Sruthi Sourabham    Chapters    Last Page

1. అభిప్రాయములు

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు

శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యేత్యాది సమస్త బిరుదావళీ విరాజమాన

శ్రీ పుష్పగిరి పీఠాధీశ్వరులు

శ్రీ మదభినవోద్దండ శ్రీ విద్యానృసింహ భారతీస్వామివారు అస్మదత్యంత

ప్రియ శిష్యులు

శ్రీ డాక్టర్‌ చిఱ్ఱావూరి శివరామకృష్ణశాస్త్రివారికి

ఆశీఃపరంపరాపూర్వకముగా వ్రాయించిపంపు నారాయణ స్మరణ పత్రిక

అనన్తరమ్‌

చిరంజీవి చిఱ్ఱావూరి శివరామకృష్ణశాస్త్రిగారు మా పీఠమునకు సుపరిచితులు. వీరింతకుముందు ఆంధ్ర సంస్కృత భాషలందు రచించిన గ్రంథములను మేము విని ఆనందించితిమి.

వీరు మా వేదశాస్త్ర రక్షణ పరిషత్తుకు సేవకులు. వీరు ప్రశ్నోత్తర రత్నమాలికయను పేరుతో పరిషత్తు తరపున ఒక గ్రంథమును ప్రకటించినారు.

వీరు పరిషత్ప్రారంభమునుండి పరిషత్కార్యములందు పాల్గొనుటయే గాక ప్రతి సంవత్సరము విద్యారణ్య సంస్మరణ సభలయందు పాల్గొని అనేక విషయములపై ఉపన్యసించియున్నారు. కావుననే లోగడ 'విద్యాలంకార' బిరుద మొసగి ఆశీర్వదించితిమి.

వీరు లోగడ సాయణాచార్యులవారి వేదభాష్యభూమికపై ఉపన్యసించుట మా స్మృతిపథముననున్నది. వీరి బృహదారణ్యక పరిచయము మా 'పుష్పగిరి భారతి' సంచికలో ప్రచురించితిమి. పై విషయములతోపాటు వేద విషయక వ్యాసములను 'శ్రుతి సౌరభమను' పేర ప్రచురించుట ముదావహము.

వేదములో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ మాత్రమేకాక గణితవిద్య, వైద్యశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము, దూరదర్శన, దూర శ్రవణములు, యోగముద్వారా రోగనివారణము, యోగసిద్ధ్యుపాయము, ¸°వనదాయక యోగము, ధారణమార్గములు, మొదలగునవి కలవని వెల్లడించుట ఆనందదాయకము.

ఇవి వేదమహత్త్వ ఖ్యాపకములైన విషయములు. బహుళ ప్రయోజన సాధకమైన వేదమాతతో సఖ్యముచేసిన ఆ తల్లి అనుగ్రహముచే ఎన్నియో విజ్ఞాన రహస్యములభివ్యక్తములగును.

'అత్రాసఖాయ స్సఖ్యాని జానతే' అని శ్రుతియే తనతో చెలిమిచేసి తరించుడని బోధించినది. చిరంజీవి శివరామకృష్ణశాస్త్రిగారు భక్తి శ్రద్ధలతో, వేదమాతతో చెలిమిచేసి, ఆ విజ్ఞానామృతమును అందరికి పంచగలరని ఆశించుచున్నాము.

శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహముచే వీరి కృషి యితోధికముగా అభివృద్ధి పొందునుగాక. ఈ పుస్తక ముద్రణమునకు ద్రవ్యమొసగిన వారి కుటుంబములను శ్రీ శారదాచంద్రమౌళీశ్వరులు అనుగ్రహించుదురుగాక.

