Prathyaksha Daivamu    Chapters    Last Page

కృతజ్ఞతాంజలి

'చర్మం వొలిచి చెప్పులు కుట్టించినా కన్నవారి ఋణం తీరద'న్నారు పెద్దలు. ఎంత వ్రాసినా, ఏమి చేసినా జన్మనిచ్చిన వారి ఋణం తీర్చుకోవటం సాధ్యంకాని పని.

మా నాన్నగారు డా|| పణతుల సుబ్బరామయ్యగారు సాహితీ పిపాసి. వీరి గురువులు నెల్లూరిలో పేరుమోసిన వైద్యులు డా|| పులుగుండ్ల నరసింహ శాస్త్రిగారు ''ఆంధ్ర క్షేమేంద్ర'' బిరుదాంకితులు. ఆ రోజుల్లో శ్రీ చెళ్ళపిళ్ళవారు నెల్లూరు వస్తే వీరింట్లో దిగేవారు. వయోధికులైన వీరికి మా నాన్నగారిని సహాయంగా వుండమని పులుగుండ్ల వారు పురమాయించే వారట. ఆ సందర్భంలో వివరాలన్నీ తెలిసికొన్న తర్వాత 'వీడు మా వాడేనే' అంటూ మా నాన్న గారిని అభిమానించేవారట చెళ్ళపిళ్ళవారు. వారి శిష్య ప్రశిష్యులతో అంటే పింగళి లక్ష్మీకాంతం, విశ్వనాథ, దీపాల పిచ్చయ్య శాస్త్రి, ఇంకను గడియారం వేంకట శేష శాస్త్రి, మోచర్ల, గౌరిపెద్ది, ధన్వంతరి రఘూత్తమా చార్య ప్రభృతుల సాన్నిహిత్యంవల్ల మా నాన్నగారికి కవిత్వమంటే ప్రాణంగా మారింది. అందునా తిరుపతి కవుల పద్యాలైతే వందల సంఖ్యలో కంఠతః వచ్చు. ఈ శక్తిని గుర్తించి పింగళివారు ''మా గురువుగారి పద్యాలు మాకంటే మీకే ఎక్కువ వచ్చే'' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు మా నాన్నగారితో.

ఇటువంటి వాతావరణంలో వుండబట్టే మాకు గూడా చిన్నప్పుడే అమరకోశం చెప్పించేవారు ఆ వాసనే ఈనాడు ఏదో అంతో ఇంతో నాచేత ఇలా వ్రాయిస్తూ వుంది. ఇక ప్రొద్దుటూరి వాతావరణం నాలోని కవితా బీజాలను అంకురింపజేసింది. పూజ్యశ్రీ గడియారం, డా|| పి. వి. సుబ్బన్న శతావధాని, ప్రాచ్య కళాశాల ఆధ్యాపక వర్గంతోపాటు ముఖ్యంగా మా బావగారు సంగీత సాహిత్య విశారదులు అన్ని రకాలుగా నాకు కొండంత అండగా నిలిచారు. మద్రాసు ఆపోలో హాస్పిటల్లో వున్నప్పుడు గూడా ''దాన్ని పూర్తి చేసెయ్యరా'' అంటూ ఈ రచన విషయంగా నా కర్తవ్యాన్ని బోధించి తీరా కార్యం పూర్తి కాకముందే అనంత వాయువుల్లో లీనమైపోయారు. వారు లేని లోటు తీర్పరానిది. వారికి నేను బడిన యప్పు తీరరానిది. ఇక నాలో చివురించిన కవితా లతకు మాఱాకు హత్తించి తమ్మునిగా కాక నన్ను స్నేహితునిగా భావిస్తూ, శాశ్వతమైన పని ఏదైనా చెయ్యమని బలవంతంగా నాచే రచనలు చేయిస్తూ ''సుకవిద్వంద్వము స్వర్గలోకమున....'' వంటి రచనలతో ఆంధ్రసాహితీ క్షేత్రంలో క్రొత్త పుంతలు త్రొక్కి, చేతికి ఎదిగి వచ్చి ఏ ముచ్చటా తీరకనే పరమపదాన్ని చేరుకున్న మా అన్న శ్రీ పణతుల నరసింహయ్యగారు లేని లోటు శల్యంలాగా బాధిస్తోంది.

ఇక మూడో వ్యక్తి, నేనేమి వ్రాసినా నిక్కచ్చిగా విమర్శిస్తూ ఆంధ్రాంగ్లభాషల్లో అద్భుత నైపుణ్యం కల్గి వుండడమే గాకుండా సంగీతంలో స్వయంకృషితో మేటి అనిపించుకొని విశిష్ట ప్రతిభతో వైద్యశాస్త్రంలో M.D., దాకా అధిరోహించి అతి చిన్న వయసులోనే కన్నవారికి పుట్టెడు దుఃఖం మిగిల్చిపోయిన తమ్ముడు డాక్టర్‌ పణతుల వేంకటేశ్వర శర్మ వుంటే ఈ రచనను చూచి ఎంతగా ఆనందించేవాడో చెప్పలేను.

ఇక నేను హైదరాబాదు వెళ్ళిన సందర్భంలో పూజ్యులు డా|| దివాకర్ల వేంకటావధానిగారికి అసంపూర్తిగా వున్న ఈ రచనలోని కొన్ని పద్యాలు విన్పించాను. ''ఎందుకు పూర్తిచేయలేదండి'' అన్నారు. ''వస్తువు లేద''న్నాను. ''అయ్యో! ఎంత చక్కని శార్దూల మత్తేభ వృత్తాలు. అందునా కంచి స్వాములవారిమీద. నిలపకండి. వెంటనే పూర్తిచెయ్యండి'' అని చెప్పి 'THE PRECEPTERS OF ADWAITHA' అన్న గ్రంథాన్ని తెచ్చి యిచ్చారు. ఈ సందర్భంలో ప్రాతః స్మరణీయులైన అవధానిగారు లేకపోవడం నా దురదృష్టం. పై గ్రంథంతో పాటు 'గురుజాడ'వారు ప్రచురించిన ప్రత్యేక సంచిక, శ్రీమతి మాలతీ చందూర్‌ గారి 'సంకల్పసిద్ధి' అన్న వ్యాసమూ నాకు చాలా సహకరించాయి. వీరికి నా ప్రత్యేక కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను.

మకుటమున 'భక్త మోక్షప్రదా!' అన్న చోట 'భక్త ముక్తి ప్రదా !' అని మార్చుకొమ్మని సలహా నిచ్చిన డా|| కరుణశ్రీ గారికి,

స్వామివారికి యావద్భారతంలోనూ భక్తులున్నారు కాబట్టి వీలైనంతవరకు అందరికీ అందుబాటులో నుండునట్లుగా ఆంగ్లంలోకి అనువదించి యిండని కోరగానే వెనువెంటనే సాంప్రదాయికంగా సలక్షణంగా అనువదించి యిచ్చిన బహు భాషాకోవిదులు, పుంభావ సరస్వతీ మూర్తులైన శ్రీ కె. వి. నరసింహా చార్‌ గారికి కృతజ్ఞతా వందనాలు.

ఎడతెరపిలేని కార్యభారములతో సతమత మవుతున్నప్పటికీ మా కోరికను మన్నించి శ్రీ స్వామిపాదుల వారి రూపమును నిసర్గ మనోహరముగా, కన్నుల పండువుగా చిత్రించి యిచ్చిన సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకులు 'బ్రహ్మవ్రాతకు బాపు గీతకు తుడుపు లేద''న్న నానుడికి మూల భూతులైన శ్రీ బాపు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ యూరి ధ్యానమందిరంలో తఱచుగా నా పద్యములు విని, నేను కోరకయే, ఎంత ఖర్చయినను వెంటనే ముద్రింపించి ఈ కృతిని భక్త జనులకు బహూకృతిగా సమర్పింపదలచిన దాతృవరేణ్యులు పుణ్య దంపతులు శ్రీ టంకసాల సత్యనారాయణ గుప్తా, శ్రీమతి వసుంధరా దేవి గారలకు దీనిని అంకితమిచ్చుట తప్ప కృతజ్ఞతలు తెల్పుట సాధ్యముకాని పని.

స్థలాంతరమున 'బొకారో'లో నున్నను, ప్రార్థించినంతనే, దీనికి ప్రాణశక్తివలె మహాశీర్భాగ్యము ననుగ్రహించిన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ శ్రీ చరణుల మ్రోల 'సాష్టాంగంబుగ సాగిలంబడి నమస్కారంబు గావించెదన్‌.'

నా కోరికను మన్నించి అమూల్యమైన తమ కాలమును నాకు కొంత కేటాయించి అభిప్రాయములను, ఆశీస్సులను పంపిన పెద్దలకు నా వినయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటున్నాను.

