SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌ సత్‌

శ్రీ గణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

8. తైత్తరీయోపనిషత్తు.

ఈ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదీయ తైత్తరీయ శాఖాంతర్గత తైత్తరీయ ఆరణ్యక మందలిది. ఈ ఆరణ్యక మందు 10 అధ్యాయములు కలవు. అందు 7, 8, 9 అధ్యాయములే తైత్తరీయోపనిషత్తు.

శిక్షావల్లి:-

ప్రధమ అనువాకము:- (శంనోమిత్ర: శం అరుణ:) ఈ ప్రధమ అనువాకమందు భిన్న భిన్న శక్తుల అధిష్టాత పరబ్రహ్మ పరమేశ్వరుని భిన్న భిన్న నామరూపముల స్తుతించుట జరిగినది. సమస్త అధిదైవిక , అధిభౌతిక, ఆద్యాత్మిక శక్తుల అధిష్టాత రూపమున మిత్ర వరుణాది దేవతల సర్వాంతర్యామియగు పరమాత్మను సాధనా మార్గమున వచ్చు విఘ్నములనివారించి కళ్యాణము చేకూర్చుటకు ప్రార్ధించుచున్నాను. సర్వశక్తివంతుడగు పరమాత్మ సమస్త ప్రాణుల ప్రాణ స్వరూప వాయు రూపమునను నియమ రూప ఋతు రూపమునను, సత్యభాషణాదుల యందు సత్య రూపమున శక్తి ప్రదానము చేసి నన్ను నా ఆచార్యుని రక్షించుగాక, త్రివిధ విఘ్నములను ఉపశమింప జేసి శాంతిని ప్రసాదించుగాక. పరమాక్మ శాంతి స్వరూపుడు.

ద్వితీయ అనువాకము:- పరమాత్మ యొక్క రహస్యవిద్యా జిజ్ఞాసువులగువారు లేద మంత్రోచ్ఛారణ చేయుటయందు సావధానులై నియమాను సారముగా సర్వ, వ్యంజనల స్పష్ట ఉచ్చారణ, ఉదాత్త అనుదాత్తాది స్వరముల హ్రస్వ దీర్ఘ, ఫ్లుత మాత్రా భేదములనను సరించి స్పష్ట ఈషత్‌ స్పష్ట , వివుతక, ఈ షతో వివృత, సంవృతాది అభ్యంతర ప్రయత్నములు , వివర , సంవార, శ్వాస, నాద, ఘోష, అఘోష, అల్పప్రాణ, మహాప్రాణ, ఉదాత్త, అనుదాత్త, స్వరితయను బాహ్య ప్రయత్నముల స్వర, వ్యంజన, విసర్గ, సంధుల నియమానుసార పాలన చేయుచు పఠించవలెను.

తృతీయ అనువాకము:- సమదర్శియగు ఆచార్యుడు తనకు, తన శిష్యునికి యశస్సు, తేజోవృద్ధికి శుభాకాంక్షలు తెలుపుచు సంహితావిషయక నిరూపణము చేయుచున్నాడు. వర్ణముల యందు జరుగు సంధియే సంహిత, ఇది యే వ్యాపక రూపమున లోకాదులయందు మహాసంహితయనబడును. స్వర్గ, వ్యంజన, స్వాది, విసర్గ అనుస్వారములు పంచసంధులు. మహాసంహితయగు మహాసంధియందు లోక, జ్యోతి, విద్య ప్రజ్ఞ, ఆత్మ (శరీరము) అను పంచ సంధులు , పూర్వవర్ణ పరీవర్ణ, రెండింటి మిశ్రమ రూపము, రెండింటి సంయోజకము అను నాలుగు సంధినియమములు, అట్లే లోక సంహిత యందు పూర్వ రూప, ఉత్తర రూప, సంధి, సంధానము, లోకవిషయిక సంహితాదృష్టిలో పృధ్వి పూర్వరూపము, స్వర్గము ఉత్తర రూపము, అంతరిక్షము (ఆకాశము ) సంధి, వాయువు సంధానము. పూర్వ ఉత్తర వర్ణములు సంధిచే ఒకటగునట్లు పూర్వస్థానీయ భూతల ప్రాణులు, ఉత్తరస్థానీయ ఆకశమును స్వర్గమును పొందును. లోకప్రాప్తి యందు ప్రాణము ప్రధానము, ప్రాణముద్వారా మనస్సు ఇంద్రియ సహితముగా జీవాత్మ ప్రత్యేక లోక గమనము చేయును. పృధ్వి ప్రధమవర్ణము, ద్యులోకము ద్వితీయవర్ణము, ఆకాశము సంధియను భావము సరిగా అర్ధమగుటలేదు.

అగ్ని సంహిత యొక్క పూర్వవర్ణము, ద్యులోకమున ప్రకాశించు సూర్యుడు ఉత్తర రూపము, రెండింటి నుండి ఉత్పన్నమైన మేఘము సంధి, విద్యుచ్ఛక్తి సంధానము, విద్యుచ్ఛక్తి నేటి వైజ్ఞానికోన్నతికి ముఖ్యకారణము.

విద్యా రూప సంహితయందు గురువు పూర్వవర్ణము, శిష్యుడు పరవర్ణము, గురు శిష్య సంబంధ విద్యాజ్ఞానము సంధి, ప్రవచన, గురూపదేశము, శిష్యుని ద్వారా శ్రవణ, మనన ధారణలు సంధానము.

ప్రజా విషయిక సంహితయందు తల్లి పూర్వవర్ణము, తండ్రి పరవర్ణము. తల్లి దండ్రులు సంయోగముచే ఉత్పన్న సంతానము సంధి, ఋతుకాలమున శాస్త్ర విధిననుసరించి సంతానోత్పత్తి కొరకు తల్లి దండ్రులు సంయోగము సంధానము.