ఇతి

నారాయణ స్మృతయః

శ్రీ విద్యానృసింహభారతీస్వామినః

''మహామహోపాధ్యాయ'', ''రాష్ట్రపతి అవార్డు గ్రహీత''

''వేద మీమాంసా సార్వభౌమ'', ''వేదార్థ సమ్రాట్‌'', ''శాస్త్ర రత్నాకర''

రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి

'శ్రుతి సౌరభ' మను ఈ గ్రంథమును రచించిన చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మగారు పరిపూర్ణ వేదాధ్యయనమేగాక సంస్కృతాంధ్రములలో ఎక్కువ పరిశ్రమ చేయడంతోబాటు విమర్శనాశక్తి కూడా గలవారు. వీరి ముత్తాతగారు శ్రీ కృష్ణశాస్త్రిగారు మన్త్ర శాస్త్రములో చాలా ప్రవీణులు. కేవలం శాస్త్రసంబంధ వైదుష్యమే గాదు అనుష్ఠానవిశేషము చేతగూడను మన్త్రసిద్ధి గలవారని, అన్నవరం, రమాసహిత సత్యనారాయణస్వామివారియొక్క యన్త్ర ప్రతిష్ఠను వారే జరిపించినారని ప్రాచీనులు చెప్పుట గలదు. ఆ దేవాలయము యొక్క వైభవము శ్రీ స్వామివారిని దర్శించి అర్చించినవార్కి పరోక్షముగా జాలదు. దానివలన శాస్త్రిగారి యొక్క మన్త్రసిద్ధి ప్రస్ఫుట మగుచున్నది. వీరితండ్రిగారు శ్రీ అనన్త పద్మనాభశాస్త్రిగారు వ్యాకరణశాస్త్రములో దిట్టలగుటయే గాక, భారత భాగవతాద్యనేక పురాణములను అనేక పర్యాయములు ప్రవచించిన మహామనీషులు. అట్టివారియొక్క ప్రపౌత్రులు పుత్రులగుటచే ఆభిజాత్యముచే ఉత్తమ వంశీయులగుటయే గాక పెద్దలయొక్క ఛాయలు వీరియందు సంక్రమించుటచే చక్కని వైదుష్యము గలవారయి శ్రుతిసౌరభ మను పేరుతో షోడశప్రకరణాత్మక గ్రంథమును రచించిరి. ఇందలి 16 ప్రకరణములను ఆమూలాగ్రముగా చదివితిని.

భారతీయ సంస్కృతి అంతయూ వేదమూలకమయినదని, వేదములు చాలా అనాదిసిద్ధములు, అపౌరుషేయములు, స్వతఃప్రామాణ్యము గలవి యని మీమాంసాది శాస్త్రములచే నిర్ణయింపబడినవయి కేవలం ఆధ్యాత్మికమయిన, పారమ్పర్యముగాను, సాక్షాత్తుగాను మోక్షసాధనములయిన ధర్మజ్ఞాన ప్రతిపాదకము లగుటయేగాక ఆనుషంగికముగా భౌతికవిజ్ఞానవిశేషములను కూడా ప్రతిపాదించుచున్నవని, ఇతరుల యొక్క శంకలకు సమాధానముగా సప్రమాణముగా ఈ గ్రంథమును రచించుటయందు తాత్పర్యమని తెలియుచున్నది. ఈ గ్రంథనామమునకు ఇందలి మొదటి రెండు ప్రకరణములు చారిత్రకములగుటచే పరస్పర సమన్వయముగాదని నేను అభిప్రాయపడుచున్నాను.

