Sri Jayendravani    Chapters    Last Page

పదవ భాగము

46. వివాహ వ్యవస్థపై కొన్ని అభిప్రాయాలు

(వరకట్నం యొక్క దుష్పరిణామాలు)

ఈ కాలంలో వివాహ విధానం చాలా మారిపోయినది. ఒక కుటుంబంలోని అక్కాతమ్ముళ్లను, మరియొక కుటుంబం లోని అన్నాచెల్లెళ్లకు యిచ్చి వివాహం చేసి తమ కుమార్తెల వివాహ సమస్యలను పరిష్కరించుకోగల్గుతున్నారు.

'కట్నం' అనేది 'వరదక్షిణ' అనే పేరుతో ప్రచారం పొందినది. కాని దాని ఉద్దేశ్యం అదికానే కాదు.

ఒకప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు కొంత ధనం యిచ్చేవాడు. తల్లిదండ్రులు కుమార్తెను పెండ్లి కుమారునకు దానంగా యిస్తారు. దానాన్ని స్వీకరించిన వ్యక్తి కొంత దోషాన్ని అంటగట్టుకుంటాడు. ఆ దోష పరిహారం కొరకు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు కొంత ధనమిస్తాడు. కాని ఇది కూడ అత్యుత్తమమైన వివాహ ప్రక్రియగా భావింపబడటం లేదు. వైదిక సాంప్రదాయ సమన్వితమైన, శాస్త్రనియమబద్ధమైన వివాహాలే అత్యుత్తమమైనవి. వైదిక వివాహాల్లో ఈ కట్న కానుకలు మొదలైనవి పరిగణనలోకి రావు.

ఇప్పటి పద్ధతిలో పెండ్లి కుమార్తె తండ్రిగాని, ఆమె కుటుంబంగాని పెండ్లి కుమారునకు దక్షిణ రూపంలో ఈయవలసియుంటుంది. ఇది వివాహ వ్యవస్థలో సంభంవించిన విచిత్రమైన వైపరీత్యము.

నా చిన్నతనంలో కట్నం అంత పెద్ద మొత్తంలో వుండేది కాదు. ఆ రోజుల్లో విద్యాభ్యాసం చేసిన వారి విషయంలో వివాహాల కొరకు ఎక్కువ సొమ్ము ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత వుండేది కాదు. కాని ప్రస్తుతం విద్యకొరకు ఖర్చులు పెరిగాయి. కనుక సహజంగానే ప్రజలు కట్నం మితిమీరిన స్థాయిలో కావాలని కోరుతున్నారు.

దీనంతటికీ హేతువు మనకై మనం తెచ్చుకొన్న సాంఘిక పరిణామాలే. ఈ పరిణామాలు ధర్మం మీద ఆధారపడినవి కావు. ఒక తండ్రి తన తనయుని విద్యాభ్యాసం కొరకు ఎక్కువగా ధనం వ్యయించి, వ్యయించిన దానికి రెండు మూడు రెట్లన్నా వరకట్నం రూపంలో పొందాలని ప్రయత్నిస్తాడు. అలా వచ్చిన సొమ్ముతో తన మనుమలు, మనవరాండ్ర విద్యాభ్యాసాలు కూడ నిర్వహించగలుగుతాడు.

వరకట్న స్వీకారం ఒక దురాచారం, పాపకార్యం. మిక్కిలి హీనమైన పాపంగా దీన్ని నేను చెప్పగలను. కాని ప్రజలు నిరుత్సాహపడతారనే తలంపుతో ఆ పదాల్ని వాడటం లేదు.

ఒక కుటుంబంలో ఒక అవివాహితయైన ఆడపిల్ల వుందంటే దానివల్ల సంక్రమించే పాపానికి ఆ కుటుంబం మాత్రమే బాధ్యులుగారు. మొత్తం సమాజానికి అది వర్తిస్తుంది. కనుక ఆడపిల్ల యొక్క కుటుంబీకులేగాక మొత్తం సమాజం ఆమె వివాహం విషయంలో ఉద్యమించాలి. సమాజ సభ్యులందర్నీ కలవరపరిచే విషయం యిది గనుక అందరూ పూనుకొని యీ పాపం నుండి విముక్తి కల్గే పథంలో సంఘసంస్కరణలను తేవాలి.

