Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

మితభాషణము ఆయుర్వృద్ధి

''తిరుపతి, చిదంబరము, కాళహస్తి మొదలగు దివ్యక్షేత్రములలో భగవదారాధన జరుగు సమయమున అప్పుడప్పుడు స్వామికి ఎదురుగా నున్న తెరను వేయుట, మరల తొలగించుట, స్నానాద్యుపచార సమయములలో మనము చూచుచునే యున్నాము.'' ఇట్టి సమయములలో మన మనస్సు స్వామిపైనే లగ్నమగును-ఎప్పుడు తెరతొలగింతురా అని తహతహ లాడుదుము. దృశ్యాదృశ్యముగా నున్నప్పుడే మనమనస్సునకు ఏకాగ్రత సిద్ధించును. అప్పుడు మన శ్వాస కూడా నిలిచిపోవును, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగి నప్పుడుగాని, విషాదకరమైన వార్త వినినప్పుడుగాని మన శ్వాస కొన్ని నిమేషములు స్తంభించును. మన మనస్సు ఆ వార్తలందే లగ్నమగును, అట్లే పూజాది సందర్భములందు మన మనస్సు లగ్నమైనచో మనకు శాంతచిత్తం అలవడును. శాంతముగా నున్నప్పుడు శ్వాసను నెమ్మదిగా పీల్చుట కలదు, క్రోధాదులందు శ్వాసలు వ్యయమయి పోయి ఆయుస్సు క్రమముగా క్షీణించును. ప్రతిజీవుడు యెన్ని లక్షల, యెన్ని కోట్ల శ్వాసలు కలిగి యుండననియు, ఆ వెనుక మరణమని ఆ యుర్దాయమును శ్వాసల సంఖ్యనుబట్టి లెక్కించుట శాస్త్రములందుకలదు. మనమెంత శాంతముగా నున్న ఆయుర్దాయమంత వృద్ధియగును. శాంతుని ఎవరూ ఏమి చేయలేరు. మౌనమును అభ్యాసము చేయుట చాలామంచిది. కొందరు పుట్టుకతోనే జడులుగా మందబుద్ధులుగా పుట్టుదురు, పలుకరించినను ఎప్పుడో గాని పలుకరు. ఆస్థితి మౌనము కాదు, అనవసర సంభాషణ మాని, ఎంతవరకు మాట్లాడుట తగ్గించిన మనవ్యవహారము జరుపు కొనవచ్చునో అంతవరకే సంభాషించుట అభ్యాసము చేసికొనవలెను, ఆ మౌనములో శంఖునాదములు వినబడునని, జ్యోతిస్సులు కనిపించునని పెద్దలు చెప్పుట కలదు. ఆనందము వినుట అలవడినచో ఆ వెలుగును కనులు రుచిజూచినచో అన్యమైన ఏ వస్తువుపై అభిలాష కలుగదు. ఆ నాదము, ఆ వెలుగుల బాహ్యస్వరూపమే దేవాలయాదులందు ఘంటా నాదములు, దీపహారతులు అవి చూచి లోనున్న వానిని కనుట వానిలక్ష్యము.

''జ్ఞాదే మౌనం క్షమాశక్తా త్యాగేశ్లాఘా విపర్యయః.''

అని కాళిదాసు రఘువంశమున అభిభాషించెను, పూర్వ జ్ఞానము కలిగినను తన కింతవచ్చునని ప్రకటింపకుండుట. శక్తి కలిగియున్నప్పుడు ఎవరైనమనకుహాని చేసినచో వారిని క్షమించుట, త్యాగము చేసినను గొప్పలు చెప్పకుండుట-ఇవి సజ్జనుల లక్షణములు. ఈ శ్లోకములో నున్న మౌనమును బాటింపవలెను. మనము మాట్లాడునది ఎవరికి తెలియకుండ నుండుటకు ఏగదిలోనికి వెళ్ళి మాట్లాడుదుము? లేక పెద్దజనసమూహములో మాట్లాడినను మనమాటలు మరొకరికి తెలియవు. ''గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుఛిన్న సంశయాః'' గదిలోకి వెళ్లి యిద్దరు మాట్లాడుచున్నప్పుడు ఫలానా విషయము గూర్చి మాట్లాడు చున్నారని వూహింపవచ్చును. ఒక్కొక్కప్పుడు మన వూహలు కూడా నిజమనిపించును, కాని జనసమూహములో నున్నప్పుడు మనసంభాషణ మరియొకరికి తెలియదు. ఆ ధ్వనిలో సమస్తము లయమై పోయినట్లుండును. అందులకే దేవాలయాదులందు ఘంటా నాదములు. ఆనాదములో చిత్తవృత్తులు లయించును, దక్షిణామూర్తి, నటరాజమూర్తి, భిక్షాటనమూర్తి, ఇందు దక్షిణామూర్తి చిత్స్వరూపుడు, నటరాజమూర్తి ఆనందస్వరూపము, భిక్షాటనమూర్తి సత్స్వరూపము.

ఈనాడు రాజులు లేరు. జమీందారులు లేరు, మనమే రాజులము, ఏ ధర్మ కార్యము నిర్వహింప వలె నన్నను ఆ రాజులను మనమాశ్రయించెడి వారము, ఈనాడు వారు లేరు, కనుక మన మందరముకూడి ధర్మకార్యములను నిర్వహింపవలెను.