మిగిలిన ప్రకరణములలో శ్రుత్యర్థ ప్రతిపాదన పురస్సరముగా, ఇతిహాస పురాణములకు ఆయుర్వేద, మన్త్రశాస్త్ర, యోగశాస్త్రము మున్నగువాటికి వేదము మూలమెట్లు అగుచున్నదో, వాటియొక్క సహాయముతో వేదార్థమెట్లు వివరించవలెనో ఆ పద్ధతిని సప్రమాణముగా నిరూపించిరి. ఇంతియేగాదు. వేదము పరమపురుషార్థసాధనమగు జ్ఞానమును ప్రతిపాదించుటలో తాత్పర్యము గలదయిననూ, మన జీవనవిధానమునకుపయోగించు వ్యవసాయ విషయము ఇప్పటి వారనుకున్నట్లు స్త్రీలకు వేదాధ్యయన అధికారము లేదనుట వారిని అగౌరవపరచుట అనువాదమునకు వేదమెంతవారిని గౌరవించినచో ఆయా విషయములను నిరూపించుచూ, గార్గి, మైత్రేయ మున్నగువారిని ఉదాహరించువారలకు స్త్రీలు బ్రహ్మవాదినులు, సద్యోవధ్వలు అని రెండు విధములని గార్గి మొదలగు వారు మొదటికోవకు చెందినవారని నిరూపించిరి. మరియు పరమాత్మ ఒక్కడే అని నిర్ణయించినది వేద సిద్ధాంతము. శ్రుతి స్మృతి పురాణాదుల యందు అనేక దేవతామూర్తులు ప్రతిపాదింపబడినవి. వారిని ఆరాధించు మార్గములు కూడా చూపబడినవి. ఇది పరస్పర విరుద్ధాంశమని ఆక్షేపించువారికి 'ఉపాసకానాం ఉపాసనా కార్యార్థం బ్రహ్మణోరూపకల్పనా' ఇత్యాది ప్రమాణములతో సమాధానము నొసగిరి.

ఇట్లనేక నూతన విషయములను వేదార్థోపబృంహకములతో సమన్వయ పరచుచూ నిరూపించుటకు గ్రంథకర్త అత్యన్త శ్రమకోర్చి అనేక సంప్రదాయములకు సంబంధించిన వివిధ గ్రంథములను పరిశీలించినట్లు ఈ గ్రంథపఠనము చేయువారలకు స్పష్టముకాగలదు.

ఇట్టి అపూర్వమయిన శ్రుతి సౌరభమును బహుజనులు చదివి గ్రంథకర్త యొక్క శ్రమను సార్థకం చేయవలెనని, గ్రంథకర్త సప్రమాణముగా బహుజనులకుపయోగించు అనేక గ్రంథములను రచించవలెననియు, వీరికి పరిపూర్ణమయిన దీర్ఘాయుస్సును యిచ్చి పరమేశ్వరుడనుగ్రహించుగాక యని నా ఆశీస్సులు.

ఇట్లు

రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి

ప్రిన్సిపాల్‌

శ్రీ గౌతమీ విద్యాపీఠం

రాజమండ్రి - 5

విద్యాలంకార డాక్టర్‌ చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మగారు వ్రాసిన 16 అమూల్య వ్యాసములను ఆమూలచూడము చదివితిని. శ్రీ శర్మగారు వేదాధ్యయన పరులు. సంస్కృతాంధ్ర భాషావేత్తలు. మంచి పరిశోధకులు. వారు వ్రాసిన వ్యాసములలో వారి వైదుష్యము, పరిశోధనా సామర్థ్యము, విషయ వివేచన పద్ధతి శ్రోతలను ఆకర్షించగలవు. సాధారణముగ వేదపండితులు విమర్శల జోలికి, చరిత్ర వైపు కూడ మొగ్గుచూపరు. శ్రీ శాస్త్రిగారు హరప్పాలో దొరకిన పశుపతి దేవుని ముద్రికను ఆధారముగ చేసికొని గావించిన విచారణలో వారి చారిత్రక దృష్టి మనకు విశదమగును.

వారి వ్యాసములలో మూల గ్రంథముల నుదాహరించి అవసరమగు చోట విద్యారణ్యాదుల వ్యాఖ్యను గూడ ఉల్లేఖించి విచారణ గావించుట ప్రామాణికతను సంతరించి పెట్టుచున్నది. ఈ 16 వ్యాసములలో వారి బహుముఖ పాండిత్యము స్పష్టమగుచున్నది.

''వేదంలో సేద్యం'' ''కొన్ని ఓషధులు - వినియోగాలు'' అను వ్యాసాలు ఈనాటి పరిశోధకులకు చాల ఉపయోగకరములు కాగలవు. భారతీయ సంస్కృతిలో స్త్రీల విశిష్టత 'వేదాలలో స్త్రీలు' అను వ్యాసములో వివరించబడినది.

