Varahamahapuranam-1    Chapters   

సప్తవింశత్యధికశతతమోధ్యాయః - నూటయిరువది యేడవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవుడిట్లు పలికెను.

క్షత్రియస్య ప్రవక్ష్యామి తచ్చ్రుణో హి వసుంధరే,

త్యక్త్వా ప్రహరణాన్‌ సర్వాన్‌ యః కశ్చి త్పూర్వశిక్షితమ్‌.

పూర్వమన్త్రేణ మే భూమి తస్య దీక్షాం చ కారయేత్‌. 1

ఓ వసుంధరా! ఇప్పుడు క్షత్రియునకు సంబంధించిన దీక్షను గూర్చి చెప్పెదను. వినుము ఆతడు ముందు నేర్చుకొన్న ఆయుదముల నన్నింటిని వదలి వేయవలయును. పిమ్మట ఆతనికి ముందు చెప్పిన మంత్రముతో దీక్షనొసగవలయును.

మయా చ పూర్వా ముక్తాని యాని సంభారకాణిచ,

తాని సర్వాన్‌ సమానీయ ఏవం వర్జ్యం యశస్విని. 2

నేను మునుపు చెప్పిన వస్తువుల నన్నింటిని, చెప్పబోవు వానిని విడచి, కూర్చుకొనవలయును.

న దద్యాత్‌ కృష్ణసారస్య చర్మ తత్ర కదాచన,

పాలాశం దండకాష్ఠం చ దీక్షాయాం నతు కారయేత్‌. 3

నల్లజింక చర్మమును, మోదుగ కర్రను ఈ దీక్ష యందు ఎన్నటికిని ఉపయోగింపరాదు.

ఛాగస్య కృష్ణసారస్య తస్య చర్మ చ కారయేత్‌,

ఆశ్వత్థ దండ కాష్ఠంచ దీక్షాయై తదనన్తరమ్‌. 4

నల్లని గొఱ్ఱ చర్మమును, మఱ్ఱిచెట్టు దండమును ఈ దీక్ష కొరకు కూర్చుకొనవలయును.

కృత్వా ద్వాదశహస్తాని స్థణ్డిలం చోపలేపయేత్‌,

సర్వాణ్యతాని వై కృత్వా యన్మయా భాషితాని వై. 5

పండ్రెండు మూరల చదరపు స్థలమును ఏర్పరచుకొని చక్కగా అలువలయును. పిదప నేను మునుపు చెప్పిన విధానముల నన్నింటిని చేయవలయును.

ఏవం కృత్వా తతః సర్వం క్షత్రియే దీక్షకారిణ,

మమైవ శరణం గత్వా ఇమం మన్త్ర ముదాహరేత్‌. 6

ఇట్లు దీక్షను పొందెడు క్షత్రియుడు విధానమంతయు కావించి నన్నే శరణు పొందుచు ఈ మంత్రమును పఠింపవలయును.

మంత్రః - మంత్రము.

త్యక్తాని విష్ణో శస్త్రాణి త్యక్తం కర్మ చ క్షత్రియమ్‌,

సర్వం త్యక్త్వా దేవం విష్ణుం ప్రపన్నో స్మి,

నాథ సంసారార్థైవ జాతిం మాం జనయస్వ. 7

విష్ణూ! నేను ఆయుధముల నన్నింటిని వదలివైచితిని. క్షత్రియకర్మమును వదలితిని. అన్నియు వదలి విష్ణు దేవుడవైన నిన్ను చేరుకొంటిని. ఇటుపై నన్ను సంసారము కొరకు, మరియొక జన్మము కొరకును పుట్టింపకుము.

ఏవం తతో వచ శ్చోక్త్వా క్షత్రియో మమపార్శ్వతః,

చరణౌగృహ్య ఇమం మన్త్ర ముదీరయేత్‌. 8

ఇట్లు పలికి క్షత్రియుడు నా ప్రక్కను ఉండి నా రెండు పాదములను పట్టుకొని యీ మంత్రమును పలుకవలయును.

మన్త్రః - మంత్రము.

నాహం శస్త్రం దేవేదవ స్పృశామి

పరాపవాదం నచ వై బ్రవీమి,

కర్మ కరోమి సంసారమోక్షణం

త్వయా చోక్త మేవ వరాహసంస్థితమ్‌. 9

దేవదేవా! నేను ఆయుధమును ముట్టను. పరులను గూర్చి చెడుమాటలను పలుకను. సంసారమునుండి ముక్తి కలిగించు కర్మమును, నావు వరాహరూపుడవై ఉపదేశించిన ప్రకారము ఆచరింతును.

తత్ర ఏవం వచో బ్రూతో సర్వం చైవాత్ర యోజయేత్‌,

వివిధై ర్గన్ద పత్రైశ్చ ధూపై శ్చైవ యథోదితమ్‌. 10

ఇట్లు అచట పలికి పెక్కువిధములగు గంధములను, ధూపములను మున్ను చెప్పిన విధముగా సమర్పింపవలయును.

యథా తేనైవ తాన్‌ భూమే హోజయేత్‌ తదనన్తరమ్‌,

శుభాన్‌ భాగవతాం శ్చైవ ఏవ మేత న్న సంశయః. 11

భూమి! అటుపై ఆతడు అదేవిధముగా పరిశుద్దులగు భాగవతులకు అన్నమిడవలయును.

ఏషా వై క్షత్రియే దీక్షా దేవి సంసారమోక్షణమ్‌,

మత్ప్రసాదేన కర్తవ్యం యతీచ్ఛేత్‌ సిద్ది ముత్తమామ్‌. 12

దేవీ! క్షత్రియుడు ఉత్తమ సిద్దిని కోరునేని నా అనుగ్రహముతో ఇట్టి దీక్షను సంసారముక్తికై పొందవలయును.

వైశ్యసై#్యవ ప్రవక్యమి శృణు తత్త్వేన సుందరి,

దీక్షా చ యాదృశీ తత్ర యథా భవతి సుందరి. 13

సుందరీ! వ్యైనకు దీక్షయెట్టిదో చెప్పెదను. వినుము.

త్యక్త్వా తు వైశ్యకర్మాణి మమ కర్మ పరాయణః,

యథా చ లభ##తే సిద్దిం తృథీయో వర్ణ సంస్థితః. 14

మూడవ వర్ణమున నున్న వ్యక్తి, నా పూజయందు శ్రద్దకల వాడునగు వైశ్యుడు సిద్దిని పొందుటకై వైశ్యకర్మములను విడనాడ వలయును.

సర్వాం స్తత్ర సమానీయ యే మయా పూర్వభాషితాః,

వింశ ద్దస్తం సమాలిప్య పూర్వ్యయేన కారయేత్‌,

చర్మణా పీతభాగస్య స్వాగతం పరివేష్టయేత్‌. 15

నేను మునుపు తెలిపిన వస్తువుల నన్నింటిని కూర్చుకొన వలయును. ఇరువది మూరలమేర అలికి మునుపటి వలెనే చేయవలయును. పసుపు వన్నె గొఱ్ఱ చర్మము నందు పరపవలయును.

ఉదుంబరం దండకాష్ఠం చ గృహ్య హస్తే తు దక్షిణ,

కుర్యాద్‌ భాగవతాన్‌ శుద్దాన్‌ త్రీణి వారాన్‌ ప్రదక్షిణమ్‌,

జానుభ్యా మవనిం గత్వా ఇమం మన్త్ర ముదాహరేత్‌. 16

మేడిచెట్టు కర్రను కుడిచేత పట్టుకొని పవిత్రులగు భాగవతులకు మూడుమారులు ప్రదక్షిణ నమస్కారము గావింపవలయును.

మోకాళ్ళపై నిలబడి ఈ మంత్రమును పలుకవలయును.

మంత్రః - మంత్రము.

అహం హి వైశ్యో భవస్త ముపాగతః

ప్రముచ్య కర్మాణి చ వైశ్యయోగమ్‌,

దీక్షా చ లబ్దా భగవత్‌ ప్రసాదాత్‌

ప్రసీద సంసారకరోహి మోక్షణమ్‌. 17

నేను వైశ్యుడను తమకడ కరుదెంచితిని. వైశ్యజాతి కర్మముల నన్నింటిని వదలివైచితిని. భగవంతుని ప్రసాదము వలన దీక్ష నాకు లభించినది. ప్రసన్నులరై నాకు సంసారమోక్షమును దయసేయుడు.

మమ త్వేదం తత శ్చోక్త్వా మమ కర్మప్రసాదనాత్‌,

గురవే చరణౌ గృహ్య ఇమం మన్త్ర ముదాహరేత్‌. 18

ఈ విధముగా నన్ను గూర్చి పలికి నా అనుగ్రహమును పొంది గురువు పాదములను పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.

త్యక్త్వా వై కృషిగోరక్షా వాణిజ్యక్రయ విక్రయమ్‌,

లబా చ త్వత్ప్రసాదేన విష్ణుదీక్షా థ కామయేత్‌. 19

నేను వ్యవసాయము, గోపాలనము, వాణిజ్యము కొనుగోలు, అమ్మకము అనువానిని వదలివైచి నీ దయవలన కోరిన విష్ణు దీక్షను పొందితిని.

దేవాభివాదనం కృత్వా పురో భగవతేషు చ,

పశ్చాత్‌ తు భోజనం దద్యాదపరాధబహిష్కృతమ్‌. 20

ముందు భాగవతులకు, పిదప దేవునకు మ్రొక్కులు చెల్లించి ఏ దోషమును లేని విధముగా భోజనము పెట్టవలయును.

