Paramacharya pavanagadhalu Chapters
65. వేణువేదీ?
శ్రీవారొక వూళ్లో మకాం చేస్తూ అక్కడ వున్నగుళ్లు చూడటానికి పోయారు. ఆయన ప్రక్క కల్లూరి వెంకటసుబ్రహ్మణ్యం దీక్షితులు గారున్నారు.
దీక్షితులు గారు స్వామి జీవిత చరిత్ర రాశారు. ఆంధ్రప్రభలో దానిని శ్రీ నీలంరాజు వెంకట శేషయ్య గారు ధారావాహికంగా ప్రచురించారు.
'ఇది శివాలయం, ఏదీ శివుని మీద నీవు చెప్పిన పద్యం చదువు', అన్నారు శ్రీవారు దీక్షితుల వారితో ఆయన చదివారు.
తరువాత వారంతా విష్ణ్వాలయానికి వెళ్లారు.
'ఇక్కడ విష్ణువు మీద రాసిన పద్యం చదువు' - అన్నారు.
దీక్షితులు గారు తన స్వగ్రామంలో వెలసి వున్న కులదైవంపై రాసిన పద్యం ఎత్తుకున్నారు. మూడు పాదాలు చదివారు. నాలుగో పాదం వారికి గుర్తు రాలేదు.
శ్రీవారు ' ఆ పద్యానికి ఎన్ని పాదాలు'? అనడిగారు
'నాలుగు' - అన్నారు దీక్షితులు గారు.
'మదనగోపాలుని మీదనా నీ పద్యం?'
'వేణుగోపాలుడు'
'వేణు వేదీ?' | అన్నారు స్వామి.
'దాని కోసమే వెతుకుతున్నాను', అన్నారు. దీక్షితులు. ఇంతలో స్వామి వేణువు పదం మీదికి సంభాషణ మళ్లించిన సంగతి ఆయన గమనించారు. వెంటనే ఆయనకు హఠాత్తుగా నాలుగోపాదం గుర్తుకు వచ్చింది.
''మధుర బింబాధర సుధదోగి తోగి
యింపొలసి వేణువు దివ్యకళలు గురియ'' అదీ ఆ నాలుగో పాదం, అందుకూ స్వామి సంభాషణ వేణువు మీదికి మరల్చారు?
'జ్ఞాపకం గాని, మరపుగాని నా వల్లనే కలుగుతున్నాయి', అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో.