Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

కామాక్షి చరణ ప్రభావము

మన భారతదేశము పరమ పవిత్రమైన దేశము, ఇది కర్మభూమి ఇతర దేశములన్నీ భోగ భూములు. శాస్త్రముల ప్రకారము ఇది అన్వర్థము, అనుభవములో కూడా ఒక్క భారతదేశములో మాత్రమే ఈనాటికి కూడా వైదిక కర్మానుష్టానము జరుగుచున్నది. ఇక్కడ ఏడు ముక్తి ప్రదములైన క్షేత్రము లున్నట్లు సంప్రదాయముగా చెప్పుకుంటున్నారు.

''అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా,

పురీ ద్వారవతీ చైవ సపై#్తతే మోక్షదాయకాః''

అయోధ్యానగరము శ్రీరామావతారముచే పవిత్రమైనది. మధురానగరము శ్రీకృష్ణావతారముచే ప్రసిద్ధి పోందినది, ''మాయా'' అను దానిని ఇప్పుడు ''హరిద్వార'' మని పిలుస్తున్నారు. శ్రీ హరిని పొందటానికది ద్వారమన్నమాట. కాశీనగరములో చనిపోయిన వారికి శివుడు స్వయముగా శ్రీరామనామము నుపదేశించి, ముక్తినిస్తాడు. ''అవంతీ'' అను నగరమును ఇప్పుడు ''ఉజ్జయినీ'' అంటున్నారు. అది విక్రమార్కుని గాథలతో చరిత్ర ప్రసిద్ధి నొందిన మహాకాళికాక్షేత్రము.

ద్వారకానగరము శ్రీ కృష్ణుని గాథలతో పెనవేసుకొన్న చోటు, ఈ ఏడుక్షేత్రములలోను చనిపోయిన వారికి మరల జన్మలేదు. అంటే వారు పుణ్యలోకములకు వెళ్లి అక్కడ మరల తపస్సచేసి క్రమముక్తి పొందుతారు, తక్కిన ఆరుక్షేత్రములు ఎందుకు ముక్తిప్రదమో ఇప్పుడు వివరిస్తారు.

''కాంచీ'' అంటే మధ్యభాగము, లేక ఓఢ్యాణము, అని అర్థము, స్త్రీలు ఓఢ్యాణమును (వడ్డాణమును) శరీర మధ్యభాగములోనే ధరిస్తారుగదా! కాంచీదేనికి మధ్య భాగము? ఒకప్పుడు మన వైదికమతము సింహళము, ఇండోనేషియా మొదలైన అనేక దేశములలో వ్యాపించి ఉండేది. విశాలమైన వైదిక మతావలంబులు నివసించే భూభాగానికి ఆనాడు కాంచీనగరము మధ్యభాగమున ఉండేది. కాంచీ వంటి నగరము మరొకటి లేదు. ఆ ఊరిలో 108 శివాలయములున్నవి. ఇవిగాక విశిష్ణ్వాలయములు, సుబ్రహ్మణ్యశ్వరుని ఆలయాలు ఉన్నవి. ప్రతివీధిలోను ఒక దేవాలయ మున్నది. గుడిలేని వీధిలేదు. ప్రతిరోజు ఏదో ఒక దేవాలయములో ఉత్సవము జరుగుతూనే ఉంటుంది. అట్టి కాంచీపుర మధ్య భాగములో కామాక్షీ దేవి ఆలయమున్నది.

ప్రాచీనకాలమునుండి వస్తున్న లెక్కప్రకారము కాంచీనగరమునకు సరిగా నడిబొడ్డున కామాక్షీ దేవి ఆలయమున్నది. అక్కడ 108 శివాలయములలోను ఈశ్వరునికి వేర్వేరు నామములున్నవి. అమ్మవారికి ఒక్కటే పేరు, 108 శివాలయములలో ఎక్కడా అమ్మవారి సన్నిధి లేదు, విష్ణ్వా లయములలోను, సుబ్రహ్మణ్యశ్వర ఆలయములోనూ అమ్మవారి సన్నిధి ఉంటుంది. కాంచీ నగరములో ఏ శివాలయములోను అమ్మవారి మూర్తి ఉండదు. కామాక్షీ దేవియే సకల శివా లయములకు ఆదిశక్తియై అనుగ్రహిస్తూంటుంది. కంచికి ఆరేడు మైళ్ళదూరంలో ''అంబి'' అనే గ్రామమున్నది. ఆ ఊరిలో శివాలయములో అమ్మవారి సన్నిధి ఉన్నది. అంటే అంబి కాంచీపుర సరిహద్దులకు బయట ఉన్నదని అర్థము. ప్రాచీన కాంచీనగరము ఇప్పటి అంబి గ్రామము వరకు వ్యాపించి ఉండేది. కాంచీనగరములోని అన్ని శివాలయముల ఇతర దేవాలయముల విమానములు, వరద రాజస్వామి విమానముతో సహా అన్నీ కామాక్షీ దేవి ఆలయవిమానము వైపు ముఖముగా ఉంటవి.

ఏ గుడిలో ఏ ఉత్సవము జరిగినా వరద రాజస్వామి రథోత్సవము, ఏకామ్రనాథ స్వామి రథో త్సవము జరిగినా, ఆ ఉత్సవము వచ్చి కామాక్షీదేవి ఆలయ ప్రదక్షిణము చేసి వెళ్లవలసినదే. ఒకప్పుడు స్వదేవాలయ ప్రదక్షిణము మానివేసి కూడా కామాక్షీ దేవి ప్రదక్షిణము చేస్తారు. రథోత్సవములో, తంత్రశాస్త్రవేత్తల పరిభాషలలో కాంచీనగరము అమ్మవారి ఉద్యానపీఠస్థానము. సామాన్యముగా అన్ని గుడులలోను అమ్మవారికి నాలుగు చేతులు, ఆ చేతులలో 1. వరదముద్ర, 2.అభయముద్ర, 3. పాశము, 4. అంకుశము ఉంటవి. పాశము అనే ఆయుధము మనలో ఆశాపాశములను తొలగించి, మనసుకున్న చంచలత్వము పోగొట్టుతుంది. అంకుశము - మన అహంకారమును నశింపచేస్తుంది. అభయముద్ర కష్టములలోనున్న వారికి భీతిలేకుండా చేయగా, వరదముద్ర కోరిన వరముల నిస్తుంది. కొన్ని గ్రామములలో అమ్మవారికి రెండు చేతులే ఉండి, వరదాభయముద్ర లుండును. కామాక్షీ దేవి కూడా చుతుర్భుజయే, 1. కుడివైపు క్రిందిచేతులో పంచ (పుష్ప) బాణములు, 2. కుడివైపుపై చేతిలో పాశము. 3. ఎడమవైపు క్రిందిచేతిలో ధనుస్సు, 4. ఎడమ వైపు పైచేతిలో అంకుశము ఉన్నవి. వరదాభయ ముద్రలు లేవు. కామాక్షి అమ్మవారికి వరదాభయముద్రలు లేకుండుట చూచి శంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు.

''త్వ దన్యః పాణిభ్యా మభయ వరదో దైవత గణ

స్త్వమేకా నైవాసి ప్రకటిత వరాఖీ త్యఖినయ

భయా త్త్రాతుం దాతుం ఫల మపిచ వాంఛా ఫలమధికం

శరణ్య లోకానాం తవ హి చరణా వేష నిపుణౌ''

అమ్మా! నీకన్నా ఇతరులైన దేవతలు అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరధాభయము ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, వరముల నిచ్చుటకు నీపాదములే సమర్థములై, ''వాంఛా'' ''సమధికం'' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని భావము, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము, అమ్మవారి చతుర్భుజములలోని ఆయుధములను లలితా సహస్రనామములో వివరించి చెప్పారు. అమ్మవారి మూర్తిలో ఒక్కొక్క భాగమును ధ్యానముచేస్తే, ఒక్కొక్క సిద్ధివస్తుంది. పంచబాణములను ధ్యానముచేస్తే ఆశాపాశము విడి పోతుంది. దేవతామూర్తుల విగ్రహములలో, వాహనములలో, ఆయుధములో, ముద్రలలో తంత్రశాస్త్ర సంకేతము లిమిడి ఉన్నవి. మిగిలిన క్షేత్రములు రామకృష్ణాదుల వలన పవిత్రము లైనవి. కాంచీనగరము అమ్మవారి చరణములవలన మోక్ష క్షేత్రమైనది.

శంకరులు కాంచీలోనే సిద్ధిపొందారని సంప్రదాయ సిద్ధమగుచరిత్ర, కామాక్షి ఆలయములో ఆ తల్లికి వెనుక భాగమున శంకరుల విగ్రహములున్నవి. భక్తుల విగ్రహములు ఆళ్వార్ల పంటివి గుడిలో ఉండటము కలదు. కాని, సమాధి గుడిలో ఉండటము ఎక్కడా లేదు. గుడి అంటే గర్భా లయ ప్రాంగణము. శంకరుల సమాధి గుడిలో లేదు. గర్భాలయ ప్రాంగణమున గాక మొదటి ప్రాకారములో ఉన్నది. అలా ఉండటము ఆగమశాస్త్ర. శిల్పశాస్త్ర విరుద్ధముగాదు. లోకములో సన్యాసుల సమాథి స్థలము మీద తులసి వృక్షము నాటుతారు. కొన్ని చోట్ల బిల్వము, కొన్ని చోట్ల శివలింగము, కొందరు వారి ఇష్టదేవతా వాహనమును ప్రతిష్టిస్తారు. మరి శంకరుల సమాధిపై అవేమియు లేక శంకరుల విగ్రహమే ఎందుకున్నది - అని ప్రశ్న ?

శంకరులు షణ్మత సంస్థాపకులు, వారి సమాధిపైన ఏ ఒక్క మతమునకు చెందిన చిహ్నము పెట్టినా అది పక్షపాతము చూసినట్లవుతుంది. న్యాయమైతే వారి సమాధిపై నిర్గుణ పరబ్రహ్మను ప్రతిష్ఠించాలి. అది సాధ్యముకాదుగదా, ''గగనం గగనా కారం సాగరం సాగరోపమమ్‌'' అన్నారు. ఆకాశమునకు, సముద్రమునకు వాటి కవియే సాటి. అట్లే శంకరులకు శంకరులే సాటి. అందుకని జగద్గురువులైన శంకరుల విగ్రహమునే వారి సమాధిపై ప్రతిష్టించి ఉంటారు.

''గురుర్ర్బహ్మా, గురుర్విష్ణుః'' అన్నారుకదా, శంకరులు జగద్గురువులు, కాన సకల దేవతామూర్తులు, షణ్మతములకు వారి రూపము భగవద్రూపమే. 'శతశ్లోకి' అనే గ్రంథములో శంకరులు ఇలా చెప్పేరు:

ఈ ప్రపంచములో జ్ఞానదాతయగు సద్గురువునకు మరొక దృష్టాంతము (పోలిక) లేదు. సద్గురువునకు సద్గురువే సాటి, స్పర్శమణి లోహమును బంగారముగా ఎలా చేయగలుగుచున్నదో సద్గురువు ఒక జడుని జ్ఞానిగా వారు సద్గురువుగా చేస్తున్నారు. అందువలన స్పర్శమణి అనుకుంటారేమో అది కూడా సరికాదు. స్పర్శమణి ఇనుమును బంగారముగా చేయగలుగునుగానీ, మరియొక స్పర్శమణిగా చేయలేదు. సద్గురువు శిష్యుని తనంత వారిగా ఆత్మసదృశులుగా చేస్తున్నారు. అన్నారు. ''చరతి భువనే శంకరాచార్యరూపా''- అంటే ఇప్పటికీ, ఈనాటికి కూడ శంకరులు భూమి మీద తిరుగుతున్నారన్నమాట, శంకరులు ఎక్కడ ఉన్నారు? అంటే జగద్గురువుల రూపములో భూమిపై ఉన్నారన్నమాట. శంకరులు (సద్గురువులు) శిష్యులను ఆత్మసదృశులుగా చేయుదురు గదా.

ఇతర దేశములకు మనవారు వెళ్లితే అక్కడి బజారులు, మేడలు చూడడానికి వెళుతారు గాని, అక్కడి మహాత్ములను చూడడానికి వెళ్లటము లేదు. విదేశీయులు మన దేశపు దేవాలయములను, జ్ఞానులను చూడడానికి వస్తున్నారు గాని, మన రోడ్లుచూడడానికి రావడము లేదు. అంటే ఆధ్యాత్మిక విద్యకోసము అందరు మన దేశము వస్తారు. లౌకిక ప్రయోజనముల కొరకు మనము ఇతరదేశములు వెళుతాము. అందుచేతనే ఈనాటికి భారతదేశము ''పుణ్యభూమి, కర్మభూమి'' అన్నమాట అక్షరాల నిజము.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page