ఏవం దీక్షా తు వైశ్యానాం మమ మార్గానుసారిణామ్‌,

యేన ముచ్యతి సుశ్రోణి ఘోరసంసారసాగరాత్‌. 21

నా మార్గ ముననుసరించు వైశ్యులకు ఇది దీక్షావిధానము. దీనితో ఆతడు ఘోరమగు సంసారమునునండి ముక్తి పొందును.

శూద్రస్యాపి ప్రవక్ష్యామి మద్భక్తస్య వసుంధరే,

యస్తు దీక్షాం సమాసాద్య ముచ్యతే సర్వకిల్బిషైః. 22

నా భక్తుడగు శూద్రునకు దీక్ష యెట్టిది యో చెప్పెదను. ఇది పొందిన ఆతడు అన్ని పాపముల నుండియు విముక్తి పొందును.

సర్వద్రవ్యాణి సంస్కారాన్‌ యే మయా పూర్వభాసితాః,

దీక్షాకామస్య శూద్రస్య ఏతాన్‌ శీఘ్రం ప్రకల్పయేత్‌. 23

నేను ముందు చెప్పిన విధముగా అన్ని వస్తువులను, అన్ని సంస్కారములను దీక్షను కోరెడు శూద్రుని కొరకు కూర్పవలయును.

ఉపలిప్య సప్తహస్తం స్థణ్డిలం తదనన్తరమ్‌,

చర్మణా కృష్ణభాగస్య తస్య గాత్రాణి వేష్ఠియేత్‌,

ఖాదిరం దండకాష్ఠం చ గురునా తత్ర్పకల్పయేత్‌. 24

ఏడుమూలరల నేలను ఆవుపేడతో ఆలికి స్థండిలమును ఏయవలయును. నల్లనిగొఱ్ఱ చర్మముతో ఆతని అంగముల నన్నింటిని కప్పవలయును. ఖదిర వృక్షపు దండమును గురువు ఆతనికి కూర్పవలయును.

ఏవం గృహ్య యథాన్యాయం శూద్రో దీక్షాదికారణమ్‌,

మమైవ శరణం గత్వా ఇమం మన్త్ర ముదాహరేత్‌. 25

ఇట్లు దీక్షకు సంబంధించిన వస్తువునన్నింటిని తగు విధముగా తెచ్చుకొని నన్నే శరణు పొందుచు ఈక్రింది మంత్రములను పలుకవలయును.

మన్త్రః - మంత్రము.

శూద్రోహం శూద్రకర్మాణి ముక్త్వా భక్షం చ సర్వశః,

భక్షయామో హ్యభక్ష్యం వై శూద్రకర్మ చ కుర్వతః. 26

నేను శూద్రుడను. శూద్రకర్మముల నన్నింటిని వదలు చున్నాను. మునుపు శూద్రకర్మములను చేయుచు తినరాని వస్తువులను తినెడివాడను. ఆ తిండిని కూడ వదలివేయుచున్నాను.

త్యక్తు మిచ్ఛామి తత్సర్వం విష్ణోః కర్మ కరోమి వై,

పశ్యవైదేవ శూద్రోహం తవ ప్రపన్నోస్మి గురు ప్రసాదాత్‌. 27

ఆ తిండి మొదలగు దానినంతటిని వదలివేయగోరుచున్నాను. ఇటుపై విష్ణుని ఆరాధనమునే చేయుదును. దేవా! చూడు. నేను శూద్రుడను. గురువు దయవలన నిన్ను సర్వభావముతో చేరుకొంటిని.

ఏవం వదేత్‌ తతో దేవం శూద్రో దీక్షాకాంక్షిణిః,

విముక్తః సరపాపేభ్యో లబ్ధసంజ్ఞో గతస్పృహః. 28

దీక్షను పొందెడు శూద్రుడిట్లు పలుకవలయును. అతడు పాపములన్నింటి నుండి విముక్తుడగును. జ్ఞానము పొందును. ఆశలుడిగినవాడగును.

ఉభౌ చరణౌ సంగృహ్య గురవే తదనన్తరమ్‌,

గురోః ప్రసాదనార్థాయ ఇమం మన్త్ర ముదాహరేత్‌. 29

తరువాత గురువు పాదములను రెండింటిని పట్టుకొని అతని దయపొందగోరుచు ఈ మంత్రమును పలుకవలయును.

మన్త్రః - మంత్రము.

విష్ణుప్రసాదేన గుహ్యం ప్రసన్నపూర్వం లబ్ధ్వార్థ మేనం,

సంసారమోక్షణాయ కరోమి కర్మ ప్రసీద.

గురుదేవా! విష్ణువు ప్రసాదము వలన రహస్యమైన దీక్షను సంసారముక్తి కొరకు నేను పొందితిని. దానికనుగుణమగు కర్మమునే ఆచరింతును. నా యందు ప్రసన్నడవు కమ్ము.

