమేశ్వరుని యందు సంస్థితుడు. పరమాశ్రయ పరమాత్మను పొంది జీవాత్మ వాస్తవిక శాంతి పొందును.

10) అవినాశి పరమాత్మను తెలిసికొని, పొందువాడు సర్వజ్ఞ స్వరూపుడు.

11) పంచమహాభూత, ఇంద్రియ, అంతఃకరణ సహిత విజ్ఞాన స్వరూప జీవాత్మ అక్షర పరమాత్మను తెలిసికొని, పొంది, సర్వజ్ఞ స్వరూప పరమేశ్వరుని యందు లీనమగును.

పంచమ ప్రశ్న.

సత్యకాముడు ఓంకారమును ఆజీవనము ఉపాసించు వారికి ఏ లోకప్రాప్తి కలుగను. వారికి ఎట్టి ఫలము కలుగునని ప్రశ్నించెను.

2) ఓంకారము తన లక్ష్యభూత పరబ్రహ్మముకంటె భిన్నము కాదు. ఓంకారము ప్రకట రూపమున ఆయన విరాట్‌ స్వరూపము. అపర బ్రహ్మ, ఓంకార జప, స్మరణ, చింతనల విరాట్‌ పురుషుని ఏ అంగమును సంకల్పించి ఉపాసింతురో ఆ అంగమును పూర్ణ పరబ్రహ్మను గూర్చి నిష్కామ ముగా ఉపాసించువారు పూర్ణ పరబ్రహ్మను పొందెదరు.

3) ఓంకారము విరాట్‌ పరమేశ్వరుని భూభువః స్వరూపములు. ఓంకారముయొక్క మొది మాత్ర పృధ్వీ సంబంధము. ఋగ్వేదరూపము. దీనిను పాసించు వారు మనుష్యజన్మనెత్తి శుభ కర్మలనొనరించి సుఖింతురు.

4) భు, భువ, ద్విమాత్రోపాసన చేయు సాధకుడు మనోమయ చంద్ర లోకమును పొందును. యజుర్వేద మంత్రము చంద్రలోకము చేర్చును. స్వర్గలోక సుఖములనుభవించి మరల భూలోకమున జన్మింతురు.

5) అక్షర పరబ్రహ్మ స్వరూపమగు ఓంకారమును త్రిమాత్రా యుతముగా పరమేశ్వరుని గూర్చి ఉపాసించిన సర్వబంధ విముక్తుడై నిర్వికారుడగును. అతనిని సామ వేదమంత్రము తేజోమయ సూర్యమండలము చేర్చి సర్వాపరి బ్రహ్మ లోకమును చేర్చును. సంపూర్ణ జగత్తును తన శక్తియొక్క ఏకాంశ##దేధరించు జీవ సముదాయ చేతన స్వరూప శ్రేష్ఠ పరబ్రహ్మ పరమాత్మను పొందును.

6) ఓంకార వాచ్య పరబ్రహ్మ పరమేశ్వరుని జగద్రూపక విరావేస్వరూపము వాస్తవిక అవినాశి స్వరూపముకాదు. ఇది పరివర్తన శీలమగుటచేఅమరము కాదు. జగత్తుయొక్కబాహ్య రూపమును ఆశక్తిచే %ుపాసించు వారు పరమాత్మను పొందలేక జన్మ మరణ చక్రమున తిరుగుదురు. ఏ సాధకుడు శరీరములోపబ బయట, మధ్య హృదయ దేసమున సర్వత్ర ఓంకారవాచ్య రూప ఏకమాత్ర పరబ్రహ్మ పురుషోత్తముని ఉపాసించువారు ఓంకార జప స్మరణ , చింతనల ద్వారా పరమాత్మనే పొందెదరు.

7) ఓంకారమును ఏక మాత్రోపాసన చేయువారిని ఋగ్వేద మాంత్రము మనుష్యలోకమున చేర్చును. ద్వైమాత్రికరూపమున ఉపాసించువారిని యజుర్వేదమంత్రము చంద్రలోకమునకు తీసుకువెళ్లును. వీరికి పునర్జన్మకలదు. ఓంకారమును త్రిమాత్రికముగా పరిపూర్ణ ఆత్మరూప పరబ్రహ్మముగా ఉపాసించు వారిని సామవేదమంత్రము బ్రహ్మలోకమున చేర్చును. కావున బుద్దిమంతుడగు సాధకుడు బాహ్యజగత్తునందు ఆసక్తి లేక ఓంకారోపాసన ద్వారా జరామృత్యురహిత పరమ శాంతి ఆత్మ రూప పరబ్రహ్మను పొందును.

----

షష్ఠ ప్రశ్న.

పదునారు కళల పురుషుని గూర్చి కోసల రాజ కుమారుడు హిరఅమయ నాభుడు నన్ను ప్రశ్నింపగా నాకునిజముగా తెలియదంటిని. కావున ఆషోడశ కళాపురుషుడు ఎచట నుండును. స్వరూపతత్వములు ఏవి?

2) షోడశకళా సముదాయముచే పరమాత్మ యొక్క జగద్రూపక విరాట్‌ శరీరము ఉత్పన్నమైనది. ఆషోడశకళా పురుషుడు మన హృదయ సీమలోనే నుండుటచే వేరుగా ఎచటను వేదుక పనిలేదు.

3) ఈ బ్రహ్మాండమును సృజించునపుడు పరమాత్మతన ఏతత్వమును ప్రవేశ##పెట్ట వలెను. ఏది లేనిచో నేను స్వయముగా అందుండనో అనగా నాశక్తి స్పష్టముగా ప్రకటితమగునో అట్టి తత్వము ప్రవేశ పెట్ట గోరెను.

4) పరబ్రహ్మ పరమేశ్వరుడు మొదట ప్రాణ రూప సర్వాత్మ హిరణ్య గర్భుని సృజించెను. పిమ్మట శుభకర్మల యందు ప్రవేశింపజేయు శ్రద్ధ అను ఆస్తిక బుద్ధిని తర్వాత క్రమముగా నా శరీరమునకు ఉపాదాన కారణమగు పంచ భూతములు, పిమ్మట అంతఃకరణ చతుష్టయము, పిమ్మట విషయ జ్ఞానమునకు జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, శరీరస్థితికై అన్నాదులు, అంతఃకరణాది ఇంద్రియముల సంయమనము కొరకు తపస్సు, ఉపాసనకొరకు వివిద మంత్రములు , తత్‌ ఫలరూప వివిధ నామ రూపాత్మక లోకములు సృజించి షోడశకళా పూర్ణుడగు పరమాత్మ మనుష్య శరీరమున జీవాత్మ గూడి హృదయకుహరమున ప్రవేశించెను. మానవ శరీరమే బ్రహ్మాండము యొక్క సూక్ష్మ రూపము. పరమాత్మ బ్రహ్మాండమందు వ్యాపించినట్లే శరీరమందు వ్యాప్తుడై హృదయసీమ నలంకరించి యుండును.

6) రధ చక్రము యొక్క ఆకులు నాభిని ఆశ్రయించుకొని యున్నట్లే ప్రాణాదిషోడశకళలు ఆ పరమాత్మనే ఆశ్రయించు కొని, ఆయన నుండియే ఉత్పన్నమై, ఆయన యందే వినీనమగును. అట్టి సర్వాధార పరమాత్మను తెలిసికొనినచో జన్మ మరణ సంసార దుఃఖమున పడక శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి నొందును.

7) హే ఋషులారా! నేను పరబ్రహ్మ పరమేశ్వరుని గూర్చి నాకు తెలిసిన దంతా చెప్పితిని. ఇంతకుమించి ఏమియులేదు.

8) ఇట్లు పిప్పలాదునిచే పరబ్రహ్మతత్వమును తెలిసి కొనిని ఆర్గురు ఋషులు పిప్పలాదుని పూజించి, మీరేమాకు తండ్రివంటివారు, మమ్ములను సంసార సాగరమునుండి రక్షించిన జ్ఞాన స్వరూపులు, మీకు మరల మరల మా నమస్కారములని పలుకుచు శెలవు తీసుకొనిరి.

-----

ప్రశ్నోపనిషత్తు సమాప్తము.

ఓం శాంతిః శాంతిః శాంతిః

SARA SUDHA CHINDRIK    Chapters