Sruthi Sourabham
Chapters
Last Page 7. అథర్వణ వేదంలో కొన్ని ఓషధుల వినియోగాలు - ఫలాలు వేదములు ఐహికాముష్మిక ఫలసాధనాలు. వీనిలో అథర్వణ వేదమున ఐహిక ప్రయోజనములను సాధించుకొనుటకు పలు సాధనములు కలవు. వానిలో కొన్నిటిని గమనింతము. 1. అభీవర్తమణిని ధరిస్తే వ్యక్తి గొప్పవాడవుతాడు. శత్రువులను జయించడానికి ఆర్థికాభివృద్ధికి ఆ మణిధారణం తోడ్పడుతుంది. అభీవర్తమణి అంటే వ్యాఖ్యాతలు చక్రనేమి నిర్మిత మణి అని వ్రాశారు. దీని స్వరూప స్వభావాలు అన్వేషించాలి. (అథర్వణ - 1 కాం. - 6 అ. - 29 సూ.) 2. మధుక ఓషధిని నమిలితే మనోభావాలలో వాక్కులో మాధుర్యం కలుగుతుంది. దానిని ధరించిన వారి సాన్నిహిత్యం స్వపరప్రీతికర మవుతుంది. నీటిఇప్ప, తిప్పతీగె మధుక పదానికి అర్థాలని వ్యాఖ్యాతల వచనం.
(అథర్వణ - 1 కాం. - 6 అ. - 34 సూ.) 3. శ్యామవర్ణం కల ఒక ఓషధి కుష్ఠును తొలగిస్తుంది. అది నీల్యాది ఔషధమని వ్యాఖ్యాత చెప్పారు. దీని స్వరూప స్వభావాలను పరిశోధించాలి.
(అథర్వణ - 1-5 కాం. - 24 సూ.) 4. ఇనుప గొడ్డలిని కాల్చి నీటిలో వేసి ఆ నీటితో శీతజ్వర బాధితునకు అభిషేకం చేస్తే ఉపశాంతి కలుగుతుంది.
(అథర్వణ - 1 కాం. - 5 అను. - 25 సూ. 1 మం.) 5. ఉపజీకములు సముద్రము నుండి రోగనివారకమయిన ఔషధాన్ని పైకి కొని వస్తాయి. దీనివల్ల అతిసారం మొదలయిన రోగాలు నశిస్తాయి. ఉపజిహ్విక, ఉపజీక, ఉపదీక అను పేరులు ఒకరకమయిన చీమలను చెప్తాయని వ్యాఖ్యాతలంటారు. (అథర్వణ - 2 కాం. - 5 అను. - 25 సూ. 1 మం.) 6. ముంజ పర్వతం మీద నున్న దర్భ అతీసారాది రోగాలు తగ్గిస్తుంది. మంత్రంలో పర్వతం, భేషజం అనే పేరులు మాత్రమే ఉన్నాయి. కాని సాయనాచార్య భాష్యం ఆ పర్వతం ముంజపర్వతమనియు, ఆ ఓషధిదర్భ అనియు వివరించింది. ముంజ పర్వత మెచ్చటిదో అన్వేషించాలి. (అథర్వణ - 2-1-3-4) 7. జంగిడ మణిని ధరిస్తే చిరకాల జీవనం, విఘ్ననివారణం, ఆత్మరక్షణం కలుగుతాయి. ఇది రోగాది నివారకం. వారణాసిలో ప్రసిద్ధమయిన వృక్షం జంగిడమని సాయణాచార్య భాష్యం చెబుతుంది. (అథర్వణ - 2-1-2-4)జంగిడమణిని శణమనే త్రాటితో ధరిస్తారు. శణమంటే జనుము. ఇది కూడా విఘ్న నివారకం. (అథర్వణ -2-1-4-5) 8. క్షేత్రియ రోగాన్ని దర్భ, (అథర్వణ - 2-2-8-2) కపిలవర్ణం కలిగిన మద్ది కాండం, యవ కాండం, ఊక, నువ్వులతో చేసిన మణి తొలగిస్తుంది. (అథర్వణ - 2-2-8-3) యక్ష్మము, కుష్ఠము మొదలయిన రోగాలను క్షేత్రియ రోగాలంటారు. 9. 'పాట' అనే ఓషధి శత్రువులను సహించుటకు, శత్రువులను ఓడించుటకు సహకరించును. దీనికి పాఠ, విద్ధకర్ణి అనే పేరులున్నాయి. తెలుగులో 'విసబొద్ది' అని పిలుస్తారు. (అథర్వణ - 2-5-27-1) 10. పేలపిండిని నీటిలో కలిపి చిలికి త్రాగితే అది బలాన్ని కలిగిస్తుంది. జరానివర్తకంగా ఉంటుంది. దీనికి 'మంథమని' పేరు. (అథర్వణ - 2-5-29-6, 7 మం.) 11. ఖదిరము నందు పుట్టిన అశ్వత్థమణిని ధరించినచో శత్రువులకు నాశము జరుగుతుంది. దీనిని Accaciacatecum wild అంటారని Vedic Dictionary చెబుతుంది. తెలుగులో 'అత్తిపత్తి ముడుగుదామర' అని అంటారు. 12. హరిణ శృంగం క్షేత్రియ రోగాన్ని నశింపజేస్తుంది. హరిణ చర్మం కూడా క్షేత్రియ రోగాన్ని తొలగిస్తుంది. (అథర్వణ - 3-2-7-1,2,3) 13. విఘ్ననివారణార్థం అరలు మణిని ధరిస్తారు. దీనికి మంత్రం 'అశ్రేష్మాణః' అని పిలిచింది. (అథర్వణ-3-2-9-2) 14. 'పాట' అనే ఓషధిమీద శయనిస్తే, పరున్నవానిమీద ఆ ఓషధిని కప్పితే అతని మనస్సు ఇతరులకు వశపడి నడుచుకొంటుంది. (అథర్వణ - 3-4-19-6) 15. తిలకవృక్షాన్నుండి నిర్మించిన మణి శత్రునివారకమూ, వర్చస్సు నొసగునది. దీనిని మంత్రము 'స్రక్త్యము'అని పిలిచింది. తిలకవృక్షాన్ని 'పొట్టుగు' అని తెలుగులో అంటారు. (అథర్వణ - 2-3-11) పై ఓషధుల కన్నిటికి మంత్ర సహితంగా వినియోగం చెప్పబడింది. మంత్రాన్ని సజీవంగా ఉచ్ఛరించడానికి తపశ్శక్తి, సాధన కావాలి. అలా ప్రయోగించి వీటిని ఋజువు చేయడం ఒక ముఖ్య కర్తవ్యం. అథర్వణ వేదంలో ఇలాంటి ఓషధీ ప్రసంగాలు ఇంకా చాలా ఉన్నాయి.