శరీరవిషయిక సంహితయందు శరీర ప్రధాన అంగమగు ముఖ మునందు క్రింది దవడ పూర్వవర్ణము. పైదవడ పరవర్ణము, రెండింటి సంయోగముచే మధ్య భాగమున అభివ్యక్తమగు వాణి సంధి, జిహ్వసంధానము. వాణి ద్వారా మనుష్యుడు శరీరపోషణ సామగ్రిని పొందును. ఓంకార రూప పరమేశ్వరుని నామ జపముచే పరమాత్మను పొందును. ఇట్లు శారీరక ఆత్మ విషయిక ఉన్నతి పొందును.

ఇట్లు లోక విషయిక సంహితాజ్ఞానము చేస్వర్గాది ఉత్తమ లోకములు, జ్యోతి విషయిక సంహితా జ్ఞానముచే అనేక విధములగు భౌతిక సామగ్రి, ప్రజావిషయిక సంహితా జ్ఞానముచే సత్సంతానము, విద్యావిషయిక సంహితాజ్ఞానముచే విద్య, బ్రహ్మతేజస్సు, ఆధ్యాత్మ సంహితావిజ్ఞానము చే వాణి శక్తిని పొందును. శృతులు ఈశ్వరవాణి, కావున శ్రద్ధా విశ్వాసములతో ఉపాసించి సర్వఫలములను నిస్సందేహముగా పొందవచ్చును.

చతుర్థ అనువాకము:- ఓంకారము పరమాత్మయొక్క నామము, ఓంకారము వేదమంత్రములయందు సర్వశ్రేష్ఠము. కావున ప్రతి మంత్రమునకు ముందు ఓంకారము ఉచట్చరించెదరు. ఆ పరమేశ్వరుడే ఇంద్రుడు. ఇంద్రుడు నన్ను ధారణాశక్తి సంపన్న, బుద్ధి, మేధచే సంపన్నము చేయుగాక, నాశరీరము రోగరహితమై నీ ఉపాసనయందు ఎట్టి విఘ్నములు కలుగ కుండు గాక, నా జిహ్వ నీ మధుర నామ స్మరణ , గుణ కీర్తన యందు కర్ణములు కళ్యాణమయ యశస్సు వినుగాక. నాకు నీ ఉపదేశము వినుచు స్మరణ చేయుచు తదను సారముగా జీవితము గడుపుగాక.

ఐశ్వర్యము కోరు సకాములు పరమేశ్వరుని తన కువలయు వస్తుసామగ్రి , ధనాదులు ప్రసాదింపమని వేడుచు అగ్నియందు స్వాహా శబ్దముచే మంత్రోచ్ఛారణ చేయుచు ఆహుతి నీయవలెను.

శిష్యుల హితము కోరు ఆచార్యుడు, ఉత్తమ బ్రహ్మచారులు నాయొద్ద విద్య నేర్చుకొనుటకు రావలెనని కపట శూన్యులై యుండవలెను. ఉత్తమ జ్ఞానము పొందువారు కావలెను. ఇంద్రియదమనము చేయగలవారై యుండవలెను. మనస్సును వశపరచుకొను వారై యుండవలెను అని కోరుచు పంచ ఆహుతి నీయవలెను.

ఆచార్యుడు తనకొరకు, నేను యశస్విని యగుదునుగాక, అధిక సంపత్తి శాలిని యగుదుగాక, నేను నీ దివ్యరూపము నాయందు ప్రతిష్టమగుగాక, నీ సహస్ర శాఖాయుత దివ్యరూపమును ధ్యానించుటయందు నిమగ్నుడనై విశుద్ధడనగుదు గాకయని ఆహుతి నీయవలెను.

సమస్త జల ప్రవాహము సముద్రమందు కలయునట్లు దినము, మాసము, సంవత్సరమునందు విలీన మగునట్లు నాయొద్దకు వచుచు విద్యార్ధులకు నేను, విద్యాబ్యాసమొనర్చి, కళ్యాణ కారక ఉపదేశమునిచ్చి నాకర్త వ్యమును, నీయాజ్ఞను పరిపాలించుదు గాక, నీదివ్యరూపము నాకు లభించుగాక. ఇందు ఇహ లోకపరలోక ఉన్నతి కొరకు పరమాత్మను ప్రార్థించు ఉపాయము హవన విధి తెలుపబడెను.

పంచమ అనువాకము:- భూః భువః స్వః మహః ఈ నాలుగు వ్యహృతులు, భువ, అంతరిక్షలోకము, స్వః స్వర్గ లోకము, మహః సూర్యుడు. భూః భువః స్వః ఈ మూడు వ్యాహృతులు పరమాత్మయొక్క శరీర రూప స్థూల బ్రహ్మాండము. మహః వ్యాహృతి విరాట్‌ స్వరూప ప్రకాశము ఆత్మరూప పరమేశ్వరుడే, సూర్యుడు విరాట్‌ స్వరూప పరమాత్మయొక్క ఆత్మ, సూర్యరూపమున సర్వలోక ప్రకాశము.

భూః అగ్ని, భఙువః వాయువు, స్వః సూర్యుడు, మహః చంద్రుడు. వీరు జ్యోతి రూపమున వాణి , త్వరే, చక్షు, మనస్సునీకు అధిష్టాన దేవతలు, మనస్సుచే సర్వ జ్యోతి రూప ఇంద్రియములు మహిమాన్వితములగునుగాన, మహః పరమాత్మ రూపమున ఆహుతి నీయవలెను. వేదవిషయికముగా భూః ఋగ్వేదము, భువ, సామవేదము, స్వ, యజుర్వేదము, మహ, పర బ్రహ్మము, వేదములందు వర్ణిత సమస్త జ్ఞానము పరమేశ్వరునుండియే ప్రకటితమైనది. పరమేశ్వర తత్వము వర్ణింపబడెను.

ప్రాణ విషయికముగా భూ, ప్రాణము, భువ, అపానము, స్వః వ్యానము, మహః అన్నము, సమస్త ప్రాణుల పోషణకు అన్నము ప్రధానముగాన పరమేశ్వరుని అన్న రూపమున ఉపాసించి ఆహుతులనీయవలెను.

షష్ఠ అనువాకము :- మనోమయపర బ్రహ్మ హృదయమందు అంగుష్ట మాత్ర ఆకాశమందు అంతర్యామి పరమపురుష పరమేశ్వరుడు విరాజిల్లు చుండును. అచటనే ఆయన సాక్షాత్కారమగును. వేరుచోట్ల వెదుక పనిలేదు. ముఖమునందు తాళు ప్రదేశమునగల కొండ నాలుకమందు గల బ్రహ్మ రంధ్రము కలదు, హృదయము నుండి వెడలు సుషుమ్నానాడి కొండ నాలుక మధ్యనుండి కపాల భేదనము చేయును, అనగా బ్రహ్మ రంద్ర భేదనము ద్వారా భూః పర అగ్నిలోకము, భువ, వాయులోకము, స్వ, సూర్యలోకము ద్వారా మహః నామక బ్రహ్మలోకము పొందెదరు. ఇట్లు బ్రహ్మలోక ప్రతిష్టతుడగు పురుషుడు. సర్వేంద్రియములు, అంతఃకరణముల స్వామియగు,పరమాత్మను పొందును. ఇట్లతడు స్వరాట్‌ పురుషుడగును. ఇట్లు ప్రాప్తవ్య బ్రహ్మ నిరాకార సర్వవ్యాపి, సూక్ష్మరూప, సత్తారూపక, పరమానందదాయక అవినాశి పరమాత్మ, చింతనా ధ్యాన తత్పరుడై సాధకుడు పరమాత్మను పొందవలెను.

సప్తమ అనువాకము :- పృధ్వి, అంతరిక్ష, స్వర్గలోకములు, దిశలు, మూలలు, ఇవి లోక అధి భౌతిక పంక్తులు. అగ్ని, వాయు, సూర్యచంద్ర నక్షత్రములు జ్యోతి రూప అధి భౌతిక పంక్తి, జల, ఔషధి, వనస్పతి, ఆకాశము, పొంద భౌతిక స్థూల శరీరము, స్థూల జడ పదార్ధముల అధిభౌతిక పంక్తి. ఇట్లే శరీరమందు ప్రాణ, వ్యావ , అపాన, ఉదాన, సమాన వాయువులు ప్రాణ పంక్తి, నేత్రములు, కర్ణములు, మనస్సు , వాణి, .త్వచకరణ సముదాయ పంక్తి. చర్మ, మాంస, నాడి, అస్థి, మజ్జ శరీరగత ధాతు పంక్తి, ఇట్లు ఆధ్యాత్మిక పంక్తులగు ప్రాణ పంక్తి, కరణపంక్తి, ధాతు పంక్తులు క్రమముగా అధి భౌతిక లోక, జ్యోతి, జడపదార్ధ పంక్తులకు సంబంధముకలదు. ఇట్లు స్థూల సూక్ష్మ తత్వముల బాగుగా తెలిసికొని ఉపయోగించిన సర్వవిధముల సాంసారిక ఉన్నది పొందును.

అష్టమ అనువాకము:- ఓంకారము సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. ఆయన నామము, ఓంకారము పరబ్రహ్మయొక్క స్ధూల రూపము, ఓంకారము అనుమోదన సూచకము, ఓంకారము ఉపదేశమునకు పూర్వము ఉచ్చరింపబడును. ఓంకారముతో సామవేద గానము ప్రారంభమగును. ఓంకారమునుచ్చరించి యజ్ఞ కర్మ ప్రారంభింతురు. యజ్ఞములందు ఋత్విక్కులందరు ఓంకార ఉచ్ఛారణచేయుచు తమ తమ నియుక్త యజ్ఞ కర్మలు చేయుదురు. ఓంకారమే సర్వము.

నవమ అనువాకము:- అధ్యాయన అధ్యాపన చేయువారు శాస్త్రానుకూల కర్తవ్యనిర్వహణ చేయవలెను. విధి ఫలముల జ్ఞానము పొందవలెను. ఇందు కర్తవ్యాచరణ, సత్యభాషణ స్వధర్మ పాలన యందు కష్టములు సహించుట, ఇంద్రియములు మనస్సు వశపరచుకొనుట, అగ్ని హోత్రమునకు అగ్ని ప్రజ్వరింప జేయుట, హవనము చేయుట, అతిధి సేవనము, అందరియెడల సుందర మనుష్యోచిత లౌకిక వ్యవహారమొనర్చుట, శాస్త్ర విధిననుసరించి ఋతుకాలమున స్త్రీ సహవాస గర్భాదానము చేయుట, కుటుంబ వృద్ధి మొదలగు శ్రేష్ఠ కర్మల ననుష్ఠింప వలెను. రధ తరీపుభుడు, సత్యవదుడు సత్యమును, పురుషిష్ట పుత్రుడు తపోనిత్యుడు తపశ్చర్యను, ముద్గలపుత్రుడు నాకముని వేదమును శ్రేష్ఠమని వచించిరి. కర్తవ్యనిష్టులకు ఈమూడు సత్యము, తపము, వేదము ప్రధానములే.

దశమ అనువాకము:- త్రిశంకుడను ఋషి పరమాత్మను పొంది తన అనుభవమునిట్లు వివరించెను. అంతఃకరణమున భావన చేయుట పరమాత్మ ప్రాప్తికి సాధనము. ప్రవాహ రూపమున అనాదికాలము నుండి వచ్చు, జన్మ మరణ వృక్షమును భేదించెదను. ఇది నాయొక్క అంతిమ జన్మ, దీని తరువాత నాకు జన్మ లేదు. నా కీర్తి పర్వత శిఖరముకంటె ఉన్నతమైనది. సూర్యునివలెన నేను విశుద్ధుడను , రోగముక్తుడను. అమృత స్వరూపుడను, ప్రకాశయుక్త ధన భండారమును అని సంకల్పించుచు పరమానంద రూపర అమృతమున నిమగ్నుడై శ్రేష్ఠధారణాయుక్త బుద్ధి సంపన్నుడు కావలెను. సంకల్పమునకు అపూర్వ ఆశ్చర్యకర శక్తి కలదు. భావనాను కూల గుణము లేనిచో పతనము కలుగును. కావున అభిమాన ముండరాదు.

ఏకాదశ అనువాకము:- విదాయపరి సమాప్తి సమావర్త సంస్కారమున ఆచార్యుడు శిష్యునకిచ్చు ఉపదేశము - నాయనా ! ఎల్లప్పుడు సత్యము పలుకుము. ఆపదలోకూడా అసత్యము పలుకకు. వర్ణాశ్రమ ధర్మ పాలన చేయుము. స్వాధ్యాయము, సంధ్యావందనము, గాయత్రీ జపము, భగవన్నామ గుణ కీర్తనాది నిత్య కర్మల ప్రమాదాలస్యము లేక నిర్వర్తింపుము. గురువునకు ఆయన కోరిక ప్రకారము గురుదక్షిణ ప్రేమ పూర్వకముగానిమ్ము. అనుకూల వతియగు ధర్మపత్నియందు అనాసక్తముగా సంతానోత్పత్తి నొంది ధర్మపాలన చేయుచు, లౌకిక శాస్త్రీయ కర్తవ్యశుభ కర్మల నొనరింపుము. వర్ణాశ్రమ ధర్మానుకూలముగా ధనార్జన చేయుము, పఠన పాఠన అగ్నిహోత్రాది దేవపితృ కార్యము ఆలస్యము, అవహేలన, ప్రమాదరహితముగా చేయుము.

తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిధి యందు దైవ బుద్ధి కలిగి శ్రద్ధా భక్తి పూర్వకముగా సేవించుము. దోషయుక్త నిషిద్ధ కర్మ నాచరింపక, శాస్త్రము, శిష్ఠ పురుషులు నిర్దేశించిన సత్కర్మలనే చేయుము. వయో విద్యా తపోధనులగు బ్రాహ్మణులు గృహము నీకు విచ్చేసిన ఆర్ఘ్య పాద్యాదులు సమ్మాన పూర్వకముగా సేవించుము. భగవానుడు గీతయందు నుడివినట్లు ధనాదులు భగవత్సేవకై వినియోగించుచు పాత్రోచిత దానములు శ్రద్ధా భక్తి వివేక పూర్వకముగా నిష్కామ భావమున యొనరింపుము. కర్తవ్యపాలన లో శంకలు కలిగి కింకర్తవ్య ని మూడు వైపునపుడు శాస్త్రాను కూలముగా సదాచారాపరాయణుడు, సత్యభావముకలవాడు, ధర్మపాలనా పరుడగు మహాపురుషులు నడచిన మార్గమున గాని, లేదా వారినిర్దేశాను సారము వర్తించవలెను. ఈ శ్వరాజ్ఞ పరంపరాగత ఉపదేశ##మే. అనుశాసనము. కావున అట్టి సదాచార యుత కర్త్వ్యపాలన చేయవలెను.

ద్వాదశ అనువాకము:- శిక్షావల్లి అంతిమ అనువాకమందు భిన్న భిన్న శక్తులు వాటి అధిష్టాత పరమేశ్వరుని భిన్న భిన్న నామరూపములకు స్తుతి, ప్రార్ధనా, పూర్వక కృతజ్ఞత తెలుప బడుచున్నది. అధిదైవిక, అదిభౌతిక, ఆద్యాత్మిక శక్తి రూపములు వాని అధిష్టాతలగు మిత్రవరుణాదిదేవతల రూపమగు సర్వులకు ఆత్మ రూప అంతర్యామి పరమేశ్వరుని విఘ్నరహిత, ఉన్నత కళ్యాణ ము కొరకు నమస్కార పూర్వక ప్రార్ధన , ప్రాణులలో వ్యాప్త వాయు రూప పరమేశ్వరుని ప్రార్‌ఎథించుచు ఓ సర్వశక్తివంత ప్రాణ వాయు రూప పరమేశ్వరా ! సర్వప్రాణుల యందు ప్రణవ స్వరూప పరబ్రహ్మవు నీవే. నీవే కళ్యాణ కారక నియమరూప ఋతు నామకుడవు. సదాచార, సత్యభాషణ, సత్వర్తనాదులు సత్‌ స్వరూపుడవు నీవే, అందరకు ఉపదేశము చేయుచు సత్య ప్రచారము చేయు ఆచార్యునకు, నాకు రక్షనొసంగుము. సర్వవిఘ్నముల ఉపశమింప జేసి శాంతిని ప్రసాదించుము.

ఓం శాంతిః శాంతిః శాంతిః

తైత్తరీయోపనిషత్తు - బ్రాహ్మనందవల్లి.

ప్రధమ అనువాకము:- పరబ్రహ్మ పరమాత్మ సత్యస్వరూపుడు, పరబ్రహ్మయొక్క నిత్యత్వమే సత్యము. పరమాత్మ జ్ఞానస్వరూపుడు, దేశకాల సీమారహిత అనంతుడు (సత్యం జ్ఞానమనంతబ్రహ్మ). పరబ్రహ్మ విశుద్ధ ఆకాశమున నున్నను, అందరి హృదయకుహరమున నుండును. ఈ తత్వము బాగుగా నెరిగిన సాధకులు బ్రహ్మ జ్ఞానము పొంది బ్రహ్మను గూడి సర్వభోగములు అలౌకికముగా అనుభవింతురు.

ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలము నుండి పృధ్వి ఉత్పన్నమైనవి. భూమియందు నానా ప్రకార ఓషధులు ధ్యానము మనుష్యునకు అన్నముగా ఉత్పన్నమైనవి. అన్నము నుండి స్థూల మనుష్య శరీరము ఉత్పన్నమాయెను. స్థూల మనుష్యశరీరమే ఒక పక్షి, అందు శిరము శిరము, భుజములు రెక్కలు, మధ్యభాగము శరీర మధ్యభాగము, రెండు కాళ్లు తోక లేక ప్రతిష్ట.

