మంచిచెడులు - దేవదానవులు
''పుష్పములలో కెల్ల పద్మము, మల్లెపూవులు సర్వదేవతలకు పూజార్హములైనవి. పుష్పసంతతిలో కొన్నిటికి పూజానర్హత ఉన్నదికాని, ఈ రెండిటికి ఏనిషిద్ధములేదు. ఇది శరదృతువులో పుష్పించడం ప్రారంభిస్తాయి. శరదృతువు ఆశ్వయుజమాసంలో దేవీనవరాత్రులు ప్రారంభమవుతాయి. వీటికే ''శరన్నవరాత్రులు''అని పేరు. ఈ రోజుల్లో అమ్మవారికి ప్రీతికరమైన మల్లెపూలు విశేషంగా సమర్పిస్తారు.
ఈ మల్లెపూలు రూపంలోనే శ్రీశైలం మల్లికార్జునుడు వెలసినారు. శ్రీశైలమల్లికార్జున క్షేత్రం ఒక మహాక్షేత్రం అది మనకు ఆధ్యాత్మిక కేంద్రం. అందుకే సంకల్పంలో ''శ్రీశైలస్య పశ్చిమభాగే'' అని చెప్తారు. జన్మాష్టమి రోజున కృష్ణుడు, యోగమాయ ఒకేసారి జన్మించారు. కనుకనే వారికి సోదర సంబంధ మున్నది. యోగమాయ కృష్ణుల జననాంతరం వసుదేవుడు వారిస్థలాలు మార్పుచేశాడు, అందుకు యమునానది సహాయపడింది.
ఇదే మాదిరిగా విష్ణువుకు, దుర్గకు సహోదర సంబంధం ఉన్నది. ఈ విషయం శ్రీభాగవతం, విష్ణుభాగవతాలవల్ల స్పష్టమవుతుంది. దేవీభాగవతంలో కూడ ఈ విషయం చెప్పబడింది. దేవీజననం, దేవీనవరాత్రులు, ప్రారంభం-మున్నగు విషయాలు కూడా అందులో చెప్పబడ్డాయి.
ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తైత్తిరి, మొదలగుగాగల పదిఉపనిషత్తులలోను బ్రహ్మపదార్థము వివరించబడింది. ఈ పది ఉపనిషత్తులు వేదమనే మహావృక్షానికి కుసుమములు, వీటినుండి మనము నేర్చుకొన్న అనుభవమే ఫలము. ఈపదికూడా బ్రహ్మసాక్షాత్కార బోధవాలి.
బృహదారణ్యకోపనిషత్తులో ఈ విధంగా ఉంది- ''మానవ హృదయంలో జరిగే మంచి -చెడుల పోరాటమే దేవదానవుల సంగ్రామం వంటిదని, మంచి-దేవతా స్వరూపమనీ, చెడు - రాక్షస స్వభావమనీ చెప్పబడింది. మంచి-చెడుల జయాపజయాల ననుసరించి, అహంకారం జనించడం గానీ, నాశనం కావడం కానీ జరుగుతా''యని చెప్పబడింది.
దీనికే కేనోపనిషత్తులో ఒక కథ ఉన్నది. అదేమిటంటే- ''ఒకసారి దేవదానవులక ఒక గొప్ప యుద్ధం జరిగింది. అందులో అదృష్టవశాత్తు చివరకు దేవతలకు విజయం లభించింది. అపుడు దేవతలంతా కలిసి ఒకవిజయోత్సవం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్నవారు గర్వంతో ఆత్మస్తుతి, పరనింద ప్రారంభించారు. ''అహం'' తలకెక్కింది. ఇది గమనించిన పరాశక్తి, జ్ఞానోదయం కలుగడానికి విజయోత్సవం జరిగేచోట బ్రహ్మండమంతా వ్యాపించిన ఒక పెద్దజ్యోతిరూపంలో ప్రత్యక్షమయింది. దానికే ఉపనిషత్తులో ''యక్షరూపం'' అని పేరు పెట్టబడింది. దానిని చూసిన దేవతలంతా ఒక్క క్షణం ఆశ్చర్య చకితులయ్యారు. ఉత్తరక్షణంలో అంతా సమావేశ##మై, తమకంటే అతిరిక్తమైన శక్తి మంతులు లేరనే అహంకారంతో తమ ప్రతినిధిగా అగ్నిని ఆ జ్యోతివిషయం తెలుసుకు రమ్మని పంపారు.
అగ్ని మహాగర్వంతో జ్యోతి సమీపానికి వెళ్ళాడు. అపుడు దానినుంచి ''నీ వెవరు? అనే శబ్దం వినిపించింది. దానికి సమాధానంగా అగ్ని ''నన్ను జాతవేదుడు'' అంటారు. ''ప్రపంచంలోనున్న ఏవస్తువునైనా దహించివేసే శక్తి నాకున్న'' దని చెప్పాడు. అపుడు ఆ జ్యోతి ఒక తృణం అతని ముందు పెట్టి, దానిని దహించమని చెప్పింది. అగ్ని తన యావచ్ఛక్తిని ఉపయోగించాడు. కాని దానిని దహించలేక విఫలుడయ్యాడు. ఆ అవమానంతో దేవతలవద్దకు తిరిగి వెళ్ళి, అహంనశింపగా జరిగింది వారితో చెప్పాడు.
అది విన్న దేవతలు మరింద అహంకారంతో ఈసారి వాయువును ఉపయోగించారు. వాయువు వెళ్ళాడు, వాయువుకు కూడా ''నీవెవరు?''-అనే ప్రశ్న వినిపించింది. అపుడు వాయువు నన్ను ''మాతలి'' అంటారు. సర్వప్రాణులకు ఆధారభూతుణ్ణి, ''ఏ వస్తువునైనా క్షణంలో స్థానభ్రంశం కల్గించగలను'' అని చెప్పాడు, వెంటనే ఆ జ్యోతి అతనికి కూడ ఒక తృణం ఇచ్చి, దానిని ఎగురగొట్టమని చెప్పింది. వాయువు కూడా తనయావచ్ఛక్తిని వినియోగపరచి, దానిని కదల్చలేక నిర్విణ్ణు డయి పశ్చాత్తాపంతో వెనకకు తిరిగి వచ్చాడు.
అగ్ని, వాయువు-ఇద్దరూ అశక్తులవడంతో, దేవతలంతా భయభ్రాంతు లయ్యారు. అపుడు ఇంద్రుడు ఆ జ్యోతిని సమీపించి, హృదయపూర్వక వందనం చేసి ''నీవెవరవో తెలియ జేయవలసింది''-అని ప్రార్థించాడు. అపుడు ఆజ్యోతినుండి దివ్యమైన తేజస్సుతోను, రూపంతోను కూడిన ''పరాశక్తి'' ఆవిర్భవించింది.
ఆ పరాశక్తియే ఇంద్రునికి బ్రహ్మోపదేశం గావించింది. తర్వాత మిగిలిన దేవతలకు జ్ఞానోదయం గల్గి, తమకు విజయం ఈశ్వరసంకల్ప వల్లనే కలిగిందని తెలుసుకున్నాను.
''దేవీజననం '' చైత్రశుద్ధనవమి మధ్యాహ్నం అయిందని శ్రీదేవీభాగవతంలో వున్నది. అదే రోజున ఒకే అంశంలో ''శ్రీరామజననం'' కూడా అయింది. అందుకే వీరిద్దరికీ సోదరసంబంధం ఉన్నది.
ఇదే విధంగా కృష్ణుడు, దుర్గ ఒకే రోజున-అనగా- 'అష్టమి' రోజున జన్మించారు. ఈ విధంగానే రాముడు పార్వతీదేవి ఒకటేనని, సీత శంకరుడు ఒకే అంశగలవాళ్ళని తెలుస్తున్నది.
రాముడు, నీలమేఘ శ్యామలవర్ణం గలవాడు. పార్వతీ దేవికూడా అదే వర్ణంగలది. సీత, శంకరుడు తెలుపువర్ణం గలవారు. ఈవిషయం రామాయణంలో కూడా స్పష్టంగా వివరించబడి వున్నది. రాముడు వనవాసానికి వెళ్ళేప్పుడు సీతకూడా వస్తానంటే, రాముడు అభ్యంతరం పెడుతాడు. అప్పుడు సీత ''స్త్రియం పురుష విగ్రహమ్''-అని రాముని ''నన్ను భరించలేనివాడివా? స్త్రీలాంటి అధైర్యవంతుడివా?'' అని అడిగింది, దీనిని బట్టి శ్రీరాముడు ''స్త్రీ రూపమే ''నని స్పష్టమౌతుంది.
ఇదే విషయం రావణాసురుని వల్లకూడా అవగతమౌతుంది. రావణుడు గొప్ప శివభక్తుడు, అతడు శివుణ్ణి తన అశోకవనానికి తీసుకువెళ్ళాలని తలచి, ఆ అహంభావంతో కైలాసం చేరాడు. అచట నందినిచూసి, అవమానపరిచాడు. అపుడు నంది తిరిగి నిన్ను అవమానపరుస్తానని చెప్పాడు. ఈ విషయం రామాయణంలో ఇలా వుంది. ఆంజనేయుడు రావణుని వద్దకు వచ్చినపుడు, రావణుడు అతనికి ఉచితాసనం ఇవ్వడు. అప్పుడు ఆంజనేయుడు తన వాలాన్ని చుట్ట చుట్టి ఆసనంగా తయారుచేసుకుని, రావణుని కంటే ఉన్నతంగా కూర్చుంటాడు, అప్పుడు రావణుడు, ఇతడే నందికేశ్వరుడు అని, వానరరూపంలో వచ్చి తనను అనుమానపర్చాడని భావించాడు.
అపుడు కైలాసాన్ని అహంకారంతో చేరిన రావణుడి కార్యం, పరాశక్తికి ఇష్టంలేక అది జరుగనివ్వలేదు. అందుకే రావణుడు-సీతను పరమశివునిగా తెలుసుకొని, ఆమెను లంకకు తీసుకొని వెళ్లినాడు. కామోన్మత్తత అనేది ఒక మిషగా పెట్టుకొని ప్రజలను మభ్యపరచాడు. ఆతడు మహాశివభక్తుడనీ, అంతా శివమయమనీ శ్రీ శంకరాచార్యస్వామి వారు చెప్పారు.
మన మేది చేసినా పరమేశ్వర సమర్పణం చేయాలి.
|