ఏవం మన్త్ర ముదీర్యాథ కుర్యా త్తత్ర ప్రదక్షిణమ్‌,

చతురశ్చయథాన్యాయం పునశ్చైవాభివాదయేత్‌. 30

ఇట్లు మంత్రమును పలికి నాలుగుమారులు ప్రదక్షిణము చేసి మరల తగు విధములుగా అభివాదన మాచరింపవలయును.

అనన్తరం తతః కుర్యాద్‌ గన్ధమాల్యేన చార్చనమ్‌,

భోజనం చ యథాన్యాయ మపరాధవివర్జితః. 31

పిదప గంధములతో, మాలలతో అర్చనముగావింప వలయును. మనసులో ఏచెడు భావములు లేకుండ భోజనము సమర్పించపవలయును.

దీక్షా ఏషా చ శూద్రాణా ముపచారశ్చ ఈదృశః,

చతుర్ణామపి వర్ణానాం దుఃఖసంసార మోక్షణమ్‌. 32

శూద్రులకు దీక్షయిట్టిది. ఉపచారము (సేవ) ఈవిధమైనది. నాలుగు వర్ణముల వారికి దుఃఖరూపమైన సంసారమునుండి ముక్తి కలిగించు దీక్షను గూర్చి తెలిపితిని.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

చతుర్ణాపి వర్ణానాం ఛత్రం ప్రదీయతే. 33

వసుంధరా! నీకు మరియొక విషయమును తెలిపెదను వినుము. నాలుగు వర్ణములవారికి గొడుగల నొసగు విధానమును గూర్చి చెప్పెసదను.

బ్రాహ్మణ పాణ్డురం దద్యాద్‌ రక్తం దాతవ్యం క్షత్రియే,

వైశ్యాయ పీతకం దద్యాన్‌ నీలం శూద్రాయ దాపయేత్‌. 34

బ్రాహ్మణునకు తెల్లనిది, క్షత్రియునకు ఎర్రనిది, వైశ్యునకు పచ్చనిది, శూద్రునకు నల్లనిదియగు గొడుగు నొసగవలయును.

సూత ఉవాచ - సూతుడు ఇట్లనెను.

చాతుర్వర్ణస్య శ్రుత్వా వై పా మహీ సంశిత వ్రతా,

వరాహరూపిణం దేవం ప్రత్యువాచ వసుంధరా. 35

నిర్మములగు వ్రతములు గల ఆ భూదేవి నాలుగు వర్ణముల వారిదీక్షలను గూర్చి విని వరాహరూపుడగు దేవునితో ఇట్లు పలికెను.

ధరణ్యువాచ - భూమి పలికెను.

శ్రుత్వా దీక్షాం యథాన్యాయం చాతుర్వర్ణ్యస్య కేశవ,

దీక్షితైః కిం ను కర్తవ్యం తవ కర్మపరాయణౖః. 36

కేశవా! నాలుగు వర్ణముల వారికి సంబంధించిన దీక్షలను గూర్చి వింటిని. నీ పూజలయందు శ్రద్ధ కల ఆ దీక్షితులకు కర్తవ్యమెట్టిది?

తతో మహీవచః శ్రుత్వా మేఘదుందుభినిః స్వనః,

వరాహరూపీ భగవా నువాచస మహీం స్థితః. 37

అంత భూమి పలుకులు విని మేఘదుందుభి నాదము వంటి కంఠధ్వని గల వరాహరూపదేవుడు భూమితో ఇట్లు పలికెను.

శ్రీ వరాహ ఉవాచ - వరాహదేవుడు పలికెను.

శృణు తత్త్వేన కల్యాణి యన్మాం త్వం పరిపృచ్ఛసి,

సర్వత్ర చిన్తనీయోహం గుహ్యమేవ గణాన్తికమ్‌. 38

కల్యాణీ! నీవు నన్నడిగిన దానికి నిజమైన సమాధానము చెప్పెదను. వినుము. దీక్ష పొందిన వ్యక్తి నన్ను, గుహ్యమైన గణాంతికమును భావించుచుండవలయును.

నారాయణవచః శ్రుత్వా ధరణీ సంశితవ్రతా,

హృష్ణతుష్ఠమనా స్తత్ర శ్రుత్వా ధర్మం మహౌజసమ్‌,

శుచి ర్భాగవతాం శ్రేష్ఠా తవ కర్మాణి నిత్యశః. 39

తతః కమలపత్రాక్షీ భక్తాభ##క్తేషు వత్సలా,

కరాభ్యా మఞ్జిలిం కృత్వా నారాయణ మథాబ్రవీత్‌. 40

నారాయణుని పలుకు విని దోషము లేని వ్రతములు గల ధరణి మిక్కిలిగా సంతోషముతో ఉప్పొంగిన హృదయము కలది యాయెను. గొప్ప శక్తిగల ధర్మమును విన్న భాగవత శ్రేష్ఠ యగు ఆమె భక్తుల యందును, భక్తులు కాని వారి యందును వాత్సల్యము కలదియై చేతులు మోడ్చి నారాయణునితో మరల ఇట్లు పలికెను.

