Paramacharya pavanagadhalu    Chapters   

12. 'ఒకటి తరువాత.....?' 'మూడు'

స్వామినాథన్‌ చిన్నతనం నుండి చురుకైన పిల్లవాడు. ఏకసంతగ్రాహి. ఒకసారి వింటేనే ఏ పాఠమైనా అతనికి కంఠతా వచ్చేసేది. తన క్లాసు పాఠాలే గాక, తన పై క్లాసు వాళ్ల పాఠాలు కూడా యిలా వింటూనే పట్టేసేవాడు.

అది 1900 సంవత్సరం. స్వామినాథన్‌ ఆ యేడు చిదంబరంలో ఒకటో క్లాసు చదువుతున్నాడు. ఒకరోజు వాళ్ల బడికి పరీక్ష పంతులుగారు వచ్చారు. ఆరోజుల్లో పరీక్ష పంతులు గారు రావటం అంటే అదో పెద్ద సంగతి. బడిలో పంతుళ్లంతా నానా హడావుడి పడేవారు. ఇక ప్రధానోపాథ్యాయుల సంగతి చెప్పనక్కర్లేదు. అందులోనూ వచ్చేది సింగరవేలు ముదలియారు గారు. చాలా నిక్కచ్చి మనిషి గనుక ఆయనంటే అందరికీ హడల్‌.

ఆ రోజందరు పిల్లలు మంచి శుభ్రమైన బట్టలేసుకొని, తలలకు నూనె రాసుకొని బాగా దువ్వుకొని, బొట్లు పెట్టుకొని వచ్చారు. వాళ్లలో ఎవరికీ ఇన్‌స్పెక్షన్‌ అంటే తెలియదు. కాని ఏదో విశేషం జరగపోతోందనే సంగతి మాత్రం అందరికీ అర్థమైంది. ఎప్పుడూ గల గల లాడుతూ గందరగోళంగా వుండే క్లాసులన్నీ ఆరోజు నిశ్శబ్దంగా వున్నాయి.

స్వామినాథన్‌ క్లాసులోకి వచ్చాడు, ముదలియార్‌. అంతా లేచి నిల్చోని నమస్కారం చేశారు. కూర్చోండి అన్నాడు. పరీక్ష పంతులు గారు క్లాసంతా కలయజూస్తూ ఉన్నట్లుండి ఆయన చూపు స్వామినాథన్‌పై పడింది. నదురూ బెదురూ లేకుండా వున్న ఆ కుర్రాణ్ణి చూస్తే ఆయనకు ముచ్చటవేసింది. అంతేకాదు, కొంచెం తమాషా చేయబుద్దయింది. ఆయన తన చేతిలో వున్న ఇంగ్లీషు పుస్తకాన్ని స్వామినాథన్‌ కిచ్చి చదవమన్నాడు. స్వామినాథన్‌ లేచి గడగడా చదివేశాడు వొక్క తప్పు పోకుండా.

ఇనస్పెక్టరు గారు అదిరిపోయారు. ఎందుకంటే ఆయన యిచ్చిన పుస్తకం వొకటి క్లాసుదికాదు. పై క్లాసు వాళ్లది - లాంగ్‌మన్స్‌ ఇంగ్లీష్‌ రీడర్‌!

ముదలియార్‌ స్వామినాథన్‌ ను ఎంతో మెచ్చుకున్నాడు. బాల మేధావి అని ప్రశంసించాడు. అంతేకాదు. ఒకేసారి ఒకటో క్లాసు నుంచి మూడో క్లాసుకు ప్రమోట్‌ చేశాడు!

స్వామినాథన్‌కు యింటిలోను, బళ్లోను కూడా చదువుకు అనువైన వాతావరణం వుండేది. అతనికి చదువుకోవాలనే అభిరుచి, ఆసక్తి ఎక్కువ. అతని తండ్రి సుబ్రహ్మణ్యశాస్త్రి స్వయంగా ఉపాధ్యాయుడు. మెట్రిక్యులేషన్‌ ప్రథమ శ్రేణిలో పాసయిన ప్రతిభావంతుడు. శాస్త్రి గారి తండ్రి గణపతి శాస్త్రిగారు ఋగ్వేదాన్ని సాంగంగా అధ్యయనం చేశారు. షడ్దర్శనాలను బాగా చదువుకున్న పండితులు. స్వామినాథన్‌ తల్లి వేపు కూడా పండితకుటుంబమే. అతని తల్లి గారి తండ్రి నాగేశ్వర శాస్త్రి. ఆయన గొప్ప ఋగ్వేద పండితుడు. అందువల్ల ఆ ప్రభావం సహజంగా స్వామినాథన్‌పై పడింది. అతడు చదువులో మొదటి వరుసలో వుండేందుకు ఈ నేపథ్యం బాగా తోడ్పడింది.

'ఇతర దేశాల సంస్కృతీ, సాహిత్యాలను గురించి, సాంప్రదాయాలను గురించి తెలియజేసే పుస్తకాలను అనేకం మనం చదువుతాం. కాని మన సంస్కృతీ సంప్రదాయాలను వివరించే పుస్తకాలేవో మనకు తెలియదు. వాటిని గురించి తెలిసిన పండితులెవరయిన వివరించినా మనకు వినబుద్దికాదు. వారిని మనం లక్ష్యపెట్టం. ఇదీ నేటి మన దైన్య స్థితి.

విదేశాల వారో? వారు మన ఆత్మవిద్యను ప్రశంసిస్తున్నారు. అభ్యసిస్తున్నారు. అసంఖ్యాకులైన మహర్షులు దర్శించిన ఆ దివ్య ప్రకాశ##మే ఆత్మ జ్యోతి. మన దేశానికీ, సంస్కృతికీ జీవగర్ర అయిన ఆత్మవిద్యను గురించి ఉపేక్ష చేస్తే మనల్ని మనమే కించపరుచుకుంటున్నట్లు.'

- పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters