Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

శంకరులు ఎందుకు సన్యసించారు?

ఆదిశంకరులు అవతరించిన దినము వైశాఖ శుద్ధ పంచమి, వసంతఋతువులో వేదములో చైత్రమునకు మధుమాసమని, వైశాఖమునకు మాధవమాసమని పేరు, శ్రీరాములవారు కూడా ఈఋతువులోనే అవతరించారు. రాములవారు మధుమాసములో జన్మిస్తే శంకరులు మాధవ మాసంలో జన్మించారు. వసంతఋతువు మల్లెపూలకు మామిడిపండ్లకు ప్రసిద్ధి పొందింది, సంస్కృతములో మల్లెపూలకు ''వాసంతికా'' అని పేరు. మంచివాసనగల మల్లెపూవులు చక్కని రుచిగల మామిడిపండ్లు ఈభూమిలోనుండే పుడుతున్నవి. రసమూ, గంధమూ రెండూ భూమిలో నుండే వస్తున్నవి. శంకరులను స్మరించినప్పుడు మనకు హృదయములో ఉత్తమమైన పరిమళము, అమృతరసాత్మకముగా నున్నట్లు స్ఫురిస్తుంది. శ్రీరామనవమికి మామిడిపండ్లు మల్లెపూలు కొద్దిగా ఆరంభమగును, శంకరజయంతికి విరివిగా వచ్చును. రాములవారు ప్రారంభించారు. శంకరులు పరిపూర్ణత ప్రసాదించారు.

మనము ఎన్నో పండుగలు, ఉత్సవములు చేసుకొంటున్నాము. శంకరులు అవతరించకపోతే ఇవన్నీ ఈరూపములో నుండేవో, లేవో, మనవైదిక సంస్కృతిని నిలబెట్టినది శంకరులు. మనధర్మమునకు మూలస్తంభము శంకరులు, ''మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ'' అన్నారుగదా! కాని తల్లి, తండ్రి, ఆచార్యులు అందరూ ఆదిగురువులైన శంకరులే మనకు. శంకరుల చరిత్రకు శంకరవిజయమని పేరు; 32 సంవత్సరాల జీవితములో వారు మనకు ఎంతో ఉపకారము చేశారు. ప్రయాగ, నేపాలము, ద్వారక, ఓ ఢ్రదేశము, కన్యాకుమారి, రామేశ్వరము మొదలైన ఎన్నో ప్రదేశములలో శంకరులు ప్రతిష్టించిన ఆలయములు, యంత్రములు ఉన్నవి, ప్రపంచమంతా వారిదే. వారికి 3వ సంవత్సరమునుండే అనేక శాస్త్రములు స్ఫురించాయి, 5వ సంవత్సరములో ఉపనయనము, 8వ సంవత్సరము నాటికి సర్వశాస్త్రములు వేదములు అభ్యసించి, పరి పూర్ణత్వమును పొంది సన్యసించారు; వారి సన్యాసమును గూర్చి ఒక కథ ఉన్నది. శంకరులు తల్లికి ఒక్కరే కుమారులు, తండ్రి పరమపదించారు. అట్టి పరిస్థితిలో ఏ తల్లి అయినా 8 సం.ల కుర్రవాడికి సన్యసించటానికి అనుమతినిస్తుందా? పూర్వము మగపిల్లలకు కూడా చిన్నప్పుడే పెండ్లి చేసేవారు, బహుశః బంధవులు కుమారుడికి పెండ్లి సంబంధములు విచారిస్తూండవచ్చు. ఒకరోజున నదికి స్నానము చేయడానికి వెళ్లారు. నదిలో స్నానము చేస్తుండగా మొసలిపట్టు కున్నది. శంకరుల పాదములను, శంకరులు కేకవేశారు. ''అమ్మా! మొసలిపట్టుకొన్నది, ఇప్పుడు చనిపోతే నాకు దుర్మరణము, నీకు దుర్గతి కలుగుతుంది. ఇప్పుడు సన్యసించాలనిపిస్తుంది. సన్యాసి తల్లిదండ్రులే కాక, అతని ఏడుపురుషాంతరముల వరకూ తరిస్తారని శాస్త్రము చెప్పుతున్నది. అందువలన నేను సన్యసిస్తే నీకు ఉత్తమగతి కలుగుతుంది, సన్యాసము పునర్జన్మతో సమానము కాబట్టి ఈ జన్మలో చేసిన కర్మంతా నశించి పోతుంది. అందువలన ఒకవేళ నేను బ్రతికినా బ్రతకవచ్చును, నీ అనుజ్ఞను కోరుతున్నాను'' అన్నారు. తల్లి దుఃఖముతో ''నాయనా అన్నీ తెలిసినవాడవు, నీ ఇష్టము అన్నది''. వెంటనే ప్రేషోచ్చారణ చేసి సన్యసించారు. మొసలి వదలిపెట్టింది. ఆ మొసలి కారణజన్మురాలు, ఒక గంధర్వుడు దూర్వాసశాపమువలన మొసలిగా మారిపోయాడు. ఈశ్వరుని పాదస్పర్శ కలిగినప్పుడు శాపవిమోచనము కలుగునని దూర్వాసులు అనుగ్రహించారు, గంధర్వుని శాపము పోయి పూర్వరూపము వచ్చింది. వానికి పునర్జన్మ లేకుండా శంకరులు అనుగ్రహించారు.

అంత్యకాలములో తనను స్మరిస్తే వస్తానని తల్లికి చెప్పి శంకరులు నర్మదాతటాకానికి వెళ్లారు. నర్మదా తీరములో శ్రీ గోవిందభగవత్పాదాచార్యు లనే గురువుల వద్దకు వెళ్ళారు. శంకరుల గురువుగారి పేరు గోవిందయోగీంద్రులు, ఈ విషయము సంప్రదాయ పరంపరలో చెప్పుకొనే ''నారాయణం పద్మభువం వశిష్టం'' అనే శ్లోకములో నున్నది. అంతేకాక శంకరులు వ్రాసిన వివేకచూడామణిలో ''గోవిందం పరమానందం మద్గురం ప్రణతో7స్మి అహం'' అని వ్రాశారు. దీనివలన కూడా శంకరుల గురువుపేరు గోవిందులని తెలియుచున్నది. భజగోవింద స్తోత్రములో ''గోవిందం భజ ''అని శంకరులు ఉపదేశించారు. ''గోవిందం భజ'' అంటే ఆచార్యులవారికి గురుస్మరణగాను, శిష్యులకు విష్ణుస్మరణగాను రెండు అర్థము లున్నవి. విష్ణుదేవుని అనంత నామములలో గోవిందనామమునకు మాత్రమే బహుళప్రచార మున్నది. ఏనాడు శంకరులు ''గోవిందం భజ'' అని ఆదేశించారో, ఆనాటినుండి ప్రజలు శిరసావహించి, ''గోవింద, గోవింద'' అంటున్నారు. శివ విష్ణు భేదమే లేక శ్రీశైలము వెళ్లినా ''గోవిందా'' అనే అంటున్నారు. గోవిందుని యందు భక్తి కలిగితే ఏమిఫలము? జగత్కారణవస్తువు, సర్వజ్ఞుడైన పరమాత్మను నిత్యము ధ్యానముచేస్తే మహాఫలము కలుగక మానుతుందా! భగవద్గీత 18వ అధ్యాయము 55 వ శ్లోకములో భగవంతు డిలా చెప్పాడు:

భక్త్యా మా మభిజానాతి యావాన్య శ్చాస్మి తత్త్వతః |

తతో మాం తత్త్వతో జ్ఞాత్వా | విశ##తే తదనన్తరమ్‌ ||

8-9ొ

నేను ఎంతటివాడినో, ఎట్టి స్వరూపముగలవాడనో భక్తివలన తెలుసుకొంటున్నాడు, తత్త్వః అంటే వాస్తవముగా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొంటున్నాడు, అనగా అంతటా ఉన్నవాడినని, అన్ని స్వరూపములలోను ఉన్న వాడినని తెలుసుకుంటున్నాడు. సముద్రములో కలసిన తర్వాత నదులన్నీ తమ పూర్వనామరూపములు కోల్పోయి సముద్రమే అవుతున్నవికదా. ''విశ##తే తదనన్తరమ్‌'' అంటే భగవంతుడిని ఈ విధముగా తెలుసుకొన్న జ్ఞాని వెంటనే పరమాత్మలో ప్రవేశించి, పరమాత్మగా అయిపోతున్నాడని అర్థము, మన శరీరములు, చెట్లు, పూవులు అన్నీ భూమిలో నుండి పుట్టిభూమిలో కలిసిపోతున్నవి. ఏది ఎందులో నుండి పుడుతున్నదో అది తుట్ట తుద కందులోనే లయము చెందుతుంది. మన శరీరాదులకు భూమికారణము. దానికి మరొకటి కారణము. ఇలా వెతకగా, వెతకగా అదికారణం మొకటి వస్తుంది. ఆ ఆదికారణముకూడా పరమాత్మలో నుండి ఉద్భవించి మరల పరమాత్మలో కలసిపోయేదే. పంచదార చిలక లన్నింటిలోనూ పంచదార ఉన్నట్లు పరమాత్మ అంతటా ఉన్నాడు. పరమాత్మ అన్ని వస్తువులలోనూ, అన్ని వస్తువులుగాను ఉన్నాడు, అందరిలోనూ, అందరిగాను పరమాత్మ ఉన్నాడు. ఈ దృశ్యప్రపంచమంతా పరమాత్మ పరిపూర్ణముగా వ్యాపించి యున్నాడు. అయితే చూడబడే వస్తువులన్నీ పరమాత్మ అయితే చూసే వస్తువుమాత్రము వేరవుతారా, ఆ సాక్షాత్కారము కలుగుతే ఈశ్వరుడు ఎక్కడో లేడని మీ ప్రక్కనే ఉన్నాడని తెలుస్తుంది. నాయందు గౌరవమున్నవారు నా ఎదుట చెడ్డపనులు చేయరు. అల్లాగే ఈశ్వరుని ఎదురుగా చెడ్డపనులు చేయుము. ఈశ్వరుడు అంతటా వున్నాడని తెలుసుకొన్నవాడు, ఇక చెడ్డపనులు చేయటానికి అవకాశ##మే లేదుగదా. లోకములో పాపములు ఎందుకని చేస్తున్నారు? తనకొరకు చేస్తున్నారు. నేను నాది అనునవి ఉన్నంతవరకే కోపతాపములు, చెడ్డపనులు ప్రారంభమగును, ద్వి అంటే రెండు, ద్వైతము అంటే రెండువస్తువు లున్నవని తలచటము. తనకన్నా వేరొక రున్నారని తలచితే వారు మనకు మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు. మిత్రులైతే రాగము, శత్రువులైతే ద్వేషము, రాగద్వేషములు ద్వైతమూలకములు, అన్ని వస్తువులలోనూ, అన్ని వస్తువులుగాను వీటిని చూసే సాక్షియగు జ్ఞానవస్తువుగాను కూడా ఈశ్వరుడున్నాడని తెలుసుకోవాలి. ఈ విషయము పుస్తకములలో చదవవచ్చు, ఉపన్యసించవచ్చు. కాని ఎవ్వరీ విషయము ననుభవపూర్వకముగా తెలుసు కొంటున్నారో వారు మోక్షము పొందుతున్నారు. ఈసంగతి లోకానికి వెల్లడి చేయడాని, శంకరులు సన్యసించారు. ఈ అద్వైత జ్ఞానము కలగడానికి కొన్ని మెట్లు ఏర్పరచారు. దేవుని పూజించడముకి భజన చేయడము, రామకోటి వ్రాయడం మొదలైన సాధనలన్నీ అట్టి జ్ఞానము పొందడానికి మెట్లు. ''అన్ని వస్తువులూ పరమాత్మ స్వరూపమే'' అన్న జ్ఞానమే దేవీ స్వరూపము. శంకరులు ఈ దేవీస్వరూపమునే అన్ని చోట్లా ప్రతిష్టించారు. షోడశోపచారములతో దేవుని పూజించడమంటే ఏమిటి? మనము కోరే ఉత్తమమైన వస్తువాహనములన్నీ పరమాత్మ ఇచ్చినవేగదా, ఆయన ఇచ్చినవస్తువులను ఆయనకు సమర్పించి అనుభవించాలి. ఇలా చేయడమే దేవపూజ. ఇలా చేయక పోవడము కృతఘ్నత అవుతుంది. ఒక వెయ్యి జలబిందువులున్న వనుకోండి. ప్రతిబిందువులోను సూర్యుడు ప్రతిబింబిస్తాడు. ప్రతిబిందువుకూ ఒక తేజస్సు, ఒక వెలుగు ఉంటుంది. అల్లాగే అంతః కరణలో పరమాత్మ ప్రతిబింబిస్తే జీవుడవుతాడు, ''లోకా స్సమస్తా సుఖినోభవంతు'' అంటాము గదా. జీవులందరూ పరమాత్మ ప్రతిబింబ స్వరూపములు. విష్ణ్వాలయములో అద్దాలగదిలో మధ్య దేవుని విగ్రహము పెట్టారనుకొనండి. దేవుని మూర్తిని అలంకరిస్తే అద్దములోని బింబములన్నీ అలంకరింపబడుతాయి. అట్లే పరమాత్మను అలంకరిస్తే జీవులందరూ అలంకరింపబడుతారు. పరమాత్మను పూజిస్తే అందరకూ సమృద్ధి కలుగుతుంది. లోకసేవ చేయడానికి దేవునిసేవ చేయడము సులువైన మార్గము.

ఇంతకూ శంకరులు ఎందుకు సన్యసించారు? లోకములో తల్లి, దండ్రి, పుత్రులు మొదలైనవారు గల సముదాయాన్ని కుటుంబమంటారు. శంకరులు ఒక చిన్న కుటుంబమునకు చెందినవారుగా, ఫలానావారి పుత్రుడుగా, ఫలానావారి తండ్రిగా ఉండికోరలేదు. ప్రపంచమంతా వారికుటుంబము కావాలని కోరి సన్యసించారు. ''ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం'' అన్నారు కదా. ''తనకు భిక్షాప్రదానముచేసిన వారంతా తనతల్లులు, తనకు జ్జానము నుపదేశించిన గురువులు తండ్రులు, శిష్యులే తనకుమారులు'' అని సన్యాసి భావిస్తాడు. ఇట్టి విశాల భావముతో శంకరులు సన్యసించి మనకు మహోపకారము చేశారు. ''ఉండే వస్తువు ఒక్కటే, అన్ని వస్తువులు, వాటిని చూస్తే జ్ఞానవస్తువుకూడా పరమాత్మయే'' ఈ అనుభవము వెంటనే కలుగకపోయినా, సాధనచేస్తే అనేకజన్మల తర్వాతనయినా అందరకూ కలుగుతుంది. ''బహూనాం జన్మనా మంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే.''


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page