ద్వితీయ అనువాకము:- భూలోకమున నివసించు సర్వప్రాణులు అన్నము నుండియే ఉత్పన్నమగును. అన్ని పరిణామరూప రజో వీర్యముల కలయికచే స్థూల శరీర నిర్మాణము జరుగును. శరీరము అన్నముచేతనే పోషింప బడి చిరవకు అన్నము యొక్క ఉద్గమ స్థానమగు భూమియందు లీనమగును. కాని జీవాత్మ నశించక మృత్యు కాలమున ప్రాణముతో గూడ బైల్వెడలి ఇంకొక శరీరమును పొందును. అన్నము ఆకలి తీర్చి సంతాపము దూరము చేయును. కావున ఇట్టి సర్వశ్రేష్ట అన్ము పరబ్రహ్మ స్వరూపముగా భావించి ఉపాసించిన లోటు లేకుండా అన్నము ప్రాప్తించును.

ఈ స్థూల అన్నమయ శరీరముకంటె భిన్నమైనది అందులో అదే పురుషాకృతిలోనుండు సూక్ష్మ శరీరమే ప్రాణ మయ శరీరము. ఈ సూక్ష్మ ప్రాణ మయ శరీరమను పక్షికి ముఖ్య ప్రాణము శిరస్సు, వ్యానము దక్షిణ పక్షము, అపానము వామ పక్షము, సమానము సర్వవ్యాపి ఆత్మ, పృధ్వి అధివైదికశక్తి, అపానమును ఆపియుంచున దే పృచ్ఛము. (ఈ వర్ణన ప్రశ్నోపనిషత్తులో ఎనిమిదవ మంత్రమందు కలదు).

తృతీయ అనువాకము:- దైవ, మనుష్య, పశుపక్ష్యాది సమస్త శరీరధారులకు ప్రాణమే ముఖ్యము. ప్రాణము లేనిదే శరీరము నశించును. ప్రాణమే జీవనము. పరమాత్మ స్థూల శరీర ధారులగు పురుషుల అంతరాత్మ. అటులనే ప్రాణమయ పురుషుని సర్వాంతరవర్తి అంతర్యామి ఆత్మ ప్రాణమే.

ఇట్టి ప్రాణమయ శరీరము నందు మిక్కిలి సూక్ష్మము అదేపురుషాకృతి కలిగియున్న మనోమయ శరీరమను పక్షికి యజుర్వేదము శిరస్సు, ఋగ్వేదము దక్షిణ పక్షము, సామవేదము వామపక్షము, విధి వాక్యము మధ్య భాగము. అధర్వఅంగీర ఋషి ద్రష్ట అధర్వవేదము పృచ్ఛము.

అక్షరాది నియమనిబంధనలు లేక స్వాహా అను పదము తో కూడిన వైదిక వాక్యము చేయజ్ఞము లందు, హవిష్యార్పణము జరుగుటచే యజుర్వేదము శిరస్సు, వేద మంత్రముల వర్ణ, పద, వాక్య ఉచ్చరణాదులు ముందుగా మనమున సంకల్పింపబడుటచే ఋగ్వేద సామవేదమంత్రములు మనోమయ పురుషుని పక్షములు. స్తవన గాయనచే యజుర్వేద మంత్రములకంటె అప్రధానమగుట చే ఇవి పక్షములు. విది వాక్యము మనో మయ పురుషునిమధ్య భాగము. శాంతి పౌష్టిక కర్మ సాధక మంత్రములగుటచే అధర్వవేదము మనోమయ పురుషుని పుచ్ఛము లేక ప్రతిష్ట.

చతుర్ధ అనువాకము:- పరబ్రహ్మ పరమాత్మ ఆనందమయ స్వరూపుడు. మనస్సు, వాణి మొదలగు నవి సాధకుని పరబ్రహ్మ ద్వారము వరకు చేర్చి తిరిగి వచ్చి సాధకుని చేరును. మనోమయ, శరీరము యొక్క అంతర్యామి ఆత్మ పరమాత్మ యే.

విజ్ఞానమయ పురుషుడు మనోమయ శరీరమందు పురుషాకారమున సర్వత్రవ్యాపించియున్నాడు. జీవాత్మ రూప క్షేత్రజ్ఞుడు శరీరమను క్షేత్రమున సర్వత్ర ఉండునని గీతయందు (13/32) చెప్పబడెను. అట్టి విజ్ఞానమయ పురుషునకు బుద్ధి యొక్క నిశ్చిత విశ్వాసమను శ్రద్ధ ప్రధాన అంగమగు శిరస్సు. సదాచార నిశ్చయము దక్షిణ పక్షము. సత్యభాషణ నిశ్చయము వామపక్షము, ధ్యానము ద్వారా పరమాత్మతో కూడి యుండుట శరీర మధ్య భాగము. మహః నామ ప్రసిద్ధ పరమాత్మ పుచ్ఛము లేక ప్రతిష్ట.

పంచమ అనువాకము:- విజ్ఞానమయ బుద్ధియే సంపూర్ణ కర్మల ప్రేరకము. సర్వ ఇంద్రియములు, మనస్సు, అనుదేవత, సర్వశ్రేష్ఠ బ్రహ్మ రూపియగు విజ్ఞానమయ జీవాత్మను సేవించును. ఇట్లు విజ్ఞాన రూపమగు ఆత్మను బ్రహ్మగా తలంచుసాధకులు . అభిమాన రహితులై జన్మ జన్మల సంచిత పాప సముదాయ వదలి దివ్య భోగము లనునుభవింతురు. ఇట్టి విజ్ఞానమయ శరీరమునకు అంతర్యమామి ఆత్మ పరమాత్మయే.

