శివకేశవులపై సమాన భక్తి
''ప్రతిమానవునికీ నేత్రద్వయ ప్రాధాన్యమెలాగో అదే విధంగా ప్రతివారికి శివకేశవులయందు భక్తి ప్రాథాన్యం ఉండాలి'' రెండు నేత్రాలలోను దేనికి ప్రాధాన్యత ఉన్నది అంటే చెప్పలేము. రెండిటికీ సమప్రాధాన్యత నిస్తాము. అదే విధంగా విష్ణు శివులయందు సమానమైన భక్తితో నుండాలి.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి,స్థితి, లయకారులు లయానికే సంహార మనికూడా చెప్తారు. సంహారమంటే నాశనం, అనే అర్థం కాదు. సృష్టి, స్థితి జరిగిన తర్వాత ఆ ప్రాణికి శివుడు బ్రహ్మైక్యము సిద్ధింపజేస్తాడు. దీనికే లయము, సంహారము అని పేర్లు, ఈ స్థితి కలుగకపోతే చాలా బాధ. ఎందుచేతనంటే రాత్రి నిద్రపోకపోతే తిరిగి మర్నాడు లేవలేము. ఆరోగ్యం చెడుతుంది, ఒళ్ళు భారంగా ఉంటుంది. అదే విధంగా ప్రతివారు లయము కాకపోతే ప్రపంచానికి భారమవుతుంది. అందుకే శివుడు మనలను నిద్రపుచ్చుతూ ఉంటాడు. దీనికి తార్కాణ మేమంటే -
ఉదయాన్నే నిద్రలేచి పగలంతా ఎవరిపనివారు చూసుకొని, రాత్రి తిరిగి నిద్రపోతాము. ఇదే సృష్టి, స్థితి, లయములను సూచిస్తుంది. లేచినది మొదలు పనిచేయడానికి తగిన శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చేవాడు విష్ణువు. అందుకు ఉదయం లేవగానే విష్ణుస్తోత్రం చేయాలి. ఈస్తోత్రం, రామ, వేంకటేశ, కృష్ణ-మొదలైన అనేకరూపాల్లో చేయవచ్చును. రాత్రి నిద్రపోయేముందు శివశివ అని శివనామము జపించి నిద్రపోవాలి.
కొందరికి నిద్రపోయినా సుఖముగా ఉండదు. పీడకలలు వస్తూ ఉంటాయి. వీటినుంచి విముక్తి పొందాలంటే శివుని ప్రార్థించాలి, ఇదేమాదిరి ''జన్మాంతములో నరకాది బాధలు లేకుండగను, పునర్జన్మ లేకుండగను ముక్తి ప్రసాదించమని పరమశివుని ప్రార్థించాలి.
|