''విశేషేణ వాహయతీతి వివాహః''

వివాహాత్పూర్వం బ్రహ్మచారియైన పిల్లవాడు యథేచ్ఛగా సంచరించవచ్చు. కాని వివాహనంతరం అలా స్వేచ్ఛగా సంచరించటానికి అవకాశం లేదు. పెండ్లికి ముందు అతనికి తన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత మాత్రమే వుంటుంది. వివాహానంతరం వారితోపాటు తన భార్యయొక్క బాధ్యతకూడ అతనిపై పడుతుంది. ప్రస్తుతం చాల మంది యువకులు వివాహం చేసికొని మాతాపితరులతో విడిపోయి ప్రత్యేకం కాపురం పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల సమాజంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమౌతాయి. తాను ఈ రోజున స్వయంశక్తితో తన జీవితాన్ని కొనసాగించుకోగల సామర్థ్యానికి కారకులైన తన తల్లిదండ్రులను తనకు వివాహం కాగానే విడనాడాలని తలంచరాదు. తాను తన తల్లిదండ్రులను విడనాడితే తన వార్థక్యంలో తన పిల్లలు కూడ తనను విడనాడతారు. కనుక వివాహానంతరం కూడ యువకుడు తన తల్లిదండ్రులతోనే జీవించాలి. అప్పుడే అతని జీవితం సౌఖ్యప్రదమవుతుంది.

అమిత వాత్సల్యంతో మనం సాకుతున్న ఒక ప్రకృతిని ఒక పురుషునకు సమర్పిస్తున్నాం. ఒక దానిపై మనకున్న ఆధిపత్యాన్ని సర్వస్వామ్యాల్ని త్యాగంచేసే భావనతో దానిని ఇతరులకు యిస్తాం. ఇదే దానగుణంలోని పరమార్థం ఆ విధంగానే ఒక కన్యను ఆమె తల్లిదండ్రులు పెండ్లి కుమారునకు దాన భావంతో యిస్తారు. అప్పటి వరకు ఆ కన్య తన తల్లిదండ్రులకు చెందినదే కాని కన్యాదానం అనంతరం పెండ్లికుమార్తె పెండ్లికుమారుని కుటుంబానికి సంబంధించిన దౌతున్నది. అప్పటినుండి ఆమె రక్షణ బాధ్యత పెండ్లి కుమారునదై యున్నది.

మనం గోవుని గాని, గృహాన్ని కాని విక్రయించామనుకుందాం; లేక ఒక వస్తువును దానంగా యిచ్చామనుకుందాం. తర్వాత వాటిని గురించి మనం ఏమీ పట్టించుకోం. కాని కన్యాదానం విషయంలో అలా జరగదు. అత్తమామలు తరచుగా తమ కోడల్ని పుట్టింటికి పంపి ఏవో విలువగల వస్తువుల్నిగాని, రోఖ్కంగాని తెమ్మని ఆజ్ఞాపిస్తూ వుంటారు. ఈ విధమైన ఆచారం పాపభూయిష్ఠమైన కార్యం. ఒక వస్తువును దానంగా యిచ్చిం తర్వాత అది దానగ్రహీతకు చెందినదౌతున్నది. దాతకు ఆ యీయబడిన వస్తువు విషయంలో ఏ రకమైన బాధ్యత వుండదు. దానికి సంబంధించిన యే వ్యవహారంలోను దాత ప్రమేయముండదు.

చాలా తరచుగా ప్రజలు నా వద్దకు వచ్చి వరకట్నం కారణంగా తమపిల్లల వివాహాల్ని చేయలేక పోతున్నామని వాపోతుంటారు. ఉత్తర భారతంలో కూడ వరకట్నం నగదు రూపంలోను, వస్తురూపంలోను కూడ తీసికునే ఆచారం ప్రబలంగా వుందని తెలిసికొని బాధపడ్డాను. ఆ విధంగా మన దురదృష్టవశాత్తూ వరకట్న మహమ్మారి పలుప్రాంతాల్లో విషం వలె విస్తరిస్తూ ప్రజలను ఇక్కట్లపాలు చేస్తోంది.

