జగద్గురు బోధలు
ఎనిమిదవ సంపుటము
శ్రీ కంచి కామకోటి జగద్గురు
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వామి
శ్రీ స్వామి వారు
ఆంధ్రప్రదేశ పర్యటనమున ఇచ్చిన ఉపన్యాసాలు
''ఆంధ్రప్రభ'' నుండి పునర్ముద్రితం
ప్రకాశకులు :
సాధన గ్రంథమండలి, తెనాలి.
కాపీరైటు వెల రు.30.00
ఆమోదము
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమాం |
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమాం ||
ఇది జగద్గురుబోధలు ఎనిమిదవ సంపుటము. వెనుకటి ఏడు సంపుటములలో 5వ సం.ము కాక మిగిలినవి తమిళము నుండి 'విశాఖ' అనువదించెను. 5వ సం.ము ఇంగ్లీషు నుండి శ్రీ కాటూరి వెంకటేశ్వరరావుగారు అనువదించిరి. 1-7 సం.ములు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావుగారు అనువదించిరి. 1-7 సం.ములు శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు పరిష్కరించంగా పాఠకులకు అందించితిమి.
ఈ యెనిమిదవ సంపుట మట్టిది కాదు. ఈ దశాబ్దియందే పూజ్యచరణులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు, శ్రీ కంచి కామకోటి పీఠాధిపులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి వారు తమపీఠముతో యావదాంధ్రదేశమున పర్యటించిరి కదా? వారు తమ పర్యటన వేళ జనపద-నగర-తీర్థ-క్షేత్రాదులయందు జనుల నుద్బోధించుచు నొసగిన యుపన్యాసముల సంపుటము ఇది.
శ్రీ స్వామివారు సర్వజ్ఞులు, వారిపీఠము సర్వజ్ఞపీఠము. వారిపలుకు లన్నియు అర్ధగంభీరములు, వేద వేదాంగములలో వారికి తెలియనివి లేవు. దేశంలోని పెద్ద పండితులుకూడ ఒకసందేహం వస్తే శ్రీవారిమాట ప్రమాణంగా అంగీకరిస్తారు. స్వామి వేదవేదాంగములందేకాదు, అన్నిటను పండితులే. శిల్పం, గణితం, ఆగమం, యోగం తంత్రం, మంత్రం- ఇలా ఉంటే భిన్నభిన్న విద్యలలోని రహస్యాలు వారికి కరతలామలకాలు. ఎందరో విదేశ విద్వాంసులు వారిని దర్శించి వారితో సంభాషించి వారి విజ్ఞతకు జోహారులు అర్పిస్తూ ఉంటారు.
శ్రీస్వామివారి ఉపన్యాసములన్నియు శంకరాద్వైతమనెడు పాలకడలిని చిలికి చిలికి వెలికిదీసిన పీయూషమంజూషలు.
శంకరులు రచనలన్నియు సంస్కృతమునందే యున్నవి. సామాన్యులకు వాని అర్థములు దురవగాహములు. ఇట్టి స్థితియందు స్వామి యొసగిన యీయుపన్యాసము లన్నియు లోకమునకు మేలుకొలుపులై, వెన్నెల వెలుగులను కురియింపజాలియున్నవని. అశ్రమముగ అధ్యాత్మిక పథమున పురోగమింప జేయజాలినవని అభిలాంధ్ర జనావళి యెఱిగి యున్న విషయమే.
శ్రీస్వామివారు తనయందు అధిక శ్రన్ధాభక్తులుగల భక్తజనావళికి సాక్షాత్కరించి హితం ఉపదేశించినట్లు పలువురకు అనుభ##వైకవేద్యము. వారు మహాతపస్వులు, యోగులు, సర్వభారతదేశములో ఆయనకు సాటి వేఱొకరు కానిపింపరు.
అఖిలాంధ్రమున పర్యటించి స్వామివారు కంచి చేరి ప్రస్తుతము మౌనవ్రతియై యున్నారు. బాహ్య ప్రపంచముతో సంబంధములేక అంతర్ముఖులుగా తపస్సులో నున్నారు. మామూలుగా ఉన్నప్పుడే గుప్పెడు పేలాలు వారి ఆహారం. ఇపుడు అదియు లేదు. రెండుమూడు రోజులకు ఒకటి, రెండు అరటిపండ్లు తీసికొనుచున్నారేమో!
అట్టిమౌని, యోగి-మౌనం అవలంబించడానికి పూర్వం దేశం నలుమూలల పర్యటించి, దేశీయులకు ప్రస్తుతము వారున్నస్థితిలో అవసరమైన విజ్ఞానం ఏమాటలలో అందజేశారో- ఆ మాటలే ఈ సంపుటం. అందుచే జగద్గురుబోధలలోని మిగిలిన భాగాలకంటే ఈభాగం ఒక విశిష్టత కలది. భగవత్సాన్నిధ్యాన్ని చేరుకొనుటకు ప్రాచీనులు అవలంబించిన మార్గాలను అవలంబించే దార్ఢ్యం మనం చాలవరకు కోల్పోయినాము. ఇట్లు దుర్బలులమై ఉన్న మనకు భగవత్సాన్నిధ్యాన్ని చేకూర్చే సులభమార్గం కావాలి. క్లేశం మనం సహించలేము.
స్వామి దేశీయుల యీస్థితిని గమనించి తమ విజ్ఞానానుభవాలను మథించి పలికిన పలుకులు ఈ ఉపన్యాసాలు. శ్రీ స్వామివారి ఉపన్యాసాలనన్నిటిని ఎనిమిది భాగాలుగా మండలి ప్రచురించుట మహద్భాగ్యం.
ఆంధ్రప్రభలో ప్రచురించిన వ్యాసములను సాధనమాగ్రంథ మండలిలో గ్రంథరూపంగా రూపొందించుటకు తమ ఆమోద అంగీకారములను వెలిబుచ్చి అనుగ్రహించి సహకరించిన ''ఆంధ్రప్రభ'' సంపాదకులుగా నుండిన శ్రీ నీలంరాజు వెంకట శేషయ్యగారికి, ప్రస్తుతము ''ఆంధ్రప్రభ'' సంపాదకులు, శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావుగారికిని మా కృతజ్ఞతలు.
ద్వితీయ ముద్రణ
'జగద్గురుబోధలు' ఎనిమిదవభాగము తొలి ముద్రణ వ్రతులు అయిపోయి చిరకాలమయినది. అనివార్యకారణములచే మరల ముదించలేక పోతిమి, శ్రీ పరమాచార్యులవారి పరిపూర్ణాను గ్రహముతో నేడు ప్రచురించితిమి.
ఈ గ్రంథ ప్రచురణకు గౌరవ పురస్సరమైన సహకార మందించిన.
1. శ్రీ కాశినాధుని శివరావుగారు. తెనాలి
2. కీ.శే. శ్రీ దుగ్గిరాల సూర్యనారాయణమూర్తిగారి
జ్ఞాపకార్ధము కుమారుడు, శ్రీ చంద్రశేఖరశాస్త్రి. తెనాలి
3. శ్రీ పరమాచార్యులవారి పాద భక్తులు ఒకరు. తెనాలి
4. బలభద్ర పాత్రుని మోహనరావుగారు. తెనాలి
5. శ్రీ ఘంటా చిట్టెయ్యగారు. నల్లజర్ల
ఈ వదాన్యులందరకు నాహృదయపూర్వక ధన్యవాదములు.
బహుధాన్య వసంతము 1998
ఇట్లు,
బులుసు సూర్యప్రకాశశాస్త్రి
వ్యవస్థాపకుడు : సాధన గ్రంథ మండలి.
|