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

దేవి తత్త్వేన వక్ష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి,

యేన చిన్తయతే మర్త్యః మమ కర్మపరాయణః. 44

దేవీ! నీవు నన్నడిగిన దానికి సరియైన సమాధానము చెప్పెదను. నా భక్తి కర్మమున శ్రద్ధ కలవాడు నన్నెట్లు భావింప వలయునో తెలియజెప్పెదను.

ఏషా గణాన్తికా నామ దక్షిణాంబుజనిః సృతా,

ఏతద్‌ గుమ్యం మహాభాగే మమ చిన్తాం విచిన్తయేత్‌. 45

ఇది భగవంతుని కుడి పద్మమునుండి వెలువడినది. దీనిపేరు 'గణాంతిక'. మిక్కిలి గుట్టుగా ఉంచదగిన దీనిని మానువు భావించుచుండ వలయును.

దీక్షితేన తు శుద్ధేన విధిదృష్టేన కర్మణా,

గృహీతవ్యం విశాలక్షి మన్త్రేణ విధినాత్రవై. 46

శాస్త్రము చూపిన విధానమును బట్టి పరిశుద్ధుడై దీక్షగొన్న వ్యక్తి దీనిని మంత్ర విధితో గ్రహింప వలయును.

యస్తు భాగవతో భూత్వా తద్‌ గృహ్ణాతి 'గణాన్తికామ్‌',

జనస్య దర్శన స్పర్శ సంయుక్తాం వామసంయుతామ్‌,

తస్య ధర్మో న విద్యేత న స దీక్షిత కోచ్యతే. 47

భగవంతుని యందు భక్తి కలిగి ఈ గణాంతిక దీక్షను కైకొన్న వ్యక్తి జనుల దర్శనమును స్పర్శను, ముఖ్యముగా ఎడమ చేతిస్పర్శను పొందినచో అతనికి ధర్మము కలుగదు. అట్టవాడు దీక్షితుడుగా చెప్పబడును.

యస్తు గృహ్ణాతి సుశ్రోణి మన్త్రపూతాం గణాన్తికామ్‌,

ఆసురీ దీక్షణా తస్య న మే ధర్మే ప్రవర్తతే. 48

మంత్రము చేత పవిత్రమైన ఈ గణాంతిక దీక్షను సాధారణ బుద్ధితో గ్రహించిన వానికి అది ఆసుర(రాక్షస సంబంధమైన) దీక్ష అగును. అట్టివాడు నా ధర్మమున ప్రవర్తించువాడు కాడు.

గుహ్యం గణాంతికాం దేవి యో మాం చిన్తయతే బుధః,

జన్మాంతర సహస్రాణి చింతితోహం చ తేన వై. 49

ఈ గణాంతిక దీక్షను గ్రహించి ఎవనికి తెలియరాకుండ భావించుచుండు మేధావి వేయి జన్మములలో నన్ను భావించు వాడగును.

గ్రహణస్య ప్రవక్ష్యామి యథా శిష్యాయ దీయతే,

మన్త్రం లోకసుఖార్థాయ తచ్ఛ్రుణుష్వ వసుంధరే. 50

ఈ మంత్రమును గ్రహించు విధానమును, శిష్యున కొసగు విధానమును లోకసుఖము కొరకు వివరించి చెప్పెదను. భూదేవీ! దానిని వినుము.

కౌముదస్య తు మాసస్య మార్గశీర్షస్య వాప్యథ,

వైశాఖస్యాపి మాసస్య శుక్లపక్షేతు ద్వాదశీ. 51

కుర్యా న్నిరామిషం తత్ర దినాని త్రీణి నిశ్చితః,

తతో గణాన్తికా గ్రాహ్యా మన్త్రవద్‌ ధర్మనిశ్చితా. 52

కార్తీకము, మార్గశిరము, వైశాఖము నెలలో శుక్లపక్ష ద్వాదశినాడు మూడురోజులు మాంసములేని భోజనము తీసికొని ధర్మము నిర్ణయించిన ఈ గణాంతిక దీక్షను మంత్ర పూర్వకముగా గ్రహింప వలయును.