ఈ వరకట్న దురాచారమనేది మానవుని స్వయం కృతా పరాధము.

అవివాహతలైన కుమార్తెలు గల తల్లిదండ్రులు నేను చెప్పిన విషయాలను విని ఆనందపడవచ్చు కాని వారి కుమారుల వివాహ సందర్భాల్లో కూడ ఈ విషయాల్ని గుర్తించుకొని పాటించాలి. వారి కుమార్తెల వివాహం విషయంలో ఈ దురాచారం వల్ల ఇబ్బందులు తెలిసికొని, వారి కుమారుల వివాహ సమయాల్లో కట్నాలను పరిగ్రహించాలని తలచకూడదు.

మనకు సహజంగా తటస్థించే కష్టాలను, బాధలను మనం నియంత్రించు కోవచ్చు. వాటిని వారించుటకు చర్యలను చేపట్టవచ్చు. కాని వాటిని అధికం చేసుకునే విధానాన్ని మనం సృష్టించుకోరాదు.

వివాహం కొరకు అత్యావశ్యకమైన వస్తువులేమిటి ? కొన్ని మంగళద్రవ్యాలు మాత్రం వుంటే చాలు. పెండ్లి సమయంలో మంగళసూత్ర ప్రదానం ఒక్కటే నియతమైనది. మిగతావన్నీ ఆడంబరం కొరకు చేసేవే. పూర్వకాలంలో పసుపు, కుంకుమలతో అలంకరింపబడిన పసుపుతాడును పెండ్లి కుమార్తెకు యిచ్చేవారు. కాని ప్రస్తుతం అధికవ్యయంతో కూడిన సువర్ణ మంగళసూత్రాన్ని యిచ్చే ఆచారాన్ని సృష్టించుకొని తాపత్రయానికి గురి¸°తున్నారు. వైదిక వివాహాల్లో అవసరంగా కావలసింది పసుపుత్రాడు మాత్రమే. అది పవిత్రతకు, స్వచ్ఛతకు చిహ్నము.

నేను సన్న్యాసినైయుండి వివాహానికి సంబంధించిన ధర్మాన్ని గురించి మాట్లాడటం వింతగా తోచవచ్చు. అయినా, మఠాధిపతిగా యీ విషయాల్ని గురించి వివరించవలసిన బాధ్యత నాపై వుంది. అలా చేయకపోతే యధార్థస్థితిని వివులీకరించని దోషము నాకు సంక్రమిస్తుంది. ఈ విషయాలు అమలులో పెట్టగల్గితే దానివలన మీకే గాక మొత్తం సమాజానికే శ్రేయస్సు.

ఆడపిల్లల విషయంలో వివాహం అత్యావశ్యకమేగాదు విధి కూడ. అందుకే మనకు కదళీవివాహం, సాలగ్రామ వివాహాలు అనే కార్యక్రమాలున్నాయి. కొంతమంది శారీరక అనారోగ్యంతోగాని, వ్యాధివల్ల గాని బాధపడుతూండవచ్చు. ఇలాంటి వారికొరకే ఈ ధర్మాలు. కదళీ వివాహ ప్రక్రియలో అరటిచెట్టును కొట్టివేసి వివాహాన్ని జరిపి మంగళసూత్రం యిస్తారు. ఆ విధంగా వివాహం పూర్తియైనట్లు భావింపబడుతుంది. సాలగ్రామ వివాహ విషయంలో కూడ యిలాంటి విధానమే అనుసరింపబడుతుంది. అప్పుడా సాలగ్రామాన్ని ఒక బ్రహ్మచారికి దానంగా ఇస్తారు.