'మనమిచ్చునది యేమి? మన మేమి చేయగలము? అని నిరాశ చెందకుండ, మనమిచ్చు తృణములే కణములే పెద్ద పెనురాశులగును, చిన్న చిన్న బిందువులే సముద్రమగును, మన సంపాదనలో నెలకు ఒకరూపాయిగాని, రెండుగాని, మూడుగాని కూడబెట్టి ఒక పొదుపు లెక్కలో వేయవలెను. ఈ డబ్బును ఏ జీర్ణ దేవాలయమునకో ఏ ధర్మ కార్యమునకో వెచ్చింపవలెను. నూత్న మైన ఆలయములను కట్టుటకన్నా పాడయిన ఆలయమున దీపము వెలిగించుట మంచిది.

''వ్యక్తిగతముగా చూచినచో ఎందరో మేధావులు, దృఢగాత్రులు, మహావ్యక్తులు మనలో ఉన్నారు. కాని సంఘమున కేదైనా విపత్తు సంభవించినపుడు పరదేశస్తులు దండెత్తినపుడు, మనము వారి చేతిలో చనిపోవుటగాని, లేక పరుగెత్తుటగాని చేయుదుము. ఐకమత్యము లేక, ఎదుర్కొను శక్తిలేక వెల వెల పోవుదుము. దీనినుండి రక్షించుకొనుటకు ప్రతిపురుషుడు, ప్రతి స్త్రీ కూడా, ప్రతిదినము వ్యాయామము చేయవలెను, ఏ హనుమాన్‌ వ్యాయామాలయమనో, లేక రాష్ట్రీయ స్వయంసేవక సంఘాదులలో చేరిగాని శరీరబలమును పెంపొందించుకొని మన భార్యా బిడ్డలను మనము రక్షించుకొనుట మన ప్రథమకర్తవ్యము.

''ఈనాడు మన పతాకమున నున్నది అశోకచక్రము అహింసకు ప్రతీకగా అశోకుడు తాను వేయించిన శిలాశాసనములలో అహింసను బాటింపవలసినదిగా బాహాటముగా చాటి యున్నాడు, ఈ దేశములో పరమ పవిత్రముగా చూడబడు గోవును చంపుటకు ప్రత్యేకముగా కసాయిశాలలు అశోక చక్రచ్ఛాయలో కట్టబడుచున్నవి. మనతల్లి మనకే పాలు నిచ్చును. గోవు దూడకు పాలిచ్చుట తోడనే తృప్తి చెందక మనకుకూడ పాలునిచ్చును.

బ్రిటిషు వారుపాలన చేయునపుడు ఒక వయస్సులో నున్న పిల్లలు నేరములను జేసిన వారిని ఒక పాఠశాలలో చేర్పించి విద్యావంతులను చేసి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దెడివారు, వారి దగ్గరకు క్రైస్తవమత బోధకులను పంపెడివారు. రాజాజీ మద్రాసులో పాలన చేసినప్పుడు క్రైస్తవమత ఫాదరీలనేకాక యితరమత బోధకులు గూడవెళ్ళి హితబోధచేయునట్లు అంగీ కరించెను. మన మత బోధకులు ఎవరూ వెళ్ళిన జాడలు లేవు. ఆ నేరస్తులకు ఒక వారమున ఒకరోజు స్వేచ్ఛ యిచ్చెడివారు. క్రైస్తవ బాలురను మీకేరోజు సెలవుకావలెనన్న ఆదివారమని, చర్చికి వెళ్ళుట కొరకని, మహమ్మదీయ బాలురు శుక్రవారము నమాజు చేసికొనుటకు మసీదునకు వెళ్ళుట కొరకని బదులు చెప్పెడివారు. మరి హైందవ నేరస్తులను అడిగినచో మాకు ఆదివారము కావలెనని, ఎందుకన సినీమాలు చూచుటకని బదులు చెప్పెడివారు. ఇది మనదేశ స్థితి, హిందువులు, మహమ్మదీయులుగా క్రైస్తవులుగా మారిన శుక్రవారముననో, ఆదివారముననో దేవాలయమునకు వెళ్ళు సంప్రదాయమైనా వారికుండును. అదియైనను ఈశ్వరారాధనయే కదా, వారు మరల మన మతములో చేరిన ఏ దేవుని స్మరించని స్థితి ఏర్పడును. ఈ సందర్భమున యింతకు ముందుకు యే యే మతములలోనుండి యితర మతములను స్వీకరించిరో మరల వారిని హిందూ సంఘములో చేర్పించికొనుటకు ముందుగా కొన్ని ప్రాయశ్చిత్తములను చేయించి చేర్చుకొనవచ్చునని శాస్త్రములు చెప్పుచున్నవి. వేలాది ప్రజలు సమస్తము కోల్పోయి మనదేశమునకు హిందువులుగా తిరిగి వచ్చు చున్నారు. విశేషమైన అనుష్టానములు పూజలజోలికి వెళ్ళక పోయినను ఏదియో యొక ఇష్టదేవతా నామమును వారు స్మరించి ముక్తిని బడయవచ్చును, అజామీళుడు ముక్తినిగాంచలేదా? కనుక అందరు ప్రాతఃకాలమున హరినామ స్మరణ, సంధ్యాకాలమున శివనామస్మరణ చేయుట మంచిది. ఆహార శుద్ధి పాటించుట మంచిది, దానివలన సత్వశుద్ధి ఏర్పడును. మేము ధర్మప్రచారము ప్రతిగ్రామమునకు పోయి చేయుట మావిధి. ఇంతవరకు చేయకపోవుట మాలోపమే, కొన్నియైనను పాటించుట మీ ధర్మము.

8-13ొ


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page