వేదములలో సూక్ష్మరూపముగ చెప్పబడిన విషయములు పురాణములలో విస్తృతముగ విశదీకరింపబడినను విషయము 'వేదోపబృంహణం' అను వ్యాసములో సోదాహరణముగ చూపినారు.

విజ్ఞాన శాస్త్ర విషయములను గురించిన విచారణ 'వేదవిజ్ఞానము' 'సర్వసార సంగ్రహోపనిషది విజ్ఞాన శాస్త్రమ్‌' అను వ్యాసములలో కావింపబడినది. కాచిన నీరు ఎన్ని విధములో, వాటి వలన వచ్చు ఫలితములను చూపుచూ వివరించుట, 'నేల, నింగి, నీటిల్లో నడిచే వాహనాలు' అను శీర్షికతో జరిపిన విచారణ, శస్త్ర చికిత్సలకు సంబంధించిన సంక్షిప్తసమాచారము పాఠకులను ఆకర్షించగలవు.

పయి పదునారు వ్యాసములు 'శ్రుతి సౌరభము' పేరిట గ్రంథరూపమును బొందగలవని విని చాల యానందించుచున్నాను. ఇట్లే వేదములలోని ఇతర విషయములను గూడ జనసామాన్యమునకు అందజేయుటకు కృషి సాగింపవలసినదిగ శ్రీ శర్మగారిని కోరుచూ వారికి అట్టి శక్తియుక్తులను ప్రసాదించవలసినదిగ సర్వేశ్వరుని ప్రార్థించు చున్నాను.

ఆంధ్ర పాఠకులీ అమూల్యగ్రంథమును చదివి వైదిక విజ్ఞాన వైశిష్ట్యమును గుర్తించెదరని నమ్ముచున్నాను. శ్రీ శర్మగారి పాండితీ వైభవమునకు ఆనందించుచు, వారు చేయుచున్న కృషిని మనఃపూర్వకముగ అభినందించు చున్నాను.

స్వస్తి.

ఇట్లు

విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి

28-2-2000

'ధర్మశాస్త్ర రత్నాకర', 'వేదభాష్యాచార్య'

విష్ణుభట్ల శ్రీరామమూర్తి శాస్త్రి

చిత్రం అగ్రహారం

అపౌరుషేయమైన వేదము సర్వోత్తమ మైన విద్య. దీనికి శంకర భగవత్పాదాచార్యులవారు సూత్రభాష్యమందలి శాస్త్ర యోన్యధికరణ మందు మూడు బిరుదముల నిచ్చి యున్నారు. 'ప్రదీపవత్‌ సర్వావస్థావద్యోతినః సర్వజ్ఞానాకరస్య సర్వజ్ఞ కల్పస్య అస్య ఋగ్వేదాది లక్షణస్య శాస్త్రస్య యోనిః కారణం యథా పాణిన్యాదిః వ్యాకరణస్య' 'సర్వవిద్యాస్థానోప బృంహితస్య' అని వారు వ్రాసిరి.

లోకములో వేదవిరుద్ధమయిన సర్వజ్ఞానమునకు వేదమే మూలము. 'సర్వం వేదాత్ర్పసిద్ధ్యతి' అని మనువు చెప్పిరి. కాన సర్వవిద్యలు వేదమందున్న విషయములను స్పష్టముగా తెలియజేయుటకే బయలుదేరినవి.

వీటి నన్నిటిని బరిశీలించి ప్రజానీకమున ఆస్తికత్వమును వృద్ధి జేయుట పండితుల కర్తవ్యము. పండితులు నిస్స్వార్థబుద్ధితో, కేవల పరమార్థ దృష్టితో ప్రజల కీజ్ఞానము నందించుటయు, దానిని ప్రజలు మాత్సర్యము లేనివారై శ్రద్ధాళువులయి, బాగుగా బరిశీలించి, ధర్మతత్పరులయి పరమాత్మ సాయుజ్యమును బొందుటకు ప్రయత్నించ వలెను.

డాక్టర్‌ చిఱ్ఱావూరి శివరామకృష్ణశాస్త్రిగారు గురువుల యొద్ద వేదశాస్త్రముల నభ్యసించి మేధాబలముతో సమగ్రముగా నన్నియు బరిశీలించి శాస్త్రావిరోధముగా, నిస్స్వార్థబుద్ధితో ప్రజలకు వేదజ్ఞానము నందించుచున్నారు. కావున భక్తులు, పండితులు, అందరు నిర్మత్సరులయి వారి గ్రంథములను పరిశీలించి గ్రహించి పరమాత్ముని సేవకు, అనుగ్రహమునకు పాత్రులు కావలసినదిగా బ్రార్థించుచున్నాను.

వీరు ఋగ్వేద యజుర్వేదాథర్వణ వేదమంత్రములలో ప్రస్తుత లోకోపయోగులయిన నౌ, వైద్య విమానాది విషయములను నిరూపించినారు. మేధావులయిన వైజ్ఞానికులు అనేక యంత్రసామగ్రిని తయారుచేసియున్నారు. వారిని గౌరవించుచు, వారిని వేద విజ్ఞాన మహత్త్వమును గూడ గుర్తింప గోరుచున్నాను. శాస్త్రిగారి రచన లందరికి జ్ఞానవృద్ధికి సోపానములే. వీటిలో యోగమార్గమును జెప్పు మంత్రబ్రాహ్మణములు, పతంజలి యోగసూత్రములు, వ్యాఖ్యానము కలవు.

ప్రస్తుతము ప్రాణాయామమును గూడ తెలిసికొనలేని కాలమున యోగ మార్గమత్యావశ్యకము.

కావున వీరి కీశ్వరుడు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి కలుగజేయుగాక. వీరి రచనలు పురోభివృద్ధిని పొందుగాక. వీటి వలన ప్రజలు సుఖింతురు గాక.

ఇట్లు

విష్ణుభట్ల శ్రీరామమూర్తి శాస్త్రి

'విద్వన్మణి', 'విద్యాలంకార', 'సాహిత్యవిద్యాభాషాప్రవీణ'

శ్రీ కూచిభట్ల చంద్రశేఖరశర్మ M.A.(Skt. & Tel.)

''ఆస్థాన విద్వాన్‌'' అవధూత దత్తపీఠం, మైసూరు

''ఆస్థాన పండితుడు'' శ్రీ సిద్ధేశ్వరీ పీఠం, కుర్తాళం.

''చిఱ్ఱావూరి'' అనే యింటిపేరు చెవిని బడగానే ఒక మహామనీషి మనసులో మెదలటం జరుగుతుంది. ఆ మహనీయుని పూర్వుల మహిమా విశేషాలయితే నాకు తెలియదు కాని ఆ తపస్వి విగ్రహం మాత్రం కనులముందిప్పటికీ స్పష్టంగా నడయాడుతున్నట్లు చిన్ముద్రతో కూర్చొని ఉపదేశిస్తున్నట్లు గోచరిస్తుంది.

ఇంతకూ ఆ సుగృహీత నామధేయులయిన అన్వర్థ పండితులెవరో కాదు. బ్రహ్మశ్రీ చిఱ్ఱావూరి అనంతపద్మనాభశాస్త్రిగారు.

శ్రీ శాస్త్రిగారు పుంభావసరస్వతులు. త్యాగంతో ఒప్పే గొప్ప జ్ఞానులు. పురాణ ప్రవచనంలో వ్యాసులు. భాష్యాదిప్రవచనంలో బ్రహ్మణ్యులు. ఒక్కమాటలో చెప్పాలంటే గర్వగంధమెరుగని వ్యక్తి. అధీతి బోధాచరణప్రచారణ ప్రవణులు.

ఆ పుణ్యపురుషుని కుమారరత్నమే డాక్టర్‌ బ్రహ్మశ్రీ చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మగారు. వేదశాస్త్రాలు తపస్సుగా భావించి కృతకృత్యులయిన విపశ్చిద్వరులు. అలాంటి కూలంకషప్రజ్ఞామూర్తి నాకు ఆత్మీయులు, సహృదయ సుహృద్వరులు కావటం నా భాగధేయంగా భావిస్తున్నాను.

ప్రస్తుతం వీరు చేసిన యీ వ్యాస సంపుటి రచన వారి భావనాపటిమకు నిర్దుష్టమైన అవగాహన శక్తికి అంతకు మించి వేదప్రమాణబుద్ధికి అద్దం పడుతున్నది. ఆయనగారి హృదయ జలధిలోపల అట్టడుగున పుట్టిన అంతర్మథనం ఆవేదనతో సాగింది. భారతీయ సమాజానికి యథార్థ్యాన్ని చెప్పాలనే తపన పెల్లుబికింది. అసలు వేదసంస్కృతి మరుగయిపోతోందే అనే వ్యథ పట్టి పీడించింది. ఈ మనస్సాగరమథనంలో ఆవిర్భవించిన అమృతభాండమే యీ వ్యాస సంపుటి.

ఇది శర్మగారు చేసిన సప్రమాణ పరిశోధన. ఒక డాక్టరేటుకు తగిన సామగ్రి యిందులో వుంది.

ఈ సంపుటిలో పదిహేడు విషయాలు ఊచమట్టుగా పరిశీలించి ప్రమాణపూర్వకంగా నిరూపించటం జరిగింది.

పాశ్చాత్యులు నూరిపోసిన అస్తవ్యస్తవిషయాల అంధకారంలో ''శతాంధాః కూపంప్రవిశంతి'' అన్నట్లు గతానుగతికంగా గమ్యం తెలియకుండా నడచిపోతూన్నవారికి మణిదీపంగా వస్తుదర్శనం చేయిస్తున్నదీ రచన.

భగవత్తత్వం ఎంత అనాదినిధనమో వేదరాశికూడా అంత ఆద్యంత రహితం. అది శ్రుతిమాత్రమే అపౌరుషేయం. అనంత విషయాలను అందిస్తున్న స్వయం సంపూర్ణం.

ప్రాక్పాశ్చాత్య పండిత పరిశోధకులు తమ ప్రజ్ఞనంతా వినియోగించి జీవితాలు వెచ్చించినా ఆ వేదవాఙ్మయ సనాతనత్వాన్ని అర్థం చేసికోలేకపోయారు. ఏకవాక్యత లేని అభిప్రాయాలను మాత్రమే ప్రకటించారు.

సర్వమతాలకు అతీతంగాను, సర్వమతాలకు జీవగఱ్ఱగాను నిలచిన వేదవాఙ్మయాన్ని ఒక మహాధర్మప్రబోధకంగాను, ధర్మానికి మూలంగాను అవగాహన చేసికొని ఆరాధించిన మతాలేవీ లేవు ఒక్క హిందూ మతం తప్ప. వేదధర్మమే ఊపిరిగా పెట్టుకొన్న హిందూమతం ఒక్కటే సమగ్రమైంది. అజరామరమయిందీన్ని.

వేదప్రతిపాదిత ధర్మాల్లో ఏకదేశాన్ని మాత్రమే తీసికొని కొన్నిమతాలు పుట్టాయి. కొన్ని వేదదూరంగా మసలుతూ నాస్తికమతముద్ర వేసుకున్నాయి. ''ధర్మోవిశ్వస్యజగతః ప్రతిష్ఠా'' సర్వసృష్టికీ ఆధారభూతంగా వున్నదే ధర్మమనే నిర్వచనం హైందవేతర మతాలకు తెలియదు.

నాగరకతయే ధర్మమనుకొనే భ్రాంతిలో వున్నవాళ్ళు కోతిలోంచి మనిషి పుట్టాడంటే నమ్మక ఏంచేస్తారు? వాళ్ళకు హరప్పా మొదలయిన చోట్ల వేదసంస్కృతి వుందనేది యెలా తెలుస్తుంది?