మమాగ్రతో వరారోహే ప్రజ్వాల్య చ హుతాశనమ్‌,

కుశైః సంస్తరణం కృత్వా స్థాపయిత్వా గణాన్తికామ్‌. 53

తతః శిష్యో గురుశ్చైవ దీక్షితః శుచి ముత్తమమ్‌,

నమో నారాయణ త్యుక్త్వా ఇమం మన్త్ర ముదాహరేత్‌. 54

నా ముందు అగ్నిహోత్రమును ప్రజ్వలింపజేసి దర్భలతో సంస్తరణము నేర్పరచి గణాంతికను దానిపై నిలుప వలయును. (సంస్తరణము- వెడల్పుగా పరచుట) అంత శిష్యుడును గురువును శుచిగా దీక్షితులై ''ఓం నమో నారాయణాయ'' అనుచు ఈ మంత్రమును పలుక వలయును.

మన్త్రః - మంత్రము.

యా ధారితా పూర్వపితామహేన

బ్రహ్మణ్యదేవేన భవోద్భవేన,

నారాయణాద్‌ దక్షిణమాత్ర జాతాం

గృహ్ణమహే వశ్యామృతం తు తత్త్వతః. 55

మొదట లోకపితామహుడు, బ్రహ్మణ్యదేవుడు, భవోద్భవుడు అగు బ్రహ్మ నారాయణుని కుడి భాగము నుండి పుట్టిన దీనిని ధరించెను. అట్టి వశ్యము, అమృతము అయిన దీనిని మేము గ్రహించు చున్నాము.

తత ఏతేన మన్త్రేణ పునర్గృహ్య గణాన్తికామ్‌,

శిష్యాయ ప్రదదౌ తత్ర పునర్మన్త్ర ముదాహరేత్‌. 56

పిదప ఈ మంత్రముతో గురువు మరల 'గణాంతిక' ను గ్రహించి శిష్యున కొసగుచు మరల ఈ మంత్రమును పలుక వలయును.

మన్త్రః - మంత్రము.

నారాయణాద్‌ దక్షిణమాత్రజాతాం,

స్వశిష్య గృహ్ణన్‌ సమయేన దేవీమ్‌,

ఇమాం చిన్తాపరో భూత్వా భవోద్భావ నజాయతే. 57

శిష్యా! నారాయణుని కుడివైపున జనించిన ఈ దేవిని ప్రతిజ్ఞ చేసి కైకొనుము.ఎల్లప్పుడు దీని భావన యందు శ్రద్ధ కలవాడ వగుము. దీనిని భావించినవాడు మరల సంసారమున పుట్టడు.

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

స్నానోపకల్ప నాన్తేషు కిం కర్తవ్యం తు మాధవ,

ప్రసాధనవిధిం చైవ కేన మన్త్రేణ కారయేత్‌,

అకర్మణ్యవ ముచ్యన్తే తవ కర్మపరాయణః. 58

మాధవా! స్నానము మొదలగు కార్యములందు చేయదగిన విధి ఏమి? అలంకరణమును ఏ మంత్రముతో చేయవలయును? నీ పనుల యందు శ్రద్ధాసక్తులు కలవాడు ఇతర కార్యములు చేయకున్నను ముక్తి పొందును కదా!

తతో భూమ్యా వచః శ్రుత్వా లోకనాథో జనార్దనః,

ధర్మసంయుక్తవాక్యేన ప్రత్యువాచ వసుంధరామ్‌. 59

లోకనాథుడగు జనార్దనుడు భూదేవి పలుకు విని ధర్మముతో కూడిన పలుకుతో వసుంధర కిట్లు బదులు చెప్పెను.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవుడిట్లు పలికెను.

దేవి తత్త్వేన వక్ష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి,

స్నానసై#్య వోపచారాణి యాని కుర్వన్తి కర్మణః. 60

దేవీ! నీవు నన్నడిగిన దానికి యథార్థమైన సమాధానము చెప్పెదను. ఈ కర్మమునందు స్నానము, ఉపచారములు ఎట్లు చేయుదురో వివరించెదను.

వృత్తశ్చైవోపచారేషు జలప్రముదితేషుచ,

కఙ్కతీం చాంజనం చైవ శీఘ్ర మేవోపకల్పయేత్‌,

దర్పణం చ వరారోహే యేన మన్త్రేణ దీయతే. 61

ఉపచారములు, స్నానక్రియలు అనువానిని ముగించిన వ్యక్తి దువ్వెన, కాటుక, అద్దము మున్నగు వానిని ఆయా మంత్రములతో కూర్చుకొన వలయును.

స్పృష్ట్వా తు మమ గాత్రాణి క్షౌమనస్త్రేణ తత్త్వతః,

అంజనం కఙ్కతీం చైవ శీఘ్రమేవ ప్రకల్పయేత్‌. 62

నా అంగముల నన్నింటిని పట్టువస్త్రముతో కప్పి కాటుకను, దువ్వెనను ఉపయోగింప వలయును.

తతో జానుస్థితో భూత్వా మమ కర్మపరాయణః,

అంజలిం కఙ్కతం గృహ్య ఇమం మన్త్ర ముదాహరేత్‌. 63

పిదప మోకాళ్లపై కూర్చుండి శ్రద్ధ కలవాడై దువ్వెనను మోడ్చిన చేతులతో పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.

ఓం మన్త్రః - మంత్రము.

ఏషోఞ్జలిం కఙ్కతం దేవ ప్రసీద నారాయణ శిరః

ప్రాసధి హి,

మహానుభావే నేత్రే వశ్చ యే పశ్యన్తి సర్వలోకా,

లోకప్రభో సర్వలోకప్రధాన ఏషోనయనమ్‌

అఞ్జయ లోకనాథ ప్రసీద నారాయణ గృహ్ణ గృహ్ణ

పశ్యేత ముద్భావ సద్భావేన.

నారాయణ! దేవా! దయచూడు. ఇదిగో దోసిలి. ఇదిగో దువ్వెన. దీనితో నీ శిరస్సును చక్కదిద్దుకొనుము. మహానుభావము లైన మీ కన్నులను సర్వలోకములును చూచును.ఓ లోకప్రభూ! లోకప్రధానా! ఈ కాటుకను కన్నులకు పెట్టుకొనుము. దయ జూడుము. గ్రహింపుము. గ్రహింపుము. నన్ను మంచిభావముతో చూడుము.

నమో నారాయణత్యుక్త్వా ఇమం మన్త్ర ముదాహరేత్‌. 64

పిదప 'నమో నారాయణాయ' అని పలికి ఈ మంత్రమును పఠింప వలయును.

మన్త్రః - మంత్రము.

ఏషా మయా మాధవ త్వత్ర్పసాదాద్‌

గురుప్రసాదాచ్చ మన్త్ర పూజా,

ప్రాప్తా మయైషా చ గణాన్తికా వై

భవత్యధర్మం న చ మే కదాచిత్‌. 65

మాధవా! నీ దయవలనను, గురువు దయవలనను, నేనీ మంత్ర పూజ గల గణాంతిక దీక్షను పొందితిని. నాకు ఎన్నటికిని అధర్మము కలుగకుండు గాక.

య ఏతేన విధానేన మమ కర్మాణి దీక్షితః,

గృహ్యతే గురుసంయుక్తో మమ లోకాయ గచ్ఛతి. 66

ఈ విధముగా దీక్షితుడై నా పూజావిధానములను గురువుతో కూడి గ్రహించువాడు నాలోకమున కరుగును.

కుశిష్యాయ న దాతవ్యం పిశునాయ శఠాయ చ,

ఏషా చైవ వరారోహే గృహ్ణేమం చ గణాన్తికమ్‌,

సుశిష్యాయ చ దాతవ్యం హస్తేష్వేవ గణాన్తికమ్‌. 67

మంచి నడవడి లేని శిష్యునకు, క్రూరునకు, మొండివానికి ఈ దీక్ష నొసగరాదు. ఉత్తమ శిష్యుని చేతుల యందే ఈ గణాంతిక కర్మమును సమర్పింప వలయును.

మంగల్యం మంగలం సిద్ధం భక్తసంసారమోక్షణమ్‌,

పరిమాణం ప్రవక్ష్యామి శృణు తత్త్వేన మాధవి. 68

ఇది శుభములతో కూడినది. శుభ##మైనది. సిద్ధి కలిగించునది. భక్తుని సంసారము నుండి విముక్తి చేయునది. దీని పరిమాణమును చెప్పెదను. ఓ మాధవీ! వినుము.

ఉత్తమా తు శతం పూర్ణం పఞ్చాశతిక మధ్యమా,

పఞ్చవింశతికాన్యాసా పరిమాణం విధీయతే. 69

నూరు గింజల మాల ఉత్తమమైనది. ఏబదింటితో అయినది మధ్యమము. ఇరువది అయిందిటితో అయినది తక్కువది. ఈ విధముగా కొలత నిర్ణయింప. బడినది.

రుద్రాక్షా ఉత్తమా చైవ పుత్రజీవకమధ్యమా,

కన్యసీ అష్టకై ర్విధ్వా దేవి త్వాం కథితం మయా. 70

రుద్రాక్షలతో చేసిన మాల ఉత్తమమైనది. పుత్ర జీవకములతో చేసినది మధ్యమము. అష్టకములతో గ్రుచ్చినది అధమ. దేవీ! దీనిని నీకు చెప్పితిని.

ఏతన్న జానతే కశ్చి జ్జన్మాంతరశ##తై రపి,

సర్వలోకహితాం శుద్ధాం మోక్షకామాం గణాన్తికామ్‌. 71

సర్వలోకములకు మేలు చేయునదియు, శుద్ధ అయినదియు, మోక్షమందు కోరిక పుట్టించునదియునగు ఈ గణాంతిక దీక్షను నూరుజన్మముల కైనను ఎవ్వడును తెలియజాలడు.

