హిందుసమాజ ఉద్ధరణ
హిందువులలో చాలా ఎక్కువమంది ధర్మాన్ని అనుసరించడం లేదని ప్రస్తుతం దేశంలో అలుముకొన్న ఈ పరిస్థితులే కనుక మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగినట్లైతే సంధ్యావందనం చేసేవారి మాట అటుంచి, దానిని జ్ఞప్తియందుచుకొనే బ్రాహ్మణుడుకూడా కనుపించకుండా పోయే స్థితి ఏర్పడగలదు, ఇతరమతాల ప్రభావం వల్ల అనుకరణంవల్ల హిందుమతం క్షీణించిపోతున్నది. విదేశీ మిషనరీలవల్ల ప్రతిరోజూ ముఖ్యంగా అనేక కోట్లరూపాయలు వారి మతప్రచారానికి వెచ్చింపబడుతూ వున్నాయి.
పరిస్థితులు ఇలాఉంటున్నప్పటికీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాతనైనా మనం మనతోటివారైన హరిజన, గిరిజనుల ఉద్ధరణకు పూనుకొని కృషిచేసి ఉన్నట్లయితే మన మతపరిస్థితి యిలా ఉండేదికాదేమో.
హిందుమతం విడిచి, ఇతరమతాలను స్వీకరించిన వారిని తిరిగి హిందూమతస్థులుగా చేయడం విషయంలో శ్రీస్వామివారు ఒక చమత్కారాన్ని ఉదాహరిస్తూ క్రైస్తవమతం పుచ్చుకున్న హిందువుడు క్రైస్తవుడుగా ప్రతి ఆదివారం నాడూ, మహమ్మదీయ మతం పుచ్చుకున్న ముస్లిం ప్రతి శుక్రవారంనాడూ తప్పనిసరిగా నైనా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. అటువంటివారిని హిందుమతంలోనికి పునఃప్రవేశింప చేసుకుంటే ప్రస్తుతం మన హిందూమతం ఉన్నస్థితిని బట్టి భగవంతుణ్ణి అసలు ప్రార్థించకుండా ఉండే ప్రమాదం ఏర్పడగలదు.
హిందువులైన స్త్రీ-పురుషులు ఎవరైనా ప్రతిరోజూ ఉదయం 108 సార్లు ఏ హిందూ దేవతా మూర్తినైనా ప్రార్థించి తమతమ విధ్యుక్తధర్మాలను విధినిర్వహణను కొనసాగించుకోవడం శ్రేయస్కరము.
ప్రతిహిందూ మతస్థుడు, హిందూమతంలోని మూలధర్మాలను ఆచరించినట్లయితే తద్వారా హిందూమతోద్ధరణం దానంతటదే జరగగలదని ఏ పీఠాధిపతి యీ ఉద్ధరణకు పూనుకోనవసరం లేదని ఏవిధమైన ప్రచారం కూడా హిందూమతానికి అవసరంలేదని మన హిందూధర్మాన్ని మనం పాటించినప్పుడు మనమతం ఎవరిసహాయం లేకుండానే ప్రచారమై ఉద్ధరింప బడుతుందని అప్పుడు హిందూమతం నుండి వెళ్ళిపోయి ఇతరమతాలు స్వీకరించిన హిందువులు వారంతట వారే మళ్ళీ మనహిందూమతంలోనికే వచ్చి చేరతారని మన మతవిశిష్టతను కూడా వారంతట వారే గుర్తిస్తారని నేను విశ్వాసముతో చెపుతున్నాను.
|