ఆధునిక విజ్ఞానము వేదంలో వున్నదనే విషయం ఎంతమందికి తెలుసు? కొయ్యతో కూడా విమాననిర్మాణం చేయటముందనేది భరద్వాజుణ్ణి ఎరగనివాళ్ళకు ఎలా అవగాహన అవుతుంది?

సకల విద్యలు, కళలు, శాస్త్రాలు, ఓషధులు, వైద్యం మొదలయిన అనేక విషయాలను సృష్టిక్రమాన్ని పూర్తిగా చెప్పింది వేదమే అనేది నిర్వివాదం.

అసలు జీవుడికి పరమాత్మకు భేదం లేదు. అజ్ఞానం వల్ల భేదం ఏర్పడింది. జ్ఞానం కలిగి అజ్ఞానం అడ్డుతప్పుకొంటే సర్వమూ ఒకటే రెండోదనేది లేదనే పరమసత్యాన్ని చెప్పిన వేదాంతాలయిన ఉపనిషత్తులే సనాతన భారతీయతకు పునాది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం సమాజానికి ప్రసాదించింది వేదాలే.

దీన్ని ఆలంబనం చేసుకొని శివరామకృష్ణశర్మగారు ఈ పదిహేడు విషయాలను పరిశోధన దృష్టితో సప్రమాణంగా నిరూపించి కృతకృత్యులయ్యారు. ఈ గ్రంథం ప్రతి భారతీయుడు చదివి మనసుకు పట్టించుకొంటే అజ్ఞాన ప్రలాపాలేవీ కలుషితం చేయలేవు. ఇలాంటి ఉత్తమగ్రంథాలను వెలువరించే శక్తిని, ఆయురారోగ్యాలను శర్మగారికి భగవంతుడనుగ్రహించాలని ప్రార్థిస్తూ, ఆయన్ని మనసారా అభినందిస్తున్నా.

- శ్రీ కూచిభట్ల చంద్రశేఖరశర్మ

సర్వా రామమోహనప్రసాద్‌

M.A. M.Phil. (History)

ప్రిన్సిపాల్‌ (రిటైర్డ్‌)

ఎస్‌.పి.ఎమ్‌.హెచ్‌. కళాశాల

మచిలీపట్నం.

డా|| చిఱ్ఱావూరి శివరామకృష్ణ మహోదయులు జగమెరిగిన బ్రాహ్మణులు. సంస్కృతాంధ్ర భాషలలో వారి పాండిత్యము నిరుపమానము. శ్రీ శర్మగారు తమ రచనల ద్వారా, ఉపన్యాసముల ద్వారా భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను తెలియబరచుచున్నారు. ''శ్రుతిసౌరభము'' అని పేరిడిన వారి ఈ రచన వైదిక విజ్ఞానములోని అనేక విశేషములను తెలియజేయు వ్యాసముల సముదాయము.

తెలుగువారి సాహిత్యసంపదలో ప్రత్యేకముగా పేర్కొనదగినది 'కన్యాశుల్కము' అను నాటకము. ఇందు అగ్నిహోత్రావధానులు అను పాత్రచే ''అవన్నీ మన వేదాలలో వున్నాయిష'' అని పలికించారు అప్పారావు పంతులుగారు. ఆ మాటలు అక్షరసత్యాలని శ్రీ శర్మగారు తమ వ్యాసాలలో నిరూపించారు.

మొహంజోదారో-హరప్పా నాగరకతలను వివరించు పరిశీలనాత్మక వ్యాసములలో శివారాధనను, హయగ్రీవారాధనను, యజ్ఞయాగాల నిర్వహణను తిరుగులేని సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది. ఈ సంస్కృతి వేద సంస్కృతియే అని నిరూపించడంతో, ఆ నాగరకతల పుట్టుపూర్వోత్తరాల గురించి దాదాపు 8 దశాబ్దాలుగా జరుగుతున్న వివాదానికి శర్మగారు పరిష్కారం సూచించారని చెప్పవచ్చును. అంతేగాక హరప్పా శిథిలాలలో లభించిన చిత్రలిపిని అవగాహన చేసుకొనుటకు మార్గము సూచించబడినది. మనదేశంలోని లిపులన్నీ ప్రణవం నుండి ఆవిర్భవించిన విధానాన్ని ఒక చక్కని పరిశోధనా వ్యాసంలో వర్ణించారు.

భారతీయులకు మిక్కిలి పవిత్రమైనది గంగానది.''గంగా'' అను శబ్దము ఆస్ట్రిక్‌ భాషా కుటుంబమునకు చెందిన ''కియాంగ్‌'' అను పదము నుండి రూపాంతరములు చెంది సంస్కృత భాషలో ''గంగా'' అను శబ్దముగా మారినదని ప్రసిద్ధ భాషావేత్త శ్రీ సునీల్‌కుమార్‌ ఛటర్జీ ప్రతిపాదించిరి. శ్రీ శర్మగారు ఈ వాదమును త్రోసిపుచ్చును, ''గంగ'' శబ్దము సంస్కృతము నుండి యుద్భవించినదనుటకు ప్రమాణములు ఉదాహరించారు. ''ఏ దేశమున నేవస్తువులుండునో ఆదేశమున తద్వాచకపదములుండుట ఆవశ్యకము. గంగ భారతదేశమయిన హిమాలయమున బుట్టినది. ఈ దేశమునందు బ్రవహించినది. కావున దానికిచటి భాషలలో పేరుండుట యుక్తిసమ్మతము'' ఈ వాక్యములు వ్యాసకర్త ప్రతభను విశదపరచుచున్నవి.

''వేదవిజ్ఞానము''అనే వ్యాసం నిజంగానే విజ్ఞానదాయకంగా నున్నది. కృష్ణయజుర్వేదము నుండి అథర్వణ వేదమునుండి మూలమంత్రాలను ఉదాహరిస్తూ, ఈనాటి వాటర్‌ థెరఫీ ''కృత్రిమ అవయవాల అమరిక'' మొదలైన వైద్యప్రక్రియలు, విమానము, ఓడ మొదలగువానినిర్మాణ విధానాలూ చర్చించారు.

''వేదాలలో స్త్రీలు'' అనే వ్యాసంలో అనాదినుండి భారతీయ సంస్కృతిలో స్త్రీలకు సమున్నతమైన స్థానం గలదని తెలియచెప్పడం జరిగింది. ఈనాటి ఫెమినిస్ట్‌లు, 'విమన్స్‌ లిబ్‌' వాదులు ఈ వ్యాసం ప్రత్యేకంగా పఠించాలి. ఇదే వ్యాసంలో సతీసహగమనాన్ని గురించి మరింతగా వివరిస్తే బాగుండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. ఐతే అప్పటికే వ్యాసం సుదీర్ఘమగుటచేత, శ్రీ శర్మగారు సంగ్రహంగా వ్రాసియుండవచ్చు.

ఇదేవిధంగా ఈ సంకలనంలోని ఇతర వ్యాసాలు కూడా సాక్ష్యాధార పూర్వకంగా, యుక్తియుక్తంగా రచింపబడ్డాయి. 'శ్రుతిసౌరభం' పేరుకు తగినట్లుగా మన శ్రుతి, స్మృతుల సుగంధ పరిమళాలను వెదజల్లుతూ పాఠకులందరకూ విజ్ఞానదాయకంగా ఉన్నాయి. మనం భారతీయులమని గర్వపడేట్టు చేస్తున్నాయి. శ్రీ శర్మగారి రచనాపటిమను, ఆర్ష విజ్ఞానాన్ని నిరూపిస్తున్నాయి.

ఇట్లు

సర్వా రామమోహనప్రసాద్‌

Sruthi Sourabham    Chapters    Last Page