ఎల్లవేళలా నా మేలునే కోరుతూ తమ కెన్ని తొందరలున్నను ఈ పవిత్ర కార్యమున నాకు సంపూర్ణముగా సహకరించుటే గాక, నిరంతర ధార్మికచింతనాపరులైన దాత శ్రీయుత సత్యనారాయణగారికి కుడి ఎడమ భుజములుగా నిలిచిన కార్యదీక్షాదక్షులు శ్రీ ఎ. లోకరాజుగారికి మరియు శ్రీ హరినాథ జెట్టిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ కృషిలో ఆద్యంతము ప్రధాన సూత్రధారులుగా నిలచి దీనిని తమ కార్యముగా భావించి ప్రెస్‌ కాపీ వ్రాయడమే కాక ప్రెస్‌ వ్యవహారాలు, ఎడిటింగ్‌ మున్నగునవన్నీ చూచి నాకు చోదోడు వాదోడుగా నిలచి నా హృదయంలో స్థిరంగా నిలచిపోయిన సహోపాధ్యాయులు, కవి పండితులు శివానందలహరీత్యాది గ్రంథకర్తలు విద్వాన్‌ శ్రీ ఇ.వి. సుబ్రహ్మణ్యముగారికి- వీరితో పాటు ప్రెస్సు కార్యక్రమములలోను, ప్రూఫులు సరి చూచుటలోను సోదర భావముతో సహకరించి, ఈ గ్రంథము సర్వాంగ సుందరముగా వెలువడుటకు కారకులైన నా శ్రేయోభిలాషి, చలనచిత్ర నటులు మరియు మధురకవి శ్రీ ఉమ్మిటి వీరభద్రము గారికి నా కృతజ్ఞతా వందనాలు.

ఓపికతో ఆంగ్లవిభాగం ప్రెస్‌ కాపీ వ్రాసి యిచ్చిన శ్రీ ఇ. గురురాజారావు, M.A., గారికి, అన్ని విధాలా తోడ్పడిన చి|| కృష్ణమూర్తి, చి|| ద్వారకానాథ్‌, చి|| జయచంద్రలకు ఇంకను ఈ కృతి శోభాయమానముగా రూపుదిద్దుకొనుటలో సహకరించిన సహృదయుల కందరికీ నా కృతజ్ఞతలు.

అర్థాంతరముగా నిలచిన ఈ కృతి జగద్గురువుల కృపతో వున్నటులుండి ఏదో యొక దివ్య శక్తి ప్రేరేపించుటతో నిట్లు రూపుకట్టినది. ఏ తత్‌ కార్యసంపూర్తికి నా అర్థాంగ లక్ష్మి చి|| సౌ|| గీతాంజలీదేవి పట్టుదల ప్రత్యేకముగా ప్రశంసింపదగినది.

నా జీవితములో వెలుగు నింపి నే నిట్టి పుణ్యకార్యము లొనర్చుటకు అవకాశము నొసగిన పరోపకార పరాయణులు మాజీ ప్రిన్సిపాల్‌ శ్రీ ఎ. రామప్ప, M.A., M.Ed., గారికి పుంగనూరు ధ్యానమందిర భక్తాదులకు నానమోవాకములు.

ఈ గ్రంథమును సర్వాంగ సుందరముగా అచ్చొత్తించి యిచ్చిన మద్రాసు ఫ్రీడమ్‌ ప్రెస్‌ అధినేత శ్రీ M. తీర్థానందంగారికి, వారి సోదరులు శ్రీ గుణశేఖర్‌గారికి మరియు సిబ్బందికి నా కృతజ్ఞతలు.

చివరి మాట. ఇది నా ప్రథము ప్రయత్నము. నాకు పరిపూర్ణమైన ఛందో వ్యాకరణాలంకారాది జ్ఞానము లేకపోయినను ఆదిశంకర భగవత్పాదులవారి 'నహి నహి శరణం డుకృఞ్‌ కరణ' అన్న హెచ్చరిక ఈ రచన సాగించు ధైర్యము నిచ్చినది. 'నీటిబుడగ వంటి ఈ దేహమునకు మృత్యువు సన్నిహిత మ'న్నప్పుడు పరమాచార్యుల చరణ పద్మములే శరణ్యములుగదా! కావున కేవలము గురుభక్తి ప్రధానముగా, సార్వజనీనముగా సాగిన ఈ రచనలోని దోషములు మన్నింప పండితులకు మనవి. ముఖ్యమైన వాటికి సవరణపట్టిక జతపరచడమైనది. ఆయినను దోషైక దృక్కులున్నచో ''నడచుచు నుండువారి చరణంబులకేకదఱాల తాకిడుర్‌'' అన్న వేటూరి వారి మాటను స్మరించు కొనుచు, మౌనముగా ముందునకు సాగిపోవుచుందును.

తమ అనుగ్రహాశీర్వాదములో శ్రీశ్రీశ్రీ జయేంద్ర యతీంద్రులవా రభయమిచ్చినట్లు ఈ గ్రంథమును చదివిన వారికెల్లరకు శ్రీ కామాక్షీ త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరుల కృపాకటాక్షములతో శ్రేయమును, ప్రేయమును కలుగుగాతమని ఆకాంక్షించు, మీ

పణతుల రామేశ్వర శర్మ.

Prathyaksha Daivamu    Chapters    Last Page