విజ్ఞానమయ జీవాత్మకంటె భిన్నముగా లోపల నుండు ఆత్మ ఆనందమయ పరమాత్మ. ఈ పరమాత్మయే జీవాత్మ రూప శరీరమును శాసించు అంతరాత్మ (బృ.ఉ. 3/7/23) ఈ ఆనందమయ పురుషుడు విజ్ఞానమయ పురుషునికి సమాన ఆకారము కలవాడు. ప్రియ భావమే శిరస్సు. యోదము దక్షిణ పక్షము, ప్రమోదము వామపక్షము. ఆనందమయ పరమాత్మ మధ్యభాగము, స్వయం బ్రహ్మయే పుచ్ఛము లేక ఆధారము.

ఇట్లు పక్షి రూపమున పరమాత్మయొక్క స్వరూపము అంగముల కల్పన, ఉపాసనా సుగమత కొరకే. పరమాత్మ నిరవయువుడు( బ్ర.సూ. 3/3/12-14). విజ్ఞానమయుడే జీవాత్మ. ఆనందమయుడే పరమాత్మ. (బ్ర. సూ. 1/1/12-19).

షష్ఠ అనువాకము :- పరమాత్మయొక్క అస్థిత్వము లేదనువారు సదాచార భ్రష్టులు. నీచ ప్రకృతి కలవారు. పరమాత్మ యొక్క అస్థిత్వమును శాస్త్రములు, మహాపురుషుల వచనాను సారము దృఢముగా విశ్వసించు నరుడు సాధు పురుషుడు. అట్టి వారు మహాపురుషుల కృపచే సాధన చేసి పరమాత్మను పొందగలరు.

ఆనందమయ పురుషునకు వేరే అంతరాత్మ లేదు. మిగిలిన అన్మయాది శరీరములకు అంతకంటె సూక్ష్మమగు శరీరము ఆత్మయగును. కావున ఆనందమయ పురుషునికి ఆయనేసర్వాంతర్వర్తి ఆత్మ.

పరబ్రహ్మ యొక్క అస్థిత్వేము ప్రతిపాదించిన పిదప (1) బ్రహ్మను తెలియని మనుష్యుడు మరమఆనంతరము పరలోకమునకు వెళ్లునా లేదా ? (2) బ్రహ్మను గూర్చి తెలిసిన విద్వాంసుడు మరణానంతరము పరలోకము పొందునా?

పరబ్రహ్మ పరమాత్మ సృష్టికార్యము నెరవేర్చ సంకల్పించి జడచేతనమయ జగత్తును రచించి తాను కూడా అందు ప్రవిష్టుడాయెను. ఆయన మూర్త అమూర్తాది జడచేతన స్వరూపముల వ్యక్తమాయెను. కావున మనము చూచునది, వినునది, అర్థమ అర్థము చేసుకొను సమస్త జగత్తు సత్య స్వరూప పరమాత్మయే.

సప్తమ అనువాకము:- స్థూల సూక్ష్మ జడ చేతనమయ జగత్తు మొదట అవ్యక్త రూపమున నుండి యే నామరూపాత్మక జడచేతన జగత్తు ఉత్పన్నమాయెను. పరమాత్మయో జగద్రూప సుకృతుడు.

ఈ సూకృతనామధారి పరమాత్మ ఆనందస్వరూపుడు.జీవాత్మ జన్మ మరణ దుఃఖము నుండి విడివడి పూర్ణ, నిత్య అఖండానందమును పొందును. పరమాత్మయో సర్వ జగత్తునకు కర్త, ధర్త, ఆనందప్రదాత.

పరబ్రహ్మ పరమేశ్వరుని పొందగోరు జీవి పరమాత్మ నిర్భయ స్థితిని పొంది, భయ శోకరహితుడగును. పరమాత్మ యొక్క పూర్ణ స్థితి లాభము పొందక, నిరంతరము స్మరించక కొద్ది సమయమైనను మరచువాడు భయగ్రస్తుడై పునర్జన్మ పొందును. మృత్యు సమయమున ఏ భావమును స్మరించిన తదను సార పునర్జన్మ పొందును. పరమాత్మను స్మరించని వారు ఎంతటి పండితులైనను జన్మ మరణ భయమును పొందెదరు.

అష్టమ అనువాకము:- పరబ్రహ్మ పరమేశ్వరుని భయము చేతనే వాయువు వీచును. సూర్యుడు సమయమునకు ఉదయించుట అస్తమించుట జరుగును. అగ్ని, ఇంద్ర, మృత్యువు మొదలగు దేవతలందరు తమ తమ కార్యములు నియమపూర్వకముగా సువ్యవస్థితి రూపమున ఆచరించెదరు.అట్టి నియమనకర్తయే సత్యజ్ఞాన ఆనంద బ్రహ్మ.

సదాచార సంపన్న వేదవిదుడు రోగరహిత, సుదృఢ దేహముకల పురుషునికి ధన సంపదలతో కూడిన సంపూర్ణ పృధ్వి అతని అధికారమునకు వచ్చిన మానవలోకమందలి గొప్ప ఆనందము పొందును.

మనుష్య జన్మయందు ఉత్తమకర్మలచే గంధర్వభావము పొందినవాడు వందరెట్లు ఎక్కువ ఆనందముపొందును. మనుష్య గంధర్వ ఆనందము కంటె దేవ గంధర్వ ఆనందము వందరెట్లు ఎక్కువ. ఎవరు ఈ ఆనందమును కోరక వేదోపదేశమును హృదీయంగమము చేసుకొందురో అట్టి విద్వాంసునకు ఈ ఆనందము సహజముగా లంభించును. దేవగంధర్వ ఆనందము కంటె పితృలోక ఆనందము వందరెట్లు ఎక్కువ. అంతకంటె ఆజనజ దేవతల ఆనందము వందరెట్లు ఎక్కువ.అంతకంటె కర్మ దేవతల ఆనందము వందరెట్లు ఎక్కువ. అంతకంటె స్వభావసిద్ధ దేవతల ఆనందము వందరెట్లు ఎక్కువ. అంతకంటె ఇంద్రుని ఆనందము అంతకంటె బృహస్పతి ఆనందము అంతకంటె ప్రజాపతి హిరణ్య గర్భుని ఆనందము క్రమముగా వందేసి రెట్లు అధికము. ఇట్టి ఆనందము లన్నియు పూర్ణానంద స్వరూపుడగు పరమాత్మ ఆనందముకంటె తుచ్ఛమైనవే. సమస్త ఆనందములకు ఏకమాత్ర కేంద్రము పరమానంద స్వరూప పరమాత్మ. ఆయన సర్వాంతర్యామి. ఆయన మనుష్యులలోను, సూర్యునిలోను కూడా కలడు. పరంచ కోశముల అంతర్యామి ఆ పరమాత్మయే. అట్టి పరమానంద స్వరూప సర్వాంతర్యామి పరమాత్మను పొందుటయే జీవుని పరమావధి.