నోచ్ఛిష్టేన తు స్పృష్టవ్యా స్త్రీణాం హస్తే న కారయేత్‌,

ఆకాశే స్థాపనం కుర్యాద్‌ యదీచ్ఛేత్‌ పరమాం గతిమ్‌. 72

దీనిని ఎంగిలితో తాకరాదు. స్త్రీచేతియందు ఉంచరాదు. పరమగతిని కోరువాడు దీనిని మిక్కిలి ఎత్తున నిలుప వలయును.

గుహ్యానాం పరమం గుహ్యం సంధ్యోపాసన మేవ చ,

ఏష మన్త్రశ్చ జాప్యశ్చ పూజ్యమేవ గణాన్తికమ్‌. 73

ఇది రహస్యములలో మిక్కిలి రహస్యమైనది. సంధ్యా కాలములయందు ఉపాసింప దగినది. ఈ మంత్రము మిక్కిలిగా పూజింప దగినది. జపింపదగినది.

ఏవం హి విధిపూర్వేణ పాలయేచ్చ గణాన్తికామ్‌,

విశుద్ధో మమ భక్తశ్చ మమ లోకాయ గచ్ఛతి. 74

ఈ గణాన్తికను విధిపూర్వకముగా పాలింప వలయును. అట్లు చేసిన నాభక్తుడు మిక్కిలి శుద్ధుడై నాలోకమున కరుగును.

ఏవం విష్ణోర్వచః శ్రుత్వా ధరణీ రత్నభూషితా,

ప్రత్యువాచ పరం శ్రేష్ఠం లోకనాథం మహౌజసమ్‌. 75

రత్నముల అలంకారములు గల భూదేవి విష్ణువు వాక్కును విని లోకనాథుడు, మహాశక్తిశాలి అయిన పరమ పురుషునితో మరల ఇట్లు పలికెను.

దర్పణం తే కథం దేయం తత్వ మాఖ్యాహి మాధవ,

యేన తుష్టో నిజం రూపం పశ్యసే చిన్తితః ప్రభో. 76

ప్రభూ! మాధవా! నీకు అద్దము నెట్లు పట్టవలయును. ఎట్లు పట్టినచో నీ నిజరూపమును చూచుకొని తృప్తినంది భక్తుని భావనల కందుదువు?

ధరణ్యా స్తద్వచః శ్రుత్వా వరాహః పున రబ్రవీత్‌,

శృణు మే దర్పణవిధిం యథావత్‌ దేవి సువ్రతే. 77

భూదేవి పలుకు విని శ్రీ వరాహ దేవుడు ఇట్లు పలికెను. దేవీ! నాకు అద్దము చూపుట యెట్లో ఉన్నదున్నట్లు తెలిపెదను. వినుము.

నమో నారాయణత్యుక్త్వా ఇమం మన్త్ర ముదీరయేత్‌,

''నమో నారాయణాయ'' - నారాయణ దేవునకు నమస్సు అనుచు ఈ మంత్రమును పఠింపవలయును.

మన్త్రః - మంత్రము.

శుచి ర్భాగవతాః శ్రేష్ఠా స్తవ కర్మవినిశ్చితాః,

గాత్రాణి తే సర్వజగత్‌ ప్రధానం ముఖం చంద్రాతపాగ్రే

నేత్రే ఇమం చ మే దర్పణం లోకనాథస్య పశ్యస్వరూపం

జగత్‌ సర్వతః.

దేవా! నీ పూజల యందు శ్రద్ధగల భాగవతులందరు శ్రేష్ఠులు. స్వామీ! ఇవిగో నీ అంగములు. అన్ని లోకములలో ముఖ్యమైన నీ ముఖము చంద్రుని సూర్యుని వెలుగులు గల కన్నులు. ఇదిగో లోకనాథుడవగు నీకు అద్దము. అన్ని వైపుల నుండియు నీ స్వరూపమే అయిన జగత్తును దర్శింపుము.

య ఏతేన విధానేన మమ కర్మపరాయణః,

మమ కర్మాణి కుర్వీత తారితాః సప్త వై కులాః. 78

నా పూజాకర్మమునందు శ్రద్ధ కలవాడు ఈ విధానముతో నా కర్మములను ఆచరించినచో ఆతని ఏడు తరముల బంధువులు తరింతురు.

ఏతన్మన్త్రేణ వై భూమి ఉపచారస్తు ఈదృశః,

హృష్టతుష్టేన కర్తవ్యం యదీచ్ఛేత్‌ పరమాం గతిమ్‌. 79

భూమీ! ఈ మంత్రముతో ఈవిధమగు ఉపచారముతో ఆనందము, తృప్తికలవాడు, పరమగతిని కోరినచో, చేయవలయును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తవింశత్యధిక శతతమోధ్యాయః.

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటయిరువది యేడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters