Paramacharya pavanagadhalu    Chapters   

62. కొల్లాయి గట్టితేనేమి....?

అక్కడ వొక తోపుడు రిక్షా పెట్టి వుంది. దానిలో పీటలూ, చెక్కపాత్రలూ, ఒకటో రెండో ఖద్దరు శాఠీలు (కాషాయం రంగువి) వున్నాయి. ఆ రిక్షా పక్క నిలుచున్న వారు స్వామి సేవ కోసం వచ్చిన స్వచ్ఛంద సేవకులు. స్వామికి తొంబయి యేళ్లు దాటాయి. వడలిపోయి వరుగులా వున్నారు. నడక నేర్చుకొంటున్న పాపాయి మూడు చక్కాల బండిని పట్టుకొని తప్పటడుగులు వేసినట్లు, స్వామి ఆ రిక్షాను పట్టుకొని అడుగులు వేస్తారు. రిక్షాను నెమ్మదిగా నడిపిస్తారు శిష్యులు స్వామి వారి గమనం గమనిస్తూ, ఎంత దూరమైనా యీ యాత్రయింతే!

పొద్దున్నే యాత్ర మొదలు. ఎక్కడన్నా స్నానానికి, అనుష్ఠానానికి వసతి కనిపిస్తే ఆగటం, పూర్తి చేసుకోడం పొలాల్లో, వ్యవసాయక పంపు సెట్టు దగ్గరా, పాడుబడిన దేవాలయాల్లో, సత్రాల్లో, చెట్ల క్రింద ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఆగటం, మళ్లీ ముందుకు సాగటం. ఆయన భోజనం పేలాలా, అటుకులా, పండ్లా, ఏదయినా పిడికెడు ఒక్కోసారి అదీ లేదు. పరివారానికి భోజనమా? గ్రామస్థులు యిస్తే ఆ రోజుకు సరిపడే సామాగ్రి మాత్రమే తీసికోవాలి. వూరు వదిలిపోయేటప్పుడు మిగిలినది అక్కడే వదిలేయాలి. అని నియమం.

ఈ స్వామి ఎక్కడ ఆగుతే అది క్షేత్రం. అదే తీర్థం. అక్కడే తిరుణాళ్ల. ఆయన అక్కడ బస చేసినంత కాలం ఆ వూరికి అయిదు నిమిషాలకో బస్సు తిరుగుతుంది. కార్లూ, బండ్లూ, అంతా సందడే, పేదలూ, పెద్దలూ అందరికీ ఆయనను ఒక్కసారి చూడాలని, ఆయనతో ఒక్క మాటు మాట్లాడాలనీ, ఆయన చేతి మీదుగా తీర్థం తీసికోవాలని ఒకటే తాపత్రయం.

ఆయనకు కార్లేమిటి, కోరితే విమానాలే అక్కడికి వస్తాయి. కావాలంటే పంచభక్ష్య పరమాన్నాలు, పట్టుపరుపులు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆయనకు అవేవీ అక్కడ లేదు.

అలా ఆరేళ్లు పాదయాత్ర చేసి కంచికి వచ్చారు స్వామి. అది ఎండా కాలం. అసలే కాంచీపురంలో ఎండ ఎక్కువ. అయినా అదేమిటో ఆయనకు చెమట పోయదు. చలికాలంలో అంతా శాలువలు కప్పుకొని కూడా గజగజలాడుతుంటే ఆయన చన్నీళ్లతో మునిగి తడిబట్టల్తో గుడి చుట్టూ తిరుగుతారు, వణుకంటూ ఎరగకుండా, ఇంతకూ ఆ ఎండకాలంలో కంచికి చల్లా విశ్వనాధశాస్త్రి గారు వెళ్లారు, స్వాములవారు తిరిగొచ్చారని తెలిసి. అంతా ఆరుబయట పడుకున్నా ఉక్కకు నిద్ర పట్టక రాత్రంతా అవస్థ పడుతూ గడిపేవారు. స్వాముల వారు మాత్రం ఒక యిరుకు మేనాలో కాళ్లు జాపుకోడానిక్కూడ వీలే లేకుండా గంపెడు పుస్తకాలు పెట్టుకొని అవి చదువుతూ గడిపేవారు. ఉదయం మేనా తలుపులు తీసికొని వస్తుంటే ఎయిర్‌కండీషన్డ్‌ గదిలోంచి వచ్చినంత ప్రసన్నంగా ఉండేవారని స్వయంగా ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డ శాస్త్రి గారు రాశారు.

స్వామి గారి దర్శనం కోసం ప్రముఖులెందరో వస్తుంటారు. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడికే వారు వెళ్లి దర్శనం చేసికొంటారు.

ఒకసారి భారతరాష్ట్రపతిగా వున్న శ్రీ నీలం సంజీవరెడ్డిగారు స్వామి దర్శనం కోసం వచ్చారు. స్థానికాధికారులు ఆడంబరంగా రాష్ట్రపతి కోసం ఒక రత్న కంబళీ, స్వామికి మరోటీ ఆసనాలుగ ఏర్పాటు చేశారు. తీరా రాష్ట్రపతి వచ్చేసరికి స్వామి పశువుల కొట్టంలో కూర్చొని ఆవులు మేత మేస్తుంటే చూసి ఆనందిస్తున్నారు..రెడ్డి గారక్కడికే వెళ్లి స్వామి దర్శనం చేశారు.

ఒక శబ్దం వుంటుంది. కాని దానికి అర్థం ఆయిన వస్తువు లోకంలో వుండదు. దానికి 'వికల్పం' అంటారు. గొడ్రాలి కొడుకు దీనికి ఉదాహరణ.

తాడు పాములా కనిపించటాన్ని ప్రాతిభాసిక సత్యం అంటారు. మనం చూసి, యింద్రియాలచే గ్రహించేది వ్యావహారిక సత్యం. ప్రాతిభాసికమైనా, వ్యావహారికమైనా- ఈ రెండూ కల్లలే. వేదాంతంలో కల్లను మిథ్య అంటారు. అసత్యం కల్ల కూడా కాదు. దానికి అసలు వునికే లేదు. అది పూర్తిగా అసత్తు.

సర్వదా వుండేది సత్యం. అసలు లేనిది అసత్యం. సత్యానికీ, అసత్యానికీ మధ్య వుంటూ సత్యాలవలె తోచే కల్లలు వున్నాయి. పరమాత్మ వొక్కడే సత్యం. నిత్యం. ఆయనను పారమార్ధిక సత్యం అంటారు.

('తదేకో వశిష్ట: శివ:కేవలోహమ్‌ - దశ శ్లోకి)

-పరమాచార్య

Paramacharya pavanagadhalu    Chapters