నవమ అనువాకము:- పరబ్రహ్మ పరమాత్మయొక్క ఆనందము తెలిసిన మహాపురుషులు నిర్భయులై శోకరహితులై యుందురు.లోభ, భయ, సంతాపముల కతీతుడగును. ఆసక్తి పూర్వకముగా చేయు కర్మలు జన్మ మరణ సంతాపహేతువులు, రాగద్వేషాదులు వదలి పరమాత్మ చింతనయందు సంలగ్నమగు వారు ఆత్మ రక్షణ ద్వారా పరమాత్మ పదము పొందెదరు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

------

తైత్తరీయోపనిషత్తు - భృగువల్లి.

ప్రధమ అనువాకము:- వరుణ పుత్రుడు భృగువు పరమాత్మ నుగూర్చి తెలిసికొన గోరి తండ్రి వద్దకు వెళ్లెను. వరుణుడు వేదము తెలిసిన బ్రహ్మ నిష్ఠాపరుడగు మహా పురుషుడు, ఆయన వత్సా! అన్నము, ప్రాణము, నేత్రము, శ్రోత్రము, మనస్సు, వాణి ఇవియన్నియు బ్రహామపలబ్ధికి ద్వారములు. ప్రత్యక్షము గాకనపడు ప్రాణులన్నియు ఎవని నుండి ఉత్పన్నమై, ఎవని బలముచేజీవించి, మహాప్రళయ కాలమున ఎవనియందు లీనమగుచున్నవో అతడే బ్రహ్మ. ఇట్లు తండ్రి ఉపదేశమును పొందిన భృగువు బ్రహ్మచర్యము నవలంబించి, శమదమాది నియమపాలన చేయుచు సంయమనముతో తపము చేసెను.

రెండవ అనువాకము:- భృగువు తండ్రి ఉపదేశానుసారము తపమొనర్చి అన్నమే పరబ్రహ్మయని నిశ్చయించెను. అన్నమునుండియే జీవులు పుట్టి, పెరిగి, గిట్టు చున్నవి. బ్రహ్మలక్షణములన్నియు అన్నములోకలవు. ఇట్లు తన నిశ్చయము తండ్రికి తెలుపగా ఆయన జవాబు నీయలేదు. ఏలనన భృగువు బ్రహ్మ యొక్క స్థూల రూపమునే గ్రహించెను. దీనివలన ఇతనికి హితముకాదు. కావున తపమొనర్పమని పలుకగా భృగువు మరల దీక్షాయుతుడై తపమొనర్చెను.

మూడవ అనువాకము:- బ్రహ్మయొక్క పూర్ణ లక్షణములు ప్రాణము నందుండుటచే ప్రాణమునే బ్రహ్మయని భృగువు తలచెను. సమస్త ప్రాణుల ప్రాణముచే ఉత్పన్నమై జీవించి, ప్రాణము పోయిన వెనుక మరణించు చున్నవి. ఇది విని నవరుణుడు ఈతని బుద్ధి ఇంకొంచెము సూక్ష్మమును చేరినది. ఇతడు ఇంకను చాలా తెలియవలసియున్నవాడని జవాబునీయక తపమొనర్పగోరెను. భృగువుయధా విధిగా తపమొనర్చెను.

నాల్గవ అనువాకము:- మనస్సునుండియే సర్వప్రాణలు ఉత్పన్నమగుచున్నవి. స్త్రీ పురుషుల మానసిక ప్రేమ పూర్ణ సంబంధముచే బీజ రూపమున తల్లి గర్భమున ప్రవేశించి జన్మనొంది, మానసిక ప్రేరణచే ఇంద్రియాదుల కర్మల ద్వారా జీవించి, మరణానంతరము మనస్సు లోనే విలీనమగుటచే మనస్సే బ్రహ్మయని తలచిన భృగువునకు సమాధానమీయక తపమొనర్ప తండ్రి యాదేశాను సారము భృగువు మరల తపముచేసెను.

ఐదవ అనువాకము:- విజ్ఞాన స్వరూప జీవాత్మ నుండియే ఉత్పత్తి, స్థితి, లయములు జరుగుటచే జీవాత్మనే బ్రహ్మముగా తలచిన భృగువుచెప్పినదివిని ఈతడు స్థూలము నుండి సూక్ష్మమువైపు వెళ్లుచు చేతన జీవాత్మను బ్రహ్మగా తలచెను. కాని బ్రహ్మజీవాత్మకంటె విలక్షణ ఆనంద స్వరూపుడు. కావున కుమారుని మరల తపమొనర్పగోరెను.

షష్ఠ అనువాకము:- ఇట్లు తపముద్వారా ఆనందమయ పరమాత్మయే. అన్నాది సర్వమునకు అంతరాత్మ. ఇవి బ్రహ్మయొక్క స్థూల రూపరములగుటచే వీనియందు బ్రహ్మ భావము కలుగుచున్నది. సర్వాంశమున బ్రహ్మయొక్క లక్షణములన్నియు ఆనందమునందేకలవు. ఆనందమయ పరబ్రహ్మ పరమాత్మనుండియే సృష్టి జరిగినది. బ్రహ్మయో సృష్టికి ఆదికారణము. పరమాత్మ యొక్క అచింత్య శక్తి యొక్క ప్రేరణచే సమస్త ప్రాణలు కర్మలు చేయుచున్నవి. సూర్యాదులు కూడా తమతమ కర్మల నొనరించుచు ప్రళయ కాలమున పరబ్రహ్మలో విలీనమగుచున్నారు. ఇదియే వరుణుని ద్వారా భృగువునకు తెలుప బడిన బ్రహ్మవిద్య. బ్రహ్మజ్ఞానులు శరీరము, అంతఃకరణలయందు విలక్షణ శక్తులు ఉత్పన్నమగును.

సప్తమ అనువాకము:- ఇందు అన్నము యొక్క మహత్వము తెలుపబడెను. అన్నాదులచే సుసంపన్నతను కోరి మనుజుడు అన్నమును నిందించక బ్రహ్మ రూపమున నెంచవలెను. మనుష్యుడు ఏ వస్తువును కాంక్షించునో దానింయందు మహత్వబుద్ధి కలిగి యుండవలెను. అన్నమే ప్రాణము. ప్రాణమే అన్నము. అన్నము నుండియే ప్రాణులు పుట్టును. అన్నరసము శరీరమంతటా వ్యాపించి ప్రాణాధార శరీరము బలపడును. అన్నములేనిదే ప్రాణము శరీర అవయముల సుష్కింపజేయును. అన్నరసమును శరీరమంతటా వ్యాపింపజేయును. కావున శరీరము ప్రాణము అన్యోన్యశ్రితములు.

అష్టమ అనువాకము:- ఇట్లు అన్నమును నిందించక దురపయోగపరచక అన్నతత్వము తెలియ వలెను. అన్న బాంద్య పదార్థములు, జలము నుండి ఉత్పన్నమగును. జ్యోతి లేక తేజస్సు జలరూప అన్నమును భక్షించును. సూర్యుడు జలమును శోషింప జేయునట్లు జఠరాగ్ని శరీరగత జలతత్వమును శోషింపజేయును. జలమునందు జ్యోతి బడబాగ్ని, విద్యుతోరూపమున ప్రతిష్టితమైనది. సూర్యునితేజస్సుచే శోషింప బడిన జలము మరల వర్ష రూపమున కురిసి అన్నోత్సాదనకు కారణమగుచున్నవి. ఇట్లు జలతేజములు అన్యోన్యాశ్రితములై అన్నాది ఖాద్య పదార్థములకు కారణ మగుచున్నవి. దీనివలన సమస్త భోగ సామగ్రి లభించును.

నవమ అనువాకము:- పృధ్వి, ఆకాశము రెండును అన్న స్వరూపములే. భూమి నుండియే అన్నము ఉత్పన్న మగును. ఆకాశము సర్వవ్యాపక మగుటచే పృధ్వి ఆకాశములు అన్యోన్యాశ్రితములే గాక ఆకాశము మొదట తత్వము. పృధ్వి ఆఖరి తత్వము. వాయు, తేజ, జలములు వీని అంతర్భాగములే. ఇట్లు ఆకాశ రూప అన్నమున పృధ్వి రూప అన్నము ప్రతిష్టితము. ఈ విజ్ఞానముచే సమస్త భోగపదార్ధముల అనుభవించును.

దశమ అనువాకము:- ఇందు అతిధి సేవా మహత్వము చెప్పబడినది. అతిధి దేవోభవ అను సూక్తి ననుసరించి అతిధిని దేవతగా భావించి సర్వవిధోపచారముల ఆతని సంతృప్తుని చేసిన వారికి అన్నాదులలోటు ఉండదు. అతిధి ని ఎట్లు సేవించిన అట్లే అన్నాదులు సులభ సామాన్య కష్టరీతుల లభించును.

ఇందు పరమాత్మ యొక్క విభూతుల సంక్షీపవర్ణన కలదు. సత్యవాణియందు ఆశీర్వాద పూర్వక పరమాత్మ యుండును. ప్రాణా పానములందు జీవనరక్షా శక్తి, కరణచరణాదులను ఉపయోగించు శక్తి, అంతయు పరమాత్మ శక్తియే.ఇట్లు మానవ శరీరమందు పరమాత్మ యొక్క ఆధ్యాత్మిక శక్తినుపాసించవలెను. అన్నము నుత్పన్ము చేయు జలము, విద్యుత్‌, సూర్యచంద్ర తారాగణము, సర్వము పరమాత్మ యొక్క అచింత్య శక్తి యొక్క అంశ మాత్రమే (గీ.10/41)ఉపాస్యదేవతను ఏభావమున ఉపాసించిన ఆయా శక్తులు లభించును. ఉపాస్యదేవత యొక్క ఉపాసన ప్రకారాంతరీయమున పరబ్రహ్మ పరమేశ్వర ఉపాసనయే. కావున సర్వదేవతలను సర్వశక్తి వంతుడగు. పరమాత్మగా ఉపాసించిన ఆయననే పొందెదరు. సర్వ ప్రాణులయందు అంతర్యామి రూపమున పరమాత్మ విరాజిల్లుచున్నాడు. నానారూపములు ఆయన యొక్క అభివ్యక్తియే. ఇట్లు స్థూలమునుండి సూక్ష్మమునకు పయనించి పరమానంద స్వరూపుని పొందవలెను. ఈ సంపూర్ణ భోగసామగ్రి అనుభవించు జీవాత్మ రెంటిని సంయోగపరచు పరమాత్మ అంతయు నేనే అనుభావము మిక్కిలి ఆశ్చర్యకరము. సర్వ ప్రధాన బ్రహ్మ. పరమానంద కారక అమృత స్వరూప బ్రహ్మనాకంటె వేరుకాదు. కావున అవి అన్నియు నేనే. ఇట్లు తనను బ్రహ్మగా తెలిసికొని బ్రహ్మానంద పదము పొందవలెను.

-----

తైత్తరీయోపనిషత్తు సమాప్తము.

ఓం తత్‌ సత్‌. ఓం తత్‌ సత్‌, ఓం తత్‌ సత్‌.

ఓం శాంతిః శాంతిః శాంతిః.

-------------

SARA SUDHA CHINDRIK    Chapters