వరకట్న సమస్య జటిలం కావటానికి కారణం మనమే. మగపిల్లవాడు సంపాదనను పెంపొందించుకొన్న కొలది వరకట్నం ఎక్కువ కావాలని ఆశిస్తాడు. దానివల్ల సమస్య కఠినమవుతుంది. పిల్లవాని విద్యాప్రమాణాలు పెరుగుతూ పోతూవుంటే వాటితో పాటు వరకట్నంగా పుచ్చుకునే మూల్యం ఆకాశాన్నంటు తుంటే యీ సమస్యకు పరిష్కారం అగమ్యగోచరమే. విజ్ఞులు దీన్ని గురించి తీవ్రంగా ఆలోచించాలి. ప్రజలు ధర్మశాస్త్రాలు, స్మృతులలో సూచించిన ప్రకారం నడచుకునేటట్లుచూడాలి.

వివాహ సంస్కారాలకు మొత్తం అరగంట కంటే ఎక్కువ సమయం అక్కరలేదు. అయినా ఈ సమస్య ఇతర కారణాలవల్ల అత్యధిక జటిలం అవుతోంది. కుటుంబ రక్షణకొరకు ధనం సంపాదించటానికి కట్నం మార్గం కాదు. చాలా మార్గాలున్నాయి. ధనం అమితంగా ఖర్చు చేయకుండా వివాహాలు కూడ చేసుకోవచ్చు.

కుమార్తెలు సంపాదించి తల్లిదండ్రులను పోషించటం కూడా చూస్తాము. ఆ తల్లిదండ్రులు ఆ కుమార్తెల వివాహానంతరం తమ పోషణ బాధ్యతను స్వీకరించే వారుండరని ఆందోళన చెందుతారు. కుమార్తెలను సంపాదన మార్గంలో పెట్టిన తల్లిదండ్రుల కీ ఇక్కట్లు తప్పవు. ఈ సమస్యకూడ మన స్వయం కృతాపరాధంవల్ల పరిణమించిందే.

మన ధర్మంలోను, మన సంఘీభావనలోను మనకు పూర్తి విశ్వాసముంటే యీ కష్టాలను సులభంగా అధిగమించవచ్చు. వరకట్న దురాచారంలో చిక్కుకొని మనం అసంఖ్యాకములైన ఇక్కట్లకు గురి¸°తున్నాము. చిన్న సమస్యలను పరిష్కరించుకుంటే తీవ్ర సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి.

మన సమాజంలో మనకు మంచి సంస్కారాలు సంప్రదాయాలూ ఉన్నాయి. వాటిని మనం సంరక్షించుకొని ఇతర సమాజాలకు మార్గదర్శకులం కావాలి. మనకు సంక్రమించిన సంప్రదాయ సంస్కారాల్లో మనకే విశ్వాసం సన్నగిల్లితే అది మనకు, దేశానికి కూడ శ్రేయస్కరం కాదు. కనుక మనం ఈ విషయంలో జాగరూకత వహించాలి. మొదట మనం మన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడు మన సంఘం, మన దేశం కూడ సరి¸°తాయి. ప్రతివాడు ఈ విషయాల్ని నిత్యం మనస్సులో వుంచుకోవాలి.

సన్యాసులకు ఈ రకమైన సమస్యలుండవు. కాని మాయీ ప్రవచనాలన్నీ గృహస్థులైన మీ ప్రయోజనాల కొరకే. మీరు అలా చేస్తే, ఆ పరిమితికి నాబాధ్యత తగ్గుతుంది. ఈ విషయాలపై ఉపన్యసించి నందుకు నాకు సిద్ధించే ప్రయోజన మిది ఒక్కటే.

కనుక ప్రజలు వారి ధర్మాన్ని అవలంబించటానికి హృదయ పూర్వకంగా కృషి చేయాలి. అలాగే తమ ధర్మాల్ని, సాంప్రదాయల్ని కాపాడుకోటానికి, తద్ద్వారా సమాజాన్ని సంస్కరించి, దానిలో ప్రవేశించిన మాలిన్యాల్ని ప్రక్షాళన చేయటానికి కూడ ఉద్యమించాలి.

Sri Jayendravani    Chapters    Last Page