Paramacharya pavanagadhalu    Chapters   

17. ప్రథమ విజయయాత్ర

జగద్గురు శంకరాచార్యులుగా అభిషేకించబడిన తర్వాత 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతిస్వామి చేసిన మొదటి విజయయాత్ర జంబుకేశ్వరానికి కావటం విశేషం. ఇది 1908లో జరిగింది.

జంబుకేశ్వరాన్ని ప్రస్తుతం తిరువాన్నయిక్కావల్‌ అని పిలుస్తున్నారు. ఇక్కడ అఖిలాండేశ్వరి ఆలయం వుంది. ఒకప్పుడీ దేశంలో జంబుమహర్షి తపస్సు చేసికొంటుండేవాడట. వారి చుట్టూ తీగెలూ, పొదలూ మొలవటమే కాక ఒక జంబూ వృక్షం (నేరేడు) మొలిచింది. అక్కడ వెలసిన శివలింగం జంబుకేశ్వరుని ఆ మహర్షి ఆరాధించేవాడు. జంబుకేశ్వరుడు ఆపోలింగం అంటే జలలింగం. లింగం వద్ద ఎప్పుడూ నీరూరుతూ వుంటుంది. కంచిలోని ఏకామ్రేశ్వరుడు పృథివి లింగమనీ, జంబుకేశ్వరుడు జలలింగమనీ, శ్రీకాళహస్తీశ్వరుడు (కాళహస్తి) ఆకాశలింగమనీ అంటారు.

ఒకప్పుడు అఖిలాండేశ్వరి ఉగ్రదృష్టి కలిగివుండేదిట. ఆదిశంకరులు ఈ క్షేత్రం దర్శించి ఆమె ఉగ్రస్వరూపాన్ని తగ్గించటానికి గాను అక్కడ శ్రీ చక్రప్రతిష్ఠ చేశారు. చెవులకు తాటంకాలు (లోలకులు) అమర్చి ఆమె ఉగ్రాన్ని వానిలోనికి ఆకర్షించినారు. అంతేకాక ఎదురుగా విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేశారు. ఉగ్రదృష్టికల మాత చూపులు కుమారుని మీద పడగానే దృష్టిలో తీవ్రత పోయి సౌమ్యత కలిగింది. ఆమెలో మాతృవాత్సల్యం పొంది వాత్సల్య దృష్టి వచ్చింది.

అయితే ఆచార్యులు అమర్చిన తాటంకాలు కాలక్రమంలో మాసిపోయి తేజస్సు తగ్గుతూ వుంటాయి. అప్పుడు కామకోటి పీఠానికి ఆచార్యులైన వారు వచ్చి జీర్ణాద్ధారం చేసి తాటంక ప్రతిష్ఠ చేయటం ఆచారం. ఒకసారి యీ తాటంకప్రతిష్ఠ చేసే అధికారం ఎవరిది అని శృంగేరి, కామకోటి పీఠాధిపతుల మధ్య వివాదం కలిగింది. చివరకది న్యాయస్థానానికెక్కింది. కామకోటి ఆచార్యులకే ఆ అధికారం యిస్తూ కోర్టు తీర్పివ్వటంతో ఆ వివాదానికి తెరపడింది.

1908లో ఆలయోద్ధరణ జరిగి కుంభాభిషేకం జగద్గురువుల 14వ యేట ఆయన పవిత్ర సన్నిథిలో మహావైభవంగా జరిగింది.

Paramacharya pavanagadhalu    Chapters